న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ నమూనా స్థానిక రిటైలర్లకు సవాళ్లు విసురుతోందని, రాజకీయ అంశంగానూ మారొచ్చని వెటరన్ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. భారత్‌ను ప్రపంచంలోనే వినూత్నమైన దేశంగా పేర్కొంటూ.. మరెక్కడా క్విక్ కామర్స్ నమూనా అంత సత్ఫలితాలు సాధించలేదని, ఇక్కడ మాత్రం విజయవంతంగా కొనసాగుతున్నట్టు చెప్పారు.
‘‘ఇది సానుకూల సంకేతమే. క్షేత్రస్థాయిలో ఆవిష్కరణలకు ఫలితాలు కనిపిస్తున్నాయి’’ అని ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. అదే సమయంలో యాపిల్, మెటా, యూనిలీవర్ వంటి బ్రాండ్లను భారత్ సృష్టించాల్సి ఉందన్నారు. అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని పరిశీలించినా ఈ విధమైన ఆవిష్కరణల బలం కనిపిస్తుందంటూ.. భారత వ్యాపార సంస్థలు ఉత్పతాదకత, సృజనాత్మకతపై దృష్టి సారించాలని సూచించారు. దేశీయ సంస్థలకు, దేశీయ మార్కెట్ నుంచే రక్షణ కల్పించడం అన్నది దీర్ఘకాల పోటీతత్వం కోణంలో ప్రమాదకరమన్నారు.
దేశీయ వ్యాపారాలను కాపాడుకోవడం కంటే అవి స్వేచ్ఛగా పోటీపడేలా చూడాలన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత మార్కెట్లలో 900 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారని, ట్రంప్ పాలనలో వచ్చే మార్పులతో లేదా ఏదైనా అంతర్జాతీయ పరిణామంతో ఇందులో 5–10 శాతం మేర వెనక్కి మళ్లినా అందుకు సన్నద్ధమై ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment