గంజాయిపై ఉక్కుపాదం | Andhra Pradesh Govt Attack On 1720 kg of marijuana in Single day | Sakshi
Sakshi News home page

గంజాయిపై ఉక్కుపాదం

Published Tue, Nov 9 2021 3:30 AM | Last Updated on Tue, Nov 9 2021 8:16 AM

Andhra Pradesh Govt Attack On 1720 kg of marijuana in Single day - Sakshi

డుంబ్రిగుడ మండలం దండగుడలో గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్న గిరిజనులు

పాడేరు/డుంబ్రిగుడ/జీకే వీధి/చింతపల్లి/కాకినాడ సిటీ/అనంతగిరి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగు, రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాల ఆధ్వర్యంలో యథేచ్ఛగా సాగుతున్న గంజాయి దందాను నామరూపాల్లేకుండా తుదముట్టించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు త్రిముఖ వ్యూహంతో ముందుకు కదులుతూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ఓ వైపు గంజాయి సాగు వల్ల తలెత్తే దుష్పరిణామాలపై ‘ఆపరేషన్‌ పరివర్తన్‌’ పేరిట గిరిజనులకు అవగాహన కల్పిస్తూ గంజాయి తోటలను ధ్వంసం చేసే పనిలో కొన్ని బృందాలు నిమగ్నం కాగా.. మరికొన్ని బృందాలు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాయి.



అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఎస్‌ఈబీ, పోలీస్‌ అధికారులు కార్యాచరణ కొనసాగిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. విజయవంతంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో వందలాది ఎకరాల్లో గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేయగా.. పలుచోట్ల తనిఖీలు దాడులు నిర్వహిస్తూ వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతున్న గంజాయిని పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సోమవారం విశాఖ జిల్లా మారుమూల గిరిజన గ్రామాల్లో 217 ఎకరాల్లో సాగు చేస్తున్న 9.80 లక్షలకు పైగా గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారు. మరోవైపు ఒడిశా నుంచి స్మగ్లింగ్‌ అవుతున్న రూ.కోటిన్నరకు పైగా విలువైన 1,720 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

ఒకే పంచాయతీ పరిధిలో 217 ఎకరాల్లో పంట ధ్వంసం
విశాఖ ఏజెన్సీ పరిధిలోని ఐదు మండలాల్లో సోమవారం 217 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సిబ్బంది ఏడు బృందాలుగా ఏర్పడి జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ పరిధిలోని వాకపల్లి, డిప్పలగొంది, వడ్రంగుల గ్రామాల్లో 164 ఎకరాల్లో సాగవుతున్న సుమారు 7.40 లక్షల మొక్కలను నరికి నిప్పంటించారు. డుంబ్రిగుడ  మండలంలోని కండ్రుం పంచాయతీ దండగుడ, బెడ్డగుడ, కండ్రుం గ్రామాల్లో 12 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను సోమవారం ఆ పంచాయతీ గిరిజనులు స్వచ్ఛందంగా ధ్వంసం చేశారు. ఇకపై గంజాయి సాగుచేయబోమని తీర్మానం చేశారు.

గూడెం కొత్తవీధి మండలంలో మావోయిస్టు ప్రాంతమైన కుంకుంపూడికి సమీపంలోని 5 ఎకరాల్లో గంజాయి తోటలను గిరిజనులు స్వచ్ఛందంగా ధ్వంసం చేసి, మొక్కలకు నిప్పంటించారు. చింతపల్లి  మండలం గొందిపాకలు పంచాయతీ గాదిగొయ్యి గ్రామంలో 20 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. పాడేరు మండలం గొండెలి, కించూరు పంచాయతీల్లో 16 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఆయా ప్రాంతాల ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది, గిరిజన పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగాయి. 

పశువుల దాణా ముసుగులో తరలిస్తున్న టన్ను గంజాయి పట్టివేత
తూర్పు గోదావరి జిల్లా చింతూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో రూ.కోటి విలువైన వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు కాకినాడలో సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన వ్యక్తులు పశువుల దాణా ముసుగులో ఆ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు లారీలో గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ లారీని చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని గోడ్లగూడెం జంక్షన్‌ వద్ద అటకాయించారు.

పోలీసుల్ని చూసి ఒక వ్యక్తి పారిపోగా మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా తికూరి గ్రామానికి చెందిన మన్మోహన్‌ పటేల్, అదే జిల్లా మౌరహా గ్రామానికి చెందిన మహమ్మద్‌ హారన్, ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా ఎంపీవీ–79 గ్రామానికి చెందిన రాబిన్‌ మండల్,  ఎంపీవీ–75 గ్రామానికి చెందిన అమృతా బిశ్వాస్, నలగుంటి గ్రామంలోని ఎంపీవీ–36కు చెందిన బసుదేవ్‌ మండల్‌ను అరెస్ట్‌ చేశారు. ఒడిశాలో పండించిన గంజాయిని వారంతా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని ఎస్పీ చెప్పారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి రాజును ఒడిశా పోలీసుల సహకారంతో అరెస్ట్‌ చేస్తామన్నారు. 

చిలకలగెడ్డ వద్ద 720 కేజీల స్వాధీనం
విశాఖ జిల్లా అనంతగిరి మండలం చిలకలగెడ్డ చెక్‌పోస్టు వద్ద ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు వ్యాన్‌లో తరలిస్తున్న 720 కేజీల గంజాయిని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం సంయుక్తంగా పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సీఐ గణపతిబాబు, టాస్క్‌ఫోర్స్‌ హెచ్‌సీ శ్రీధర్‌ నేతృత్వంలోని పోలీసులు చిలకలగెడ్డ వద్ద కాపుగాసి పట్టుకున్నారు. గంజాయితో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబట్ట గంజాయి విలువ రూ.50 లక్షలకు పైగా విలువ చేస్తుందని అంచనా. ఈ దాడిలో ఎస్‌ఈబీ ఎస్‌ఐ దాస్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కృష్ణప్రసాద్, నర్సింగరావు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement