![Sakshi Guest Column On Artificial Inteligence and children and parents](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/kid.jpg.webp?itok=mLnJMaxP)
ఏఐ ప్రాధాన్యం రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల ప్రపంచం తీవ్ర ప్రభావానికి లోనవుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు బిడ్డల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అత్యంత ముఖ్యమైన అంశం అయ్యింది.
2025 నుంచి 2039 మధ్య జన్మించే పిల్లలు బీటా తరం కిందకు వస్తారు. మొన్న జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 12.03 నిమిషాలకు మిజోరంలోని ఐజ్వాల్ ఆసుపత్రిలో జన్మించిన అబ్బాయిని భారతదేశంలో మొదటి తరానికి చెందే తొలి ‘బీటా చిన్నారి’గా గుర్తించారు. అసలు ఆల్ఫా, బీటా... అంటూ ఈ వర్గీకరణ అంతా ఏమిటి అనుకుంటున్నారా?
పిల్లలు ఏ తరంలో జన్మించారు అన్న అంశం వాళ్ల సామాజిక వ్యవహార శైలిని నిర్దేశిస్తుంది. అప్పుడు ఉండే సాంకేతికత, సామాజిక మాధ్య మాల ప్రభావం వంటి అంశాలు వాళ్ల వ్యక్తిత్వాన్ని, అనుభవాలను ప్రభావితం చేస్తాయి. అంతేకాదు. రాజకీయంగా వాళ్ల ఐడియాలజీని, వినియోగ దారునిగా వాళ్ల మనస్తత్వాన్ని నిర్దేశిస్తాయి.
ఇప్పుడు పుట్టుకొస్తున్న బీటా బేబీలు ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్‌తో నిండిపోయిన సాంకేతిక ప్రపంచంలో జీవిస్తారు. అంటే వాళ్ల రోజువారీ జీవితం చిన్న రోబోల మధ్య సాగుతుంది. అవి చెప్పినట్టే వాళ్లు నడుచుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే అవి వీళ్లకు ట్యూటర్లు అన్న మాట. దాంతో పాటు వాటికవే నడిచే డ్రైవర్ లేని కార్లను చూస్తారు. 2035 నాటికి మొత్తం జనాభాలో 16 శాతం మంది బీటా తరానికి చెందిన వాళ్లే ఉంటా రని అంచనా.
బీటా తరంలో పుట్టిన పిల్లలు ఆల్ఫా తరం కంటే చురుగ్గా, తెలివిగా, టెక్ సావీగా ఉంటారు. ఉదాహరణకి ‘వీల్స్ ఆన్ ద బస్’ ఆట ఆడాలంటే ‘అలెక్సా’ను పిలుస్తారు. లెక్కల్లో హెచ్చివేతలు అంటే మల్టిప్లికేషన్ వంటివి తెలియకపోతే ‘బ్లాక్ బాక్సు’ను ఆశ్రయిస్తారు. ఈ పరిస్థితుల్లో పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసు కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ముందుగా మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్న యాప్స్, ప్లాట్ ఫారమ్స్ గురించి తెలుసుకోవాలి. ట్రెండ్స్‌ను అనుసరించాలి. అప్పుడు పిల్లలకు ఏవి ఉపయోగపడతాయి? ఏవి ఉపయోగపడవు అనేది తెలుసుకోగలుగుతారు. పిల్లలు ఎక్కువ టెక్నాలజీ మధ్య ఉంటారు గనుక సైబర్ మోసాల బారిన పడే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలకు తగినంత అవగాహన పెంచాలి. ఎక్కువ డివైజ్‌లపై ఆధారపడకుండా బాహ్య ప్రపంచంలో వాళ్లకు మంచి అనుభవాలను అందించాలి. కొత్త ప్రదేశాలకు తీసికెళ్లటం, బంధువులు, స్నేహితుల మధ్య గడపటం నేర్పాలి.
ఇంట్లో కొంత ప్రదేశాన్ని ‘టెక్ ఫ్రీ జోన్’గా మలచాలి. ప్రధానంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేసే డైనింగ్ టేబుల్ మీద ఎలాంటి డివైజ్‌లూ లేకుండా చూసుకోవాలి. పుస్తకాలు చదవటం, ఇంట్లో అమ్మానాన్నలతో మాట్లాడటం వంటివి అలవాటు చేయాలి. ఏది ఏమైనా బీటా తరం కొత్త ప్రపంచాన్ని చూస్తుంది. చుట్టూ ఉన్న వాళ్లకు కొత్త అనుభవాలను అంది స్తుంది. అవి ఎలా ఉంటాయో రానున్న రోజుల్లో మనకు అర్థం అవుతుంది.
– డా‘‘ పార్థసారథి చిరువోలు
సీనియర్ జర్నలిస్ట్ ‘ 99088 92065
Comments
Please login to add a commentAdd a comment