![Droupadi Murmu PSO Poonam Gupta set to have marriage in Rashtrapati Bhavan](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/POONAM.jpg.webp?itok=g8nYq05o)
12న రాష్ట్రపతి ముర్ము పీఎస్‌వో పూనమ్ గుప్తా వివాహం
తొలిసారి వివాహానికి అనుమతి ఇచ్చిన రాష్ట్రపతి ముర్ము
ముస్తామైన భవన సముదాయం, భారీగా భద్రతా ఏర్పాట్లు
సాక్షి, న్యూఢిల్లీ: చరిత్రలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి వేడుక జరగనుంది. ఈ నెల 12న జరిగే ఈ వేడుక కోసం యంత్రాంగం రాష్ట్రపతి భవన్‌ను ముస్తాబు చేసింది. భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇంతకీ పెళ్లెవరిది? అని కదా మీ సందేహం! రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కుటుంబసభ్యులదీ, సంబంధీకులదీ మాత్రం కాదు! రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యక్తిగత భద్రతా అధికారి(పీఎస్‌వో) పూనమ్ గుప్తా పెళ్లి. పూనమ్ వినతి మేరకు ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతినిచ్చారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన సీఆర్‌పీఎప్ అసిస్టెంట్ కమాండెంట్ అవ్‌నీశ్ కుమార్, పూనమ్ గుప్తా ఓ ఇంటి వారు కానున్నారు. రాష్ట్రపతి ముర్ము సారథ్యంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.
జీవితాంతం గుర్తుండిపోయే కానుక
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన పూనమ్‌గుప్తా 2018 యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్(సీఆర్‌ఎఫ్) విభాగంలో 81వ ర్యాంకు సాధించారు. సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా బిహార్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో పని చేశారు. ఆ తర్వాత ఆమె రాష్ట్రపతి పీఎస్‌ఓగా నియమితులయ్యారు. జమ్మూకశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్న అవ్‌నీశ్ కుమార్‌తో ఈమె వివాహం నిశ్చయమైంది. కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ లేదా కశ్మీర్‌లో వివాహం చేయాలని యోచిస్తుండగా కాబోయే వధువు పూనమ్ మాత్రం సరికొత్తగా ఆలోచించారు. ‘మీకు పీఎస్‌ఓగా పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉంది. దీనిని నేను ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాను. నాకు వివాహం నిశ్చయమైంది.
రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి చేసుకోవాలనేది నా చిరకాల కోరిక. నా కోరికను మీరు తీరుస్తారని ప్రారి్థస్తున్నాను’అంటూ రెండు నెలల క్రితం రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ లేఖపై రాష్ట్రపతి ముర్ము సానుకూలంగా స్పందించారు. ‘డియర్, పూనమ్ గుప్తా(పీఎస్‌వో) మీకు వివాహ శుభాకాంక్షలు. విధుల్లో మీరు కనబరుస్తున్న శ్రద్ద, బాధ్యత నాకెంతో నచ్చాయి. మీ వివాహ వేడుకను రాష్ట్రపతి భవన్‌లో జరిపేందుకు అనుమతి ఇస్తున్నాను’అంటూ బదులిచ్చారు. దీంతో పూనమ్‌గుప్తాకు రాష్ట్రపతి జీవితాంతం గుర్తుండిపోయే కానుకను ఇచ్చారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ముస్తాబవుతున్న రాష్ట్రపతి కార్యాలయం
పూనమ్ అవ్‌నీశ్‌ల పెళ్లి వేడుకకు రాష్ట్రపతి కార్యాలయంలోని మదర్ థెరిస్సా క్రౌన్‌కాంప్లెక్స్ సిద్దమైంది. భారతీయ, సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా వేదికను అలంకరించారు. వేడుక అతి కొద్ది మంది సమక్షంలో జరగనుంది. వధూవరుల కుటుంబ సభ్యులు వంద మంది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, సీఆర్‌పీఎఫ్ డీజీ, ఢిల్లీ పోలీస్ ఉన్నత అధికారులు హాజరు కానున్నట్లు తెలిసింది.
చారిత్రక కట్టడం
రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి భవన్ చరిత్రల సమ్మేళనంతో కూడిన ఓ కళాఖండమే. మొత్తం నాలుగు అంతస్తుల్లో 340 గదులు ఉంటాయి. గదులు, కారిడార్లు, కోర్టులు, గ్యాలరీలు, సెలూన్లు, వంటశాలలు, ప్రింటింగ్ ప్రెస్, థియేటర్‌లు... ఇలా వీటన్నింటినీ కాలినడకన తిరుగుతూ చూడాలంటే కనీసం మూడు గంటల సమయం పడుతుంది. ఇటలీలోని క్విరినల్ ప్యాలస్ తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశాధినేత భవనంగా రాష్ట్రపతి భవనం నిలుస్తుంది. ప్రఖాత్య అమృత ఉద్యాన్, ఒక మ్యూజియం, గణతంత్ర, అశోక మండపాలు, రాగి ముఖం గల గోపురాలు ఉన్నాయి. ఈ భవన్‌లో మొట్టమొదటిగా 1948లో స్వతంత్ర భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి నివసించారు. రాష్ట్రపతి భవన్‌లో నివసించిన మొదటి భారతీయుడిగా చరిత్రలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment