'పుష్ప 2' చిత్రం వరుస రికార్డ్స్‌తో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. రూ. 1000 కోట్లకుపైగా సాధించిన భారతీయ చిత్రాల లిస్ట్‌లో రెండో స్థానంలో పుష్ప ఉన్నాడు. అదే టాలీవుడ్ సినిమా లిస్ట్‌లో అయితే ప్రథమ స్థానం. ఇండియన్ బాక్సాఫీస్ టాప్ కలెక్షన్ల పరంగా ఇప్పటి వరకు 'దంగల్' (రూ. 2,070 కోట్లు), 'బాహుబలి 2' (రూ.1810 కోట్లు) సాధించి వరుస స్థానాల్లో ఉన్నాయి.
అయితే, తాజాగా పుష్ప2 ( Pushpa 2: The Rule) ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు (గ్రాస్) రాబట్టి కలెక్షన్స్ పరంగా రెండో స్థానంలో చేరిపోయింది. ఇప్పుడు పుష్పగాడి టార్గెట్ దంగల్.. కేవలం మరో రూ. 200 కోట్ల మార్క్ అందుకుంటే దంగల్ (Dangal) రికార్డ్ బద్దలవుతుంది. ఇండియన్ టాప్ వన్ సినిమాగా పుష్ప2 చేరిపోతుంది. అయితే, ఈ మార్క్‌ను అల్లు అర్జున్ (Allu Arjun) చాలా సులువుగా అందుకుంటాడని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇండియాలో కలెక్షన్ల పరంగా టాప్ వన్ సినిమాగా పుష్ప-2 రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో బాహుబలి-2 ఉండగా రీసెంట్‌గా పుష్ప దాటేసింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతీయ సినిమాల లిస్ట్‌లో బాలీవుడ్ హిట్ మూవీ దంగల్ టాప్ వన్‌లో ఉంది. ఇప్పుడు పుష్పగాడి టార్గెట్ కూడా ఆ చిత్రంపైనే పడింది. దంగల్ సినిమా టాప్ వన్‌లో చేరడానికి ప్రధాన కారణం చైనా మార్కెట్ (China Cinema Market ) అని చెప్పవచ్చు. ఈ మూవీ అక్కడ ఏకంగా రూ. 1100 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో టాప్ వన్‌లోకి దంగల్ చేరిపోయింది.
దశాబ్ద కాలంగా దంగల్ రికార్డ్ పదిలంగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్ అందుకునే ఛాన్స్ పుష్పగాడికి మాత్రమే ఉంది. అక్కడ పుష్పగాడు నచ్చితే సులువుగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తాడని అంచనా వేస్తున్నారు. దీంతో పుష్ప2 ఫైనల్ కలెక్షన్స్ రూ. 3వేల కోట్లకు చేరవచ్చు అని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనా వాళ్లకు పుష్ప నచ్చుతాడు అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
పుష్ప-2 టార్గెట్ చైనా
పుష్ప2 చిత్రం చైనాలో కూడా విడుదల కానుంది. త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. చైనా బాక్సాఫీస్‌లో పుష్ప2 ఎంట్రీ ఇస్తే తప్పనిసరిగా దంగల్ రికార్డ్‌ను క్రాస్ చేస్తుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో పుష్ప2 చిత్రానికి భారీ అనుకూల అంశాలు ఎక్కువగా ఉన్నాయి. చైనా, జపాన్‌లో ఎర్రచందనాన్ని (Redwood) అక్కడి ప్రజలు చాలా పవిత్రంగా భావిస్తారు. వారి కుటుంబ వ్యవస్థల్లో ఎర్ర చందనానికి ఉండే విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడి ప్రజలు నిత్యం చందనంతో తయారు అయిన వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఎర్రచందనంతో వాళ్లకు ఎక్కువ కనెక్షన్ ఉంది. ఈ అంశాలు పుష్ప2 విజయంలో కీలకంగా మారుతాయి. ఎర్రచందనం సరఫరా విషయంలో ఇంత డ్రామా ఉంటుందా అని వాళ్లు ఆశ్చర్యపడటం గ్యారెంటీ అని చెప్పవచ్చు.
ఈ మధ్య కాలంలో అక్కడ విడుదలైన భారతీయ సినిమాలు భారీగానే కలెక్షన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతి చిత్రం మహారాజ పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి వారు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారు. ఇన్నీ సానుకూలతలు పుష్ప2 చిత్రానికి ఉన్నాయి. పుష్ప-2 చైనాలో విడుదలైతే దంగల్ రికార్డ్ బద్దలు కావడం చాలా సులువు అని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
చైనాలో వరకట్నంగా ఎర్రచందనం
ఎర్ర చందనంతో చేసిన వస్తువులను వరకట్నంగా ఇవ్వడాన్ని అక్కడి వారు చాలా గొప్పగా, గర్వంగా ఫీలవుతుంటారు. ఎర్ర చందనాన్ని గౌరవాన్ని పెంచే చిహ్నంగా భావిస్తారు. ఎర్ర చందనంతో చేసిన పూసలను బౌద్ధ భిక్షువులు మెడలో ధరిస్తారు. అక్కడ ఒక కేజీ ఎర్ర చందనం దుంగ నుంచి కీ చైన్లు, పూసలు తయారుచేసి అమ్మితే సుమారు రూ.25 వేలు వస్తుంది. టన్ను ఎర్ర చందనం ధర అక్కడ రూ.2.50 కోట్లు పలుకుతోంది కాబట్టే విదేశాలకు అక్రమ రవాణా అడ్డూ అదుపు లేకుండా సాగిపోతోంది.
(ఇదీ చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బన్నీపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు)
ఎర్ర చందనాన్ని చైనా, మలేషియా, జపాన్, సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ దేశాలకు ఎక్కువగా తరలిస్తారు. బౌద్ధులు దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో ఎర్ర చందనం ముక్క ఉంటే.. అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. బొమ్మలు, ఇంటి వస్తువులు, సంగీత వాయిద్యాలు, దేవుడి బొమ్మలు, బుద్ధుడి బొమ్మలు, గడియారాలు, టీ కప్పులు తదితర వస్తువుల తయారీకి దీనిని ఉపయోగిస్తున్నారు. ముఖ సౌందర్యం కోసం క్రీమ్‌లు, పౌడర్‌గానూ వాడుతున్నారు. ఆయుర్వేద గుణాలు ఎక్కువగా ఉండడంతో ఔషధాల తయారీలోనూ వినియోగిస్తున్నారు. ఎర్ర చందనంతో చేసిన గ్లాసుల్లో నీటిని ఉంచి తాగితే బీపీ, షుగర్ వ్యాధులు తగ్గుముఖం పడతాయని నమ్ముతారు.
మన దేశంలో తప్ప ఎక్కడా దొరకదు
మన దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఎర్ర చందనం దొరకదు. మన దేశంలోనూ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలోనే ఎర్ర చందనం ఉంది. దాదాపు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. శేషాచలం అటవీ ప్రాంతంలో పెరిగే ఎర్ర చందనానికి ఉన్న గిరాకీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడ పెరిగినా లేదు.
Comments
Please login to add a commentAdd a comment