Rangareddy Crime News
-
Hyderabad: మ్యాట్రిమోనీని అడ్డుపెట్టుకొని మోసాలు..! అసలేం చేశాడంటే?
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి: మాట్రిమోనీలో పెళ్లిళ్ల కోసం నమోదు చేసుకున్న మహిళలను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని మార్కెట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 27 తులాల బంగారు ఆభరణాలు స్వాదీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. గురువారం ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో మహంకాళి ఏసీపీ రవీందర్, మార్కెట్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, డీఐ వెంకటరమణలతో కలిసి వివరాలు వెల్లడించారు. జిల్లా కందుకూరు మండలం నెడనూర్ గ్రామానికి చెందిన తుమ్మ మోహన్‌రెడ్డి (38) 2011లో కల్వకుర్తికి చెందిన మహిళతో వివాహం జరిగి గొడవలు రావడంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు. మ్యాట్రిమోనీలో శ్రీనాథ్ అనే పేరుతో పేరు నమోదు చేసికున్నాడు. భారత్ మాట్రిమోనీలో విడాకులు తీసుకున్న ఓ మహిళ రెండవ పెళ్లి కోసం నమోదు చేసుకోగా ఆమె ప్రొఫైల్‌ను సేకరించాడు. ఆమెకు ఫోన్ చేసి తాను పెళ్లి చేసుకుంటానని అయితే ఒక సారి నేరుగా కలుద్దామని చెప్పాడు. వచ్చే సమయంలో నగలతో పాటు వస్తే ఫొటో తీసుకుని తన తల్లిదండ్రులకు చూపించి పెళ్లి చేసికుంటానని నమ్మించాడు. దీన్ని నమ్మిన ఆ మహిళ ఈ నెల 7న సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాత్రి ఇన్ హోటల్‌కు వచ్చారు. రెడీ అయ్యే ముందు వాష్ రూమ్‌కు వెళ్లి ఫ్రెష్అప్ కావాలని చెప్పాడు. దీంతో ఆమె వాష్ రూమ్‌కు వెళ్లి వచ్చే లోపు ఆమెకు చెందిన 27 తులాల బంగారు ఆభరణాలున్న బ్యాగును తీసుకుని హోటల్ నుంచి పరారయ్యాడు. నిందితున్ని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివిధ కేసుల్లో నిందితుడు.. ► ఇదే విదంగా నిందితుడు మోహన్‌రెడ్డి షాదీ డాట్ కామ్‌లో గౌతమ్‌రెడ్డి పేరుతో పేరు నమోదు చేసికుని ఓ మహిళను నమ్మించాడు. ఆమెకు నమ్మకం కలిగిన తర్వాత ఆమె క్రెడిట్ కార్డు ద్వారా రూ.6.20 లక్షలతో బంగారు నగలు కొనుగోలు చేసి పరారయ్యాడు. ► మరో మాట్రిమోనీలో విజయరెడ్డి పేరుతో పేరు నమోదు చేసికుని రూ.9లక్షలు తన అకౌంట్లో వేసుకున్నాడు. ► కల్వకుర్తిలో ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తూ 10వ తరగతి చదువుతున్న బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించి 3 నెలలు జైలుకు వెళ్లివచ్చాడు. ► కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తన బంధువుకే కారు పేరుతో రూ.4.50లక్షలు మోసం చేశాడు. మాదాపూర్‌లోని హాస్టల్లో ఉంటూ రూ.70వేల విలువ చేసే ల్యాప్‌టాప్ తదితర వస్తువులను దొంగతనం చేశాడు. ► చైతన్యపురిలో మరో హాస్టల్లో రూ.40వేల విలువ చేసే ల్యాప్‌టాప్ దొంగతనం చేశాడు. ఇలా పలు కేసుల్లో నిందితుడు పరారీలో ఉన్నాడు. -
యువతి నుదిట సింధూరం.. యువకుడి పాలిట మరణ శాసనం
సాక్షి, క్రైమ్: షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. బలవంతంగా యువతి నుదట దిద్దిన సింధూరం!.. ఓ యువకుడిపాలిట మరణ శాసనమైంది. ప్రేమ పేరుతో తన కూతురిని వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని హతమార్చాడు ఓ తండ్రి. సినీ ఫక్కీలో పక్కా మర్డర్‌కు ప్లాన్ వేసి మరీ కిరాతకంగా ప్రాణం తీశాడు. బీహార్‌కు చెందిన కరుణాకర్ కుటుంబం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలో నివాసం ఉటూ చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆగష్టు 29వ తేదీ నుంచి కరుణాకర్ కనిపించకుండా పోయాడు. దీంతో.. అతని సోదరుడు దీపక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి. రంజిత్ కుమార్ అనే వ్యక్తి ప్లాన్ ప్రకారమే కరుణాకర్‌ను హత్య చేశారని పోలీసులు దర్యాప్తు ద్వారా తేల్చారు. రంజిత్ కుమార్ కూతురిపై కరుణాకర్ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె నుదుటిపై సింధూరం కూడా దిద్ది ఆమెను ఇబ్బందికి గురి చేశాడు. ఈ విషయం బయటకు పొక్కితే తన పరువు పోతుందని రంజిత్ రగిలిపోయాడు. కరుణాకర్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆగష్టు 15వ తేదీన కేశంపేట మండలంలోని నిడదవెళ్లి గ్రామం నుంచి జూలపల్లి వెళ్లే రోడ్డులో ఉన్న వరి చేను దగ్గరికి పిలిపించుకున్నాడు. విచక్షణా రహితంగా కరుణాకర్‌పై దాడికి దిగాడు. కాళ్లు చేతులు కట్టేసి వరి చేను నీటి బురద లో తలకాయ ముంచి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అదే బురదలో పాతిపెట్టి వెళ్లిపోయారు. దర్యాప్తు ద్వారా ఈ కేసును చేధించామని, ప్రధాన నిందితుడు రంజిత్‌తో పాటు అతనికి సహకరించిన వాళ్లనూ అరెస్ట్ చేశామని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు. నిందితులపై 302, 201 ,34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉండగా.. వాళ్లను జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. -
3 నెలలుగా బాలికపై యజమాని అఘాయిత్యం
సాక్షి, శంషాబాద్: పూల దుకాణం యజమాని ఓ బాలికపై మూడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలిలాన్నాయి. స్థానిక హుడా కాలనీలో నివసించే బాలిక(14) పట్టణంలోని సతీష్(40) పూల దుకాణంలో కొంతకాలంగా పనిచేస్తోంది. బాలికను బైక్‌పై ఇంటి వద్ద వదిలేసే క్రమంలో మూడు నెలలుగా బాలికపై లైంగిక దాడి చేస్తున్నాడు. ఇటీవల అనారోగ్యంతో ఉన్న సమయంలో కూడా దారుణానికి ఒడిగట్టేందుకు యత్నించడంతో బాలిక అఘాయిత్యాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబసభ్యులు మంగళవారం ఆర్జీఐఏ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు పంపారు. సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలకార్మికురాలిని పనిలో పెట్టుకోవడంతో పాటు అత్యాచారానికి ఒడిగట్టిన అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికను గర్భవతిని చేసి..
శంషాబాద్: మైనర్ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు నమ్మించి మోసం చేసిన సంఘటన ఆర్జీఐఏ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. సదరు బాలిక సోమవారం అర్ధరాత్రి నుంచి అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆర్జీఐఏ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కొత్వాల్‌గూడకు చెందిన మైనర్ బాలిక(17)ను ఎయిర్‌పోర్టు కాలనీకి చెందిన విజయ్(25) ప్రేమ పేరుతో నమ్మించి గర్భవతిని చేశాడు. సదరు బాలికకు తెలియకుండానే ఇటీవలే మరో వివాహం కూడా చేసుకున్నాడు. కాగా సోమవారం అర్ధరాత్రి నుంచి బాలిక అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు, మాలల ఐక్యవేదిక సంఘం గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు అనిత మంగళవారం ఉదయం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయమై మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు మాలల ఐక్యవేదిక గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు అనిత పేర్కొన్నారు. మైనర్ బాలిక అదృశ్యంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆర్జీఐఏ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. -
శంకరయ్య.. 4.58 కోట్లు.. 11 ప్లాట్లు..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూతగాదాల కేసులో రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన షాబాద్ సీఐ శంకరయ్యపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కసరత్తు చేస్తోంది. గత శుక్రవారం శంకరయ్య ఇంట్లో సోదాల సందర్భంగా రూ.4.58 కోట్ల ఆస్తులను గుర్తించిన అధికారులు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు, నగలు, నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. శంకరయ్యకు హైదరాబాద్, పూర్వ నల్లగొండ జిల్లాలో బినామీల పేరిట పలు ఆస్తులు ఉన్నట్లు తేలింది. సోదాల సందర్భంగా ఆయన ఇంట్లో రూ.17.88 లక్షల నగదు లభ్యంకాగా.. డాక్యుమెంట్ల ఆధారంగా11 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ రూ.2.28 కోట్లు. నిజామాబాద్ జిల్లా రెంజల్‌తో పాటు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లో 41.3 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. వీటి విలువ రూ.77 లక్షలని ఏసీబీ వెల్లడించింది. రూ.7 లక్షల విలువ చేసే కారు, రూ.21.44 లక్షల ఖరీదైన బంగారు ఆభరణాలు, రూ.6.13 లక్షల విలువ చేసే గృహోపకరణాలు, రూ.81వేల విలువ చేసే వెండి సామగ్రిని ఏసీబీ అధికారులు గుర్తించారు. నగరంలో రెండు ఇళ్లు ఉండగా, వాటి విలువ రూ.1.05 కోట్లుగా నిర్ధారించారు. సీఐ స్థాయి అధికారికి ఇంత ఆస్తులు కూడబెట్టడంతో.. ఇవి అక్రమాస్తులుగా ఏసీబీ పరిగణించిందని, అందుకే ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. -
బంగారం పేరుతో టోకరా
మనోహరాబాద్(తూప్రాన్): జేసీబీతో పనులు చేస్తుంటే బంగారం కడ్డీలు దొరికాయని తక్కువ ధరకు అమ్ముతానని నమ్మించి మోసం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని, కాళ్ళకల్‌కు రప్పించి చాకచక్యంగా పట్టుకొని పోలీసులకు అప్పగించిన వైనం మనోహరాబాద్ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... మనోహరాబాద్ మండలంలోని కాళ్ళకల్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ళ నర్సింగ్‌రావుకు రిసాల్ అనే వ్యక్తి మూడు నెలల క్రితం ఫోన్ చేసి మాది హర్యానా రాష్ట్రం అని, జేసీబీ డ్రైవింగ్ చేస్తానని డ్రైవర్ జాబ్ కావాలని అడిగాడు, కాగా నర్సింగ్‌రావు వద్ద జేసీబీ లేదని తెలిపాడు. కానీ రెండు నెలలుగా ఫోన్ చేస్తూ ఎక్కడైనా సరే డ్రైవర్‌గా పెట్టించమని అడిగాడు. నెల క్రితం అలాగే ఫోన్ చేసి నాకు ఓ పాత ఇంటిలో జేసీబీతో పనులు చేస్తుంటే బంగారం బిస్కెట్స్ దొరికాయని, నాకు అర్జెంట్‌గా డబ్బులు అవసరమని, వీటిని అమ్ముతానని బంగారం ఫొటోలను నర్సింగ్‌రావు ఫోన్‌కు పంపించాడు. దీన్ని నమ్మి విడతల వారిగా ఆన్లైన్లో రూ.లక్షా 28 వేలు పంపాడు. కాగా ఇంకా డబ్బులు కావాలని ఫోన్ చేయడంతో, అనుమానం వచ్చి మిగతా డబ్బులు బంగారం చూపితేనే ఇస్తానని చెప్పి అతడిని చాకచక్యంగా కాళ్ళకల్ గ్రామంలో బంగారమ్మ దేవాలయం వద్దకు రప్పించాడు. నర్సింగ్‌రావుకు బంగారం బిస్కెట్స్ మాదిరి బిల్లలు ఇవ్వగా అనుమానం వచ్చి వాటిని చెక్ చేయించగా అది బంగారం కాదని నకిలీదని తెలింది. వెంటనే అతడిని పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించినట్టు ఎస్ఐ రాజు తెలిపారు. అతడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నర్సింగ్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు విచారణ చేసి అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
నలుగురూ స్నేహితులు.. ఒకే గ్రామం
చేవెళ్ల: నలుగురూ స్నేహితులు... ఒకే గ్రామం.. పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. వేర్వేరు ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నారు. సరదాగా కారులో వెళ్లి గ్రామానికి తిరిగి వస్తుండగా మృత్యువు రూపంలో మర్రిచెట్టు మాటేసి మింగేసింది. కారు అదుపుతప్పి ఢీకొనడంతో ఘటనా స్థలంలో ముగ్గురు దుర్మరణం పాలవడగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా మండల పరిధిలోని ఆలూరు గ్రామస్తులు కావడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన ఆదివారం రాత్రి 7 గంటలకు మండల పరిధిలోని మీర్జాగూడ బస్‌స్టేజీ సమీపంలో జరిగింది. పోలీసులు, మృతుల కుటుంబీకుల కథనం ప్రకారం.. మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన సార నరేశ్(30), గారెల రవీందర్(32), ఎన్కేతల రఘు(30), నర్కుడ నవీన్ స్నేహితులు. వీరు నలుగురు కలిసి చదువుకున్నారు. 2005 పదో తరగతి బ్యాచ్. ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్వగ్రామం నుంచి నరేష్‌కు చెందిన కారులో సరదాగా చేవెళ్లకు వచ్చారు. రాత్రి 7 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. మరో 10 నిమిషాల్లో గ్రామానికి చేరుకోవాల్సి ఉండగా.. మార్గంమధ్యలో మీర్జాగూడ బస్‌స్టేజీ దాటిన తర్వాత కారు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న మర్రిచెట్టును ఢీకొట్టింది. వాహనం అతివేగంగా చెట్టును ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారు డ్రైవింగ్ చేస్తున్న రఘు వాహనంలో ఇరుక్కుపోయాడు. సార నరేశ్, గారెల రవీందర్ తీవ్రంగా గాయపడటంతో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. నర్కూడ నవీన్ కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురు మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన నవీన్‌ను చికిత్స నిమిత్తం నగరానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురూ ఉద్యోగస్తులే.. కారు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు స్నేహితులు ఆలూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబాలకు చెందిన యువకులు. ఎప్పుడూ స్నేహంగా మెలిగే వీరు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. బాధిత కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. సార నరేశ్ బీటెక్, ఎల్ఎల్బీ పూర్తి చేశాడు. బెంగళూరులో ప్రైవేట్ జాబ్ చేసేవాడు. లాక్‌డౌన్‌తో ఇటీవల ఉద్యోగం షాదనగర్‌కు మారింది. ఆదివారం సెలవు కావటంతో గ్రామానికి వచ్చాడు. తండ్రి చంద్రయ్యకు ఇద్దరు కొడుకులు నరేశ్ పెద్దకొడుకు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న అతడు మృతిచెందడంతో తల్లిదండ్రులు గుండులుబాదుకుంటూ రోదించారు. గారెల నారాయణ, కమలమ్మ దంపతుల ఏకైక కుమారుడు రవీందర్. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం కాలేదు. ఎన్కేతల రఘు(30) ఏఆర్ కానిస్టేబుల్. వికారాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామానికి చెందిన ఎన్కేతల యాదయ్య, లక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురూ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. రఘుకు ఏడాది క్రితమే వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయన భార్య గర్భవతి. తీవ్రంగా గాయపడిన నర్కుడ నవీన్ గ్రామంలోనే ఉంటూ తల్లిదండ్రులకు సాయంగా ఉండేవాడు. చేవెళ్ల ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. -
ఇళ్లల్లోకి దుర్వాసన రావడంతో...
రంగారెడ్డి, కొత్తూరు: జంతు కళేబరాలతో కంపు కొడుతున్న ఓ షెడ్‌కు అధికారులు తాళం వేశారు. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని ఓ షెడ్లో జంతుకళేబరాలను నిల్వ చేయడంతో ఇళ్లల్లోకి దుర్వాసన వస్తోంది. ఇది గుర్తించిన స్థానికులు అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం షెడ్‌ను పరిశీలించిన అధికారులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న జంతు కళేబరాలను చూసి అవాక్కయ్యారు. తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ జ్యోతి, పోలీసులు షెడ్లోని జంతుకళేబరాలతో తయారు చేస్తున్న ఉత్పత్తులను పరిశీలించారు. అధికారులు వచ్చే సరికి షెడ్లో పనిచేస్తున్న సిబ్బంది పరారయ్యారు. ఇతర ప్రాంతాల నుంచి డీసీఎంలో తెచ్చిన జంతుకళేబరాలు, అవయవాలు దీంతో షెడ్‌కు తాళం వేసినఅనంతరం అధికారులు మాట్లాడుతూ.. ఏపీకి చెందిన కొంతమంది వ్యాపారులు తిమ్మాపూర్ శివారులో హరిప్రోటీన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ షెడ్‌ను అద్దెకు తీసుకొని దాంట్లో జంతుకళేబారాలతో పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. కాగా ఉత్పత్తుల తయారీ కోసం అన్ని శాఖల అనుమతులు తీసుకున్నారా..? ఇక్కడ కళేబరాలు, అవయవాలతో వంటనూనె తయారు చేస్తున్నారా..? లేక ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నారా.? అనే విషయాలు తెలాల్సి ఉందన్నారు. షెడ్లో తయారు చేస్తున్న ఉత్పత్తుల విషయాన్ని తాను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తహసీల్దార్ చెప్పారు. ఇదిలా ఉండగా నిర్వాహకుల్లో కొందరు మాట్లాడుతూ.. తాము జంతుకళేబరాలతో వంటనూనె తయారు చేయడం లేదన్నారు. ఆక్వాఫుడ్(చేపల ఆహారం) ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం అన్ని అనుమతులు తీసుకున్నట్లు చెప్పారు. -
మెడపై గాట్లతో విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, వికారాబాద్ : అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని జాంబపూర్ తండాలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన రవినాయక్ కూతురు రేణుక(13) నవాబుపేట మండల కేంద్రంలోని కేజీబీపీ పాఠశాలలో 8వ తరగతి చదువుతుండేది. బుధవారం ఉదయం బాలిక అనారోగ్యానికి గురవడంతో ఏఎన్ఎం జ్వరం మాత్రలు ఇచ్చింది. అనంతరం బాలిక తండ్రి రవినాయక్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం 3:30 గంటలకు రవినాయక్ హాస్టల్‌కు వెళ్లి కూతురును సదాశివాపేట్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తానని తన వెంట తీసుకెళ్లాడు. అయితే, రేణుక తల్లి, రవినాయక్ మొదటి భార్య ఏడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఆయన తన రెండో భార్య బుజ్జిబాయితో కలిసి సంగారెడ్డి జిల్లా సదాశివాపేట మండలం ఆత్మకూరులో ఉంటూ అక్కడే మేస్త్రిగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో రేణుకను ఆత్మకూరుకు తీసుకెళ్లినట్లు సమాచారం. తండాకు మృతదేహం.. వసతిగృహం నుంచి రేణుకను తీసుకెళ్లిన రవినాయక్.. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఆమె మృతదేహాన్ని స్వగ్రామం జాంబపూర్ తండాకు తీసుకొచ్చాడు. అనంతరం స్థానికులకు విషయం తెలియడంతో రవినాయక్ ఇంటికి వచ్చారు. బాలిక మృతదేహాన్ని పరిశీలించగా మెడపై గాట్లు కనిపించాయి. దీంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. వీఆర్ఓ అనిత ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్ఐ లక్ష్మయ్య తండాకు చేరుకొని రేణుక మృతదేహాన్ని పరిశీలించారు. తండ్రి రవినాయక్‌ను వికారాబాద్ పోలీసులు విచారింగా పొంతన లేని సమాధానాలు తెలిపాడు. బుధవారం రాత్రి రేణుకను ద్విచక్ర వాహనంపై సదాశివపేట్‌కు తీసుకొస్తుండగా నురుగులు కక్కుతూ వాహనం పైనుంచి కింద పడిందని, దీంతో మెడకు గాయాలైనట్లు తెలిపాడు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వికారాబాద్ పోలీసులు సదాశివాపేట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన సదాశివాపేట్ సీఐ శ్రీధర్‌రెడ్డి కుటుంబీకుల నుంచి సమచారం సేకరించి తండ్రి రవినాయక్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. ఏడేళ్ల క్రితం తల్లి బలవన్మరణం రేణుక తల్లి చంద్రిబాయి 7 ఏళ్ల క్రితమే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటికే ఆమెకు కూతురు రేణుక, కుమారుడు దర్శన్ ఉన్నారు. తల్లి మృతి తరువాత రవినాయక్ పిల్లలను ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్చాడు. అనంతరం బుజ్జిబాయిని రెండో వివాహం చేసుకొని సదాశివాపేట్ మండలం ఆత్మకూరులో ఉంటున్నాడు. బుధవారం రేణుకను ఆత్మకూరు తీసుకెళ్లిన రవినాయక్ రెండో భార్య బుజ్జిబాయి సహాయంతో ఆటోలో మృతదేహాన్ని జాంబపూర్కు తీసుకొచ్చారు. రేణుక మెడకు రెండు వైపుల గాట్లు ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తుంది. తండ్రి పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు ఆయనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేణుక మృతిపై డీఈఓ విచారణ నవాబుపేట: రేణుక మృతిపై డీఈఓ రేణుకాదేవి గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విచారణ జరిపారు. రేణుకను హాస్టల్నుంచి ఇంటికి ఎందుకు పంపారు...? ఎవరు వచ్చి తీసుకెళ్లారని ఆమె పాఠశాల ప్రత్యేకాధికారిని ఆశలతను, ఏఎన్ఎం అనసూయను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక నీరసంగా ఉండటంతో తండ్రి రవినాయక్‌కు ఫోన్లో సమాచారం ఇచ్చామని, ఆయన మధ్యా హ్నం వచ్చి తన కూతురికి జ్వరంగా ఉందని చెప్పి మూమెంట్ రిజిస్టర్లో సంతకం పెట్టి సెలవు చిట్టీ ఇచ్చి తీసుకెళ్లాడని వివరించారు. గురువారం ఉదయం రేణుక మృతి చెందినట్లు సమాచారం అందిందని తెలిపారు. అంతకు ముందు తహసీల్దార్ వెంకటేశం, ఆర్ఐ రవీందర్‌రెడ్డి పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించారు. ఎంఈఓ గోపాల్ తదితరులు ఉన్నారు. -
‘గోల్డెన్’ లేడీస్.. బంగారాన్ని లోదుస్తుల్లో దాచి!
సాక్షి, రంగారెడ్డి: అతివలు స్మగ్లర్లకూ టార్గెట్ అవుతున్నారు. ఎన్నో విధాలుగా ఆశలు చూపి వీరిని క్యారియర్లుగా వినియోగిస్తున్నారు. కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల కన్ను మహిళలపై ఎక్కువగా ఉండదనే ఉద్దేశంతోనే ఈ పంథా అనుసరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లలో ఈ తరహాలో బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ ఏడుగురు మహిళలు పట్టుబడ్డారు. ఒక్క ఆదివారమే జిద్దా నుంచి 2.5 కేజీల బంగారాన్ని లోదుస్తుల్లో దాచి తీసుకువస్తూ నగరానికి చెందిన నలుగురు మహిళలు చిక్కారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కస్టమ్స్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్ళుగప్పడానికే.. సాధారణంగా స్మగ్లర్లు వీరి కోసం బంగారాన్ని తీసుకుని వచ్చే క్యారియర్లు అనగానే అందరూ పురుషులు అనే భావిస్తుంటారు. దీనికి తోడు మహిళలూ.. అందునా నిండు గర్భంతో, చంకలో పసి పిల్లలతో వచ్చే వారిని అధికారులు అనుమానించం చాలా తక్కువ. ఈ కారణంగానే దుబాయ్ తదితర దేశాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలకు కమీషన్ ఆశ చూపుతున్న బడా స్మగ్లర్లు వారికి బంగారం, మాదకద్రవ్యాలు అప్పగిస్తున్నారు. డ్రగ్స్ మాట అటుంచితే.. పసిడి తీసుకువచ్చే ఉమెన్ క్యారియర్లను ఎక్కువగా ఆయా దేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనే గుర్తిస్తున్న స్మగ్లర్లు వారికి ఇచ్చి పంపిస్తున్నారు. మాదకద్రవ్యాలను కడుపులో దాచి గర్భవతులుగా, చంటి బిడ్డలతో వస్తున్న వారికి బంగారం తదితరాలను అప్పగించి పంపిస్తున్నారు. డీఎఫ్‌ఎమ్‌డీల వద్దా బురిడీ.. వివిధ రూపాల్లో, వివిధ పంథాల్లో ఒంటిపై ఏర్పాటు చేసుకుని బంగారం అక్రమంగా తీసుకువస్తున్న మహిళలను విమానాశ్రయాల్లోని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్‌లు (డీఎఫ్ఎండీ) కూడా కొంత వరకు పసిగట్టలేకపోతున్నాయి. ఏదైనా అక్రమరవాణా విషయం కస్టమ్స్ అధికారులు గుర్తించాలంటే పక్కా సమాచారం, ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) నిఘాల కంటే డీఎఫ్‌ఎండీఏ ఎక్కువగా ఉపకరిస్తున్నాయి. క్యారియర్లు దాటుతున్న సమయంలో లోపల దాచి ఉంచిన మెటల్ కారణంగా డీఎఫ్ఎండీలు శబ్దం చేస్తాయి. మహిళలు సాధారణంగానే కొంత వరకు నగలు ధరించి ఉంటారు. వీటి వల్లే శబ్దం వచ్చి ఉంటుందని అధికారులు భావించే ఆస్కారం సైతం ఉంటుందనే బడా స్మగ్లర్లు మహిళల్ని వినియోగించుకుంటున్నారు. తప్పించుకుంటున్న కీలక వ్యక్తులు.. ఈ తరహాలో అక్రమ రవాణా చేస్తూ చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా.. ముఠా వెనుక ఉన్న సూత్రధారుల్ని కనిపెట్టడం కష్టసాధ్యంగా మారుతోందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో వీరికి బంగారం అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో మాత్రం మహిళలకు చెప్పట్లేదు. కేవలం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక ఓ ప్రాంతంలో వేచి ఉండమనో, ఫలానా హోటల్/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు. ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్లి బంగారం తీసుకుని కమీషన్లు చెల్లిస్తున్నారు. ఈ కారణంగానే విమానాశ్రయాల్లో పట్టుబడుతున్న క్యారియర్ల కేసుల్లో పురోగతి ఉండట్లేదని వివరిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల ముమ్మర కసరత్తు.. బడా స్మగ్లర్లు మహిళల్ని అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారనే ఉద్దేశంతో ప్రతి మహిళలను ఆపడం, క్షుణ్ణంగా తనిఖీ చేయడం సాధ్యం కాదు. అలా చేస్తే అమాయకులు సైతం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల అధికారులు మహిళా ప్రయాణికుల జాబితాను ముందే సేకరిస్తున్నారు. వారు విదేశాలకు ఎప్పుడు వెళ్లారు.. ఆఖరిసారిగా ఎప్పుడు వచ్చారు.. ఏ వీసాపై వెళ్లారు.. వారి నేపథ్యం ఏమిటి? తదితరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం అనుమానాస్పదమైన వారిని మాత్రమే అదుపులోకి తీసుకుంటూ ఫలితాలు సాధిస్తున్నారు. ఇవిగో ఉదాహరణలు.. దుబాయ్ నుంచి ‘గర్భవతిగా’ వచి్చన సౌతాఫ్రికా మహిళ మూసా తన కడుపులో 793 గ్రాముల కొకైన్‌తో చిక్కింది. సౌదీ నుంచి తన భర్త, ఏడాదిన్నర కుమారుడితో కలిసి వచి్చన మహిళ 1.75 కేజీల బంగారంతో పట్టుబడింది. బ్యాంకాక్, దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారి నుంచి నాలుగు కేజీల బంగారం స్వా«దీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల్ని తనిఖీ చేసిన అధికారులు 5.1 కేజీల బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు 1.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
బిజినెస్‌కు తల్లిదండ్రులు డబ్బులివ్వలేదని..
సాక్షి, మొయినాబాద్ : సొంతంగా బిజినెస్ ఏర్పాటుకోసం తల్లిదండ్రులను డబ్బులు అడిగితే ఇవ్వలేదనే మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వీరన్నపేట సమీపంలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం రేగడి ఘనాపూర్ గ్రామానికి చెందిన కంఠం వెంకట్‌రెడ్డి కుమారుడు భరత్‌రెడ్డి (28) గత 8 సంవత్సరాలుగా నగరంలోని లంగర్‌హౌస్‌లో ఉంటూ ప్రైవేటు జాబ్ చేసేవాడు. సొంతంగా బిజినెస్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో భరత్‌రెడ్డి నెల రోజుల క్రితం జాబ్ మానేశాడు. బిజినెస్ ఏర్పాటుకు అవసరమైన డబ్బులు ఇవ్వాలని నాలుగు రోజుల క్రితం రేగడి ఘనాపూర్‌కు వెళ్లి తల్లిదండ్రులను అడిగాడు. ఇప్పుడు డబ్బులు లేవని.. పంటలు అమ్మిన తరువాత డబ్బులు ఇస్తామని తల్లిదండ్రులు చెప్పారు. ఇప్పుడే అత్యవసరంగా డబ్బులు కావాలని గట్టిగా అడగడంతో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన భరత్‌రెడ్డి ఇంటి నుంచి లంగర్‌హౌస్ రూంకు వెళ్లిపోయాడు. (నాడు అన్న.. నేడు తమ్ముడు ) స్నేహితులకు మెసేజ్ పంపి.. భరత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం పురుగుల మందు తీసుకుని లంగర్‌హౌస్ నుంచి మొయినాబాద్ మండలం వీరన్నపేట సమీపంలోకి బైక్‌పై వచ్చాడు. అక్కడి నుంచి లంగర్‌హౌస్‌లో ఉన్న తన స్నేహితులకు సాయంత్రం 6 గంటల సమయంలో ఒక మెసేజ్ పంపాడు. బిజినెస్ ప్రారంభించేందుకు తనకు ఎవరూ డబ్బులు ఇవ్వడంలేదని.. అందుకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ పెట్టాడు. దీంతో స్నేహితులు 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు. డయల్ 100 నుంచి లంగర్‌హౌస్ పోలీసులకు సమాచారం వచ్చింది. భరత్‌రెడ్డి మొబైల్ నంబర్ లొకేషన్‌ను పరిశీలించిన పోలీసులు మొబైల్ లొకేషన్ మొయినాబాద్ మండలం వీరన్నపేట సమీపంలో ఉన్నట్లు చూపించడంతో లంగర్‌హౌస్, మొయినాబాద్ పోలీసులు ఆ ప్రాంతంలో వెతికారు. అప్పటికే చీకటి పడటంతో భరత్‌రెడ్డి ఆచూకీ లభించలేదు.(ప్రియురాలిపై సామూహిక లైంగికదాడికి యత్నందొరకలేదు.) బుధవారం ఉదయం వీరన్నపేట సమీపంలో గ్రామస్తులకు భరత్‌రెడ్డి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం వద్ద పురుగుల మందు డబ్బా పడి ఉండటాన్ని గమనించారు. సంఘటనా స్థలంలో వివరాలు సేకరించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
అల్లరి చేయొద్దన్నందుకు.. ఇంట్లోకి దూరి హత్య
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి: అల్లరి చేయొద్దని వారించిన యువకుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అనంతరం భయాందోళనతో పరుగులు తీయగా ఇంట్లోకి చొరబడి కత్తిపోట్లు పొడవడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మృతుడి కుటుంబీకులు, సీఐ సత్తయ్యగౌడ్ కథనం ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధి రోషన్ కాలనీలో మహ్మద్ అబ్దుల్ ముజీబ్(28), అజర్ నివాసముంటున్నారు. ముజీబ్ క్యాబ్ డ్రైవింగ్ చేస్తూ స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. పలు ఠాణాల్లో కేసులు నమోదైన అజర్(26) ఇతరులతో గొడవలు పడుతూ ఖాళీగా తిరుగుతుండేవాడు. ముజీబ్(ఫైల్); యువకుడి మృతదేహం కొంతకాలంగా ముజీబ్ ఇంటి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద అజర్ తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి వరకు మద్యం తాగుతూ అల్లరి చేస్తున్నాడు. ఈనేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి అదేవిధంగా జరిగింది. దీంతో అల్లరి చేయొద్దని ముజీబ్ అజర్‌ను వారించాడు. తనకు చెప్పడానికి నీవెవరు అంటూ ఆగ్రహానికి గురైన అతడు ముజీబ్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో భయాందోళనకు గురైన అతడు తన స్నేహితులతో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు. ముజీబ్ ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్న అజర్ లోపలికి చొరబడి తల, ఛాతీపై నాలుగైదు కత్తిపోట్లు వేశాడు. తీవ్రంగా గాయపడిన ముజీబ్‌ను కుటుంబీకులు ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. విషయాన్ని తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు రోషన్ కాలనీకి చేరుకొని వివరాలు సేకరించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న అజర్ కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. పోకిరీగా తిరుగుతున్న అజర్ కొంతకాలంగా ముజీబ్‌తో గొడవపడుతున్నారని కుటుంబీకులు తెలిపారు. రోషన్ కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్న పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడం లేదని ఆరోపించారు. -
బీటెక్ చదివి ఖాళీగా తిరిగితే ఎలా? అనడంతో ఆత్మహత్య
సాక్షి, చేవెళ్ల: ‘బీటెక్ చదివి ఖాళీగా తిరిగితే ఎలా..? ఏదైనా పనిచేయొచ్చు కదా’ అని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు గండిపేట చెరువులో మునిగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజుల తర్వాత చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో మృతదేహం నీళ్లపై తేలడంతో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై మహేంద్రనాథ్ కథనం ప్రకారం.. గండిపేట మండల పరిధిలోని నార్సింగికి చెందిన పులకల నరేష్కుమార్(24) బీటెక్ పూర్తి చేశాడు. కొంతకాలంగా ఖాళీగా తిరుగుతున్నాడు. ఏదైనా పని చేసుకుని కుటుంబానికి తోడుగా ఉండాలని తల్లిదండ్రుల ఇటీవల మందలించారు. దీంతో మనస్తాపం చెందిన నరేష్కుమార్ గతనెల 30న స్కూటీ తీసుకుని ఇంట్లోంచి బయలుదేరాడు. రాత్రి అయినా అతడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు మిస్సింగ్ కేసుగా పోలీసులు నమోదు చేశారు. మంగళవారం ఉదయం మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో గండిపేట చెరువులో ఓ యువకుడి మృతదేహం నీళ్లపై తేలియాడుతూ స్థానికులు కనిపించింది. సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీయించారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో మిస్సింగ్ అయిన నరేష్‌కుమార్‌గా గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలాజీ దేవాలయానికి వచ్చి.. ఇంట్లో తల్లిదండ్రులు మందలించడంతో గత నెల 30న స్కూటీ తీసుకుని బయలు దేరిన నరేష్కుమార్ చిలుకూరు బాలాజీ దేవాలయానికి వచ్చాడు. ఆలయం వద్ద పార్కింగ్‌లో స్కూటీ పెట్టి సమీపంలో ఉన్న గండిపేట చెరువు వద్దకు వెళ్లాడు. ఈనేపథ్యంలో అతడు నీళ్లలో మునిగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నరేష్కుమార్ ఇంట్లో రాసిపెట్టిన సూసైట్‌నోట్‌ను నార్సింగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు నార్సింగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ.. ఘోరం జరిగింది ఇక్కడేనా!
సాక్షి, శంషాబాద్: ‘పాపం.. ఆ అమ్మాయిని ఇక్కడే హత్య చేశారు.. అయ్యో కొంచెం ధైర్యం చేసి రోడ్డుపైకి వస్తే ప్రాణాలు దక్కేవి.. పోలీసులు గస్తీ తిరిగి మృగాలను పసిగట్టినా ఘోరం జరగకపోయేది కదా..’ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. శంషాబాద్ మండలంలోని తొండుపల్లి టోల్‌గేటు వద్ద జస్టిస్ ఫర్ దిశ హత్యా సంఘటన ప్రాంతాన్ని సందర్శిస్తున్న జనం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి, ఔటర్ రింగురోడ్డు గుండా రాకపోకలు సాగించేవారితో పాటు స్థానికులు ఇక్కడ ఆగి ఘోర దుర్ఘటనను తలచుకుని కన్నీరు పెడుతున్నారు. ఈ ప్రాంతం వద్ద గుమికూడిన జనం పరిసరాలను పరిశీలించి ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. వాహనాల రద్దీ, జన సంచారం ఉన్న ఇలాంటి చోట ఈ ఘటన జరగడం ఏమిటని మదన పడుతున్నా రు. ఎవరి నోట విన్నా.. అయ్యో ఎంత ఘో రం జరిగింది అనే మాట వినిపిస్తోంది. వారిలో ఆవేదన, ఆక్రోషం కనపడుతోంది. అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన మాన వ మృగాలను కాల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
లాడ్జీలో ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం ఆత్మహత్య
సాక్షి, జహీరాబాద్: మతి స్థిమితం సరిగ్గా లేక మానసికంగా బాధపడుతున్న వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జహీరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ– 2 విఠలయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బషీరాబాద్ మండలం క్యాద్గిరాకు చెందిన మోసీన్ (34) అల్లాపూర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతడికి కొన్ని రోజుల నుంచి మతి స్థిమితం సక్రమంగా లేక పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నాడు. దీంతో కుటుంబసభ్యులకు చెప్పకుండా ఎక్కడెక్కడో తిరిగేవాడు. ఈ క్రమంలో ఈనెల 20వ తేదీన పాఠశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వికారాబాద్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి అదే రోజు రాత్రి జహీరాబాద్‌కు చేరుకున్నాడు. అక్కడ బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న తిరుమల లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. తనకు జీవితంపై విరక్తి వచ్చిందని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబసభ్యులకు మెసేజ్ పెట్టి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి అన్న అబ్దుల్ మోహిజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య బషీరాబాద్ ఉర్దూ మాధ్యమం పాఠశాలలో వలంటీర్‌గా పని చేస్తోంది. కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరు బషీరాబాద్: జహీరాబాద్‌లో మోసీన్(38) ఆత్మహత్యకు పాల్పడడంతో అతడి స్వగ్రామం క్యాద్గిరలో విషాదం అలుముకుంది. జహీరాబాద్‌లో పోలీసులు మృతదేహం అప్పగించడంతో గురువారం రాత్రి క్యాద్గిరకు చేరుకుంది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఉపాధ్యాయుడి ఆత్మహత్యతో బషీరాబాద్ మండల ఉపాధ్యాయులు గ్రామానికి చేరుకొని మోసీన్‌కు నివాళులర్పించారు. -
ప్రేమ పేరుతో వేధింపులు..
సాక్షి, మల్కాజిగిరి: ప్రేమ పేరుతో ఓ విద్యార్థినిని వేధిస్తున్న యువకుడిని మల్కాజిగిరి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ లింగస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్కాజిగిరి వాణీనగర్‌కు చెందిన సాయిప్రసాద్(35) ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా అతను అదే ప్రాంతానికి చెందిన విద్యార్థిని వెంటపడుతూ ప్రేమించాలని వేధిస్తున్నాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లి తండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. సోమవారం దయానంద్‌నగర్ స్టేషన్ వద్ద సాయిప్రసాద్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
మహిళ అనుమానాస్పద మృతి: పరారీలో భర్త
మొయినాబాద్(చేవెళ్ల): అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఎత్‌బార్‌పల్లిలోసోమవారం ఉదయం జరిగింది. ఎస్సై వెంకట్ కథనం ప్రకారం.. ఏపీ గుంటూరు జిల్లా పత్తిపాడు గ్రామానికి చెందిన కుంచాల శ్రీను, కోటేశ్వరమ్మ(38) దంపతులు రెండు నెలల క్రితం బతుకుదెరువు కోసం మొయినాబాద్ మండలం ఎత్‌బార్‌పల్లికి వచ్చారు. స్థానికంగా అద్దెకు ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం తెల్లవారినా కోటేశ్వరమ్మ నిద్రలేవకపోవడంతోఅక్కడే మరో ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆమె సోదరి రమణమ్మ ఇంటి వద్దకు వెళ్లి చూసింది. బయటి నుంచి గడియ ఉండటంతోతీసి తలుపులు తెరిచి చూసింది. పడుకొని ఉన్న కోటేశ్వరమ్మను ఎంత పిలిచినా స్పందించకపోవడంతో ఆమె చుట్టుపక్కల వారిని పిలిచింది. ఆమెను పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పడుకున్న చోటనే కోటేశ్వరమ్మ మృతి చెంది ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. అనుమానంతో హత్య? వివరాలు సేకరిస్తున్న పోలీసు కోటేశ్వరమ్మను ఆమె భర్త శ్రీను హత్యచేసి ఉంటాడని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీను భార్యపై అనుమానంతో నిత్యం గొడవపడేవాడని.. ఆదివారం రాత్రి కూడా ఘర్షణ జరిగిందని స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి దిండుతో గొంతు నుమిలి హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి శ్రీను పరారీలో ఉండటంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. ఈమేరకు పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. -
ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
సాక్షి, మహేశ్వరం: కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా చిన్నారులపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నా యి. తాజాగా ఓ దుర్మార్గుడు అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సోమవారం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహేశ్వరం పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పోరండ్ల గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి స్థానికంగా అంగన్వాడీ కేంద్రంలో చదువుతోంది. ఆదివారం ఆమె తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. మధ్యాహ్నం చిన్నారి ఇంట్లో ఆడుకుంటుండగా పొరుగింటికి చెందిన మోడి చందు(21) ఆమె వద్దకు వచ్చాడు. మాయమాటలు చెప్పి అఘాయిత్యం చేశాడు. అనంతరం అతడు ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా బాలిక తల్లి గమనించి యువకుడిని ప్రశ్నించగా నీళ్లు నమిలాడు. దీంతో అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసింది. కూతురిని పరిశీలించగా అత్యాచారం జరిగినట్లు గుర్తించింది. అనంతరం నిందితుడు పరారయ్యాడు. అదే రోజు రాత్రి మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిని గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సోమవారం నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకన్ననాయక్ తెలిపారు. -
కానిస్టేబుల్ ఉద్యోగం రాలేదని..
యాలాల/బంట్వారం: పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో ఇద్దరు యువకులు వేర్వేరు చోట్ల బలవన్మరణాల కు పాల్పడ్డారు. ఈ వి షాదకర ఘటనలు వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాస్నం, అదే జిల్లాకు చెందిన బంట్వారంలో చోటుచేసుకున్నాయి. కుటుంబీకులు, పోలీసు ల కథనం ప్రకారం.. రాస్నం గ్రామానికి చెంది న దోమ మల్లేశం, పుష్పమ్మ దంపతుల కుమా రుడు రోహిత్ అలియాస్ రంజిత్ (24) బీటెక్ వరకు చదివాడు. 2018లో వెలువడిన నోటి ఫికేషన్‌తో కానిస్టేబుల్ ఉద్యోగానికి సన్నద్ధమయ్యాడు. రెండు నెలల క్రితం ఈ ఫలితాలు వె లువడ్డాయి. బీసీ–డీ కేటగిరీకి చెందిన రంజిత్ కు 101 మార్కులు వచ్చాయి. కటాఫ్ 103 మార్కులు కావడంతో రెండు మార్కుల తేడా తో ఉద్యోగం కోల్పోయాడు. దీనిపై తరచూ స్నేహితులు, బంధువుల వద్ద చెబుతూ మనోవేదనకు గురవుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అతడు ఇంట్లో పైకప్పుకు తాడుతో ఉరేసుకున్నాడు. సోమవారం ఉద యం కుటుంబీకులు గమనించగా అప్పటికే విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. మృతుడి సోదరుడు రాకేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉరివేసుకొని ఆత్మహత్య.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేజారిందనే మనస్తాపంతో వికారాబాద్ జిల్లా బంట్వారం లో కుమార్ (24) అనే యువకుడు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన అల్లిపురం నర్సింలు, ఈశ్వరమ్మ దంపతుల నాలుగో కొడుకు కుమార్ డిగ్రీ వరకు చదివాడు. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో హైదరాబాద్, తాండూ రులో శిక్షణ తీసుకున్నా డు. ఇటీవల విడుదలై న ఫలితాల్లో అతడికి ఉద్యోగం రాలేదు. అ దే గ్రామానికి చెందిన కుమార్ స్నేహితులకు ఇద్దరికి ఉద్యోగం వ చ్చింది. తనకు ఉద్యో గం రాలేదని అతడు మిత్రులకు చెప్పి ఆవేద న వ్యక్తం చేస్తుండేవాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కుమార్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎదిగి వచ్చిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడటంతో నర్సింలు దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
గొడవ చేయొద్దన్నందుకు.. దారుణంగా హత్య
సాక్షి, హైదరాబాద్: ఫంక్షన్ వద్ద తాగి గొడవ చేయొద్దు అనడంతో ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సులేమాన్‌నగర్ ప్రాంతానికి చెందిన ఇక్బాల్ కుమారుడు ఫిరోజ్ (22) శనివారం రాత్రి చింతల్మెట్లోని ఉర్దూ మాధ్యమం పాఠశాల వద్ద ఓ వివాహ విందుకు హాజరయ్యాడు. అయితే విందు సమీపంలో స్థానిక యువకులు సర్వర్, మోసీన్ మద్యం తాగి గొడవ పడుతున్నారు. అక్కడకు వెళ్లిన ఫిరోజ్ గొడవపడొద్దని వారిని వారించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది మనసులో పెట్టుకున్న సర్వర్, మోసీన్ ఫిరోజ్‌పై దాడి చేయాలని పథకం పన్నారు. అర్ధరాత్రి సమయంలో ఫిరోజ్‌ను ఇంటి నుంచి బయటకు పిలిచి కత్తులతో పొడిచారు. తీవ్ర గాయాలపాలవడంతో ఫిరోజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సర్వర్, మోసిన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అర్ధరాత్రి చింతల్మెట్లో హత్య జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. -
బంధువులే చంపి.. అడవిపంది దాడిగా చిత్రీకరించారు!
సాక్షి, బషీరాబాద్: అడవిపంది దాడిలో వ్యక్తి మృతిచెందిన కేసులో కొత్త మలుపు తిరిగింది. తన తండ్రిని బంధువులే చంపేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని మృతుడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బషీరాబాద్ మండలం మాసన్పల్లి గ్రామానికి రైతు గొల్ల కమలప్ప అడవి పంది దాడిలో ఈనెల 8వ తేదీన మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. అయితే తాజాగా మృతుడి కుమారుడు గొల్ల చరణ్ తన తండ్రిది ‘ముమ్మాటికి హత్యే’ అని ఆరోపించారు. ఆస్తి కోసం బంధువులే హత్యచేసి ప్రమాదకరంగా చిత్రీకరిస్తున్నారని తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. గ్రామంలోని పొలాలతో పాటు తాండూరులో ఇంటి స్థలాలు తమకు ఉన్నాయని, వాటిని కాజేయడడానికి తన మేనమామ గొల్ల మొగులప్ప, మేనత్తలు గొల్ల కమలమ్మ, మొగులమ్మతో పాటు మరికొందరు కలిసి హత్యచేశారని ఆరోపించాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని వారు బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కోరారు. విచారణకు ఆదేశించాం మాసన్పల్లి గ్రామానికి చెందిన రైతు కమలప్ప మృతిపై మొదట ఫిర్యాదు చేయడానికి కుటుంబసభ్యులు వెనకాడారు. పోస్టుమార్టం కూడా వద్దన్నారు. ఆ తర్వాత ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశాం. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు లోతుగా విచారణ చేపట్టాలని తాండూరు గ్రామీణ సీఐకి ఆదేశించాం. అన్ని కోణాల్లో విచారణ చేస్తాం. పోస్టుమార్టం, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా కేసును త్వరగా చేధిస్తాం. – లక్ష్మీనారాయణ, డీఎస్పీ -
ప్రేమ, పెళ్లి అంటూ కట్నం తీసుకొని ఇప్పుడేమో..
మంచాల: ప్రేమించి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు తప్పించు తిరుగుతున్నాడని యువతి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం.. మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన మార మల్లేశ్ బీఈడీ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయితే మల్లేశ్ నాలుగేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెను పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. నాలుగు నెలల క్రితం పెళ్లి విషయమై అమ్మాయి ఒత్తిడి చేయడంతో మల్లేశ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. దీంతో గ్రామపెద్దలు, ఇరు కుటుంబాలకు చెందిన వారు పోలీస్‌స్టేషన్‌లో పంచాయతీ పెట్టారు. అనంతరం గ్రామపెద్ద సçమక్షంలో మల్లేశ్ తనకు రెండెకరాల భూమి, రూ.20 లక్షలు కట్నం కావాలని డిమాండ్ చేశాడు. దీంతో గ్రామపెద్దలు ఎకర భూమి, రూ.10 లక్షలు కట్నం ఇప్పిస్తామని ఒప్పించారు. రూ.2 లక్షలు నగదు అప్పుడే కట్నం కింద మల్లేశ్‌కు ఇచ్చారు. అప్పుడే పోలీస్‌స్టేషన్ ఆవరణలో వారిద్దరూ పూలదండలు మార్చుకున్నారు. అయితే పెళ్లి విషయంలో మాత్రం ఎలాంటి కదలిక రాలేదు. ఇప్పుడు మంచి రోజులు లేవు. మంచి రోజుల్లో పెళ్లి చేసుకుంటానని ఆ యువతికి చెబుతూ వస్తున్నాడు. ఇలా ఎన్నాళ్లు కాలయాపన చేస్తారని శుక్రవారం గ్రామంలో పంచాయతీ పెట్టి నిలదీశారు. అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరాలని పట్టుబట్టడంతో ఆ అమ్మాయిని ఇంట్లోకి రానిచ్చారు. రాత్రంతా ఇంట్లో ఉన్నారు. అయితే శనివారం తెల్లారేలోగానే తనకు పెళ్లి ఇష్టం లేదు, పెళ్లి వద్దంటూ అమ్మాయిని తీసుకొని మల్లేశ్ పోలీస్‌స్టేషన్ వచ్చాడు. ఇలా మరోసారి వీరి ప్రేమ వ్యవహారం పోలీస్‌స్టేషన్ చేరింది. అమ్మాయి మాత్రం మల్లేశ్‌నే పెళ్లి చేసుకుంటానని, తనకు న్యాయం చేయాలని కోరుతుంది. అమ్మాయి కుటుంబసభ్యులు కూడా తమ కూతురుకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. -
తండ్రిలాంటి వాడివంటూనే వలపు వల..
మొయినాబాద్ (చేవెళ్ల): తన ఆరోగ్యం బాగోలేదని, తనకోసం ప్రార్థనలు చేయాలంటూ ఓ మహిళ చర్చి ఫాదర్‌ను కోరింది. తన తండ్రిలాంటి వాడివంటూనే వలపు వల విసిరింది. తమకు హోటల్ బిజినెస్ ఉందని, చర్చికి అనుబంధంగా ఉన్న సంస్థకు విరాళాలు సైతం ఇస్తా మంటూ ఆశ చూపింది. పలుమార్లు అతడిని రెస్టారెంట్లకు భోజనానికి పిలిచింది. హోటల్ వ్యాపారంలో పెట్టుబడి కోసం రూ.10 లక్షలు కావాలంటూ అతడి వద్ద తీసుకుంది. ఓ రిసార్ట్‌కు తీసుకెళ్లి పళ్ల రసంలో మత్తుమందు కలిపి మాయ చేసింది. మత్తులో నుంచి తేరుకోగానే బొమ్మ పిస్తోల్‌తో భర్త ఎంట్రీ ఇచ్చాడు. ఫాదర్‌ను బెదిరించి రూ.కోటి బాకీ ఉన్నట్లు బాండ్ పేపర్ రాయించుకున్నారు. రూ.10 లక్షలు తీసుకుని మిగతా డబ్బుల కోసం వేధించడంతో చర్చి ఫాదర్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు భార్యాభర్తలను పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. మొయినాబాద్ మండలంలోని ఓ చర్చి వద్దకు ఆగస్టు 11వ తేదీన మందాకిని కనిష్క అనే మహిళ వచ్చింది. చర్చి ఫాదర్‌ను కలిసి తన ఆరోగ్యం బాగోలేదని.. తనకోసం ప్రార్థనలు చేయాలని కోరింది. ఇలా మూడుసార్లు చర్చికి వచ్చి ఫాదర్‌తో ప్రార్థనలు చేయించి అతడితో చనువు పెంచుకుంది. తన తండ్రిలాంటి వాడివని మాటలు చెప్పి నమ్మించింది. తమకు హోటల్ బిజినెస్ ఉందని, చర్చికి అనుబంధంగా ఉన్న సంస్థకు విరాళాలు కూడా ఇస్తామని చెప్పడంతో ఫాదర్ ఆ మాటలు నమ్మాడు. తాము కూడా సికింద్రాబాద్‌లో అనాథాశ్రమం నడుపుతున్నట్లు ఫాదర్‌కు చెప్పింది. ఫాదర్ ఫోన్ నంబర్ తీసుకుని తరచూ వాట్సప్ చాటింగ్ చేసేది. ఈ క్రమంలో శంషాబాద్ ప్రాంతంలో రెస్టారెంట్లో భోజనానికి పిలిచింది. మరోసారి అనాథ పిల్లలను వండర్లాకు తీసుకెళ్తున్నామని అక్కడికి పిలిచి ఫాదర్‌తో సెల్ఫీలు దిగింది. మరోసారి అనాథలకు సబంధించిన సినిమా అంటూ సినిమాకు తీసుకెళ్లింది. హోటల్ వ్యాపారంలో పెట్టుబడి అంటూ.. తన భర్త హోటల్ వ్యాపారం చేస్తాడని, విజయవాడలో కేఎఫ్‌సీ బ్రాంచి ఏర్పాటు చేస్తున్నామని, దానికి రూ.2 కోట్లు ఖర్చవుతుందని చర్చి ఫాదర్‌కు కనిష్క చెప్పింది. తమ వద్ద రూ.1.50 కోట్లు ఉన్నాయని, మీరు కూడా రూ.50 లక్షలు పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చెప్పింది. తన వద్ద అన్ని డబ్బులు లేవని.. తాను పెట్టుబడి పెట్టలేని చెప్పడంతో చేబదులుగా ఎన్ని డబ్బులు ఉన్నా ఇవ్వండని కనిష్క అడిగింది. దీంతో చర్చిఫాదర్ ఆమెను నమ్మి రూ.10 లక్షలు ఇచ్చాడు. రిసార్ట్‌కు పిలిచి.. డబ్బులు తీసుకున్న పది రోజుల తరువాత అక్టోబర్ 2వ తేదీన కేఎఫ్‌సీ ప్రతినిధులు శంకర్పల్లి లోని రిసార్ట్‌కు వస్తున్నారని, వారిని పరిచయం చేస్తానని అక్కడికి రావాలని ఫాదర్‌ను ఆమె కోరింది. రిసార్ట్‌లో ఓ కాటేజీ ఫాదర్‌కు, తనకు మరో కాటేజీ బుక్ చేసుకుంది. రాత్ర యినా కేఎఫ్‌సీ ప్రతినిధులు రాలేదు. అప్పటికే ఆకలి వేస్తుందని, తాను భోజనం చేస్తానని ఫాదర్ చెప్పాడు. తన కాటేజీలోనే కలిసి భోజనం చేద్దామని కనిష్క పిలిచింది. భోజనం కాస్త ఆలస్యమవుతుందని, అప్పటివరకు పండ్ల రసం తాగమని యాపిల్ జ్యూస్ ఇచ్చింది. అందులో మత్తుమందు కలపడంతో జ్యూస్ తాగిన ఫాదర్ మత్తులోకి జారుకున్నాడు. మత్తులో ఉన్న సమయంలో అతడితో కలిసి ఉన్నట్లు ఫొటోలు, వీడియోలు తీసుకుంది. మరుసటి రోజు వేకువజాము 4 గంటలకు ఫాదర్ లేచి చూసేసరికి బాత్రూంలో ఉన్నాడు. అదే సమయంలో కనిష్క భర్త విజయ్‌కుమార్ పిస్టల్‌తో ఫాదర్ కణతకు గురిపెట్టి చంపేస్తా నని బెదిరించాడు. నా భార్యను మోసం చేస్తావా అంటూ భయపెట్టాడు. ఫొటో లు, వీడియోలు ఉన్నాయని.. వాటిని బయటపెడితే నీ పరువు పోతుందని బెదిరించాడు. తమకు రూ.కోటి ఇస్తే ఇవి బయట పెట్ట మని రూ.కోటికి బాండ్‌పేపర్ రాయించుకున్నారు. ఆ తరువాత ఫోన్‌చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో రూ.10 లక్షలు ఇచ్చాడు. మరో వారం తరువాత మళ్లీ ఫోన్ చేసి మిగతా డబ్బులు ఇవ్వాలని వేధించడం మొదలుపెట్టారు. విషయం బయటకు వస్తే పరువు పోతుందని భావించిన ఫాదర్ లోలోనే మదనపడ్డాడు. ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించిన చర్చి ఫాదర్ ఎట్టకేలకు తన మిత్రుడితో ఈ విషయం పంచుకున్నాడు. ఆ తరువాత మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. కటకటాల్లోకి నిందితులు.. అక్టోబర్ 18వ తేదీన మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్‌లో కనిష్క, విజయ్‌కుమార్ దంపతులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి బాండ్ పేపర్లు, ఫొటోలు, వీడియోలు, సెల్ఫోన్లు, బొమ్మ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడం కోసమే బెదిరింపులకు పాల్పడినట్లు తేలడంతో పోలీసులు వారిద్దరినీ రిమాండ్‌కు పంపారు. హోటల్ వ్యాపారంలో నష్టం రావడంతో.. విజయవాడకు చెందిన మందాకిని కనిష్క గతంలో హైదరాబాద్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పని చేసింది. జగ్గయ్యపేటకు చెందిన విజయ్ కుమార్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి హోటల్ బిజినెస్ నిర్వహిస్తున్నాడు. ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసే సమయంలో కనిష్క విజయ్‌కుమార్ హోటల్‌కు వెళ్లేది. ఆ క్రమంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో గతేడాది పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత హోటల్ వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో ఏదో రకంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో చర్చి ఫాదర్‌పై వలపు వల పన్నారు. పథకం ప్రకారమే అతడిని మాయచేసి డబ్బులు గుంజారు. -
‘పండుగ’ను క్యాష్ చేసుకుందామని అడ్డంగా దొరికాడు
మహేశ్వరం: టపాసుల దుకాణం అనుమతి కోసం ఓ దుకాణదారుడి నుంచి లంచం అడగడంతో అగ్నిమాపక కార్యాలయం హెడ్ కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామానికి చెందిన కడారి దుర్గాప్రసాద్ గ్రామంలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. దీపావళి సందర్భంగా గ్రామంలో టపాసుల దుకాణం ఏర్పాటుకు అనుమతి కావాలని మహేశ్వరం అగ్నిమాపక కార్యాలయంలో సంప్రదించాడు. హెడ్ కానిస్టేబుల్ గురువయ్య దుకాణం ఏర్పాటుకు రూ.2,500 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇవ్వలేనని రూ.1,500 తీసుకోవాలని దుకాణదారుడు దుర్గాప్రసాద్ హెడ్ కానిస్టేబుల్‌ను కోరాడు. అనంతరం ఈ విషయాన్ని ఈ నెల 20వ తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు ఫోన్ రికార్డులను పరిశీలించి కేసు నమోదు చేసుకొని పథకం ప్రకారం శనివారం అగ్నిమాపక కార్యాలయంపై అధికారులు దాడి చేశారు. హెడ్‌కానిస్టేబుల్ గురవయ్యను విచారించి కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. మహేశ్వరం అగ్నిమాపక కార్యాలయం పరిధిలో మొత్తం 43 టపాసుల దుకాణాలకు అనుమతులు తీసుకున్నారు. ఒక్కో దుకాణదారుడి నుంచి రూ.2 వేల నుంచి 3 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకొని అనుమతి ఇచ్చిన 43 టపాసుల దుకాణదారులను విచారించి డబ్బులు తీసుకున్నట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సూర్యనారయణ తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్ గురువయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే 94404 46140లో సమాచారం ఇవ్వాలని కోరారు. -
ప్రేమించి పెళ్లి చేసుకొని పోషించలేక..
శంషాబాద్: విలాసాల కోసం ఓ యువకుడు చోరీల బాటపట్టాడు.. ప్రేమించి పెళ్లి చేసుకుని కుటుంబాన్ని విలాసవంతంగా ఉంచాలనే ఉద్దేశంలో మరో వ్యక్తి అదే చోరీలను ఎంచుకున్నాడు.. వేర్వేరుగా చోరీలు చేసి జైలు పాలైన ఇద్దరు స్నేహితులుగా మారి సుమారు ఇరవైకి పైగా వరుస చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను షాద్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి... షాబాద్ మండలం చర్లగూడెం గ్రామానికి చెందిన బాసుపల్లి ప్రవీణ్(27) పదవతరగతి వరకు చదువుకున్నాడు. విలాసవంతంగా బతకడానికి చోరీలనే మార్గంగా ఎంచుకున్నాడు. షాద్‌నగర్, కొత్తూరు పోలీస్స్టేషన్ల పరిధిలో పలు చోరీలు చేసి జైలుకు వెళ్లాడు. ఇదే సమయంలో మహబూబ్‌నగర్ పట్టణ షషాబ్గుట్ట ప్రాంతంలో నివాసముండే వడ్డె శేఖర్( 28) స్థానికంగా ఫొటోగ్రాఫర్‌గా పనిచేసే వాడు. ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన అతడి ఆదాయం చాలకపోవడంతో పాటు విలాసవంతంగా బతికేందుకు చోరీలు చేయడం ప్రారంభించాడు. మహబూబ్‌నగర్ టౌన్‌తో పాటు కేశంపేట పరిధిలో పలు చోరీలకు పాల్పడి జైలుకెళ్లాడు. ప్రవీణ్, శేఖర్లు జైలులో స్నేహితులుగా మారారు. అక్కడి నుంచి వీరు మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 16 చోరీలకు పాల్పడ్డారు. దుకాణాల షట్టర్లు తొలగించడం చైన్ స్నాచింగ్, బైక్‌లు చోరీ చేయడం ప్రారంభించారు. రాచకొండ పరిధిలో ఒకటి, షాద్‌నగర్ 5 కేసులు నమోదయ్యాయి. సోమవారం షాద్‌నగర్‌లో చేపట్టిన వాహనాల తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా కనిపించిన వీరిని షాద్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టి ఐదు ద్విచక్రవాహనాలు, 22.5 గ్రాముల బంగారం, 62 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. చోరీల్లో ప్రధాన నిందితుడైన ప్రవీణ్‌పై పీడీ యాక్టు నమోదు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. కేసును ఛేదించిన షాద్‌నగర్ ఏసీపీ వి.సురేందర్, సీఐ సుధీర్‌కుమార్, డీఐ తిరుపతిని డీసీపీ ఈ సందర్భంగా అభినందించారు. -
ఆపరేషన్లకు పిలిచి.. పట్టించుకోలేదు
తాండూరు: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (కుని) శిబిరం నిర్వహణ లోపంతో గందరగోళంగా నెలకొంది. ఆపరేషన్లు చేస్తామని గ్రామాల నుంచి మహిళలను రప్పించారు. తీరా టార్గెట్ పూర్తయిందని వైద్యులు ఆపరేషన్లను నిలిపి వేశారు. దీంతో మహిళలు, మహిళల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని జిల్లా ఆస్పత్రి పీపీ యూనిట్ విభాగంలో సోమవారం పెద్దేములో మండలానికి చెందిన మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు శిబిరం ఏర్పాటు చేశారు. దీంతో పలు గ్రామాల నుంచి మహిళలు కుటుంబసభ్యులతో వచ్చారు. పీపీ యూనిట్ ఇన్చార్జి శ్రీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో గైనకాలజిస్ట్ జయమాలిని, అనస్థిషియా సాకేత్‌తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యులు మరియాఆఫ్రిన్, శ్రావణ్‌కుమార్ ఆపరేషన్లు చేశారు. మొత్తం 78 మంది మహిళలకు ఆపరేషన్లు చేయించుకునేందుకు వైద్య సిబ్బంది రిజిస్టర్లో పేర్లు నమోదు చేసుకున్నారు. అంతకు మించి మహిళలు ఆపరేషన్లు చేయించుకోవడానికి ముందుకొచ్చారు. అయితే వైద్యులు 70 మంది మహిళలకు మాత్రమే ఆపరేషన్లు చేసి వెళ్లి పోయారు. ఆపరేషన్ చేయాలని ఆందోళన ఆస్పత్రికి వచ్చిన మహిళలందరికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని వారు ఆందోళనకు దిగారు. ఆపరేషన్లు చేయించుకోవాలని గ్రామాల్లో ఆశవర్కర్లు తమ ఆధార్ కార్డు వివరాలను, పేర్లను నమోదు చేసుకోవడంతోనే ఆస్పత్రికి వచ్చామని వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో ఆస్పత్రిలోని ధియేటర్ను ముట్టడించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వైద్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ గఫార్ పోలీసులతో కలిసి మహిళలకు, వారి కుటుంబ సభ్యులను నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. కనీస వసతులు కరువు జిలా ప్రభుత్వ ఆస్పత్రిలోని పీపీ యూనిట్లో జరిగిన కుటుంబ నియంత్రణ శిబిరంలో ఆపరేషన్లు చేయించుకునే మహిళలకు, కుటుంబ సభ్యులకు కావాల్సిన కనీస వసతులను కల్పించడంలో పీపీ యూనిట్ నిర్వాహకులు విఫలమయ్యారు. దీంతో ఆపరేషన్ చేయించుకున్నాక మహిళలను అరగంట పాటు విశ్రాంతి తీసుకోకుండానే వారిని వార్డులో నుంచి పంపించారు. దీంతో పరేషన్ చేయించుకున్న మహిళలు ఆస్పత్రి ఆవరణలో నేలపై పడుకుని అవస్థలు పడ్డారు. 50 మందికి మాత్రమే ఆపరేషన్లు చేయాలి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ను 50 మందికి మాత్ర మే చేస్తాం. అయితే పెద్దేముల్ మండలం నుంచి మహిళలు అధికసంఖ్యలో వచ్చారు. అయితే 70మంది మహిళలకు ఆపరేషన్లు చేశారు. మరోసారి శిబిరం ఏర్పాటు చేస్తే మిగిలిన వారికి ఆపరేషన్లు చేస్తాం. – శ్రీకాంత్‌రెడ్డి, పీపీ యూనిట్ ఇంచార్జ్ -
చిరుత దాడిలో మూడు దూడలు మృతి
ఆమనగల్లు: చిరుత మళ్లీ పంజా విసిరింది. ఆమనగల్లు మండలం మంగళపల్లి గ్రామ సమీపంలో ఉన్న మూడు దూడలపై ఆదివారం రాత్రి చిరుత దాడి చేసింది. ఈ దాడిలో దూడ అక్కడికక్కడే మృతిచెందగా మరో రెండు దూడలు సాయంత్రం మృతిచెందాయి. మంగళపల్లి గ్రామ సమీపంలో బాపురెడ్డి, శ్రీను తమ వ్యవసాయ పొలాల వద్ద పశువులను ఉంచారు. తెల్లవారుజామున రైతులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిచూడగా దూడ చనిపోగా మిగతా రెండు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. సమీపంలో ఉన్న పాదముద్రలను చూసి చిరుత దాడి చేసినట్లుగా రైతులు గుర్తించారు. రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని మంగళపల్లి సర్పంచ్ నర్సింహారెడ్డి పరిశీలించారు. చిరుత దాడిలో ఇప్పటికే ఆరు ఆవు దూడలు మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చిరుతను త్వరగా బంధించాలని రైతులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. -
150 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
సాక్షి, తాండూరు: వందల క్వింటాళ్లు రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారనే పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం విజిలెన్స్, సివిల్‌సప్లయ్, పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ చంద్రమౌలి, సివిల్ సప్లయి తహసీల్దార్లు నందిని, పద్మ, రూరల్ సీఐ జలేంధర్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన వడ్డె వెంకటేశం గత కొంతకాలంగా రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని గౌతంపూర్ శివారులో ఉన్న రిలయన్స్ పెట్రోల్ బంక్ వెనకాల ఓ గదిలో 150 క్వింటాళ్ల (15టన్నుల) రేషన్ బియ్యంను అక్రమంగా నిల్వ ఉంచారు. పక్కా సమాచారంతో విజిలెన్స్, సివిల్ సప్లయ్ అధికారులు ఆ ఇంటిపై ఆదివారం దాడులు చేశారు. కాగా ఆ గదిలో 450 బస్తాల రేషన్ బియ్యం ఉన్నాయి. ఇందులో 300 బస్తాల దొడ్డు బియ్యం, 150 బస్తాల నూకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని తాండూరులోని స్టాక్‌పాయింట్‌కు తరలించారు. సంబంధిత వ్యాపారులు రేషన్ బియ్యం సేకరించి కొడంగల్, జహీరాబాద్ మీదుగా కర్ణాటకకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంత్సరాలుగా ఇలా సేకరిస్తున్న రేషన్‌బియ్యాన్ని ఇక్కడ నిల్వ ఉంచి.. వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. తాండూరులో ఈ అక్రమ దందా కొనాసాగుతున్న ఈ దాడులు నిర్వహించినవారిలో కరన్‌కోట్ ఎస్ఐ సంతోష్‌కుమార్ ఉన్నారు. కేసు నమోదు చేశాం గౌతపూర్లోని రిలయన్స్ పెట్రోల్‌బంక్ వెనకాల ఓ గదిలో 15 టన్నులు అక్రమంగా రేషన్‌బియ్యం ఉన్నట్లు గుర్తించాం. రేషన్‌బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన సంబంధిత వ్యక్తి (వెంకటేశ్)పై క్రిమినల్ కేసుతో పాటు 6ఏ కేసు నమోదు చేశాం. కేసు నమోదు తర్వాత జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ ఉంటుంది. – నందిని, తహసీల్దార్, సివిల్‌సప్లయ్, వికారాబాద్ -
రైతుబంధు సహాయం మరొకరి ఖాతాలోకి..
సాక్షి, తాండూరు: వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతో ఓ మహిళ రైతుబంధు డబ్బులు మరొకరి బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. సంబంధిత రైతు ఖాతాలో పడాల్సిన డబ్బులు హైదరాబాద్‌లోని ఓ వ్యక్తి ఖాతాలో పడ్డాయి. తాండూరు మండలం గౌతపూర్ గ్రామానికి చెందిన జెన్నె ఎల్లమ్మకు అల్లాపూర్ గ్రామ సమీపంలో సర్వే నంబర్ 200, 201లో 4.35 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం చేస్తూ ఆమె జీవిస్తోంది. అయితే ఆమెకు అందించాల్సిన రైతుబంధు పెట్టుబడి సహాయం ఆమె ఖాతాలో జమ కాలేదు. తనకు డబ్బులు పడలేదని ఆమె వ్యవసాయ అధికారులు, ఆంధ్రాబ్యాంక్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోంది. అయితే ఆమెకు రావాల్సిన 2018, 2019 కు సంబంధించిన రైతుబంధు డబ్బులు ఆమె ఖాతాలో కాకుండా ఇతరుల ఖాతాల్లో పడ్డాయని సమాచారం తెలిసింది. హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌కు సంబంధించిన సిండికేట్ బ్యాంక్ ఖాతా ఉన్న ఓ వ్యక్తి ఖాతాలో జమ అయినట్లు అధికారులు చెప్పారు. దీంతో ఎల్లమ్మ కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు వెళ్లి సిండికేట్ బ్యాంకులో వెళ్లి నగదు విషయమై బ్యాంక్ అధికారులను అడగ్గా తిరస్కరించారు. దీంతో ఎల్లమ్మ తాండూరులోని వ్యవసాయ కార్యాలయం చుట్టూ రైతుబంధు డబ్బుల కోసం తిరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ ఉన్నతాధికారులు స్పందించి రైతుబంధు డబ్బులు ఎల్లమ్మ ఖాతాలో జమ చేయాలని కోరుతున్నారు. -
చంపేసి.. కాల్చేశారు
సాక్షి, ఇబ్రహీంపట్నం: పాత కక్షల నేపథ్యంలో సొంత బంధువులే ఓ వ్యక్తిని కిరాతంగా హత్య చేసి మృతదేహాన్ని కాల్చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్టేషన్ పరిధిలో శుక్రవారం అలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది. ఏసీపీ యాదగిరిరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. హయత్‌నగర్‌కు చెందిన జక్కుల కిషన్(42) భార్య గతంలో చనిపోయింది. ఈయనకు ఇంటర్ చదువుతున్న కూతురు మీనాక్షి, పదో తరగతి చదువుతున్న కుమారుడు అరుణ్ ఉన్నాడు. కిషన్ కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నాడు. ఇతడికి పొల్కంపల్లి అనుబంధ గ్రామాలైన మాన్యగూడ, నెర్రపల్లిలో ఉన్న బంధువులతో పాతకక్షలు, గొడవలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈక్రమంలో అతడు గత నెల 31న చుట్టాల వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరి తిరిగి రాలేదు. దీంతో ఆయన కూతురు మీనాక్షి ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 6న ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జరిగింది ఇదీ.. మాన్యగూడకు చెందిన గునుకుల ఐలయ్య కిషన్‌కు ఫోన్ చేసినట్లు కాల్‌డేటా ద్వారా పోలీసులు గుర్తించారు. ఈమేరకు ఐలయ్యను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేపట్టగా కిషన్ హత్యకు సంబంధించిన వివరాలు తెలిపాడు. కుటుంబ గొడవలు, పాతకక్షల నేపథ్యంలో కిషన్‌ను హతమార్చాలని ఐలయ్యతో తన కుమారులు సురేష్, నరేష్, అల్లుడు కృష్ణతోపాటు బంధువులైన నెర్రపల్లికి చెందిన శేఖర్, శ్రీశైలం, నరేష్‌తో కలిసి పథకం పన్నాడు. గత 31న కిషన్ నెర్రపల్లికి వచ్చాడని తెలుసుకున్న వీరు మాన్యగూడకు రావాలని చెప్పారు. దీంతో స్కూటర్‌పై రాత్రిపూట బయలుదేరిన కిషన్‌ను దారి కాచి గొడ్డళ్లు, కొడవళ్లు, కర్రలతో దాడిచేసి అతి కిరాతకంగా హతమార్చారు. అనంతరం రాయపోల్ గ్రామ సమీపంలోని ఓ వెంచర్లో తీసిన ఓ కందకంలో మృతదేహాన్ని పడేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. మరుసటి రోజు తిరిగి అక్కడికి వచ్చి మట్టితో కప్పేశారు. విచారణలో భాగంగా ఐలయ్య ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కిషన్ మృతదేహాన్ని వెలికితీశారు. దాదాపు 20 రోజుల క్రితం మృతదేహాన్ని తగులబెట్టి పూడ్చివేయడంతో కేవలం కిషన్ అస్థిపంజరం మాత్రమే మిగిలింది. తహాసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏసీపీ యాదగిరిరెడ్డి, సీఐ గురువారెడ్డి సమక్షంలో ప్రభుత్వ వైద్యుడు హనుమంతురావు పోస్టుమార్టం నిర్వహించారు. కన్నీరుమున్నీరైన పిల్లలు కిషన్ హత్యతో పిల్లలు మీనాక్షి, అరుణ్‌తోపాటు బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. గతంలో తల్లి మృతి, ప్రస్తుతం తండ్రి హత్యతో పిల్లలు అనాథలయ్యారు. కిషన్ నిందితుడు ఐలయ్య చిన్నమ్మ కుమారుడు. పాత కక్షల నేపథ్యంలో అతడిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో నిందితులు కిషన్ హత్యలో ఏడుగురికి సంబంధం ఉందని, ఐలయ్యను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ యాదగిరిరెడ్డి తెలిపారు. ప్రత్యేక బృందాలతో మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలో పట్టుకుంటామని తెలిపారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చామని పేర్కొన్నారు. హత్యకు గల పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. -
అదృశ్యమై.. హీరో ఫాంహౌస్‌లో అస్థిపంజరంలా తేలాడు
అన్నంటే అతడికి ప్రాణం.. ఒకరినొకరు విడిచి క్షణమైనా ఉండే వారు కాదు.. రక్తం పంచుకొని పుట్టిన అన్న అనారోగ్యానికి గురై మృతిచెందాడు.. అన్న లేని జీవితం వ్యర్థమని.. తాను కూడా ఇక తనువు చాలిస్తానంటూ లేఖ రాసి పెట్టిన ఓ యువకుడు.. నాలుగేళ్ల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. బుధవారం అస్థి పంజరమై కనిపించాడు. ఈ సంఘటన కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో చోటుచేసుకుంది. సాక్షి, కేశంపేట (షాద్‌నగర్): నాలుగేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తి బుధవారం అస్థిపంజరమై కనిపించాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలంలోని పాపిరెడ్డిగూడలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న అంజయ్య, అంజమ్మ దంపతులకు హన్మంత్, రాజు, కుమార్, పాండు నలుగురు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు పాండు (32) నాలుగేళ్ల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వీరికి ఫరూఖ్‌నగర్ మండలం వెలిజర్ల గ్రామ శివారులో కొంత వ్యవసాయ పొలం ఉంది. కుమార్, పాండు మధ్య అనుబంధం విడదీయలేనిది. అయితే నాలున్నరేళ్ల కిందట కుమార్‌కు వివాహమైంది. పెళ్లయిన కొద్ది నెలలకే అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో కుటుంబం తట్టుకోలేకపోయింది. ముఖ్యంగా పాండు తన అన్న మృతితో కుంగిపోయాడు. కుమార్ వైద్యం కోసం కుటుంబసభ్యులు ఉన్న భూమిని అమ్మేశాడు. ఆ అప్పును చిన్న కుమారుడు పాండు తరచూ కుటుంబసభ్యులతో చెప్పేవాడు. అయితే అప్పులు ఎంతకీ తీరే మార్గం కనిపించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో కుటుంబసభ్యులు తమ భూమిని అమ్మేశారు. ప్రాణంగా ఇష్టపడే అన్న మృతిచెందడం.. ఇటు తనకు ఇష్టమైన వ్యవసాయ భూమిని విక్రయించడాన్ని తట్టుకోలేకపోయిన పాండు తాను చనిపోతున్నానంటూ లేఖ రాసి అదృశ్యమయ్యాడు. అమ్మంటే తనకు చాలా ఇష్టమని.. ఆమెను బాగా చూసుకోవాలని లేఖలో పేర్కొన్నాడు. అన్న కుమార్ పెళ్లి సందర్భంగా తనకు తెచ్చిన దుస్తులు వేసి అంతిమసంస్కారాలు జరిపించాలని లేఖలో కోరాడు. నాలుగేళ్ల క్రితం పాండు రాసిన సూసైడ్ నోట్ నాగార్జున ఫాంహౌస్‌లో అస్థిపంజరం.. నాలుగేళ్ల క్రితం ఇంట్లో నుంచి అదృశ్యమైపోయిన పాండు హీరో నాగార్జున పాపిరెడ్డిగూడ గ్రామ శివారులో కొనుగోలు చేసిన ఫాంహౌస్‌లోని ఓ భవనంలో అస్థిపంజరమై కనిపించాడు. అయితే పాండుకు సంబంధించిన వ్యవసాయం పొలం పక్కనే నాగార్జున ఫాంహౌస్ ఉండడం, దీనికి చివరలో ఓ పాత భవనం ఉండడంతో అక్కడకు ఎవరూ వెళ్లేవారు కాదు. లేఖ రాసి పెట్టిన పాండు నేరుగా ఇక్కడకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, చేవెళ్ల ఏసీపీ వెంకట్‌రెడ్డి, సీఐలు రామకృష్ణ, చంద్రబాబు, కేశంపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు గురువారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి సంబంధించిన వివరాల కోసం ఆరా తీశారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధార్‌కార్డులు, ఐడీ కార్డులు, చెప్పులు, ఇయర్ఫోన్లు, ఒక జత దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు పాపిరెడ్డిగూడకు చెందిన పాండుగా గుర్తించారు. ఇతను కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వీఆర్వో మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
విద్యార్థినిని కిడ్నాప్‌కు యత్నించలేదు
సాక్షి, ఆమనగల్లు: పదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆటోతో పాటు ఒమన్ దేశానికి చెందిన ఓ నిందితుడి పాస్‌పోర్ట్‌ను సీజ్ చేశారు. గురువారం సాయంత్రం కస్తూర్బా గాంధీ గిరిజన విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న బాలిక తన స్వగ్రామానికి వెళ్తుండగా ఆటోలోని యువకులు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కిందికి దూకడంతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. శుక్రవారం స్థానిక ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ నర్సింహారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. కడ్తాల మండలం నార్లకుంట తండాకు చెందిన బాలిక ఆమనగల్లులోని కస్తూర్బా గాంధీ గిరిజన విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. బాలిక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నిత్యం స్వగ్రామం నుంచి పాఠశాలకు వచ్చి వెళ్తుండేది. ఈక్రమంలో గురువారం సాయంత్రం 5.30 గంటలకు బాలిక నార్లకుంట తండాకు వెళ్లేందుకు జాతీయ రహదారిపై నిలబడి ఉంది. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న ఆటోను చూసి ప్యాసింజర్ ఆటోగా భావించి ఆపి అందులో ఎక్కింది. ఆటోలో ఉన్న యువకుడు విద్యార్థినిని పొగతాగుతావా.. అంటూ చేయి పట్టుకున్నాడు. అసభ్యంగా ప్రవర్తించడంతో తీవ్ర భయాందోళనకు గురై ఆటోలో నుంచి కిందికి దూకడంతో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి.. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఘటన విషయం వెంటనే విఠాయిపల్లి సమీపంలో ఆటోతోపాటు అందులో ఉన్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. బాధితురాలి వాంగ్మూంలం మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన యువకులు ఇమ్రన్ హుస్సేన్(ఒమన్ దేశస్తుడు), మహ్మద్ సాజిద్(చంద్రాయణగుట్ట)గా గుర్తించి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరూ స్నేహితులు. ఆటోతోపాటు ఇమ్రాన్ హుస్సేన్ పాస్‌పోర్టును సీజ్ చేశామన్నారు. అయితే, మహబూబ్‌నగర్ పరిసర ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతలను చూసేందుకు నిందితులు ఇద్దరూ మూడు రోజుల క్రితం బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. ఇమ్రన్ హుస్సేన్ తల్లి పాతనగరవాసి, తండ్రి ఒమన్ దేశస్తుడు. ఇతడు తరచూ మేనమామల ఇంటికి వస్తుంటాడని సీఐ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. విలేకర్ల సమావేశంలో ఆమనగల్లు ఎస్ఐ ధర్మేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: విద్యార్థినితో ఆటోడ్రైవర్ అసభ్య ప్రవర్తన -
ఏసీబీకి చిక్కిన లైన్మెన్
సాక్షి, రంగారెడ్డి : గృహ వినియోగ విద్యుత్ మీటర్ కోసం లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు లైన్మెన్ చిక్కాడు. పెద్దషాపూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని తొండుపల్లి, ఊట్పల్లి, చౌదరిగూడ లైన్మెన్గా కాశీరాం పనిచేస్తున్నాడు. ఊట్పల్లి పరిధిలోని సదరన్ వెంచర్లో ఇంటిని నిర్మించుకుంటున్న తిరుపతిరెడ్డికి గృహ వినియోగ విద్యుత్ మీటర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ పనికోసం లైన్మెన్ రూ.40 వేలు లంచం డిమాండ్ చేశాడు. తాను డబ్బులు ఇవ్వలేనని తిరుపతిరెడ్డి చెప్పడంతో లైన్మెన్ మీటర్ బిగించకుండా ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో తిరుపతిరెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఒప్పందం మేరకు ఇటీవల రూ.20 వేలు ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ సమాచారాన్ని ఏసీబీకి తెలపడంతో సోమవారం ఆ నగదు కాశీరాంకు ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీపీబీ డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు మాజీద్ అలీ, నాగేందర్‌గౌడ్ కేసు దర్యాప్తు చేపడుతున్నారు. కాశీరాం గతంలో పనిచేసిన శంషాబాద్, పాలమాకుల పరిధిలో కూడా అనేకమంది గృహ, పారిశ్రామిక యజమానులకు లంచాల కోసం ఇబ్బందులు పెట్టేవాడని ఆరోపణలు ఉన్నాయి. -
మైకుల వైర్లు కట్ చేయించిన ఎస్సై!
సాక్షి, ధారూరు: మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వినాయకుల ఊరేగింపులో ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఓవరాక్షన్ చేసి హల్చల్ చేశారు. దీంతో యువత, భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఎస్ఐ ఎవరికీ చెప్పకుండా మైకులకు ఉన్న వైర్లను కట్‌చేసి సౌండ్ సిస్టంను బంద్ చేయించారు. దీంతో యువకులతోపాటు భక్తులు ఆందోళనకు దిగారు. మైకులకు అనుమతి ఇవ్వకుంటే వినాయక విగ్రహాలను కదలనివ్వమని, పోలీస్‌స్టేషన్‌లో విగ్రహాలను పెడతామని, పోలీసులే నిమజ్జనం చేసుకోవాలని స్పష్టం చేశారు. కొద్దిసేపు ఎస్ఐ పట్టించుకోకుండా ఊరుకున్నారు. దీంతో యువకులు పోలీసుల వాహనం ఎదుట బైఠాయించారు. ‘జై బోలో.. గణేశ్ మహరాజ్ కీ జై’ అంటూ నినదించారు. చివరకు ఎస్ఐ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో సర్పంచ్ చంద్రమౌలి, గ్రామస్తులు చర్చలు జరిపారు. ధారూరు సీఐ రాజశేఖర్ జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో ఎస్ఐ మిన్నుకండిపోయారు. అనంతరం యువకులు శాంతించి నిమజ్జనం పూర్తి చేయడంతో సమస్య సద్దుమణిగంది. -
కల్యాణలక్ష్మి డబ్బు కావాలని భర్త వేధింపులు
సాక్షి, రాజేంద్రనగర్: కట్నం వేధింపులు తాళలేక ఓ నవవధువు తనువు చాలించింది. కోటి ఆశలతో అత్తింట్లో కాలు పెట్టిన ఆమె భర్త వేధింపులకు విసుగుచెందిన ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ పట్టణానికి చెందిన మమత(24)ను మూడు నెలల క్రితం గండిపేట మండలం గంధంగూడ వెస్టెండ్ కాలనీకి చెందిన సురేష్‌కుమార్ వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో మమత కుటుంబసభ్యులు బంగారం, నగదుతోపాటు ఇతర వస్తువులను అందజేసి ఘనంగా వివాహం చేశారు. సురేష్‌కుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, పెళ్లి తర్వాత నెలరోజుల నుంచి అతడు అద నపు కట్నంతోపాటు కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకొని ఆ డబ్బు తీసుకురావాలని భార్యను వేధించసాగాడు. దీంతో మమత విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. ఇటీవల అల్లుడి వద్దకు వచ్చిన వారు మూడు నెలల క్రితమే వివాహం చేశామని, ప్రస్తుతం కట్నం డబ్బు లేదని, త్వరలో సమకూర్చి అందజేస్తామని నచ్చజెప్పి వెళ్లిపోయారు. అప్పటి నుంచి సురేశ్ భార్యతో మాట్లాడడం మానేశాడు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు తన కుటుంబీకులు, తల్లిదండ్రులకు చెప్పి కన్నీటిపర్యంతమైంది. ఈక్రమంలో తీవ్ర మనస్తాపం చెందిన మమత గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం విధుల నుంచి వచ్చిన సురేశ్ విషయాన్ని గమనించి పోలీసుకలు సమాచారం ఇచ్చాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. మమత మృతదేహం -
నిండు చూలాలు దారుణ హత్య
సాక్షి, పరిగి: నిండు చూలాలును దారుణంగా హతమార్చి రోడ్డు పక్కన పడేసిన సంఘటన పరిగి మండలం రంగంపల్లి శివారులో గురువారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. రంగంపల్లి శివారులోని హైదరాబాద్– బీజాపూర్ రహదారి పక్కన గుంతల్లో కాలిపోయిన స్థితిలో ఉన్న ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. పరిగి డీఎస్పీ రవీంద్రారెడ్డి, ఎస్ఐ చంద్రకాంత్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఒక్క ఎడమకాలి పాదం మినహా పూర్తిగా ఆమె శరీరం కాలిపోయి ఉంది. 20 నుంచి 25 ఏళ్ల వయసున్న యువతి అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాళ్లకు మెట్టెలు, మెడలో మంగళసూత్రంలాంటివి లేకపోవడం, ఆమె జననాంగాలకు ఆనుకుని గర్భస్థ శిశువు పడి ఉంది. ఎక్కడో హత్య చేసిన దుండగులు బుధవారం రాత్రి ఇక్కడ పడవేసి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారై ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను తప్పుతోవ పట్టించేందుకే ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారా..? అని భావిస్తున్నారు. వాహనం తచ్చాడిన గుర్తులను బట్టి కారులో తీసుకువచ్చి పడేసి ఉంటారని గుర్తించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు.. సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పరిగి లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఆయా పోలీస్స్టేషన్లకు పంపించి మిస్సిం గ్ కేసుల విషయంలో ఆరా తీస్తున్నారు. చుట్టు పక్కల పోలీస్స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అబార్షన్ వికటించిందా..? లభ్యమైన మృతదేహం గర్భవతి కావడంతో పాటు అవివాహితగా అనుమానిస్తున్న పోలీసు లు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాం పక్కన ఆస్పత్రిలో పేషెం ట్లకు కప్పే బట్ట లభ్యం కావడం సంఘటన వెనక మరో కోణాన్ని వెలుగులోకి తెస్తోంది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో గుట్టుగా అబార్షన్ చేయిం చేందుకు ప్రయత్నించి అది వికటించడంతో యువతి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. మృతి చెందాక మృతదేహాన్ని, శిశువును తీసుకువచ్చి ఇక్కడ పడేసి నిప్పంటించి పరారై ఉంటారా...? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా కనిపించకుండాపోయిన వారు ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు. 94406 27360, 94406 27275లలో తమను సంప్రదించాలని సూచించారు. -
భార్యతో గొడవపడి.. పిల్లలను అనాథలు చేశాడు
సాక్షి, కడ్తాల్: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్యతో గొడవపడి క్షణికావేశానికి గురై ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కడ్తాల్ మండల కేంద్రంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్ఐ సుందరయ్య, స్థానికుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం రాణిపేట్ గ్రామానికి చెందిన మహ్మద్ ముజీబ్(38) కడ్తాల్ మండలం న్యామతాపూర్‌కు చెందిన సలేహాబేగంను కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. స్వగ్రామంలో ఉపాధి లేక పోవడంతో బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం దంపతులు కడ్తాల్ మండల కేంద్రానికి వచ్చారు. స్థానికంగా శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన తలకొండపల్లి చౌరస్తాలో ముజీబ్ పంక్చర్ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల మద్యానికి బానిసైన ముజీబ్ తరచు భార్య సలేహాబేగంతో గొడవపడుతున్నాడు. మద్యం మానేయాలని భార్య పలుమార్లు అతడిని కోరినా ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా గురువారం ఉదయం భార్యాభర్తల మధ్య మరోమారు గొడవ జరిగింది.అప్పటికే మద్యం మత్తులో ఉన్న ముజీబ్ భార్యను కొట్టాడు. ఆమె ఇంటి అవరణలో నిద్రించింది. ఈక్రమంలో క్షణికావేశానికి గురైన ముజీబ్ 11 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు భార్యతో పాటు, పోలీసులు, బంధువులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ సీతారాంరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. స్థానిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతుడి భార్య సలేహాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుందరయ్య తెలిపారు. మృతుడికి కూతుళ్లు సుమాయ, హయిసా, కుమారుడు సోహైల్ ఉన్నారు. రోదిస్తున్న భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు, స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు మా నాన్నకు ఏమైంది.. ముజీబ్ ఆత్మహత్యతో భార్యాపిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. దంపతులకు ఐదోతరగతి చదువుతున్న సుమాయ, నాలుగో తరగతి చదువుతున్న కూతుళ్లు హయిసాతో పాటు 1వ తరగతి చదువుతున్న కొడుకు సోహైల్ ఉన్నారు. వీరంతా స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ఇదిలా ఉండగా నిత్యం మధ్యాహ్నం సమయంలో సలేహాబేగం పాఠశాలకు వెళ్లి పిల్లలకు అన్నం తినిపించి వచ్చేది. గురువారం మాధ్యాహ్నం తల్లి పాఠశాలకు రాకపోవడంతో చిన్నారులు ముగ్గురు భోజనం కో సం స్కూల్‌కు సమీపంలో ఉన్న ఇంటికి వచ్చారు. తండ్రి ఆత్మహత్య చేసుకున్న విష యం వీరికి తెలియదు. ఇంటి ఆవరణలో అప్పటికే జనం పెద్దసంఖ్యలో గుమిగూడి ఉండడంతో వారికి ఏమీ అర్థం కాలేదు. బిక్కుబిక్కుమంటూ ఇంట్లోకి వెళ్లి చూశారు. తండ్రి విగతజీవిగా పడి ఉండడం, తల్లి రోదిస్తుండడం చూసి విషయం తెలిసింది. మా పప్పాకు ఏమైందని పలువురిని అడిగారు. కొంత సేపటికి విషయం తెలుసుకొని ‘పప్పా..’ అంటూ గుండెలుబాదుకుంటూ రోదించిన తీరు హృదయ విదారకం. చిన్నారుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. -
ఠాణా ఎదుట ఆత్మహత్యాయత్నం
సాక్షి, కొత్తూరు: భూమి విషయంలో పోలీసులు తమను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ తండాకు చెందిన పలువురు రైతులు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ధర్నా చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఓ గిరిజన యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎస్ఐ కృష్ణతో పాటు షాద్‌నగర్‌కు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి భూమికి సంబంధించిన గొడవలో జోక్యం చేసుకుంటూ తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని, వ్యాపారులతో కుమ్మక్కై తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. ఈ క్రమంలో తండాకు చెందిన యువకుడు రాజేందర్ స్టేషన్ ఆవరణలో సీఐ, ఎస్ఐ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. వెంటనే తండావాసులు అప్రమత్తమై అతడి నుంచి డబ్బాను లాక్కొని నీళ్లు చల్లారు. అనంతరం మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. సివిల్ విషయంతో పోలీసులు తలదూర్చమని హమీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని భీష్మించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఇముల్‌నర్వ గ్రామ శివారులో సర్వే నంబర్ 293, 295, 296, 307, 309, 325లోని సుమారు 64 ఎకరాల భూమిని కొన్నేళ్లుగా తాము కాస్తులో ఉండి సాగు చేసుకుంటున్నామని, అయితే ఇటీవల తమ తండావాసులు కొందరు భూమిని విక్రయించారని తెలిపారు. ఆ భూములను కొనుగోలు చేసిన వ్యాపారులు మధ్యలో ఉన్న పొలాలకు దారి ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. మాజీ సర్పంచ్ అరెస్టుతో.. ఇన్ముల్‌నర్వ తండాకు చెందిన మాజీ సర్పంచ్ మిట్టునాయక్ గురువారం ఉదయం జేపీ దర్గా ఆవరణలో ఉండగా కొత్తూరు ఎస్ఐ కృష్ణ, సీఐ చంద్రబాబు అతడిని తమ కారులో ఎక్కించుకొని స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న బాధిత రైతులు, తండావాసులు దాదాపు 100 మంది ఠాణాకు చేరుకున్నారు. పోలీసులు వ్యాపారులతో కుమ్మక్కై తమపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. వివాదం ఉన్న పొలానికి మిట్టునాయక్‌కు సంబంధం లేకున్నా అకారణంగా ఆయనను ఎందుకు ఠాణాకు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయమై ఎస్ఐ కృష్ణ మాట్లాడుతూ.. తాము వ్యాపారులతో కుమ్మక్కు కాలేదని స్పష్టం చేశారు. వ్యాపారులు కట్టిన గోడను తండావాసులు కూలగొట్టడంతో వ్యాపారుల ఫిర్యాదు మేరకు తండావాసులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చట్ట ప్రకారమే తాము వ్యవహరించామన్నారు. -
ఫినాయిల్ తాగి నవ వధువు మృతి
సాక్షి, యాచారం: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతిచెందింది. యాచారం మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన బాలమణి (23) కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైంది. తీవ్ర ఆవేదనతో ఇటీవల ఇంట్లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రి సూచన మేరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. బాలమణికి నాలుగు నెలల కిందే తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన నాగరాజుతో పెళ్లి జరిగింది. వేధింపులతోనే బాలమణి మృతి చెందిందని బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటయ్య తెలిపారు. -
క్షణికావేశంలో వ్యక్తిని దారుణంగా హత్య
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడలో బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు వివరాల ప్రకారం.. వికారాబాద్‌లోని రామయ్యగూడకు చెందిన బసిరెడ్డిపల్లి సత్యనారాయణ (49) షాద్‌నగర్ సమీపంలోని బాల్నగర్లో సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తుండేవాడు. పోలీసులు వివరాల ప్రకారం.. వికారాబాద్‌లోని రామయ్యగూడకు చెందిన బసిరెడ్డిపల్లి సత్యనారాయణ (49) షాద్‌నగర్ సమీపంలోని బాల్నగర్లో సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తుండేవాడు. ఆయన వికారాబాద్‌లో భార్య అమృతమ్మతో పాటు, ఇద్దరు కూతుళ్లు, రెండు నెలల బాబుతో కలిసి నివసిస్తున్నాడు. అనారోగ్యంగా ఉండడంతో సత్యనారాయణ వైద్యం చేయించుకునేందుకు బుధవారం సాయంత్రం 7:15 గంటల సమయంలో రామయ్యగూడ నుంచి వికారాబాద్‌లోకి వస్తున్నాడు. అయితే రామయ్యగూడ ప్రధాన రోడ్డు వద్ద ఆటో ఎక్కుతున్న సమయంలో కొందరు వ్యక్తులతో గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. గొడవ జరుగుతుండగానే ఆటో ఎక్కి వస్తున్న సత్యనారాయణను శివరాంనగర్ కాలనీ సమీపంలో మరోసారి వ్యక్తి అడ్డగించాడు. క్షణాకావేశంలో అతడి తలను బలంగా రోడ్డుకు బాదేసి కొట్టడంతో సత్యనారాయణ స్పృహ కోల్పోయాడు. అనంతరం దుండగుడు పదునైన కత్తితో కడుపులో పొడిచాడు. దీంతో సత్యనారాయణ అక్కడిక్కడే మృత చెందాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ, సీఐ, హత్యకు గురైన సత్యనారాయణ స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగుడు కత్తితో అందరినీ బెదిరించాడు. సత్యనారాయణ మృతిచెందాడని నిర్ధారించుకుని దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య విషయం అప్పటికప్పుడు వికారాబాద్‌లో దావానంలా వ్యాపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ సీతారామ్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మయ్య ఆధ్వర్యంలో హత్యకు సంబంధించిన ఆధారాలను క్లూస్ టీం సహకారంతో సేకరించారు. కలకలం రేపుతున్న వరుస హత్యలు వరుస హత్యలతో పట్టణావుసులు ఉలిక్కిపడుతున్నారు. ఇటీవల జరిగిన తల్లీఇద్దరు పిల్లల దారుణహత్య మరువక ముందే తాజాగా నడిరోడ్డులో వ్యక్తి దారుహత్యకు గురికావడం వికారాబాద్‌వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. -
నిండు గర్భిణిని హతమార్చిన భర్త!
సాక్షి, ఇబ్రహీంపట్నం: కట్టుకున్న భార్య.. నిండు గర్భిణి.. భార్యనేను కనికరం లేకుండా కడతేర్చాడో ఓ భర్త. ఈ హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతపల్లిగూడ గేట్ సమీపంలోని చోటుచేసుకుంది. ఎస్ఐ మోహన్ కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం అజీలపురం గ్రామానికి చెందిన సరిత (22)కు రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం పోచమ్మగడ్డతండాకు చెందిన ఆటో డ్రైవర్ రాజు (25)తో 2018 మే నెలలో వివాహమైంది. కట్నకానుకల కింద రూ.పది లక్షలు ఇచ్చారు. అయితే కొన్నాళ్లు బాగానే ఉన్నా వీరి కాపురంలో అదనపు కట్నం చిచ్చుపెట్టింది. అదనంగా కట్నం తేవాలని తరచూ సరితను భర్త వేధించడం మొదలుపెట్టాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఈ విషయమై అప్పట్లో మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో కౌన్సిలింగ్ ఇప్పించారు. అయితే పెద్దల సమక్షంలో రాజీకి వచ్చినా ఆ తర్వాత యథావిధిగానే పరిస్థితి ఉంది. అయితే రెండు రోజుల కిందట ఏడు నెలల గర్భవతిగా ఉన్న భార్యను ఆస్పత్రిలో చూపిస్తానని చెప్పి రాజు ఇంటి నుంచి ఆమెను తీసుకెళ్లాడు. క్యాబ్‌లో కందుకూర్ నుంచి మంగళ్‌పల్లికి భార్యతో పాటు వచ్చాడు. చింతపల్లిగూడ గేట్ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి ఆమె చున్నీని మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చేశాడు. ఆ తర్వాత బావమరిది నర్సింహకు ఫోన్ చేసి మీ సోదరి ఇంట్లో కనిపించడం లేదని చెప్పాడు. దీంతో నర్సింహా శనివారం కందుకూర్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాడు. అయితే ఆదివారం చింతపల్లిగూడ గేట్ పొదల్లో సరిత శవమై తేలిందని కబురు అందింది. డాగ్‌స్క్వాడ్‌తో చుట్టుముట్టు పరిసరాలను పరిశీలించారు. ఈలోపే కందుకూర్ పోలీస్‌స్టేషన్‌లో రాజు లొంగిపోయాడు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబసభ్యుల ఆందోళన అదనపు కట్నం కోసం వేధిస్తూ సరితను హతమార్చడంతో కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని అజిలాపూర్ గ్రామస్తులు ఆదివారం రాత్రి ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. తన సోదరి మృతిచెందడంతో మనస్తాపం చెందిన సోదరుడు నర్సింహ ఒంటిపై పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రధాన రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రయాణికులు, వాహనదా రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఎంతచెప్పినా ఆందోళనకారులు వినిపించుకో లేదు. చివరికి పోలీసులు కల్పించుకుని ఆందోళ నకారులతో మాట్లాడి శాంతింపజేశారు. -
ఇండియాకు వస్తాననుకోలేదు
కుల్కచర్ల: బీజేపీ నిరుపేదలకు ఎల్లప్పుడు అండగా ఉంటోందని, ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్‌రావు తెలిపారు. కొన్నినెలల క్రితం ఉపాధి నిమ్మిత్తం దుబాయికి వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఇటీవల స్వగ్రామానికి చేరుకున్న కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన సమీనాబేగంను ఆయన పార్టీ కార్యాలయంలో బుధవారం పరామర్శించారు. బతుకు దెరువు కోసం విదేశానికి వెళ్లిన ఆమె అక్కడి ఇంటి యజమానులతో నరకం అనుభవించింది. సమీనాబేగంతో ముందు తామే మాట్లాడి దుబాయ్‌లో ఉంటున్న బీజేపీ లీగల్ సెల్ అడ్వయిజర్ శ్రీనివాస్‌రావుకు సమాచారం అందించామని చెప్పారు. ఆయన సమీనాబేగం వద్దకు చేరుకొని కేంద్ర ప్రభుత్వం సాయంంతో ఇండియాకు రప్పించినట్లు వివరించారు. అనంతరం సమీనాబేగం తాను అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించింది. బతుకు దెరువు కోసం ఇండియా నుంచి దుబాయికి వెళ్లిన ఆడపిల్లలను అక్కడి యజమానులు తీవ్రంగా హింసిస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలు దుబాయికి వెళ్లి ఇబ్బందులకు గురికావొద్దని చెప్పింది. తాను అక్కడ నరకం అనుభవించినట్లు తెలిపింది. తిరిగి ఇండియాకు వచ్చి తన కుటుంబాన్ని కలుసుకుంటాననుకోలేదని కలలో కూడా అనుకోలేదని ఈ సందర్భంగా సమీనాబేగం కన్నీటిపర్యంతమైంది. బీజేపీ నేత ప్రహ్లాద్‌రావు చొరవతో తాను ఇక్కడికి వచ్చానని తెలిపింది. అనంతరం సమీనాబేగంకు బీజేపీ తరఫున ఆర్థిక సహాయం అందజేశారు. ఆమెను శాలువాతో సన్మానించారు. ఎల్లప్పుడు బీజేపీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని ఈ సందర్భంగా ఆమెకు ప్రహ్లాద్‌రావు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కుల్కచర్ల మాజీ సర్పంచ్ ఎల్లప్ప, నాయకులు మహిపాల్, కాటంపల్లి అంజిలయ్య, శివరాజ్, కిష్టరెడ్డి, తదితరులు ఉన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
కొత్తూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ భార్య ప్రియుడితో భర్తను హత్య చేయించింది. ఈ ఘటనలో హత్య చేసిన నిందితుడిని, ప్రియురాలిని, సహకరించిన మరో బాలుడిని (15) పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకేసు సంబంధించిన వివరాలను కొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్ఐ కృష్ణ వెల్లడించారు. కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన ఎండీ ఇస్మాయిల్(23)కు గత రెండేళ్ల క్రితం హైదరాబాద్ కిషన్‌బాగ్‌కు చెందిన అనీస్‌బేగం(19)తో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. కాగా, అనీస్‌బేగంకు పెళ్లికి ముందే కిషన్‌బాగ్‌కు చెందిన జహీర్(25)తో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఇస్మాయిల్‌ను ఎలాగైన హత్యచేసి అడ్డు తొలగించుకోవాలని అనీస్‌బేగం ప్రియుడితో కలిసి పథకం రచించింది. ఇందులో భాగంగానే జహీర్ గత నెల రోజుల క్రితం అనీస్‌బేగంకు బంధువయ్యే ఓ మైనర్ బాలుడి సహాయంతో జేపీదర్గా ఆవరణలో కూలీ పనిచేస్తున్న ఇస్మాయిల్‌తో స్నేహం చేశాడు. నమ్మకంగా మెలుగుతూనే మైనర్ సహాయంతో రెండుసార్లు హత్య చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. కాగా, ఈ నెల 16న జహీర్ తన మొహనికి దస్తీ కట్టుకొని బైకు నంబర్‌ప్లేట్ చివరి రెండు అక్షరాలు కనిపించకుండా టేప్ అంటించి క్రికెట్ బ్యాట్‌తో ఒక్కడే ఇన్ముల్‌నర్వకు వచ్చాడు. అక్కడి నుంచి ఇస్మాయిల్‌తో కలిసి ఇద్దరు కిషన్‌భాగ్‌కు వెళ్లారు. మార్గమధ్యలో మద్యం సేవించడంతో పాటు గ్రామానికి వచ్చిన తర్వాత మరోమారు ఇస్మాయిల్‌కు ఎక్కువగా మద్యం తాగించి తలపై బ్యాట్‌తో మోది హత్య చేశాడు. ఈ సంఘటనపై భార్య అనీస్‌బేగంతో ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఆమె పాత్రపై అనుమానం కలగడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. జాతీయ రహదారి ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి కూడలి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా జహీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయగా.. జహీర్ నేరాన్ని అంగీకరించాడు. జహీర్ సమాచారం మేరకు కిషన్‌బాగ్‌లోని తల్లిగారి ఇంటి వద్ద ఉన్న అనీస్‌బేగంతో పాటు బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొత్తూరు పీఎస్‌కు తీసుకువచ్చి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి హోండాషైన్ బైకు, క్రికెట్ బ్యాట్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీసీ పుటేజీ ఆధారంగా.. ఈ హత్య కేసు ఛేదించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం అని సీఐ రామకృష్ణ తెలిపారు. గ్రామాల ముఖ్య కూడళ్లు, ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో కచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీఐ సూచించారు. హత్య కేసును ఛేదించిన ఐడీపార్టీ కానిస్టేబుళ్లు నరేందర్, శివకుమార్, శేఖర్, రవీందర్లను సీఐ అభినందించారు. -
దౌల్తాబాద్‌లో భార్యపై హత్యాయత్నం
దౌల్తాబాద్: కుటుంబ కలహాలతో ఓ భర్త తన భార్యను పట్టపగలు కత్తితో కిరాతకంగా దాడిచేశాడు. ఈ సంఘటన దౌల్తాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ సతీశ్ వివరాల ప్రకారం.. దౌల్తాబాద్‌కు చెందిన పల్లెవోని గోవిందమ్మ, తిర్మాలాపూర్ గ్రామానికి చెందిన నారాయణతో 18 ఏళ్ల కిందట వివాహమైంది. నారాయణ ఇల్లరికం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య విబేధాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తరచూ కలహాలు ఉన్నాయి. దీంతో 8 నెలలుగా ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. గోవిందమ్మ తల్లిగారింట్లో, నారాయణ గ్రామ సమీపాన ఉన్న పొలం వద్ద ఉన్న ఇంటిలో ఉంటున్నారు. చిన్నకుమారుడు తల్లి గోవిందమ్మ వద్ద, పెద్ద కుమారుడు తండ్రి నారాయణతో ఉంటున్నాడు. గోవిందమ్మ గ్రామంలోని కో ఆపరేటివ్ సొసైటీ దుకాణ సముదాయాల్లో బేకరి నిర్వహిస్తూ జీవిస్తోంది. భర్త నారాయణ కూడా ఇదే దుకాణ సముదాయాల్లో మరో షాపులో కిరాణం కొట్టు నిర్వహిస్తున్నాడు. అయితే వీరిద్దరు విడాకులు కోరుతూ, మెయింటెనెన్స్ కింద కోర్టులో కేసు కూడా వేసుకున్నారు. పథకం ప్రకారం హత్యాయత్నం.. ఈ నేపథ్యంలో భార్య గోవిందమ్మపై నారాయణ కోపంగా ఉన్నాడు. ఆమెను ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంలో పథకం రచించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం గోవిందమ్మ ఎప్పటిమాదిరిగా బేకరికి వెళ్లగా నారాయణ కూడా తన కిరాణ దుకాణానికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో బేకరికి నారాయణ మద్యంమత్తులో వచ్చాడు. గోవిందమ్మను దుకాణంలో నుంచి బయటకు లాక్కొచ్చి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనను చూసి స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించగావారిపై దాడి చేస్తానని హెచ్చరించాడు. దీంతో నారాయణ భార్య గోవిందమ్మపై కత్తితో దాడి చేశాడు. గోవిందమ్మ మృతిచెందిందని తెలుసుకుని నారాయణ బస్టాండ్ వైపు కత్తితో వెళ్లాడు. పోలీసుల అదుపులో నిందితుడు...? భార్యపై పట్టపగలు హత్యయత్నం చేసిన భర్త నారాయణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కుటుంబకలహాలతో భార్య ప్రవర్తన నచ్చకనే తాను హత్య చేయడానికి ప్రయత్నించానని పోలీసులకు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. విషయం తెలుసుకున్న సీఐ నాగేశ్వర్రావు, ఎస్ఐ సతీశ్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గోవిందమ్మ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కొన ఊపిరితో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన వారు కూడా నేరస్తులే
ధారూరు: శ్రీసాయి రాఘవేంద్ర ఎంటర్‌ప్రైజెస్‌ను స్థాపించి 800 మంది సభ్యుల్ని చేర్చుకుని నెలకు రూ.వెయ్యి చొప్పున రాబట్టి, చిట్టీల రూపంలో బాదితుల నుంచి డబ్బులు తీసుకుని ఉడాయించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రెంటాల రాఘవప్రసాద్‌ను బుధవారం మద్యాహ్నంట్టుకుని అరెస్టు చేసి అదేరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో రిమాండుకు పంపించామని ధారూరు సీఐ దాసు తెలిపారు. ఎంటర్ప్రైజెస్ పేరుతో బురిడీ అనే శుక్రవారం సాక్షిలో వచ్చిన వార్తకు సీఐ దాసు స్పందించారు. శ్రీసాయి రాఘవేంద్ర ఎంటర్‌ప్రైజెస్‌లో సభ్యులుగా చేర్పించిన వారు కూడా నేరస్తులేనని స్పష్టం చేశారు. వారు సభ్యులు దగ్గర డబ్బులు వసూలు చేసి వాటిలో కొన్ని వాడుకున్నారని సీఐ తెలిపారు. ఇలాంటి వారే ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌కు ఫిర్యాదు చేశారని చెప్పారు. వారు చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదన్నారు. జైలులో ఉన్న రాఘవప్రసాద్‌ను, అతడి బాబాయి, ఏ 2 ముద్దాయి రెంటాల సత్యనారాయణను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ వేస్తున్నట్లు వివరించారు. తమ కస్టడీకి వస్తే వారి నుంచి అన్ని విషయాలను రాబట్టి ఎంటర్‌ప్రైజెస్‌లో సభ్యులుగా చేరి డబ్బులు కట్టి నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాన నిందితుడి బామర్ది, బాబాయి, బావలతో పాటు ఏజెంట్లుగా మారిన వారిని విచారిస్తామని, నిందితుడి మామను కూడా ఈ కేసులో చేర్చినట్లు వెల్లడించారు. నిందితుడి భార్య హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారని, అందుకే నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపామని తెలిపారు. రాఘవప్రసాద్ దగ్గర ఏజెంట్లుగా మారి డబ్బులు తిన్న వారు కూడా నిందితులేని అన్నారు. అరెస్టు చేసిన నిందితుని వద్ద ఒక్క రూపాయి కూడా లేదని, నిందితుడు వసూలు చేసిన డబ్బులతో బాబాయి పేరుతో ధారూరులో ఓ ఇల్లు కట్టించారని, ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారని, మామ, బామ్మర్తికి రూ.10 లక్షల చొప్పున డబ్బులు ఇచ్చాడని, తన పెళ్లికి రూ.15 లక్షలు వ్యయమైందని నిందితుడు చెప్పినట్లు వెల్లడించారు. ఎంటర్ప్రైజెస్ స్కీంలో నష్టపోయిన ప్రతి వ్యక్తికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. -
సాగర్ హైవేపై ప్రమాదం: ఇద్దరి మృతి
యాచారం: నాగార్జునసాగర్ – హైదరాబాద్ రహదారిపై కారు, ఆటో ఢీకొన్న సంఘటనలో తల్లీకొడుకులు మృతిచెందగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం లైలాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కాట్రోత్తండాకు చెందిన చందర్ ఆయన భార్య నేజీ(45), కుమారుడు నర్సింగ్(26) తమ ఆటోలో ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వైపు వెళ్తున్నారు. యాచారం నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తున్న కారు అతివేగంగా వెళ్తూ గునుగల్ క్రీడాక్షేత్రం సమీపంలో ముందు వెళ్తున్న ఓ వాహనాన్ని ఓవర్‌టెక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న చందర్, నేజీ, నర్సింగ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న నేజీ, ఆమె కొడుకు నర్సింగ్ చికిత్స పొందుతూ మృతిచెందారు. చందర్ పరిస్థితి కూడా విషమంగా ఉందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుకుమార్ తెలిపారు. -
కడ్తాల్‌లో కారు బీభత్సం
కడ్తాల్: హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై కడ్తాల్ మండల కేంద్రం సమీపంలో టోల్‌ప్లాజా వద్ద కారు టైర్ పగిలి ఎదురుగా వస్తున్న ఆటోతో పాటు మూడు బైక్‌లను ఢీకొట్టిన సంఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్న కారు టైర్ కడ్తాల్ టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కూరగాయల ఆటోతో పాటు మూడు బైక్‌లను ఢీకొట్టింది. ఈ సంఘటనలో బైక్‌లపై ఉన్న కడ్తాల్‌కు చెందిన నార్లకంటి యాదయ్య, జల్కం బీరప్ప, మరో బైక్‌పై ఉన్న కాలె శ్రీను, ఒగ్గు మహేశ్, ఇంకో బైక్‌పై ఉన్న పాపయ్య, హేమలత, ఆటోలో ఉన్న సుజాత, జ్యోతి, వెంకటేశ్‌లకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో ఆమనగల్లు, హైదరాబాద్ ఆస్పత్రిలకు తరలించారు. వీరిలో కడ్తాల్‌కు చెందిన నార్లకంటి యాదయ్యకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలిక కిడ్నాప్ కలకలం
మొయినాబాద్(చేవెళ్ల): ‘మీ నానమ్మ దగ్గరకు తీసుకెళ్తాను’ అంటూ బాలికకు నమ్మించిన ఓ దుండగుడు కిడ్నాప్‌కు యత్నించాడు. స్కూటీపై తీసుకెళ్తుండగా చిన్నారిని గుర్తించిన ఓ వ్యక్తి అడ్డుకుని స్థానికులతో కలిసి నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మొయినాబాద్ మండలం చిలుకూరులో బుధవారం తీవ్ర కలకలం రేపింది. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కార్వాన్ ప్రాంతానికి చెందిన సమృద్దీన్(45) బుధవారం ఉదయం 10 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన బాలిక(13)ను ‘మీ నానమ్మ వద్దకు తీసుకెళ్తాను’ అంటూ నమ్మబలికి తన స్కూటీపై ఎక్కించుకుని బయలుదేరాడు. మొయినాబాద్ మండలంలోని హిమాయత్‌నగర్–తంగడపల్లి రోడ్డులో స్కూటీపై వెళ్తుండగా.. కార్వాన్కు చెందిన నజీమ్ అనే వ్యక్తి పని నిమిత్తం చిలుకూరు గ్రామానికి ప్రయాణమయ్యాడు. ఈక్రమంలో చిలుకూరు మహిళా ప్రాంగణం వద్ద అతడు బాలికను గుర్తించాడు. ఆమెను ఎక్కడి తీసుకెళ్తున్నావంటూ నజీమ్ ప్రశ్నించగా దుండగుడు తప్పించుకోవడానికి స్కూటీ వేగం పెంచాడు. నజీమ్ వెంబడించి అతడిని పట్టుకున్నాడు. స్థానికులంతా గుమ్మికూడి నిలదీశారు. బాలికను అడిగి విషయం తెలుసుకున్న స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో నిందితుడిని వారికి అప్పగించారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు ఠాణాకు రావడంతో వారికి ఆమెను అప్పగించారు. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చంపేసి.. దుప్పట్లో శవాన్ని తీసుకొచ్చి
షాబాద్(చేవెళ్ల): కుటుంబ కలహాలతో భర్త తన భార్యను కడతేర్చిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని బిక్యాతండాలో చోటు చేసుకుంది. షాబాద్ ఎస్ఐ రవికుమార్ కథనం ప్ర కారం.. మండలంలోని మద్దూర్ అనుబంధ బిక్యాతండాకు బుడ్డమ్మ(35), కేతావత్ తావ్ దంపతు లు. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నా రు. పెద్ద కూతురు వివాహం కూడా అయిపోయింది. తాగుడుకు బానిసైన కేతావత్ తావ్ డబ్బులు ఇవ్వాలని భార్యతో నిత్యం గొడవ పడేవాడు. ఈ విషయమై బుడ్డమ్మ తల్లిదండ్రులు పలుమార్లు అల్లుడుకి నచ్చజెప్పినా అతడిలో మార్పురాలేదు. మంగళవారం ఉదయం పొలం పనికి వెళ్లిన దంపతులిద్దరూ సాయంత్రం ఇంటికి చేరే సమయంలో మార్గమధ్యలోనే గొడవపడ్డారు. మాటమాటా పెరగడంతో భర్త తావ్ పక్కనే ఉన్న కర్రతో భార్య బుడ్డమ్మపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బుడ్డమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. భార్య మృతదేహాన్ని దుప్పట్లో మూటకట్టుకొని ఇంటికి తీసుకువచ్చి పడుకోబెట్టాడు. బుధవారం తెల్లవారుజామున ఆమె నిద్ర లేవకపోవడంతో కుటుంబీకులు దగ్గరకు వెళ్లి చూసి బుడ్డమ్మ మృతిచెందినట్లుగా గుర్తించారు. తన సోదరి మృతికి ఆమె భర్తనే కారణమని, తాగుడుకు బానిసై భార్యను తరచూ వేధించేవాడని మృతురాలి సోదరుడు అంగోతు దాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘అమ్మానాన్న' నేను వెళ్లిపోతున్నా..
రంగారెడ్డి , దౌల్తాబాద్: కడుపులో నొప్పి భరించలేక ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దౌల్తాబాద్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ సతీశ్ వివరాల ప్రకారం.. పొల్కంపల్లి గ్రామానికి చెందిన పెద్ద నర్సప్ప, పద్మమ్మకు కుమారుడు నాగమొళ్ల శ్రీనివాస్ (16). తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లగా శ్రీనివాస్ నాన్నమ్మ దగ్గర ఉంటూ గోకఫసల్వాద్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అయితే ఆదివారం నాన్నమ్మ పొలం పనులకు వెళ్లగా ఆ సమయంలో శ్రీనివాస్ కడుపు నొప్పితో బాధపడ్డాడు. నొప్పి భరించలేక ‘తన చావుకు ఎవరూ కారణం కాదు’ అని సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చిన నానమ్మ చూసి కంగారుపడింది. వెంటనే చుట్టు పక్కల వారికి సమాచారం అందించి శ్రీనివాస్ మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు గ్రామానికి చేరుకుని కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని కొడంగల్ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. తండ్రి నర్సప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు తమ కుమారుడి కడుపులో నొప్పి అని ఏనాడు తమకు చెప్పలేదని కుటుంబసభ్యులు వాపోయారు. గతంలో శ్రీనివాస్‌కు ఒక అక్క లక్ష్మి ఉండేది. ఆరు నెలల కిందట లక్ష్మి కూడా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకుంది. ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు పిల్లలను దూరం చేసుకోవడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నేను వెళ్లిపోతున్నా.. ‘అమ్మానాన్న నేను వెళ్లిపోతున్నా. ఎందుకంటే నాకు కడుపులో నొప్పిగా ఉంది. అందుకని నేను చనిపోతున్నా. సారీ గుడ్ బై’ అని ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడే ముందు సూసైడ్ నోటు రాసి పెట్టాడు. -
గిరిజన బాలికపై అత్యాచారం
బషీరాబాద్: కామ పిశాచులు చెలరేగిపోతున్నారు. మొన్న వరంగల్‌లో తొమ్మిది నెలల పసికూనపై అఘాయిత్యం మరవక ముందే తాజాగా జిల్లా పరిధిలోని బషీరాబాద్ మండలం బోజ్యానాయక్తండాలో మరో ఘటన వెలుగుచూసింది. పదకొండేళ్ల బాలికపై తండ్రి వయసున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎస్ఐ మహిపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బొంరాస్‌పేట మండలం ఊరెనికితండాకు చెందిన గిరిజన దంపతులు బతుకుదెరువు కోసం కొంతకాలం కిందట పూణెకు వెళ్లారు. తమ ముగ్గురు పిల్లలను చదివించడానికి బషీరాబాద్ మండలం బోజ్యానాయక్తండాలోని అమ్మమ్మ ఇంట్లో ఉంచారు. మొదటి కుమార్తె (11) 6వ తరగతి చదువుతోంది. అయితే ఈ నెల 19వ తేదీన బడికి వెళ్లిన బాలిక ఇంటికి వచ్చింది. ఇదే గ్రామానికి చెందిన తాక్య్రనాయక్ (50) లారీ డ్రైవర్‌గా, నాపరాతి గనుల్లో కార్మికుడిగా పని చేస్తుంటాడు. తంబాకు (పొగాకు) తీసుకురమ్మని దుకాణానికి పంపించాడు. దుకాణానికి వెళ్లి వచ్చిన బాలికను ఇంట్లోకి లాకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని చిన్నారి ఇంట్లో చెప్పింది. వెంటనే కుటుంబసభ్యులు పుణెలోని బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు తండాకు వచ్చి జరిగిన ఘటనపై పెద్ద మనుషులతో మాట్లాడారు. అప్పటికే అత్యాచారం చేసిన తాక్య్రనాయక్ పరారయ్యాడు. జరిగిన ఘటనపై బషీరాబాద్ పోలీసులకు ఈ నెల 23వ తేదీన బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడు. విచారణ చేసిన తాండూరు డీఎస్పీ రామచంద్రుడు, పట్ణణ సీఐ రవి నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని సోమవారం పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. మొదటి నుంచి వక్రబుద్ధి.. బోజ్యానాయక్తండాకు చెందిన తాక్య్రనాయక్ మొదటి నుంచి వక్రబుద్ధితోనే ఉన్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలిసింది. మొదటి భార్య చనిపోగానే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె వదిలేయడంతో అక్క కూతురును పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా రెండేళ్లుగా ఇతడికి దూరంగా ఉంటోంది. దీంతో లారీ డ్రైవర్‌గా, నాపరతి గనుల్లో లేబర్‌గా పనిచేస్తు తండాలో ఉంటున్నాడని పోలీసుల విచారణలో తేలింది. -
నవవధువు ఆత్మహత్య
బన్సీలాల్‌పేట్: అత్తా, మామల వేధింపుల కారణంగా ఓ నవవధువు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మల్లేశం కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బన్సీలాల్‌పేట్, బోయిగూడ ప్రాంతానికి చెందిన ప్లాస్టిక్ రీస్లైకింగ్ వ్యాపారి మహావీర్, మధ్యప్రదేశ్‌కు చెందిన సంగీతారాథోడ్ గత ఏప్రెల్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ బోయిగూడలో జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్ల పాటు పుట్టింటికి వెళ్లిన సంగీత గత నెల 25న భర్తతో కలిసి నగరానికి వచ్చింది. ఇటీవల అత్త, మామలతో గొడవ జరగడంతో అత్త మీనా చిక్కడపల్లిలో ఉంటున్న కుమార్తె ఇంటికి వెళ్లిపోగా, మామ శాంతిలాల్ ఆఫీసులోనే ఉంటున్నాడు. దీంతో మనస్తాపానికిలోనైన సంగీత ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న గాంధీనగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అత్త,మామల వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి మధురా రాథోడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కందుకూరులో దొంగల బీభత్సం
కందుకూరు: కందుకూరు మండల పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో చొరబడి సుమారుగా రూ.8.70 లక్షల విలువ గల బంగారు, వెండి, నగదు దోచుకెళ్లారు. ఎస్ఐ స్వామి కథనం మేరకు వివరాలు.. కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్లకు చెందిన మేదరి నర్సింహ కుటుంబం ఆదివారం ఉదయం ఇంటికి తాళం వేసి చెర్వుగట్టుకు దైవ దర్శనానికి వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో దాచి పెట్టిన నాలుగున్నర తులాల బంగారం, 27 తులాల వెండి ఆభరణాలు, రూ.5.90 లక్షల నగదు దోచుకున్నారు. పక్కనే ఉన్న తల్లోజు నిర్మలమ్మ, మోటే సత్తమ్మ ఇళ్లకు తాళం వేసి ఇంటిపై నిద్రిస్తున్నారు. దీంతో ఆ రెండు ఇళ్ల తాళాలు పగులగొట్టి చొరబడ్డారు. తల్లోజు నిర్మలమ్మ ఇంట్లో బీరువాలో దాచిన 26 తులాల వెండి ఆభరణాలు, రూ.6 వేల నగదు, మోటే సత్తమ్మ ఇంట్లో 27 గ్రాముల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.15 వేల నగదు దోచుకుని పరారయ్యారు. ఈ మూడు ఇళ్లు ఊరికి చివరన ఉన్నాయి. సోమవారం ఉదయం దొంగలు పడినట్లుగా గుర్తించిన బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ యాదగిరిరెడ్డి, సీఐ జంగయ్య, ఎస్ఐ.స్వామి సిబ్బందితో కలిసి చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ జంగయ్య, ఎస్ఐ స్వామి మాట్లాడుతూ...తాళం వేసి ఊరు వెళ్తుంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తాళం వేసి ఇంటిపైన అందరూ నిద్రించకుండా ఒకరన్నా ఇంట్లో ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రస్తుతం జరిగిన చోరీలు కేవలం తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేశారన్నారు. -
రెండు నెలలు.. 18 హత్యలు
తాండూరులో ఇటీవల జరిగిన ఓ ప్రతీకార హత్య కలకలం సృష్టించింది. గతేడాది తన తల్లిదండ్రులను ఆస్తితగాదాల నేపథ్యంలో బాబాయి హత్య చేశాడనే కక్షతో మృతుల కుమారుడు అతడిని దారుణంగా చంపేశాడు. తన తల్లిదండ్రులను చంపిన మాదిరిగానే.. అదే స్థలంలో చంపడం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈనెల 7న కొత్తూరు మండలం సిద్ధాపూర్లో తండ్రి ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని కుమారుడు చంపేశాడు. బంధాలు ఎటు వెళ్తున్నాయి.. జనం పుట్టుకతో వచ్చిన బంధాలు, అనుబంధాలను విస్మరించి.. చిన్నచిన్న తగాదాలు, కక్షలు, ఇతర కారణాలతో తన వాళ్లను కడతేర్చడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మైలార్‌దేవ్‌పల్లిలో అత్తాకోడలి దారుణ హత్య ఉమ్మడి జిల్లాతోపాటు నగరంలో కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు వారిని అతిదారుణంగా చంపేశారు. రెండు నెలల పరిధిలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 18 హత్య జరగడంతో పోలీసులతో పాటు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చిన్నచిన్న గొడవలు జరిగినప్పుడే పోలీసులు ఇరువర్గాలను ఠాణాలకు పిలిపించి కౌన్సెలింగ్ చేస్తే కొంత మార్పు వస్తుందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. షాద్‌నగర్ టౌన్: క్షణికావేశం, కక్షలు, చిన్నచిన్న సమస్యలు పెద్దవి కావడంతో హత్యలు జరుగుతున్నాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలో కొందరు సొంతవారినే కడతేర్చుతున్నారు. అదేవిధంగా వివాహేతర సంబంధాలు హత్యలకు కారణమవుతున్నాయి. నేరాల నివారణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు కంటితుడుపుగానే ఉంటున్నాయి. చిన్నచిన్న తగాదాలపై సకాలంలో స్పందించకపోవడంతో హత్యలు జరుగుతున్న సందర్భాలు లేకపోలేదు. మార్చి 4న వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ ఎల్ఐజీ కాలనీలో ఇళ్లలో పని చేస్తూ పొట్టపోసుకుంటున్న స్వరూపను గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో గొంతుకోసి దారుణంగా హతమార్చారు. అదేనెల 6న చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మతిస్థిమితం కోల్పోయిన మంగలి యాదమ్మ తన భర్త వెంకటయ్యపై గొడ్డలితో దాడి చేసి చంపేసింది. అనంతరం ‘మీ నాన్నను చం పేశాన’ని ఆమె తన కుమారుడి వద్దకు వెళ్లి చెప్పడంతో కలకలం రేగింది. మార్చి 14న నవాబుపేట మండలం చిట్టిగిద్దకు చెందని యువకుడు షేక్ సోహెల్ ఇంట్లోనుంచి వెళ్లి తిరిగి రాలేదు. లింగంపల్లిగుట్ట మీద దారుణ హత్యకు గురై విగతజీవిగా కనిపించాడు. దుండగులు వైరుతో సోహెల్ గొంతుకు బిగించి హతమార్చారు. 15వ తేదీ రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆస్తి తగాదాల నేపథ్యంలో నరెడ్లగూడ గ్రామానికి చెందిన ముక్కు రాంమోహన్‌ను అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు దారుణంగా చంపేశారు. బండరాళ్లతో మోది ఓ ఓ ఫాంహౌస్‌లో పాతిపెట్టిన ఘటన కలకలం రేపింది. మార్చి 18న శంకర్పల్లి పరిధిలోని మోకిలి శివారులో ఉన్న ఓ వెంచర్లో గుడ్డు కుమార్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన రఘువీర్, విక్రం, అర్జున్ ఇనుపరాడ్లుతో కొట్టి అంతమొందించారు. మార్చి 19న శంషాబాద్ మండలం చౌదరిగూడ శివారులోని ఓ వెంచర్లో నిర్జన ప్రదేశంలో గుర్తు తెలియని మహిళను దండగులు చంపేసి మృతదేహాన్ని కాల్చివేశారు. 23న తాండూరు పట్టణంలో జరిగిన ప్రతీకార హత్య సంచలనం రేపింది. సీతారాంపేటకు చెందిన అబ్దుల్ సత్తార్, షరీఫ్ అన్నదమ్ములు. వీరి మధ్య ఆస్తి విషయంలో తగాదాలు ఏర్పడ్డాయి. దీంతో షరీఫ్ తన అన్న అబ్దుల్సత్తార్తో పాటు వదిన ఫహీమున్సిసాబేగంను గతేడాది బండరాయితో మోది హత్య చేశాడు. తన తల్లిదండ్రులను చంపేయడంతో అబ్దుల్ సత్తార్ కుమారుడు అబ్దుల్లా బాబాయిపై కక్ష పెంచుకున్నాడు. మార్చి 23న తన స్నేహితులతో కలిసి అబ్దుల్లా బాబాయిపై కర్ర, బండారాయితో దాడి చేసి చంపేశాడు. అయితే, తన తల్లిదండ్రులను చంపేసిన మాదిరిగానే, అదే స్థలంలో అం తమొందించడం కలకలం రేపింది. తాండూరు మండలం రాంపూర్ తండాకు చెందిన రుక్కిబాయి, డప్పు దశరథ్ దంపతులు. రుక్కిబాయిపై అనుమానం పెంచుకుంటున్న దశరథ్ మార్చి 25న ఇంట్లో నిద్రిస్తుండగా రోకలి, పారతో ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. మార్చి 26న ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని మహల్‌ఎలికట్ట గ్రామానికి చెందిన జంగం రాములు వివాహిత అయిన జంగం మంగమ్మ ఒంటిపై కిరోసిన్ పోసి సజీవదహనం చేసేందుకు యత్నించాడు. వివాహేతర సం బంధం నేపథ్యంలో వారిమధ్య గొడవలు ఉన్నాయి. చికిత్స పొందుతూ మంగమ్మ ప్రాణం విడిచింది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన మైనుద్దీన్ మార్చి 24న హత్యకు గురయ్యాడు. మైనుద్దీన్ తండ్రి రుక్మొద్దీన్ సోదరులు సద్దాం, జహంగీర్ ఆయనను చంపేశారు. ఆస్తి కోసం ఈ దారుణానికి పాల్పడ్డారు. మార్చి 27న రాజేంద్రనగర్ ఎంఎంపహడీ ప్రాంతంలో నదీమ్ గ్యాంగ్ వార్‌కు బలయ్యాడు. తన స్నేహితుడికి ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గంమధ్యలో జరిగిన ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇది యువకుడి హత్యకు దారి తీసింది. పెద్దేముల్ మండలం జనగామ గ్రామానికి చెందిన బాల్‌రాజ్, ఎర్రమరియమ్మ ప్రేమించి వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా మరియమ్మ ఫోన్లో మాట్లాడుతుండటంతో అనుమానించిన బాల్‌రాజ్ ఆమెను హెచ్చరించాడు. ఫలితం లేకపోవడంతో మార్చి 31న పొలంలో ఉరివేసి హతమార్చాడు. మార్చి 31న చేవేళ్ల మండలం ఊరెళ్ల గ్రామానికి వెళ్లే దారిలో సాగర్ ఇంజినీరింగ్ కళాశాలకు ఎదురుగా ఉన్న ఓ వెంచర్లో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఏప్రిల్ 2న వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం నర్సాపూర్ పెద్ద తండాకు చెందిన ఆంగోత్ జంకిబాయిని దాయాది అయిన హరియానాయక్ గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. తన బోరు నీళ్లు ఎందుకు పారించుకున్నావని ఆమె అడగడంతో దారుణానికి పాల్పడ్డాడు. యాచారం మండలం తక్కళ్లపల్లికి చెందిన కంబాలపల్లి బాలయ్య, ఆయన కుమారుడు జంగయ్య, అతడి భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. తండ్రీకొడుకు మధ్య విబేధాలు రావడంతో క్షణికావేశానికి గురైన కొడుకు జంగయ్యపై రోకలితో దాడి చేయడంతో ప్రాణం విడిచాడు. ఏప్రిల్ 13న వికారాబాద్ జిల్లా ధారూరు మండలం ధర్మాపూర్‌లో రచ్చబండ సాక్షిగా నరేష్ అనే యువరైతు దారుణ హత్యకు గురయ్యాడు. నరేష్‌కు సంబంధించిన మేక జొన్న పంటలోకి వెళ్లి మేసింది. పొలం యజమాని అశోక్ అతడిపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. వెంటనే ఈ విషయాన్ని నరేష్ ఇంట్లో వచ్చి చెప్పగా రచ్చబండ వద్ద పంచాయితీ పెట్టారు. రావులపల్లి అశోక్, నర్సింలు, నందు, శ్రీనివాస్, శేఖర్ మారుణాయుదాలతో వచ్చి దాడి చేశారు. చికిత్స పొందుతూ నరేష్ మృతిచెందాడు. ఏప్రిల్ 19న రాజేంద్రనగర్ పరిధిలోని నార్సింగ్ మూసీ కల్వర్టు వద్ద ఓ గుర్తు తెలియని మహిళ దారుణహత్యకు గురైంది. దుండగులు ఆమెను వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి చంపేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. ఏప్రిల్ 22న యాచారం మండలం చింతుల్ల గ్రామంలో నాగరవితేజ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఇతడు మెకానిక్‌గా పనిచేస్తుండేవాడు. అయితే పౌల్ట్రీలో పని చేస్తున్న ఓ వ్యక్తి.. తన భార్యతో నాగరవితేజకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించి పథకం ప్రకారం చింతల్ల– అయ్యవారిగూడెం మధ్యలో ఇనుపరాళ్లతో కొట్టి హతమార్చారు. ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని కొడుకు తం డ్రిపై దాడి చేసి హత్య చేసిన ఘటన ఈనెల 7న కొత్తూరు మండలం సిద్దాపూర్లో వెలుగు చూసింది. సామరస్యంగా పరిష్కరించుకోవాలి తాండూరు టౌన్: చిన్నచిన్న విషయాలను పెద్దగా చేసి గొడవలకు దిగి చంపుకోవడం అమానుషం. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆస్తి తగాదా అయిన, పొలం తగాదైనా.. మరేదైనా అందరూ కూర్చుని మాట్లాడుకోవడం వల్ల సగం సమస్య పరిష్కారమవుతుంది. అక్కడ పరిష్కారం కాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. అంతే కానీ క్షణికావేశంలో అఘాయిత్యాలకు పాల్పడితే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. జైలుకు వెళ్తే కుటుంబీకులు రోడ్డునపడతారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ తరఫున పలు అంశాలపై కళాజాత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నాం. – రామచంద్రుడు, డీఎస్పీ, తాండూరు డబ్బుల కోసమే హత్య తండ్రిని చంపిన తనయుడి అరెస్టు కొత్తూరు: డబ్బుల కోసం తండ్రిని చంపిన తనయుడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. స్థానిక ఠాణాలో రూరల్ సీఐ రామకృష్ణ వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని సిద్ధాపూర్‌కు చెందిన గుండెమోని చంద్రయ్య(60)కు కుమారులు అంజయ్య, లక్ష్మయ్య ఉన్నారు. అంజయ్య వేరుగా నివాసం ఉండగా చంద్రయ్య తన భార్య సత్యమ్మ, చిన్న కొడుకుతో కలిసి ఉంటున్నాడు. అయితే, లక్ష్మయ్య పనీపాట చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీంతోపాటు తన ఖర్చుల కోసం తరచూ తండ్రితో గొడవపడుతుండేవాడు. ఈక్రమంలో తండ్రిని చంపేస్తే ఉన్న భూమిని పంచుకొని తన వాటాను విక్రయిస్తే డబ్బులు వస్తాయని లక్ష్మయ్య భావించాడు. ఈనెల 5న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి తలపై కట్టెతో బలంగా కొట్టి పారిపోయాడు. కుటుంబీకులు చంద్రయ్యను గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి 7న మృతి చెందాడు. తప్పించుకు తిరుగుతున్న నిందితుడు లక్ష్మయ్యను పోలీసులు కొత్తూరులోని రాధాగార్డెన్ వద్ద అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కార్యక్రమంలో ఎస్ఐ కృష్ణ తదితరులు ఉన్నారు. -
స్విమ్మింగ్‌పూల్‌లో పడి ఇద్దరు మృతి
మొయినాబాద్: వేసవి సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సహంగా గడిపేందుకు ఫాంహౌస్‌కు వచ్చిన ఓ యువకుడు స్విమ్మింగ్‌పూల్‌లో ముగిని మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని తోలుకట్ట సమీపంలో ఉన్న ఓ ఫాంహౌస్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పూర, కిషన్‌భాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సయ్యద్ ఖాన్ కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఆదివారం మొయినాబాద్ మండల పరిధిలోని తోలుకట్ట సమీపంలో ఉన్న ఒయాసిస్ ఎన్ ఫాంహౌస్‌కు ఉదయం 10 గంటలకు వచ్చారు. సయ్యద్ ఖాన్ కుమారుడు షోయబ్‌ఖాన్(20), బంధువుల పిల్లలు ముగ్గురు కలిసి ఫాంహౌస్‌లోని స్విమ్మింగ్‌పూల్ వద్దకు వెళ్లారు. స్విమ్మింగ్‌పూల్‌లోకి దిగిన సోయబ్‌ఖాన్ ఎక్కువ నీళ్లు ఉన్నవైపు వెళ్లాడు. అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఈతరాక నీటమునిగిన బాలుడు రాజేంద్రనగర్: స్విమ్మింగ్‌పూల్‌లో నీట మునిగి ఓ బాలుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గండిపేట గ్రామంలో ఉన్న డ్యూడ్రాం ప్రైవేటు ఫాంహౌస్‌కు హయత్‌నగర్‌కు చెందిన రాజు కుటుంబం వచ్చింది. వారంతా కలిసి ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఈత కొడుతున్న క్రమంలో అతని కుమారుడు ప్రసన్న బాబు (7) నీటిలో మునిగిపోయాడు. విషయాన్ని గమనించేలోపే అతను నీట మునిగి మృతిచెందాడు. హుటాహుటిన బాలుడిని మొయినాబాద్‌లోని భాస్కర ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. నార్సింగి పోలీసులకు రాత్రి వరకు బాధితులు ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేయగానే కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని సీఐ రమణగౌడ్ తెలిపారు. -
ఓ బాలిక, ఓ యువతి మిస్సింగ్!
సాక్షి, రంగారెడ్డి : శంషాబాద్‌లో ఓ బాలిక, యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కిరాణా షాపుకు వెళ్లిన పదహారేళ్ల మైనర్ బాలిక తిరిగి రాలేదు. ఈ ఘటన ఊటుపల్లిలో చోటుచేసుకోగా.. సిద్దంతిలో ఉంటే 23 ఏళ్ల యువతి కూడా అదృశ్యమైంది. బేకరీలో పనికోసమని వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆ యువతి తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు
చిన్నకోడూరు(సిద్దిపేట): జీవితాంతం కలిసి ఉంటాడనుకున్న భర్తే కాలయముడయ్యాడు. కట్నం కోసం కట్టుకున్న భార్య గొంతు నులిమి హత్య చేశాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండల పరిధిలోని విఠలాపూర్‌లో బుధవారం కలకలం రేపింది. పోలీసులు, గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగసాని శ్రీనివాస్‌రెడ్డికి మంగమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. కాగా శ్రీనివాస్‌రెడ్డి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ నేపథ్యంలో మంగమ్మను కట్నం కోసం అత్తింటి వారు వేధింపులకు గురి చేయడంతో మనస్థాపం చెందిన మంగమ్మ 10 ఏళ్ల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత శ్రీనివాస్‌రెడ్డి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌లో కూలీ పనులు చేసుకుంటూ అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో రాయచూర్‌కు చెందిన ఇందిర అనే మహిళతో పరిచయం ఏర్పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. తిరిగి శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామమైన విఠలాపూర్‌కు వచ్చి ఇక్కడ కూలీ పనులు చేసుకుంటూ నివసిస్తున్నాడు. వీరికి లోకేష్(06) కుమారుడు ఉన్నాడు. కొద్ది నెలలుగా మరిది, అత్త, ఆడపడుచులు ఇందిరను కట్నం కోసం వేధింపులకు గురి చేశారు. ఈ విషయాన్ని ఇందిర తన సోదరుడికి సమాచారం అందించింది. అయినప్పటికీ వారి వేధింపులు అలాగే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. బుధవారం తెల్లవారు జామున శ్రీనివాస్‌రెడ్డి భార్య ఇందిరను గొంతు నులిమి హత్య చేశాడు. కాగా తానే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు చిత్రీకరించాడు. విషయం తెలుసుకున్న సిద్దిపేట అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, రూరల్ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ అశోక్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతురాలి బంధువులు శ్రీనివాస్‌రెడ్డి, అత్త భూదవ్వ, ఆడపడుచు రేణుక, మరది కనకారెడ్డిలే హత్య చేశారని ఆరోపించారు. వారిని శిక్షించే వరకు ఇక్కడ నుంచి మృతదేహాన్ని తరలించొద్దని బీష్మించారు. దీంతో మృతురాలి భర్త శ్రీనివాస్‌రెడ్డి, అత్త భూదవ్వలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతురాలి సోదరుడు గట్టు వీరేశ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు భర్త, అత్తింటి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. ముందస్తుగా గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు. -
పేలిన స్కూటీ టైర్
మహేశ్వరం: స్కూటీ టైర్ పేలిపోవడంతో వాహనం అదుపుతప్పడంతో డీఎంఅండ్‌హెచ్‌ఓ సీనియర్ అసిస్టెంట్ దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని సిరిగిరిపురం గేటు సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ వెంకన్న నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వనస్థలిపురానికి చెందిన పోల చంద్రశేఖర్(45 ) రంగారెడ్డి జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం కందుకూరు మండలంలోని ఉద్యోగుల వేతనాలు, ఇతర పత్రాలను ఇచ్చేందుకు తన స్కూటీ (టీఎస్ 08 ఈహెచ్ 5491)పై మహేశ్వరం ఎస్టీఓ కార్యాలయం వైపు వస్తున్నాడు. ఈక్రమంలో సిరిగిరిపురం గేటు వద్ద స్కూటీ టైర్ పగిలిపోవడంతో వాహనం కిందపడింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ కిందపడిపోవడంతో తలకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్త్రావం జరిగి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెంటనే వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతుడి జేబులో లభించిన ఐడెంటిటీ కార్డుతో సాయంతో అతడి వివరాలు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. స్కూటీ టైర్ పగిలిపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు, స్థానికులు తెలిపారు. మృతుడి తోటి ఉద్యోగులు ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
రాముడు కాదు.. రాక్షసుడు
షాద్‌నగర్‌రూరల్: ఒక్కరు కాదు... ఇద్దరు కాదు ఏకంగా ఐదు మందిని హతమార్చాడు.. బంధాల ను, బంధుత్వాలను పక్కన పెట్టి కిరాతకంగా వ్యవహరించాడు.. చిన్న చిన్న సంఘటన మనస్సులో పెట్టుకుని రాములు మానవ మృగంలా మారాడు. కన్న తండ్రిని, కట్టుకున్న భార్యలను, ప్రియురాలిని కర్కషంగా హతమార్చాడు. తాజాగా ప్రియురాలిని దారుణంగా హత్య చేసి మళ్లీ పోలీసులకు చిక్కాడు. కిరాతకుడి అరెస్టుకు సంబంధించిన వివరాలను శుక్రవారం సా యంత్రం షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ వెల్లడించారు. కోరిక తీర్చలేదని ప్రియురాలి హత్య.... ఫరూఖ్‌నగర్ మండలం మహల్ ఎలికట్ట గ్రామా నికి చెందిన రాములు కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన జంగం మంగమ్మతో పరిచయం ఏర్పడింది. దీంతో తన కోరిక తీర్చాలని రాములు మం గమ్మను వేధించాడు. అందుకు ఆమె నిరాకరిం చింది. అయితే తన కోరిక తీర్చలేదని ఎలాగైనా ఆ మెను అంతమొందించాలని రాములు కుట్రపన్నా డు. ఈ నేపథ్యంలో ఈనెల 26న సాయంత్రం జం గం మంగమ్మ కూలీ పనులు చేసి ఒంటరిగా ఇం టికి వెలుతున్న సమయంలో మహల్ ఎలికట్ట గ్రా మ శివారులో రాములు ఆమె ఒంటిపై కిరోసిన్ పో సి నిప్పటించాడు. ఈ విషయాన్ని గమనించిన సా ్థనికులు 108 సహాయంతో మంగమ్మను చికిత్స ని మిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స ని మిత్తం ఆమెను ఉస్మాని యా ఆసుపత్రికి తరలించ గా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి రాములును శుక్రవారం అరెస్టు చేసి రిమాం డ్కు తరలించినట్లు ఏసీపీ సురేందర్ తెలిపారు. ఇప్పటికే నలుగురి హత్య... రాములుకు 24ఏళ్ళ కిందట మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామానికి చెందిన పార్వతమ్మతో మొదటి వివాహమయింది. కొంత కాలం రాములు పార్వతమ్మల కాపురం సజావుగా సాగింది. ఆతర్వాత వారిద్దరి మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో రాములు మొదటి భార్య పార్వతమ్మ ఒంటి పై కిరోసిన్ పోసి హత్య చేశాడు. తర్వాత కొందుర్గుకు చెందిన స్వప్నతో రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెపై అనుమానం పెంచుకుని తండ్రి జంగం అలియాస్ పులాయిల అడివయ్యతో పాటుగా భార్య స్వప్నలను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ కేసులో రాములు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కిషన్‌నగర్ గ్రామానికి చెందిన మంజులను మూడో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. రాములు నేర చరిత్ర తెలుసుకున్న మంజుల బంధువులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఎలికట్ట గ్రామంలో ఉన్న 20గుంటల పొలాన్ని మంజుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఆమెను వివాహమాడాడు. ఈ నేపథ్యంలో మూడో భార్య మంజులను మభ్యపెట్టి ఆమె పేరు న ఉన్న భూమిని విక్రయించాడు. ఈ విషయంలో మూడో భార్య మంజుల కుటుంబ సభ్యులకు, రాములుకు మధ్య గొడవలు జరిగాయి. దీంతో కొంత కాలం పాటు మంజుల తన పుట్టింటికి వెళ్లింది. దీంతో భూ విక్రయ డబ్బులు ఇస్తానని మంజు ల కుటుంబ సభ్యులను ఒప్పించి భార్యను కాపురానికి తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యం 2016లో డిసెంబర్లో మూడో భార్య మంజుల తండ్రి పోచయ్య మహల్ ఎలికట్ట గ్రామానికి వచ్చాడు. అప్పటికే మామ పోచయ్య పై పగపెంచుకున్న రాములు అతడిని మద్యం సేవించేందుకు మహల్ ఎలికట్ట గ్రామ శివారులోకి తీసుకెళ్లి బండరాళ్లతో దారుణంగా హతమార్చాడు. కన్న తండ్రిని, కట్టుకున్న వాడే అతికిరాతకంగా హతమార్చాడని తెలియడంతో మూడో భార్య మంజుల రాములును వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఒంటిరిగా ఉన్న రాములు తాజాగా అదే గ్రామానికి చెందిన మంగమ్మ లోబర్చుకునేందుకు ఆమె వెంట పడ్డాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెపై కోపం పెంచుకున్న రాములు మంగమ్మను హతమర్చాడు. ఇప్పటికే ఐదు హత్యలు చేసిన రాములు నరహంతకుడిగా మారాడు. జైలుకు వెళ్లినా మారని తీరు... నాలుగు హత్యలు చేసిన రాములు అన్ని కేసుల్లో జైలు శిక్షలు అనుభవించాడు. అయినా రాములు వ్యవహార శైలి మార్చకోలేదు. కన్న తండ్రిని, కట్టుకున్న భార్యను హతమార్చిన కేసులను కోర్టులో కొట్టేసినట్లు, 2016లో మామను హత్య చేసిన కేసు మహబూబ్‌నగర్ కోర్టులో నడుస్తున్నట్లు ఏసీపీ సురేందర్ తెలిపారు. ఐదు హత్యలకు పాల్పడిన రాములుపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు ఏసీపీ తెలిపారు. -
న్యాయం కోసం... భర్త ఇంటి ఎదుట ధర్నా
జూబ్లీహిల్స్: ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..వారికి ఇద్దరు సంతానం. కొన్నేళ్ల తర్వాత భర్త మరో మహిళ మోజులో పడి భార్యను వదిలేశాడు. పిల్లలను తీసుకొని ఇంటికి తాళం వేసి వెళ్లడంతో దిక్కుతోచని బాధితురాలు భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగిన సంఘటన మధురానగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గ్రామానికి చెం దిన తోట లక్ష్మి, కృష్ణశంకర్ 2008లో ప్రేమ వివా హం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నా రు. రెండేళ్ల క్రితం నగరానికి వలసవచ్చిన లక్ష్మి, కృష్ణ శంకర్ దంపతులు మధురానగర్‌లోని సీ 83బ్లాక్‌లోని దివ్య రెసిడెన్సీలో అద్దెకు ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం శంకర్‌కు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసిన లక్ష్మి భర్తతో గొడవకు దిగింది. గత జనవరిలో ఎర్రుపాలెంలో భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో కృష్ణశంకర్ తన ఇంటికి తాళం వేసుకొని పిల్లలను తీసుకొని వెళ్లిపోయాడు. తన పిల్లలను అపహరించాడ ని ఆమె ఎస్సార్‌నగర్‌లో ఫిర్యాదు చేయగా, తమ పరిధి కాదని, మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టా లని వారు సూచించడంతో అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకురన్న పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. చేతిలో చిల్లిగవ్వా లేదు... చేతిలో చిల్లిగవ్వా లేదు. తిండి లేదు. బట్టలు కూడా లేవు. తాళం పగలగొట్టి లోపలికి వెళదామంటే ఇరుగుపొరుగు అడ్డుకుంటున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నాకు న్యాయం చేయాలి. బాధితురాలు లక్ష్మి -
పెళ్లి కావడంలేదని యువకుడి ఆత్మహత్య
చేవెళ్ల: పెళ్లి సంబంధాలు కుదరడం లేదనే మనస్థాపం చెందిన ఓ యువకుడు ఉరివేసుకొని ఆతహ్మత్య చేసుకున్నాడు. ఈ సంఘటన చేవెళ్ల మండలంలోని పామెన గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... చేవెళ్ల మండలంలోని పామెన గ్రామానికి చెందిన తొలికట్ట నర్సింహారెడ్డి, లక్ష్మమ్మలకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. నర్సింహారెడ్డి ఆర్టీసీ డ్రైవర్. కూతురు పెళ్లి కాగా, ఇద్దరు కుమారులు గ్రామంలో వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు. పెద్ద కుమారుడు రాఘవేందర్‌రెడ్డి (27)కి పెళ్లీడు వచ్చిందని రెండు మూడు సంబంధాలు చూసిన అవి కుదరలేదు. దీంతో యువకుడు తనకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్థాపం చెంది తరచూ బాధపడేవాడు. గురువారం తెల్లవారుజామున పొలం వైపు వెళ్లి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం పొలాల వైపుకు వెళ్లిన మృతుడి చిన్నాన్న శివారెడ్డి మృతదేహాన్ని గమనించి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబీకులు మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
టార్గెట్ సెల్‌ఫోన్స్!
సాక్షి, సిటీబ్యూరో: అతనో రౌడీషీటర్ నగర పోలీసులు రెండుసార్లు అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు... అయినా పంథా మార్చుకోని అతను మరో ముగ్గురితో కలిసి దృష్టి మళ్లించి సెల్ఫోన్లు తస్కరించడం మొదలెట్టాడు. ఇటీవల కాలంలో మొత్తం ఐదు చోరీలు చేసిన ఈ ముఠాలో ముగ్గురిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం పటుకున్నారు. వీరి నుంచి 11 సెల్ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. యాకత్‌పురకు చెందిన మహ్మద్ పర్వేజ్ అలియాస్ ఫర్రు వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. దురలవాట్లకు బానిసైన అతను నేరాలు చేయడం మొదలెట్టాడు. హత్య, హత్యాయత్నం, ఆయుధ చట్టం కింద నమోదైన వాటితో సహా మొత్తం 24 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉండటంతో రెయిన్‌బజార్ పోలీసులు రౌడీషీట్ తెరిచారు. ఇతడి నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు విభాగం 2015, 2017ల్లో పీడీ యాక్ట్ ప్రయోగించింది. ఈ రెందు సందర్భాల్లోనూ ఏడాది చొప్పున జైల్లో ఉండి బయటకు వచ్చిన ఇతను సైనిక్‌పురికి మకాం మార్చాడు. మురాద్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్, చిలకలగూడ వాసి మహ్మద్ నదీమ్‌లతో పాటు గౌస్‌తో ముఠా కట్టాడు. వీరిలో నేరచరితుడైన ఇమ్రాన్‌పై మూడు కేసులు ఉన్నాయి. పర్వేజ్ పరిచయస్తులైన ఆటో యజమానుల నుంచి వాహనాన్ని అద్దెకు తీసుకునేవాడు. తాను ఆటోడ్రైవర్‌గా నటిస్తూ తన ముగ్గురు అనుచరులను ప్యాసింజర్ల మాదిరిగా వెనుక కూర్చోబెట్టుకుంటాడు. సికింద్రాబాద్ బస్టాండ్, రైల్వేస్టేషన్లతో పాటు మెహదీపట్నం బస్టాండ్లలో మాటు వేసూ ఈ ముఠా ఒంటరి ప్రయాణికుల్ని ఎంపిక చేసుకుని వారు వెళ్లాల్సిన గమ్యాలను చేరుస్తామని ఎర వేసి ఎక్కించుకుంటుంది. ఆటో కాస్త ముందుకు వెళ్లిన తర్వాత ప్రయాణికుడి దృష్టి మళ్లించే నిందితులు అతడి సెల్‌ఫోన్ కాజేస్తారు. ఆపై తమకు వేరే పని ఉందంటూ మార్గమధ్యంలో ఆ ప్రయాణికుడిని దింపేసి.. అతడు సెల్‌ఫోన్ పోయిన విషయం గుర్తించేలోపే వేగంగా ఉడాయిస్తారు. ఈ గ్యాంగ్ ఇటీవల కాలంలో ఇదే తరహాలో మహంకాళి, గోపాలపురం. ఆసిఫ్‌నగర్, బంజారాహిల్స్, రాయదుర్గం ఠాణాల పరిధిలో 11 సెల్ఫోన్లు చోరీ చేశారు. వీటిని అమ్మగా వచ్చిన మొత్తాన్ని అంతా పంచుకుని జల్సాలు చేస్తుంటారు. ఈ తరహా ఫిర్యాదులు వరుసగా అందడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగా అనుమానితులను గుర్తించారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు బి.పరమేశ్వర్, కేఎస్ రవి, కె.శ్రీకాంత్ తమ బృందాలతో వలపన్నారు. సికింద్రాబాద్‌లోని 31 బస్టాప్ వద్ద గౌస్ సహా మిగిలిన ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును మహంకాళి పోలీసులకు అప్పగించారు. -
వేధింపులకు తాళలేక బలవన్మరణం
పెద్దేముల్: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పెద్దేముల్ ఎస్ఐ సురేశ్, గ్రామస్తుల కథనం ప్రకారం.. మంబాపూర్ గ్రామానికి చెందిన చాకలి మంజుల (31), శ్రీనివాస్ దంపతులు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుండేవారు. అయితే వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రోజు భర్త శ్రీనివాస్ మద్యం సేవించి భార్య మంజులను వేధిస్తుండేవాడు. ఆదివారం కూడా భర్త వేధించడంతో మనస్తాపానికి గురైన మంజుల అర్ధరాత్రి ఇంట్లో దులానికి కట్టుకున్న చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటికి కుటుంబసభ్యులు మంజుల కోసం చూడగా దూలానికి వేలాడుతూ కనిపించింది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని కిందకుదించి పోస్ట్‌మార్టం నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి పాండయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త వేధింపులతోనే తన కూతురు మంజుల ఆత్మహత్య చేసుకుందని పాండయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతురాలికి కుమారులు అభిషేక్, విష్ణువర్దన్ ఉన్నారు. -
బెట్టింగ్ వీరి ప్రొఫెషన్
శంషాబాద్: క్రికెట్ బెట్టింగ్ ప్రొఫెషన్‌గా మార్చుకొన్న ఇద్దరు సోదరులతో పాటు వారికి సహకరించిన ఓ ఏజెంట్, ఓ గ్యాంబ్లర్‌ను శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో పాతనగరంలోని ఘాన్సీబజార్‌కు చెందిన అకింత్ అగర్వాల్(28), మోహిత్ అగర్వాల్(25) క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో నిరంతరంగా బిగ్‌బాష్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు బెట్టింగ్‌లపై నిఘా పెంచారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తాలో ఉన్న ఓ హోటల్ ఓ గదిని అకింత్ అగర్వాల్, మొహిత్ అగర్వాల్‌తో పాటు జిడిమెట్ల ప్రాంతానికి చెందిన యాసిమిన్ మహేష్(44) కలెక్షన్ ఏజెంట్, బెట్టింగ్ సబ్ ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తున్న చార్‌కమాన్ బస్తీకి చెందిన రోహిత్ అగర్వాల్ (27) అద్దెకు తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 5 లక్షల నగదుతో పాటు ఎనిమిది సెల్ఫోన్లు, ఓ క్యాలికులేటర్, స్కోరింగ్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా అంకిత్, మొహిత్ అగర్వాల్‌లు 2016 క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుత సుల్తాన్‌బజార్ పోలీసులకు చిక్కి జైలుశిక్ష సైతం అనుభవించారు. అదే తరహాలో 2018 ఐపీఎల్ క్రికెట్ సందర్భంలో రాజేంద్రనగర్, వెస్ట్‌మారేడ్‌పల్లి పోలీసులు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ లావాదేవీలన్నింటినీ వీరు కొనసాగిస్తున్నారని డీసీపీ ప్రకాష్‌రెడ్డి తెలిపారు. యువత క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడకూడదని డీసీపీ సూచించారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా చాలామంది యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసులు గట్టి నిఘా వేసి ఉంచారని చెప్పారు. బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసి ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులను డీసీపీ అభినందించారు. -
రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి..
రాజేంద్రనగర్: రెడిమిక్స్ వాహనం అదుపు తప్పి మినరల్ వాటర్ సప్లే చేసేందుకు వెళ్తున్న టాటా ఏసీ ఆటోని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ సంఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెడిమిక్స్ వాహనం ఆటోని ఢీకొట్టి ముందుకు ఈడ్చుకెళ్లి హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పల్టీకొట్టింది. దీంతో ఆటోలోని ఇరువురు ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. స్తంభాన్ని ఢీకొట్టకుండా అలాగే వెళ్లి ఉంటే పక్కనే ఉన్న గుడిసెలపై పడి మరింత ప్రాణ నష్టం సంభవించేది. ఈ సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట మూవీ టవర్స్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోకాపేట నుంచి ఖానాపూర్ వెళ్లేందుకు మూవీ టవర్స్ మీదుగా రెడిమిక్స్ వాహనం బుధవారం రాత్రి వెళ్తుంది. రోడ్డు నిటారుగా ఉండడంతో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న టాటా ఏసీ ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది. ఇందులోని వాటర్ సప్లే చేసే వట్టినాగులపల్లికి చెందిన అనిల్‌కుమార్(27), హేమంత్‌రెడ్డి(30) ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. రెడిమిక్స్ డ్రైవర్ వాహనంలోని ముందు భాగంలో ఇరుక్కుపోయాడు. అతి కష్టం మీద గచ్చిబౌలి ట్రాఫిక్ సీఐ రవికుమార్, నార్సింగి ఇన్స్పెక్టర్ నారాయణగౌడ్‌లు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. క్లినర్ సైతం తీవ్రగాయాలకు గురయ్యారు. ఇరువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి తరలివచ్చారు. సహాయక చర్యల్లో పోలీసులకు సహకరించారు. తప్పిన పెను ప్రమాదం... రెడిమిక్స్ వాహనం రోడ్డు పక్కన ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ దాటికి స్తంభం పక్కకు ఒరిగింది. స్తంభానికి ఉన్న ఒక వైరు మాత్రం తెగి కిందపడింది. స్తంభం పూర్తిగా కింద కు పడి వైర్లు పడిఉంటే మరింత ప్రమాదం చోటు చేసుకునేది. సంఘటన జరిగిన వెంటనే ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని విద్యుత్ అధికారులకు సమాచారం అందించి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. రెడిమిక్స్ వాహనాలను నిషేధించండి... రెడిమిక్స్ వాహనాల కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానిక ప్రజలు బుధవారం రాత్రి పోలీసుల ఎదుట వాపోయారు. ప్రతి రోజు ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటుందన్నారు. రెడిమిక్స్ వాహనాలు అదుపు తప్పి తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వాటిని నిషేధించాలని వెల్లడించారు. కేవలం రాత్రి 10 గంటల అనంతరం మాత్రమే అనుమతించాలని పోలీసులను కోరారు. -
ఒడిశా బాలికపై ఇద్దరు అత్యాచారం
మంచాల: పొట్టకూటి కోసం ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు వచ్చిన ఒడిశా బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మంచాల మండల పరిధిలోని బోడకొండ గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బోడకొండలో కొన్నేళ్లుగా ఒడిశా రాష్ట్రంలోని బాలంగీర్ జిల్లా తురేకాన్ మండలం శ్యామల గ్రామానికి చెందిన పలువురు కూలీలు పని చేస్తున్నారు. అయితే, గ్రామానికి చెందిన యువకులు శ్రీను, మహేందర్ కూడా బట్టీలో పని చేస్తున్నారు. సోమవారం రాత్రి ఒడిశా రాష్ట్రానికి చెందిన బాలిక(15)పై వీరు అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి చీకటి సమయం కావడంతో కూలీలు భయపడి మిన్నకుండిపోయారు. మంగళవారం ఉదయం జరిగిన సంఘటనపై కూలీలు బట్టీ యాజమాన్యంతో గొడవపడ్డారు. తాము ఇక్కడ ఉండమని, రక్షణ లేదని వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. దీంతో వారు కూలీలకు సర్ది చెప్పి కొంత డబ్బు ఇస్తామని ఆశచూపారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వివరాలను సేకరించి నిందితులపై కేసు నమోదు చేశారు. బాధితురాలైన బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. -
‘మోజు తీరాకా నేనెవరో తెలీదంటున్నాడు’
సాక్షి, హైదరాబాద్: ప్రేమించి వివాహం చేసుకొని ఇప్పుడు వరకట్నం కోసం మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ ప్రేమావతిపేటకు చెందిన వికలాంగురాలు లిల్లీకుమారి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుద్వేల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో లిల్లీకుమారి మాట్లాడుతూ.. ‘ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ బేస్‌పై కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నా, అదే కార్యాలయంలో సీహెచ్ శ్రీధర్ సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మా ఇద్దరికి 2010లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహం నుంచి ప్రేమ వరకు దారి తీసింది. 2014వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన శంషాబాద్ మండలం సాతంరాయి వద్ద గల రామాలయం గుడిలో శ్రీధర్ నన్ను వివాహం చేసుకున్నాడు. అనంతరం బుద్వేల్‌తో పాటు రాజేంద్రనగర్, శివరాంపల్లిలలోని అద్దె గృహాల్లో కాపురం చేశాం. 18 నెలల పాటు తమ దాంపత్య జీవితం సాఫీగా సాగింది. అనంతరం శ్రీధర్ తల్లి సరోజ, తమ్ముడు డాక్టర్ రాజ్‌కుమార్, చెల్లెలు సునీత వచ్చి మా కాపురంలో చిచ్చుపెట్టారు’ అని లిల్లీకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. అనేక రకాలుగా వేధించారని, అదనపు కట్నం కోసం వేధించడంతో రూ. 7 లక్షల నగదు, ఆరు తులాల బంగారం, ద్విచక్ర వాహనాన్ని అందించామన్నారు. అయినా కట్నం కోసం వేధించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో రాజేంద్రనగర్ పోలీసులు కేసు పెట్టడంతో రాజీకి వచ్చి సరిగ్గా చూసుకుంటానని పెద్దలు, పోలీసుల సమక్షంలో తెలపడంతో కాపురానికి వెళ్లినట్లు తెలిపారు. ఇదే సమయంలో రూ.35 లక్షల రూపాయల కట్నంతో మరో వివాహం చేసుకునేందుకు తన భర్త శ్రీధర్ సిద్ధమయ్యాడని, ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు మరోసారి వేరొక వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసిందని, విషయంలో పోలీసులు తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వికలాంగురాలినైన తనను పెళ్లి చేసుకొని మోజు తీరిన అనంతరం నీవు ఎవరో నాకు తెలియదని చెబుతున్నాడని వాపోయింది. ఈ విషయంలో పోలీసులు స్పందించి న్యాయం చేయాలని లేకపోతే తనకు ఆత్మహత్యే శరణమని వెల్లడించారు. ఈ విషయమై శ్రీధర్‌ను వివరణ కోరేందుకు వెళ్లగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
అత్తాపూర్: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం చెంది న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజేంద్ర నగర్ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ (22) బీటెక్ విద్యార్ధి. గురువారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి పయనమయ్యాడు. హిమాయత్‌సాగర్ సౌడమ్మ రహదారి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ప్రవీణ్ కుటుంబీకులు వెంటనే ఘట నా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. ముగ్గురు ఆడపిల్లల తరువాత జన్మించిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. -
బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం
ఇబ్రహీంపట్నం: ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై నేపాల్ దేశానికి చెందిన సహచర విద్యార్థి అత్యాచారం చేశాడు. అనంతరం అసభ్యకరమైన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈమేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో జరిగింది. గురువారం సీఐ గురుశారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. నిజమాబాద్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని ఇబ్రహీంపట్నంలోని ఎస్టీ హాస్టల్లో ఉంటూ స్థానిక గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. సహచ విద్యార్థి అయిన నేపాల్ దేశానికి చెందిన ఆరిఫ్‌అన్సారీ(22) ఆమెతో స్నేహిం చేశాడు. విద్యార్థినిని నమ్మించి ఇబ్రహీంపట్నంలోని తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం విద్యార్థికి సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితురాలు ఈనెల 10 ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు నిందితుడిపై ఎస్సీఎస్టీ అట్రాసిటి, ఆత్యాచారం కేసులను నమోదు చేసి బుధవారం రిమాండుకు తరలించారు. -
చేతబడి చేసి తీసుకెళ్లారు : చంద్రముఖి
బంజారాహిల్స్: గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్ధి, ట్రాన్స్‌జెండర్ ఎం.రాజేష్ అలియాస్ చంద్రముఖి(32) అదృశ్యంపై మిస్టరీ వీడింది. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చంద్ర ముఖి బుధవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షం కావడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. తన కూతురు కనిపించడం లేదని చంద్రముఖి తల్లి హైకోర్టులో హెబియస్‌కార్పస్ పిటీషన్ దాఖలు చేయడంతో బుధవారం పోలీసులకు చెమటలు పట్టాయి. ఏమాత్రం ఆచూకి లేని చంద్రముఖిని గురువారం ఉదయంలోగా హైకోర్టులో ఎలా ప్రవేశపెట్టాలో తెలియక సతమతమయ్యారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా విడిపోయి తెలుగు రాష్ట్రాలను జల్లెడపట్టారు. ఎట్టకేలకు రాత్రి 11 ప్రాంతంలో చంద్రముఖి సికింద్రాబాద్‌లోని లంబా థియేటర్ సమీపంలో ఉన్నట్లు సమాచారం అంద డంతో పోలీసులు ఆమెను స్టేషన్‌కు ర ప్పించడంతో కథ సఖాంతమైంది. గురువారం ఉదయం ఆమెను హైకోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవే శపెట్టారు. అంతకుముందు ఆమె విలేకరులతో మాట్లా డుతూ.. ఆ రోజు ఉదయం 8 గంటలకు రూ.25 వేలు బ్యాంకులో జమ చేసేందుకు వెళుత్తుండగా ఓ ఆటో ఎక్కడం జరిగిందన్నారు. ఆ ఆటో వాల తనను కోఠిలోని ఓ వీధిలోకి తీసుకెళ్లాడని అక్కడ మరో ఆటో ఎక్కి ఎల్బీనగర్లో దిగానన్నా రు. అక్కడ బస్సు ఎక్కి విజయవాడలో, అక్కడి నుం చి తిరుపతి, అక్కడి నుంచి చెన్నై వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఎవరో తనను చేతబడి చేసి ముందుకు నడిపించినట్లుగా ఉందని చెప్పారు. -
భార్య వివాహేతర సంబంధం.. ఒకే కుటుంబంలో!
ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఎస్.హన్మంతుకు ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు. ఆయన రంగారెడ్డి జిల్లా కుర్మల్‌గూడలోని రాజీవ్‌గృహకల్ప కాలనీలో ఆరు నెలలుగా నివాసం ఉంటున్నారు. హన్మంతు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోసిస్తున్నాడు. హన్మంతుకు చంద్రకళతో పది సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. అయితే, కుమారుడు కావాలని హన్మంతు చంద్రకళ చెల్లెలు సూజాతను ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. తరువాత చంద్రకళకు కొడుకు పుట్టాడు. సూజాతకు కూడా కొడుకు, కూతురు పుట్టారు. అందరూ కలిసి జీవిస్తున్నారు. కాగా, కొంత కాలంగా రెండవ భార్య సూజత వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో హన్మంతు మందలించాడు. ఇలా చేయడం తగదని చెప్పినా వినిపించుకోకపోవడంతో చేయిచేసుకున్నాడు. ఈ నెల 18న సుజాత తన కుమారుడిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బాబును హన్మంతు ఇంట్లోనే వదిలేసింది. ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో సహజీవనం చేస్తుందనే విషయం హన్మంతు, చంద్రకళకు తెలిసింది. దీంతో వారు కొద్ది రోజులుగా మానసిక క్షోభకు గురవుతున్నారు. సుజాతపై వారు అప్పట్లోనే ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో ఉంది. అయితే, శుక్రవారం రాత్రి పిల్లలు హాల్లో పడుకొని ఉండగా.. హన్మంతు (40), చంద్రకళ(30), చిన్న కూతురు మంజుల(8)లు పడక గదిలో ఒకే తాడుకు ఉరివేసుకొని అత్మహత్య చేసుకున్నారు. హాల్లో పడుకున్న ముగ్గురు పిల్లలు నిద్రలేచి కిటికిలో నుంచి చూసి భయబ్రాంతులకు గురయ్యారు. ఎడుస్తూ కేకలు పెట్టడంతో చుట్టు పక్కల వారు వచ్చి చూశారు. పైనే నివాసం ఉన్న హన్మంతు అక్క తలుపులు పగలగొట్టి లోపలకి వెళ్లి చూసే సరికి విగత జీవులుగా వేలాడుతున్నారు. ఆదిబట్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ నరేందర్, ఎస్ఐ రామకృష్ణ వచ్చి మృతదేహాలను కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. గదిలో సుసైట్నోట్ లభించినట్టు తెలిసింది. అయితే పోలీసులు ధ్రువీకరించలేదు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. సాయి, వెంకట్, కిట్టు అనే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
రెండు చావులకు నా భార్యే కారణం: భర్త సూసైడ్ నోట్
సాక్షి, పరిగి: ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన పరిగిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. చావుకు తన భార్యే కారణమని సూసైడ్ నోట్ సైతం రాశాడు. పోలీసులు, గ్రామస్తులు వివరాల ప్రకారం.. పరిగి పట్టణంలోని బాహర్పేట్ వల్లభనగర్‌కు చెందిన ముకుంద్ శ్రీనివాస్ (35) సహకార సంఘం కార్యాలయంలో ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గతంలో అతనికి వేరొక మహిళతో వివాహం జరగ్గా మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. నాలుగేళ్ల క్రితం శ్రీనివాస్ కొడంగల్‌కు చెందిన భాగ్యలక్ష్మిని కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో 15 రోజుల క్రితం శ్రీనివాస్ తల్లి సత్తెమ్మ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో గత మూడు రోజుల క్రితం కొడంగల్‌లోని అత్తవారింటికి శ్రీనివాస్ భార్య పిల్లలతో కలిసి నిద్ర చేసేందుకు వెళ్లాడు. అక్కడ భార్యభర్తలు గొడవపడ్డారు. గురువారం భార్య పిల్లలను అక్కడే వదిలి తన నివాసానికి చేరుకొని ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందాడు. రాత్రి 11 గంటల సమయంలో చుట్టు పక్కల వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి అతని వద్ద లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు చావులకు నా భార్యే కారణం.. మృతుడు శ్రీనివాస్ రాసిన సూసైడ్ నోట్లోని సారాంశం ఇది.. ఈ నెల 10న మా అమ్మ ఉరి వేసుకుని మృతి చెందింది. దీంతో దశదిన ఖర్మ అయిపోయాక 21వ తేదీన భార్య పిల్లలతో కలిసి కొడంగల్‌లోని అత్తవారింటికి వెళ్లాను. అక్కడ రాత్రి సమయంలో నా కూతురు తినకుండా మారాం చేసింది. ఆ సమయంలో నేను ఆ పక్కనే ఉన్నాననే విషయం మరిచిపోయి నా భార్య కూతురును బెదిరించింది. నీ నాయనమ్మను ఉరేసి చంపాను. నిన్ను. మీ నాన్నను కూడా చంపేస్తాను అని బెదిరించింది. వెంటనే వెళ్లి నేను మా అమ్మను ఎందుకు చంపావని తనని నిలదీశా. కోపంతో నన్ను కింద తోసేసింది. అవును మీ అమ్మను చంపాను. నిన్ను చంపుతాను.. ఏంచేస్తావంటూ బెదిరించింది. ఇంట్లోకి తీసుకు వెళ్లి రాత్రి బయటకు రానివ్వలేదు. మరుసటి రోజు 22న ఎలాగోలా బయటకు వచ్చి పరిగికి చేరుకున్నాను. ఇక బతకి ప్రయోజనం లేదని ఆత్మహత్య చేసుకుంటున్నా. అంత్యక్రియలకయ్యే ఖర్చుకు రూ. 500 పక్కింటి వారి దగ్గర ఉన్నాయి తీసుకుని అంత్యక్రియలు జరిపించండి. నా ఇద్దరు కూతుళ్లు నవ్యశ్రీ, సాత్వికలను మా అక్క సంరక్షణలో ఉంచండి. మా అమ్మతో పాటు నా చావుకు కారణమైన నా భార్యను విచారించి శిక్షించి పోలీసులు న్యాయం చేయాలంటూ ముగించాడు. -
పండుగ మిగిల్చిన విషాదం
రాజేంద్రనగర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఇంటి ముందు బాధిత కుటుంబీకులు, బంధువులు మృతదేహంతో ధర్నా చేపట్టారు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాబుల్‌రెడ్డినగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబుల్‌రెడ్డినగర్ ప్రాంతానికి చెందిన సంగమేశ్వర్‌రెడ్డి(40) తన కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి(15)తో కలిసి ఈ నెల 7వ తేదీ దీపావళి పండుగ రోజు దుర్గానగర్‌లో బాణసంచా కొనుగోలు చేసేందుకు వెళ్లారు. రోడ్డు దాటుతున్న క్రమంలో పల్సర్ వాహనంపై వేగంగా వచ్చిన ముగ్గురు యువకులు వీరిని ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన తండ్రీకొడుకులను చికిత్స నిమితం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న సంగమేశ్వర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి కన్నుమూశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ప్రమాదానికి కారణమైన వాహన యజమాని బాబుల్‌రెడ్డినగర్‌కు చెందిన రణవీర్‌సింగ్ ఇంటి ముందు మృతదేహంతో ధర్నాకు దిగారు. రణవీర్‌సింగ్ ఇంట్లో అద్దెకు ఉంటున్న యువకుడు ఈ వాహనాన్ని పండుగ రోజున తీసుకువెళ్లి తండ్రీకొడుకులను ఢీకొట్టాడు. విషయం తెలుసుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులను, బంధువులను సముదాయించారు. వాహనం నడిపిన యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాగా రాత్రయినా ధర్నా కొనసాగుతోంది. -
వివాహేతర సంబంధం మహిళ.. దారుణ హత్య
సాక్షి, అనంతగిరి: అప్పు తీర్చలేదని ఓ మహిళను దుండగుడు అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. వ్యవసాయ పొలంలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వికారాబాద్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శిరీష కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వికారాబాద్ మండలం మదన్‌పల్లి గ్రామానికి చెందిన బోయిని మంజుల(35) ఈ నెల 9న హత్యకు గురైంది. మృతురాలి భర్త చంద్రయ్య మూడేళ్ల క్రితం మృతిచెందాడు. కాగా మంజులకు అదే గ్రామానికి చెందిన మంగళి రాజశేఖర్‌తో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. గత కొన్ని నెలల క్రితం మంజుల రాజశేఖర్ వద్ద రూ. 80 వేలు అప్పుగా తీసుకుంది. తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వలేదు. అప్పుగా ఇచ్చిన డబ్బు అడిగితే ఇవ్వడం లేదని రాజశేఖర్ మంజులపై కసి పెంచుకున్నాడు. ఎలాగైన ఆమెను కడతేర్చాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో ఈ నెల 9న రాజశేఖర్ గ్రామంలోని కల్లు దుకాణంలో కల్లు తీసుకుని గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలోకి వెళ్లాడు. మంజుల కూడా అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య డబ్బుల విషయమై ఘర్షణ జరిగింది. దీంతో రాజశేఖర్ కత్తితో మంజుల మెడ, చేతిపై దాడి చేసి హత్యచేశాడు. అనుమానం బలపడింది అదే గ్రామానికి చెందిన కిష్టయ్య పొలంలో మంజుల విగతజీవిలా పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. హత్య జరిగిన ప్రదేశంలో బీరు బాటిళ్లు, కల్లు ప్యాకెట్లు పడి ఉండటాన్ని గమనించారు. అక్కడ లభించిన ఆధారాల ప్రకారం మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో అదే గ్రామానికి చెందిన రాజశేఖర్‌తో అక్రమ సంబంధం ఉందని బయటపడింది. దీంతో నిందితుడి పరారీలో ఉండడం, ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో అనుమానం బలపడింది. గాలింపు ముమ్మరం చేసిన పోలీసులకు సోమవారం యంఆర్పీ చౌరస్తాలో రాజశేఖర్ పట్టుపడ్డాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని, రాజశేఖర్‌పై రౌడీషీట్ కూడా తెరుస్తున్నట్లు డీఎస్పీ శిరీష చెప్పారు. కేసును ఛేదించిన సీఐ సీతయ్య, ఎస్ఐ లక్ష్మయ్యను డీఎస్పీ అభినందించారు. -
గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు
సాక్షి, చేవెళ్ల: హైటెక్ కాలంలో కూడా ఇంకా ప్రజలు మూఢ నమ్మకాలను వీడడం లేదు. గుప్త నిధులు ఉన్నాయని క్షుద్రపుజలు నిర్వహిస్తున్నారంటే ప్రజల్లో ఇంకా చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేవెళ్ల మండల కేంద్రంలోని తులసీ వాటర్‌ప్లాంట్‌కు సమీపంలో ఉన్న ఓ పురాతన దర్గా వద్ద సోమవారం అర్ధరాత్రి కొంత మంది దుండగులు క్షుద్రపూజలు నిర్వహించారు. అంతటితో ఆగకుండా దర్గా వద్ద గుప్త నిధులు ఉన్నాయని తవ్వకాలు చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో వాటర్ ప్లాంట్ వద్ద ఉండే యువకులు దర్గా వైపు నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడం గుర్తించారు. అక్కడ ఎవరో వ్యక్తులు ఉన్నట్లు అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వస్తున్నట్లు గుర్తించిన దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ హడావుడిలో దుండగులు అక్కడే వారి బైక్‌ను వదిలి పరారయ్యారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించగా దర్గా వద్ద క్షుద్రపూజలకు ఉపయోగించిన నిమ్మకాయలు, కుంకుమ, ఆకులు, ఇతర పూజా సామగ్రి ఉంది. దర్గా మధ్యలో ఒక గుంత, దర్గాకు రెండు వైపుల రెండు గుంతలను తవ్వారు. దుండగులు మద్యం సేవించేందుకు తీసుకువచ్చిన బాటిళ్లు సైతం అక్కడ లభించాయి. తులసీ వాటర్ ప్లాంట్ వద్ద పనిచేసే యువకులు సమాచారంతో వచ్చిన పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. బైక్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరు నెలల క్రితం కూడా.. ఆరునెలల కిత్రం కూడా దర్గా ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కాలంలో కూడా ప్రజలు ఇలాంటి వాటిని నమ్మడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంటున్నారు. లేనిపోని ఆశలకు పోయి ప్రమాదాల్లో చిక్కుకుంటారని, ప్రజలు ఇలాంటి వాటిని నమ్మవద్దని పోలీసులు సూచించారు. ఈ విషయం ఆనోటా.. ఈనోటా మండలమంతా వ్యాపించడంతో మంగళవారం ప్రజలంతా దర్గా వద్దకు బారులు తీరారు. -
ఇబ్రహీంపట్నంలో ఘోర ప్రమాదం
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ బస్సు ఆటోట్రాలీని ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, 12 మంది గాయపడిన సం ఘటన ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీసుల కథనం ప్రకారం.. యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన రైతులు ప్రతి రోజు ఆకుకూరలను అమ్ముకునేందుకు హైదరబాద్ మార్కెట్‌కు వెళ్తుంటారు. రోజూ మాదిరిగానే ఆటోట్రాలీలో కూరగాయాలు నింపుకొని గ్రామం నుంచి బయల్దేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ సమీపంలో రైతులు ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న గొడుకాండ్లు యాదయ్య(59) అక్కడికక్కడే మృతిచెందగా కట్టెల రాములు(40), మంచాల జంగయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. వీరితో పాటు ప్రమాదంలో గాయపడిన మర్రిపల్లి వినోద్‌కుమార్, గుర్రం మధుకర్‌రెడ్డి, బోరిగె మహేందర్, కట్టల మహే ందర్, మేకల యాదగిరిరెడ్డి, మొగిలి జంగారెడ్డి, జి. రవీందర్, శ్యామల లక్ష్మమ్మ, గుడాల బాలమ్మ, మేకల కల్పనలను స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం నగరంలోని ఉస్మానియా, యశోద, సాయి సంజీవిని ఆస్పత్రులకు తరలించారు. నిర్లక్ష్యంగా బస్సును నడిపించిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మొండిగౌరెల్లిలో విషాదఛాయలు యాచారం: కరువు పరిస్థితులు పండించిన ఆకుకూరలకు మంచి ధర వస్తుందనే ఆశ ప్రాణాల మీదకు తెచ్చింది. పూదీనా, కొత్తిమీరా పండించే మొండిగౌరెల్లి రైతులు నిత్యం ప్రైవేట్ వాహనా ల్లో హైదరాబాద్‌లోని మాదన్నపేట మార్కెట్‌కు తరలించి 5:30 గంటల్లోపే విక్రయాలు జరిపి తిరిగి ఇంటికి చేరుకుంటారు. ఏళ్లుగా ఇదే మాదిరిగా గ్రామానికి చెందిన రైతులు ఆకుకూరలను మార్కెట్లో విక్రయిస్తారు. అదే మాదిరిగా ఆదివారం ఉదయం 4 గంటలకు ఆటోలో పూదీనా, కొత్తిమీరా తదితర ఆకుకూరలను తీసుకుని 13 మంది రైతులు మాదన్నపేట మార్కెట్‌కు బయల్దేరారు. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ దాటుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు రైతులు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రగాయాలపాలైన గొడుకొండ్ల యాదయ్య మృతిచెందగా, పలువురు తీవ్ర గాయాలపాలై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. యాదయ్య మృతితో వీధిన పడిన కుటుంబం... గొడుకొండ్ల యాదయ్య మృతితో ఆయన కుటుంబం వీధిన పడింది. యాదయ్యకు నాలుగు ఎకరాల వ్యవసాయ పొలం ఉన్నప్పటికీ బోరుబావుల్లో నీళ్లు లేకపోవడంతో యాచారం గ్రామానికి చెందిన కుమ్మరి గాలయ్య వద్ద పొలాన్ని కౌలుకు తీసుకుని ఆకుకూరలు సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. యాదయ్యకు భార్య మల్లమ్మతో పాటు ఇద్దరు కుమారులు ప్రవీణ్‌కుమార్, రాంప్రసాద్కుమార్, దివ్యాంగురాలైన కూతురు జంగమ్మ ఉంది. యాదయ్య మృతితో కుటుంబం వీధినపడింది. ఈ ప్రమాదంతో మొండిగౌరెల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటోట్రాలీ ప్రమాదాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచనలు చేశాడు. యాదయ్య కుటుంబీలకు సాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. క్షతగాత్రులను పరామర్శించిన వారిలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మరిపల్లి అంజయ్య యాదవ్, యాచారం జెడ్పీటీసీ కర్నాటి రమేష్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అచ్చెన మల్లీకార్జున్ తదితరులు ఉన్నారు. -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
సాక్షి, చేవెళ్ల: అప్పుల బాధతో వేర్దేరు చోట్ల ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. చేవెళ్ల మండంలో ఒకరు, ఆమనగల్లు మండలంలో మరొకరు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన దేవుని శివరాజ్(34) తనకు వారసత్వంగా వచ్చిన అర ఎకరం పొలంతో పాటు మరో రెండున్నర ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈఏడాది టమాట, మొక్కజొన్న, పూదీన పంటలు వేశాడు. వర్షాలు సక్రమంగా లేకపోవడంతో పాటు బోరుకూడా ఎండిపోవటంతో దిగుబడి సరిగా రాలేదు. సాగు కోసం సుమారు రూ.4లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం లేక కొన్ని రోజులుగా మదనపడుతున్నాడు. మంగళవారం గ్రామ బస్‌స్టేజీ సమపంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, కూతరు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సాకిబండ తండాలో.. ఆమనగల్లు: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని సాకిబండతాండాకు చెందిన రైతు నేనావత్ హన్మ(40) ఏడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేశాడు, ఇందుకోసం దాదాపు రూ.3 లక్షలు అప్పు చేశాడు. దీంతో పాటు కూతురు పెళ్లి కోసం మరో రూ.2 లక్షలు అప్పు చేశాడు. ఈ ఏడాది పంటలు సరిగా రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన హన్మ పొలం వద్ద బుధవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య దోళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఆమనగల్లు ఎస్ఐ మల్లీశ్వర్ తెలిపారు. -
రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడి హత్య..
శంషాబాద్: షాద్‌నగర్‌లో సంచలనం రేపిన యువకుడి హత్య కేసులో ప్రియురాలే నిందితురాలని పోలీసులు తేల్చారు. ఆమెతో పాటు మరో యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కేసు వివరాలను బుధవారం శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి తన కార్యాలయంలో వెల్లడించారు. ఫరూఖ్‌నగర్‌లో నివాసముండే ఎండీ పర్వీన్‌బేగం, అదే ప్రాంతంలో నివాసముంటున్న ఈరమోని శేఖర్(24) మూడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. అయితే, ఎనిమిది నెలలుగా పర్వీన్బేగంకు జానంపేటలో నివాసముంటున్న ఆసిఫ్ఖురేషితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో శేఖర్‌తో పర్వీన్ మాట్లాడుతున్న సమయంలో ఆసిఫ్ గమనించి ప్రశ్నించగా.. గతంలో అతడిని ప్రేమించానని, తన వద్ద కొంత డబ్బు కూడా అప్పుగా తీసుకుని శేఖర్ ఇవ్వడం లేదని తెలిపింది. దీంతో ఆసిఫ్‌కు శేఖర్‌పై కోపం పెరిగింది. ఈ క్రమంలో శేఖర్‌ను హత్య చేయాలని ఆసిఫ్, పర్వీన్‌లు పథకం వేశారు. ఈ నెల 20న పర్వీన్ శేఖర్‌ను తన ఇంటికి పిలిచింది. అక్కడి వచ్చిన తర్వాత బీరులో మాత్రం కలిపి ఇచ్చింది. మొత్తం మూడు బీర్లు తాగిన తర్వాత శేఖర్‌ను అక్కడే కాపు కాసి ఉన్న ఆసిఫ్ కత్తితో కడుపులో విచక్షణారహితంగా పొడిచాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అతడి శవాన్ని మూటగట్టి బయటపారేసి పరారయ్యారు. ఈ హత్య వెలుగులోకి రావడంతో డీసీపీ ప్రకాష్‌రెడ్డి సూచనల మేరకు బృందాలుగా ఏర్పడిన షాద్‌నగర్ పోలీసులు నగరం నుంచి తిరిగి వస్తున్న ఇద్దరు నిందితులను షాద్‌నగర్‌లో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు, కత్తులు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. -
యువకుడి దారుణ హత్య
షాద్‌నగర్‌రూరల్: యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన శనివారం ఉదయం ఫరూక్‌నగర్‌లోని గుండుగేరిలో వెలుగు చూసింది. ఫరూఖ్‌నగర్‌కు చెందిన శేఖర్(25)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా గొంతు కోసి హతమార్చారు. స్థానికుల సమాచారం మేరకు హత్య విషయం తెలుసుకున్న షాద్‌నగర్ ఏసీపీ సురేందర్, సీఐ శ్రీధర్‌లు వెంటనే ఘటనా స్ధలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. హత్య ఏవిధంగా జరిగింది? హత్య ఎవరు చేశారన్న విషయం ఇంకా తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. శేఖర్ ప్లంబర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలుసుకుని జనం పెద్ద ఎత్తున ఘటనా స్ధలానికి తరలివచ్చారు. -
ప్రేమికుల ఆత్మహత్య.. బోయిన్‌గుట్టలో ఉద్రిక్తత
కడ్తాల్(కల్వకుర్తి): వారి ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడంతో ఆత్మహత్య చేసుకున్నారు. 14 సంవత్సరాల బాలిక.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న 23 సంవత్సరాల అబ్బాయితో ప్రేమలో పడింది. ఇద్దరి వయసులో తేడాతో పాటు వరుసలు కూడా కుదరకపోవడంతో పెద్దలు వీరి ప్రేమను నిరాకరించారు. దీంతో బాలిక, యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. షాద్‌నగర్ ఎసీపీ సురేందర్, కడ్తాల్ ఎస్ఐ సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్ మండలం చరికొండ పంచాయతీ పరిధిలోని బోయిన్‌గుట్టతండాకు చెందిన నేనావత్ రఘు–మంగమ్మ దంపతుల రెండో కూతురు నేనావత్ రేణుక(14), అదే తండాకు చెందిన పాత్లవత్ హూమ్లా, కేడీ దంపతుల మూడో కుమారుడు పాత్లావత్ రాజునాయక్(23) ప్రేమించుకున్నారు. వివాహం చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు కడ్తాల్ పోలీస్ స్టేషన్లో అప్పట్లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్, కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక, ఆ యువడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. బాలికకు స్టేషన్లో కౌన్సెలింగ్ ఇచ్చి.. యువకుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపిచారు. ఇదిలా ఉండగా.. రెండు నెలల క్రితం జైలు నుంచి విడుదలైన పాత్లావత్ రాజు గతంలో మాదిరిగానే ఆటో నడుపుతూ బతుకువెళ్లదీస్తుండగా వారం రోజుల క్రితం రేణుకతో రాజు మాట్లాడాడని అదే తండాకు చెందిన కొందరు రేణుక తల్లితో చెప్పారు. దీంతో రేణుకను ఆమె తల్లి ఈ నెల 11న మందలించింది. మనస్తాపం చెందిన రేణుక 12వ తేదీ ఉదయం పురుగుల మందు తాగగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది. సోమవారం మృతదేహన్ని బోయిన్‌గుట్టకు తండాకు తీసుకువచ్చారు. అయితే, రాజు కారణంగానే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని అతడి ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. యువకుడి ఇంటి వద్ద ఇరువర్గాలకు చెందిన వారు ఘర్షణకు దిగడంతో సమాచారం అందుకున్న పోలీసులు తండాకు చేరుకుని ఇరువర్గాల వారిని శాంతిపజేశారు. రేణుక కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. మనస్తాపంతో ప్రేమికుడి ఆత్మహత్య.. ప్రేమించిన యువతి ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన పాత్లావత్ రాజు మంగళవారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా అప్పటికే తండాకు చేరుకున్న మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు తమ కుమారిడిది ఆత్మహత్య కాదని, హత్య చేసి నోట్లో పురుగుల మందు పోశారని ఆరోపించారు. దీంతో తండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలతో తండాలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం యువకుడి అంత్యక్రియలు నిర్వహించారు. ఇరువురి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మద్యం మత్తులో వ్యక్తిపై కత్తితో దాడి
పెద్దేముల్(తాండూరు): భార్యాభర్తల గొడవలో పక్కింటి వ్యక్తి తలదూర్చాడు. దీంతో దంపతులిద్దరూ ఏకమై మా సమస్య గురించి నీకెందుకు అని వారించడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి తన ఇంట్లో నుంచి కత్తి తీసుకొచ్చి భర్తను దాడి చేసిన సంఘటన పెద్దేముల్ పొలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండల బండపల్లి గ్రామానికి చెందిన చిన్నింటి బుజ్జమ్మ భర్త హన్మంతులు ఆదివారం రాత్రి సుమారు 9:30 సమయంలో కుటుంబ విషయమై గొడవ పడుతున్నారు.ç పక్కింటి వ్యక్తి చిన్నింటి రాములు వచ్చి గొడవ ఏంటీ..? నిత్యం ఇదేనా అంటూ మందలించాడు. దీంతో నీవు మా వద్దకు ఎందుకు వచ్చావు..? నీకు మా సంసారం విషయంతో సంబంధం ఏంటీ అంటు హన్మంతు రాములును ప్రశ్నించాడు. దీంతో రాములు పక్కనే ఉన్న రాడ్డుతో హన్మంతుపై దాడికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. అప్పటికే మద్యం మత్తుల్లో ఉన్న చిన్నింటి రాములు ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న కత్తి తీసుకొచ్చి హన్మంతు తలపై పొడిచాడు. తీవ్రంగా గాయపడిన హన్మంతును గ్రామస్తులు వెంటనే చికిత్స నిమిత్తం తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీకి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుభాష్ అదే రాత్రి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గతంలో ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా.. అని ఆరా తీశారు. హన్మంతు భార్య బుజ్జమ్మ ఫిర్యాదు మేరకు రాములును అదుపులోకి తీసుకొని కేసు నమేదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఒత్తిడితో బతుకులు చిత్తు
కామారెడ్డి క్రైం: విద్యార్థి దశలోనే ఎదురవుతున్న ఒత్తిళ్ళకు యువత చిత్తవుతున్నారు. ఇక్కడితో అంతా అయిపోయింది, ఇంక చేసేదేమి లేదనే నైరాశ్యంలోనికి వెళ్లిపోతున్నారు. చదువుల పేరిట అటు విద్యాలయాల్లో, ఇంట్లో పెద్దలు నిర్దేశిస్తున్న లక్ష్యాలను చేరుకుంటామో లేదోనన్న బెంగ ఎంతో మంది విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. అలాంటి బలహీనమైన క్షణాలు వారిని మృత్యువైపు అడుగులు వేయిస్తున్నాయి. ఎంత చదివినా మార్కులు తక్కువగా వస్తున్నాయనే బాధలో కొందరు, పరీక్ష బాగా రాయలేకపోయామని మరికొందరు, ఫలితాలు నిరాశపరిచాయని ఇంకొందరు ఇలా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 11 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలవరపెడుతోంది. కొన్ని సందర్భాల్లో సమస్యలు ఎదురై మనోవేదనకు గురైనా భవిష్యత్తుపై భరోసాతో ముందుకుసాగాల్సిన విషయాన్ని గుర్తించాల్సి ఉంది. పిల్లలను ఉన్నతస్థానాల్లో చూడాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అదే సమయంలో పిల్లల శక్తి సామర్థ్య్లాలను సైతం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అవసరమైన విషయాల్లో తోడ్పాటును అందించాలి. సెల్ఫోన్లు, సినిమాల ప్రభావం పిల్లలపై ఏ మాత్రం ఉందో గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టసమయాల్లో మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా వారి భుజం తట్టాల్సిన అవసరాన్ని తల్లిదండ్రుల గుర్తించాలి. వీటి విషయాల్లో నిర్లక్ష్యం చేస్తూనే పిల్లల నుంచి ఉత్తమ ఫలితాలను ఆశించడం అనర్థాలకు దారి తీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే.... పరీక్షలు బాగా రాయ లేదని, అందరితో సమనంగా చదవలేకపోతున్నాననీ, మార్కులు తక్కువగా వస్తే తల్లిదండ్రులు ఏమంటారోననే భయాందోళనలు విద్యార్థుల్లో పెరిగాయి. ఇవే కొన్ని సందర్భాల్లో అత్మహత్యలకు కారణమవుతున్నాయి. తల్లిదండ్రులు, గురువులు వారి మానసిక పరిస్థితిని సకాలంలో గుర్తించక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. వారం క్రితం రెండు రోజుల వ్యవధిలో బానుసవాడలో ఓ 8వ తరగతి చిన్నారి, కామారెడ్డిలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 12న మోర్తాడ్ మండలంలో సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకరం. గత మార్చిలో తాడ్వాయికి చెందిన హారిక అనే ఇంటర్ విద్యార్థిని పరీక్షలో ఫెయిలయ్యానని ఉరేసుకుంది. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన సుప్రియ(19) అనే విద్యార్థిని టెట్ పరీక్షలు బాగా రాయలేదనే బాధలో ఉరేసుకుంది. ఉప్పల్వాయి గ్రామానికి చెందిన కుమ్మరి రజిత(25) అనే యువతి వీఆర్ఓ పరీక్ష బాగా రాయలేదని ఆత్మహత్యకు పాల్పడింది. అడ్లూర్‌కు చెందిన సుస్మిత(18) టెట్‌లో మార్కులు తక్కువగా వస్తున్నాయని మనస్థాపం చెంది రైలు కిందపడి ప్రాణం తీసుకుంది. కామారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని ప్రవళిక(19) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా జిల్లాలో ఈ యేడాది ఇప్పటిదాక జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నవారిలో 20 ఏళ్లలోపు వారు 20 మంది ఉన్నారు. మాధ్యమాల ప్రభావం... ఇటీవలి కాలంలో స్మార్ట్ఫోన్ల ప్రభావం యువతపై ఎంతగా పడుతోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అశ్లీలతను చూపించే వెబ్సైట్లు విద్యార్థి దశనుంచే యువతను పెడదారి పట్టిస్తున్నాయి. హైస్కూల్ స్థాయి నుంచి యువత మొబైల్ ఫోన్లను చేత పట్టుకుని నిమగ్నమవుతున్నారు. కళాశాలల్లో ఫోన్లను నిరాకరించే విషయంలో యాజమాన్యాలు దృష్టి సారించడం లేదు. ఎక్కడున్నా స్మార్ట్ఫోన్లలో కాలక్షేపం చేస్తూ సమయాన్ని వృథా చేసుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీని సరైన మార్గంలో ఉపయోగించుకోవాల్సిన యువతరం అదే టెక్నాలజీతో పెడదారి పట్టడంతో పాటు విలువైన సమయాన్ని వృథా చేసుకుంటోంది. తద్వారా చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. స్మార్ట్ఫోన్లను తమ పిల్లలను దూరంగా ఉంచాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు గుర్తించాల్సి అవసరం కనిపిస్తోంది. ఇక సినిమాల ప్రభావం ఏ విధంగా ఉన్నదో ఇటీవలి జగిత్యాలలో ఇద్దరు యువకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చూస్తే తెలుస్తుంది. సెల్‌ఫోన్ కొనివ్వలేదనే కారణంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. కొద్దిరోజుల క్రితం బిచ్కుందకు చెందిన పురుషోత్తం(19) అనే యువకుడు ఓ వివాహితను ఫోన్లో వేధించగా పెద్దలు పంచాయితీ పెట్టి మందలించారు. దీంతో మనస్థాపం చెందిన అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి దశలో యువతపై సెల్ఫోన్లు, సినిమాల ప్రభావం పడుతోందని ఇలాంటి సంఘటనలతో స్పష్టమవుతోంది. బాధ్యతగా వ్యవహరించాలి.. తమ పిల్లల చదువులు, వారి ప్రవర్తనల విషయంలో జరుగుతున్న సంఘటనలు తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తు చేస్తున్నాయి. ప్రశాంతమైన క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను పిల్లలకు అందించడంతో పాటు వారి శక్తి సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సాహం అందించాలని పలువురు సూచిస్తున్నారు. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసి కుటుంబాలు పెరిగాయి. నిత్యం విధులు, ఇంటి పనుల్లో బిజీగా ఉంటూ పిల్లలతో కలిసి సమయాన్ని గడపడం లేదు. వారికి ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఎందరో యువత మానసికంగా కృంగిపోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. తప్పనిసరిగా పిల్లలతో తల్లిదండ్రులు సమయాన్ని కేటాయిస్తూ వారి కష్ట, సుఖాల్లో అండగా నిలుస్తూ ఆలోచనలను పంచుకుంటే జరిగే తప్పిదాలను అరికట్టవచ్చు. వారి సమస్యలను తెలుసుకుని ప్రోత్సహించాలి. తప్పుదారిలో వెళ్తే దిశానిర్దేశం చేయాలే గానీ ఒత్తిళ్లకు గురి చేయడం సరికాదంటున్నారు విశ్లేషకులు. ఒత్తిడికి గురిచేయొద్దు.. పోటీ ప్రపంచంలో యాజమాన్యాలు, తల్లిదండ్రులు చదువు ఒక్కటే చూస్తున్నారు. పిల్లల సామర్థ్యానికి మించి ఒత్తిడికి గురి చేయొద్దు. వారి సామర్థ్యాలను సమస్యలను అర్థం చేసుకుని ప్రోత్సహించాలి. వారిలో అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. – లక్ష్మీనారాయణ, డీఎస్పీ, కామారెడ్డి -
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
సాక్షి, పరిగి (రంగారెడ్డి): అప్పుల బాధతో చె ట్టుకు ఉరివేసికుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పరిగి మండల పరిధిలోని నజిరాబాద్తండాలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసు లు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నజిరాబాద్తండాకు చెందిన కాళ్యానాయక్కు నలుగురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు సంతోష్ (22) డిగ్రీ మధ్యలో ఆపి త్రండికి తోడు గా ఇంటి పనులు చూసుకుంటున్నాడు. ఇద్దరు అక్కల వివాహం కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో మంగళవారం తెల్లవారు జాము న సంతోష్ పొలానికి వెళ్లి చింతచెట్టుకు ఉరివేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉద యం చింతకాయలు కోసేందుకు పొలానికి వెళ్లిన తండా యువకులు సంతోష్ చెట్టుకు వేలాడుతుండటాన్ని చూసి పరుగున వెళ్లి కుటుంబీకులకు సమాచారం అందించారు. కుటుంబీకులు వచ్చి చూడగా అప్పటికే మృతిచెందాడు. మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అందజేశారు. మృతుడి తండ్రి కాళ్యానాయక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
న్యాయవాది దారుణ హత్య
సాక్షి, తాండూరు టౌన్ (రంగారెడ్డి): గుర్తు తెలియని వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున తాండూరు రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాండూరు రైల్వే స్టేషన్ రెండో ఫ్లాట్‌ఫాంపై హత్యకు గురైన ఓ వృద్ధుడి మృతదేహాన్ని సోమవారం ఉదయం పోలీసులు గుర్తించారు. మృతుడు 70 ఏళ్ల వయసు, ముస్లిం మతానికి చెందిన వాడు. మృతుడి గొంతుకోసి, కడుపులో పలు చోట్లు కత్తిపోట్ల వల్ల చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అతని దగ్గర దొరికిన విజిటింగ్ కార్డు ఆధారంగా హతుడు కర్నూలు జిల్లాకు చెందిన ఓ న్యాయవాదిగా గుర్తించారు. కార్డు వెనుక ఉన్న రెండు ఫోన్ నంబర్లకు రైల్వే పోలీసులు ఫోన్ చేయగా ఓర్వకల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ నంబర్‌గా గుర్తించారు. అతడికి మృతుడి ఫొటో, విజిటింగ్ కార్డును వాట్సాప్ ద్వారా పంపించారు. అయితే మృతుడు తనకు తెలియదని, విజిటింగ్ కార్డుపై ఉన్న రాతను బట్టి అది బనగానపల్లికి చెందిన రాజేష్ అనే ఓ నేరస్థుడిదని చెప్పారు. రాజేష్ రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, అతడిని కోర్టుకు తరచూ తరలిస్తుండే తరుణంలో తన ఫోన్ నంబర్ విజిటింగ్ కార్డుపై రాసుకున్నట్లు కానిస్టేబుల్ చెప్పాడు. రాజేష్ మానసికస్థితి సరిగా ఉండదని, గతంలో ఇదే తరహాలో రెండు హత్యలు చేశాడని చెప్పాడు. కానిస్టేబుల్ సమాచారం మేరకు రాజేష్ నంబర్‌కు ఫోన్ చేయగా వరంగల్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా సెల్ టవర్ సిగ్నల్ చూపిస్తుందని సికింద్రాబాద్ రూరల్ రైల్వే డీఎస్పీ శ్రీనివాస్‌రావు తెలిపారు. వెంటనే రెండు టీంలను రాజేష్ కోసం పంపినట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఊరు మారినా.. ఆమె తీరుమారలేదు
పెద్దఅంబర్‌పేట (రంగారెడ్డి): బాలికను బలవంతంగా వ్యభిచారరొంపిలోకి దింపిన ఓ మహిళపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ పీడీ యాక్ట్ నమోదు చేశారు. వివరాల్లో వెళితే... యాదగిరిగుట్టలో వ్యభిచార గృహాలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో వ్యభిచార గృహ నిర్వాహకురాలు పాకనాటి పద్మమ్మ అనే మహిళ అక్కడి నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామానికి మకాం మార్చింది. ఇక్కడ కూడా ఓ మహిళ, ఓ బాలికతో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తుండగా గత ఆగస్టు 9వ తేదీన బాలిక వ్యభిచార గృహం నుంచి తప్పించుకుని వచ్చి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు వ్యభిచారం గృహంపై దాడి చేసి నిర్వాహకురాలు పద్మమ్మతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను రెస్క్యూ హోంకు తరలించారు. విచారణ చేపట్టిన పోలీసులు శనివారం వ్యభిచార గృహ నిర్వాహకురాలు పద్మమ్మపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. -
భూవివాదంలో రౌడీషీటర్ల రంగప్రవేశం
కందుకూరు (రంగారెడ్డి): రియల్ ఎస్టేట్ ప్రభావంతో భూముల ధరలకు రెక్కలు రావడంతో వివాదాలు అంతే వేగంగా ప్రారంభమయ్యాయి. కందుకూరు మండలంలో దెబ్బడగూడ గేట్ సమీపంలోని సర్వే నంబర్ 460లో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను అర్ధరాత్రి కొందరు దుండగులు కాపలాదారులపై దాడిచేసి ఫెన్సింగ్‌ను కూల్చివేశారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. సర్వే నంబర్ 460లో హైదరాబాద్ చంద్రాయణగుట్టకు చెందిన మొహినుద్దీన్, మోహిన్‌మర్ఫిది, ఎండీ హిదాయతుల్లాలకు 5.35 ఎకరాల భూమి ఉంది. అదే నంబర్లో ఎస్.సుగుణాకర్‌రెడ్డి, చండీశ్వర్‌కు చెందిన మరో ఎకరం భూమి ఉంది. ఈ భూముల చుట్టూ యజమానులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. కాగా, అదే సర్వే నంబర్లో వారి భూమికి ఆనుకునే హైదరాబాద్‌కు చెందిన అస్లాంకు కొంత భూమి ఉంది. వీరి మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే, ఆదివారం అర్ధరాత్రి డీసీఎం వాహనం, కార్లలో పెద్దఎత్తున పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న భూమి యజమాని అస్లాం రౌడీలతో తరలివచ్చి పొలంలో పని చేస్తున్న కాపలాదారుల్ని కత్తులతో బెదిరించి ఫెన్సింగ్‌ను కూల్చివేయించారు. దీంతో హడలిపోయిన వారు పోలీసులతో పాటు సంబంధిత యజమానులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి రౌడీలు పరారయ్యారు. ఫెన్సింగ్ కూల్చివేతకు పాల్పడిన అస్లాంతో పాటు పలువురిపై సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అస్లాం తమను తరచూ భూవిషయమై బెదిరిస్తున్నాడని బాధిత భూ యజమానులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
నవ వధువు ఆత్మహత్య
ధారూరు (రంగారెడ్డి): పెళ్లయిన నాలుగు నెలలకే ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ధారూరు మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ నాగేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. బంట్వారం గ్రామానికి చెందిన రాజు తల్లిదండ్రులు 12 సంవత్సరాల క్రితం ధారూరుకు వచ్చి 2.20 ఎకరాల భూమిని తీసుకుని సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్దకుమారుడు రాజుకు ఏప్రిల్ 25వ తేదీన పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామానికి చెందిన అనురాధ (21)తో వివాహం జరిగింది. ఆ తర్వాత తల్లిదండ్రులు చిన్న కొడుకుతో కలిసి హైదరాబాద్ వెళ్లి అక్కడే కూలి పని చేసుకుంటున్నారు. రాజు పొలాన్ని సేద్యం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో కూలీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. కాగా రాజు ఆదివారం పొలానికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనురాధ దూలానికి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన రాజు తలుపులు తీసి చూడగా భార్య అనురాధ దూలానికి వేలాడుతూ కనిపించింది. వెంటనే రాజు ధారూరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాగా అనురాధ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని సీఐ చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. -
దాడి చేసి.. డబ్బులు దోచేసి..
రాజేంద్రనగర్ : గుర్తుతెలియని దుండగులు ఓ గ్యాస్ ఏజెన్సీ క్యాషియర్‌పై దాడి చేసి రూ. 6.7లక్షలు దోచుకుపోయారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సైదాబాద్ ప్రాంతానికి చెందిన రాము(23) రాజేంద్రనగర్ బుద్వేల్‌లో ఉన్న భార్గవి గ్యాస్ ఏజెన్సీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. నిత్యం వచ్చే నగదును ఇంటికి తీసుకువెళ్లి మరుసటి రోజుబ్యాంకులో డిపాజిట్‌చేస్తుండేవాడు. ఈక్రమంలో బుధవారం రూ. 6.70 లక్షల నగుదు రావడంతో బ్యాగులో పెట్టుకొని రాత్రి 11 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. మార్గంమధ్యలో బుద్వేల్ ప్రధాన రహదారిపైకి రాగానే నలుగురు యువకులు రామును వెంబడించి వాహనంపై నుంచి నెట్టివేశారు. కిందపడిన అతడి వద్ద నుంచి బ్యాగును లాక్కునేందుకు ప్రయత్నించారు. రాము వారిని అడ్డుకునే యత్నం చేయగా కట్టెలతో దాడి చేశారు. దుండగులు తలపై మోదడంతో రాము అక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం డబ్బులు ఉన్న బ్యాగును తీసుకొని నలుగురు యువకులు పరారయ్యారు. స్థానికులు విషయాన్ని గమనించి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితుడిని హైదర్‌గూడలోని ఉషామోహన్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తలకు 18 కుట్టు వేశారు. ప్రస్తుతం రాము కోలుకుంటున్నాడు. తనపై దాడి చేసిన యువకులను మరోసారిచూస్తే గుర్తుపడతానని అతడు పోలీసులకు తెలిపాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
పట్టపగలే భారీ చోరీ
కొత్తూరు రంగారెడ్డి : కొత్తూరు మండల కేంద్రంలో బుధవారం భారీ చోరీ జరిగింది. ఓ కుటుంబం పక్కనే జరుగుతున్న బంధువుల శుభకార్యానికి వెళ్లొచ్చే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి దొంగలు 50తులాల బంగారం, రూ.5లక్షల నగదును దోచుకెళ్లారు. బాధితులు, షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ కథనం ప్రకారం... మండల కేంద్రంలోని పెంజర్ల బైపాస్ రోడ్డు పక్కన నివాసం ఉంటున్న గుబ్బ లింగం కుటుంబ సభ్యులు ఉదయం 11గంటలకు నారాయణగూడ కాలనీలో ఉండే తన తమ్ముడు వెంకటేష్ ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్లారు. తిరిగి 3గంటల ప్రాంతంలో ఇంటికి రాగా తాళాలు పగులగొట్టి ఉండడంతో లోపలికెళ్లి పరిశీలించారు. కాగా అంతకు ముందే వారు ఈ నెల 30న జరిగే శుభాకార్యం(పెళ్లి) కోసం బ్యాంకు లాకర్లో దాచిన బంగారు ఆభరణాలతో పాటు, వారి కూతుళ్ల బంగారు ఆభరణాలను ఇంట్లో దాచి శుభాకార్యం వద్దకు వెళ్లారు. వారు వచ్చే సరికి దొంగలు తాళాలు పగులగొట్టి సుమారు 50తులాల బంగారు ఆభరణాలు, రూ.5లక్షల నగదును ఎత్తుకెళ్లారు. విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం హైదరాబాద్ నుంచి వచ్చిన క్లూస్‌టీం సంఘటన స్థలంలో వేలి ముద్రలు సేకరించారు. జాగిలం సంఘటన స్థలం నుంచి వినాయకస్టీల్ కూడలీలో ఉన్న ఓ పంక్ఛర్ దుకాణం వద్దకు వెళ్లి ఆగిపోయింది. బాధితుడు గుబ్బలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసును సాధ్యమైనంత త్వరగా చేధిస్తామని షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ తెలిపారు. ఇదే ఇంట్లో గతంలో మూడు సార్లు చోరీలు జరగడం కొసమెరుపు. మరోఘటనలో 8తులాల వెండి ఆభరణాలు చోరీ.. పరిగి : ఊరికి వెళ్లి వచ్చే సరికి ఇళ్లంతా ఊడ్చేశారు. ఈ సంఘటన పరిగిలోని బాలాజీనగర్ పద్మావతి కాలనీలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. పూడూరు మండల పరిధిలోని కంకల్ గ్రామానికి చెందిన యూసుఫ్ కుటుంబ సభ్యులు పరిగిలోని పద్మావతి కాలనీలో నివాసముంటున్నారు. కాగా మంగళవారం బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లారు. ఇది గమనించిన దొంగలు తాళం పగులకొట్టి ఇంట్లో చొరబడ్డారు. శబ్ధానికి పక్కవారు లేస్తే బయటకు రాకుండా ఉండేందుకు పక్కింటికి గడియ పెట్టారు. బీరువా తాళాలు పగలగొట్టి 8తులాల వెండి ఆభరణాలు, రూ.2వేల నగదుతో పాటు 25ఖరీదైన చీరలు తదితర వస్తువులు ఎత్తుకెళ్లారు. తెల్లవారు జామున గడియ పెట్టి ఉండటం గమనించిన పక్కింటివారు మరో ఇంట్లో ఉండే వాళ్లకు ఫోన్ చేసి తీయించుకున్నారు. అనంతరం పక్కింట్లో దొంగతనం జరిగిందని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బుధవారం ఉదయం పోలీసులు సంఘటణ స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం నెపంతో.. వృద్దుడి హత్య
మర్పల్లి : ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మండల కేంద్రంలోని కోట్‌మర్పల్లి చౌరస్తా సమీపంలో కల్లు దుకాణం సమీపంలో గు రువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థాని కుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. మర్పల్లి గ్రామానికి చెందిన బేగరి తుల్జయ్య (70) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో కల్లు దుకాణంలో కల్లు కొనుగోలు చేసి ఇంటికి వెళ్తుండగా కోట్‌మర్పల్లి చౌరస్తా సమీపంలో కల్లు దుకాణం పక్కనే అదే గ్రామానికి చెందిన బక్క మొల్లయ్య కత్తితో తుల్జయ్యపై దాడి చేశాడు. మెడ, కడుపులో దారణంగా పొడిచాడు. తుల్జయ్య కడుపులో నుంచి అవయవాలు బయటపడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తుండగా, చిన్నవాడు రాజు గ్రామంలోనే కరెంట్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. లొంగిపోయిన నిందితుడు... తుల్జయ్యను హత్య చేసిన అనంతరం బక్క మొల్లయ్య కిలోమీటర్ దూరంలో ఉన్న మర్పల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న తుల్జయ్యను తానే కత్తితో పొడిచి హత్య చేశానని పోలీసులకు వివరించాడు. వివరాలు సేకరించిన పోలీసులు తుల్జయ్య హత్య విషయం తెలుసుకున్న మర్పల్లి పోలీసులు మోమిన్‌పేట్, ధారూరు సీఐల సా యంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలను స్థానికులను, కుటుంబసభ్యుల ను అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసుకొని తుల్జయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పథకం ప్రకారమే హత్య చేశారు.. వయస్సు పైబడి వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రిని పథకం ప్రకారమే హత్య చేశారని తుల్జయ్య కుమారుడు రాజు కన్నీటి పర్యంతమయ్యాడు. తన తండ్రిని హత్య చేసిన బక్క మొల్లయ్యను పూర్తి స్థాయిలో విచారిస్తే అతని వెనక ఉన్నవారు బయటకొస్తారన్నాడు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని తుల్జయ్య కుటుంబీకులు పోలీసులను కోరారు. ఈ విషయమై మర్పల్లి ఎస్ఐ విఠల్‌రెడ్డికి వివరణ కోరగా హత్యకు గల కారణాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని, కేసు దర్యాప్తులో ఉందన్నారు. -
అనధికార ఆశ్రమాలపై కొరడా..
హయత్‌నగర్ మండలం సచివాలయనగర్‌లో లైసెన్స్ లేకుండా గ్రేసియస్ ప్యారడైజ్ చారిటబుల్ ఫౌండేషన్ పేరిట కొనసాగుతున్న బాలబాలికల అనాథ ఆశ్రమాన్ని గురువారం అధికారులు సీజ్ చేశారు. గతంలో ఒకే చోట బాలబాలికలకు వసతి కల్పించడం, సరైన సౌకర్యాలు లేకపోవడం, పిల్లలతో భిక్షాటన చేయిస్తుండడంతో జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ (డీసీపీయూ) అధికారులు ఆ ఆశ్రమాన్ని మూసివేశారు. లైసెన్స్ తీసుకోకుండా మళ్లీ ఇటీవల నిర్వాహకులు దీన్ని తెరిచి అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగిస్తుండడంతో.. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో సీజ్ చేశారు. ఇందులో ఉన్న పిల్లలను మరో ఆశ్రమానికి తరలించారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా : అనధికారికంగా కొనసాగుతున్న బాలబాలికల అనాథ ఆశ్రమాలపై జిల్లా సంక్షేమ శాఖ కొరడా ఝళిపిస్తోంది. జువైనల్ జస్టిస్–2015 చట్టానికి లోబడి నడుచుకోని ఆశ్రమాలను సీజ్ చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 56 అనాథ బాలబాలికల ఆశ్రమాలు ఉండగా.. ఇవన్నీ జేజే యాక్ట్ ప్రకారం లైనెన్స్ పొందాలని గతేడాది చివరలో ఆశ్రమాలకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డీసీపీయూ నోటీసులు జారీచేసింది. ఆరు నెలలలోపు యాక్ట్ ప్రకారం బాలబాలికలకు అన్ని సదుపాయాలు కల్పించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఆ ఆరునెలల కాలానికి చెల్లుబాటయ్యేలా తాత్కాలిక రిజిస్ట్రేషన్లు ఇచ్చారు. ప్రస్తుతం ఆ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న ఆశ్రమాలు ఏ మేరకు మెరుగుపడ్డాయని తెలుసుకునేందుకు ప్రత్యేకం టీం రంగంలోకి దిగింది. ఈ బృందంలోని డీసీపీయూ, సీడబ్ల్యూసీ, ఎన్జీఓల ప్రతినిధులు ప్రతి ఆశ్రమాన్ని చుట్టేసి అక్కడి సదుపాయలు, సౌకర్యాల తీరును నేరుగా తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను సైతం రూపొందించింది. అయితే మొత్తం 56లో ఇప్పటికే పదింటికి లైసెన్స్‌లు ఇచ్చారు. మిగిలిన 46 ఆశ్రమాల్లో 25కిపైగా చెప్పుకోదగ్గ రీతిలో మార్పు కనిపించినట్లు బృందంలోని సభ్యులు గుర్తించారు. మిగిలిన వాటిలో ఎటువంటి పురోగతి కనిపించలేదని, పిల్లల బాగోగు చర్యలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయని పరిశీలనలో తేలింది. వీటిపై ఒక్కొక్కటిగా కొరడా ఝళిపించేందుకు రంగంలోకి దిగారు. తొలుత మరోసారి నోటీసులు జారీ చేసి.. ఆ తర్వాత సీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం హయత్‌నగర్ మండలంలో ఒకదాన్ని జప్తు చేశారు. పాటించాల్సిన నిబంధనల్లో కొన్ని.. బాలబాలికల ఆశ్రమాలు వేర్వేరు ప్రాంగణాల్లో కొనసాగాలి. ఒకే భవనంలో వసతి కల్పించడానికి వీల్లేదు. వయసుల వారీగా చిన్నారులకు గదులు కేటాయించాలి. బాలికల ఆశ్రమాల్లో మహిళలే పనిచేయాలి. నేలపై చిన్నారులకు పడుకోనివ్వద్దు. కచ్చితంగా పరుపు, మంచం ఉండాలి. ప్రతి 25 మంది చిన్నారుల పడకకు వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల వైశాల్యం ఉండాలి. ప్రతి 8 మందికి ఒక మూత్రశాల, ప్రతి ఐదుగురికి ఒక స్నానపు గది తప్పనిసరి. వైద్యుడు అందుబాటులో ఉండి నెలకోసారి వైద్య పరీక్షలు నిర్వహించి రికార్డుల్లో నమోదు చేయాలి. మెనూ ప్రకారం పౌష్టికాహారం, రక్షిత తాగునీరు సమకూర్చాలి. సిబ్బంది, నిర్వహణ, చిన్నారుల వ్యక్తిగత ప్రొఫైల్, వైద్య, ఆరోగ్య పరమైన వివరాల రికార్డులు నిర్వహించాలి. ప్రాంగణం చుట్టూ ప్రహరీతోపాటు రక్షణ వలయం, 24 గంటల పాటు భద్రత, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కౌన్సిలర్, టీచర్ నిత్యం విధుల్లో కొనసాగాలి. చదువుతోపాటు వృత్తిపరమైన శిక్షణ అందజేయాలి. పాఠశాలలకు పంపినా.. తోడుగా మరొకరిని ఉంచాలి. ఆరేళ్లలోపు చిన్నారులను ఆశ్రమాల్లో చేర్చుకోవద్దు. ఈ నిబంధనలన్నీ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా ఆశ్రమాల నిర్వాహకులకు పట్టడం లేదు. భద్రత గాలికి.. జిల్లా శివారులో ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఆశ్రమాలు కొనసాగుతున్నాయి. వీటిలో ఎంతమంది పిల్లలు ఉన్నారనే లెక్కలు లేవు. రాజకీయ నాయకుల అండదండలతో ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. వాస్తవంగా అనాథలను చేరదీయడం, అక్కడి నుంచి బయటకు పంపించడమూ చట్టబద్ధంగానే జరగాలి. అనాథల వివరాలను తొలుతు శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) దృష్టికి తీసుకెళ్లాలి. ఆ కమిటీ సూచించిన ఆశ్రమాలే సదరు చిన్నారులకు ఆశ్రయం కల్పించి బాగోగులు చూడాలని జేజే చట్టం వెల్లడిస్తోంది. అయితే తమకు దొరికనవారిని దొరికినట్లుగా ఆశ్రమాల్లో చేర్చుకుని చిన్నారుల రక్షణ, సంరక్షణ విషయంలో ఎనలేని నిర్లక్ష్యాన్ని కనబర్చుతున్నారు. లైంగిక దాడులు.. ఆశ్రమాల్లోని బాలికలకు భద్రత లేకుండా పోయింది. వారిపై అత్యాచారాలు సైతం జరుగుతున్నాయి. తండ్రి స్థానంలో ఉండి కనురెప్పలా సంరక్షించాల్సిన నిర్వాహకులే కామాంధులుగా మారుతున్నారు. జిల్లాలో ఇటువంటి ఐదారు ఘటనలు వెలుగులోకి వస్తే తప్ప బయటి ప్రపంచానికి తెలియడం లేదు. వీటిపై నిర్వహణపై ఎటువంటి పర్యవేక్షణా లేకపోవడంతో నిర్వాహకులు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పిల్లలతో భిక్షాటన.. లాభార్జన నా అనే వారు లేని అభాగ్య చిన్నారులకు మానవతా దృక్పథంతో చేరదీసి రక్షణ, సంరక్షణ కల్పించడమే అనాథ ఆశ్రమాల ముఖ్య ఉద్దేశం. వీటినుంచి ఒక్క పైసా కూడా ఆశించకుండా సామాజిక సేవతో నిర్వహించాలి. ఇటువంటి ఆశ్రమాలకు దాతలు అందించే విరాళాలే ఆర్థిక వనరులు. ఈ నిధులను నిస్సంకోచంగా చిన్నారుల రక్షణ, సంరక్షణ కోసమే వెచ్చించాలి. కానీ, నిర్వాహకులు వచ్చిన దాంట్లో కొంతమేర చిన్నారుల కోసం ఖర్చు చేసి మిగిలినవి వెనకేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇవి చాలవన్నట్లు పిల్లలతో సైతం బిక్షాటన చేయిస్తున్న దారుణాలు నిత్యం కనిపిస్తున్నాయి. ఇంకొందరు చిన్నారులతో విరాళాలు సేకరిస్తున్నా రు. ముఖ్యంగా ఆశ్రమాలు రికార్డులు నిర్వహించడం లేదు. దాతల విరాళాలు, ఖర్చుల వివరాల న్నీ గు ట్టుగానే ఉంటున్నాయి. ఆడిట్ రిపోర్ట్లు తప్ప నిసరి. వాస్తవంగా విరాళాలు తీసుకోవాలంటే ఆదా య పన్ను శాఖ పరిధిలో సెక్షన్ 80(జి) కింద సద రు ట్రస్టీ/సొసైటీ ధ్రువపత్రం కలిగి ఉండాలి. కానీ ఈ తరహా గుర్తింపు పొందిన ఆశ్రమాలు ఐదారుకు మించి ఉండవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
నడుస్తున్న కారులో మంటలు
బొంరాస్‌పేట : నడుస్తున్న కారులో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం మండల పరిధిలోని మెట్లకుంట చెక్‌పోస్టు వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సందీప్ బంధువుల పెళ్లి పత్రికలు పంచేందుకు తన కారులో కొడంగల్ వైపు వెళ్తున్నారు. బొంరాస్‌పేట చెక్‌పోస్ట్ వద్ద హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై సందీప్ ప్రయాణిస్తున్న మారుతి కారు (ఏపీ09జెడ్ 4095)లో నుంచి అకస్మాత్తుగా పొగ రావడంతో కారును పక్కకు నిలిపివేశారు. మెల్లగా మంటలు రావడంతో కారులో ఉన్న సందీప్‌తో పాటు మరో ఇద్దరు దూరంగా పరుగులు తీశారు. పెద్ద పెద్ద మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి మంటలను అదుపుచేశారు. కారులో ఏసీ సమస్య వల్ల ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణ తేలింది. -
నయీం ఎన్‌కౌంటర్‌కు రెండేళ్లు
షాద్‌నగర్‌టౌన్ రంగారెడ్డి : జలధరింపజేసిన పోలీసుల వేట... నయీం గుండెల్లోకి దూసుకెళ్లిన పోలీసుల తూట. స్థానికుల వదనాల్లో భయంతో నిండిన చమట.. ఒళ్లు గగుర్పాటు పొడింపించిన ఘటన. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన నయీం ఎన్కౌంటర్ జరిగి సరిగ్గా నేటితో రెండేళ్లు పూర్తయింది. వెన్నులో వణుకు పుట్టించిన ఘటనను షాద్‌నగర్ ప్రాంత వాసులు నేటికీ మరిచిపోలేకపోతున్నారు. ఉదయం 6గంటలకు 2016 ఆగస్టు 8న షాద్‌నగర్ పట్టణ శివారులోని మిలీనియం టౌన్షిప్లో ఒక్కసారిగా పోలీసులు ఓ ఇంటిని చుట్టుముట్టారు. అసలు ఏం జరుగుతుందో కాలనీ వాసులకు అర్థం కాని పరిస్ధితి. భారీ ఎత్తున ప్రత్యేక పోలీసు బలగాలు మొహరించారు. తుపాకులెక్కుపెట్టి ఓ వ్యక్తిపై పోలీసులు ఏకదాటిగా కాల్పులు జరిపారు. పోలీసుల ఎన్కౌంటర్లో హతమైంది కరుడుగట్టిన నేరస్తుడు, వంద కేసుల్లో నిందితుడు, 40హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు నయీం అని ఆ రోజు తెలిసింది. వెంటాడుతున్న జ్ఞాపకాలు షాద్‌నగర్‌లోని మిలీనియంటౌన్‌షిప్ అంటేనే నయీం డెన్‌గా మారిపోయింది. మిలీనియం టౌన్షిప్లో ఇంటిని కొనుగోలు చేసి డెన్‌గా ఏర్పర్చుకొని రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించాడు. గుట్టు చప్పుడు కాకుండా నయీం షాద్‌నగర్‌కు వచ్చి వెళ్లేవాడు. ఇంట్లో ఉండే వారు పెద్దగా బయటికి వచ్చే వారు కాదు. షాద్‌నగర్‌లోని ఇంటికి మామిడితోటగా పేరుపెట్టుకొని దందాలను నిర్వహించేవాడు. భారీ ఎత్తున సెటిల్మెంట్లు, మాటవినని వారిని హత్య చేసేందుకు ఇక్కడ నుండే పథకం రచించేవాడని సిట్ అధికారులు దర్యాప్తులో తేల్చారు. ఇప్పటికీ నయీం ఇల్లు మూతే మిలీనియం టౌన్షిప్లో సుమారు రెండు వందల చదరపు గజాల్లో ఉన్న ఇంటిని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ చెందిన సయ్యద్ సాధిక్‌పాషా పేరుపై 2012లో కొనుగోలు చేశాడు. నయీం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పోలీసులు ఇంట్లో క్షుణ్ణంగా సోదాలు చేపట్టారు. ఇంట్లో దొరికిన సామగ్రిని వాహనాల్లో తరలించారు. అయితే సుమారు నాలుగేళ్ల పాటు షాద్‌నగర్ నుంచి నయీం కార్యకలాపాలు కొనసాగించాడు. 2016 ఆగస్టు నుంచి నయీం ఇల్లు మూత పడే ఉంది. ఇప్పటికీ నయీం ఇంటి వైపు వెళ్లాలంటే చాలా మంది జంకుతుంటారు. ప్రస్తుతం ఇంటి గేటుకు తాళం వేసి ఇంటి ఆవరణలో పిచ్చిమొక్కలు మొలిచి చిందరవందరగా ఉంది. షాద్‌నగర్ మున్సిపాలిటీ వారు మిలీని యం టౌన్ షిప్లో మొక్కలు పెంచేందుకు స్మృతి వనం ఏర్పాటు చేశారు. నయీం ఎన్కౌంటర్ స్మృతి వనం ఎదుట జరిగింది. అయితే ఎన్కౌంటర్ సమయంలో పోలీసులు నిర్వహించిన కాల్పుల్లో ఓ బుల్లెట్ స్మృతి వనం గేటుకు తాకడంతో రంద్రం పడింది. బుల్లెట్ తాకి గేటుకు రంద్రం పడిన దృశ్యం నేటికి కనిపిస్తుంది. -
ఆవులను పట్టుకున్న పోలీసులు
తాండూరు రూరల్ వికారాబాద్ : ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న ఆవులను కరన్‌కోట్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. పోలీస్‌స్టేషన్ ఎదుట నుంచి వెళ్తున్న ఆవులను తోలుకెళ్తున్న వ్యక్తులను ఆపి వివరాలు అడిగారు. ఆవుల క్రయవిక్రయాలకు సంబంధించిన పత్రాలు చూపించాలని కోరారు. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌కు ఆవులను తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వీహెచ్‌పీ, బజరంగ్దళ్, బీజేపీ, ఏబీవీపీ నాయకులు కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌కు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆవులను ఎక్కడికి తరలిస్తున్నారని వ్యక్తులను ప్రశ్నించారు. యాలాల మండలం జుంటుపల్లి అనుబంధ గ్రామం రేళ్లగడ్డతండా నుంచి 33 ఆవులను తాండూరు మండలం రాంపూర్‌తండాకు తీసుకెళ్తున్నమని వారు చెప్పారు. సరైన సమాధానం చెప్పాలని కోరగా తాండూరుకు చెందిన సాధిక్ ఈ ఆవులను రూ.1.60 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎస్ఐ రేణుకారెడ్డితో నాయకులు భేటీ అయ్యారు. బక్రీద్ సందర్భంగా ఆవులను విక్రయించడానికి తీసుకెళ్తున్నారని వారు ఆరోపించారు. తాండూరు చుట్టూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు ఎస్ఐ స్పందిస్తూ ఆవులకు సంబంధించిన పూర్తి విచారణ చేపడతామన్నారు. అప్పటి వరకు ఆవులను పట్టణంలోని గోశాలకు తరలిస్తామని చెప్పారు. ఆవులను తీసుకెళ్తున్న వ్యక్తుల నుంచి వివరాలు తెలుసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రమ్యానాయక్, బొప్పి సురేష్, టైలర్ రమేష్, రజనీ, అశోక్, నాగేష్, దాస్, మహేష్ పాల్గొన్నారు. -
వరకట్న వేధింపులకు వివాహిత బలి
తాండూరు టౌన్ : వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. అదనపు కట్నం కోసం భర్త పెడుతున్న వేధింపులకు తాళలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తాండూరు పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణ సీఐ ప్రతాప్‌లింగం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాతతాండూరుకు చెందిన చాకలి అనూష (22)కు దౌల్తాబాద్ మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన అరుణ్‌తో ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన వివాహం జరిగింది. అయితే మృతురాలు భర్త, తన తల్లిదండ్రులతో కలిసి సంగారెడ్డి జిల్లా కంది పట్టణంలో జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల భర్త అరుణ్ అదనపు కట్నం తేవాలని, అలాగే పలు అనుమానాలతో వేధిస్తున్నాడు. ఇటీవల అనూష పుట్టింటికి వచ్చింది. భర్త పెట్టే మానసిక వేధింపులు తాళలేక శుక్రవారం తల్లిగారింట్లో దూలానికి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు మృతురాలి తల్లి చంద్రమ్మ, తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. అనూష ఉరేసుకున్న విషయంపై వికారాబాద్ డీఎస్పీ శిరీష శుక్రవారం రాత్రి పాతతాండూరులో విచారణ చేపట్టారు. మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐదు నెలలకే..
పూడూరు రంగారెడ్డి : ఆర్థిక ఇబ్బందులతో నవ దంపతులు చెట్టుకు ఉరేసుకుని మృతిచెందిన సంఘటన వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండల పరిధిలోని కంకల్ గ్రామానికి చెందిన డప్పు మల్లేశ్ అలియాస్ సద్గురు(19), జ్యోతి (18) ఇరువురు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు.. ఐదు నెలల క్రితం పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. మల్లేశ్ పరిగిలో పంక్చర్ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. భార్య జ్యోతి వ్యవసాయ పనులు చేస్తూ చేదోడువాదోడుగా ఉండేది. శనివారం ఉదయం మల్లేశ్ తన తల్లి, భార్యతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. పనులు ముగించుకున్న తర్వాత.. చీకటి పడుతుంది తాము బైక్‌పై వస్తామని చెప్పి తల్లిని ఇంటికి పంపించాడు. కొడుకు, కోడలు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లి కుటుంబసభ్యులతో పొలం వద్దకు వెళ్లింది. చుట్టుపక్కల్లో వెతకగా.. దంపతులిద్దరూ చెట్టుకు ఉరేసుకుని కనిపించారు. వెంటనే కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక ఇబ్బందులతోనే తన అల్లుడు, కూతురు ఆత్మహత్య చేసుకున్నారని జ్యోతి తల్లి మాణెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అందరితో సన్నిహితంగా ఉంటూ జీవనం సాగిస్తున్న మల్లేశ్, జ్యోతిల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.