అనధికార ఆశ్రమాలపై కొరడా..    | Orphanage Seized In Rangareddy | Sakshi
Sakshi News home page

అనధికార ఆశ్రమాలపై కొరడా..   

Published Fri, Aug 17 2018 9:13 AM | Last Updated on Fri, Aug 17 2018 9:13 AM

Orphanage Seized In Rangareddy - Sakshi

హయత్‌నగర్‌లోని ప్యారడైజ్‌ చారిటబుల్‌ అనాథ ఆశ్రమాన్ని సీజ్‌ చేసిన అధికారులు

హయత్‌నగర్‌ మండలం సచివాలయనగర్‌లో లైసెన్స్‌ లేకుండా గ్రేసియస్‌ ప్యారడైజ్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ పేరిట కొనసాగుతున్న బాలబాలికల అనాథ ఆశ్రమాన్ని గురువారం అధికారులు సీజ్‌ చేశారు. గతంలో ఒకే చోట బాలబాలికలకు వసతి కల్పించడం, సరైన సౌకర్యాలు లేకపోవడం, పిల్లలతో భిక్షాటన చేయిస్తుండడంతో జిల్లా బాలల పరిరక్షణ యూనిట్‌ (డీసీపీయూ) అధికారులు ఆ ఆశ్రమాన్ని మూసివేశారు.

లైసెన్స్‌ తీసుకోకుండా మళ్లీ ఇటీవల నిర్వాహకులు దీన్ని తెరిచి అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగిస్తుండడంతో.. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో సీజ్‌ చేశారు. ఇందులో ఉన్న పిల్లలను మరో ఆశ్రమానికి తరలించారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా :  అనధికారికంగా కొనసాగుతున్న బాలబాలికల అనాథ ఆశ్రమాలపై జిల్లా సంక్షేమ శాఖ కొరడా ఝళిపిస్తోంది. జువైనల్‌ జస్టిస్‌–2015 చట్టానికి లోబడి నడుచుకోని ఆశ్రమాలను సీజ్‌ చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 56 అనాథ బాలబాలికల ఆశ్రమాలు ఉండగా.. ఇవన్నీ జేజే యాక్ట్‌ ప్రకారం లైనెన్స్‌ పొందాలని గతేడాది చివరలో ఆశ్రమాలకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డీసీపీయూ నోటీసులు జారీచేసింది. ఆరు నెలలలోపు యాక్ట్‌ ప్రకారం బాలబాలికలకు అన్ని సదుపాయాలు కల్పించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఆ ఆరునెలల కాలానికి చెల్లుబాటయ్యేలా తాత్కాలిక రిజిస్ట్రేషన్లు ఇచ్చారు. ప్రస్తుతం ఆ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న ఆశ్రమాలు ఏ మేరకు మెరుగుపడ్డాయని తెలుసుకునేందుకు ప్రత్యేకం టీం రంగంలోకి దిగింది.

ఈ బృందంలోని డీసీపీయూ, సీడబ్ల్యూసీ, ఎన్‌జీఓల ప్రతినిధులు ప్రతి ఆశ్రమాన్ని చుట్టేసి అక్కడి సదుపాయలు, సౌకర్యాల తీరును నేరుగా తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను సైతం రూపొందించింది. అయితే మొత్తం 56లో ఇప్పటికే పదింటికి లైసెన్స్‌లు ఇచ్చారు. మిగిలిన 46 ఆశ్రమాల్లో 25కిపైగా చెప్పుకోదగ్గ రీతిలో మార్పు కనిపించినట్లు బృందంలోని సభ్యులు గుర్తించారు. మిగిలిన వాటిలో ఎటువంటి పురోగతి కనిపించలేదని, పిల్లల బాగోగు చర్యలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయని పరిశీలనలో తేలింది. వీటిపై ఒక్కొక్కటిగా కొరడా ఝళిపించేందుకు రంగంలోకి దిగారు. తొలుత మరోసారి నోటీసులు జారీ చేసి.. ఆ తర్వాత సీజ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం హయత్‌నగర్‌ మండలంలో ఒకదాన్ని జప్తు చేశారు.   

పాటించాల్సిన నిబంధనల్లో కొన్ని.. 

బాలబాలికల ఆశ్రమాలు వేర్వేరు ప్రాంగణాల్లో కొనసాగాలి. ఒకే భవనంలో వసతి కల్పించడానికి వీల్లేదు. వయసుల వారీగా చిన్నారులకు గదులు కేటాయించాలి. బాలికల ఆశ్రమాల్లో మహిళలే పనిచేయాలి. నేలపై చిన్నారులకు పడుకోనివ్వద్దు. కచ్చితంగా పరుపు, మంచం ఉండాలి. ప్రతి 25 మంది చిన్నారుల పడకకు వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల వైశాల్యం ఉండాలి. ప్రతి 8 మందికి ఒక మూత్రశాల, ప్రతి ఐదుగురికి ఒక స్నానపు గది తప్పనిసరి. వైద్యుడు అందుబాటులో ఉండి నెలకోసారి వైద్య పరీక్షలు నిర్వహించి రికార్డుల్లో నమోదు చేయాలి. మెనూ ప్రకారం పౌష్టికాహారం, రక్షిత తాగునీరు సమకూర్చాలి. సిబ్బంది, నిర్వహణ, చిన్నారుల వ్యక్తిగత ప్రొఫైల్, వైద్య, ఆరోగ్య పరమైన వివరాల రికార్డులు నిర్వహించాలి. ప్రాంగణం చుట్టూ ప్రహరీతోపాటు రక్షణ వలయం, 24 గంటల పాటు భద్రత, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కౌన్సిలర్, టీచర్‌ నిత్యం విధుల్లో కొనసాగాలి. చదువుతోపాటు వృత్తిపరమైన శిక్షణ అందజేయాలి. పాఠశాలలకు పంపినా.. తోడుగా మరొకరిని ఉంచాలి. ఆరేళ్లలోపు చిన్నారులను ఆశ్రమాల్లో చేర్చుకోవద్దు. ఈ నిబంధనలన్నీ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా ఆశ్రమాల నిర్వాహకులకు పట్టడం లేదు.  

భద్రత గాలికి.. 

జిల్లా శివారులో ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఆశ్రమాలు కొనసాగుతున్నాయి. వీటిలో ఎంతమంది పిల్లలు ఉన్నారనే లెక్కలు లేవు. రాజకీయ నాయకుల అండదండలతో ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. వాస్తవంగా అనాథలను చేరదీయడం, అక్కడి నుంచి బయటకు పంపించడమూ చట్టబద్ధంగానే జరగాలి. అనాథల వివరాలను తొలుతు శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) దృష్టికి తీసుకెళ్లాలి. ఆ కమిటీ సూచించిన ఆశ్రమాలే సదరు చిన్నారులకు ఆశ్రయం కల్పించి బాగోగులు చూడాలని జేజే చట్టం వెల్లడిస్తోంది. అయితే తమకు దొరికనవారిని దొరికినట్లుగా ఆశ్రమాల్లో చేర్చుకుని చిన్నారుల రక్షణ, సంరక్షణ విషయంలో ఎనలేని నిర్లక్ష్యాన్ని కనబర్చుతున్నారు.  

లైంగిక దాడులు.. 

ఆశ్రమాల్లోని బాలికలకు భద్రత లేకుండా పోయింది. వారిపై అత్యాచారాలు సైతం జరుగుతున్నాయి. తండ్రి స్థానంలో ఉండి కనురెప్పలా సంరక్షించాల్సిన నిర్వాహకులే కామాంధులుగా మారుతున్నారు. జిల్లాలో ఇటువంటి ఐదారు ఘటనలు వెలుగులోకి వస్తే తప్ప బయటి ప్రపంచానికి తెలియడం లేదు. వీటిపై నిర్వహణపై ఎటువంటి పర్యవేక్షణా లేకపోవడంతో నిర్వాహకులు ఆగడాలు మితిమీరిపోతున్నాయి.  

పిల్లలతో భిక్షాటన.. లాభార్జన 

నా అనే వారు లేని అభాగ్య చిన్నారులకు మానవతా దృక్పథంతో చేరదీసి రక్షణ, సంరక్షణ కల్పించడమే అనాథ ఆశ్రమాల ముఖ్య ఉద్దేశం. వీటినుంచి ఒక్క పైసా కూడా ఆశించకుండా సామాజిక సేవతో నిర్వహించాలి. ఇటువంటి ఆశ్రమాలకు దాతలు అందించే విరాళాలే ఆర్థిక వనరులు. ఈ నిధులను నిస్సంకోచంగా చిన్నారుల రక్షణ, సంరక్షణ కోసమే వెచ్చించాలి. కానీ, నిర్వాహకులు వచ్చిన దాంట్లో కొంతమేర చిన్నారుల కోసం ఖర్చు చేసి మిగిలినవి వెనకేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇవి చాలవన్నట్లు పిల్లలతో సైతం బిక్షాటన చేయిస్తున్న దారుణాలు నిత్యం కనిపిస్తున్నాయి.

ఇంకొందరు చిన్నారులతో విరాళాలు సేకరిస్తున్నా రు. ముఖ్యంగా ఆశ్రమాలు రికార్డులు నిర్వహించడం లేదు. దాతల విరాళాలు, ఖర్చుల వివరాల న్నీ గు ట్టుగానే ఉంటున్నాయి. ఆడిట్‌ రిపోర్ట్‌లు తప్ప నిసరి. వాస్తవంగా విరాళాలు తీసుకోవాలంటే ఆదా య పన్ను శాఖ పరిధిలో సెక్షన్‌ 80(జి) కింద సద రు ట్రస్టీ/సొసైటీ ధ్రువపత్రం కలిగి ఉండాలి. కానీ ఈ తరహా గుర్తింపు పొందిన ఆశ్రమాలు ఐదారుకు మించి ఉండవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement