వేసవి తాగునీటి అవసరాల కోసం కేటాయింపు
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయం
ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయించిన కమిటీ
తదుపరి అవసరాలపై మళ్లీ భేటీ
సాక్షి, హైదరాబాద్: వేసవి తాగునీటి అవసరాలకు తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. కేఆర్‌ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయపురే నేతృత్వంలో ఈ ముగ్గు రు సభ్యుల కమిటీ శుక్రవారం జలసౌధలో ప్రత్యేకంగా సమావేశమైంది. తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డితో రాయపురే 2 గంటలకు పైగా చర్చించారు. తుదకు శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటి నిల్వలను వినియోగించుకోవద్దని నిర్ణ యించారు. సాగర్ రిజర్వాయర్‌లోని నీటి నిల్వలపై చర్చించారు.
సాగర్ ఎండీడీఎల్ 510 ఫీట్లు కాగా, గతంలో 505 ఫీట్ల వరకు అందుబాటులో ఉన్న నీటిని లెక్కగట్టి ఆ మేరకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. తాజా సమావేశంలో దీన్ని 500 అడుగులకు తగ్గించారు. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 510.53 అడుగులు కాగా, 132.86 టీఎంసీలు అందుబాటులో ఉన్నా యి. అందులో 500 అడుగుల ఎండీడీఎల్ మేరకు మొత్తం 17.55 టీఎంసీలు ప్రస్తుతం వినియోగానికి అందుబాటు లో ఉన్నాయి. అందులో 3.55 టీఎంసీలను భవిష్యత్ అవసరాలకు మినహాయించి మిగతా 14 టీఎంసీలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. తదుపరి అవసరాలపై మేలో సమా వేశం కావాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది.
రెండు రాష్ట్రాల విజ్ఞప్తితో..
మే మాసాంతం వరకు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన అంశంపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ గత అక్టోబర్‌లో చివరి సారిగా సమావేశమైంది. శ్రీశైలం ప్రాజెక్టు కనీస మట్టం (ఎండీడీఎల్)ను 805 ఫీట్లు, సాగర్ ఎండీడీఎల్‌ను 505 ఫీట్లకు నిర్ణయించి, వేసవి ఆవిరి నష్టాలను కూడా లెక్కగట్టి రెండు జలాశయాల్లో 92.78 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్టు నిర్ధారించింది. అయినప్పటికీ మే మాసాంతం వరకు మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో 82.78 టీఎంసీలనే వినియోగించాలని అప్పట్లో కమిటీ నిర్ణయించింది.
అందులో 2.78 టీఎంసీలను జూన్, జూలై తాగునీటి అవసరాల కోసమని రిజర్వ్ చేసింది. మిగిలిన 80 టీఎంసీల్లో 35 టీఎంసీలను తెలంగాణకు, 45 టీఎంసీలను ఏపీకి కేటాయించిన విషయం విదితమే. కాగా కమిటీ నిర్ణయించిన కోటాకు మించి తెలంగాణ ఇప్పటికే 11 టీఎంసీలను వినియోగించుకుంది. ఏపీ కోటా మేరకు వినియోగించుకుంది. అయితే ఇరు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు అదనంగా జలాలను విడుదల చేయాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలోనే కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంది. సమావేశంలో సాగర్ సీఈ అజయ్‌కుమార్, ఈఈ విజయ్‌భాస్కర్, కృష్ణా బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సల్లా విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీలో మంచినీటి కొరత ఎక్కువగా ఉంది: ఈఎన్సీ
త్రిసభ్య కమిటీ సమావేశంలో కేవలం తాగునీటి అంశంపైనే చర్చించామని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి సమావేశానంతరం చెప్పారు. 2 రాష్టాల అంగీకారంతో నీటి వాటాల పంపిణీ జరిగిందని తెలిపారు. ఏపీలో మంచినీటి కొరత కొంత ఎక్కువగా ఉందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment