
పది భాషల్లో వేలకొద్దీ పాటలకు కొరియోగ్రఫీ చేశారు శివశంకర్ మాస్టర్ (Shiva Shankar Master). మగధీరతో జాతీయ పురస్కారం అందుకున్నారు. బెంగళూర్ అంతర్జాతీయ గ్లోబల్ ట్రస్ట్ ఈయన్ను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈయన పుట్టిపెరిగింది తమిళనాడులో అయినా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది మాత్రం తెలుగునేలపైనే! 2021 నవంబర్ 28న ఆయన కన్నుమూశారు.
వెన్నెముక విరిగి 12 ఏళ్లపాటు..
తాజాగా ఇతడి పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. మా తాతవాళ్లది రాజమండ్రి. 70-80 ఎకరాలుండేది. తర్వాత చెన్నై షిఫ్ట్ అయ్యారు. నాన్నకు చిన్నప్పుడు జరిగిన ఓ ప్రమాదంలో వెన్నెముక విరిగింది. కదల్లేని స్థితిలో నరకం అనుభవించాడు. 12 ఏళ్ల తర్వాత కోలుకున్నాడు.
కరోనా సమయంలో కన్నుమూత
ఆ సమయంలోనే థియేటర్ ఆర్టిస్టుల హావభావాలు చూసి తాను అలా పలికించాలనుకునేవాడు. అలా మొదట్లో సలీం మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. తర్వాత కొరియోగ్రాఫర్‌గా ఎదిగాడు. కరోనా సమయంలో నాకు, నాన్నకు ఒకేసారి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. పరిస్థితి సీరియస్‌గా మారడంతో ఆస్పత్రిలో చేరాం. ప్రతి రోజు రూ.7 లక్షల దాకా ఖర్చయింది. అప్పుడు మా ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే! సరిగ్గా అదే సమయంలో ఇండస్ట్రీనుంచి సాయం అందింది. నాన్నకు కరోనా తగ్గిపోయాక ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి మరణించాడు. కోవిడ్ వల్ల ఇండస్ట్రీ నుంచి ఓంకార్, అశ్విన్.. తప్ప ఎవరూ నాన్న పాడె మోసేందుకు రాలేదు.
(చదవండి: అమ్మతోడు.. జైలర్‌లో ఏం చేశానో నాకే తెలీదు: శివరాజ్‌కుమార్)
ఆ ఒక్క ఘటనతో..
మా నాన్నకు జీవితంలో చేదు అనుభవం ఏదైనా ఉందా? అంటే అది నా భార్య చేసిన నిర్వాకం వల్లే..! మాది పెద్దలు కుదిర్చిన వివాహం. బెంళూరుకు చెందిన అమ్మాయి. పెళ్లయిన నాలుగు నెలలకే ప్రెగ్నెంట్ అయింది. పాప పుట్టాక తను మారిపోయింది. నిజానికి తను మంచి అమ్మాయే.. కాకపోతే, మా నాన్నకు చాలా ఆస్తి ఉంది, ఒక్క కంప్లైంట్ చేస్తే చాలు ఆస్తంతా కొట్టేయొచ్చు అని కొందరు తనకు నూరిపోశారు. ఆ చెప్పుడు మాటలు విని ఆమె రూ.10 కోట్లు, నాన్న కట్టిన ఇల్లు కావాలని ఇంటి ముందు ధర్నా చేసింది.
కోడలు హింసిస్తోందని..
మా కుటుంబం మొత్తానిపై పలు కేసులు పెట్టించింది. ఆమెను చంపడానికి కూడా ప్రయత్నించామంది. దాంతో నాన్న.. మా కోడలు హింసిస్తోందని అప్పటి సీఎం జయలలితకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఆమె మహిళా కమిషన్‌ను సంప్రదించింది. ఈ గొడవ సద్దుమణిగేలా లేదని చెన్నైలో ఇల్లు వదిలేసి హైదరాబాద్‌కు వచ్చేశాం. తర్వాత విడాకులు తీసుకున్నాం. ఆమెకు కొంత భరణం ఇచ్చాను అని పేర్కొన్నాడు. విజయ్ శివ శంకర్.. మహాత్మ (నీలపురి గాజుల ఓ నీలవేణి), రాజన్న, లయన్ వంటి పలు సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేశాడు. మగధీరలో తండ్రి దగ్గరే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌నూ వ్యవహరించాడు.