
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ... మార్చి నెల 30వ తేదీని జీరో వేస్ట్ డే గా గుర్తిస్తూ 2022, డిసెంబర్ 14వ తేదీన ఒక తీర్మానాన్ని చేసింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అప్పటి నుంచి మార్చి నెల 30వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్’గా గుర్తిస్తూ ప్రపంచాన్ని చైతన్యవంతం చేస్తోంది. ఈ ఏడాది ఫ్యాషన్ అండ్ టెక్స్‌టైల్ రంగాల వృథా మీద దృష్టి పెట్టింది.
పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న వాయు, నీటి కాలుష్యాలతోపాటు వస్త్రాల అవశేషాలు కూడా ప్రధానమైనవి. క్లాత్‌తో డ్రస్ కుట్టిన తర్వాత వచ్చే మిగులు నదులు, కాలువల్లోకి చేరి నీటిలో, నీటి అడుగుల మట్టిలో నిలిచి΄ోతోంది. కొంతకాలానికి ఆ వస్త్రానికి అద్దిన రసాయన రంగులు నేలలో, నీటలో ఇంకుతాయి. ఇలా వేస్ట్ క్లాత్ కారణంగా కెమికల్ పొల్యూషన్ నీటిని, మట్టిని కూడా కలుషితం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దుస్తుల తయారీ విపరీతంగా పెరిగిపోయింది.
2000 సంవత్సరంలో ఉత్పత్పి 2015నాటికి రెండింతలైంది. ఏడాదికి 92 మిలియన్ టన్నుల టెక్స్‌టైల్ వేస్ట్ లెక్క తేలుతోంది. ఇది కాలువలు, నదుల్లోకి వెళ్తోంది. దీనిని అరికట్టడం కోసమే యూఎన్‌ఓ (యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్) ఈ ఏడాది ఫ్యాషన్ ఇండస్ట్రీ వేస్ట్ మీద దృష్టి పెట్టింది. ఫ్యాషన్, టెక్స్‌టైల్ రంగాలను జీరో వేస్ట్ దిశగా నడిపించడానికి మార్గాలను అన్వేషించాలంటోంది యూఎన్‌ఓ. హైదరాబాద్‌లో ఫ్యాషన్ ఇండస్ట్రీ నిర్వహిస్తున్న సుదీప కందుల ట్రిపుల్ ఆర్ (రీ యూజ్, రీ సైకిల్, రీ పెయిర్) అనే యూఎన్‌ఓ థీమ్‌ను రెండు దశాబ్దాలుగా అమలు చేస్తున్నారు.
మనసుంటే మార్గం ఉంటుంది!
సుదీప కందుల... ఆలన బొటీక్ పేరుతో చిన్న పిల్లల దుస్తుల డిజైనింగ ప్రారంభించి మూడు దశాబ్దాలవుతోంది. ఫ్యాషన్ ఇండస్ట్రీలో బొటీక్ కల్చర్ మొదలైన తొలినాళ్ల నుంచి బొటీక్ నడుపుతున్నారామె. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని భావించే సుదీప, ఆమె ఉద్యోగులు పాలిథిన్ కవర్ల వినియోగాన్ని తగ్గించడానికి మార్కెట్‌కెళ్లేటప్పుడు క్లాత్ బ్యాగ్‌ను వెంట తీసుకువెళ్తారు. బొటీక్‌లో ఉత్పన్నమయ్యే వేస్ట్ క్లాత్‌ను పునర్వినియోగంలోకి తీసుకురావడానికి అనేక మార్గాలనెంచుకున్నారు సుదీప.
చిన్న ముక్కలతో నవజాత శిశువులకు, ఏడాది లోపు పిల్లలు ధరించడానికి వీలుగా కుట్టించి ఆర్ఫనేజ్‌కు ఇచ్చారు. అలా కుదరని వాటిని నగరంలోని ఒక ఎన్‌జీవోకి ఇస్తుంటారు. ఆ ఎన్‌జీవోలో అల్పాదాయ వర్గాల మహిళలకు ఆ క్లాత్‌తో చిన్న చిన్న పోట్లీ బ్యాగ్‌లు, పర్సులు తయారు చేసుకుంటారు.
అలా కూడా పనికి రాని సన్నగా పొడవుగా రిబ్బన్ ముక్కల్లాంటి క్లాత్‌ని ఒక స్కూల్‌కి ఇస్తే వాళ్లు పిల్లల చేత డోర్‌మ్యాట్ మేకింగ్ వంటి క్రాఫ్ట్ ప్రాక్టీస్‌కి ఉపయోగిస్తున్నారు. ఇక ఎందుకూ పనికిరావనిపించే ముక్కలను ఒక కవర్‌లో జమ చేసి ఆ బొటీక్‌లో పని చేసే వాళ్లు దిండులో స్టఫింగ్‌గా నింపుకుంటారు. వ్యర్థాన్ని అర్థవంతంగా మారుస్తున్న సుదీప తన బొటీక్‌లో చిన్న ముక్క కూడా నేలపాలు కాకుండా ప్రయత్నం చేస్తున్నారు.
ఉత్పత్తి– కొనుగోలు పెరిగాయి
మనం కొంతకాలం వాడి ఇక పనికిరావని పారేస్తున్న వస్తువులు నిజానికి పనికిరానివి కాదు, వాటిని మరొక రకంగా మలుచుకుని ఉపయోగించుకోవడం మనకు చేతకాక΄ోవడమే. రీ యూజ్ చేయడం నేర్చుకోవాలి. నాచురల్ ఫైబర్‌తో వస్త్రాలు తయారుచేసినన్ని రోజులు వస్త్ర పరిశ్రమ, అనుబంధ పరిశ్రమల వ్యర్థాల గురించి మాట్లాడాల్సిన అవసరం రాలేదు. మ్యాన్‌మేడ్ ఫైబర్ ప్రవేశించిన తర్వాత ఎదురవుతున్న సమస్యలివన్నీ. నిజానికి వ్యర్థాల ఉత్పత్తి మనదేశంలోకంటే యూఎస్, యూరప్‌దేశాల్లో చాలా ఎక్కువ. అవసరానికి మించి ఉత్పత్తి చేయడం, అవసరానికి మించి కొనడం రెండూ పెరిగాయి.
షాపింగ్ వ్యసనం
ఈ తరానికి షాపింగ్ ఒక వ్యసనంగా మారింది. యూఎస్, యూరప్‌ల నుంచి వాడిన దుస్తులు మూడవ ప్రపంచదేశాలకు డంప్ అవుతున్నాయి. అరేబియా షిప్పుల్లో గుజరాత్ తీరం నుంచి దేశంలోకి వస్తుంటాయవి. మన దగ్గర తయారయ్యే పాలియెస్టర్ వస్త్రాలకు తోడు ఆయాఖండాల నుంచి వచ్చిపడుతున్న దుస్తులు కూడా కలిసి డంప్ పెరిగిపోతోంది.
పాలియెస్టర్ వస్త్రాలను ఫైబర్‌గా మార్చి కొత్త దుస్తులు తయారు చేసే క్రమంలో విడుదలయ్యే వ్యర్థాలు సముద్రాల్లోకి చేరి మైక్రోప్లాస్టిక్‌గా మారి తిరిగి మన మీదనే దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే పారేస్తున్న దుస్తులతో కాలువలు నిండిపోతున్నాయి.
– డాక్టర్ దొంతి నరసింహారెడ్డి, పర్యావరణ నిపుణులు
జీరో వేస్ట్‌తో ద బెస్ట్
ప్లాస్టిక్, ఆహార వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ పరికరాల వేస్ట్‌తో ఏటా ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్ల టన్నుల చెత్త జమవుతోంది. ఇది పెరుగుతూ భూగ్రహాన్ని ముంచేసినా ఆశ్చర్యం లేదు. ఈ ప్రమాదాన్ని మన దేశంలో ముందుగా గ్రహించి అప్రమత్తమైన పప్రాంతం ఢిల్లీ, మాల్వీయ నగర్‌లోని నవజీవన్ విహార్ రెసిడెన్షియల్ సొసైటీ. రీయూజ్, రీసైకిల్‌ను ఫాలో అవుతూ జీరో వేస్ట్‌తో పర్యావరణప్రియమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది.
దాదాపు ఏడేళ్ల కిందట... ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మాల్వీయనగర్‌లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ మీద ఒక వర్క్‌షాప్ నిర్వహించింది. అందులో పాల్గొన్న నవజీవన్ విహార్ రెసిడెన్షియల్ సొసైటీ సభ్యులు ఆ వర్క్‌షాప్‌లో చెప్పినవి, చూపించినవి తమ కాలనీలో అమలు చేయడం మొదలుపెట్టారు. అక్కడ 250 ఇళ్లున్నాయి. ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్తను ఎలా వేరుచేయాలో వివరించి, కొన్నాళ్లపాటు పర్యవేక్షించారు సొసైటీ సెక్రటరీ, కంటివైద్యులు డాక్టర్ రూబీ మఖీజా. తతిమా సభ్యుల సహాయసహకారాలతో తడిచెత్తతో కాలనీలోనే కంపోస్ట్ తయారుచేయడం మొదలుపెట్టారు.
ఆ ఎరువుతో కిచెన్, బాల్కనీ, రూఫ్ గార్డెన్స్‌ను ప్రోత్సహించారు. ఒక షెడ్డు లాంటిదీ ఏర్పాటు చేశారు.. ఇళ్లల్లో పాతపుస్తకాలు, దుస్తులు, ఆటబొమ్మలు, ఉపయోగంలో లేని వస్తువుల కోసం. ఆ కాలనీలో ఎవరికైనా ఏ వస్తువైనా అవసరం ఉంటే ముందు ఈ షెడ్డుకొచ్చి చూసి, అందులో తమకు కావలసింది లేకపోతేనే కొత్తది కొనుక్కోవాలి. అలా కాలనీ వాసులు తీసుకున్నవి పోనూ మిగిలినవి స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారు అవసరమైన వాళ్లకు పంచేందుకు! ఈ కాలనీలో ప్లాస్టిక్ బ్యాన్. గుడ్డ సంచులనే వాడుతారు.
నీటి వృథా, ఆదానూ సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. పిల్లలకు పర్యావరణం పట్ల అవగాహన కలిగించడానికి వారానికోసారి క్యాంప్ పెడతారు. అందులో పిల్లలను ఆడిస్తూ, పాడిస్తూ వాళ్లు ఎలక్ట్రానిక్ పరికరాలకు బానిసలు కాకుండా జాగ్రత్తపడుతున్నారు. వీళ్లో బ్రాడ్‌కాస్ట్ సిస్టమ్‌నూ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజూ కాలనీలో జరిగే పర్యావరణపరిరక్షణ కార్యక్రమాలను వీడియోలుగా తీసి వాటిని సాయంకాలం ప్రసారం చేస్తారు. ఈ ప్రయత్నాలతో జీరో వేస్ట్‌లో దేశానికే స్ఫూర్తిగా నిలిచింది నవజీవన్ విహార్.
(చదవండి: 'తోలుబొమ్మలాట'ను సజీవంగా ఉండేలా చేసిందామె..! ఏకంగా రాజధానిలో..)