
పాడేరు: ఇటీవల విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం ఈదులపాలెంలోని మెడికల్ షాపులో నిబంధనలకు విరుద్ధంగా గిరిజన మహిళలకు సంక్షేమ ఆపరేషన్లు చేసిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆపరేషన్ చేసిన అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ గైనకాలజిస్టు డాక్టర్ ఎస్.తిరుపతిరావును సస్పెండ్ చేసింది.
ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.ఎస్.సూర్యనారాయణ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ‘విశాఖ ఏజెన్సీలో ప్రైవేటు ముఠా’ శీర్షికన ఈ నెల 10న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. సబ్ కలెక్టర్ వి.అభిషేక్ చేపట్టిన విచారణలో.. ఈ ఆపరేషన్లు చేసింది అనకాపల్లి ఆస్పత్రి గైనకాలజిస్టు తిరుపతిరావుగా తేలింది. అలాగే వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ అధికారులు జరిపిన విచారణ నివేదికను అందుకున్న జిల్లా వైద్యాధికారి సూర్యనారాయణ.. డాక్టర్ తిరుపతిరావుపై చర్యలు తీసుకున్నారు. తిరుపతిరావును సస్పెండ్ చేసి ఆయన స్థానంలో తగరంపూడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ రమేష్‌నాయుడును అర్బన్ ఫ్యామిలి వెల్ఫేర్ సెంటర్‌కు ఇన్‌చార్జిగా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment