
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల్లోని ఉపకులాల వర్గీకరణపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రంగరాజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఐదు కీలక సూచనలు చేసింది. గతేడాది నవంబర్ 15న నియమితులైన ఆయన అదే నెల 27న బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి 13 జిల్లాల్లో పర్యటించి ఈ నెల 10న ప్రభుత్వానికి నివేదిక సమర్పింపంచారు. నాలుగు నెలలపాటు అధ్యయనం చేసి 3,820 విజ్ఞాపనలు స్వీకరించిన కమిషన్ మొత్తం 360 పేజీల నివేదికలో ఐదు కీలక సూచనలు చేసింది.
రాష్ట్రంలోని 59 ఎస్సీ ఉపకులాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించింది. వాటిలో గ్రూపు–ఏలో 2.25 శాతం జనాభా కలిగిన అత్యంత వెనుకబడిన 12 రెల్లి ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్ అందించాలని సిఫారసు చేసింది. గ్రూప్–బీలో 41.56 శాతం జనాభా కలిగిన వెనుకబడిన 18 మాదిగ ఉపకులాలకు 6.5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పేర్కొంది. గ్రూప్ సీలో 53.98 శాతం జనాభా కలిగి మిశ్రమ వెనుకబాటుతనంతో ఉన్న 29 మాల ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సిఫారసు చేసింది.
రోస్టర్ విధానం ప్రకారం మొదట వంద పోస్టులు వస్తే 8 శాతం పోస్టులు మాల సామాజిక వర్గానికి వస్తాయి. మాదిగ సామాజిక వర్గానికి 6 శాతం, రెల్లి సామాజిక వర్గానికి ఒక శాతం వస్తాయి. ఈ మూడు కలిపితే 15 శాతమవుతుంది. అదే రోస్టర్ విధానంలో 200 పోస్టులు వస్తే మాల సామాజిక వర్గానికి 15, మాదిగ సామాజిక వర్గానికి 13, రెల్లి వర్గానికి రెండు వర్తిస్తాయి. తద్వారా రోస్టర్‌లో అందరికీ న్యాయం జరుగుతుంది.
ఇవీ ఐదు కీలక సూచనలు..
» ప్రస్తుతానికి రాష్ట్రం యూనిట్‌గా వర్గీకరణ అమలు చేయాలి.
» 2026 జనాభా లెక్కల సేకరణ పూర్తి అయ్యాక ప్రభుత్వం జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేసుకోవచ్చు.
» ఎస్సీ 59 ఉపకులాలను ఏ, బీ, సీగా మూడు కేటగిరీల్లో వర్గీకరణ.
» 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ శాతం అమలు.
» రోస్టర్ విధానాన్ని కూడా ఇదే రీతిలో అమలు చేయాలి.
జనగణన తర్వాతే వర్గీకరణ
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రం యూనిట్‌గా 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 2026 జనగణన తర్వాతే జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాల్లో ఉప కులాల వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం నియమించిన రంగరాజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నివేదికపై గురువారం స్వల్పకాలిక చర్చ అనంతరం ఆమోదిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. 1995లో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి సుదీర్ఘకాలం సాగిన వర్గీకరణ అంశం మళ్లీ తన హయాంలోనే పరిష్కారం కావడం సంతృప్తినిచి్చందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
‘ఎన్నికల్లో చెప్పినట్లే ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నాం. 30 ఏళ్ల నిరీక్షణను నిజం చేస్తూ నా చేతుల మీదుగా వర్గీకరణ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. అంటరానితనంపై అప్పట్లో జస్టిస్ పున్నయ్య కమిషన్ చేసిన 42 సిఫారసులు ఆమోదించి 25 జీవోలు, మెమోలు తీసుకొచ్చాం. పున్నయ్య కమిషన్ వేసి ఎస్సీ, ఎస్టీ చట్టం తెచ్చా. మాదిగ పేరు చెప్పుకొనేందుకు కూడా వెనుకాడిన రోజుల్లో మాదిగ దండోరాను స్థాపించి మందకృష్ణ పెద్ద ఉద్యమం చేశారు.
వారి డిమాండ్లు సమంజసమని భావించి 1997 జూన్ 6న ఎస్సీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరిస్తూ ఉత్వర్వులు ఇచ్చాం. దీంతో మాదిగలు, ఉప కులాలకు 22 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా గతేడాది ఆగస్టులో జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచి్చంది. అంటరానితనాన్ని రూపుమాపేందుకు నాకు చాలా సమయం పట్టింది. పేదరికంలేని సమాజమే నా లక్ష్యం. ఉగాది నుంచి పీ 4 విధానం తెస్తాం’ అని చంద్రబాబు అన్నారు.
ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే మంద కృష్ణ, చంద్రబాబు ఇద్దరే కారణమని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉండే రెల్లి కులస్తుతులకు కూడా న్యాయం చేయాలన్నారు. బుడగ జంగాలనూ ఎస్సీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment