సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యతను పూర్తిగా సర్పంచ్‌లకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అయితే సర్పంచ్‌ల పదవీకాలం నెలాఖరుతో ముగుస్తున్నందున అధికారులు ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్కతో కలసి సచివాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్) కింద కేటాయించిన రూ.10 కోట్లలోంచి రూ. కోటి చొప్పున తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ లాంటి కొత్త రిజర్వాయర్లన్నింటినీ తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాలని.. తద్వారా చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటి సరఫరా సులభమవుతుందని సీఎం తెలిపారు. గ్రామాల వరకు రక్షిత మంచినీటిని సరఫరా చేసే బాధ్యతను మిషన్ భగీరథ విభాగమే తీసుకోవాలని, ఇంటింటికీ నీళ్లను అందించే బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ, నల్లాలు, పైపులైన్ల మెయింటెనెన్స్‌ను సర్పంచులకే అప్పగించాలన్నారు.
నీరురాని గ్రామాల సర్వే..
రాష్ట్రంలో ఏయే ప్రాంతాలకు తాగునీరు అందట్లేదో సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. సంబంధిత ఇంజనీర్లు అన్ని గ్రామాలకు వెళ్లి నిజ నిర్ధారణ బృందం చేసినట్లుగానే పక్కాగా తాగునీరు అందని ఆవాసాల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. జలజీవన్ మిషన్ నిధులు రాబట్టుకొనేలా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించాలన్నారు.
స్వయం సహాయక సంఘాలకు...
స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, వాళ్లకు ఆర్థికంగా చేయాతను అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థిని విద్యార్థులు, పోలీసులకు అందించే యూనిఫామ్‌లను కుట్టించే పనిని ఈ సంఘాల మహిళలకు అప్పగించాలని సూచించారు.
రహదారులు లేని గ్రామాలకు తారురోడ్లు...
రోడ్డు సౌకర్యంలేని గ్రామాల్లో రోడ్లను నిర్మించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 422 గ్రామ పంచాయతీలు, 3,177 ఆవాసాలకు ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేదని అధికారులు సీఎంకు నివేదించగా వాటన్నింటికీ తారురోడ్లు వేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఉపాధి హామీ నిధులను అనుసంధానించి వాటిని పూర్తి చేయా లని చెప్పారు. ఈ బడ్జెట్‌లోనే అందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
గత ప్రభుత్వ నిర్వాకంతో కేంద్ర నిధులు రాలేదు..
తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచి్చనట్లు గత ప్రభుత్వం చెప్పుకోవడంతో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ ప్రకటనలతో కేంద్రం నుంచి జలజీవన్ మిషన్ నిధులు రాకుండా పోయాయన్నారు. ఇకపై వాస్తవాలను దాచిపెట్టి గొప్పలకు పోవాల్సిన అవసరం లేదని అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment