నేలపై పడుకున్న మహిళలు
తాండూరు: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (కుని) శిబిరం నిర్వహణ లోపంతో గందరగోళంగా నెలకొంది. ఆపరేషన్లు చేస్తామని గ్రామాల నుంచి మహిళలను రప్పించారు. తీరా టార్గెట్ పూర్తయిందని వైద్యులు ఆపరేషన్లను నిలిపి వేశారు. దీంతో మహిళలు, మహిళల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని జిల్లా ఆస్పత్రి పీపీ యూనిట్ విభాగంలో సోమవారం పెద్దేములో మండలానికి చెందిన మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు శిబిరం ఏర్పాటు చేశారు. దీంతో పలు గ్రామాల నుంచి మహిళలు కుటుంబసభ్యులతో వచ్చారు. పీపీ యూనిట్ ఇన్‌చార్జి శ్రీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో గైనకాలజిస్ట్ జయమాలిని, అనస్థిషియా సాకేత్‌తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యులు మరియాఆఫ్రిన్, శ్రావణ్‌కుమార్ ఆపరేషన్లు చేశారు. మొత్తం 78 మంది మహిళలకు ఆపరేషన్లు చేయించుకునేందుకు వైద్య సిబ్బంది రిజిస్టర్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు. అంతకు మించి మహిళలు ఆపరేషన్లు చేయించుకోవడానికి ముందుకొచ్చారు. అయితే వైద్యులు 70 మంది మహిళలకు మాత్రమే ఆపరేషన్లు చేసి వెళ్లి పోయారు.
ఆపరేషన్ చేయాలని ఆందోళన
ఆస్పత్రికి వచ్చిన మహిళలందరికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని వారు ఆందోళనకు దిగారు. ఆపరేషన్లు చేయించుకోవాలని గ్రామాల్లో ఆశవర్కర్‌లు తమ ఆధార్ కార్డు వివరాలను, పేర్లను నమోదు చేసుకోవడంతోనే ఆస్పత్రికి వచ్చామని వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో ఆస్పత్రిలోని ధియేటర్‌ను ముట్టడించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వైద్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ గఫార్ పోలీసులతో కలిసి మహిళలకు, వారి కుటుంబ సభ్యులను నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.
కనీస వసతులు కరువు
జిలా ప్రభుత్వ ఆస్పత్రిలోని పీపీ యూనిట్‌లో జరిగిన కుటుంబ నియంత్రణ శిబిరంలో ఆపరేషన్లు చేయించుకునే మహిళలకు, కుటుంబ సభ్యులకు కావాల్సిన కనీస వసతులను కల్పించడంలో పీపీ యూనిట్ నిర్వాహకులు విఫలమయ్యారు. దీంతో ఆపరేషన్ చేయించుకున్నాక మహిళలను అరగంట పాటు విశ్రాంతి తీసుకోకుండానే వారిని వార్డులో నుంచి పంపించారు. దీంతో పరేషన్ చేయించుకున్న మహిళలు ఆస్పత్రి ఆవరణలో నేలపై పడుకుని అవస్థలు పడ్డారు.
50 మందికి మాత్రమే ఆపరేషన్లు చేయాలి
కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ను 50 మందికి మాత్ర మే చేస్తాం. అయితే పెద్దేముల్ మండలం నుంచి మహిళలు అధికసంఖ్యలో వచ్చారు. అయితే 70మంది మహిళలకు ఆపరేషన్లు చేశారు. మరోసారి శిబిరం ఏర్పాటు చేస్తే మిగిలిన వారికి ఆపరేషన్లు చేస్తాం. – శ్రీకాంత్‌రెడ్డి, పీపీ యూనిట్ ఇంచార్జ్
Comments
Please login to add a commentAdd a comment