అందీ అందకుండా... అమ్మా నాన్నా పిలుపు  | Shortage Of Children In Orphanages | Sakshi
Sakshi News home page

అందీ అందకుండా... అమ్మా నాన్నా పిలుపు 

Published Sun, Sep 5 2021 2:32 AM | Last Updated on Sun, Sep 5 2021 2:32 AM

Shortage Of Children In Orphanages - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అమ్మా..నాన్నా.. అనేది ఓ మధురమైన పిలుపు. అలా పిలిపించుకునేందుకు ప్రతిఒక్కరూ ఉవ్విళ్లూరుతుంటారు. కానీ కొందరికి ఆ ఆశ నెరవేరడం లేదు. ఆధునిక జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా అనేక జంటలు ఆ పిలుపునకు దూరం అవుతున్నాయి. పిల్లల కోసం తాపత్రయ పడుతూ ఆధునిక వైద్య విధానాలను అనుసరిస్తూ ప్రయత్నిస్తున్నా, కొందరికి ఫలితం దక్కడం లేదు. ఈ క్రమంలోనే అమ్మా, నాన్నలుగా అయ్యేందుకు, వృద్ధాప్యంలో అవసరమైన ఆసరా కోసం.. కొంద రు దత్తత బాట పడుతున్నారు.

అయితే శిశు గృహ కేంద్రాల్లో పిల్లలు తక్కువగా ఉండటం, దత్తత ప్రక్రియ సుదీర్ఘంగా ఉండటంతో పిల్లల కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. అమ్మా, నాన్నా అని పిలిపించుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్న వారికి ఈ పరిస్థితి ఆవేదనకు గురిచేస్తోంది. 

గతంలో సులువుగా దత్తత 
దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులకు పిల్లలను అప్పగించేందుకు గతంలో తక్కువ సమయం పట్టేదని అధికారులు చెబుతున్నారు. ఇపుడు ఏడాది నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతు న్న సందర్భాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. గతంలో జిల్లా స్థాయిలో వచ్చిన దరఖాస్తులను బట్టి జిల్లాల్లోని శిశు గృహ కేంద్రాల్లో ఉన్న పిల్లలను దత్తతకు ఇచ్చేవారు. అయితే 2015లో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. రాష్ట్రం యూనిట్‌గా దత్తత ప్రక్రియను ఆన్‌లైన్‌ చేసింది.

ఇందుకోసం సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్సు అథారిటీ (కారా), స్టేట్‌ అడాప్షన్‌ రిసోర్సు అథారిటీలను (సారా) ఏర్పాటు చేసింది. దత్తత తీసుకోవాలనుకునేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సీరియల్‌ నంబర్‌ ప్రకారం, అందుబాటులో ఉన్న పిల్లల సంఖ్యను బట్టి అవకాశం ఇస్తారు. ఆరో గ్యవంతమైన పిల్లలను మాత్రమే దత్తతకు ఇస్తారు. అయితే ఈ ప్రక్రియకు ఎక్కువ సమ యం పడుతోంది. ఈలోగా పిల్లలు పెద్ద వారు అవుతుండటంతో దత్తత తీసుకునేందుకు కొంతమంది నిరాకరిస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి.  

అబ్బాయే కావాలి.. 
దత్తత కోసం వచ్చే దరఖాస్తుల్లో అబ్బాయిలు కావాలనేవే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ జిల్లాల్లోని శిశు గృహ కేంద్రాల్లో 122 మంది పిల్లలు ఉంటే.. 683 మంది జంటలు తమకు పిల్లలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. అందులో అబ్బాయి కావాలని దరఖాస్తు చేసుకున్నవారు 372 మంది కాగా.. అమ్మాయిలు కావాలని దరఖాస్తు చేసుకున్నవారు 288 మంది ఉన్నారు. ఎవరైనా పర్వాలేదని అన్నవారు కేవలం 30 మంది మాత్రమే ఉన్నారు.

తగ్గిపోతున్న పిల్లల సంఖ్య 
ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, ప్రజల్లో వచ్చిన చైతన్యం, ప్రభుత్వ నిబంధనల కారణంగా శిశు గృహ కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. గతంలో అప్పుడే పుట్టిన బిడ్డను కూడా తీసుకునేవారు. వారికి డబ్బా పాలు తాగించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండడం లేదు. కొందరు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో నిబంధనల్లో మార్పులు చేశారు. పుట్టిన బిడ్డను పోషించలేని పరిస్థితుల్లో దత్తత ఇద్దామనుకున్నప్పుడు, తల్లి బిడ్డకు మూడు నెలలపాటు పాలు ఇవ్వాలని, అప్పుడే బిడ్డను తీసుకుంటామనే నిబంధన విధించారు.

దీంతో మూడు నెలలు పాలు ఇవ్వడం వల్ల బిడ్డపై ప్రేమ పెరిగిన కొందరు మనసు మార్చుకుంటున్నారు. వారిని శిశు గృహ కేంద్రాలకు ఇవ్వడం లేదు. ఇక మారుమూల అటవీ ప్రాంతాల్లో అనాగరికత కారణంగా పిల్లలను కన్నా.. సాకలేక, పోషించలేక వదిలేసే ఘటనలు గతంలో ఎక్కువగా ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో వారిలో పెరిగిన అవగాహన, ప్రభుత్వాలు తీసుకువచ్చిన చైతన్యం కారణంగా శిశు గృహాలకు ఇచ్చే పిల్లల సంఖ్య తగ్గిపోయింది. 

25 మందిని అనాథలుగా చేసిన కరోనా..  
రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో 25 మంది పిల్లలు కరోనా కారణంగా అనాథలుగా మారా రు. కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయినవారు కొందరైతే, గతంలో వేరే కారణాలతో తల్లి లేదా తండ్రి చనిపోయి.. కరోనా సమయంలో మిగిలినవారు చనిపోవడంతో మరికొందరు అనాథలుగా మారారు. ఇలాంటి పిల్లలు నల్లగొండలో ఆరుగురు, నిజామాబాద్‌లో 9 మంది, ఖమ్మంలో 10 మంది, మెదక్‌ జిల్లాలో నలుగురు ఉన్నారు. అయితే వీరెవరూ శిశు గృహ కేంద్రాల్లో లేరు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహకారంతో వారి బంధువుల ఇళ్లల్లోనే పెరుగుతున్నారు. వారి నిర్వహణ కోసం ఒక్కో శిశువుకు నెలకు రూ.2 వేల చొప్పున శిశు సంక్షేమ శాఖ ఆర్థిక సహకారం అందిస్తోంది. 

పిల్లలు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ 
ఉన్న పిల్లల సంఖ్య కంటే వారికోసం వచ్చే దరఖాస్తుదారుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో దత్తతిచ్చేందుకు ఏడాదిన్నర సమయం పడుతోంది. గతంలో జిల్లా స్థాయిలోనే ఉండటం వల్ల త్వరగా ముగిసేది. ఇప్పుడు రాష్ట్రం యూనిట్‌గా ఆన్‌లైన్‌ కావడంతో ఆలస్యం అవుతోంది.     


– గణేశ్, బాలల పరిరక్షణ జిల్లా అధికారి, నల్లగొండ 

18 నెలలు పట్టింది 
పాపను దత్తత తీసుకోవాలనుకుని ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేశాం. తర్వాత ప్రక్రియ అంతా ముగిసి పాపను తీసుకోవడానికి 18 నెలల సమయం పట్టింది. రెండేళ్ల లోపు పాప కావాలని అడిగాం. 5 నెలల శిశువును ఇచ్చారు. ఐదేళ్లు గడిచాయి. ప్రస్తుతం యూకేజీ చదువుతోంది.     
– ఖమ్మం నగరానికి చెందిన ఓ జంట 

15 ఏళ్లయినా పిల్లలు లేకపోవడంతో 
మాకు వివాహమై 15 ఏళ్లు గడిచింది. అయినా పిల్లలు కాలేదు. దీంతో దత్తత తీసుకునేందుకు ‘కారా’లో దరఖాస్తు చేసుకున్నా. అదృçష్టంకొద్దీ అమ్మాయి లభించింది. పిల్లలు లేరనే బాధ తప్పింది. 
– శ్రీనివాస్, వరంగల్‌ 

మాకు ఏడాదిలో పాప లభించింది 
సంతానం లేకపోవడంతో 2015లో రెండేళ్ల లోపు పాప కావాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాం. ఏడాది సమయం తర్వాత ఐదు నెలల పాప లభించింది. 
– శ్రీనివాస్, సరస్వతి, నిజామాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement