- ‘కేటు’ గ్యాంగ్ లీడర్ రజనీ భాయ్ అరెస్ట్
- గుజరాత్‌లో నకిలీ సరుకుల తయారీ.. దేశ వ్యాప్తంగా సరఫరా
- అరెస్టు చేసి తీసుకువచ్చిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు
హైదరాబాద్: డూబ్లి‘కేటుగాళ్ళు’ ఏ వస్తువునీ వదిపెట్టట్లేదు. వివిధ కంపెనీల పేర్లతో నకిలీ గ్యాస్ లైటర్లు తయారు చేసి దేశ వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఉత్పత్తులకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సీసీఎస్ అధికారులు శుక్రవారం సూత్రధారిని రజనీ భాయ్‌ని అరెస్టు చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన ఇతగాడు దేశ వ్యాప్తంగా దందా చేస్తున్నట్లు గుర్తించామని డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు.
రాజ్‌కోట్‌కు చెందిన రజనీ భాయ్ అక్కడి ఆర్‌ఆర్ నగర్ చౌక్ ప్రాంతంలో జైమా ఖొడియార్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు. మిల్టన్, పీజియన్, ఈగెల్ కంపెనీల పేర్లతో డైలు రూపొందించాడు. వీటిసాయంతో ఆయా కంపెనీల పేర్లు ముద్రితమయ్యేలా నకిలీ గ్యాస్ లైటర్లు తయారు చేస్తున్నాడు. వీటిని దేశంలోని అనేక ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌కూ సరఫరా చేస్తున్నాడు. సిటీలోని రిద్దీ సిద్దీ మార్కెటింగ్, రిషబ్ మార్కెటింగ్, రామ్‌దేవ్ స్పేర్ పార్ట్స్, రాజేశ్వర్ స్పేర్‌పార్ట్స్ సంస్థలకు కంపెనీ వాటి కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ నాలుగు సంస్థల్లో బ్రాండెడ్ కంపెనీ పేరుతో నకిలీ గ్యాస్ లైటర్లు విక్రయిస్తున్న విషయం గుర్తించిన శ్రీ ముఖేష్ మార్కెటింగ్ అధికార ప్రతినిధి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిద్దీ సిద్దీ మార్కెటింగ్, రిషబ్ మార్కెటింగ్, రామ్‌దేవ్ స్పేర్ పార్ట్స్, రాజేశ్వర్ స్పేర్‌పార్ట్స్ దుకాణాలపై దాడులు చేశారు. వీటి నిర్వాహకులైన సతీష్ జైన్, రతిలాల్, జగదీష్‌కుమార్, మోతీరామ్‌లను అదుపులోకి తీసుకుని వందల సంఖ్యలో నకిలీ గ్యాస్ లైటర్లు స్వాధీనం చేసుకున్నారు. జగదీష్ కుమార్ విచారణలో ఈ నకిలీ లైటర్లను రాజ్‌కోట్‌కు చెందిన రజనీ భాయ్ సరఫరా చేస్తున్నట్లు బయటపడింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న సూత్రధారి కోసం గాలిస్తూ అక్కడకు వెళ్ళిన ప్రత్యేక బృందం రజనీ భాయ్‌ను అరెస్టు చేసి తీసుకువచ్చింది. ఇతడి నుంచి గ్యాస్ లైటర్లపై ఆయా కంపెనీల పేర్లు ముద్రించడానికి ఉపకరించే ఇనుప డైలను స్వాధీనం చేసుకున్నారు.
గ్యాస్ లైటర్లనీ వదలట్లేదు!
Published Sat, Jan 28 2017 12:08 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement