నిందితుడు అజర్; దాడి వివరాలను తెలుసుకుంటున్న పోలీసులు
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి: అల్లరి చేయొద్దని వారించిన యువకుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అనంతరం భయాందోళనతో పరుగులు తీయగా ఇంట్లోకి చొరబడి కత్తిపోట్లు పొడవడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మృతుడి కుటుంబీకులు, సీఐ సత్తయ్యగౌడ్ కథనం ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధి రోషన్ కాలనీలో మహ్మద్ అబ్దుల్ ముజీబ్(28), అజర్ నివాసముంటున్నారు. ముజీబ్ క్యాబ్ డ్రైవింగ్ చేస్తూ స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. పలు ఠాణాల్లో కేసులు నమోదైన అజర్(26) ఇతరులతో గొడవలు పడుతూ ఖాళీగా తిరుగుతుండేవాడు.
ముజీబ్(ఫైల్); యువకుడి మృతదేహం
కొంతకాలంగా ముజీబ్ ఇంటి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద అజర్ తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి వరకు మద్యం తాగుతూ అల్లరి చేస్తున్నాడు. ఈనేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి అదేవిధంగా జరిగింది. దీంతో అల్లరి చేయొద్దని ముజీబ్ అజర్‌ను వారించాడు. తనకు చెప్పడానికి నీవెవరు అంటూ ఆగ్రహానికి గురైన అతడు ముజీబ్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో భయాందోళనకు గురైన అతడు తన స్నేహితులతో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు. ముజీబ్ ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్న అజర్ లోపలికి చొరబడి తల, ఛాతీపై నాలుగైదు కత్తిపోట్లు వేశాడు. తీవ్రంగా గాయపడిన ముజీబ్‌ను కుటుంబీకులు ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. విషయాన్ని తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు రోషన్ కాలనీకి చేరుకొని వివరాలు సేకరించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న అజర్ కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. పోకిరీగా తిరుగుతున్న అజర్ కొంతకాలంగా ముజీబ్‌తో గొడవపడుతున్నారని కుటుంబీకులు తెలిపారు. రోషన్ కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్న పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడం లేదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment