
రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ (Jailer Movie) వచ్చి రెండేళ్లవుతోంది. అప్పట్లో జైలర్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు షేక్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించిన శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్‌ల పర్ఫామెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం దీనికి సీక్వెల్ తెరకెక్కుతోంది. జైలర్ 2లో తన ఎంట్రీ ఉందని కన్ఫామ్ చేసేశాడు శివరాజ్‌కుమార్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా కన్నడ చిత్రం 45.
వెంటనే ఒప్పేసుకున్నా..
ఈ సినిమా ఈవెంట్‌లో శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. జైలర్ సినిమాను రజనీకాంత్ కోసమే చేశాను. చిన్నప్పటినుంచి ఆయన్ను చూస్తూ ఉన్నాను. తను నాకు నా కుటుంబంలోని వ్యక్తిలాగే అనిపిస్తాడు. రజనీకాంత్ సినిమా అనగానే క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాను. ఆయన నాకు తండ్రిలాంటివాడు. అందుకే ఎంత చిన్న పాత్రయినా సరే రెడీ అని చెప్పాను. కథేంటని కూడా అడగలేదు. వాళ్లే పిలిచి మరీ కథంతా చెప్పారు. ఏదేమైనా సరే, నేను యాక్ట్ చేస్తానని భరోసా ఇచ్చాను.
అమ్మతోడు.. ఏం చేశానో..
కానీ నా లుక్, రోల్ అంత బాగా ఎలా వర్కవుట్ అయిందనేది నాకిప్పటికీ అర్థం కాదు. సినిమా రిలీజయ్యాక దేశవిదేశాల నుంచి నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అదిరిపోయిందని పొగిడారు. నేను చేసిందే రెండు సీన్లు కదరా అంటుంటే కూడా సూపర్ అని మెచ్చుకున్నారు. అమ్మతోడు.. నేనంత గొప్పగా ఏం చేశానో నాకిప్పటికీ అర్థం కాదు. సిగరెట్ పట్టుకుని నడిచావ్, టిష్యూ డబ్బా తన్నావు.. అంతకుమించి ఏం చేశావ్? అని నా భార్య ఇప్పటికీ దెప్పి పొడుస్తుంది.
బహుశా అదే కారణమేమో!
బహుశా గుడ్ లుక్స్ వల్ల కావొచ్చు. ఈ విషయంలో డైరెక్టర్ నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, నన్ను బాగా చూపించిన కెమెరామెన్‌కు థాంక్స్ చెప్తున్నాను. జైలర్ 2లో కూడా నేను కనిపించబోతున్నాను అని పేర్కొన్నాడు. జైలర్ 2లో నందమూరి బాలకృష్ణ భాగమయ్యారన్న ప్రచారం గురించి తనకేమీ తెలియదన్నాడు.
చదవండి: కొత్త లుక్‌లో ఖుష్బూ.. ఇంజక్షన్స్ తీసుకుందని ట్రోలింగ్