
రెండు బంగారం, ఒక వెండి,
కాంస్య పతకాలు కైవసం
దెందులూరు: ఏలూరు జిల్లా దెందులూరు మండలం జోగన్నపాలేనికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని మాత్రపు జెస్సీరాజ్ ఇంటర్నేషనల్ స్కేటింగ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. మార్చి 26 నుంచి 31 వరకు తైవాన్‌లో జరిగిన ఆర్టిస్టిక్ స్కేటింగ్ చాంపియన్ షిప్–2025 పోటీల్లో ఆల్‌రౌండ్ సత్తా చాటింది. సోలో డ్యాన్స్, కపుల్ డ్యాన్స్ విభాగాల్లో రెండు బంగారు పతకాలు, పెయిర్ స్కేటింగ్‌లో వెండి, ఇన్‌లైన్ ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్య పతకం సాధించి భారతీయ జెండాను రెపరెపలాడించింది.
సోమవారం తైవాన్‌లో జెస్సీరాజ్‌కు ఏషియన్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ చైర్మన్ అలెక్స్ వాంగ్ చేతులమీదుగా పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా జెస్సీరాజ్‌ను రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ నరేశ్ వర్మ, ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఇండియా చైర్మన్ ఎం.ప్రదీప్ అభినందించారు.