పదవీ కాలం ఆరు నెలలే
మే 13న పదవీ విరమణ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నా రు. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జస్టిస్ ఖన్నా ఆరు నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మే 13వ తేదీన ముగియనుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆదివారం పదవీ విరమణ చేశారు. ఆయన సిఫార్సు మేరకు నూతన సీజేఐగా జస్టిస్ ఖన్నాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 24న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జస్టిస్ సంజీవ్ ఖన్నాకు న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన 1960 మే 14న జని్మంచారు. ఆయన తండ్రి జస్టిస్ దేవ్‌రాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ ఖన్నా ఢిల్లీలోని మోడ్రన్ స్కూల్‌లో చదువుకున్నారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ అనంతరం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్ లా సెంటర్‌లో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్‌గా చేరారు. తొలుత తీస్‌హజారీ కాంప్లెక్స్‌లోని జిల్లా కోర్టుల్లో, తర్వాత ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
ఆదాయపు పన్ను విభాగంలో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా పని చేశారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సేవలందించారు. ఢిల్లీ హైకోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, అమికస్ క్యూరీగా ఎన్నో క్రిమినల్ కేసుల్లో సమర్థంగా వాదించి పేరు తెచ్చుకున్నారు. 2005 జూన్ 24న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏడాది తిరగకుండానే శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
హైకోర్టు న్యాయమూర్తుల్లో ఆయన కంటే 32 మంది సీనియర్లున్నా వారిని కాదని జస్టిస్ ఖన్నాకు పదోన్నతి దక్కడం వివాదాస్పదంగా మారింది. అయినా ఆయన నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పలు కీలక తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసిన ధర్మాసనంలో ఆయన సభ్యుడు. ఆరి్టకల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు.
ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వాడకాన్ని సమర్థించారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రత్యేక శ్రద్ధ చూపుతారని పేరుంది. అనవసరమైన వాయిదాలకు తావు లేకుండా వేగంగా న్యాయం చేకూర్చడంలో ఆయన దిట్ట అని న్యాయవాద వర్గాలు చెబుతాయి.
ఇక ఇంట్లోనే మార్నింగ్ వాక్
తెల్లవారుజామునే ట్రాక్ ప్యాంట్, ఆఫ్ హ్యాండ్స్ టీ షర్ట్‌తో ఢిల్లీ వీధుల్లో వాకింగ్ చేయడం జస్టిస్ ఖన్నాకు చాలా ఇష్టం. అనేక సందర్భాల్లో ఆయన మార్నింగ్ వాక్ గురించి ప్రస్తావించారు. ‘‘ఉదయాన్నే వాకింగ్ చేస్తే రోజంతా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి’’ అంటారాయన. సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇకపై మార్నింగ్ వాక్‌కు ఆయన స్వస్తి పలకనున్నట్లు తెలిసింది. వాకింగ్‌తో పాటు జిమ్ వంటి కసరత్తులన్నీ ఇంట్లోనే చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment