Orphanages
-
TS: రాష్ట్రంలో అనాథ వసతిగృహాలెన్ని?
సాక్షి, హైదరాబాద్: అనాథల సంరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక పాలసీని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సుదీర్ఘ అధ్యయనం చేసి సలహాలు, సూచనలతో కూడిన నివేదిక ఇవ్వాలంటూ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అనాథల వసతిగృహాలు, అనాథల లెక్క తేల్చే పనిలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిమగ్నమైంది. అధికారిక లెక్కల ప్రకారంరాష్ట్రవ్యాప్తంగా 57 అనాథ వసతిగృహాలు నమోదయ్యాయి. మరో 2 వందల వరకు అనధికారికంగా కొనసాగుతున్నట్లు అధికారుల అంచనా. వీటి పరిధిలో దాదాపు 34 వేల మంది పిల్లలున్నారు. అయితే వీరిలో పాక్షిక, పూర్తి అనాథులున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వసతిగృహాల గుర్తింపు, పిల్లల లెక్కలను కచ్చితంగా తేల్చేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ వసతిగృహాలను సందర్శించి పిల్లల సంఖ్యను నిర్ధారించనుంది. ఇలా గుర్తించిన పిల్లలకు స్మార్ట్‌కార్డులు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వనికి సూచించింది. పట్టణ ప్రాంతాల్లోనే అత్యధికం... రాష్ట్రంలో కొనసాగుతున్న అనాథ వసతిగృహాలు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. స్వచ్ఛందసంస్థలు నిర్వహించే వసతిగృహాలకు ప్రభుత్వ గుర్తింపు ఉండగా, స్వతంత్రులు నిర్వహించేవాటికి మాత్రం గుర్తింపు లేదు. రాష్ట్రంలోని అనాథ వసతిగృహాల్లో 80 శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చ ల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చేవారంలో మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి అనాథల లెక్కింపు ప్రక్రియను వేగవంతం చేసేలా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. అనాథ వసతిగృహాలను సందర్శించి తనిఖీలు చేసే కమిటీలు వసతిగృహం నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలు(ట్రాక్ రికార్డు)ను క్షుణ్ణంగా పరిశీలించనుంది. వసతిగృహం నిర్వహణకు వచ్చే నిధులు, విరాళాలను సైతం పరిశీలించి వసతిగృహాల వారీ గా నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనుంది. -
సామాజిక సేవ చేయండి
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) కె.శామ్యూల్‌కు హైకోర్టు సామాజిక సేవను శిక్షగా విధించింది. అనంతపురం జిల్లాలోని ఏదైనా వృద్ధాశ్రమం లేదా అనాథ ఆశ్రమంలో ఉన్న వారికి వారం రోజుల పాటు భోజన ఖర్చులను భరించాలని ఆయనను ఆదేశించింది. ఆ వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడమంటే కోర్టులను అవమానించడమేనంది. కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేసేలా తగిన చర్యలు చేపట్టాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నోషనల్ సీనియారిటీని కల్పించే విషయంలో అనంతపురం జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పి.వెంకటరమణ 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు నోషనల్ సీనియారిటీ కల్పించాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో వెంకటరమణ గతేడాది కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, అప్పటి కమిషనర్ చినవీరభద్రుడు, అనంతపురం డీఈవో శామ్యూల్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల మేరకు వారంతా సోమవారం కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల అమలులో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, చినవీరభద్రుడు కారణం కాదని న్యాయమూర్తి తేల్చారు. డీఈవో శామ్యూల్ వల్లే కోర్టు ఆదేశాల అమలులో జాప్యం జరిగిందన్నారు. ఇందుకు ఆయనను బాధ్యుడిని చేస్తూ సామాజిక సేవను శిక్షగా విధించారు. -
అందీ అందకుండా... అమ్మా నాన్నా పిలుపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అమ్మా..నాన్నా.. అనేది ఓ మధురమైన పిలుపు. అలా పిలిపించుకునేందుకు ప్రతిఒక్కరూ ఉవ్విళ్లూరుతుంటారు. కానీ కొందరికి ఆ ఆశ నెరవేరడం లేదు. ఆధునిక జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా అనేక జంటలు ఆ పిలుపునకు దూరం అవుతున్నాయి. పిల్లల కోసం తాపత్రయ పడుతూ ఆధునిక వైద్య విధానాలను అనుసరిస్తూ ప్రయత్నిస్తున్నా, కొందరికి ఫలితం దక్కడం లేదు. ఈ క్రమంలోనే అమ్మా, నాన్నలుగా అయ్యేందుకు, వృద్ధాప్యంలో అవసరమైన ఆసరా కోసం.. కొంద రు దత్తత బాట పడుతున్నారు. అయితే శిశు గృహ కేంద్రాల్లో పిల్లలు తక్కువగా ఉండటం, దత్తత ప్రక్రియ సుదీర్ఘంగా ఉండటంతో పిల్లల కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. అమ్మా, నాన్నా అని పిలిపించుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్న వారికి ఈ పరిస్థితి ఆవేదనకు గురిచేస్తోంది. గతంలో సులువుగా దత్తత దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులకు పిల్లలను అప్పగించేందుకు గతంలో తక్కువ సమయం పట్టేదని అధికారులు చెబుతున్నారు. ఇపుడు ఏడాది నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతు న్న సందర్భాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. గతంలో జిల్లా స్థాయిలో వచ్చిన దరఖాస్తులను బట్టి జిల్లాల్లోని శిశు గృహ కేంద్రాల్లో ఉన్న పిల్లలను దత్తతకు ఇచ్చేవారు. అయితే 2015లో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. రాష్ట్రం యూనిట్‌గా దత్తత ప్రక్రియను ఆన్లైన్ చేసింది. ఇందుకోసం సెంట్రల్ అడాప్షన్ రిసోర్సు అథారిటీ (కారా), స్టేట్ అడాప్షన్ రిసోర్సు అథారిటీలను (సారా) ఏర్పాటు చేసింది. దత్తత తీసుకోవాలనుకునేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సీరియల్ నంబర్ ప్రకారం, అందుబాటులో ఉన్న పిల్లల సంఖ్యను బట్టి అవకాశం ఇస్తారు. ఆరో గ్యవంతమైన పిల్లలను మాత్రమే దత్తతకు ఇస్తారు. అయితే ఈ ప్రక్రియకు ఎక్కువ సమ యం పడుతోంది. ఈలోగా పిల్లలు పెద్ద వారు అవుతుండటంతో దత్తత తీసుకునేందుకు కొంతమంది నిరాకరిస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి. అబ్బాయే కావాలి.. దత్తత కోసం వచ్చే దరఖాస్తుల్లో అబ్బాయిలు కావాలనేవే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లోని శిశు గృహ కేంద్రాల్లో 122 మంది పిల్లలు ఉంటే.. 683 మంది జంటలు తమకు పిల్లలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. అందులో అబ్బాయి కావాలని దరఖాస్తు చేసుకున్నవారు 372 మంది కాగా.. అమ్మాయిలు కావాలని దరఖాస్తు చేసుకున్నవారు 288 మంది ఉన్నారు. ఎవరైనా పర్వాలేదని అన్నవారు కేవలం 30 మంది మాత్రమే ఉన్నారు. తగ్గిపోతున్న పిల్లల సంఖ్య ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, ప్రజల్లో వచ్చిన చైతన్యం, ప్రభుత్వ నిబంధనల కారణంగా శిశు గృహ కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. గతంలో అప్పుడే పుట్టిన బిడ్డను కూడా తీసుకునేవారు. వారికి డబ్బా పాలు తాగించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండడం లేదు. కొందరు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో నిబంధనల్లో మార్పులు చేశారు. పుట్టిన బిడ్డను పోషించలేని పరిస్థితుల్లో దత్తత ఇద్దామనుకున్నప్పుడు, తల్లి బిడ్డకు మూడు నెలలపాటు పాలు ఇవ్వాలని, అప్పుడే బిడ్డను తీసుకుంటామనే నిబంధన విధించారు. దీంతో మూడు నెలలు పాలు ఇవ్వడం వల్ల బిడ్డపై ప్రేమ పెరిగిన కొందరు మనసు మార్చుకుంటున్నారు. వారిని శిశు గృహ కేంద్రాలకు ఇవ్వడం లేదు. ఇక మారుమూల అటవీ ప్రాంతాల్లో అనాగరికత కారణంగా పిల్లలను కన్నా.. సాకలేక, పోషించలేక వదిలేసే ఘటనలు గతంలో ఎక్కువగా ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో వారిలో పెరిగిన అవగాహన, ప్రభుత్వాలు తీసుకువచ్చిన చైతన్యం కారణంగా శిశు గృహాలకు ఇచ్చే పిల్లల సంఖ్య తగ్గిపోయింది. 25 మందిని అనాథలుగా చేసిన కరోనా.. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో 25 మంది పిల్లలు కరోనా కారణంగా అనాథలుగా మారా రు. కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయినవారు కొందరైతే, గతంలో వేరే కారణాలతో తల్లి లేదా తండ్రి చనిపోయి.. కరోనా సమయంలో మిగిలినవారు చనిపోవడంతో మరికొందరు అనాథలుగా మారారు. ఇలాంటి పిల్లలు నల్లగొండలో ఆరుగురు, నిజామాబాద్‌లో 9 మంది, ఖమ్మంలో 10 మంది, మెదక్ జిల్లాలో నలుగురు ఉన్నారు. అయితే వీరెవరూ శిశు గృహ కేంద్రాల్లో లేరు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహకారంతో వారి బంధువుల ఇళ్లల్లోనే పెరుగుతున్నారు. వారి నిర్వహణ కోసం ఒక్కో శిశువుకు నెలకు రూ.2 వేల చొప్పున శిశు సంక్షేమ శాఖ ఆర్థిక సహకారం అందిస్తోంది. పిల్లలు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ ఉన్న పిల్లల సంఖ్య కంటే వారికోసం వచ్చే దరఖాస్తుదారుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో దత్తతిచ్చేందుకు ఏడాదిన్నర సమయం పడుతోంది. గతంలో జిల్లా స్థాయిలోనే ఉండటం వల్ల త్వరగా ముగిసేది. ఇప్పుడు రాష్ట్రం యూనిట్‌గా ఆన్లైన్ కావడంతో ఆలస్యం అవుతోంది. – గణేశ్, బాలల పరిరక్షణ జిల్లా అధికారి, నల్లగొండ 18 నెలలు పట్టింది పాపను దత్తత తీసుకోవాలనుకుని ఆన్లైన్లో రిజిస్టర్ చేశాం. తర్వాత ప్రక్రియ అంతా ముగిసి పాపను తీసుకోవడానికి 18 నెలల సమయం పట్టింది. రెండేళ్ల లోపు పాప కావాలని అడిగాం. 5 నెలల శిశువును ఇచ్చారు. ఐదేళ్లు గడిచాయి. ప్రస్తుతం యూకేజీ చదువుతోంది. – ఖమ్మం నగరానికి చెందిన ఓ జంట 15 ఏళ్లయినా పిల్లలు లేకపోవడంతో మాకు వివాహమై 15 ఏళ్లు గడిచింది. అయినా పిల్లలు కాలేదు. దీంతో దత్తత తీసుకునేందుకు ‘కారా’లో దరఖాస్తు చేసుకున్నా. అదృçష్టంకొద్దీ అమ్మాయి లభించింది. పిల్లలు లేరనే బాధ తప్పింది. – శ్రీనివాస్, వరంగల్ మాకు ఏడాదిలో పాప లభించింది సంతానం లేకపోవడంతో 2015లో రెండేళ్ల లోపు పాప కావాలని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాం. ఏడాది సమయం తర్వాత ఐదు నెలల పాప లభించింది. – శ్రీనివాస్, సరస్వతి, నిజామాబాద్ -
బాలల కోసం బహువిధ రక్షణ
సాక్షి, అమరావతి: వీధి బాలల రక్షణ, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఇందుకోసం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ పథకం (ఐసీపీఎస్)కింద వివిధ రూపాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందుకోసం గ్రామ, మండల, పట్టణ, రైల్వే స్టేషన్ స్థాయిల్లో 10,541 రక్షణ కమిటీలను నియమించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 7,201 బాల్య వివాహాలను నివారించింది. పోక్సో చట్టం కింద నమోదైన 6,038 లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు రక్షణ కల్పించింది. 13,703 మంది బాల కార్మికులకు పని నుంచి విముక్తి కల్పించింది. తల్లిదండ్రులు, సంరక్షకులు లేని బాలలను హోమ్స్‌కు తరలించి వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వమే చేపట్టింది. 3,793 మంది యాచించే పిల్లలను గుర్తించి వారి రక్షణ కోసం చర్యలు చేపట్టింది. హెచ్ఐవీ, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలున్న 843 మంది పిల్లల్ని గుర్తించి సహకారం అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. రాష్ట్రంలో 14 శిశు గృహ కేంద్రాలు ఉండగా.. వాటిలో 127 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ప్రభుత్వ సంరక్షణలో ఉన్న అనాథ పిల్లల్లో 675 మంది పిల్లలను వారి సంరక్షణ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకొచ్చే కుటుంబాలకు దత్తత ఇవ్వబోతోంది. పిల్లల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు చదువు అనేది పిల్లల ప్రాథమిక హక్కు. ఆ హక్కుకు భంగం కలిగించేందుకు ఎవరు ప్రయత్నించినా శిక్షార్హులవుతారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నాం. అనాథ పిల్లలు ఎక్కడ దొరికినా శిశు గృహ కేంద్రాలకు తరలించి ప్రభుత్వమే వారి ఆలనా, పాలనా చూస్తోంది. – కృతికా శుక్లా, డైరెక్టర్, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ -
అనాథలకో అమ్మానాన్న
సమాజంలో సాయం కోసం ఎదురుచూసే అభాగ్యులెందరో. వీరికి చెయ్యందించేవారు మాత్రం అరుదుగా కనిపిస్తారు. కానీ పిసరంత సాయం దొరికితే చాలు అభాగ్యుల జీవితాలు కొంతైనా మెరుగుపడతాయని, చెప్పడమేగాక చేసి చూపుతున్నారు‘పొపాట్రో పుండే దంపతులు’. మనస్సుంటే మార్గం ఉంటుంది అనే మాటకు ఈ దంపతులు సాక్ష్యంగా నిలుస్తున్నారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా పత్రాది ప్రాంతంలో నివసించే పొపాట్రో ఫుండె, అనురాధ దంపతులు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడమేగాక.. గత ఆరేళ్లుగా వీరు తమ జీతాల్లోనుంచి 10 శాతం మొత్తాన్ని ఒంటరి నిరాశ్రయులైన మహిళలు, వితంతువులు, అనాథలు, బాధిత రైతులు, అవసరంలో ఉన్న స్కూలు పిల్లలకు ఖర్చుచేస్తున్నారు. ఇప్పటిదాకా దాదాపు 1200 మందికి సాయమందించారు. ఇంతకీ వీరికి ఈ ఆలోచన ఎందుకొచ్చిందంటే... అది 2014 జూన్ నెల.. ఓ రోజు స్కూల్లో ఉండగా అకస్మాత్తుగా పొపాట్రో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో తోటి ఉద్యోగులు హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పొపాట్రోని పరీక్షించిన డాక్టర్ లో బి.పితో అలా స్పృహæతప్పి పడిపోయారని చెప్పారు. సకాలంలో డాక్టర్ వైద్యం అందించడంతో తనకు ఏ ప్రమాదం జరగలేదని గ్రహించిన పొపాట్రో... తనకు సాయం అందినట్లుగానే అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తే బావుంటుందన్న ఆలోచన తట్టింది. అనుకున్న వెంటనే సాయం చేయడం ప్రారంభించారు. ప్రొపాట్రో దంపతులు ఇద్దరూ ప్రతి ఆదివారం దగ్గరల్లోని గ్రామాల్లో పర్యటించి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం అందిస్తారు. ఇందులో భాగంగా వారు కుట్టుమిషన్, బట్టలు, బుక్స్, బర్త్‌డే గిఫ్ట్స్, వ్యవసాయం చేసుకునే రైతులకు మేకలు, అనాథలకు మౌలిక సదుపాయాల కల్పన వంటివి చేస్తుంటారు. కొంతమందికి వంట చేసుకోవడానికి గ్యాస్ స్టవ్, మరికొందరికి ఆసుపత్రి బిల్లులు కట్టడం, గృహిణులకు వెట్ గ్రైండర్లు వంటివి ఇచ్చి ఆదుకుంటున్నారు. ప్రొపాట్రో తన పదేళ్ల సర్వీసులో ఎక్కువగా రిమోట్ ఏరియాల్లో పనిచేయడంతో .. అక్కడ ఉన్న పరిస్థితులను నిశితంగా గమనించారు. దీంతో గ్రామాల్లో ఉన్న స్కూళ్లను మెరుగు పరిచేందుకు వారి స్నేహితులను, బంధువులు, సామాజిక కార్యకర్తలను సంప్రదించి ఇక్కడి పరిస్థితులు వివరించి వారు చేయగలిగిన సాయంతోపాటు వీరు కొంత ఖర్చుపెట్టి ..స్కూళ్లలో రెండు గదులను ఏర్పాటు చేయడం, కంప్యూటర్లు, ఈ–లెర్నింగ్స్ కిట్స్, లౌడ్‌స్పీకర్స్, బల్లలు, వాటర్ ఫ్యూరిఫయర్స్, టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించారు. అంతేగాక స్కూలు మానేసిన పిల్లలను మళ్లీ బడికి తీసుకు రావడం, వారు చదువుకోవడానికి అవసరమైన వాటిని కొనిస్తూ్త వారిని ప్రోత్సహించడం వీరి పనులు. గ్రామాల్లోని మహిళలకు స్వయం సహాయక సంఘాల గురించి అవగాహన కల్పించడం, పొదుపుతో కుటుంబాన్ని సక్రమంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్పి వారిని సైతం సరైన మార్గంలో నడిపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. -
రిజిస్ట్రేషన్ లేని వృద్ధాశ్రమాలా?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల నిర్వహణ అధ్వానంగా ఉందని, అధికారుల పర్యవేక్షణ లేదని, ఏడాదిలో రెండుసార్లు తనిఖీ చేయాలన్న చట్ట నిబంధనల్ని అమలు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో రిజిస్టర్ చేసినవి 89 ఉంటే రిజిస్టర్ చేయనివి 41 ఉన్నాయని తెలుసుకున్న ధర్మాసనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. రిజిస్టర్ కూడా చేసుకోని వృద్ధాశ్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని, తనిఖీలు చేయాల్సిన అధికారులు తమ విధులను సరిగ్గా నిర్వహించకపోవడంపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నదీ కూడా వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వృద్ధాశ్రమాల్లో వసతులు లేవని, అక్కడి పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని న్యాయ సేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి రాసిన లేఖను హైకోర్టు ప్రజా హిత వ్యాజ్యంగా పరిగణించింది. ఈ పిల్‌ను బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహా న్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టుకు సహాయకారిగా (అమికస్ క్యూరీ) నియమితులైన న్యాయవాది వసుధా నాగరాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి తయారు చేసిన నివేదికను ధర్మాసనానికి అందజేశారు. జంటనగరాల్లో 41 వృద్ధాశ్రమాలు కనీసం రిజిస్టర్ చేయకుండా నిర్వహిస్తున్నారని, పలు ఆశ్రమాల్లో కనీస వసతులు లేవని నివేదికలో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ కల్పించుకుని, లాక్డౌన్ కారణంగా అన్ని ఆశ్రమాలను అధికారులు తనిఖీలు చేయలేకపోయారని, కొన్ని చోట్ల వసతులు సాధారణంగా ఉన్నాయని తెలిపారు. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామన్నారు. 41 ఆశ్రమాలకు నోటీసులు ఇచ్చామని, 15 రోజుల్లోగా రిజిస్టర్ చేసుకోకపోతే వృద్ధాశ్రమాల్ని రద్దు చేస్తామని చెప్పామన్నారు. వాదనల అనంతరం జూలై 14 నాటికి ప్రభుత్వ నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. -
అనాథల కోసం నిత్యం పిడికెడు బియ్యం సేకరణ
సాక్షి, చేవెళ్ల: అనాథ పిల్లలకు అన్నం పెట్టి కడుపు నింపాలనే గొప్ప ఆశయంతో ఆ విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిత్యం అందరూ పిడికెడు బియ్యం తీసుకొచ్చి జమ చేశారు. పదిరోజుల్లో 500 కిలోలు జమ కావడంతో అనాథ ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు. వివరాలు.. మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోని ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనతో అనాథ పిల్లలకు తమవంతు సహకారం అందించాలని ఆలోచించారు. ఎవరూ లేని చిన్నారులకు అన్నం పెట్టి కడుపు నింపాలని భావించారు. అందుకోసం బియ్యం సేకరణకు శ్రీకారం చుట్టారు. పది రోజులపాటు ఒక్కో విద్యార్థి పిడికెడు చొప్పున బియ్యాన్ని తీసుకొచ్చి జమచేశారు. గురువారానికి 500 కేజీల బియ్యం కావడంతో వాటిని అనాథ ఆశ్రమాలు నడుపుతున్న నాలుగు సంస్థలకు అందజేశారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. -
మాకు మీరు మీకు మేము
మన పక్కనే ఉన్న మనిషిని మనకు దగ్గరగా ఉంచలేకపోతోందని టెక్నాలజీని నిందిస్తూ ఉంటాం. ఓ వీడియో కాల్ ఎక్కడో విదేశాల్లో ఉన్న మనవాళ్లను దగ్గర చేసినప్పుడు కూడా సంబరపడిపోతాం తప్ప, దాని వెనక ఉన్నదీ టెక్నాలజీనే అని గుర్తు చేసుకోం! మనం ఎంత నిందించినా,మనకు ఎంత గుర్తుకు రాకపోయినా..టెక్నాలజీ అనేది పాత అనుబంధాలను,కొత్త బంధాలనూ కలుపుతూనే ఉంటుంది. అలా వృద్ధాశ్రమాలను, అనాథాశ్రమాలను కలుపుతున్న ఓ కొత్త టెక్–బంధం ఢిల్లీలోని వయోవృద్ధుల జీవితాలలోవసంతాలను చిగురింపజేస్తోంది. పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత... తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కారణంగా ఎవరు ఏ దేశంలో స్థిరపడతారో ఊహించలేం. దేశాల ఎల్లలు దాటిన పిల్లలతో పాటు పెట్టేబేడా సర్దుకుని వెళ్లడానికి పెద్దవాళ్లు ఇష్టపడకపోవచ్చు. అలాంటి వాళ్ల కోసం వెలుస్తున్న సౌకర్యవంతమైన వృద్ధాశ్రమాల సంఖ్య కూడా ఏడాదికేడాదీ పెరుగుతూనే ఉంది. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న పిల్లలు, అమ్మానాన్నలకు ఏ లోటూ రాకుండా డబ్బు పంపిస్తుంటారు. ఇక్కడ వీళ్లకూ వృద్ధాశ్రమాల్లో విశాలమైన, అధునాతన సౌకర్యాలున్న గదులుంటున్నాయి. గోడలకు మంచి పెయింటింగ్‌లు కూడా ఉంటున్నాయి. కానీ ఆ గోడలతో బంధాలు బలపరచుకోలేక సతమతమవుతోంది వార్ధక్యం. ఓల్డేజ్ హోమ్‌లో భార్యాభర్త ఇద్దరూ ఉన్నంత కాలం వాళ్లు కొంతలో కొంత హాయిగానే గడుపుతున్నారు. కానీ ఈ ఇద్దరిలో ఒకరే మిగిలిన క్షణం నుంచి మొదలవుతుంది ఒంటరితనం అనే ప్రత్యక్ష నరకం. ఆ నరకాన్ని భరించలేని ఓ పెద్ద ప్రాణం భార్య పోయిన కొన్నాళ్లకే లోకాన్ని వదిలేసింది. ఆ విషాదం నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే.. ‘మైత్రీయాప్’. ఈ యాప్‌ను రూపొందించినది అనన్య. ఆ వృద్ధ దంపతుల మనుమరాలు. ‘‘బాల్యానికి– వార్ధక్యానికి మధ్య వెలిసిన మెత్రీబంధమే ఈ మైత్రీయాప్’’ అంటున్నారు అనన్య. ఈ యాప్ ద్వారా... ఓల్డేజ్ హోమ్‌లలో నివసిస్తున్న వృద్ధులకు, అదే నగరంలో అనాథాశ్రమంలో పెరుగుతున్న పిల్లలకు మధ్య ఓ బంధం ఏర్పడుతోంది. పెద్దలకు ఒంటరితనాన్ని, పిల్లలకు ఏకాకితనాన్ని పోగొట్టేందుకు మైత్రీ యాప్‌ను సృష్టించడంలో అనన్యకు ఆమె స్నేహితులు కూడా సహకరించారు. ఐదుగురు అమ్మాయిలు న్యూఢిల్లీలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థినులు అనన్య గ్రోవర్, అనుష్క శర్మ, అరీఫా, వంశిక యాదవ్, వసుధా సుధీందర్... ఈ ఐదుగురమ్మాయిల కృషి ఫలితంగా మైత్రీ యాప్ అనే ఈ కమ్యూనికేషన్ చానెల్ ఆవిర్భవించింది. వీరి లక్ష్యం... ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లు జీవిస్తున్న అనేక మంది మధ్య బంధాలను కలపడం. ఒకరితో ఒకరిని అనుసంధానం చేసి అనుబంధాల వింజామరలను వీచడం. అనన్య బృందం స్వయంగా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కలిపి మొత్తం 140 హోమ్స్‌ను సందర్శించింది. ఈ ఏడాది మార్చిలో మొదలైన వీరి ప్రయత్నం జూన్ చివరికి ఫలించింది. ఈ యువ టెక్ ప్రెన్యూర్స్‌లు మైత్రి యాప్‌ను జూలైలో అధికారికంగా లాంచ్ చేశారు. ఇప్పుడిది దేశంలో స్థిరంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వెయ్యి మందికి పైగా ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇలా న్యూఢిల్లీలోని ఓల్డేజ్ హోమ్‌లో ఉంటున్న పెద్దవాళ్లు... పదిహేను అనాథాశ్రమాలతో అనుసంధానం అయ్యారు. పెద్దవాళ్లకు మిగిలిన చిన్న కోరిక మా నానమ్మ, తాతయ్యలతో నాకు మంచి అనుబంధం ఉండేది. వాళ్ల నుంచి అంతులేని ప్రేమను అందుకున్నాను. ఒకటి కాదు, రెండు కాదు... ఎన్నెన్నో జ్ఞాపకాలు. చదువులు, ఉద్యోగాలతో ఒక్కొక్కరు ఒక్కో చోట ఉండేవాళ్లం. సెలవుల్లో అందరం కలిసేవాళ్లం. ఇలా ఉండగా క్యాన్సర్ వ్యాధి మా నానమ్మను తీసుకెళ్లి పోయింది. ఆమె పోయిన ఏడాదిలోపే తాతయ్య కూడా వెళ్లి పోయారు. ఆయనకు ఎటువంటి అనారోగ్యమూ లేదు. కేవలం నానమ్మ పోయిన తర్వాత ఆ ఒంటరితనాన్ని భరించలేక జీవితాన్ని చాలించారు. పెద్దవాళ్లకు ఆ వయసులో ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం. మా తాతయ్యలాగ ఎందరో ఉన్నారు. మా టీమ్ ఓల్డేజ్ హోమ్‌లకు వెళ్లినప్పుడు.. అక్కడ ఉండే వృద్ధులు చాలా మంది మమ్మల్ని తమ మనుమరాళ్లలా అభిమానించారు. ‘మీకు వీలయినప్పుడు మళ్లీ మళ్లీ వచ్చి కనిపిస్తూ ఉండండి తల్లీ. మా మనుమరాళ్లను చూసుకున్నట్లే సంతోషంగా ఉంది’ అనేవాళ్లు. మా మైత్రి యాప్ ఆ వృద్ధుల చిన్న కోరికను తీర్చగలుగుతుంది. ఈ యాప్ ద్వారా మేము అనాథాశ్రమాల్లో పెరుగుతున్న పిల్లలకు గ్రాండ్ పేరెంట్స్‌ని ఇవ్వగలిగాం. తాతయ్యకు ఎదురైన చేదు అనుభవం నుంచి... నేను ఎంతోమంది పెద్దవాళ్లకు ఒక ఆలంబనను అందివ్వగలిగాను.– అనన్య గ్రోవర్, టెక్‌ప్రెన్యూర్ అవ్వాతాత దొరికారు మైత్రి యాప్ ద్వారా అనాథాశ్రమాల్లో పెరుగుతున్న పిల్లలకు అవ్వాతాతలు దొరికినట్లయింది. ఈ యాప్ ద్వారా అనుసంధానమైన ఓల్డేజ్ హోమ్ నిర్వహకులు, అనాథాశ్రమ నిర్వహకులు.. వృద్ధులను – చిన్నారులను కలవడానికి వీలుగా గెట్ టు గెదర్లు ఏర్పాటు చేస్తారు. ఇలా ఓల్డేజ్‌హోమ్‌లో వృద్ధులను కలిసిన తర్వాత స్కూలుకెళ్లిన పిల్లలు ‘నిన్న మా నానమ్మ, తాతయ్యల ఇంటికి వెళ్లాం. వచ్చే ఆదివారం కూడా వెళ్తాం’ అని స్నేహితులతో సంతోషంగా చెప్పుకుంటున్నారు. ఇక పెద్దవాళ్ల విషయానికి వస్తే... వాళ్ల మనుమలు మనుమరాళ్లు దూరంగా ఉండి ఏ ఏడాదికో ఒకసారి కనిపిస్తుంటారు. ఏడాదంతా తమ మనుమల కోసం మనుమరాళ్ల కోసం ఎదురు చూస్తూ, తీరా సెలవులప్పుడు వాళ్లు రాలేకపోతే, రాలేదని నిరాశ చెందడం కంటే... ప్రతి వారాంతం తమను వెతుక్కుంటూ వచ్చే అనాథ పిల్లల చేత ‘అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య’ అని పిలిపించుకోవడంతో సంతోషాన్ని పొందుతున్నారు. తమకు ఎవరూ లేరనుకునే నిరాశలో ఉన్న చిన్నారి పిల్లలకు తమకోసం ఎదురు చూసే అవ్వా, తాతలున్నారంటే చెప్పలేని సంతోషం కలుగుతోంది. అనన్య చేసిన ఈ ప్రయోగం.. ప్రేమను పంచడానికి పేగుబంధం అక్కరలేదని చెబుతోంది. – మంజీర -
హోమ్లీ హోమ్
నలభై ఏళ్లుగా అనాథ బాలలు, వృద్ధులు, వికలాంగులకు ఆశ్రయం ఇస్తున్న డాక్టర్ గీత దంపతులు.. ఇప్పుడు మరొక హోమ్లీ హోమ్‌తో ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు. ఓ పదమూడేళ్ల అమ్మాయి. తమ ఊరికి వచ్చిన డాక్టర్ల బృందాన్ని ఆశ్చర్యంగా చూసింది. ఆ మెడికల్ టీమ్ ఆ ఊరి వాడల్లో పర్యటిస్తోంది. ఒక్కొక్కరు వచ్చి తమ అనారోగ్యం గురించి చెబుతున్నారు. డాక్టర్లు మందులు ఇచ్చి ఎలా వాడాలో చెబుతున్నారు. అప్పుడే టీనేజ్లోకొచ్చిన ఆ అమ్మాయికి ఆ సన్నివేశం అద్భుతంగా అనిపిస్తోంది. మెడికల్ టీమ్ పని పూర్తి చేసుకుని తిరిగి పట్నం పోవడానికి సిద్ధమైంది. వాళ్ల వెంటే వెళ్తున్న అమ్మాయికి ఓ గుడిసెలో నుంచి మూలుగు వినిపించింది. లోపలికి వెళ్లి చూస్తే మంచం మీద ముడుచుకుని పడుకుని ఉన్న ఒక అమ్మాయి కనిపించింది. ‘‘డాక్టర్లొచ్చారు చూపించుకుందువు గాని రా’’ అని ఆ అమ్మాయిని లేపింది. లేచే పరిస్థితిలో లేదా అమ్మాయి. ఆమెను లేపి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు. గుడిసె బయటకు వచ్చి చూస్తే మెడికల్ టీమ్ ముందుకు వెళ్లిపోయింది. పరుగెత్తుకుంటూ వెళ్లి ‘‘ఓ అమ్మాయి మంచం మీద నుంచి లేవలేకపోతోంది. వైద్యం చేద్దురు రండి’’ అని చెప్పి, మెడికల్ టీమ్‌ను వెనక్కు తీసుకు వచ్చి, జ్వరంతో బాధపడుతున్న అమ్మాయికి వైద్యం చేయించింది. ఇది జరిగి యాభై ఏళ్లవుతోంది. ఆ రోజే నిర్ణయించుకుంది ఆ అమ్మాయి తాను డాక్టర్ని కావాలని, వైద్యం అందని వాళ్లకు వైద్యం చేయాలని. అనుకున్నట్లే డాక్టర్ అయ్యి, దేశం నలుమూలలా పర్యటిస్తూ ప్రభుత్వ వైద్యం అందని, ప్రైవేట్ వైద్యం చేయించుకోలేని పేదలకు వైద్యం చేస్తోంది. ఆమే.. డాక్టర్ గీతా ఏరువ. గీత.. ఆధ్యాత్మిక సేవామార్గం పట్టడానికి ప్రేరేపించిన సందర్భం అది. ఏదీ వృథా కాకూడదు డాక్టర్ గీత సొంతూరు కర్నూలు జిల్లా కౌలూరు. ఆమె పెరిగింది అనంతపురం జిల్లా తాడిపత్రిలో. తండ్రి బాలిరెడ్డి మిలటరీ ఆఫీసర్. ఆయన పెంపకం తనకు ‘ఇవ్వడాన్ని’ నేర్పిందని అంటారు గీత. ‘‘నేనీ గౌను వేసుకోను అంటే మా నాన్న వెంటనే ‘మరి దీనిని ఏం చేద్దాం’ అని అడిగేవారు. ఈ గౌనులో పత్తి పండించిన రైతు శ్రమ ఉంది, రంగులద్దిన కార్మికుని శ్రమ ఉంది. కుట్టిన టైలర్ పని ఉంది. ఇంతమంది పని ఉంది ఈ గౌను వెనుక. అలాగే నేను పడిన శ్రమతో సంపాదించిన డబ్బుతో కొన్నాను. అంతకంటే ఎక్కువగా... ప్రకృతి నుంచి మనం తీసుకున్న వనరు. దీనిని ఉపయోగించకపోవడం తప్పు. నువ్వు వేసుకోకపోతే మరొకరికి ఇవ్వు. వనరులను వృథా చేయకూడదు’ అని చెప్పారు. మిలటరీలో పనిచేయడం వల్ల ఆయనలో వెల్లివిరిసిన సేవాభావం అది. మాకూ అవే నేర్పించారు. ఇప్పటికీ మాకెంతవరకు అవసరమో అంతవరకు ఉంచుకుని మిగిలినది లేని వాళ్లకు ఇవ్వడం అలవాటైంది. టామ్ (భర్త థామస్ రెడ్డి) క్రైస్తవ మిషనరీ నేర్పించిన కరుణ, సేవా ప్రభావంతో పెరిగిన వారు కావడంతో మా ఇద్దరికీ సేవ చేయడమే జీవితం అయింది’’ అన్నారు డాక్టర్ గీత. మా తర్వాత కూడా పిల్లల్లేని దంపతులు తమకు పిల్లల్లేని కారణంగా అనాథాశ్రమాలకు వెళ్లి ఒక బిడ్డను దత్తత తీసుకుని పెంచుకుంటారు. టామ్– గీత దంపతులు ఏకంగా అనాథాశ్రమాలనే దత్తత తీసుకున్నారు. స్వయంగా ‘ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ (ఎఫ్సీఎన్)’ను స్థాపించి అనాథ, పేద పిల్లల కోసం స్కూళ్లు, కాలేజీలు పెట్టారు. తల్లిదండ్రులు ఉండి పై చదువులకు ఫీజు కట్టుకోలేని పిల్లలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండువేల ఐదు వందల మంది విద్యార్థులు వీళ్ల సంస్థల ద్వారా జీవితాలను నిలబెట్టుకున్నారు. ఇంత విస్తృతమైన సర్వీస్ చేయాలంటే డబ్బవసరం పెద్ద మొత్తంలోనే ఉంటుంది. అందుకు ఈ దంపతులు ఇక్కడి పిల్లలను అమెరికా నుంచి దాతలతో అనుసంధానం చేశారు. ‘‘మాకు విరాళాలిస్తున్న వాళ్లలో ఎక్కువ మంది మేము అమెరికాలో ఉద్యోగం చేసినప్పటి మా ఫ్రెండ్సే. ఫండ్ రైజింగ్ కోసం ఏటా ఆరు నెలలు అమెరికాలో ఉంటున్నాం. మాకు వయసై పోయిన తర్వాత ఈ సర్వీస్ ఆగిపోకుండా కొనసాగేటట్లు సిస్టమ్‌ను డెవలప్ చేయడమే ఇప్పుడు మా ముందున్న ఆలోచన. అందుకే అవకతవకలకు అవకాశం లేని విధంగా ఒక సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం’’ అన్నారు డాక్టర్ గీత. – వాకా మంజులారెడ్డి రెండు వందల మందికి మా అమ్మానాన్నలు ఆంతోనమ్మ, శౌరిరెడ్డిల జ్ఞాపకార్థం పోరుమామిళ్ల, ధర్మవరం, గుంటూరు, జడ్చర్ల, నంద్యాల, మైదుకూరు, స్టేషన్‌ఘన్‌పూర్, కడప, హైదరాబాద్‌లలో విద్యాసంస్థలు, హోమ్‌లను స్థాపించాం. ఇప్పుడు షాద్ నగర్లో నిర్మించిన హోమ్‌లో ఒక్కో గదికి ఒక్కో దాత పేరు ఉంటుంది. ఇందులో ఆశ్రయం పొందుతున్న వాళ్లు తాము ఉంటున్న గదికి ఆర్థిక సహాయం చేసిన వాళ్ల పేరును రోజూ గుర్తు చేసుకుంటారు. అలా పెరిగిన పిల్లలు పెద్దయిన తర్వాత ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారని మా విశ్వాసం. సేవాశ్రమంలో రెండు వందల మందికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. ఆశ్రయం అవసరమైన వాళ్లకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. – థామస్‌రెడ్డి, ఎఫ్సీఎన్ నిర్వాహకులు పిల్లలకు అందరూ ఉండాలి హైదరాబాద్‌కు సమీపంలోని షాద్‌నగర్‌లో స్థాపించిన మా ‘సేవాశ్రమం’ జనవరి 23న ప్రారంభం అవుతోంది. మా ముఖ్య ఉద్దేశం ఉమ్మడి కుటుంబంలో ఉండే బంధాలను పిల్లలకు అనుభవంలోకి తేవడమే. పిల్లలు తమకు ఎవరూ లేరనే నిస్పృహలో పెరగకూడదు. వృద్ధులు కూడా మరణం కోసం ఎదురు చూస్తూ రోజులు గడపకూడదు. జీవించి ఉన్నన్ని రోజులూ సంతోషంగా గడపాలి. అలాగే దివ్యాంగులు కూడా ఏదో బతుకీడుస్తున్నాం అనే నిర్వేదంలో మునిగిపోకుండా తాము చేయగలిగిన సర్వీస్ ఇతరులకు చేయగలుగుతున్నామనే మానసికానందంతో జీవించాలి. అందుకోసం పిల్లలకు, వృద్ధులకు, దివ్యాంగులకు హోమ్‌లను ఒకే ప్రాంగణంలో నిర్మించాం. – డాక్టర్ గీత, ఎఫ్సీఎన్ నిర్వాహకురాలు -
అక్రమాల బాలసదన్..!
మంకమ్మతోట(కరీంనగర్): అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని.. విద్యాబుద్దులు చెప్పించి వారి జీవితాల్లో వెలుగు నింపాల్సిన బాలసదన్ అక్రమాల పుట్టగా మారింది. జిల్లాకేంద్రంలోని క్రిస్టియన్ కాలనీలో ఐసీడీఎస్ పరిధిలో నడుస్తున్న బాలసదన్ అధికారులు పిల్లల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా ఏటా బాలల వారోత్సవాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. అనాథ బాలలు ఉంటున్న బాలసదన్లు, ఆ శాఖ అధికారుల పనితీరుపై మాత్రం దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం బాలసదన్‌లో ఉంటున్న బాలల పట్ల సంరక్షణ కరువై రోగాలపాలవుతున్నారు. ప్రభుత్వం ఏటా బాలసదన్ నిర్వహణకు కాస్మోటిక్ చార్జీల పేరుతో రూ.కోట్లు కేటాయిస్తున్నా.. పిల్లలకు చేరడం లేదు. వారి పరిశభ్రత పట్ల అధికారులు శ్రద్ధ తీసుకోకపోవడంతో చర్మవ్యాధులు, ఇతర రోగాలతో సతమతమవుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. జిల్లాకేంద్రంలోని బాలసదన్‌లో 30మంది అనాథ పిల్లలు ఆశ్రయం ఉంటున్నారు. వీరికి ఆశ్రయం కల్పించడంతోపాటు విద్యాబుద్దులు నేర్పించి మంచి పౌరులుగా తీర్చి దిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడ పనిచేస్తున్న అధికారి బాలల సంరక్షణ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆ శాఖ సిబ్బంది బాహాటంగా ఆరోపిస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఆవిర్భావ దినోత్సవాలతోపాటు నాయకులు, సినీ నటుల ఫ్యాన్స్ వేడుకలను బాలసదన్‌లో జరుపుకునేందుకు వస్తుంటారు. వీరంతా పిల్లల మధ్య వేడుకలు జరుపుకొని స్వీట్లు, పండ్లు, ఆట వస్తువులు, దుస్తులు, దుప్పట్లు, బియ్యం, పప్పులు వంటివి పంపిణీ చేయడంతోపాటు వారందరికి ఉపయోగపడే వస్తువులు ఫ్యాన్లు, కూలర్లు, గీజర్లు, వాషింగ్ మిషన్లు వంటివి కానుకలుగా ఇస్తుంటారు. మరికొంత మంది అవసరమైన వాటిని కొనుక్కోవాలని విరాళాలు అందిస్తుంటారు. ఇలా దాతలు ఇచ్చిన నగదుకు లెక్కలు ఉండకపోగా.. వస్తువులు మాయం అవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దాతలు ఇచ్చిన వాటిలో చాలావరకు కనిపించకపోగా.. మరికొన్ని కొత్తవాటిస్థానంలో పాతవి దర్శనం ఇస్తున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. చెడిపోయిందని మూలనపెట్టి కొద్ది రోజుల తర్వాత వీటిని రిపేర్లపేరుతో బయటికి తీసుకుపోయి పాతవి బాగుచేసి పెడుతున్నట్లు సమాచారం. మొక్కల పెంపకం పేరుతో.. బాలసదన్ ఆవరణలో మొక్కలునాటి వారి సంరక్షించేందుకు దాతల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సిబ్బంది తెలుపుతున్నారు. వర్షాకాలంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రభుత్వం పిలుపు ఇవ్వడంతోపాటు అందుకు అవసరమైన మొక్కలు, కంచెవంటివి పంపిణీ చేసింది. ఈ మొక్కల పెంపకం సాకుగా చూపి బాలల మధ్య వేడుకలు జరుపుకోవడానికి బాలసదన్‌కు వచ్చిన దాతల నుంచి విరాళాలు వేలల్లో వసూలు చేసినట్లు ప్రజలు తెలుపుతున్నారు. ప్రభుత్వం దృష్టి సారించాలి.. బాలసదన్‌కు విరాళంగా ఇచ్చిన నగదు, వస్తువుల రికార్డులు ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అసవరం ఉంది. దాతలు ఇచ్చినపుడే రికార్డుల్లో రాసి వారికి రశీదు వంటివి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. -
అనధికార ఆశ్రమాలపై కొరడా..
హయత్‌నగర్ మండలం సచివాలయనగర్‌లో లైసెన్స్ లేకుండా గ్రేసియస్ ప్యారడైజ్ చారిటబుల్ ఫౌండేషన్ పేరిట కొనసాగుతున్న బాలబాలికల అనాథ ఆశ్రమాన్ని గురువారం అధికారులు సీజ్ చేశారు. గతంలో ఒకే చోట బాలబాలికలకు వసతి కల్పించడం, సరైన సౌకర్యాలు లేకపోవడం, పిల్లలతో భిక్షాటన చేయిస్తుండడంతో జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ (డీసీపీయూ) అధికారులు ఆ ఆశ్రమాన్ని మూసివేశారు. లైసెన్స్ తీసుకోకుండా మళ్లీ ఇటీవల నిర్వాహకులు దీన్ని తెరిచి అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగిస్తుండడంతో.. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో సీజ్ చేశారు. ఇందులో ఉన్న పిల్లలను మరో ఆశ్రమానికి తరలించారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా : అనధికారికంగా కొనసాగుతున్న బాలబాలికల అనాథ ఆశ్రమాలపై జిల్లా సంక్షేమ శాఖ కొరడా ఝళిపిస్తోంది. జువైనల్ జస్టిస్–2015 చట్టానికి లోబడి నడుచుకోని ఆశ్రమాలను సీజ్ చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 56 అనాథ బాలబాలికల ఆశ్రమాలు ఉండగా.. ఇవన్నీ జేజే యాక్ట్ ప్రకారం లైనెన్స్ పొందాలని గతేడాది చివరలో ఆశ్రమాలకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డీసీపీయూ నోటీసులు జారీచేసింది. ఆరు నెలలలోపు యాక్ట్ ప్రకారం బాలబాలికలకు అన్ని సదుపాయాలు కల్పించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఆ ఆరునెలల కాలానికి చెల్లుబాటయ్యేలా తాత్కాలిక రిజిస్ట్రేషన్లు ఇచ్చారు. ప్రస్తుతం ఆ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న ఆశ్రమాలు ఏ మేరకు మెరుగుపడ్డాయని తెలుసుకునేందుకు ప్రత్యేకం టీం రంగంలోకి దిగింది. ఈ బృందంలోని డీసీపీయూ, సీడబ్ల్యూసీ, ఎన్జీఓల ప్రతినిధులు ప్రతి ఆశ్రమాన్ని చుట్టేసి అక్కడి సదుపాయలు, సౌకర్యాల తీరును నేరుగా తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను సైతం రూపొందించింది. అయితే మొత్తం 56లో ఇప్పటికే పదింటికి లైసెన్స్‌లు ఇచ్చారు. మిగిలిన 46 ఆశ్రమాల్లో 25కిపైగా చెప్పుకోదగ్గ రీతిలో మార్పు కనిపించినట్లు బృందంలోని సభ్యులు గుర్తించారు. మిగిలిన వాటిలో ఎటువంటి పురోగతి కనిపించలేదని, పిల్లల బాగోగు చర్యలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయని పరిశీలనలో తేలింది. వీటిపై ఒక్కొక్కటిగా కొరడా ఝళిపించేందుకు రంగంలోకి దిగారు. తొలుత మరోసారి నోటీసులు జారీ చేసి.. ఆ తర్వాత సీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం హయత్‌నగర్ మండలంలో ఒకదాన్ని జప్తు చేశారు. పాటించాల్సిన నిబంధనల్లో కొన్ని.. బాలబాలికల ఆశ్రమాలు వేర్వేరు ప్రాంగణాల్లో కొనసాగాలి. ఒకే భవనంలో వసతి కల్పించడానికి వీల్లేదు. వయసుల వారీగా చిన్నారులకు గదులు కేటాయించాలి. బాలికల ఆశ్రమాల్లో మహిళలే పనిచేయాలి. నేలపై చిన్నారులకు పడుకోనివ్వద్దు. కచ్చితంగా పరుపు, మంచం ఉండాలి. ప్రతి 25 మంది చిన్నారుల పడకకు వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల వైశాల్యం ఉండాలి. ప్రతి 8 మందికి ఒక మూత్రశాల, ప్రతి ఐదుగురికి ఒక స్నానపు గది తప్పనిసరి. వైద్యుడు అందుబాటులో ఉండి నెలకోసారి వైద్య పరీక్షలు నిర్వహించి రికార్డుల్లో నమోదు చేయాలి. మెనూ ప్రకారం పౌష్టికాహారం, రక్షిత తాగునీరు సమకూర్చాలి. సిబ్బంది, నిర్వహణ, చిన్నారుల వ్యక్తిగత ప్రొఫైల్, వైద్య, ఆరోగ్య పరమైన వివరాల రికార్డులు నిర్వహించాలి. ప్రాంగణం చుట్టూ ప్రహరీతోపాటు రక్షణ వలయం, 24 గంటల పాటు భద్రత, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కౌన్సిలర్, టీచర్ నిత్యం విధుల్లో కొనసాగాలి. చదువుతోపాటు వృత్తిపరమైన శిక్షణ అందజేయాలి. పాఠశాలలకు పంపినా.. తోడుగా మరొకరిని ఉంచాలి. ఆరేళ్లలోపు చిన్నారులను ఆశ్రమాల్లో చేర్చుకోవద్దు. ఈ నిబంధనలన్నీ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా ఆశ్రమాల నిర్వాహకులకు పట్టడం లేదు. భద్రత గాలికి.. జిల్లా శివారులో ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఆశ్రమాలు కొనసాగుతున్నాయి. వీటిలో ఎంతమంది పిల్లలు ఉన్నారనే లెక్కలు లేవు. రాజకీయ నాయకుల అండదండలతో ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. వాస్తవంగా అనాథలను చేరదీయడం, అక్కడి నుంచి బయటకు పంపించడమూ చట్టబద్ధంగానే జరగాలి. అనాథల వివరాలను తొలుతు శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) దృష్టికి తీసుకెళ్లాలి. ఆ కమిటీ సూచించిన ఆశ్రమాలే సదరు చిన్నారులకు ఆశ్రయం కల్పించి బాగోగులు చూడాలని జేజే చట్టం వెల్లడిస్తోంది. అయితే తమకు దొరికనవారిని దొరికినట్లుగా ఆశ్రమాల్లో చేర్చుకుని చిన్నారుల రక్షణ, సంరక్షణ విషయంలో ఎనలేని నిర్లక్ష్యాన్ని కనబర్చుతున్నారు. లైంగిక దాడులు.. ఆశ్రమాల్లోని బాలికలకు భద్రత లేకుండా పోయింది. వారిపై అత్యాచారాలు సైతం జరుగుతున్నాయి. తండ్రి స్థానంలో ఉండి కనురెప్పలా సంరక్షించాల్సిన నిర్వాహకులే కామాంధులుగా మారుతున్నారు. జిల్లాలో ఇటువంటి ఐదారు ఘటనలు వెలుగులోకి వస్తే తప్ప బయటి ప్రపంచానికి తెలియడం లేదు. వీటిపై నిర్వహణపై ఎటువంటి పర్యవేక్షణా లేకపోవడంతో నిర్వాహకులు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పిల్లలతో భిక్షాటన.. లాభార్జన నా అనే వారు లేని అభాగ్య చిన్నారులకు మానవతా దృక్పథంతో చేరదీసి రక్షణ, సంరక్షణ కల్పించడమే అనాథ ఆశ్రమాల ముఖ్య ఉద్దేశం. వీటినుంచి ఒక్క పైసా కూడా ఆశించకుండా సామాజిక సేవతో నిర్వహించాలి. ఇటువంటి ఆశ్రమాలకు దాతలు అందించే విరాళాలే ఆర్థిక వనరులు. ఈ నిధులను నిస్సంకోచంగా చిన్నారుల రక్షణ, సంరక్షణ కోసమే వెచ్చించాలి. కానీ, నిర్వాహకులు వచ్చిన దాంట్లో కొంతమేర చిన్నారుల కోసం ఖర్చు చేసి మిగిలినవి వెనకేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇవి చాలవన్నట్లు పిల్లలతో సైతం బిక్షాటన చేయిస్తున్న దారుణాలు నిత్యం కనిపిస్తున్నాయి. ఇంకొందరు చిన్నారులతో విరాళాలు సేకరిస్తున్నా రు. ముఖ్యంగా ఆశ్రమాలు రికార్డులు నిర్వహించడం లేదు. దాతల విరాళాలు, ఖర్చుల వివరాల న్నీ గు ట్టుగానే ఉంటున్నాయి. ఆడిట్ రిపోర్ట్లు తప్ప నిసరి. వాస్తవంగా విరాళాలు తీసుకోవాలంటే ఆదా య పన్ను శాఖ పరిధిలో సెక్షన్ 80(జి) కింద సద రు ట్రస్టీ/సొసైటీ ధ్రువపత్రం కలిగి ఉండాలి. కానీ ఈ తరహా గుర్తింపు పొందిన ఆశ్రమాలు ఐదారుకు మించి ఉండవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో చేర్చకండి
తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో చేర్చకండి అని సీనియర్ నటుడు రాధారవి హితవు పలికారు. గురువారం సాయంత్రం చెన్నైలోని గ్రీన్‌పార్క్ హోటల్లో జరిగిన ఇరైవి చిత్ర విలేకరుల సమావేశంలో పాల్గొన్న రాధారవి పై విధంగా పేర్కొన్నారు. కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ఇరైవి. విజయ్‌సేతుపతి, ఎస్జే.సూర్య, బాబీసింహా, అంజలి, కమలిని ముఖర్జి, కరుణాకరన్, రాధారవి నటించిన ఈ చిత్రాన్ని తిరుకుమరన్ ఎంటర్టెయిన్మెంట్, అభి అండ్ అభి, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. పచ్చైక్కారన్ చిత్రంతో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టి మంచి లాభాలను ఆర్జించిన ఆర్కే.ఫిలింస్ సంస్థ ఏరియా 78 ప్రొడక్షన్ హౌస్ సంస్థతో కలిసి ఇరైవి చిత్రాన్ని విడుదల చేయనుంది. ఏరియా 78 ప్రొడక్షన్ హౌస్ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. రాధారవి మాట్లాడుతూ కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కారణం తాను 45 ఏళ్లుగా 300 చిత్రాలకు పైగా నటించానన్నారు. అందులో అధిక భాగం చెడ్డవాడిగానే నటించానని కొన్ని చిత్రాల్లో మంచి వాడిగా నటించినా, ఇరైవి చిత్రంలో కార్తీక్‌సుబ్బరాజ్ మరింత మంచి వాడిగా చూపించారన్నారు. కార్తీక్‌సుబ్బరాజ్ చాలా తెలివైన దర్శకుడని ప్రశంసించారు. ఇరైవి చిత్రం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని విడుదలైన తరువాత ప్రజలే చెబుతారని అన్నారు. అయితే చిత్రంలో నటించిన వారందరూ అంకిత భావంతో నటించారని అభినందించారు. ఈ సందర్భంగా తను ఇచ్చే సందేశం ఏమిటంటే తల్లిదండ్రులను అనాథాశ్రమాలకు పంపకండి అన్నారు. అనాథాశ్రమాలు లేని దేశమే మానవత్వం ఉన్న ప్రజా దేశమని రాధారవి పేర్కొన్నారు. ఇరైవి చిత్రం జూన్ 3న విడుదల కానుంది.