కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే కేవలం మహిళలే ముందుకు వస్తున్నారు. దీనికి పురుషులు ఆమడ దూరం ఉంటున్నారు. జిల్లాలో వేసక్టమీ ఆపరేషన్ చేయించుకునే మగవారి సంఖ్య కనీసం నమోదు కూడా కావడం లేదు. ఆరేళ్లలో ఒక్క మగాడూ ఈ ఆపరేషన్ చేయించుకోలేదంటే పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు.
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ప్రస్తుత అంచనా ప్రకారం 44లక్షలకు పైగా జనాభా ఉంది. 2001లో 40లక్షలు ఉన్న జనాభా 2011 జనాభా లెక్కల నాటికి 44లక్షలకు చేరుకుంది. పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు గాను కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రోత్సహిస్తోంది. 30 ఏళ్ల క్రితం ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు చాలంటూ
ప్రచారం చేశారు. ఆ తర్వాత పదేళ్లకు ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలే ముద్దంటూ ప్రచారం తెచ్చింది. ఈ మేరకు జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పీపీ యూనిట్లతో పాటు ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, బేతంచర్ల, డోన్, నందికొట్కూరు, గూడూరు, గార్గేయపురం, డోన్‌తో పాటు కర్నూలులోని గడియారం ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రతి పీహెచ్‌సీలో కు.ని. ఆపరేషన్లు నిర్వహించాలి. ప్రస్తుతం కోసిగి, దేవనకొండ, కల్లూరు, బండి ఆత్మకూరు, గోనెగండ్ల పీహెచ్‌సీల్లో మాత్రమే చేస్తున్నారు. కొన్ని పీహెచ్‌సీల్లో మత్తుమందు డాక్టర్ల కొరత ఉంది.
క్యాంపుల ఊసే లేదు
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు గాను గతంలో ప్రత్యేకంగా జిల్లాలో క్యాంపులు నిర్వహించేవారు. ప్రతి సంవత్సరం 35వేల మందికి కు.ని. ఆపరేషన్లు చేయాలని లక్ష్యంగా ఉండేది. ఆపరేషన్ చేయించుకునే వారికి ప్రోత్సాహక నగదుతోపాటు వారికి రాను, పోను రవాణా ఛార్జీలు, పసుపు, కుంకుమ, చీర ఇచ్చి సత్కరించేవారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక లక్ష్యం ఎత్తేశారు. ఎవ్వరైనా కు.ని. ఆపరేషన్ చేయించుకోవడానికి ముందుకు వస్తే వారికి మాత్రమే శస్త్రచికిత్స చేయాలని సూచించారు. దీంతో ఆసుపత్రులకు వచ్చిన వారికి మాత్రమే ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. అయితే కోత, కుట్టు తక్కువగా ఉన్నా బటన్‌హోల్ ఆపరేషన్లు చేయించుకునేందుకు ఎక్కువ మంది మహిళలు ముందుకు రావడం లేదు.
మగవాళ్లలో అపోహ..
జిల్లాలో 2013 నుంచి ఇప్పటి వరకు ఒక్క మగాడూ కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్(వేసక్టమీ) చేయించుకోలేదు. ఇప్పటి వరకు మహిళలే ఆపరేషన్ చేయించుకుంటూ వచ్చారు. కోత, కుట్టు లేకపోయినా, రక్తస్రావం రాకపోయినా, ఆపరేషన్ అనంతరం సంసార జీవితానికి ఎలాంటి ఢోకా లేకపోయినా, మగవారు ఈ ఆపరేషన్ చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ ఆపరేషన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలను తొలగించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment