సాక్షిప్రతినిధి, నల్లగొండ: జిల్లా పోలీసు శాఖకు సంబంధించి ఆర్మ్‌డ్ రిజర్వు (ఏఆర్) విభాగంలో జరుగుతున్న వ్యవహారాలు నివ్వెర పరుస్తున్నాయి. మామూళ్ల ఒత్తిడి భరించలేక లేక కొందరు కిందిస్థాయి అధికారులు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం, లేదంటే, ఇతర జిల్లాలకు బదిలీ చేయించుకుని వెళ్లిపోతున్నారు.
పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (పీఎస్‌ఓ) లో డ్యూటీ చేస్తున్న వారి నుంచి నెలనెలా మామూళ్లు వసూలు చేసి ఇవ్వాలని తీవ్రంగా ఒత్తిడి వస్తుండడంతో పీఎస్‌ఓ ఇన్‌చార్జ్‌గా డ్యూటీ చేయాలంటేనే హడలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ తదితర ప్రజాప్రతినిధులకు పీఎస్‌ఓ విభాగమే గన్‌మెన్లను కేటాయిస్తుంది. గన్‌మెన్ డ్యూటీలు చేస్తున్న వారి నుంచి నెలనెలా కనీసం రూ.50వేల మామూళ్లు వసూలు చేసి ఇవ్వాలన్న ఒత్తిళ్లు తట్టుకోలేక సెలవులపై వెళ్లిన వారున్నారని చెబుతున్నారు. గడిచిన మూడు నెలల కాలంలో ఇలా కనీసం నాలుగుసార్లు జరిగిందని సమాచారం.
ఇక, గొర్రెతోక జీతంతో నానా అవస్థలు పడుతున్న హోంగార్డులను కూడా వీరు వదిలిపెట్టడం లేదు. ఐదు సబ్- డివిజన్ల నుంచి నెల నెలా కనీసం రూ.5వేల చొప్పున వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏఆర్ అధికారుల వేధింపులకు తట్టుకోలేక, చాలారోజుల పాటు విధులకు గైర్హాజరైన ఓ ఆర్‌ఎస్‌ఐ ఇటీవలే పొరుగు జిల్లాకు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. మరో ఆర్‌ఎస్‌ఐ సైతం ఇటీవలే విధుల్లో చేరినట్లు తెలిసింది. ఇటీవల కొందరు హెడ్ కానిస్టేబుల్ పదోన్నతులపై వెళ్లగా, మరికొందరు సివిల్ కానిస్టేబుళ్లుగా ‘కన్వర్షన్’లో వెళ్లారు. దీంతో ఖాళీ అయిన బాంబ్‌స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, పీఎస్‌ఓకి చెందిన పోస్టుల్లో కొత్తవారిని తీసుకోవ డానికి ఒక్కో పోస్టుకు కనీసం రూ. 25వేలు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
అదే మాదిరిగా, సెలవుల విషయంలోనూ కింది స్థాయి ఉద్యోగులకు సతాయింపులు తప్పడం లేదు. వ్యక్తిగత, అనారోగ్య కారణాల రీత్యా ఎవరికైనా సెలవు మంజూరు చేయాలంటే, రోజుకింత చొప్పున డిమాండ్ చేస్తున్నార ని విమర్శిస్తున్నారు. తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఎక్కడికి వెళ్లినా తమకు అప్పు పుట్టడం లేదన్న ఆవేదన కొందరు సిబ్బంది వ్యక్తం చేశారు. ఫైనాన్సులు, బ్యాంకులు ముఖం చాటేస్తున్నాయని, చివరకు తమ వేతన అకౌంట్లున్న బ్యాంకు సైతం పర్సనల్ లోన్లు ఇవ్వడానికి ముందుకు రావడంలేదని వాపోయారు. జిల్లా ఏఆర్ సిబ్బంది వేతనాల అకౌం ట్లన్నీ ఓ ప్రముఖ బ్యాంకులోనే ఉన్నాయి. కేవలం వేతనాల మొత్తమే కాకుండా, భద్రత, హౌసింగ్, సంక్షేమ పథకాల్లో డిపార్టుమెంటు ఖర్చు చేయాల్సిన నిధులు కూడా ఈ బ్యాంకుకే జమవుతున్నాయని, తమ సొమ్ముతో లాభం పొందుతున్న బ్యాంకు తమకు మాత్రం రుణాలు ఇవ్వడం లేదని, ఆ బ్యాంకులో అకౌంట్లు రద్దు చేసే, లోన్లు ఇచ్చే ఒప్పందంతో వేరే బ్యాంకుకు బదలాయించాలని సిబ్బంది చేసిన డిమాండ్‌కు విలువ లేకుండా పోయింది. ఏఆర్ విభాగానికి చెందిన అధికారులు బ్యాంకు అధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నందునే, సదరు బ్యాంకులోనే అకౌంట్లు బలవంతంగా ఉంచుతున్నారని ఆరోపించారు. ‘ జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్‌లో ఇన్ని సమస్యలున్నా, జిల్లా పోలీసు అధికారుల సంఘం నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సిబ్బంది అగచాట్లను తీర్చేందుకు ఎస్పీ ప్రత్యేక విచారణ చేపట్టి, రక్షణ కల్పించాలి..’ అని ఓ ఉద్యోగి కోరారు.
ఇదేం చోద్యం !
Published Fri, Dec 27 2013 4:06 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement