personal securtity officer
-
రాష్ట్రపతి భవన్‌కు పెళ్లి కళ
సాక్షి, న్యూఢిల్లీ: చరిత్రలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రపతి భవన్లో పెళ్లి వేడుక జరగనుంది. ఈ నెల 12న జరిగే ఈ వేడుక కోసం యంత్రాంగం రాష్ట్రపతి భవన్‌ను ముస్తాబు చేసింది. భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇంతకీ పెళ్లెవరిది? అని కదా మీ సందేహం! రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కుటుంబసభ్యులదీ, సంబంధీకులదీ మాత్రం కాదు! రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యక్తిగత భద్రతా అధికారి(పీఎస్వో) పూనమ్ గుప్తా పెళ్లి. పూనమ్ వినతి మేరకు ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతినిచ్చారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన సీఆర్పీఎప్ అసిస్టెంట్ కమాండెంట్ అవ్నీశ్ కుమార్, పూనమ్ గుప్తా ఓ ఇంటి వారు కానున్నారు. రాష్ట్రపతి ముర్ము సారథ్యంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. జీవితాంతం గుర్తుండిపోయే కానుక మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన పూనమ్‌గుప్తా 2018 యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఆర్ఎఫ్) విభాగంలో 81వ ర్యాంకు సాధించారు. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా బిహార్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో పని చేశారు. ఆ తర్వాత ఆమె రాష్ట్రపతి పీఎస్ఓగా నియమితులయ్యారు. జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్న అవ్నీశ్ కుమార్‌తో ఈమె వివాహం నిశ్చయమైంది. కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ లేదా కశ్మీర్లో వివాహం చేయాలని యోచిస్తుండగా కాబోయే వధువు పూనమ్ మాత్రం సరికొత్తగా ఆలోచించారు. ‘మీకు పీఎస్ఓగా పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉంది. దీనిని నేను ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాను. నాకు వివాహం నిశ్చయమైంది. రాష్ట్రపతి భవన్లో పెళ్లి చేసుకోవాలనేది నా చిరకాల కోరిక. నా కోరికను మీరు తీరుస్తారని ప్రారి్థస్తున్నాను’అంటూ రెండు నెలల క్రితం రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ లేఖపై రాష్ట్రపతి ముర్ము సానుకూలంగా స్పందించారు. ‘డియర్, పూనమ్ గుప్తా(పీఎస్వో) మీకు వివాహ శుభాకాంక్షలు. విధుల్లో మీరు కనబరుస్తున్న శ్రద్ద, బాధ్యత నాకెంతో నచ్చాయి. మీ వివాహ వేడుకను రాష్ట్రపతి భవన్లో జరిపేందుకు అనుమతి ఇస్తున్నాను’అంటూ బదులిచ్చారు. దీంతో పూనమ్గుప్తాకు రాష్ట్రపతి జీవితాంతం గుర్తుండిపోయే కానుకను ఇచ్చారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముస్తాబవుతున్న రాష్ట్రపతి కార్యాలయం పూనమ్ అవ్నీశ్ల పెళ్లి వేడుకకు రాష్ట్రపతి కార్యాలయంలోని మదర్ థెరిస్సా క్రౌన్కాంప్లెక్స్ సిద్దమైంది. భారతీయ, సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా వేదికను అలంకరించారు. వేడుక అతి కొద్ది మంది సమక్షంలో జరగనుంది. వధూవరుల కుటుంబ సభ్యులు వంద మంది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, సీఆర్పీఎఫ్ డీజీ, ఢిల్లీ పోలీస్ ఉన్నత అధికారులు హాజరు కానున్నట్లు తెలిసింది. చారిత్రక కట్టడం రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి భవన్ చరిత్రల సమ్మేళనంతో కూడిన ఓ కళాఖండమే. మొత్తం నాలుగు అంతస్తుల్లో 340 గదులు ఉంటాయి. గదులు, కారిడార్లు, కోర్టులు, గ్యాలరీలు, సెలూన్లు, వంటశాలలు, ప్రింటింగ్ ప్రెస్, థియేటర్లు... ఇలా వీటన్నింటినీ కాలినడకన తిరుగుతూ చూడాలంటే కనీసం మూడు గంటల సమయం పడుతుంది. ఇటలీలోని క్విరినల్ ప్యాలస్ తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశాధినేత భవనంగా రాష్ట్రపతి భవనం నిలుస్తుంది. ప్రఖాత్య అమృత ఉద్యాన్, ఒక మ్యూజియం, గణతంత్ర, అశోక మండపాలు, రాగి ముఖం గల గోపురాలు ఉన్నాయి. ఈ భవన్లో మొట్టమొదటిగా 1948లో స్వతంత్ర భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి నివసించారు. రాష్ట్రపతి భవన్లో నివసించిన మొదటి భారతీయుడిగా చరిత్రలో నిలిచారు. -
గన్‌మెన్ ఉండాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీల భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తమైనట్లు తెలిసింది. ఎన్నికలు సమీపిస్తుండటం, ఇతరత్రా కారణాల వల్ల వారి భద్రత విషయమై జాగ్రత్తలు తీసుకుంటోంది. నాలుగేళ్లుగా గన్మెన్లను నియమించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు అధికారులు నివేదించినట్లు సమాచారం. ఉండాల్సిందే.. రాష్ట్రంలోని ఎమ్మెల్యేల్లో కొంతమంది ఒకే గన్‌మెన్‌తో, మరికొంత మంది గన్మెన్లు లేకుండానే నియోజకవర్గాలు, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో అనుకోని సంఘటనలు జరగకుండా ఉండేందుకు గన్మెన్లను నియమిస్తే మరుసటి రోజే హెడ్‌క్వార్టర్స్‌కు రిటర్న్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌కు ఎస్పీలు రిపోర్టు చేశారు. ఈ విషయమై ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు లేఖలు రాశారు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (పీఎస్ఓ)లను తొలగించుకోవడం సరికాదని చెప్పారు. ఎమ్మెల్యేలు సొంతగా కారు డ్రైవ్ చేసుకుంటూ తిరగడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతపై ఆయా జిల్లాల మంత్రులతోనూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సీఎం కార్యాలయం నుంచి నేరుగా కొంతమందికి ఫోన్లు వెళ్లడంతో తప్పక పలువురు గన్మెన్లను నియమించుకున్నట్లు తెలిసింది. ముగ్గురు ఎంపీలూ.. ముగ్గురు ఎంపీల విషయంలోనూ ఇదే వ్యవహారం బయటపడినట్లు తెలిసింది. గన్మెన్లను కేటాయిస్తే క్యాంపు ఆఫీసు, ఇళ్లలో వదిలి కార్యకర్తలు, అనుచరులతో వెళ్తున్నారని.. ఆ ఎంపీలకూ మందలింపులు జరిగాయని సమాచారం. దీంతో ఇద్దరు 2+2 నియమించుకోగా, ఓ ఎంపీ 1+1 స్వీకరించినట్లు తెలిసింది. కాగా ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఎస్పీలు, కమిషనర్ల మధ్య గన్మెన్లు ఒత్తిడికి గురవుతున్నారు. వారిని ఎమ్మెల్యేలు వెంట తీసుకెళ్లకపోవడం.. వెళ్లకపోతే అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుండటంతో ఏం చేయాలో తెలియడం లేదని వారు వాపోతున్నారు. -
ఇదేం చోద్యం !
సాక్షిప్రతినిధి, నల్లగొండ: జిల్లా పోలీసు శాఖకు సంబంధించి ఆర్మ్డ్ రిజర్వు (ఏఆర్) విభాగంలో జరుగుతున్న వ్యవహారాలు నివ్వెర పరుస్తున్నాయి. మామూళ్ల ఒత్తిడి భరించలేక లేక కొందరు కిందిస్థాయి అధికారులు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం, లేదంటే, ఇతర జిల్లాలకు బదిలీ చేయించుకుని వెళ్లిపోతున్నారు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (పీఎస్ఓ) లో డ్యూటీ చేస్తున్న వారి నుంచి నెలనెలా మామూళ్లు వసూలు చేసి ఇవ్వాలని తీవ్రంగా ఒత్తిడి వస్తుండడంతో పీఎస్ఓ ఇన్చార్జ్గా డ్యూటీ చేయాలంటేనే హడలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ తదితర ప్రజాప్రతినిధులకు పీఎస్ఓ విభాగమే గన్మెన్లను కేటాయిస్తుంది. గన్‌మెన్ డ్యూటీలు చేస్తున్న వారి నుంచి నెలనెలా కనీసం రూ.50వేల మామూళ్లు వసూలు చేసి ఇవ్వాలన్న ఒత్తిళ్లు తట్టుకోలేక సెలవులపై వెళ్లిన వారున్నారని చెబుతున్నారు. గడిచిన మూడు నెలల కాలంలో ఇలా కనీసం నాలుగుసార్లు జరిగిందని సమాచారం. ఇక, గొర్రెతోక జీతంతో నానా అవస్థలు పడుతున్న హోంగార్డులను కూడా వీరు వదిలిపెట్టడం లేదు. ఐదు సబ్- డివిజన్ల నుంచి నెల నెలా కనీసం రూ.5వేల చొప్పున వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏఆర్ అధికారుల వేధింపులకు తట్టుకోలేక, చాలారోజుల పాటు విధులకు గైర్హాజరైన ఓ ఆర్ఎస్ఐ ఇటీవలే పొరుగు జిల్లాకు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. మరో ఆర్ఎస్ఐ సైతం ఇటీవలే విధుల్లో చేరినట్లు తెలిసింది. ఇటీవల కొందరు హెడ్ కానిస్టేబుల్ పదోన్నతులపై వెళ్లగా, మరికొందరు సివిల్ కానిస్టేబుళ్లుగా ‘కన్వర్షన్’లో వెళ్లారు. దీంతో ఖాళీ అయిన బాంబ్‌స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, పీఎస్ఓకి చెందిన పోస్టుల్లో కొత్తవారిని తీసుకోవ డానికి ఒక్కో పోస్టుకు కనీసం రూ. 25వేలు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే మాదిరిగా, సెలవుల విషయంలోనూ కింది స్థాయి ఉద్యోగులకు సతాయింపులు తప్పడం లేదు. వ్యక్తిగత, అనారోగ్య కారణాల రీత్యా ఎవరికైనా సెలవు మంజూరు చేయాలంటే, రోజుకింత చొప్పున డిమాండ్ చేస్తున్నార ని విమర్శిస్తున్నారు. తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఎక్కడికి వెళ్లినా తమకు అప్పు పుట్టడం లేదన్న ఆవేదన కొందరు సిబ్బంది వ్యక్తం చేశారు. ఫైనాన్సులు, బ్యాంకులు ముఖం చాటేస్తున్నాయని, చివరకు తమ వేతన అకౌంట్లున్న బ్యాంకు సైతం పర్సనల్ లోన్లు ఇవ్వడానికి ముందుకు రావడంలేదని వాపోయారు. జిల్లా ఏఆర్ సిబ్బంది వేతనాల అకౌం ట్లన్నీ ఓ ప్రముఖ బ్యాంకులోనే ఉన్నాయి. కేవలం వేతనాల మొత్తమే కాకుండా, భద్రత, హౌసింగ్, సంక్షేమ పథకాల్లో డిపార్టుమెంటు ఖర్చు చేయాల్సిన నిధులు కూడా ఈ బ్యాంకుకే జమవుతున్నాయని, తమ సొమ్ముతో లాభం పొందుతున్న బ్యాంకు తమకు మాత్రం రుణాలు ఇవ్వడం లేదని, ఆ బ్యాంకులో అకౌంట్లు రద్దు చేసే, లోన్లు ఇచ్చే ఒప్పందంతో వేరే బ్యాంకుకు బదలాయించాలని సిబ్బంది చేసిన డిమాండ్‌కు విలువ లేకుండా పోయింది. ఏఆర్ విభాగానికి చెందిన అధికారులు బ్యాంకు అధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నందునే, సదరు బ్యాంకులోనే అకౌంట్లు బలవంతంగా ఉంచుతున్నారని ఆరోపించారు. ‘ జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్‌లో ఇన్ని సమస్యలున్నా, జిల్లా పోలీసు అధికారుల సంఘం నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సిబ్బంది అగచాట్లను తీర్చేందుకు ఎస్పీ ప్రత్యేక విచారణ చేపట్టి, రక్షణ కల్పించాలి..’ అని ఓ ఉద్యోగి కోరారు.