కర్నూలులోని ఏపీఈఆర్‌సీ భవనంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సన్నాహాలు.. రేపు భవనాల పరిశీలనకు కర్నూలుకు హైకోర్టు న్యాయమూర్తులు రాక
కర్నూలులో ఏర్పాటైన సంస్థలపై మరోసారి మాట తప్పిన చంద్రబాబు సర్కారు
లోకాయుక్త, హెచ్‌ఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్‌ను కూడా తరలించే అవకాశం
సాక్షిప్రతినిధి కర్నూలు : ‘‘నాలుగు సందర్భాలు.. నాలుగు రకాల ప్రకటనలు..! నోరు ఒకటి చెబుతుంది.. చేతలు మరొకటి.. దేనిదోవ దానిదే..!’’ అన్నట్లుంది సీఎం చంద్రబాబు సర్కారు తీరు. కర్నూలులో ఇప్పటికే ఏర్పాటు చేసిన సంస్థలను తరలించబోమని, అవి అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా చెప్పిన మూడు నెలలకే ఏపీఈఆర్‌సీ (రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి)ని అమరావతికి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కు అనుకూల భవనాలను అత్యవసరంగా పరిశీలించి నివేదిక పంపాలంటూ ఈ నెల 29న కలెక్టర్ రంజిత్‌బాషాకు హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) లేఖ రాశారు. ఈ క్రమంలో ఏపీఈఆర్‌సీ భవనాలతోపాటు జగన్నాథగట్టుపైన నిర్మించిన క్లస్టర్ యూనివర్సిటీ భవనాలు, నన్నూరు టోల్ ప్లాజా సమీపంలోని ఓ ప్రైవేట్ భవనాలను పరిశీలించి అధికార యంత్రాంగం నివేదిక పంపింది.
ఈ మూడింటిలో ఏపీఈఆర్‌సీ భవనంపై హైకోర్టు బృందం సుముఖత చూపినట్లు తెలుస్తోంది. హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీ ఈ నెల 6వతేదీన కర్నూలులోని ఏపీఈఆర్‌సీ భవనాన్ని పరిశీలించనుంది. కమిటీలో సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ రఘునందన్‌రావు, జస్టిస్ ఎన్.జయసూర్య, జస్టిస్ బి.కృష్ణమోహన్ సభ్యులుగా ఉన్నారు.
రూ.25 కోట్లతో అత్యాధునికంగా..
కర్నూలులో ఏపీఈఆర్‌సీకి సొంత భవనాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.25 కోట్లతో అత్యాధునికంగా నిర్మించింది. ఇందులో 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించడంతో పాటు ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిథి గృహాలను ఏర్పాటు చేశారు. గతేడాది మే 23న దీన్ని ప్రారంభించారు.
ప్రభుత్వం కొత్తగా నిర్మించిన భవనం కావడం.. అన్ని వసతులు ఉండటం.. సిటీలోనే ఉన్నందున ప్రజల రాకపోకలకు వీలుగా ఉంటుందని దీన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా కోస్తా, ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులో ఉండేలా విశాఖలో ఏపీఈఆర్‌సీ క్యాంపు కార్యాలయం 2023 ఆగస్టు 18న ప్రారంభమైంది.
నేషనల్ లా వర్సిటీ సంగతి ఏమిటి?
వైజాగ్‌లో ఇప్పటికే నేషనల్ లా యూనివర్సిటీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టుబట్టి కర్నూలులో మరో లా వర్సిటీని మంజూరు చేయించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రెండు లా యూనివర్సిటీలు లేవు. కర్నూలులో 273 ఎకరాల్లో నిర్మించాలని భావించిన ‘జ్యుడీషియల్ సిటీ’లో 100 ఎకరాల్లో నేషనల్ లా యూనివర్సిటీని నిర్మించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం భావించింది. దీనికి రూ.వెయ్యి కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది.
ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి దీనికి భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగస్టులో బీసీఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులతో సమావేశం సందర్భంగా అమరావతిలో ‘నేషనల్ లా యూనివర్సిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటించారు. కర్నూలుతో సంబంధం లేకుండా అమరావతిలో మరొకటి నిర్మిస్తున్నారా? లేక కర్నూలు లా యూనివర్సిటీకి మంగళం పాడనున్నారా? అనేది స్పష్టత ఇవ్వలేదు.
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత యూనివర్సిటీ పనుల్లో ఎలాంటి ముందడుగు లేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే న్యాయ సంస్థలను ఒక్కొక్కటిగా అమరావతికి తరలించడంతో పాటు లా వర్సిటీ నిర్మాణాన్ని పక్కనపెట్టనున్నట్లు స్పష్టమవుతోందని న్యాయవాదులు, అధికారవర్గాలు చెబుతున్నాయి.
టీడీపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సీమ నుంచి అత్యధికంగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు దక్కాయి. ఇంత మెజార్టీ కూటమికి ఇచ్చినందుకు కర్నూలుకు హైకోర్టును ఎత్తివేసి బెంచ్‌కు పరిమితం చేయడం, న్యాయ సంస్థలను ఒక్కొక్కటిగా తరలించడం ‘సీమ’కు చంద్రబాబు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అని మండిపడుతున్నారు.
ఏపీఈఆర్‌సీ భవనంలోనే హైకోర్టు బెంచ్..!
హైకోర్టు బెంచ్‌ను ఏపీఈఆర్సీ భవనంలోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మూడు ప్రతిపాదనల్లో ఇదే ఉత్తమమని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కర్నూలు సిటీ (కలెక్టరేట్) నుంచి జగన్నాథగట్టుపై ఉన్న క్లస్టర్ యూనివర్సిటీ 17.5 కిలోమీటర్లు దూరంలో ఉంది. నన్నూరు టోల్‌ప్లాజా సమీపంలోని ప్రైవేట్ భవనం 11 కి.మీ. దూరంలో ఉంది. ఏపీఈఆర్‌సీ 3.5 కి.మీ. దూరంలో నగరానికి చేరువలో ఉన్నందున దీనివైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
సీఎంగారూ.. ఇప్పుడేమంటారు?
కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసి ‘న్యాయ రాజధాని’గా అభివృద్ధి చేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంక్షించారు. అందులో భాగంగానే ఏపీఈఆర్‌సీ, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టులను కర్నూలులో ఏర్పాటు చేశారు.
లోకాయుక్త, హెచ్‌ఆర్సీ ఏర్పాటుపై మద్దిపాటి శైలజ 2021లో హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా ఆ సంస్థలను అమరావతికి తరలించేలా నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం తెలిపింది. దీనిపై విపక్ష పార్టీలు, రాయల సీమ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో కర్నూలులో నెలకొల్పిన సంస్థలను తరలించబోమని, అవి అక్కడే ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గతేడాది నవంబర్‌లో అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా ప్రకటించారు.
దీనికి విరుద్ధంగా ఇప్పుడు హైకోర్టు బెంచ్‌ను కర్నూలులోని ఏపీఈఆర్‌సీ భవనంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధపడటాన్ని బట్టి ఆ సంస్థను అమరావతికి తరలించడం లాంఛనమే అని స్పష్టమవుతోంది. కర్నూలులో బెంచ్ ఏర్పాటైన తర్వాత మిగతా సంస్థలను కూడా అమరావతికి తరలించే అవకాశం ఉన్నట్లు కూటమి ప్రభుత్వం చర్యలు స్పష్టం చేస్తున్నాయి.
» లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ) కార్యాలయాలను కర్నూలు నుంచి అమరావతికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో దీనికి సంబంధించి చట్ట సవరణ చేస్తాం. ఆపై తరలింపు నోటిఫికేషన్ జారీ చేస్తాం’ – నవంబర్ 13న హైకోర్టుకు స్పష్టం చేసిన కూటమి ప్రభుత్వం.
» ‘లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కర్నూలులోనే ఉంటాయి. ఇప్పటికే నెల
కొల్పిన సంస్థలను తరలించబోం. ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్‌తో చర్చించాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం’ – నవంబర్ 15న మంత్రి టీజీ భరత్ ప్రకటన
» ‘కర్నూలులో ఏర్పాటు చేసిన సంస్థలను అమరావతికి తరలించం. వాటిని అక్కడే ఉంచుతాం. హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం’ – గత నవంబర్‌లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన
» ‘ఈ నెల 6న హైకోర్టు న్యాయమూర్తుల బృందం కర్నూలుకు వస్తోంది. దిన్నెదేవరపాడు వద్ద నిర్మించిన ఏపీఈఆర్‌సీ భవనాన్ని పరిశీలిస్తారు’ – తాజాగా న్యాయశాఖ మంత్రి ఫరూక్ వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment