
ప్రపంచ జనాభాలో రెండో స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం జనాభా విస్ఫోటనం దిశగా సాగుతోంది. ప్రస్తుతమున్న సంతానోత్పత్తి పెరుగుదల రేటుతో 2024 సంవత్సరానికల్లా చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఇండియా నిలవనుంది. 1952లోనే కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంభించినప్పటికీ ఆశించిన ఫలితాలను సాధించడంలో భారత్ విఫలం కాగా, రెండేళ్ల అనంతరం జనాభా నియంత్రణకు చైనా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అక్కడ సత్ఫలితాలు ఇచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రాలవారిగా జనాభా పెరుగుదల రేటు దేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది చర్చనీయాంశమవుతోంది.
ఉత్తరభారతం పైపైకి..
ఉత్తరాదిలో ముఖ్యంగా బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు గణనీయంగా పెరుగుతోంది. అదే దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి అది తక్కువగా ఉంటోంది. జనాభా పెరుగుదలలో ప్రాంతాల వారీగా తారతమ్యాలు అధికమైతే.. దేశంలో రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో మార్పులకు అవకాశం ఏర్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సంతానోత్పత్తి అధికంగా లేకపోవడంతో దక్షిణాదిలో మరణిస్తున్న వారి కంటే పుట్టే పిల్లల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఇది ఆ రాష్ట్రాల్లో జనాభా తగ్గుదలకు దారితీస్తోంది. సంతానోత్పత్తి రేటు బిహార్‌లో 3.41 ఉండగా, యూపీలో 2.74గా ఉంది. 1951లో బిహార్ కంటే తమిళనాడు జనాభా కొంత ఎక్కువగా ఉండగా, గడచిన ఆరు దశాబ్దాల్లో తమిళనాడు కంటే బిహార్ జనాభా ఒకటిన్నర రెట్లు పెరిగింది. 1951లో కేరళ కంటే మధ్యప్రదేశ్‌లో 37 శాతం ఎక్కువ మంది ప్రజలుండగా, 2011 వచ్చేసరికి ఈ సంఖ్య 217 శాతానికి చేరుకుంది.
పెద్ద, చిన్న రాష్ట్రాలు..
జనాభా వృద్ధితో పెద్ద, చిన్న రాష్ట్రాల మధ్య అంతరాలు పెరగకుండా సమానస్థాయిలో అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 1971 జనాభా లెక్కలకు అనుగుణంగా ఒక్కో రాష్ట్రంలోని పార్లమెంట్ సీట్ల సంఖ్యను నిర్ధారించగా, తదుపరి స్థానాల పెంపు గడువు 2026 తర్వాతే.. 2026 వరకు పార్లమెంట్ సీట్ల కూర్పు 50 ఏళ్ల క్రితం జనాభా ఆధారంగా చేసిన కేటాయింపులే కొనసాగుతాయి. ఉదాహరణకు...యూపీలో ఒక ఎంపీ 25 లక్షల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, బిహార్‌లో 26 లక్షలు, పశ్చి మబెంగాల్‌లో 22 లక్షలు, తమిళనాడులో 18 లక్షలు, కేరళలో 17 లక్షల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా పార్లమెంటు సీట్లు పునర్విభజించాలని ప్రతిపాదన ముందుకొస్తోంది.
పెరగనున్న అంతర్రాష్ట్ర వలసలు..
వివిధ రాష్ట్రాల్లో సంతానోత్పత్తి హెచ్చుతగ్గులకు తోడు ఆర్థికాభివృద్ధిలో అంతరాలు జతకలిస్తే అంతర్రాష్ట్ర వలసలకు ఎక్కువ ఆస్కారమేర్పడనుంది. 1991–2001 మధ్య కాలంలో అంతర్రాష్ట్ర వలసల కంటే ఆయా రాష్ట్రాల్లోనే అంతర్గత వలసలు ఐదు రెట్లు పెరిగినట్లు తేల్చారు. మొత్తం దేశ జనాభాతో పోల్చితే అంతర్ రాష్ట్ర వలసలు తక్కువగానే ఉన్నా వాటి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వలసలు ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయి. ఈ పదేళ్ల కాలంలో తమిళనాడుకు 39 రెట్లు వలసలు పెరిగాయి. యూపీ, బిహార్ విషయానికొస్తే రెండింతలే వృద్ధిచెందాయి.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment