గిరిజనులతో మాట్లాడుతున్న సబ్ కలెక్టర్ అభిషేక్, ఇతర అధికారులు
పాడేరు: విశాఖ ఏజెన్సీ పాడేరు మండలంలోని మారుమూల గ్రామం ఈదులపాలెంలో మెడికల్ షాపులో అక్రమంగా కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు నిర్వహించిన ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు కలెక్టర్‌ను ఆదేశించింది. విచారణాధికారిగా నియమితులైన పాడేరు సబ్ కలెక్టర్ వి.అభిషేక్ మంగళవారం ఉదయమే ఈదులపాలెం చేరుకుని విచారణ చేపట్టారు. ఏడీఎంహెచ్‌వో డాక్టర్ కె.లీలాప్రసాద్, తహసీల్దార్ ప్రకాష్‌రావు, ఇతర అధికారులు, ఈదులపాలెం వైద్యుల సమక్షంలో విచారణ నిర్వహించారు. గిరిజన మహిళలకు కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు నిర్వహించిన మెడికల్ షాపును తనిఖీ చేశారు.
మెడికల్ షాపు నిర్వహకుడితోపాటు సమీప గిరిజనులను కూడా ఆయన విచారించారు. ఆపరేషన్లు చేయించుకున్న కొంతమంది మహిళలను సబ్ కలెక్టర్ పరామర్శించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఇక్కడే ఆపరేషన్లు చేయించుకోవడానికి దారితీసిన పరిస్థితులపై ఆరాతీశారు. ఆపరేషన్లు చేసిన అనకాపల్లికి చెందిన వైద్యుడు, ఫిమేల్ నర్సు వివరాలను సేకరించారు. స్థానికంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది ఒకరిద్దరు సహకరించారనే ఆరోపణలపైన కూడా విచారణ జరిపారు. మెడికల్ షాపులో అక్రమంగా ఆపరేషన్లు జరిపారని నిర్ధారణకు వచ్చిన ఆయన పాడేరు పోలీసులకు కూడా తగిన సమాచారం అందించారు. ఆయన సమగ్ర విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. మరోవైపు జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు మెడికల్ షాపును పరిశీలించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. షాపునకు తాళాలు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment