Visakha agency
-
చలిగాలుల జాడలేదు
సాక్షి, విశాఖపట్నం: డిసెంబర్, జనవరి నెలల్లో ఎముకలు కొరికేస్తున్నట్టుగా చలి తీవ్రత ఉంటుంది. కానీ.. ఈ ఏడాది అలాంటి పరిస్థితి కనిపించలేదు. ఈ శీతాకాలం సాదాసీదాగానే ప్రభావం చూపించిది తప్ప జనాన్ని గజగజలాడించ లేదు. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలతో తీవ్ర వడగాడ్పులు (సివియర్ హీట్æవేవ్స్) వీస్తుంటాయి. అదే శీతాకాలంలో కొన్ని రోజులు అతి శీతల గాలులు (సివియర్ కోల్డ్ వేవ్స్) వీచి గడ్డ కట్టించే చలికి కారణమవుతాయి. అలాంటి రోజుల్లో కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకంటే తక్కువగా నమోదవుతాయి. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తుంది. విశాఖ ఏజెన్సీ (అల్లూరి సీతారామరాజు జిల్లా)లోని లంబసింగి, చింతపల్లి, అరకు, పాడేరు వంటిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా క్షీణిస్తాయి. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 5–6 డిగ్రీలకు దిగజారిపోతాయి. లంబసింగిలో అయితే ఏటా జనవరిలో ఏకంగా ఉష్ణోగ్రత జీరో డిగ్రీలకు పడిపోతుంది. కానీ.. ఈ శీతాకాలం సీజన్ అందుకు భిన్నంగా సాగింది. ఈ సీజన్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ రోజులు 8–15 డిగ్రీల మధ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకంటే (చింతపల్లి, లంబసింగిల్లో) తక్కువగా రాష్ట్రంలో ఎక్కడా నమోదు కాలేదు. మన్యం సహా రాష్ట్రంలో ఒక్క రోజూ అతి శీతల గాలులు (కోల్డ్ వేవ్స్) వీయలేదు. శీతల తీవ్రత అధికంగా ఉండే జనవరిలోనూ చలి ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. ఫలితంగా చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందే అవసరం ఏర్పడ లేదు. గడచిన కొన్నేళ్లలో ఇలాంటి పరిస్థితి లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తూర్పు, ఈశాన్య గాలులే ఇందుకు కారణం సాధారణంగా శీతాకాలంలో దక్షిణాదికంటే ఉత్తర, వాయవ్య భారతదేశంలో శీతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అటునుంచి మన రాష్ట్రం వైపు ఉత్తర, వాయవ్య గాలులు బలంగా వీస్తుంటాయి. దీంతో చలి తీవ్రత ఆంధ్రప్రదేశ్‌పై కూడా కనిపిస్తుంది. అయితే.. ఈ ఏడాది రాష్ట్రంపైకి తూర్పు, ఈశాన్య గాలులు బలంగా వీస్తున్నాయి. ఫలితంగా ఈ గాలులు ఉత్తర, వాయవ్య గాలులకు ఒకింత అడ్డుకట్ట వేశాయి. ఈ ఏడాది చలి తీవ్రత అంతగా లేకపోవడానికి, అతిశీతల గాలులు వీయకపోవడానికి తూర్పు, ఈశాన్య గాలుల ప్రభావం అధికంగా ఉండటమే కారణమని భారత వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు 17–23 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. దీంతో చలి ప్రభావం ఏమంత ఉండటం లేదు. గతంలో ఫిబ్రవరి ఆరంభంలో ఇలాంటి పరిస్థితి లేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల ఇవి 30–35 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మరో 10 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆపై చలి నిష్క్రమిస్తుందని పేర్కొంటున్నారు. -
పోలీసు స్టిక్కర్ తగిలించి.. గంజాయి తరలించి
రామచంద్రాపురం (పటాన్చెరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ ఏజెన్సీ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని బాలానగర్ ఎస్వోటీ, రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ నరేందర్‌రెడ్డి అందించిన వివరాలివి. మహారాష్ట్ర బడ్లాపూర్‌కు చెందిన ధీరజ్ మున్నాలా డ్రైఫ్రూట్స్ వ్యాపారం చేస్తుంటాడు. అందులో సరైన ఆదాయం రాకపోవడంతో స్నేహితుడు ప్రశాంత్ సంజయ్ షిండేతో కలిసి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయించాలని నిర్ణయించాడు. ఇన్నోవా కారు అద్దెకు తీసుకొని ఇద్దరూ విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వినయ్ మండల్ ద్వారా కిలో రూ.3 వేల చొప్పున 58.5 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. వాటిని 39 ప్యాకెట్లుగా విభజించి కారులో పెట్టుకుని మహారాష్ట్రకు బయల్దేరారు. వీరు గంజాయి తరలిస్తున్నట్లు గురువారం సాయంత్రం బాలానగర్ ఎస్వోటీ పోలీసులు, రామచంద్రాపురం పోలీసులకు సమాచారం అందింది. దీంతో రామచంద్రాపురం పట్టణ పరిధిలోని ఇక్రిశాట్ వద్ద గంజాయి తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని పట్టుకున్నారు. అందులో ఉన్న ధీరజ్ మున్నాలా జైస్వాల్, ప్రశాంత్ సంజయ్ షిండేలను అదుపులోకి తీసుకొని విచారించగా విషయం బయటపడింది. కాగా ఇన్నోవా వాహనానికి నంబర్ ప్లేట్ మార్చి, ముందు భాగంలో పోలీస్ స్టిక్కర్‌ను పెట్టుకొని గంజాయిని తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. దాంతో వారి వద్ద నుంచి రూ.11 లక్షల 70 వేల విలువైన 58.8 కిలోల గంజాయిని, ఇన్నోవా కారు, డూప్లికేట్ నంబర్ ప్లేట్, కొడవలి, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
కొనసాగుతున్న చలి తీవ్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. మంచుతోపాటు పొగమంచు కురుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో మంగళవారం తెల్లవారుజామున 3.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జి.మాడుగుల మండలం కుంతలంలో 4.1, చింతపల్లి మండలం చింతపల్లిలో 4.2, జీకే వీధిలో 4.3, డుంబ్రిగూడలో 4.4, జి.మాడుగుల, హకీంపేటలో 4.7, పాడేరులో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీలోని చాలాప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ విశాఖ ఏజెన్సీ తరహాలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం విశేషం. శ్రీసత్యసాయి జిల్లా ఆగలిలో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా మడకశిర మండలం ఆర్.అనంతపురం, అనంతపురం జిల్లా బెళుగుప్పలో 8.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
మైమరపించే మారేడుమిల్లి అందాలు...
అల్లూరి సీతారామరాజు (మారేడుమిల్లి): నిన్న మొన్నటి వరకు వాడిపోయిన చెట్లకు ఇటీవల కురిసిన వర్షాలు కొత్త ఊపిరులూదాయి. ఏజెన్సీలో ఎటుచూసినా ఆకుపచ్చని తివాచీ పరిచినట్లు ప్రకృతి కనువిందు చేస్తోంది. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, ఒంపులు తిరిగే రహదారులు, జలజలపారే సెలయేర్లు, ఉరికే జలపాతాలు, వాగులు, వంకలతో సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రకృతి అందాలను తిలకించడానికి పర్యాటకులు మారేడుమిల్లికి తరలివస్తున్నారు. ఇక్కడి నుంచి చింతూరు వెళ్లే ఘాట్‌రోడ్డు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.రోడ్డుకు ఇరువైపులా పచ్చదనంతో కూడిన దట్టమైన ఆడవులు, పక్షుల రాగాలు, ఒంపుసొంపుల మార్గంలో సాగే ప్రయాణం, చల్లని వాతావారణంలో తొలకరి చినుకుల మధ్య ఘాట్‌లో ప్రయాణం వాహనచోదకులకు మధురానుభూతిని కలిగిస్తోంది. ఘాట్‌లోని మన్యం వ్యూపాయింట్ నుంచి అందమైన ప్రకృతిని చూసే వారికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. మండలంలో పేరొందిన పర్యాటక ప్రాంతం గుడిస హిల్ టాప్. ఈ ప్రదేశం చాలా ఎత్తులో ఉంటుంది. పై భాగం చదునుగా ఉండి.. చుట్టూ గడ్డి మాత్రమే ఉంటుంది. ఇక్కడ చేతికి అందే ఎత్తులో మేఘాలు వెళుతుంటాయి. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి మెలికలు తిరిగిన ఘాట్ రోడ్డులో ప్రయాణించాలి. ఈ ప్రదేశం పచ్చదనంతో ఎంతో సుందరంగా ఉంది. అయితే ప్రస్తుతం గుడిస సందర్శనకు అనుమతి లేదు. -
వణికిస్తున్న చలి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో చలి పులి పంజా విసురుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఈ నెల 21న వాయుగుండంగా మారనుంది. ఇది థాయ్‌లాండ్ వైపుగా ప్రయాణించనుంది. దీని ప్రభావంతో బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరో 10 రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణం కంటే.. 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గడం, దీనికి తోడు గాలులు వీస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు పడిపోతే అతి శీతల గాలులు(కోల్డ్వేవ్స్)గా ప్రకటిస్తారు. ఏజెన్సీలో పలు చోట్ల ఈ తరహా కోల్డ్ వేవ్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు మంచు కూడా విపరీతంగా కురుస్తోంది. విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపుట్టులో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల కనిష్టానికి పడిపోయాయి. డుంబ్రిగుడలో 8, అరకు, జి.మాడుగుల, లంబసింగిలో 9, పెదబయలులో 9.5, పాడేరులో 11, చింతపల్లిలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఆదివాసీ బాలలకు ‘ఆధార్’ దొరికింది
జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీలో మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాలు నిట్టమామిడి, బందులపనుకులోని బాలలకు ఎట్టకేలకు ఆధార్ కార్డు నమోదు కార్యక్రమం జరిగింది. ఆ గ్రామాలకు చెందిన పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు లేకపోవటంతో చదువుకు, ఇతర ప్రభుత్వ పథకాలకు ఇప్పటివరకు దూరంగా ఉన్నారు. ‘సాక్షి’ దినపత్రికలో ఇటీవల ఈ సమస్యపై కథనం వెలువడడంతో అధికార యంత్రాంగం స్పందించింది. ఆదివాసీ పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టింది. పాడేరు ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్ అప్పలస్వామి, ఎంఆర్ఐ చిన్నారావు, సిబ్బంది 8 కి.మీ కాలినడకన ఆయా గ్రామాలను సందర్శించి పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసి ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిట్టమామిడి, బందులపనుకు గ్రామాల్లో గల 53 మంది పిల్లలకు ఆధార్ నమోదు చేశారు. దీంతో తమ పిల్లలు చదువుకోవడానికి ఒక ఆధారం దొరికిందని ఆదివాసీ గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. -
విశాఖ ఏజెన్సీలో చలి పులి
పాడేరు: విశాఖ ఏజెన్సీలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో పాటు అర్ధరాత్రి నుంచే పొగ మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడడం లేదు. నాలుగు రోజుల నుంచి ఏజెన్సీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతున్నాయి. గురువారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 10.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 11 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 14.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం వేళల్లో కూడా 24 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నమోదవుతోంది. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు అధికమవుతున్నాయి. ఏజెన్సీలోని అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, పాడేరు, చింతపల్లి, సీలేరు ప్రాంతాలను సందర్శిస్తున్న పర్యాటకులంతా ఏజెన్సీలోని శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. -
గంజాయి పంట ధ్వంసం
కొయ్యూరు/డుంబ్రిగుడ: విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం అంతాడ పంచాయతీ నిమ్మలగొంది, బోయవుట, డుంబ్రిగుడ మండలంలోని కురిడి పంచాయతీ గోరాపూర్ గ్రామాల్లో గిరిజనులు బుధవారం 40 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశారు. కొయ్యూరు సీఐ స్వామినాయుడు, మంప, కొయ్యూరు, డుంబ్రిగూడ ఎస్ఐలు లోకేష్‌కుమార్, దాసరినాగేంద్ర, సంతోష్‌కుమార్ బుధవారం ఆయా గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామాల ప్రజలు ఏకమై 40 ఎకరాల్లో గంజాయి మొక్కలను పీకి పారేశారు. ఇక మీదట గంజాయి తోటలు పెంచబోమని వారు పోలీసులకు తెలిపారు. సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ గిరిజనుల్లో చైతన్యం వచ్చిందని, స్వచ్ఛందంగా వారే గంజాయిని ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. -
మరో 287 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
పాడేరు: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల నిర్మూలన లక్ష్యంగా పోలీసు శాఖ, ఎస్ఈబీ బృందాలు గంజాయి దాడులను కొనసాగిస్తున్నాయి. జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఎస్ఈబీ జేడీ ఎస్.సతీష్‌కుమార్‌ల ఆదేశాల మేరకు మంగళవారం జరిపిన దాడుల్లో ఏజెన్సీలోని జి.మాడుగుల, జి.కె.వీధి, చింతపల్లి, పెదబయలు మండలాల పరిధిలో మొత్తం 287 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ గచ్చుపల్లి పరిసర ప్రాంతాల్లో 77 ఎకరాలు, జి.కె.వీధి మండలంలోని గొందిపల్లి, పి.కొత్తూరు, సిల్లిగూడ గ్రామ సమీపంలోని 18 ఎకరాలు, జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ పరిధిలోని కె.పెదబయలు గ్రామ పరిసరాల్లో 40 ఎకరాల్లో గంజాయి పంటను పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే పెదబయలు మండలంలోని గుల్లెలు, గోమంగి పంచాయతీల్లోని చావిడిమామిడి, గుల్లెలు, దల్లెలు గ్రామాల్లో 152 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి మొక్కలన్నింటినీ నరికి నిప్పటించారు. కళాజాత ద్వారా ప్రచారం హుకుంపేట మండలంలోని కొట్నాపల్లి, చీడిపుట్టు, దాలిగుమ్మడి గ్రామాల్లో కళాజాత బృందాల ద్వారా గంజాయి వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టారు. గంజాయి సాగు, రవాణా ద్వారా గిరిజన ప్రాంతాలకు జరుగుతున్న అనర్ధాలు, జైలు జీవితంతో దుర్భర బతుకులు, తదితర అంశాలపై పాటలు, నృత్య రూపకాల ద్వారా అవగాహన కల్పించారు. -
402 ఎకరాల్లో గంజాయి ధ్వంసం
పాడేరు/ కొయ్యూరు: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల నిర్మూలన లక్ష్యంగా పోలీసుశాఖతో పాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో బృందాలు గంజాయి దాడులను కొనసాగిస్తున్నాయి. అలాగే చింతపల్లి మండలం తురబాలగెడ్డ వద్ద లిక్విడ్ గంజాయి తరలిస్తున్న తల్లీకొడుకులను సోమవారం అరెస్టు చేశారు. కాగా విశాఖ ఏజెన్సీలోని డుంబ్రిగుడ, జి.కె.వీధి, చింతపల్లి, పెదబయలు మండలాల పరిధిలోని 402 ఎకరాల్లో గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేసి నిప్పంటించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జేడీ శంకరరెడ్డి, ఎస్ఈబీ అధికారులు సుధాకర్, శ్రీను, ప్రశాంత్, సంతోస్, తదితరులు పాల్గొన్నారు. లిక్విడ్ గంజాయి పట్టివేత.. విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి నుంచి రూ.లక్ష విలువ చేసే కిలో ద్రవ గంజాయిని ద్విచక్ర వాహనంపై తీసుకొస్తున్నారన్న సమాచారం గొలుగొండ ఎస్ఈబీ అధికారులకు అందింది. దీంతో డౌనూరు పంచాయతీ తురబాలగెడ్డ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన తల్లీ, కొడుకులు జరీనా, ఎస్కె.జహరుద్దీన్ లిక్విడ్ గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. వీరు కాకినాడలోని వైద్య విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారినుంచి మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. -
ఏజెన్సీలో 3 చోట్ల ఏకలవ్య మోడల్ పాఠశాలలు
పాడేరు/అరకులోయ: విశాఖ ఏజెన్సీలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. అరకులోయ మండలం గన్నెల రోడ్డులోని మజ్జివలస, పెదబయలు, జి.మాడుగుల మండల కేంద్రాల్లో మూడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ మూడు చోట్లా నిర్మించనున్న పాఠశాలలకు ఏపీ ప్రభుత్వం అనువైన స్థలాలను కేటాయించింది. ఒక్కో పాఠశాలను 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఈ సందర్భంగా గిరిజన గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ ఆదివారం మజ్జివలసలో పాఠశాల నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. -
ఏజెన్సీలో 102 ఎకరాల్లో గంజాయి ధ్వంసం
పాడేరు/గూడెంకొత్తవీధి: విశాఖ ఏజెన్సీలో శనివారం 102 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్, సూపరింటెండెంట్ గోపాల్ పర్యవేక్షణలో జి.మాడుగుల మండలంలోని బీరం పంచాయతీ వి.కోడాపల్లి ప్రాంతంలో 54 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. రెండు లక్షల 70 వేల మొక్కలను నరికివేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి, ఎస్ఈబీ బృందం, సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు జి.కె.వీధి మండలంలో సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐ షమీర్ ఆధ్వర్యంలో రింతాడ పంచాయతీ కోరాపల్లి గ్రామంలో గంజాయి నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం గంజాయి సాగు జోలికి పోమని వారితో తీర్మానం చేయించారు. 8 ఎకరాల్లో తోటలను ధ్వంసం చేసి నిప్పంటించారు. చింతపల్లి మండలంలోని కుడుమసారి పంచాయతీ కోటగున్నెల, లోతుగెడ్డ పంచాయతీ మేడూరు గ్రామాల్లో 40 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం చేశారు. 760 కిలోల గంజాయి స్వాధీనం కశింకోట: విశాఖ జిల్లా మండలంలోని బయ్యవరం వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దర్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ జి.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఏజెన్సీలోని జి.మాడుగుల మండలం నుంచి గంజాయి కొనుగోలు చేసి చెన్నైకు బొలెరో వాహనంలో తరలిస్తుండగా బయ్యవరం వద్ద పట్టుకున్నామన్నారు. ఈ సందర్భంగా చీడికాడకు చెందిన గ్రామానికి చెందిన డ్రైవర్ కొల్లివలస శ్రీను, బుచ్చియ్యపేట మండలం అప్పన్నపాలెం గ్రామానికి చెందిన జి.బత్తుల సంతోష్‌లను అరెస్టు చేశామన్నారు. 760 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, దీని ఖరీదు రూ.15 లక్షలు ఉంటుందన్నారు. -
AP: 239 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం
పాడేరు: విశాఖ ఏజెన్సీలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో గంజాయి దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం 239 ఎకరాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేశారు. పెదబయలు మండలంలోని మారుమూల జగ్గంపేట, సీమకొండ, రంజెలమంది గ్రామాల సమీపంలో సుమారు 216 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్న గంజాయి తోటలను ఎస్ఈబీకి చెందిన ఏడు బృందాలు ధ్వంసం చేశాయి. 10.8 లక్షల గంజాయి మొక్కలను నరికేసి వాటికి నిప్పంటించారు. చింతపల్లి మండలం మేడూరు గ్రామ సమీపంలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న చింతపల్లి ఏఎస్పీ తుషార్ డూడి ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తుల సహకారంతో 15 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలకు నిప్పంటించారు. పాడేరు మండలంలోని ఇరడాపల్లి సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్న కనక ఆధ్వర్యంలో గిరిజనులతో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు, వలంటీర్ల సహకారంతో 8 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేసి నిప్పంటించారు. -
37 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
గూడెంకొత్తవీధి/డుంబ్రిగుడ/కొయ్యూరు: విశాఖ ఏజెన్సీలో మంగళవారం 37 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. గూడెంకొత్తవీధి మండలంలోని జర్రెల, జి.కె.వీధి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. జర్రెల పంచాయతీలోని పలు గ్రామాల్లో సర్పంచ్ వీరోజి నాగరాజు ఆధ్వర్యంలో సుమారు 5 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. జి.కె.వీధి పంచాయతీలోని బి.కొత్తూరు, డి.కొత్తూరు గ్రామాల పరిధిలో జి.కె.వీధి సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐ షమీర్ ఆధ్వర్యంలో 20 ఎకరాలలో గంజాయి తోటలను ధ్వంసం చేసి మొక్కలకు నిప్పంటించారు. చింతపల్లి మండలంలోని అన్నవరం స్టేషన్ పరిధిలో గచ్చిపల్లి సమీపంలోని సుమారు 6 ఎకరాల్లోని గంజాయి తోటలను ఎస్ఐ ప్రశాంత్‌కుమార్ సమక్షంలో ధ్వంసం చేశారు. డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ కొంతుగుడ గ్రామంలో ఎస్ఐ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో 6 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. 46 కిలోల గంజాయి పట్టివేత గొలుగొండ ఎస్ఈబీ సీఐ రాజారావు ఆధ్వర్యంలో మంగళవారం డౌనూరు పంచాయతీ తురబాలగెడ్డ వద్ద 46 కిలోల గంజాయిని పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి ప్రాంతం నుంచి టాటా నానో కారులో గంజాయి ప్యాకెట్లను తీసుకెళ్తుండగా ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ.లక్ష వరకు ఉంటుంది. కారు, ద్విచక్ర వాహనం, నాలుగు ఫోన్లు, రూ.1,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. డుంబ్రిగుడకు చెందిన బి.రాజారావును, పాములవాకకు చెందిన సీహెచ్ నానిబాబు, హుకుంపేటకు చెందిన జి.రంగారావు, వి.రాజులను అరెస్టు చేశామని సీఐ తెలిపారు. -
గంజాయిపై ఉక్కుపాదం
పాడేరు/డుంబ్రిగుడ/జీకే వీధి/చింతపల్లి/కాకినాడ సిటీ/అనంతగిరి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగు, రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాల ఆధ్వర్యంలో యథేచ్ఛగా సాగుతున్న గంజాయి దందాను నామరూపాల్లేకుండా తుదముట్టించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు త్రిముఖ వ్యూహంతో ముందుకు కదులుతూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ఓ వైపు గంజాయి సాగు వల్ల తలెత్తే దుష్పరిణామాలపై ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట గిరిజనులకు అవగాహన కల్పిస్తూ గంజాయి తోటలను ధ్వంసం చేసే పనిలో కొన్ని బృందాలు నిమగ్నం కాగా.. మరికొన్ని బృందాలు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాయి. అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఎస్ఈబీ, పోలీస్ అధికారులు కార్యాచరణ కొనసాగిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. విజయవంతంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో వందలాది ఎకరాల్లో గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేయగా.. పలుచోట్ల తనిఖీలు దాడులు నిర్వహిస్తూ వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతున్న గంజాయిని పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సోమవారం విశాఖ జిల్లా మారుమూల గిరిజన గ్రామాల్లో 217 ఎకరాల్లో సాగు చేస్తున్న 9.80 లక్షలకు పైగా గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారు. మరోవైపు ఒడిశా నుంచి స్మగ్లింగ్ అవుతున్న రూ.కోటిన్నరకు పైగా విలువైన 1,720 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒకే పంచాయతీ పరిధిలో 217 ఎకరాల్లో పంట ధ్వంసం విశాఖ ఏజెన్సీ పరిధిలోని ఐదు మండలాల్లో సోమవారం 217 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది ఏడు బృందాలుగా ఏర్పడి జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ పరిధిలోని వాకపల్లి, డిప్పలగొంది, వడ్రంగుల గ్రామాల్లో 164 ఎకరాల్లో సాగవుతున్న సుమారు 7.40 లక్షల మొక్కలను నరికి నిప్పంటించారు. డుంబ్రిగుడ మండలంలోని కండ్రుం పంచాయతీ దండగుడ, బెడ్డగుడ, కండ్రుం గ్రామాల్లో 12 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను సోమవారం ఆ పంచాయతీ గిరిజనులు స్వచ్ఛందంగా ధ్వంసం చేశారు. ఇకపై గంజాయి సాగుచేయబోమని తీర్మానం చేశారు. గూడెం కొత్తవీధి మండలంలో మావోయిస్టు ప్రాంతమైన కుంకుంపూడికి సమీపంలోని 5 ఎకరాల్లో గంజాయి తోటలను గిరిజనులు స్వచ్ఛందంగా ధ్వంసం చేసి, మొక్కలకు నిప్పంటించారు. చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీ గాదిగొయ్యి గ్రామంలో 20 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. పాడేరు మండలం గొండెలి, కించూరు పంచాయతీల్లో 16 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఆయా ప్రాంతాల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, గిరిజన పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగాయి. పశువుల దాణా ముసుగులో తరలిస్తున్న టన్ను గంజాయి పట్టివేత తూర్పు గోదావరి జిల్లా చింతూరు సబ్ డివిజన్ పరిధిలో రూ.కోటి విలువైన వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు కాకినాడలో సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన వ్యక్తులు పశువుల దాణా ముసుగులో ఆ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు లారీలో గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ లారీని చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని గోడ్లగూడెం జంక్షన్ వద్ద అటకాయించారు. పోలీసుల్ని చూసి ఒక వ్యక్తి పారిపోగా మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా తికూరి గ్రామానికి చెందిన మన్మోహన్ పటేల్, అదే జిల్లా మౌరహా గ్రామానికి చెందిన మహమ్మద్ హారన్, ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా ఎంపీవీ–79 గ్రామానికి చెందిన రాబిన్ మండల్, ఎంపీవీ–75 గ్రామానికి చెందిన అమృతా బిశ్వాస్, నలగుంటి గ్రామంలోని ఎంపీవీ–36కు చెందిన బసుదేవ్ మండల్‌ను అరెస్ట్ చేశారు. ఒడిశాలో పండించిన గంజాయిని వారంతా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని ఎస్పీ చెప్పారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి రాజును ఒడిశా పోలీసుల సహకారంతో అరెస్ట్ చేస్తామన్నారు. చిలకలగెడ్డ వద్ద 720 కేజీల స్వాధీనం విశాఖ జిల్లా అనంతగిరి మండలం చిలకలగెడ్డ చెక్‌పోస్టు వద్ద ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు వ్యాన్‌లో తరలిస్తున్న 720 కేజీల గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, స్టేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం సంయుక్తంగా పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ గణపతిబాబు, టాస్క్‌ఫోర్స్ హెచ్‌సీ శ్రీధర్ నేతృత్వంలోని పోలీసులు చిలకలగెడ్డ వద్ద కాపుగాసి పట్టుకున్నారు. గంజాయితో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబట్ట గంజాయి విలువ రూ.50 లక్షలకు పైగా విలువ చేస్తుందని అంచనా. ఈ దాడిలో ఎస్ఈబీ ఎస్ఐ దాస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కృష్ణప్రసాద్, నర్సింగరావు పాల్గొన్నారు. -
ఏవోబీలో ‘ఆపరేషన్ పరివర్తన్’
సాక్షి, అమరావతి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కేరళ, మహరాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన ముఠాల ఆధ్వర్యంలో ఏవోబీలో యథేచ్ఛగా నడుస్తున్న గంజాయి సాగును నామరూపాల్లేకుండా తుదముట్టించేందుకు ప్రత్యేక బృందాలను యాక్షన్‌లోకి దించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ గంజాయి దందాను కట్టడి చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పోలీసు శాఖ ‘ఆపరేషన్ పరివర్తన్’ను చేపట్టింది. ఈ తరహా ఆపరేషన్‌ను దేశంలో తొలిసారిగా ఏపీలో అమలు చేస్తున్నారు. గంజాయి దుష్పరిణామాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తూ..టెక్నాలజీ సాయం, భారీ స్థాయిలో బలగాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ద్విముఖ వ్యూహంతో విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. రంగంలోకి దిగిన బృందాలు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలను ఆనుకుని ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ›5 రోజులుగా భారీగా గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నాయి. అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఎస్ఈబీ గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతోంది. మ్యాపింగ్‌తో నిర్దిష్ట ప్రాంతాల గుర్తింపు ‘ఆపరేషన్ పరివర్తన్’ను విజయవంతం చేసేందుకు ఎస్ఈబీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. మన్యంలో గంజాయి సాగుచేసే ప్రాంతాలను ముందుగా మ్యాపింగ్ చేశారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ మండలాలతోపాటు రాష్ట్ర సరిహద్దుకు అవతల ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తృతంగా గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలను నిర్దిష్టంగా గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ డ్రోన్ కెమెరాలతో వీడియో తీయించారు. ఐదు రోజుల్లో 550 ఎకరాల్లో.. ఏపీ పరిధిలోని గంజాయి సాగును ధ్వంసం చేసేందుకు భారీ సంఖ్యలో బలగాలు, సిబ్బందిని ఎస్ఈబీ వినియోగిస్తోంది. పోలీస్, ఎస్ఈబీ సిబ్బందితో ఏర్పాటు చేసిన 66 ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఆ బృందాలకు వివిధ మండలాల బాధ్యతలను అప్పగించారు. గంజాయి సాగును ధ్వంసం చేసేందుకు అవసరమైన యంత్రాలను సమకూర్చారు. అనంతరం ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట గంజాయి తోటల్ని ధ్వంసం చేసి, పంటకు నిప్పు పెట్టే పని ఓ యజ్ఞంగా సాగుతోంది. గడచిన 5 రోజుల్లో విస్తృతంగా దాడులు నిర్వహించి ఏకంగా 550 ఎకరాల్లో గంజాయి సాగును అధికారులు ధ్వంసం చేశారు. ఇప్పటివరకు 21 లక్షల గంజాయి మొక్కలు ధ్వంసం చేసి నిప్పు పెట్టినట్టు ఎస్ఈబీ వర్గాలు వెల్లడించాయి. వీటి విలువ రూ.104.25 కోట్లు ఉంటుందని ఎస్ఈబీ ఉన్నతాధికారులు అంచనా. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ.. రాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేసేలా ఆ రాష్ట్ర పోలీసు అధికారులతో ఏపీ పోలీసులు ఇప్పటికే చర్చలు జరిపారు. ఏపీ వైపు చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ను ఆ రాష్ట్రాల్లోనూ చేపట్టనున్నారు. అందుకు అవసరమైన సాంకేతిక, ఇతరత్రా సహకారాన్ని ఏపీ ఎస్ఈబీ అధికారులు అందిస్తారు. విశాఖ ఏజెన్సీలో భారీగా గంజాయి తోటల ధ్వంసం గూడెంకొత్తవీధి/కొయ్యూరు/చింతపల్లి/జి.మాడుగుల/అనకాపల్లిటౌన్: విశాఖ ఏజెన్సీలోని 3 మండలాల్లో శనివారం పెద్దఎత్తున గంజాయి తోటలను ధ్వంసం చేశారు. గూడెంకొత్తవీధి మండలంలోని దామనపల్లి, రింతాడ పంచాయతీల్లోని డేగలపాలెం, ఇంద్రానగర్, కొత్తూరులో 56 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. జీకేవీధి పోలీసులు ఈ గ్రామాలకు చేరుకుని, గంజాయి తోటలను ధ్వంసం చేసి, నిప్పుపెట్టి కాల్చివేశారు. కొయ్యూరు మండలంలోని మారుమూల అంతాడ పంచాయతీ పారికలలో రీముల చంద్రరావు ఆధ్వర్యంలో శనివారం గ్రామస్తులు 5 ఎకరాల గంజాయి తోటలను ధ్వంసం చేశారు. చింతపల్లి మండలంలోని గంజిగెడ్డ, బౌర్తి, కొత్తూరు గ్రామాల సమీపంలో 16 ఎకరాల గంజాయి తోటలను చింతపల్లి పోలీసులు ధ్వంసం చేశారు. జి.మాడుగుల మండలంలో ఎగమండిభ, పరిసర ప్రాంతాల్లో 158 ఎకరాల్లో సాగవుతున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ మాదకద్రవ్యాల పని పట్టేందుకు విశాఖ జిల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్లో డీఎస్పీ సునీల్ ఆధ్వర్యంలో శనివారం డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. 1, 2, 3 ప్లాట్‌ఫారాలపై, తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో కూడా డాగ్‌స్క్వాడ్ తనిఖీలు జరిగాయి. 18 కిలోల లిక్విడ్ గంజాయి పట్టివేత చింతపల్లి: విశాఖ జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ పరిధిలోని కొత్తూరు బయలులో ఓ వ్యక్తి నుంచి 18 కిలోల ద్రవరూప (లిక్విడ్) గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ ఎస్ఐ గణేష్ తెలిపారు. శనివారం రాత్రి కొత్తూరు బయలులో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద వ్యక్తి లిక్విడ్ గంజాయితో వెళ్తున్నాడని, దానిని పరిశీలిస్తుండగా అతడు పరారయ్యాడని ఎస్ఐ చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
కొనసాగుతున్న గంజాయి తోటల ధ్వంసం
సీలేరు/డుంబ్రిగుడ: ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలతో గిరిజనులు స్వచ్ఛందంగా విశాఖ ఏజెన్సీలోని గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నారు. సీలేరు ఎస్ఐ రంజిత్ చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో విశాఖపట్నం జిల్లా ధారకొండ పంచాయతీ చిన్నగంగవరం గ్రామ పరిధిలోని గంజాయి తోటలను స్థానికులు సోమవారం నరికేశారు. అలాగే డుంబ్రిగుడ మండలంలోని సాగర పంచాయతీ కొసోంగుడ, బల్లిగెడ్డ గ్రామాల్లో కూడా సర్పంచ్ తౌడమ్మ, ఎంపీటీసీ దేవదాసుల ఆధ్వర్యంలో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. అరకు సీఐ జి.డి.బాబు మాట్లాడుతూ.. గంజాయి పండించి జైలు పాలు కావద్దని.. కుటుంబాలను రోడ్డున పడవేయద్దని హితవు పలికారు. -
ఆనంద్‌బాబు వ్యాఖ్యలకు ఆధారాల్లేవు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో కొందరు రాజకీయ, ఇతర నాయకుల ప్రమేయంతోనే స్మగ్లింగ్ మాఫియా కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పిన మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు వ్యాఖ్యలకు తగిన ఆధారాలు లేవని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి.రంగారావు స్పష్టం చేశారు. విశాఖ నుంచి వెళ్లిన ఒక ప్రత్యేక పోలీసు బృందం ఆయన్ను విచారించిందన్నారు. అందులో భాగంగానే ఐపీసీ సెక్షన్ 160 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశామని చెప్పారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర –ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో గంజాయి సాగు శాశ్వత నిర్మూలన ఒక్క పోలీసు వ్యవస్థతోనే సాధ్యం కాదని, ఆయా ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు సామాజిక బాధ్యతతో సంకల్పించాలని సూచించారు. నల్గొండ పోలీసులు రెండు వారాల ముందు నుంచే విశాఖ ప్రాంతంలో పలు కేసుల విషయమై స్థానిక పోలీసులను సంప్రదించారని, కానీ చింతపల్లి వద్ద కాల్పుల ఘటన విషయమై తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఏవోబీ ప్రాంతంలో గంజాయి సమస్య దశాబ్దాల కాలంగా ఉందన్నారు. పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి కొంత కాలంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. విశాఖ జిల్లాలో 2016లో 724 ఎన్డీపీఎస్ కేసులలో 2,290 మందిని అరెస్ట్ చేశామన్నారు. 2017లో 712 కేసుల్లో 2,100 మందిని, 2018లో 579 కేసుల్లో 2,174 మందిని, 2019లో 812 కేసుల్లో 2,565 మందిని, 2020లో 812 కేసుల్లో 2,565 మందిని, ఈ ఏడాది అక్టోబర్ 15 వరకు 1,359 కేసుల్లో 4,059 మందిని అరెస్ట్ చేశామని వివరించారు. రెండేళ్లలో విశాఖ పోలీసులు ఏవోబీలో దాదాపు 50 గ్రామాల్లో 800 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారని చెప్పారు. గంజాయి స్మగ్లర్ల సమాచారం ఉందని ఎవరు చెప్పినా విచారిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. -
రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు.. పోలీసుల కాల్పులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. లంబసింగి ఘాట్‌రోడ్డులో పోలీసులపైకి స్మగ్లర్లు రాళ్లు రువ్వారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. భారీ ఎత్తున గంజాయిని నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు నల్లగొండ నుంచి విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. ఘటనా స్థలానికి నర్సీపట్నం నుంచి పోలీసు బలగాలను తరలించారు. -
అక్రమ ఆపరేషన్లపై ప్రభుత్వం కొరడా
పాడేరు: ఇటీవల విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం ఈదులపాలెంలోని మెడికల్ షాపులో నిబంధనలకు విరుద్ధంగా గిరిజన మహిళలకు సంక్షేమ ఆపరేషన్లు చేసిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆపరేషన్ చేసిన అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ గైనకాలజిస్టు డాక్టర్ ఎస్.తిరుపతిరావును సస్పెండ్ చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.ఎస్.సూర్యనారాయణ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ‘విశాఖ ఏజెన్సీలో ప్రైవేటు ముఠా’ శీర్షికన ఈ నెల 10న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. సబ్ కలెక్టర్ వి.అభిషేక్ చేపట్టిన విచారణలో.. ఈ ఆపరేషన్లు చేసింది అనకాపల్లి ఆస్పత్రి గైనకాలజిస్టు తిరుపతిరావుగా తేలింది. అలాగే వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ అధికారులు జరిపిన విచారణ నివేదికను అందుకున్న జిల్లా వైద్యాధికారి సూర్యనారాయణ.. డాక్టర్ తిరుపతిరావుపై చర్యలు తీసుకున్నారు. తిరుపతిరావును సస్పెండ్ చేసి ఆయన స్థానంలో తగరంపూడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ రమేష్‌నాయుడును అర్బన్ ఫ్యామిలి వెల్ఫేర్ సెంటర్‌కు ఇన్చార్జిగా నియమించారు. -
అక్రమ ఆపరేషన్లపై సబ్‌కలెక్టర్ విచారణ
పాడేరు: విశాఖ ఏజెన్సీ పాడేరు మండలంలోని మారుమూల గ్రామం ఈదులపాలెంలో మెడికల్ షాపులో అక్రమంగా కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు నిర్వహించిన ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు కలెక్టర్‌ను ఆదేశించింది. విచారణాధికారిగా నియమితులైన పాడేరు సబ్ కలెక్టర్ వి.అభిషేక్ మంగళవారం ఉదయమే ఈదులపాలెం చేరుకుని విచారణ చేపట్టారు. ఏడీఎంహెచ్‌వో డాక్టర్ కె.లీలాప్రసాద్, తహసీల్దార్ ప్రకాష్‌రావు, ఇతర అధికారులు, ఈదులపాలెం వైద్యుల సమక్షంలో విచారణ నిర్వహించారు. గిరిజన మహిళలకు కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు నిర్వహించిన మెడికల్ షాపును తనిఖీ చేశారు. మెడికల్ షాపు నిర్వహకుడితోపాటు సమీప గిరిజనులను కూడా ఆయన విచారించారు. ఆపరేషన్లు చేయించుకున్న కొంతమంది మహిళలను సబ్ కలెక్టర్ పరామర్శించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఇక్కడే ఆపరేషన్లు చేయించుకోవడానికి దారితీసిన పరిస్థితులపై ఆరాతీశారు. ఆపరేషన్లు చేసిన అనకాపల్లికి చెందిన వైద్యుడు, ఫిమేల్ నర్సు వివరాలను సేకరించారు. స్థానికంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది ఒకరిద్దరు సహకరించారనే ఆరోపణలపైన కూడా విచారణ జరిపారు. మెడికల్ షాపులో అక్రమంగా ఆపరేషన్లు జరిపారని నిర్ధారణకు వచ్చిన ఆయన పాడేరు పోలీసులకు కూడా తగిన సమాచారం అందించారు. ఆయన సమగ్ర విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. మరోవైపు జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్లు మెడికల్ షాపును పరిశీలించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. షాపునకు తాళాలు వేశారు. -
అందరి చూపు.. రంగురాళ్ల వైపు!.. వారం రోజుల్లో కోట్ల వ్యాపారం
రంగురాళ్లంటే వెంటనే గుర్తొచ్చేది విశాఖ ఏజెన్సీ.. అందులో నర్సీపట్నం ప్రాంతాలే. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విలువైన వైఢూర్యాలు ఇక్కడికి సమీపంలో లభ్యం కావడమే ఇందుకు కారణం. నెల రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తూ.. అప్పట్లో మూసివేసిన క్వారీలన్నీ తవ్వకాలకు అనువుగా మారడంతో అందరూ దృష్టీ దీనిపై పడింది. నెలరోజుల క్రితం సాక్షాత్తూ డీఎఫ్‌వో డ్రైవర్ ఆధ్వర్యంలో కొంతమంది రంగురాళ్ల తవ్వకాలకు యత్నించి దొరికిపోయిన సంఘటన మరువక ముందే వారం నుంచి గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం, జీకే వీధి, చింతపల్లి మండలాల్లో సిగనాపల్లి, మేడూరు, గుర్రాలగొందిల్లో క్వారీలలో సైతం తవ్వకాలు కొనసాగిస్తున్నారు. రంగురాళ్ల వ్యాపారానికి నర్సీపట్నం కేంద్రంగా మారింది. వారం రోజుల్లో సుమారు రూ.5 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలిసింది. ఫారెస్టు, పోలీసు సిబ్బంది చూసీచూడనట్టు వ్యవహరించడంతో వ్యాపారులు రంగురాళ్ల తవ్వకాలు నిరాటంకంగా సాగిస్తున్నారు. కృష్ణాబజార్ ప్రాంతంలో ఒక రంగురాళ్ల వ్యాపారి ఇల్లే ఇందుకు కేంద్రంగా మారింది. – నర్సీపట్నం కోట్లు కురిపించే క్వారీలు.. చెంతనే ప్రమాదాలు విశాఖ ఏజెన్సీ తూర్పు కనుమల్లోని గొలుగొండ మండలం కరక రంగురాళ్ల క్వారీలో లభించే ఆకుపచ్చ వైఢూర్యాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. పప్పుశెట్టిపాలెం, సిగనాపల్లి, గుర్రాలగొంది, మేడూరు క్వారీల్లో లభించే క్యాట్స్ ఐ రకాలకు కూడా డిమాండ్ ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రంగురాళ్ల తవ్వకాలకు అనువుగా మారాయి. నర్సీపట్నానికి చెందిన వ్యాపారులు సమీప గ్రామాల్లోని కొంతమందికి డబ్బులు ఇచ్చి పప్పుశెట్టిపాలెం లీజు క్వారీకి సమీపంలో అనధికారికంగా రంగురాళ్ల తవ్వకాలు సాగిస్తున్నారు. జీకే వీధి మండలం సిగనాపల్లిలో కూడా రంగురాళ్ల తవ్వకాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. సిగనాపల్లి క్వారీలో సెల్‌సిగ్నల్స్ అందుబాటులో ఉండటం రంగురాళ్ల వ్యాపారులకు కలిసొచ్చింది. తవ్వకాలు జరుపుతున్న కూలీలు (ఫైల్) పోలీసు, అటవీ సిబ్బంది ఎవరు వచ్చినా ఇట్టే సమాచారం తెలుస్తుండడంతో సమయానుకూలంగా తవ్వకాలు సాగిస్తున్నారు. 1992–93లో పప్పుశెట్టిపాలెం క్వారీలో ముమ్మరంగా తవ్వకాలు జరపడంతో క్వారీ కూలి అప్పట్లో 15 మంది మృతి చెందారు. ఆ తర్వాత కరకలో రంగురాళ్ల క్వారీ కూలి ముగ్గురు మృతి చెందారు. కరక ప్రమాదం తర్వాత అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌ప్రకాష్ , జిల్లా పోలీసు, అటవీ అధికారులు రంగురాళ్ల క్వారీల్లో తవ్వకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అప్పటి నుండి కరక, పప్పుశెట్టిపాలెం ప్రాంతాల్లో తవ్వకాలకు అడ్డుకట్ట పడింది. ఇటీవల పప్పుశెట్టిపాలెం, సిగనాపల్లి క్వారీలో భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ లభ్యమవుతున్న రంగురాళ్లను నర్సీపట్నం తరలిస్తున్నారు. చదవండి: (ఇక సొంత ఊరే.. వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్) నర్సీపట్నానికి చెందిన వ్యాపారి క్రయవిక్రయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. విశాఖపట్నం, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఈ వ్యాపారి వద్దకు వచ్చి రంగురాళ్లు కొనుగోలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సిగనాపల్లి క్వారీలో లభ్యమైన రంగురాళ్లు సుమారు రెండు కోట్ల రూపాయలకు విక్రయించినట్లు తెలిసింది. రంగురాళ్ల వ్యాపారుల ధన దాహనికి మరింత మంది అమాయకులు ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసు, అటవీ, రెవెన్యూ అధికారులు రంగురాళ్ల తవ్వకాలు నిరోధించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తవ్వకాలు జరిపితే ఉపేక్షించేది లేదు రంగురాళ్ల తవ్వకాలు, స్మగ్లింగ్ జరిపితే వదిలే ప్రసక్తి లేదు. లీజు క్వారీల వద్ద తప్ప మిగిలిన చోట్ల తవ్వకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహించే వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి రంగురాళ్ల తవ్వకాలకు వెళ్ళ వద్దు. ఎవరైనా వ్యాపారులు డబ్బులిచ్చి తవ్వకాలు జరపమని ప్రోత్సహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. –మణికంఠ చందోలు, నర్సీపట్నం ఏఎస్పీ -
విస్తారంగా వర్షాలు
సాక్షి, నెట్వర్క్: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంగళవారం కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. విశాఖ జిల్లా ఏజెన్సీలో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. హుకుంపేట–అడ్డుమాండ ప్రధాన రహదారిలో వంతెనపైకి వరదనీరు రావడంతో రాకపోకలు స్తంభించాయి. తూర్పుగోదావరి జిల్లాలో గత 24 గంటల్లో సగటున 67.9 మిల్లీమీటర్ల వర్షపాతం చోటు చేసుకుంది. జిల్లావ్యాప్తంగా సింహభాగం మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కాకినాడ అర్బన్‌లో 174 మిల్లీమీటర్లు.. అత్యల్పంగా రాజోలులో 26.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఏజెన్సీలో కొండ వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రంపచోడవరం వాల్మీకిపేటకు చెందిన గొర్లె మహేష్ (చిట్టి) చేపలు పట్టేందుకు స్థానిక పంపుహౌస్ సమీపంలోని కాలువలో దిగగా ఉధృతికి కొట్టుకుపోయాడు. అతడిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. విశాఖపట్నం రుషికొండ బీచ్‌లో కెరటాలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం 15 అడుగులు ముందుకు రావడంతో తీర ప్రాంతం కోతకు గురైంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంట ఉన్న కపుల్ బెడ్స్, వాచ్ టవర్స్, గొడుగులు వంటి వాటిని కెరటాలు తాకడంతో పర్యాటకులు భయాందోళనలకు గురయ్యారు. భీమిలి బీచ్ రోడ్డు, మంగమారిపేట, ఉప్పాడ, తిమ్మాపురం ప్రాంతాల్లోనూ కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యధికంగా కవిటిలో 125 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమగోదావరి జిల్లా ఎద్దెలవాగు వంతెనపై ప్రవహిస్తున్న గోదావరి వరద పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే దారిలో ఎద్దెల వాగు వంతెన సోమవారం రాత్రి నీటమునిగింది. దీంతో దిగువన ఉన్న కొయిదా, కట్కూరు, కాచారం, తాళ్లగొంది, పూసుగొంది, చిట్టంరెడ్డిపాలెం, యడవల్లి, బుర్రెడ్డిగూడెం, టేకూరు, సిద్దారం, కుంకుడుకొయ్యల పాకలుతోపాటు మరో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత 2 రోజుల నుంచి పెదవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడంతో వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, రామవరం, ఊటగుంపు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అశ్వారావుపేట వెళ్లే రహదారిలో రామవరం వద్ద లోతు వాగు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు నుంచి రుద్రమకోటకు వెళ్లే దారిలో పెదవాగు వంతెన ప్రాంతంలో రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. మద్దిగట్ల ప్రాంతంలో వాగు ఉధృతిలో కొట్టుకుపోతున్న 2,000 గొర్రెలను ఎస్ఐ సాదిక్, సిబ్బంది కాపాడారు. తహసీల్దార్ చల్లన్నదొర ఎద్దెల వాగు వద్ద నాటు పడవను ఏర్పాటు చేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 0.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. వాగులో గల్లంతైన యువతి మృతి పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్లి తిరిగొస్తూ సోమవారం వాగులో గల్లంతైన మనీషా వర్మ (23) మృతదేహం మంగళవారం లభ్యమైంది. సుమారు ఐదు బృందాలు ఉదయం నుంచి వాగు వెంట ఐదు కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు తెలంగాణలోని అశ్వారావుపేట మండలం కంట్లం సమీపంలో వాగులో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. వారంలో మరో అల్పపీడనం.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ కేంద్రం తెలిపాయి. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రానున్న వారం రోజుల్లో మరో అల్పపీడనం ఏపీ తీరానికి సమీపంలో ఏర్పడి.. ఒడిశా వైపుగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో 10 రోజుల తర్వాత మళ్లీ వర్షాలు పుంజుకుంటాయి. కాగా, గత 24 గంటల్లో తాడేపల్లిగూడెంలో 46.5, విశాఖపట్నంలో 30, పెందుర్తి, చింతపల్లిల్లో 22, అనకాపల్లిలో 18, వాయల్పాడులో 16.3, మాకవరపాలెంలో 12, కమలాపురంలో 11, సంజామలలో 10, నర్సీపట్నంలో 9, అమరపురంలో 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు అవాస్తవం: ప్రతాప్‌రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు అవాస్తవమని విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం కొత్తగా ఎవరికీ మైనింగ్ లైసెన్స్ ఇవ్వలేదని తెలిపారు. కోర్టు అనుమతితో ఇచ్చిన లైసెన్స్ మేరకు లెట్‌రైట్ తవ్వకాలు మాత్రమే జరుగుతున్నాయని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడినవారి లైసెన్స్‌లు రద్దు చేశామన్నారు. అక్రమ మైనింగ్‌పై రేపటి నుంచి అనకాపల్లి ఏరియాలో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని వెల్లడించారు. 3 జిల్లాల్లో కలిపి అక్రమ మైనింగ్‌పై రూ.250 కోట్ల వరకు ఫైన్ విధించామని తెలిపారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. -
విశాఖ మన్యంలో వలిసెల సోయగం విలసిల్లేలా..
సాక్షి, విశాఖపట్నం: మంచు తెరల మధ్య పసుపు వర్ణంతో మెరిసిపోయే వలిసె పూలు ప్రకృతి కాంతకు స్వర్ణ కాంతులద్దుతాయి. విశాఖ మన్యానికొచ్చే పర్యాటకుల మనసులను ఇట్టే దోచుకుంటాయి. ఏటవాలు కొండ ప్రాంతాల నడుమ చల్లని వాతావరణంలో పెరిగే వలిసె తోటలు కొన్నేళ్లుగా కనుమరుగవుతున్నాయి. గిరిజన రైతుల సంప్రదాయ పంట అయిన వలిసెల సాగు రెండు దశాబ్దాల్లో నాలుగో వంతుకు పడిపోయింది. అత్యధికంగా తేనె ఉండే వలిసె పూల సాగు తగ్గడంతో తేనెటీగలకు కష్టకాలం వచ్చింది. తేనె సేకరణపైనా తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వలిసె తోటలకు పూర్వ వైభవం తెచ్చేందుకు చింతపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధనలు చేపట్టింది. వలిసె తోటల మాతృ ప్రదేశం ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా. వందల ఏళ్ల క్రితమే మన్యంలోకి వచ్చి గిరిజనుల సంప్రదాయ పంటగా మారింది. విశాఖ మన్యంలోని అరుకు లోయ, పాడేరు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, అనంతగిరి, జి.మాడుగుల, చింతపల్లి ప్రాంతాలతోపాటు విజయనగరం జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట, శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట, తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో వలిసెల సాగు ఉండేది. తర్వాత కాలంలో విశాఖ మన్యానికే పరిమితమైంది. ఇక్కడ కూడా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం 2003–04లో 16 వేల హెక్టార్లకు పరిమితమైన వలిసెల సాగు క్రమేపీ తగ్గుతూ 2020–21 నాటికి 3,695 హెక్టార్లకు పడిపోయింది. వలిసె ఉపయోగాలివీ.. వలిసె పూలలో తేనె అధికంగా ఉంటుంది. తోటల్లో ఎకరానికి వంద చొప్పున తేనె పెట్టెల చొప్పున ఉంచి తేనెటీగల సాయంతో గిరిజనులు తేనెను సేకరిస్తారు. ఒక్కో పెట్టె నుంచి 35–40 కిలోల చొప్పున తేనె దిగుబడి వస్తుంది. వలిసె గింజల నుంచి వంటనూనె తీస్తారు. దీనిని గిరిజనులు ఇళ్లల్లో వినియోగిస్తుంటారు. ఈ నూనెను కాస్మొటిక్స్, పెయింటింగ్స్ తయారీలోనూ వినియోగిస్తున్నారు. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే వలిసె గింజలను కోళ్లు, పక్షుల దాణా తయారీలోనూ మిశ్రమంగా వాడతారు. తగ్గిపోవడానికి కారణాలు విశాఖ మన్యంలో నీరు నిలవని ఏటవాలు కొండ ప్రాంతాలు, చల్లని వాతావరణం వలిసెల సాగుకు అత్యంత అనుకూలం. పరిమాణం, రంగు, సాగు కాలంలో తేడాను బట్టి 30 రకాల వరకూ ఉన్నాయి. వలిసె గింజల దిగుబడులు తగ్గిపోవడం, రైతులకు పెద్దగా గిట్టుబాటు కాకపోవడం, భూసారం తగ్గడం వంటి పరిస్థితులు వలిసె తోటల సాగు తగ్గడానికి కారణమయ్యాయి. ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్లకు మించి వలిసె గింజల దిగుబడి రావడం లేదు. ఆకాశ పందిరి, బంగారు తీగ అనే కలుపు మొక్కలను నిరోధించడం కష్టమవుతోంది. గిరిజన రైతులు వలిసె విత్తనాలను తామే తయారుచేసుకోవడం వల్ల నాణ్యత లోపించి పంట దెబ్బతిని దిగుబడులు పెద్దగా ఉండటం లేదు. దీంతో వారంతా ప్రత్యామ్నాయ ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపడంతో సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గిపోయింది. పూర్వ వైభవానికి కృషి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్దన్‌రెడ్డి గతంలో భారతీయ నూనెగింజల పరిశోధన కేంద్రం (ఐఐవోఆర్) డైరెక్టర్‌గా ఉన్నప్పుడు వలిసెలకు పూర్వ వైభవం తేవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన చొరవతో వలిసెలపై చింతపల్లిలో నాలుగేళ్ల పరిశోధన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.69 లక్షలు మంజూరు చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో సాగవుతున్న 1,800 రకాల వలిసెల మూల విత్తనాలను న్యూఢిల్లీలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ రిసోర్సెస్ నుంచి చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రానికి తీసుకొచ్చారు. మన్యంలో వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనువైన, వివిధ తెగుళ్లను తట్టుకొని స్వల్ప కాలంలో అధిక దిగుబడిని ఇచ్చే మేలు రకం విత్తనాలను ఇక్కడి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు పాడేరు ఐటీడీఏతో పాటు సంజీవని స్వచ్ఛంద సంస్థ గిరిజన రైతులను ప్రోత్సహిస్తోంది. సాగు, సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించడమే గాక టార్పాలిన్లు, కోత పరికరాలు అందజేస్తుంది. రెండు లాభదాయక రకాల అభివృద్ధి మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ పరిసర ప్రాంతాల్లో మంచి దిగుబడి ఇస్తున్న జేఎన్ఎస్–26, జేఎన్ఎస్–28 రకాల మూల విత్తనాలను తెచ్చాం. మన్యం పరిస్థితులకు అనుగుణంగా ఉండే వీటిని ఇక్కడ అభివృద్ధి చేశాం. ఎకరానికి రెండు కిలోల విత్తనాలు వేస్తే ఆరేడు క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. ఈ విత్తనాలను ఉచితంగా గిరిజన రైతులకు త్వరలోనే ఇస్తాం. ఇలా కనీసం వంద రకాల మేలు రకం విత్తనాలను అభివృద్ధి చేయాలనేది లక్ష్యం. గిరిజన రైతులను వలిసెల సాగు వైపు అన్నివిధాలా ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నాం. – డాక్టర్ గుత్తా రామారావు, సహాయ పరిశోధన సంచాలకులు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం