సాక్షి, హైదరాబాద్: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు, తండాలనే తేడా లేకుండా ప్రతి నివాస ప్రాంతానికి తాగునీరు అందేలా చూడాలని సూచించారు. ఇందుకోసం సాగునీటి, పట్టణాభివృద్ధి, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు కలసి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. వర్షాభావంతో రాష్ట్రంలోని కీలక జలాశయాలు డెడ్‌స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అధికారులతో కలిసి తాగునీటి అంశంపై సమీక్షించారు.
బోర్లు, మోటార్లకు మరమ్మతులు
కొత్త నీటి పథకాలను తెచ్చినప్పుడల్లా అంతకుముందున్న అనేక నీటి వనరులను వదిలేశారని.. అలాంటి వాటిని ప్రస్తుతం వినియోగంలోకి తెచ్చే అవకాశాన్ని పరిశీలించాలని సమీక్షలో సీఎం సూచించారు. కాగ్నా నుంచి తాండూర్, కొడంగల్ నియోజకవర్గాలకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని.. కానీ మిషన్ భగీరథ వచ్చాక దానిని వదిలేశారని చెప్పారు. ఇలాంటివి రాష్ట్రంలో ఎక్కడున్నా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి బోర్లు, బావులు, మోటార్లకు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ఇందుకోసం ఎమ్మెల్యేలకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి (ఏసీడీపీ) నిధుల నుంచి కోటి రూపాయలు, అవసరమైతే అంతకన్నా ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు.
కృష్ణానీటిపై దృష్టి పెట్టండి
ఏపీ సర్కారు తాగునీటి కోసమంటూ నాగార్జునసాగర్ నుంచి తొమ్మిది టీఎంసీలకుపైగా నీటిని తీసుకుపోతోందని సమీక్షలో అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన రేవంత్.. అంత పెద్దమొత్తంలో తాగునీటిని ఎక్కడ వినియోగిస్తున్నారో సరైన గణాంకాలు తీసుకోవాలని.. ఇతర అవసరాలకు నీరు తీసుకుపోకుండా చూడాలని సూచించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటిని తీసుకోవాలంటే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ ఎంబీ)కి లేఖ రాయాల్సి ఉంటుందని చెప్పగా.. ఎంత నీరు అవసరమో వెంటనే సమీక్షించి లేఖ రాయాలని ఆదేశించారు. నారాయణపూర్ జలాశయం నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటకను కోరవచ్చని అధికారులు చెప్పగా.. పరిస్థితిని బట్టి దీనిని చివరి అవకాశంగా తీసుకోవాలని సీఎం సూచించారు.
తప్పుడు నివేదికలతో అందని నిధులు
ఇటీవల తాను ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినప్పుడు అనేక గ్రామాల్లో తాగునీటి సరఫరా లేదని గుర్తించినట్టు సీఎం చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా 99శాతం ఇళ్లకు నీళ్లు ఇచ్చామని గత ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చినందునే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి జల్ జీవన్ మిషన్ నిధులు రావడం లేదన్నారు. గొప్పలకు పోయి తప్పుడు నివేదికలు ఇవ్వవద్దని అధికారులకు స్పష్టం చేశారు. మొత్తంగా జూలై చివరిదాకా ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్లతో సమీక్షించాలని సీఎస్‌ను ఆదేశించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ తాగునీటికి సమస్య లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే హైదరాబాద్‌కు పెద్దగా ఇబ్బందులు లేవని.. అవసరమైతే ఎల్లంపల్లి, నాగార్జునసాగర్‌ల నుంచి తెప్పించుకునే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఇక వేసవి పూర్తయ్యే వరకు హైదరాబాద్ నగరంలో తాగునీటి ట్యాంకర్ల రాకపోకలకు పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా చూడా లని సీఎం ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్ పరిధిలోని క్షేత్రస్థాయి సిబ్బందికి వేతనాలకోసం నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment