family control operations
-
అక్రమ ఆపరేషన్లపై ప్రభుత్వం కొరడా
పాడేరు: ఇటీవల విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం ఈదులపాలెంలోని మెడికల్ షాపులో నిబంధనలకు విరుద్ధంగా గిరిజన మహిళలకు సంక్షేమ ఆపరేషన్లు చేసిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆపరేషన్ చేసిన అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ గైనకాలజిస్టు డాక్టర్ ఎస్.తిరుపతిరావును సస్పెండ్ చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.ఎస్.సూర్యనారాయణ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ‘విశాఖ ఏజెన్సీలో ప్రైవేటు ముఠా’ శీర్షికన ఈ నెల 10న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. సబ్ కలెక్టర్ వి.అభిషేక్ చేపట్టిన విచారణలో.. ఈ ఆపరేషన్లు చేసింది అనకాపల్లి ఆస్పత్రి గైనకాలజిస్టు తిరుపతిరావుగా తేలింది. అలాగే వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ అధికారులు జరిపిన విచారణ నివేదికను అందుకున్న జిల్లా వైద్యాధికారి సూర్యనారాయణ.. డాక్టర్ తిరుపతిరావుపై చర్యలు తీసుకున్నారు. తిరుపతిరావును సస్పెండ్ చేసి ఆయన స్థానంలో తగరంపూడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ రమేష్‌నాయుడును అర్బన్ ఫ్యామిలి వెల్ఫేర్ సెంటర్‌కు ఇన్చార్జిగా నియమించారు. -
ఆపరేషన్లకు పిలిచి.. పట్టించుకోలేదు
తాండూరు: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (కుని) శిబిరం నిర్వహణ లోపంతో గందరగోళంగా నెలకొంది. ఆపరేషన్లు చేస్తామని గ్రామాల నుంచి మహిళలను రప్పించారు. తీరా టార్గెట్ పూర్తయిందని వైద్యులు ఆపరేషన్లను నిలిపి వేశారు. దీంతో మహిళలు, మహిళల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని జిల్లా ఆస్పత్రి పీపీ యూనిట్ విభాగంలో సోమవారం పెద్దేములో మండలానికి చెందిన మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు శిబిరం ఏర్పాటు చేశారు. దీంతో పలు గ్రామాల నుంచి మహిళలు కుటుంబసభ్యులతో వచ్చారు. పీపీ యూనిట్ ఇన్చార్జి శ్రీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో గైనకాలజిస్ట్ జయమాలిని, అనస్థిషియా సాకేత్‌తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యులు మరియాఆఫ్రిన్, శ్రావణ్‌కుమార్ ఆపరేషన్లు చేశారు. మొత్తం 78 మంది మహిళలకు ఆపరేషన్లు చేయించుకునేందుకు వైద్య సిబ్బంది రిజిస్టర్లో పేర్లు నమోదు చేసుకున్నారు. అంతకు మించి మహిళలు ఆపరేషన్లు చేయించుకోవడానికి ముందుకొచ్చారు. అయితే వైద్యులు 70 మంది మహిళలకు మాత్రమే ఆపరేషన్లు చేసి వెళ్లి పోయారు. ఆపరేషన్ చేయాలని ఆందోళన ఆస్పత్రికి వచ్చిన మహిళలందరికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని వారు ఆందోళనకు దిగారు. ఆపరేషన్లు చేయించుకోవాలని గ్రామాల్లో ఆశవర్కర్లు తమ ఆధార్ కార్డు వివరాలను, పేర్లను నమోదు చేసుకోవడంతోనే ఆస్పత్రికి వచ్చామని వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో ఆస్పత్రిలోని ధియేటర్ను ముట్టడించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వైద్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ గఫార్ పోలీసులతో కలిసి మహిళలకు, వారి కుటుంబ సభ్యులను నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. కనీస వసతులు కరువు జిలా ప్రభుత్వ ఆస్పత్రిలోని పీపీ యూనిట్లో జరిగిన కుటుంబ నియంత్రణ శిబిరంలో ఆపరేషన్లు చేయించుకునే మహిళలకు, కుటుంబ సభ్యులకు కావాల్సిన కనీస వసతులను కల్పించడంలో పీపీ యూనిట్ నిర్వాహకులు విఫలమయ్యారు. దీంతో ఆపరేషన్ చేయించుకున్నాక మహిళలను అరగంట పాటు విశ్రాంతి తీసుకోకుండానే వారిని వార్డులో నుంచి పంపించారు. దీంతో పరేషన్ చేయించుకున్న మహిళలు ఆస్పత్రి ఆవరణలో నేలపై పడుకుని అవస్థలు పడ్డారు. 50 మందికి మాత్రమే ఆపరేషన్లు చేయాలి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ను 50 మందికి మాత్ర మే చేస్తాం. అయితే పెద్దేముల్ మండలం నుంచి మహిళలు అధికసంఖ్యలో వచ్చారు. అయితే 70మంది మహిళలకు ఆపరేషన్లు చేశారు. మరోసారి శిబిరం ఏర్పాటు చేస్తే మిగిలిన వారికి ఆపరేషన్లు చేస్తాం. – శ్రీకాంత్‌రెడ్డి, పీపీ యూనిట్ ఇంచార్జ్ -
ఒక్క మగాడూ లేడు!
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే కేవలం మహిళలే ముందుకు వస్తున్నారు. దీనికి పురుషులు ఆమడ దూరం ఉంటున్నారు. జిల్లాలో వేసక్టమీ ఆపరేషన్ చేయించుకునే మగవారి సంఖ్య కనీసం నమోదు కూడా కావడం లేదు. ఆరేళ్లలో ఒక్క మగాడూ ఈ ఆపరేషన్ చేయించుకోలేదంటే పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ప్రస్తుత అంచనా ప్రకారం 44లక్షలకు పైగా జనాభా ఉంది. 2001లో 40లక్షలు ఉన్న జనాభా 2011 జనాభా లెక్కల నాటికి 44లక్షలకు చేరుకుంది. పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు గాను కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రోత్సహిస్తోంది. 30 ఏళ్ల క్రితం ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు చాలంటూ ప్రచారం చేశారు. ఆ తర్వాత పదేళ్లకు ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలే ముద్దంటూ ప్రచారం తెచ్చింది. ఈ మేరకు జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పీపీ యూనిట్లతో పాటు ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, బేతంచర్ల, డోన్, నందికొట్కూరు, గూడూరు, గార్గేయపురం, డోన్‌తో పాటు కర్నూలులోని గడియారం ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రతి పీహెచ్సీలో కు.ని. ఆపరేషన్లు నిర్వహించాలి. ప్రస్తుతం కోసిగి, దేవనకొండ, కల్లూరు, బండి ఆత్మకూరు, గోనెగండ్ల పీహెచ్‌సీల్లో మాత్రమే చేస్తున్నారు. కొన్ని పీహెచ్‌సీల్లో మత్తుమందు డాక్టర్ల కొరత ఉంది. క్యాంపుల ఊసే లేదు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు గాను గతంలో ప్రత్యేకంగా జిల్లాలో క్యాంపులు నిర్వహించేవారు. ప్రతి సంవత్సరం 35వేల మందికి కు.ని. ఆపరేషన్లు చేయాలని లక్ష్యంగా ఉండేది. ఆపరేషన్ చేయించుకునే వారికి ప్రోత్సాహక నగదుతోపాటు వారికి రాను, పోను రవాణా ఛార్జీలు, పసుపు, కుంకుమ, చీర ఇచ్చి సత్కరించేవారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక లక్ష్యం ఎత్తేశారు. ఎవ్వరైనా కు.ని. ఆపరేషన్ చేయించుకోవడానికి ముందుకు వస్తే వారికి మాత్రమే శస్త్రచికిత్స చేయాలని సూచించారు. దీంతో ఆసుపత్రులకు వచ్చిన వారికి మాత్రమే ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. అయితే కోత, కుట్టు తక్కువగా ఉన్నా బటన్హోల్ ఆపరేషన్లు చేయించుకునేందుకు ఎక్కువ మంది మహిళలు ముందుకు రావడం లేదు. మగవాళ్లలో అపోహ.. జిల్లాలో 2013 నుంచి ఇప్పటి వరకు ఒక్క మగాడూ కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్(వేసక్టమీ) చేయించుకోలేదు. ఇప్పటి వరకు మహిళలే ఆపరేషన్ చేయించుకుంటూ వచ్చారు. కోత, కుట్టు లేకపోయినా, రక్తస్రావం రాకపోయినా, ఆపరేషన్ అనంతరం సంసార జీవితానికి ఎలాంటి ఢోకా లేకపోయినా, మగవారు ఈ ఆపరేషన్ చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ ఆపరేషన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలను తొలగించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కు.ని.. సక్సెస్
వనపర్తి అర్బన్: స్థానిక జిల్లా ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు మహిళలు ఎక్కువ సంఖ్యలో రావడంతో ఆవరణ అంతా అలజడి నెలకొంది. సుమారు ఏడాది తర్వాత కు.ని. శస్త్రచికిత్సలు చేపట్టడంతో భారీ సంఖ్యలో తరలించారు. కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశానుసారం నూతన జిల్లా అయ్యాక వైద్యవిధాన పరిషత్ కమిషనర్ కార్యాలయం నుంచి ప్రత్యేక మిషన్లను తెప్పించి ల్యాప్రోస్కోపిక్ విధానం ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహించారు. పెబ్బేరు, కడుకుంట్ల, పీపీ యూనిట్ల పరిధిలోని మహిళలకు శస్త్రచికిత్సలు జరిపారు. వందలాదిగా మహిళలు ఆస్పత్రికి తరలిరావడం, టోకెన్లు లభించకపోవడంతో చాలామంది మహిళలు వెనుదిరిగారు. గ్రామాల నుంచి మహిళలను ఆస్పత్రికి తీసుకువస్తే వైద్యసిబ్బంది తమను అసభ్యకర పదాలతో తిట్టి బయటకు పంపారని కొందరు ఆశలు ఆరోపించారు. ఆపరేషన్ల కోసం వచ్చే వారికి ప్రత్యేకంగా తాగునీరు, టెంట్లు వేసినా సరిపోకపోవడంతో చాలా మంది ఇబ్బందులకు గురయ్యారు. 84 మందికి శస్త్రచికిత్స జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసులు, హైదరాబాద్ నుంచి వచ్చిన ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ సునీల్ జోయెజ్, మత్తుమందు నిపుణులు డాక్టర్ ప్రభు తదితరులు 84 మందికి కు.ని. ఆపరేషన్లను నిర్వహించారు. 50 మందికి మాత్రమే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా.. కొందరు రికమండేషన్లు తీసుకురావడంతో 84కి చేరుకుంది. మంచాలు సరిపోకపోవడంతో కొంద రిని నేలపైనే పడుకోబెట్టారు. మహిళలు డీపీఎల్ శస్త్రచిక్తిత్సకు వెళ్లడంతో పిల్లలను వారి బంధువులు చెట్ల కింద పెట్టుకొని ఆడిపించడం, ఎండ అధికంగా ఉండడంతో చిన్నారులు అవస్థలకు గురయ్యారు. హెడ్నర్స్ గౌరీదేవి, స్టాఫ్‌నర్స్ నిర్మల, కౌసల్య, భాగ్య సిబ్బంది ఆపరేషన్లకు సహకరించారు. సద్వినియోగం చేసుకోండి చాలాకాలం తర్వాత నిర్వహిస్తున్న డీపీఎల్ శిబిరాన్ని జిల్లాలోని ఇతర పీహెచ్‌సీల్లోనూ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16వ తేదీన ఖిల్లాఘనపురం పీహెచ్సీ, 19న రేవల్లి పీహెచ్సీ, 23న ఆత్మకూర్ పీహెచ్సీ, 26న వనపర్తిలో శస్త్రచిక్తిత్స నిర్వహిస్తామని, ఆయా పీహెచ్‌సీల పరిధిలోని ఆశలు, వైద్య సిబ్బంది మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. వేసవి కావడంతో జూన్ నుంచి రెగ్యులర్‌గా జిల్లాకేంద్రంలో డీపీఎల్ శిబిరం నిర్వహిస్తామన్నారు. -
2024లో మనమే నెంబర్ 1
ప్రపంచ జనాభాలో రెండో స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం జనాభా విస్ఫోటనం దిశగా సాగుతోంది. ప్రస్తుతమున్న సంతానోత్పత్తి పెరుగుదల రేటుతో 2024 సంవత్సరానికల్లా చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఇండియా నిలవనుంది. 1952లోనే కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంభించినప్పటికీ ఆశించిన ఫలితాలను సాధించడంలో భారత్ విఫలం కాగా, రెండేళ్ల అనంతరం జనాభా నియంత్రణకు చైనా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అక్కడ సత్ఫలితాలు ఇచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రాలవారిగా జనాభా పెరుగుదల రేటు దేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది చర్చనీయాంశమవుతోంది. ఉత్తరభారతం పైపైకి.. ఉత్తరాదిలో ముఖ్యంగా బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు గణనీయంగా పెరుగుతోంది. అదే దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి అది తక్కువగా ఉంటోంది. జనాభా పెరుగుదలలో ప్రాంతాల వారీగా తారతమ్యాలు అధికమైతే.. దేశంలో రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో మార్పులకు అవకాశం ఏర్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సంతానోత్పత్తి అధికంగా లేకపోవడంతో దక్షిణాదిలో మరణిస్తున్న వారి కంటే పుట్టే పిల్లల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఇది ఆ రాష్ట్రాల్లో జనాభా తగ్గుదలకు దారితీస్తోంది. సంతానోత్పత్తి రేటు బిహార్‌లో 3.41 ఉండగా, యూపీలో 2.74గా ఉంది. 1951లో బిహార్ కంటే తమిళనాడు జనాభా కొంత ఎక్కువగా ఉండగా, గడచిన ఆరు దశాబ్దాల్లో తమిళనాడు కంటే బిహార్ జనాభా ఒకటిన్నర రెట్లు పెరిగింది. 1951లో కేరళ కంటే మధ్యప్రదేశ్‌లో 37 శాతం ఎక్కువ మంది ప్రజలుండగా, 2011 వచ్చేసరికి ఈ సంఖ్య 217 శాతానికి చేరుకుంది. పెద్ద, చిన్న రాష్ట్రాలు.. జనాభా వృద్ధితో పెద్ద, చిన్న రాష్ట్రాల మధ్య అంతరాలు పెరగకుండా సమానస్థాయిలో అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 1971 జనాభా లెక్కలకు అనుగుణంగా ఒక్కో రాష్ట్రంలోని పార్లమెంట్ సీట్ల సంఖ్యను నిర్ధారించగా, తదుపరి స్థానాల పెంపు గడువు 2026 తర్వాతే.. 2026 వరకు పార్లమెంట్ సీట్ల కూర్పు 50 ఏళ్ల క్రితం జనాభా ఆధారంగా చేసిన కేటాయింపులే కొనసాగుతాయి. ఉదాహరణకు...యూపీలో ఒక ఎంపీ 25 లక్షల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, బిహార్‌లో 26 లక్షలు, పశ్చి మబెంగాల్లో 22 లక్షలు, తమిళనాడులో 18 లక్షలు, కేరళలో 17 లక్షల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా పార్లమెంటు సీట్లు పునర్విభజించాలని ప్రతిపాదన ముందుకొస్తోంది. పెరగనున్న అంతర్రాష్ట్ర వలసలు.. వివిధ రాష్ట్రాల్లో సంతానోత్పత్తి హెచ్చుతగ్గులకు తోడు ఆర్థికాభివృద్ధిలో అంతరాలు జతకలిస్తే అంతర్రాష్ట్ర వలసలకు ఎక్కువ ఆస్కారమేర్పడనుంది. 1991–2001 మధ్య కాలంలో అంతర్రాష్ట్ర వలసల కంటే ఆయా రాష్ట్రాల్లోనే అంతర్గత వలసలు ఐదు రెట్లు పెరిగినట్లు తేల్చారు. మొత్తం దేశ జనాభాతో పోల్చితే అంతర్ రాష్ట్ర వలసలు తక్కువగానే ఉన్నా వాటి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వలసలు ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయి. ఈ పదేళ్ల కాలంలో తమిళనాడుకు 39 రెట్లు వలసలు పెరిగాయి. యూపీ, బిహార్ విషయానికొస్తే రెండింతలే వృద్ధిచెందాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బిలాస్పూర్ బాధితులకు రాహుల్ పరామర్శ
బిలాస్పూర్: చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల బాధితులను శనివారం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. నిర్లక్ష్యం, అవినీతి, నకిలీ మందుల కారణంగా మహిళల మరణించారని రాహుల్ విమర్శించారు. బిలాస్పూర్ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాహుల్ అన్నారు. బిలాస్పూర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం 13 మంది మహిళల ప్రాణాలను బలిగొంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల క్యాంపులో 83 మంది మహిళలు ఆపరేషన్లు చేయించుకోగా వారిలో 13 మంది మహిళలు ఆపరేషన్లు వికటించడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. -
నేడు బిలాస్పూర్లో రాహుల్ పర్యటన
బిలాస్పూర్: చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల బాధితులను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. శనివారం రాహుల్ బిలాస్పూర్లో పర్యటించనున్నారు. బిలాస్పూర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం 13 మంది మహిళల ప్రాణాలను బలిగొంది. బిలాస్పూర్ పట్టణ శివార్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రభుత్వం శనివారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల క్యాంపులో 83 మంది మహిళలు ఆపరేషన్లు చేయించుకోగా వారిలో 13 మంది మహిళలు ఆపరేషన్లు వికటించడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు.