Special Enforcement Bureau
-
ఎక్సైజ్ శాఖలో ‘డబ్బుల్’ ధమాకా!
సాక్షి ప్రతినిధి కర్నూలు/సాక్షి ప్రతినిధి, విశాఖ పట్నం: ఎక్సైజ్ శాఖ టీడీపీ నేతలకు కాసుల ఖజానాగా మారింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను కూటమి ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. సెబ్‌లో ఉన్న ఉద్యోగులను తిరిగి ఎక్సైజ్ శాఖకు పంపుతోంది. దీంతో కోరుకున్న పోస్టులు దక్కించుకునేందుకు అధికారులు.. వీరి ఆరాటాన్ని ‘క్యాష్’ చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. ప్రాంతానికి, పోస్టుకో రేటును నిర్ణయించి భారీగా వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఉంటేనే పోస్టింగ్.. లెటర్‌కు, పోస్టింగ్‌కు వేర్వేరుగా టీడీపీ నేతలు డిమాండ్ చేసినంత కప్పం.. అడిగినంత చెల్లించలేకపోతే లూప్‌లైన్ పోస్టింగ్‌లు.. ఇలా అమరావతిలో ఎక్సైజ్‌శాఖ ప్రధాన కార్యాలయంలో రెండు రోజులుగా ఇదే దందా నడుస్తోంది. బేరసారాలతో కొందరు ఇప్పటికే తమకు నచ్చిన చోట పోస్టింగులు దక్కించుకోగా ఇంకొన్ని పోస్టింగులకు బేరాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం ఎక్సైజ్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. సెబ్‌కు చెల్లుచీటీ ఇచ్చి.. వసూళ్ల పర్వానికి తెరలేపి.. గత ప్రభుత్వం పల్లెల్లో బెల్ట్‌షాపులకు అడ్డుకట్ట వేయడానికి, సారా తయారీని అరికట్టడానికి, గంజాయి నిర్మూలనకు సెబ్‌ను ఏర్పాటు చేసింది. అలాగే ప్రజలకు మద్యం దూరమయ్యేలా చేసేందుకు ప్రభుత్వమే పరిమిత సంఖ్యలో మద్యం దుకాణాలు నిర్వహించింది. బెల్ట్‌షాపుల కోసం బల్‌్కగా మద్యం బాటిళ్లను విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో సిబ్బంది అవసరం తగ్గింది. దీంతో సెబ్‌ను ఏర్పాటు చేసి ఎక్సైజ్ శాఖలోని 70 శాతం సిబ్బందిని అందులోకి పంపారు. బెల్ట్‌షాపులు తగ్గడంతో పల్లెల్లో మద్యం సేవించేవారి సంఖ్య తగ్గిపోయింది. తద్వారా నేరాల సంఖ్య కూడా పడిపోయింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరడంతో తిరిగి ఎక్సైజ్ శాఖను ఏర్పాటు చేస్తున్నారు. సెబ్‌లో విలీనమైన ఎక్సైజ్ అధికారులను తిరిగి మాతృశాఖలో నియమించి పాత పంథాలోనే విధులు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తిరిగి ఎక్సైజ్ స్టేషన్లలో సీఐ, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. వీటితో పాటు 26 జిల్లాలకు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు(ఈఎస్), ఉమ్మడి 13 జిల్లాలకు డిప్యూటీ కమిషనర్ (డీసీ)లను నియమించనున్నారు. దీంతో కోరుకున్న చోట పోస్టులు దక్కించుకునేందుకు ప్రభుత్వ పెద్దలను, ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారు. పోస్టుకో రేటు.. డీసీ, ఈఎస్, ఏసీలతో పాటు సీఐల నియామకాల కోసం రెండురోజులుగా అమరావతిలో కసరత్తు జరుగుతోంది. ఎక్సైజ్‌శాఖ యూనియన్ నాయకులు అక్కడే మకాం వేశారు. యూనియన్ కనుసన్నల్లోనే పోస్టింగులు ఖరారవుతున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ కమిషనర్ పోస్టు కావాలంటే స్థానిక మంత్రి లేదా ఎమ్మెల్యే సిఫార్సు లేఖ తప్పనిసరి. ఈ లేఖ కావాలంటే రూ.15 లక్షలు స్థానిక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిందే. లేఖ తీసుకొస్తే ఆపై పోస్టింగు ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖలోని ఓ ప్రభుత్వ పెద్దకు మరింత ముట్టజెప్పాలి. ఈ క్రమంలో విశాఖపట్నం, గుంటూరు, పశి్చమగోదావరి, విజయవాడ డీసీ పోస్టులకు రూ.30 లక్షలు ధర నిర్ధారించినట్లు తెలుస్తోంది. కొందరు ఇంత కంటే ఎక్కువ ఇచ్చి చేరేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తక్కిన జిల్లాల్లో డీసీ పోస్టులకు రూ.20లక్షలు, ఈఎస్ పోస్టులకు రూ.15లక్షలుగా ధర ఫిక్స్ చేశారు. ఈ మొత్తాలకు తక్కువ కాకుండా ఎవరు ఎక్కువ ఇస్తే వారికి పోస్టింగులు ఇస్తున్నారు. పోస్టింగులకు టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తప్పనిసరి అని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు యూనియన్ నాయకులు సిఫార్సు చేసిన వారికే లేఖలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కర్నూలు డీసీగా మునిచంద్రమోహన్, అనంతపురం డీసీగా నాగమద్దయ్య ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం. చిత్తూరు డీసీ పోస్టు మంత్రి నారా లోకేశ్ సిఫార్సు చేసిన వారికే దక్కనున్నట్లు తెలుస్తోంది. కడప డీసీకి పెద్దగా పోటీ లేదని సమాచారం. అలాగే విశాఖ డిప్యూటీ కమిషనర్‌గా శ్రీరామచంద్రమూర్తి, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ఆర్. ప్రసాద్ పేరు ఖరారైందని చెబుతున్నారు. అలాగే శ్రీకాకుళం ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా రామకృష్ణ ఖరారైనట్లు సమాచారం. కానిస్టేబుల్ పోస్టుకు సైతంఎక్సైజ్ స్టేషన్లలో సీఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)గా ఉంటారు. ఆయన కింద ఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు ఉంటారు. ప్రస్తుతం సీఐల పోస్టింగులకు బేరాలు నడుస్తున్నాయి. సీఐ పోస్టుకు సిఫార్సు లేఖ కావాలంటే రూ.8–10 లక్షలు సంబంధిత టీడీపీ ఎమ్మెల్యేకు ముట్టజెప్పాలని తెలుస్తోంది. రాజధానిలో పోస్టింగ్ కావాలంటే మరో రూ.10 లక్షలు సమర్పించుకోవాల్సిందే. స్టేషన్‌ను బట్టి ఈ ధరల్లో తేడాలు ఉన్నాయి. ఈఎస్‌లు.. లెటర్‌కు రూ.10 లక్షలు, రాజధానిలో పోస్టుకు రూ.15 లక్షలు ముట్టజెప్పాల్సిందేనని తెలుస్తోంది. మొదటగా డీసీలు, ఈఎస్‌లు, సీఐలను నియమించనున్నారు. ఆపై వీరు ఎస్ఐ నుంచి కానిస్టేబుళ్ల వరకూ నియమించుకోవచ్చు. ఈ నియామకాల్లోనే వీరు పెట్టిన పెట్టుబడిని రికవరీ చేయాలనే యోచనలో కొందరు డీసీలు, ఈఎస్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.కానిస్టేబుల్ పోస్టుకు రూ.లక్ష, హెడ్ కానిస్టేబుల్‌కు రూ.1.50 లక్షలు, ఎస్ఐ పోస్టుకు రూ.5 లక్షలు ధర నిర్ణయించారు. తాము అడిగినంత చెల్లించలేనివారికి మొబైల్ పార్టీ, థర్డ్‌గ్రేడ్ స్టేషన్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కొత్త పాలసీలో భారీ ఆదాయం ప్రభుత్వం నూతన మద్యం పాలసీ తీసుకురానుంది. టెండర్ల ద్వారా లేదా లాటరీ ద్వారా మద్యం షాపులు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించనున్నారు. దీంతో ప్రైవేటు వ్యక్తులు ‘సిండికేట్’ ద్వారా మద్యం ధరలు పెంచి విక్రయాలు సాగించనున్నారు. దీంతో అధికారులకు నెలమామూళ్లు ఇస్తారు. తద్వారా పోస్టింగ్ పెట్టుబడితో పాటు భారీగానే ఆర్జించే అవకాశం ఉంది. పైగా బెల్ట్‌షాపులు విచ్చలవిడిగా నడిచే అవకాశం ఉంది. దీంతోనే ఆదాయం ఉన్న స్టేషన్ల కోసం భారీగా పెట్టుబడి పెట్టి పోస్టింగులు తెచ్చుకునేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.విశాఖలో భారీ డిమాండ్ విశాఖ ఎక్సైజ్ శాఖలో పోస్టింగ్‌లకు భారీ డిమాండ్ ఉంది. డిప్యూటీ కమిషనర్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వరకు ప్రతి చోట విపరీతమైన గిరాకీ కనిపిస్తోంది. పోస్టును బట్టి రేటు పలుకుతోంది. విశాఖ ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్ పోస్టు హాట్ సీటుగా మారిపోయింది. ఇక్కడ పోస్టింగ్ కోసం ఆశావహుల సంఖ్యలో కూడా ఎక్కువగానే ఉంది. ప్రధానంగా ముగ్గురు సీనియర్ అధికారులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ సూపరింటెండెంట్‌గా పని చేసి వెళ్లిన అధికారి కూడా ఈ కోవలో ఉన్నట్టు సమాచారం. అలాగే పక్క జిల్లాల నుంచి మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరు 5 నుంచి 10 మంది ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే ఈ పోస్టుకు రూ.30 లక్షలు ముట్టజెప్పేందుకు రెడీ అవుతున్నారు. అలాగే ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పలుకుతోంది. కీలకమైన ఆ స్థానాలను చేజిక్కించుకుంటే.. ఆ తరువాత జరిగే సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ బదిలీల్లో సులువుగా సంపాదించుకోవచ్చని ఇప్పుడు ఎంతైనా ఖర్చు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.స్టేషన్‌ను బట్టి రేటు సీఐ నుంచి కానిస్టేబుళ్ల వరకు రేటుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖలు కూడా తప్పనిసరి. ఆ సిఫార్సు లేఖలకు స్టేషన్‌ను బట్టి రేటు నిర్ణయించినట్లు సమాచారం. సీఐ పోస్టింగ్‌కు రూ.5 నుంచి రూ.8 లక్షలు, ఎస్ఐకి రూ.2 నుంచి రూ.3 లక్షలు, హెడ్ కానిస్టేబుల్‌కు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలు, కానిస్టేబుల్ స్థాయికి రూ.50 వేలు నుంచి రూ.75 వేలు వసూలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర స్థాయి నేత కీలక పాత్ర పోషిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన సదరు సీఐ స్థాయి అధికారి లాబీయింగ్‌లో సిద్ధహస్తుడన్న పేరు ఉంది. కొన్ని చోట్ల అధికారులు, సిబ్బంది పోస్టింగుల విషయంలో ఎవరైనా ప్రజాప్రతినిధులను కలిస్తే.. సదరు అధికారి ద్వారా రావాలని స్పష్టంగా చెబుతున్నట్లు సమాచారం. వెలగపూడిదే రాజ్యం.. విశాఖపట్నం నగర పరిధిలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా హవా అంతా విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చలాయిస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి ఈసీ వరకూ పోస్టులకూ ఆయనే సిఫారసు లేఖలు ఇస్తున్నారు. తక్కిన ఎమ్మెల్యేలు ఎవరూ లేఖలు ఇచ్చేందుకు వీల్లేదు. వీరిలో గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఉండటం విశేషం. వీరితో పాటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్‌బాబు, వంశీకృష్ణ యాదవ్ కూడా ఉన్నారు. భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మినహా తక్కిన వారంతా తమ నియోజకవర్గాల్లో పోస్టింగ్‌ల కోసం ఎమ్మెల్యేల వద్దకు వెళ్తుంటే ‘వెలగపూడిని కలవండి’ అని వారు చెబుతున్నట్టు తెలుస్తోంది. గతంలో మద్యం సిండికేట్ మొత్తం వెలగపూడి కనుసన్నల్లోనే నడిచేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి ఎక్సైజ్‌ను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వ సహకారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో కూడా.. విశాఖలో మాత్రమే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా శ్రీకాకుళంలో మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయి. దీంతో అక్కడ పోస్టింగ్‌లకు కూడా పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. విశాఖలో పోస్టింగ్ అవకాశం దక్కని వారు రెండో ఆప్షన్‌గా శ్రీకాకుళంను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్కడ జిల్లా స్థాయిలో పోస్టింగ్ లభిస్తే ఒక వైపు కింది స్థాయి అధికారుల బదిలీల్లోనే కాకుండా మద్యం కంపెనీల నుంచి కూడా పెద్ద ఎత్తున లాభం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లా కూడా ఎక్సైజ్ అధికారులకు హాట్ ఫేవరెట్‌గా మారింది. -
ఏపీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు
సాక్షి, విజయవాడ: ఏపీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను(సెబ్) ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్‌ను ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.సెబ్ విభాగానికి కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. సెబ్‌లో వివిధ హోదాల్లో పని చేస్తున్న అధికారులను వారి మాతృశాఖల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సిబ్బందిని, ఫర్నిచర్, వాహనాలను, సీజ్ చేసిన వస్తువులను ఎక్సైజ్ శాఖకు అప్పగించాలని పేర్కొంది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.అయితే త్వరలో మద్యం అమ్మకాలను ప్రైవేటు పరం చేసే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సెబ్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.కాగా అక్రమ మద్యం, గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం గత ప్రభుత్వం ఈ సెబ్‌ను ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా సెబ్ పని చేసింది. ఎక్సైజ్ శాఖలోని 70 శాతం ఉద్యోగులను.. సిబ్బందిని సెబ్‌కు కేటాయించింది. బెల్టు షాపులు, గంజాయి నియంత్రణ కోసం సెబ్ పనిచేసింది. -
‘మత్తు’ వదిలిద్దాం
మరింత సమర్థంగా ఎస్ఈబీ అక్రమ మద్యం, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, ఇసుక అధిక ధరలకు విక్రయించడం లాంటి ఫిర్యాదులపై ఎస్ఈబీ అధికారులు సత్వరం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ఎస్ఈబీ మరింత సమర్థంగా పని చేయాలి. కేవలం అక్రమ మద్యం అరికట్టేందుకే పరిమితం కాకుండా మాదక ద్రవ్యాలు, గంజాయి, గుట్కాలు లాంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలి. అందుకోసం స్థానిక ఇంటెలిజెన్స్ (నిఘా) వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ), పోలీసు శాఖలు మరింత సమన్వయంతో పనిచేసి రాష్ట్రాన్ని సంపూర్ణంగా మాదక ద్రవ్యాలు, అక్రమ మద్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టడం, సచివాలయాల్లో మహిళా పోలీసు వ్యవస్థ బలోపేతం, కట్టుదిట్టంగా దిశ వ్యవస్థను అమలు చేయడం అత్యంత ప్రాధాన్యత అంశాలని అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఈ నాలుగు అంశాలపై పోలీసు శాఖ, ఎస్ఈబీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. అక్రమ మద్యం, గంజాయి నిర్మూలన చర్యలు, కేసుల నమోదు తదితర అంశాలపై సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. దిశ యాప్ వినియోగం, కాల్స్‌పై తక్షణ స్పందన కోసం అన్ని చోట్లా మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు. సీఎం సమీక్షలోముఖ్యాంశాలు ఇవీ.. సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారంలో రెండు సమావేశాలు మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం నిర్మూలనపై ప్రతి మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించాలి. అక్రమ మద్యం, గంజాయి సాగును అరికట్టేందుకు తీసుకున్న చర్యలను ఎక్సైజ్, ఎస్ఈబీ శాఖలు సమీక్షించాలి. ఆ తరువాత ప్రతి గురువారం పోలీసు ఉన్నతాధికారులు సమావేశం కావాలి. జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యాన్ని అరికట్టడం, సచివాలయాల్లో మహిళా పోలీసులతో సమన్వయం, సమర్థంగా దిశ వ్యవస్థ వినియోగం తదితర అంశాలపై సమీక్షించాలి. ఇక నుంచి ఇవన్నీ క్రమ తప్పకుండా పాటించాలి. 14500 టోల్‌ఫ్రీ నంబర్‌తో హోర్డింగ్‌లు మాదక ద్రవ్యాల దుష్ఫ్రభావాలపై ప్రచారం చేపట్టి కాలేజీలు, యూనివర్సిటీల్లో విస్లృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఎస్ఈబీ టోల్‌ఫ్రీ నంబర్ 14500పై పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతోపాటు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలను వివరిస్తూ కాలేజీలు, యూనివర్సిటీల వద్ద భారీ హోర్డింగులు ఏర్పాటు చేయాలి. ఎక్కడా, ఏ విద్యార్థీ మాదక ద్రవ్యాల బారిన పడకుండా చూడాలి. రాష్ట్రాన్ని వచ్చే మూడు నాలుగు నెలల్లో సంపూర్ణ మాదక ద్రవ్యాల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పోలీసు, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పని చేయాలి. మన కాలేజీలు, యూనివర్సిటీలు మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. అందుకోసం అన్ని కాలేజీలు, యూనివర్సిటీల వద్ద నెలరోజుల్లో హోర్డింగుల ఏర్పాటు పూర్తి చేయాలి. పటిష్టంగా మహిళా పోలీసు వ్యవస్థ మహిళా పోలీసులు, దిశ వ్యవస్థ, యాప్‌ను ఇంకా పటిష్టం చేయాలి. రాష్ట్రంలో దాదాపు 15 వేల మంది మహిళా పోలీసులు ఉన్నారు. వీరి సేవలను వినియోగించుకుంటూ దిశ వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలి. దిశ యాప్ డౌన్లోడ్స్ పెరగాలి. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు గంజాయి సాగు విడనాడిన వారికి వ్యవసాయం, ఇతర ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అప్పుడే వారికి శాశ్వత ఉపాధి కల్పించినట్లు అవుతుంది. గంజాయి సాగుదార్లల్లో మార్పు తెచ్చేందుకు ఆపరేషన్ పరివర్తన్ పటిష్టంగా నిర్వహించాలి. అంతా మనవైపు చూసేలా.. మనం చేసే మంచి పనులకు అవార్డులు రావాలి. మన మాదిరిగా సచివాలయాల్లో మహిళా పోలీసు వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. కాబట్టి మహిళా పోలీసు వ్యవస్థను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. దానివల్ల మంచి ఫలితాలు రాబట్టవచ్చు. దేశమంతా మనవైపు చూసే స్థాయిలో పనితీరు చూపాలి. 2.82 లక్షల ఆర్వోఎఫ్ఆర్ పట్టా భూములు రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలకు దాదాపు 2.82 లక్షల ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చాం. ఆ భూముల అభివృద్ధికి తీసుకున్న చర్యలపై అధికారులు నివేదిక ఇవ్వాలి. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఎక్సైజ్ శాఖ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్ఈబీ డైరెక్టర్ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెల్లింపుల ప్రక్రియను మరింత సౌలభ్యంగా చేయాలి: సీఎం జగన్
-
అప్రమత్తంగా ఉండాలి.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఆదాయార్జన శాఖలపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పన్ను చెల్లింపుదారులకు అధికారులు మరింత అవగాహన కల్పించాలని, చెల్లింపుల ప్రక్రియను మరింత సౌలభ్యంగా చేయాలని సీఎం సూచించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ‘‘నియంత్రణ చర్యల వల్ల మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది. రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గింది. అక్రమ మద్యం తయారీపై ఎస్ఈబీ(స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో) ప్రత్యేక దృష్టి సారించాలి’’ అని సీఎం అన్నారు. రిజిస్ట్రేషన్ శాఖపైనా సీఎం సమీక్ష శాశ్వత భూహక్కు, భూ సర్వే కార్యక్రమం చేపడుతున్న గ్రామాల్లో.. వార్డుల్లో...సబ్ రిజిస్ట్రార్ భవనం, సేవలు వంటి వాటిపై అవగాహన కలిగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఈ దిశగా ఓరియెంటేషన్ అందించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో.. ఏఏ రకాల డాక్యుమెంట్లును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్న విషయాలపై ప్రజలకూ అర్ధమయ్యేలా వివరించాలని సీఎం సూచించారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాను అప్‌గ్రేడ్ చేయాలని సీఎం ఆదేశించారు. మైనింగ్ శాఖపై సమీక్ష నాన్ ఆపరేషనల్ మైన్స్పై మరింత దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలని సీఎం జగన్ అన్నారు. చదవండి: లోకేష్ వ్యవసాయం గురించి మాట్లాడటం మన కర్మ: మంత్రి కాకాణి -
AP: గుట్కాపై ‘సెబ్’ అస్త్రం
సాక్షి, అమరావతి: గుట్కాను నిషేధించినప్పటికీ రాష్ట్రంలో అక్రమంగా సాగుతున్న దందాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. గుట్కా రాకెట్ ఆటకట్టించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)కు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. గుట్కా అక్రమ రవాణా, అమ్మకాలను అరికట్టే బాధ్యతను సెబ్ పరిధిలోకి తెచ్చింది. రాష్ట్రంలో గంజాయి, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా సెబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సెబ్ పరిధిని విస్తరిస్తూ గుట్కా దందా ఆటకట్టించే బాధ్యతను కూడా దీని పరిధిలోకి తేవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు సెబ్‌కు విస్తృతంగా అధికారాలు కల్పించారు. రాష్ట్రం ఒక యూనిట్‌గా గుట్కా కేసులను సెబ్ పరిధిలోకి తేనున్నారు. ఈమేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. సెబ్‌తో అడ్డుకట్ట సులభం గుట్కా ప్రధానంగా ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి అక్రమంగా తెస్తున్నారు. స్థానిక పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, జిల్లా సరిహద్దులు వంటి సాంకేతిక కారణాలతో నిందితులు బెయిల్ పొందుతూ తప్పించుకుంటున్నారు. కేసుల దర్యాప్తులో కూడా కాలయాపన జరుగుతోంది. దాంతో గుట్కా దందాను అడ్డుకునే బాధ్యతను స్థానిక పోలీసులకంటే సెబ్‌కు అప్పగించడమే మంచిదని నిర్ణయించారు. రాష్ట్రం అంతా సెబ్ అధికార పరిధిలోకి వస్తుంది కాబట్టి జిల్లా సరిహద్దులు వంటి సాంకేతిక అడ్డంకులు ఉండవు. సెబ్‌కు ఇప్పటికే ప్రత్యేకంగా 208 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతోపాటు అవసరమైతే పొరుగు రాష్ట్రాల పోలీసులతోనూ సమన్వయం చేసుకొనే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టడంతో పొరుగు రాష్ట్రాలకు సెబ్ మార్గనిర్దేశం చేస్తోంది. అందువల్ల పొరుగు రాష్ట్రాలతో సమన్వయం కూడా సెబ్‌కు సులభం అవుతుంది. గుట్కా రాకెట్‌ను అరికట్టడంలో కూడా సెబ్ స్థానిక పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసులతోనూ కలిసి పనిచేయగలుగుతుంది. ఇప్పటికే ‘క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్)’ పరిధిలోకి పోలీసు విభాగంతోపాటు సెబ్ కూడా చేరింది. సీసీటీఎన్‌ఎస్‌లోని సమాచారం రాష్ట్రంలోని 950 పోలీసు స్టేషన్లతోపాటు 208 సెబ్ పోలీసు స్టేషన్లకూ అందుబాటులోకి వచ్చింది. దీంతో సెబ్ అధికారులు సమర్థంగా గుట్కాను కట్టడిచేయొచ్చు. సాంకేతిక అంశాలను సాకుగా చూపించి నేరస్తులు తప్పించుకునే అవకాశాలూ ఉండవు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సెబ్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, గుట్కాతో పాటు అన్ని రకాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. -
అక్రమ దందాలకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమ దందాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ప్రభుత్వం మరింత పటిష్టపరుస్తోంది. గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్ తదితర దందాలను మరింత సమర్థంగా కట్టడిచేసేందుకు సెబ్‌కు సాంకేతిక సాధన సంపత్తిని సమకూరుస్తోంది. నేరపరిశోధనలో కీలకమైన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) పరిధిలోకి సెబ్‌ను తీసు కొచ్చింది. మరోవైపు గంజాయి, ఇసుక, మద్యం అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్ తదితర నేరాలు, నేరస్తుల డేటాను సమగ్రంగా రికార్డు చేయనుంది. తాజా విధాన నిర్ణయంతో శాంతిభద్రతల పోలీసు విభాగం, సెబ్లను అనుసంధానించనుంది. సమర్థంగా నేరపరిశోధన, నేరాల కట్టడి నేరపరిశోధనలో సీసీటీఎన్ఎస్ అత్యంత కీలక విభాగం. వివిధ నేరాలు, ఆ కేసుల పరిశోధన, ఆ నేరాలకు పాల్పడిన వారి వివరాలు అన్నింటినీ సీసీటీఎన్ఎస్లో సమగ్రంగా రికార్డు చేస్తారు. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ భద్రపరిచే ఈ వ్యవస్థ నేరపరిశోధనలో పోలీసు అధికారులకు ఎంతో ఉపయోగపడుతోంది. ఇటువంటి వ్యవస్థను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసింది. అనంతరం కేంద్ర హోంశాఖ ఇదే వ్యవస్థను జాతీయస్థాయిలో నెలకొల్పింది. అటువంటి సమర్థమైన సీసీటీఎన్ఎస్ పరిధిలో ప్రస్తుతం శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీసు విభాగమే ఉంది. గంజాయి, అక్రమ ఇసుక, అక్రమ మద్యం, ఎర్రచందనం స్మగ్లింగ్ తదితర నేరాల కట్టడికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన సెబ్‌ను సీసీటీఎన్ఎస్ పరిధిలోకి తీసుకురావాలని పోలీసు శాఖ తాజాగా నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో గంజాయి, ఇసుక, మద్యం అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు, ఆ నేరస్తుల వివరాలన్నీ సీసీటీఎన్ఎస్లో నమోదు చేస్తారు. ఆ నేరస్తుల స్వభావం, నేరాల చరిత్ర, పెండింగ్‌లో ఉన్న కేసులు తదితర సమాచారమంతా సెబ్ అధికారులకు అందుబాటులోకి వస్తుంది. ఆ కేసుల పరిశోధన కోసం ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో నేరాలకు పాల్పడుతున్న వారికి ఇతర రాష్ట్రాల్లో ఉన్న నేరస్తులు, సిండికేట్లతో ఉన్న సంబంధాలు, వ్యాపార, ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ పోలీసులకు అందుబాటులోకి వస్తాయి. తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో వ్యవస్థీకృతమైన ముఠాలు అక్కడి నుంచి మన రాష్ట్రంలో గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి దందాలకు పాల్పడుతున్నాయి. అక్రమ రవాణాకు పాల్పడుతున్నవారిపై ప్రస్తుతం సెబ్ దాడులు చేసి కేసులు నమోదు చేస్తోంది. తాజాగా సీసీటీఎన్ఎస్ పరిధిలోకి రావడంతో ఇతర రాష్ట్రాల్లోని ముఠాలపై కూడా కేసులు నమోదు చేసేందుకు, అక్రమ దందాను మూలాలతోసహా పెకలించేందుకు మార్గం సుగమమైంది. కేసు దర్యాప్తునకు దేశంలోని ఏ ప్రాంతాలకు వెళ్లాలో తెలియడంతోపాటు సంబంధిత రాష్ట్రాల పోలీసు, దర్యాప్తు సంస్థల సహకారం పొందడం సులభతరమవుతుంది. పోలీసు, సెబ్ వ్యవస్థల అనుసంధానం అక్రమ దందాలను అరికట్టడంతో పోలీసు, సెబ్ విభాగాలు మరింత సమన్వయంతో పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. సీసీటీఎన్ఎస్ పరిధిలోకి పోలీసు విభాగంతోపాటు సెబ్ కూడా చేరింది. అంటే సీసీటీఎన్‌ఎస్‌లోని సమాచారం రాష్ట్రంలోని 950 పోలీసు స్టేషన్లతోపాటు 208 సెబ్ పోలీసుస్టేషన్లకు అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర పోలీసు బాస్ డీజీపీనే సెబ్‌కు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అదే రీతిలో జిల్లాస్థాయిలో ఎస్పీల పర్యవేక్షణలోనే ఏఎస్పీల నేతృత్వంలో సెబ్ విభాగాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు పోలీసు, సెబ్ విభాగాల మధ్య సాంకేతిక అంశాల్లో కొంత సందిగ్ధత ఉంది. ప్రస్తుతం ఈ రెండు విభాగాలు కూడా సీసీటీఎన్ఎస్ పరిధిలోకి చేరడంతో వాటిమధ్య పూర్తి సమన్వయం సాధించినట్లయింది. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను సమర్థంగా కట్టడిచేసేందుకు అవకాశం ఏర్పడిం ది. దర్యాప్తులో ఇబ్బందులు తొలగను న్నాయి. సాంకేతిక అంశాలను సాకుగా చూపించి నేర స్తులు తప్పించుకునేందుకు అవకాశం ఉండదు. -
రూ 3.14 కోట్ల మద్యం ధ్వంసం
నెల్లూరు (క్రైమ్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎస్ఈబీ, ఐదు సివిల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సీజ్ చేసిన రూ 3.14 కోట్ల విలువైన మద్యాన్ని మంగళవారం ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో ఎస్ఈబీ జేడీ కె.శ్రీలక్ష్మి తన సిబ్బందితో ధ్వంసం చేయించారు. కొత్తూరు సమీపంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయ ప్రాంగణంలో రోడ్డు రోలర్ ద్వారా సీసాలను తొక్కించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గడిచిన మూడేళ్లుగా జిల్లాలో మద్యం అక్రమ రవాణా, అనధికార విక్రయాలపై ఎస్ఈబీ, పోలీసులు దాడులు ముమ్మరం చేశారన్నారు. 2,774 కేసుల్లో పట్టు బడిన రూ.3,14,37,980 విలువజేసే 74,574 మద్యం బాటిళ్లను (15,719 లీటర్లు) ధ్వంసం చేశామన్నారు. జిల్లాలో నాటుసారా తయారీ, విక్రయాలు, మద్యం అక్రమ రవాణా, అనధికార విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో నెల్లూరు ఇన్చార్జి ఏసీ రవికుమార్, ఏఈఎస్ కృష్ణకిశోర్‌రెడ్డి,పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
రూ.68 లక్షల విలువైన మద్యం ధ్వంసం
రేణిగుంట: మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి హెచ్చరించారు. రేణిగుంట మండలం గాజులమండ్యం చిన్న చెరువు వద్ద మంగళవారం గతంలో పట్టుబడిన మద్యం నిల్వలను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. కర్ణాటక, తమిళనాడు నుంచి అక్రమంగా తీసుకెళుతున్న మద్యం, బెల్ట్ షాపుల్లో సీజ్ చేసిన మద్యం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నేతృత్వంలో నూతన జిల్లా ఏర్పడినప్పటి నుంచి పట్టుకున్న మద్యం నిల్వలను అనంతపురం డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ధ్వంసం చేసినట్లు ఆయన వివరించారు. మొత్తం 32,341 మద్యం బాటిళ్లులోని 6,800 లీటర్ల మద్యం నిల్వలను ఇక్కడకు తీసుకొచ్చి ధ్వంసం చేశారు. అదనపు ఎస్పీ సుప్రజ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్వాతి సమక్షంలో బాటిళ్లను ధ్వంసం చేశారు. ఇటీవల యువత అక్రమ సంపాదన కోసం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి వారిపై రానున్న రోజుల్లో పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా అక్రమ మద్యం తరలిస్తున్నా, బెల్ట్‌షాపులు నడుపుతున్నా, నాటు సారా కాస్తున్నా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందివ్వాలని కోరారు. -
సెబ్ దూకుడు
సాక్షి, అమరావతి: సారా, గంజాయి దందాను కట్టడి చేయడానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) దూకుడు పెంచింది. వారం రోజుల్లోనే విస్తృతంగా దాడులు జరిపి 566 కేసులు నమోదు చేసి 705 మందిని అరెస్టు చేసింది. అలాగే 64 వాహనాలను జప్తు చేసింది. ఆపరేషన్ పరివర్తన్ 2.0 కింద సారా తయారీ, రవాణాపై సెబ్ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసింది. రాష్ట్ర సరిహద్దులకు అవతల సాగు చేసిన గంజాయిని రాష్ట్రం గుండా అక్రమ రవాణా చేయకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. స్మగ్లర్లు అక్రమ రవాణాకు ఉపయోగించే దారులను ఇప్పటికే మ్యాపింగ్ చేసి సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దోనూరు, చింతూరు, ఇదుగురలపల్లి, లక్ష్మీపురం, మారేడుమిల్లిలతోపాటు అనకాపల్లి జిల్లాలోని తాటిపర్తి, భీమవరం గ్రామాల్లో చెక్ పోస్టులను నెలకొల్పింది. మరోవైపు వివిధ జిల్లాల్లో సారా తయారీ కేంద్రాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను వినియోగించింది. క్షేత్రస్థాయి నుంచి పక్కా సమాచారాన్ని తెప్పించుకుంటూ దాడులు నిర్వహిస్తోంది. వారం రోజులుగా చేపడుతున్న కార్యాచరణ సత్ఫలితాలను అందించిందని సెబ్ వర్గాలు తెలిపాయి. సారా తయారీ, విక్రయాలకు సంబంధించి 560 కేసులు నమోదు చేసి 692 మందిని అరెస్టు చేశారు. అలాగే 2,940 లీటర్ల సారాను స్వాధీనం చేసుకోవడంతోపాటు 30 లీటర్ల సారా ఊటను సెబ్ ధ్వంసం చేసింది. 63 వాహనాలను జప్తు చేశారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 6 కేసులు నమోదు చేసింది. 13 మందిని అరెస్టు చేశారు. అలాగే 1,009 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఒక వాహనాన్ని జప్తు చేశారు. -
సారా రహిత పార్వతీపురమే లక్ష్యం...
పార్వతీపురం టౌన్: సారా రహిత పార్వతీపురమే లక్ష్యంగా ఎస్ఈబీ అధికారులు అడుగులేస్తున్నారు. సారా తయారీ, విక్రయాలపై ముమ్మర దాడులు నిర్వహిస్తున్నారు. స్థానిక ఎస్ఈబీ స్టేషన్ పరిధిలో ఎక్కువ శాతం ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాలు ఉన్నందున ఒడిశా రాష్ట్రంలో తయారవుతున్న సారా పార్వతీపురం పట్టణ ప్రాంతానికి అక్రమార్కులు తరలిస్తున్నారు. విషయాన్ని గ్రహించిన ఎస్ఈబీ అధికారులు పరివర్తన, అంతర్రాష్ట్ర ఆపరేషన్ పేరుతో ముమ్మరంగా దాడులు నిర్వహిస్తూ అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సారా తయారీ కేంద్రాలపై పోలీసులతో కలసి ఎస్ఈబీ సిబ్బంది మెరుపుదాడులు గతంలో ఎన్నడూ లేనివిధంగా నిర్వహిస్తున్నారు. పార్వతీపురం ఎస్ఈబీ స్టేషన్ పరిధిలో సంవత్సర కాలంలో 578 కేసులు నమోదు చేసి 148 వాహనాలను సీజ్ చేశారు. సారా రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. కఠినంగా వ్యవహరిస్తాం.. సారా రవాణా, అమ్మకాలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తున్నాం. ఇటువంటి కేసుల్లో గరిష్టంగా ఎనిమిది సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమాన లేదా రెండూ విధిస్తారు. ఒకటికి పైబడి కేసుల్లో నిందితులు పట్టుబడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాం. – ఎల్.ఉపేంద్ర, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్ఈబీ, పార్వతీపురం దాడులు నిర్వహిస్తున్నాం.. సారా తయారీ కేంద్రాలపై ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నాం. ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న సారాపై ప్రత్యేక నిఘా పెట్టాం. గ్రామాల్లో సారా తయారీ, రవాణా చేయడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఒడిశా సరిహద్దుల్లో రూట్‌వాచ్‌లు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నాం. – ఎంవీ గోపాలకృష్ణ, టాస్క్‌ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్, పార్వతీపురం (చదవండి: ఢిల్లీ హైకోర్టు జడ్జిగా వీరఘట్టం వాసి) -
పుష్పరాజ్‌లపై ‘సెబ్’ నిఘా
సాక్షి, అమరావతి: ఎర్ర చందనం స్మగ్లింగ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ సత్ఫలితాలనిస్తోంది. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ను ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పరిధిలోకి తెస్తూ రూపొందించిన వ్యూహం విజయవంతమవుతోంది. రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తూ డీఐజీ పర్యవేక్షణలో ‘సెబ్’ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్ల నరికివేతకు అడ్డుకట్ట వేస్తోంది. పటిష్ట నిఘా.. ముమ్మర కూంబింగ్ ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు ‘సెబ్’ బహుళ అంచెల వ్యవస్థను నెలకొల్పింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ పోలీసుల సహకారంతో పటిష్ట వ్యూహాన్ని అమలు చేస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో స్మగ్లర్లను గుర్తించి కార్యకలాపాలపై నిఘా పెట్టింది. మన రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల నరికి వేతలో పాల్గొంటున్న కూలీలు, రవాణా వాహనా లను సమకూర్చే వారిని గుర్తించింది. స్మగ్లర్లపై హిస్టరీ షీట్స్ తెరవడంతోపాటు పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తోంది. శేషాచలం అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేసింది. కనీసం రెండు పార్టీలు నిరంతరం కూంబింగ్ చేసేలా షెడ్యూల్ రూపొందించింది. అటవీ, రెవెన్యూ, ఎన్హెచ్ఏఐ శాఖల సహకారంతో దాడులు తీవ్రతరం చేస్తోంది. వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. కీలక ప్రదేశాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దశాబ్దం తరువాత తొలిసారిగా.. రెండేళ్లుగా సెబ్ బృందాలు పెద్ద ఎత్తున ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకుంటూ కేసులు నమోదు చేస్తున్నాయి. 520 కేసులు నమోదు చేసి 2,546 మందిని అరెస్టు చేశారు. 18,033 ఎర్రచందనం దుంగలు, 345 వాహనాలను జప్తు చేశారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ తగ్గుముఖం పట్టడం దశాబ్దం తరువాత ఇదే తొలిసారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. -
కర్ణాటక మద్యం భారీగా పట్టివేత
కర్నూలు: స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తనిఖీల్లో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై ఎస్ఈబీ సీఐ మంజుల, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌నాయక్ ఆధ్వర్యంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాయచూరు వైపు నుంచి వచ్చిన అశోక్ లేల్యాండ్ వాహనాన్ని తనిఖీ చేయగా, వాహనం వెనుక భాగంలోని ట్రాలీ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాక్‌లో 3,456 టెట్రా ప్యాకెట్లు బయటపడ్డాయి. వాహనంలో ఉన్న పోలకల్లు గ్రామానికి చెందిన పరశురాముడు, గూడూరుకు చెందిన రాఘవేంద్రను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మద్యంతో పాటు వాహనాన్ని సీజ్ చేసి కర్నూలు ఎస్ఈబీ అధికారులకు అప్పగించినట్లు సీఐ మంజుల తెలిపారు. -
'ఎర్ర'స్మగ్లింగ్‌పై ఎల్లలు లేని నిఘా!
సాక్షి, అమరావతి: ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ప్రభుత్వం పటిష్ట కార్యాచరణకు ఉపక్రమించింది. ఎర్ర స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఉద్దేశించిన టాస్క్ ఫోర్స్‌ను ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పరిధిలోకి తీసుకొచ్చింది. రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృత వ్యవస్థ ద్వారా ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు దశాబ్దాలుగా చేస్తున్న యత్నాలు పూర్తి స్థాయిలో సఫలీకృతం కావడం లేదు. చాలా ఏళ్ల కిందటే ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. కానీ జిల్లా ఎస్పీల బాధ్యత ఆయా జిల్లాలకే పరిమితమవుతుండటంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఎర్ర చందనం ఆయా జిల్లాలతో పాటు అనంతపురం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోంచి రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. మరోవైపు ఎర్రచందనం స్మగ్లర్లు తమిళనాడులో ఉంటూ ఏపీలో కూలీలు, ఏజంట్ల ద్వారా యథేచ్చగా దందా సాగిస్తున్నారు. దీంతో ఈ స్మగ్లింగ్‌ను అరికట్టాలంటే పొరుగు రాష్ట్రాలతో మరింత కేంద్రీకృత సమన్వయం అవసరమని గుర్తించారు. ఈ నేపథ్యంలో సెబ్ పరిధిలోకి ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్‌ను తీసుకొచ్చారు. గంజాయి సాగు, రవాణాను రూపుమాపడంలో సెబ్ విజయవంతం అక్రమ ఇసుక, అక్రమ మద్యం, గుట్కా, గంజాయి దందాలను అరికట్టడంతో సెబ్ ఇప్పటికే విజయవంతమైంది. తాజాగా ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)ల్లో దశాబ్దాలుగా సాగుతున్న గంజాయి సాగు, అక్రమ రవాణాను విజయవంతంగా రూపుమాపడం సెబ్ సమర్థతకు నిదర్శనం. అందుకే ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించే బాధ్యతను సెబ్‌కు అప్పగించింది. డీజీపీ నియంత్రణలో సెబ్ కమిషనర్ ఎర్రచందనం నిరోధక టాస్క్ ఫోర్స్‌ను పర్యవేక్షిస్తారు. ఆయనకు సెబ్ డైరెక్టర్ సహకరిస్తారు. అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ పాలనపరమైన అంశాలను పర్యవేక్షిస్తారు. ఈ మేరకు గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు ప్రభుత్వం సవరణలు చేసింది. రాష్ట్రం అంతా సెబ్ అధికార పరిధిలోకి వస్తున్నందున జిల్లా సరిహద్దులు వంటి సాంకేతిక అడ్డంకులుండవు. సెబ్‌కు ఇప్పటికే ప్రత్యేక పోలీస్ స్టేషన్లున్నాయి. పొరుగు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర పరిధిలోని పోర్టు అధికార వర్గాలతో సంప్రదింపులు, సహకారం వంటివి సెబ్‌కు మరింత సులభతరమవుతాయి. అవసరమైనప్పుడు పొరుగు రాష్ట్రాల పోలీసులతో కలసి జాయింట్ ఆపరేషన్లు కూడా నిర్వహించేందుకు అవకాశముంటుంది. ఏవోబీలో గంజాయి దందాను అరికట్టేందుకు ఒడిశా పోలీసులతో సమన్వయంతో పనిచేయడం తాజా తార్కాణం. ఈ నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్‌ను సెబ్ పరిధిలోకి తీసుకురావడం సానుకూల నిర్ణయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీని ద్వారా దశాబ్దాలుగా వేళ్లూనుకుని ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్‌ను తుద ముట్టించవచ్చని భావిస్తున్నారు. -
బస్సులో అర కిలో బంగారం పట్టివేత
కర్నూలు: స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తనిఖీల్లో అర కిలో బంగారు నగలు పట్టుబడ్డాయి. కర్నూలు మండలం పంచలింగాల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై సెబ్ సీఐ మంజుల, ఎస్ఐ గోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి రాయదుర్గం వెళ్తున్న ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన రాజేష్ బ్యాగ్‌లో 544 గ్రాముల బంగారు వడ్డాణాలు, నెక్లెస్‌లు లభ్యమయ్యాయి. వీటి విలువ రూ.28 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బళ్లారిలోని రాజ్‌మహల్ ఫ్యాన్సీ జ్యూవెలర్స్ షాపునకు చెందిన గుమస్తానని తెలిపిన రాజేష్ అందుకు ఆధారాలు చూపకపోవడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. హైదరాబాద్‌లో నగలు చేయించి బళ్లారి తీసుకువెళ్తున్నట్లు తెలిపాడు. వే బిల్లు, ట్రావెలింగ్ ఓచర్ కానీ చూపకపోవడంతో ఆభరణాలను స్వాధీనం చేసుకుని రవాణాదారునితో పాటు ఆభరణాలను తదుపరి చర్యల నిమిత్తం కర్నూలు అర్బన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దశాబ్దాల దందాలకు కళ్లెం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ రకాల స్మగ్లింగ్లు, దందాలను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. ఉదాశీన చట్టాలను అవకాశంగా చేసుకుని దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైన ఇసుక, అక్రమ మద్యం, గంజాయి, ఎర్రచందనం, ఆన్లైన్ గేమింగ్ తదితర దందాలపై కఠిన చర్యలకు సమాయత్తమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)కు సర్వాధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. ఐపీసీ, సీఆర్పీసీ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి దర్యాప్తు చేసేందుకు ‘సెబ్’కు అధికారాలు అప్పగించింది. ఏళ్ల తరబడి సాగుతున్న దోపిడీ చట్టంలో లొసుగులను అవకాశంగా చేసుకుని రాష్ట్రంలో ఇసుక, అక్రమ మద్యం, గంజాయి, ఎర్రచందనం, ఆన్లైన్ గేమింగ్ దందా దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైంది. ఇంతవరకు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై రాష్ట్ర మైనింగ్, మినరల్స్ నియంత్రణ చట్టం ప్రకారమే కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంది. ఎవరైనా వరుసగా 2సార్లు పట్టుబడితే ఆ చట్టం ప్రకారం జరిమానా విధించి విడిచిపెట్టేవారు. మూడోసారి దొరికితే కేసు పెట్టేందుకు అవకాశం ఉంది. అది కూడా స్థానిక పోలీసులకు అప్పగించాలి. అంతేగానీ రెవెన్యూ అధికారులకు ఎలాంటి అధికారం ఉండదు. అదే ప్రాతిపదికన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020లో ఏర్పాటుచేసిన ‘సెబ్’కు కూడా కేసులు పెట్టేందుకు సాంకేతికంగా అడ్డంకులు తలెత్తాయి. మద్యం అక్రమ రవాణా విషయంలోనూ ఎక్సైజ్ చట్టం ప్రకారం నమోదుచేసే కేసులు ఎలాంటి ప్రభావం చూపించడంలేదు. ఇక మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి జీవితాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్న ఆన్లైన్ జూదం దందాపై కూడా కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదుకూ అవకాశంలేదు. రాయలసీమలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కూడా అటవీ చట్టాల కింద పెట్టే కేసులు స్మగ్లర్ల ఆట కట్టించేందుకు సరిపోవడంలేదు. ఇటువంటి వ్యవస్థీకృత లోపాలతో రాష్ట్రంలో ఇసుక, అక్రమ మద్యం, గంజాయి, ఎర్రచందనం, ఆన్లైన్ గేమింగ్ దందాలు యథేచ్ఛగా సాగుతూ అటు ప్రజాధనాన్ని కొల్లగొట్టడంతోపాటు ఇటు సామాన్యుల జీవితాలను దెబ్బతీస్తున్నాయి. గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం కూడా స్మగ్లర్లకు ఊతమిచ్చింది. కొరఢా ఝళిపించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో అన్ని రకాల స్మగ్లింగ్ దందాలను నిర్మూలించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యుక్తమైంది. అందుకోసం ‘సెబ్’కు విశిష్ట అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. అందుకే ఆయా దందాల్లోని పాత్రధారులు, సూత్రధారులపై ఐపీసీ, సీఆర్పీసీ తదితర సెక్షన్ల కింద కఠిన శిక్షలు విధించేలా చేసేందుకు ‘సెబ్’కు అధికారాలు కల్పిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం.. ►రాష్ట్రం ఒక యూనిట్‌గా ‘సెబ్’ కమిషనరేట్‌ను గుర్తించడంతోపాటు రాష్ట్రంలో ఉన్న ‘సెబ్’ స్టేషన్లను పోలీస్స్టేషన్లుగా గుర్తిస్తూ హోంశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రకారం ‘సెబ్’కు ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసేందుకు అవకాశం కల్పిస్తూ మైనింగ్, ఎక్సైజ్, అటవీ శాఖలు విడివిడిగా కూడా నోటిఫికేషన్లు జారీచేయాల్సి ఉంది. ►ఇప్పటికే గనుల శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. దాంతో ఇక నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై ‘సెబ్’ దాడులు నిర్వహించి నేరుగా ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తుంది. ఆ కేసులను స్థానిక పోలీసులకు అప్పగించాల్సిన అవసరంలేదు. జరిమానాలతో కేసులను సరిపెట్టరు. దీంతో.. ప్రజాధనం లూటీ, సహజ వనరుల దోపిడీ కింద ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు ‘సెబ్’కు అధికారాలు సంక్రమించాయి. ► హోం, ఎక్సైజ్ శాఖలు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడంతో అక్రమ మద్యం, గంజాయి దందాలకు పాల్పడే వారిపై కూడా ‘సెబ్’ నేరుగా ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు మార్గం సుగమమైంది. ►ఇక ఎర్రచందనం స్మగ్లర్లపై ‘సెబ్’ నేరుగా ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు అవకాశం కల్పిస్తూ అటవీ శాఖ కూడా ఉత్తర్వులు జారీచేయనుంది. ► అలాగే, ఆన్లైన్ జూదాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసేందుకు వీలుగా ఐటీ శాఖ త్వరలో నోటిఫికేషన్‌ను జారీచేయనుంది. ►గుట్కా దందాపై కఠిన చర్యలకు వీలుగా వైద్య–ఆరోగ్య శాఖ ఇటీవల ఉత్తర్వులిచ్చింది. తదనుగుణంగా త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. -
Operation Parivartan: గంజాయి కట్టడికి దేశంలోనే భారీ ఆపరేషన్
సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీ) వేళ్లూనుకున్న గంజాయి దందాను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ అప్రతిహతంగా సాగుతోంది. దేశ చరిత్రలోనే అతి పెద్ద ఆపరేషన్‌తో గంజాయి ముఠాలు హడలెత్తిపోతున్నాయి. ‘ఆపరేషన్ పరివర్తన్’కు వ్యతిరేకంగా మావోయిస్టులు ప్రచారం చేపట్టినా గిరిజనుల సహకారంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) మన్యంలో ఏరివేత కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా 10 మంది సభ్యులతో 30 బృందాలను ప్రభుత్వం నియమించింది. చదవండి: విశాఖ నగరంపై స్టార్టప్ కంపెనీల దృష్టి, భారీగా పెట్టుబడులు మావోయిస్టుల బెదిరింపులు బేఖాతర్ మావోయిస్టుల సహకారంతోనే మారుమూల గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు యథేచ్ఛగా సాగుతోందన్నది బహిరంగ రహస్యం. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా డ్రోన్ కెమెరాల సహకారంతో గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేస్తోంది. గిరిజనులను భయపెట్టేందుకు మావోయిస్టులు ఇటీవల విశాఖ ఏజెన్సీలో పోస్టర్లు అతికించారు. ‘పోలీసు వాహనాల్లో ప్రయాణించవద్దు.. గంజాయి మొక్కల నరికివేతకు సహకరించవద్దు.. ప్రత్యామ్నాయం చూపకుండా గంజాయి సాగును నిర్మూలించడం హేయమైన చర్య’ అని పేర్కొంటూ విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ పేరుతో పోస్టర్లు అతికించారు. అయితే ‘సెబ్’ బృందాలు ‘ఆపరేషన్ పరివర్తన్’ను నిరాటంకంగా కొనసాగిస్తున్నాయి. గిరిజనులు కూడా పూర్తిస్థాయిలో దీనికి సహకరిస్తున్నారు. మన్యంలోకి ప్రత్యేక బృందాలు పూర్తిస్థాయిలో సన్నద్ధమైన తరువాతే ‘సెబ్’ ఈ ఆపరేషన్‌ను పకడ్బందీగా చేపట్టింది. తొలుత ప్రత్యేక నిఘా బృందాల ద్వారా క్షేత్రస్థాయి నివేదిక సేకరించింది. అనంతరం డ్రోన్ కెమెరాలతో ఆ ప్రాంతాలను గుర్తించి రంగంలోకి దిగింది. మూడు బేస్ క్యాంప్‌ల నుంచి ప్రతి రోజు ప్రత్యేక బృందాలు మన్యంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకుని ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. నిత్యం సగటున ఆరేడు గంటలపాటు ఆపరేషన్ నిర్వహిస్తూ సగటున 150 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నారు. అతిపెద్ద ఆపరేషన్ అక్టోబరు 30న ప్రారంభించిన ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 5,600 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేయడం విశేషం. దీంతో పాటు అక్రమంగా రవాణా చేస్తున్న 18,600 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 113 వాహనాలను జప్తు చేసి, 217 కేసులు నమోదు చేశారు. దాదాపు 2.15 కోట్ల గంజాయి మొక్కలను ధ్వంసం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీటి విలువ దాదాపు రూ.వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా. గంజాయి సాగు నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ దేశంలో అతి పెద్దది. 29 రోజుల్లోనే పెద్ద ఎత్తున గంజాయిని ధ్వంసం చేయడంపై జాతీయ స్థాయిలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఏవోబీతోపాటు దండకారణ్యం విస్తరించిన ఒడిశా, చత్తీస్ఘడ్, జార్ఖండ్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో అక్రమంగా గంజాయి సాగవుతోంది. ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత విస్తృతస్థాయిలో ఆపరేషన్ చేపట్టలేదని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) పేర్కొనడం గమనార్హం. ఆపరేషన్ పరివర్తన్‌పై ఎన్సీబీ ఇద్దరు అధికారులను ప్రత్యేకంగా నియమించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తోంది. -
80.8 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
పాడేరు: విశాఖ ఏజెన్సీలో నిర్వహిస్తున్న ఆపరేషన్ పరివర్తనలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీసు బృందాలు గురువారం మొత్తం 80.8 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశాయి. కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ అన్నవరం, గొర్లమెట్ట గ్రామాల్లో 70 ఎకరాలు, జి.కె.వీధి మండలం రింతాడ పంచాయతీ మర్రిపాలెం సమీపంలో 10.8 ఎకరాల గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేసి నిప్పంటించారు. ముందుగా ఆయా గ్రామాల్లో గిరిజనులకు గంజాయి నిర్మూలన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. పోలీసుల ప్రచారాలకు ప్రభావితమైన గిరిజనులు స్వచ్ఛందంగానే గంజాయి తోటల ధ్వంసానికి ముందుకొస్తున్నారు. జిల్లా రూరల్ ఎస్పీ బి.కృష్ణారావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జేడీ సతీష్‌కుమార్ పర్యవేక్షణలో గంజాయి తోటలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సీఐ స్వామినాయుడు, మంప ఎస్ఐ జె.లోకేష్‌కుమార్, జి.కె.వీధి ఎస్ఐ షేక్ షమీర్ తదితరులు పాల్గొన్నారు. 34 కిలోల గంజాయి పట్టివేత ముంచంగిపుట్టు: విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం లబ్బూరు జంక్షన్ వద్ద గురువారం పోలీసులు రూ.68 వేల విలువైన 34 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఒకరు పరారయ్యారు. గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన బొలెరో వాహనం, బైకు, స్కూటీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని మాకవరం పంచాయతీ అరబీరు గ్రామానికి చెందిన సీసా నాగేశ్వరరావు, ఒడిశా రాష్ట్రం కలహండి గ్రామానికి చెందిన పబిత్రా కటలుగా గుర్తించినట్లు ఎస్ఐ ఆర్.సంతోష్ చెప్పారు. -
402 ఎకరాల్లో గంజాయి ధ్వంసం
పాడేరు/ కొయ్యూరు: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల నిర్మూలన లక్ష్యంగా పోలీసుశాఖతో పాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో బృందాలు గంజాయి దాడులను కొనసాగిస్తున్నాయి. అలాగే చింతపల్లి మండలం తురబాలగెడ్డ వద్ద లిక్విడ్ గంజాయి తరలిస్తున్న తల్లీకొడుకులను సోమవారం అరెస్టు చేశారు. కాగా విశాఖ ఏజెన్సీలోని డుంబ్రిగుడ, జి.కె.వీధి, చింతపల్లి, పెదబయలు మండలాల పరిధిలోని 402 ఎకరాల్లో గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేసి నిప్పంటించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జేడీ శంకరరెడ్డి, ఎస్ఈబీ అధికారులు సుధాకర్, శ్రీను, ప్రశాంత్, సంతోస్, తదితరులు పాల్గొన్నారు. లిక్విడ్ గంజాయి పట్టివేత.. విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి నుంచి రూ.లక్ష విలువ చేసే కిలో ద్రవ గంజాయిని ద్విచక్ర వాహనంపై తీసుకొస్తున్నారన్న సమాచారం గొలుగొండ ఎస్ఈబీ అధికారులకు అందింది. దీంతో డౌనూరు పంచాయతీ తురబాలగెడ్డ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన తల్లీ, కొడుకులు జరీనా, ఎస్కె.జహరుద్దీన్ లిక్విడ్ గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. వీరు కాకినాడలోని వైద్య విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారినుంచి మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. -
288 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం
పాడేరు : ఆపరేషన్ పరివర్తనలో భాగంగా విశాఖ ఏజెన్సీలో గంజాయి నిర్మూలన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖతో పాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగాలు రోజువారీ గంజాయి తోటలపై దాడులు చేపడుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో భారీగా గంజాయి తోటలను ధ్వంసం చేశారు. చింతపల్లి, జి.మాడుగుల, డుంబ్రిగుడ మండలాల్లోని 288 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేసినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శంకర్‌రెడ్డి చెప్పారు. జి.మాడుగుల మండలంలోని బీరం పంచాయతీ బీరం, గడ్డిబందలు, అనర్భ, వెంకటపాలెం, చెలమరంగి గ్రామాల సమీపంలోని 211 ఎకరాలు, డుంబ్రిగుడ మండలం కొర్రాయి పంచాయతీ గంజిగుడ, కండ్రూం గ్రామాల సమీపంలోని 15 ఎకరాలు, చింతపల్లి మండలం అన్నవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోటగున్నల కాలనీ, చోడిరాయి, రామారావుపాలెం గ్రామాల్లోని 62 ఎకరాల్లోని గంజాయి తోటలన్నింటినీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీసుశాఖ బృందాలు ధ్వంసం చేశాయి. చింతపల్లి మండలం బెన్నవరం, లోతుగెడ్డ, అన్నవరం గ్రామాల్లో కళాజాత బృందాలు గంజాయి వలన జరిగే అనర్థాలపై గిరిజనులకు పాటలు, నృత్య రూపకాల ద్వారా అవగాహన కల్పించారు. -
ఏజెన్సీలో 102 ఎకరాల్లో గంజాయి ధ్వంసం
పాడేరు/గూడెంకొత్తవీధి: విశాఖ ఏజెన్సీలో శనివారం 102 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్, సూపరింటెండెంట్ గోపాల్ పర్యవేక్షణలో జి.మాడుగుల మండలంలోని బీరం పంచాయతీ వి.కోడాపల్లి ప్రాంతంలో 54 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. రెండు లక్షల 70 వేల మొక్కలను నరికివేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి, ఎస్ఈబీ బృందం, సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు జి.కె.వీధి మండలంలో సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐ షమీర్ ఆధ్వర్యంలో రింతాడ పంచాయతీ కోరాపల్లి గ్రామంలో గంజాయి నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం గంజాయి సాగు జోలికి పోమని వారితో తీర్మానం చేయించారు. 8 ఎకరాల్లో తోటలను ధ్వంసం చేసి నిప్పంటించారు. చింతపల్లి మండలంలోని కుడుమసారి పంచాయతీ కోటగున్నెల, లోతుగెడ్డ పంచాయతీ మేడూరు గ్రామాల్లో 40 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం చేశారు. 760 కిలోల గంజాయి స్వాధీనం కశింకోట: విశాఖ జిల్లా మండలంలోని బయ్యవరం వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దర్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ జి.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఏజెన్సీలోని జి.మాడుగుల మండలం నుంచి గంజాయి కొనుగోలు చేసి చెన్నైకు బొలెరో వాహనంలో తరలిస్తుండగా బయ్యవరం వద్ద పట్టుకున్నామన్నారు. ఈ సందర్భంగా చీడికాడకు చెందిన గ్రామానికి చెందిన డ్రైవర్ కొల్లివలస శ్రీను, బుచ్చియ్యపేట మండలం అప్పన్నపాలెం గ్రామానికి చెందిన జి.బత్తుల సంతోష్‌లను అరెస్టు చేశామన్నారు. 760 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, దీని ఖరీదు రూ.15 లక్షలు ఉంటుందన్నారు. -
గంజాయి కట్టడికి.. రైల్వే పోలీసులు సైతం..
సాక్షి, అమరావతి: గంజాయి దందాపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’లో రైల్వే పోలీసులూ కీలకపాత్ర పోషిస్తున్నారు. రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జనరల్ రైల్వే పోలీస్ (జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ప్రత్యేక డ్రైవ్ చేపట్టాయి. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏఓబీ)లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్–ఎస్ఈబీ), పోలీసు అధికారులు విస్తృతంగా చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ గంజాయి మాఫియాను హడలెత్తిస్తోంది. వందల ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నారు. మరోవైపు.. ఏజెన్సీలో పలు ప్రాంతాల్లో తనిఖీలుచేస్తూ గంజాయి నిల్వలను పెద్దఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో.. ఉన్న గంజాయి నిల్వలను హడావుడిగా ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు గంజాయి ముఠాలు ప్రయత్నిస్తున్నాయని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే రోడ్డు మార్గంలో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. దీంతోపాటు రైళ్లలోనూ విస్తృతంగా తనిఖీలు చేయాలని జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. 25 ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు ఆపరేషన్ పరివర్తన్ కోసం జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలతో 25 ప్రత్యేక బృందాలను నియమించారు. వాటిలో విజయవాడ రైల్వే పోలీస్ జిల్లా పరిధిలో 20 బృందాలు, గుంతకల్ రైల్వే పోలీస్ జిల్లా పరిధిలో 5 బృందాలను ఏర్పాటుచేశారు. విజయవాడ రైల్వే పోలీస్ జిల్లా పరిధిలోని 15 ప్రధాన రైల్వేస్టేషన్లు, 15 అవుట్ పోస్టులు, గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోని 19 ప్రధాన రైల్వేస్టేషన్లు, 15 అవుట్ పోస్టులలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పార్శిళ్లలో ఉన్న గంజాయిని గుర్తించేందుకు పోలీసు జాగిలాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ‘ఆపరేషన్’ సంపూర్ణంగా విజయవంతమయ్యే వరకు రైళ్లలో తనిఖీలను కొనసాగిస్తామని అదనపు డీజీ (రైల్వే) హరీష్‌కుమార్ గుప్తా చెప్పారు. ఆపరేషన్‌లో ‘సెబ్’ కమిషనర్ మరోవైపు.. ‘ఆపరేషన్ పరివర్తన్’లో ‘సెబ్’ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ గురువారం స్వయంగా పాల్గొన్నారు. ముందస్తు సమచారం ఇవ్వకుండా ఆయన గురువారం విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం పంగళలంలోని సెబ్ బేస్ క్యాంప్‌నకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఏడు బృందాలతో కలిసి ఆయన పాడేరు, చింతపల్లి మండలాల్లోని మారుమూల తండాల్లో గంజాయి సాగు తీరును పరిశీలించి విస్తుపోయారు. దాదాపు 200 ఎకరాల్లో ఈ పంటలను ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌లో సెబ్ జేడీ సతీష్, సెబ్ స్పెషల్ యూనిట్ జేడీ నరేంద్రనాథ్ రెడ్డి, పాడేరు అదనపు ఎస్పీ జగదీశ్, సెబ్ సూపరింటెండెంట్ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి తోటల నిర్మూలనే లక్ష్యం
పాడేరు/చింతపల్లి: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల నిర్మూలన లక్ష్యంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) బృందాలు పనిచేస్తున్నాయని ఆ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. ఏజెన్సీలో గురువారం మొత్తం 190 ఎకరాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేశారు. ఏజెన్సీలోని పెదబయలు మండలం మారుమూల మావోయిస్టు ప్రభావిత పూటూరు, పంగలం గ్రామాల పరిధిలోని గంజాయి తోటల ధ్వంసాన్ని ఆయన గురువారం పర్యవేక్షించారు. ఈ మారుమూల గ్రామాలకు కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్‌తో పాటు ఎస్ఈబీ విశాఖపట్నం జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్, పాడేరు ఏఎస్పీ జగదీష్, ఏడు ఎస్ఈబీ బృందాల సభ్యులు వెళ్లారు. ఇక్కడ సాగవుతున్న గంజాయి తోటలను కమిషనర్ పరిశీలించారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 115 ఎకరాల విస్తీర్ణంలో గంజాయి తోటలను ధ్వంసం చేశాయి. సుమారు 5.75 లక్షల గంజాయి మొక్కలను నరికేసి నిప్పంటించారు. చింతపల్లి మండలం అన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలోని కొండపల్లి, వర్తనపల్లి గ్రామాల పరిధిలో సుమారు 75 ఎకరాల్లో సాగవుతున్న గంజాయిని గురువారం గిరిజనులతో కలిసి ఏఎస్పీ తుషార్ డూడి ధ్వంసం చేశారు. అన్నవరం ఎస్ఐ ప్రశాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 120 కిలోల గంజాయి పట్టివేత ముంచంగిపుట్టు: విశాఖ జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు గురువారం రూ.2.4 లక్షల విలువైన 120 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. మండలంలోని జోలాపుట్టు నుంచి ముంచంగిపుట్టు మార్గంలో గుమ్మసీర్గంపుట్టు వద్ద వనుగుమ్మ నుంచి వస్తున్న ఎపి35టి9551 నంబరు జీపులో తనిఖీ చేసి 6 బస్తాల గంజాయిని పట్టుకున్నట్లు స్థానిక ఎస్ఐ ఆర్.సంతోష్ చెప్పారు. జీపులో ఉన్న నలుగురిని, జీపు వెనక బైకుపై పైలెటింగ్ చేస్తున్న ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గంజాయిని, జీపును, బైకును సీజ్‌చేశామన్నారు. నిందితుల వద్ద ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఎస్ఐ తెలిపారు. -
AP: 239 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం
పాడేరు: విశాఖ ఏజెన్సీలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో గంజాయి దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం 239 ఎకరాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేశారు. పెదబయలు మండలంలోని మారుమూల జగ్గంపేట, సీమకొండ, రంజెలమంది గ్రామాల సమీపంలో సుమారు 216 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్న గంజాయి తోటలను ఎస్ఈబీకి చెందిన ఏడు బృందాలు ధ్వంసం చేశాయి. 10.8 లక్షల గంజాయి మొక్కలను నరికేసి వాటికి నిప్పంటించారు. చింతపల్లి మండలం మేడూరు గ్రామ సమీపంలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న చింతపల్లి ఏఎస్పీ తుషార్ డూడి ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తుల సహకారంతో 15 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలకు నిప్పంటించారు. పాడేరు మండలంలోని ఇరడాపల్లి సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్న కనక ఆధ్వర్యంలో గిరిజనులతో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు, వలంటీర్ల సహకారంతో 8 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేసి నిప్పంటించారు. -
మద్యం షాపులో రూ.50 లక్షల గోల్మాల్
పిడుగురాళ్ల: మద్యం దుకాణంలో సుమారు రూ.50 లక్షలు గోల్మాల్ అయిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని చెక్‌పోస్టు ఎదురుగా గల ప్రభుత్వ మద్యం దుకాణంలో వారం రోజులుగా లెక్కలు సక్రమంగా లేకపోవడాన్ని ఎస్ఈబీ కానిస్టేబుల్ ఎస్.వెంకటేశ్వర్లు పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. సోమవారం తెల్లవారుజామున ఎస్ఈబీ సీఐ బాషా ఆధ్వర్యంలో ఆ మద్యం దుకాణాన్ని పరిశీలించి స్టాక్‌ను తనిఖీ చేసి రూ.49,63,737 విలువ గల మద్యం సీసాలు మాయమైనట్టు నిర్ధారించారు. సీఐ బాషా మాట్లాడుతూ.. ఈ మద్యం షాపులో పని చేస్తున్న సూపర్వైజర్, ఓ సేల్స్‌మేన్ కనిపించలేదని చెప్పారు. మిగిలిన ఇద్దరు సేల్స్మెన్లను విచారించామని చెప్పారు. 20 రోజుల నుంచి ఈ తంతు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. షాపు సూపర్వైజర్ విజయ్ అందుబాటులో లేడని, అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చిందన్నారు. అతన్నీ అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరమే గోల్‌మాల్‌కు సంబంధించిన వివరాలు తెలుస్తాయన్నారు. ఈ అవినీతిలో కొందరు ఎస్ఈబీ సిబ్బంది హస్తం కూడా ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. త్వరలో విచారణ పూర్తి చేసి నిందితులపై క్రిమినల్ కేసులు, ఆర్ఆర్ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు. -
గంజాయిపై ఉక్కుపాదం
పాడేరు/డుంబ్రిగుడ/జీకే వీధి/చింతపల్లి/కాకినాడ సిటీ/అనంతగిరి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగు, రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాల ఆధ్వర్యంలో యథేచ్ఛగా సాగుతున్న గంజాయి దందాను నామరూపాల్లేకుండా తుదముట్టించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు త్రిముఖ వ్యూహంతో ముందుకు కదులుతూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ఓ వైపు గంజాయి సాగు వల్ల తలెత్తే దుష్పరిణామాలపై ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట గిరిజనులకు అవగాహన కల్పిస్తూ గంజాయి తోటలను ధ్వంసం చేసే పనిలో కొన్ని బృందాలు నిమగ్నం కాగా.. మరికొన్ని బృందాలు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాయి. అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఎస్ఈబీ, పోలీస్ అధికారులు కార్యాచరణ కొనసాగిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. విజయవంతంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో వందలాది ఎకరాల్లో గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేయగా.. పలుచోట్ల తనిఖీలు దాడులు నిర్వహిస్తూ వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతున్న గంజాయిని పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సోమవారం విశాఖ జిల్లా మారుమూల గిరిజన గ్రామాల్లో 217 ఎకరాల్లో సాగు చేస్తున్న 9.80 లక్షలకు పైగా గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారు. మరోవైపు ఒడిశా నుంచి స్మగ్లింగ్ అవుతున్న రూ.కోటిన్నరకు పైగా విలువైన 1,720 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒకే పంచాయతీ పరిధిలో 217 ఎకరాల్లో పంట ధ్వంసం విశాఖ ఏజెన్సీ పరిధిలోని ఐదు మండలాల్లో సోమవారం 217 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది ఏడు బృందాలుగా ఏర్పడి జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ పరిధిలోని వాకపల్లి, డిప్పలగొంది, వడ్రంగుల గ్రామాల్లో 164 ఎకరాల్లో సాగవుతున్న సుమారు 7.40 లక్షల మొక్కలను నరికి నిప్పంటించారు. డుంబ్రిగుడ మండలంలోని కండ్రుం పంచాయతీ దండగుడ, బెడ్డగుడ, కండ్రుం గ్రామాల్లో 12 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను సోమవారం ఆ పంచాయతీ గిరిజనులు స్వచ్ఛందంగా ధ్వంసం చేశారు. ఇకపై గంజాయి సాగుచేయబోమని తీర్మానం చేశారు. గూడెం కొత్తవీధి మండలంలో మావోయిస్టు ప్రాంతమైన కుంకుంపూడికి సమీపంలోని 5 ఎకరాల్లో గంజాయి తోటలను గిరిజనులు స్వచ్ఛందంగా ధ్వంసం చేసి, మొక్కలకు నిప్పంటించారు. చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీ గాదిగొయ్యి గ్రామంలో 20 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. పాడేరు మండలం గొండెలి, కించూరు పంచాయతీల్లో 16 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఆయా ప్రాంతాల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, గిరిజన పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగాయి. పశువుల దాణా ముసుగులో తరలిస్తున్న టన్ను గంజాయి పట్టివేత తూర్పు గోదావరి జిల్లా చింతూరు సబ్ డివిజన్ పరిధిలో రూ.కోటి విలువైన వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు కాకినాడలో సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన వ్యక్తులు పశువుల దాణా ముసుగులో ఆ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు లారీలో గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ లారీని చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని గోడ్లగూడెం జంక్షన్ వద్ద అటకాయించారు. పోలీసుల్ని చూసి ఒక వ్యక్తి పారిపోగా మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా తికూరి గ్రామానికి చెందిన మన్మోహన్ పటేల్, అదే జిల్లా మౌరహా గ్రామానికి చెందిన మహమ్మద్ హారన్, ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా ఎంపీవీ–79 గ్రామానికి చెందిన రాబిన్ మండల్, ఎంపీవీ–75 గ్రామానికి చెందిన అమృతా బిశ్వాస్, నలగుంటి గ్రామంలోని ఎంపీవీ–36కు చెందిన బసుదేవ్ మండల్‌ను అరెస్ట్ చేశారు. ఒడిశాలో పండించిన గంజాయిని వారంతా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని ఎస్పీ చెప్పారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి రాజును ఒడిశా పోలీసుల సహకారంతో అరెస్ట్ చేస్తామన్నారు. చిలకలగెడ్డ వద్ద 720 కేజీల స్వాధీనం విశాఖ జిల్లా అనంతగిరి మండలం చిలకలగెడ్డ చెక్‌పోస్టు వద్ద ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు వ్యాన్‌లో తరలిస్తున్న 720 కేజీల గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, స్టేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం సంయుక్తంగా పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ గణపతిబాబు, టాస్క్‌ఫోర్స్ హెచ్‌సీ శ్రీధర్ నేతృత్వంలోని పోలీసులు చిలకలగెడ్డ వద్ద కాపుగాసి పట్టుకున్నారు. గంజాయితో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబట్ట గంజాయి విలువ రూ.50 లక్షలకు పైగా విలువ చేస్తుందని అంచనా. ఈ దాడిలో ఎస్ఈబీ ఎస్ఐ దాస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కృష్ణప్రసాద్, నర్సింగరావు పాల్గొన్నారు. -
గంజాయిపై సమష్టి పోరు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా) : దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న గంజాయి సాగును రాష్ట్రంలో సమూలంగా నిర్మూలించేందుకు పోలీసు యంత్రాంగం ఉమ్మడి వ్యూహం రచిస్తోంది. సాగు దశ నుంచే దీనిని కట్టడి చేసేందుకు పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని నిర్ణయించింది. తూర్పు గోదావరి జిల్లా వేదికగా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసు అధికారులకు ఈ మేరకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పలు విభాగాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సుమారు మూడున్నర గంటలపాటు రాజమహేంద్రవరంలో అంతర్గత సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగు దగ్గర నుంచే గంజాయి నియంత్రణ, రవాణా కట్టడికి సరిహద్దుల్లో ఎదురవుతున్న ప్రతిబందకాలను అధిగమించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని సూచించారు. ఇందుకు పొరుగునున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని సమష్టి పోరుకు సిద్ధంకావాలని ఆదేశించారు. ఇందుకోసం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేస్తున్నామని చెప్పారు. దీనికి పోలీసు, రెవెన్యూ, అటవీ, వ్యవసాయ, ఐటీడీఏల సహకారం తీసుకుంటామన్నారు. అనంతరం డీజీపీ సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. మీరే చూస్తారుగా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నెలరోజులుగా రాష్ట్రంలో గంజాయిపై లోతైన అధ్యయనం చేశామని గౌతమ్ సవాంగ్ చెప్పారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారుగా అని డీజీపీ అన్నారు. నిజానికి ఆంధ్రా–ఒడిశా మధ్య గంజాయి సమస్య దశాబ్దాలుగా ఉందన్నారు. ఎన్ఐఎ సహకారంతో ఇప్పుడు దానిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో 2.90 లక్షల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని డీజీపీ చెప్పారు. పదేళ్ల కంటే గత ఏడాదిలో కొన్ని రెట్లు అధికంగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గతంలో 3 వేల ఎకరాల్లో మాత్రమే గంజాయి సాగును ధ్వంసం చేసినట్లు చెబుతున్నారని.. కానీ, ఈసారి మొదటి విడతలోనే 4,500 ఎకరాల్లో ధ్వంసం చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని ఆయన చెప్పారు. మీడియాతో మాట్లాడుతున్న డీజీపీ సవాంగ్ ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తులపై గట్టి నిఘా ఏర్పాటుచేయడంతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వారందరినీ చట్టం ముందు నిలబెడతామన్నారు. ఇప్పటికే 463 మంది అంతర్రాష్ట్ర నిందితులను దోషులుగా నిలబెట్టామన్నారు. అలాగే, 1,500 వాహనాలను జప్తుచేసి, 5,000 మంది నిందితులను అరెస్టు చేశామని గౌతమ్ సవాంగ్ చెప్పారు. సమస్యను శాశ్వతంగా ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తున్నామని, ఒడిశా డీజీపీతో కూడా మాట్లాడామన్నారు. ఈ విషయంలో ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గంజాయి సాగుపై దాడులు విస్తృతం పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గంజాయి రవాణా, సాగుపై పోలీసు దాడులు నిర్వహించామన్నారు. ఈ ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్ బృందాలను నియమించామన్నారు. నిజానికి.. 2016లోనే ఏపీతో పాటు ఒడిశా సైతం గంజాయికి కేంద్రంగా మారిందన్నారు. ఇక గంజాయి ఏ విధంగా తరలిస్తున్నారు? ఎలా పట్టుకోవాలి? ఎక్కడ చెక్ పోస్టులు పెట్టాలి అనే అంశాలపై సమగ్రంగా చర్చించామని డీజీపీ చెప్పారు. నాలుగేళ్లుగా కేరళ నుంచి వచ్చిన స్మగ్లర్లు ఇక్కడే ఉండి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న విషయాన్ని గుర్తించామని ఆయన చెప్పారు. గంజాయి స్మగ్లింగ్ ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ఎక్కువగా ఉందన్నారు. అసత్య ఆరోపణలు సరికాదు ఇక గుజరాత్ ముంద్రా, నరసాపురం ఉదంతాలతో రాష్ట్రానికి ఎలాంటి సంబంధంలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ మరోసారి స్పష్టంచేశారు. కొందరు కావాలనే దీనిపై అసత్యపు ప్రచారం చేస్తున్నారన్నారు. విచారణ చేస్తున్న ఏజెన్సీలన్నీ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. డీఆర్ఐ, ఎన్సీబీ, ఇప్పుడు సీబీఐ కూడా ఆరా తీస్తున్నాయని ఆయన చెప్పారు. పోలీస్ వ్యవస్థపై రాజకీయంగా విమర్శలు చేయవద్దని డీజీపీ హితవు పలికారు. గంజాయి, ఇతర స్మగ్లింగ్ వ్యవహారాలపై ప్రజలు ముందుకొచ్చి సమాచారం ఇవ్వాలని డీజీపీ కోరారు. ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఏపీ, తమిళనాడు పోలీసులు సహకారం శ్రీసిటీ వేదికగా ఇరు రాష్ట్రాల పోలీసు అధికారుల చర్చలు ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో అక్రమ రవాణా, శాంతిభద్రతల పరిరక్షణకు కసరత్తు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) అడిషనల్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రెండు రాష్ట్రాల పోలీసు శాఖల సమన్వయం, పరస్పర సహకారం కోసం మంగళ వారం శ్రీసిటీ పారిశ్రామికవాడలోని వ్యా పార వాణిజ్య కేంద్రంలో చిత్తూరు, నెల్లూరు, తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలకు చెందిన పలువురు పోలీసు అధికారులు సమావేశమయ్యారు. సెబ్ అడిషనల్ ఎస్పీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన శ్రీసిటీ సెజ్ పరిధిలో ఇరు ప్రాంతాల పోలీసుల మధ్య సహకారం, సమన్వయం ఉన్నప్పుడే అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చర్యలతో శ్రీసిటీని శాంతిభద్రతల విషయంలో మోడల్ సిటీగా మార్చవచ్చన్నారు. అలాగే, ఆకతాయిలు, రౌడీమూకలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంతర్రాష్ట్ర నేరాలను నివారించడం, ఇసుక, కంకర, మట్టి, ఎర్రచందనం, మద్యం, గంజాయి, రేషన్ బియ్యంలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్స్) రమేష్‌కుమార్, శ్రీసిటీ సెక్యూరిటీ చీఫ్ రమేష్ సాదర స్వాగతం పలికారు. -
కల్లుగీత కార్మికురాలిపై ఎస్ఈబీ సీఐ దాష్టీకం
సాక్షి, పీసీపల్లి: కల్లు అమ్ముకుంటున్న మహిళపై ఎస్ఈబీ సీఐ జులుం ప్రదర్శించారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా పీసీపల్లి మండల పరిధిలోని పెదయిర్లపాడులో శనివారం జరిగింది. కనిగిరి ఎస్ఈబీ సీఐ జలీల్ ఖాన్ తన సిబ్బందితో కలిసి గ్రామంలోకి వెళ్లారు. అక్కడ కల్లు విక్రయిస్తున్న పద్మజ, బండ్ల రమేష్, శ్రీనులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రభుత్వ అనుమతితోనే కల్లు విక్రయిస్తున్నామని చెప్పినా వినలేదని, కల్లులో మాదక ద్రవ్యాలు కలిపారంటూ నానా దుర్బాషలాడుతూ రోడ్డు వెంట ఈడ్చుకెళ్లారని పద్మజ అనే కల్లు గీత కార్మికురాలు వాపోయింది. సొమ్మసిల్లి పడిపోవడంతో హుటాహుటిన పద్మజను 108లో ఆస్పత్రికి తరలించారు. అనంతరం శ్రీనును అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ వ్యవహారంపై కల్లుగీత కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళ.. అని కూడా చూడకుండా దాడి చేసిన సీఐ జలీల్ఖాన్ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి గ్రామంలో గంజాయి, నాటుసారా విక్రయిస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. కల్లు విక్రయిస్తున్న వారిని విచారించేందుకు వెళ్లాం. కల్లు విక్రయిస్తున్న వారు బాధ్యతాయుతమైన సమాధానం ఇవ్వకుండా దుర్బాషలాడారు. దీంతో చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. మా విచారణలో వారి వద్ద ఎటువంటి మాదక ద్రవ్యాలూ లభించలేదు. – జలీల్ ఖాన్, సెబ్ సీఐ సీఐపై చర్యలు తీసుకోవాలి మహిళ..అని కూడా చూడకుండా విచక్షణా రహితం దాడి చేసిన సీఐ జలీల్‌ఖాన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలి. విధుల నుంచి సస్పెండ్ కూడా చేయాలి. ఫిర్యాదులు వస్తే విచారణ చేయాలేగానీ స్వలాభం కోసం విచక్షణా రహితంగా దాడి చేయడం హేయం. – బ్రహ్మంగౌడ్, కల్లు గీత సంఘ అధ్యక్షుడు, కనిగిరి గాయాలు చూపుతున్న పద్మజ -
అపోహల సృష్టికే ఏపీలో వదంతులు
సాక్షి, అమరావతి: గుజరాత్లో కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఇటీవల జప్తుచేసిన హెరాయిన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. అయినా.. ప్రతిపక్ష పార్టీలు, ఓ సీనియర్ నాయకుడు (చంద్రబాబును ఉద్దేశించి) పదేపదే వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం డీజీపీ మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు ఏమాత్రం బాధ్యత లేకుండా అపోహలు సృష్టించడం సమంజసం కాదన్నారు. ఇటువంటి అసత్య ఆరోపణలతో ప్రజలు అభద్రతాభావానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి, నిజనిజాలు బేరీజు వేసుకోవాలన్న విచక్షణను ప్రతిపక్ష పార్టీలు మరచిపోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్ ముంద్రా పోర్ట్‌లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ నిల్వలతో విజయవాడకు, రాష్ట్రానికిగానీ అస్సలు సంబంధం లేదని విజయవాడ కమిషనర్ ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ కొందరు రాజకీయ నాయకులు ఆ అంశాన్ని పదేపదే ప్రస్తావించడం సమంజసం కాదన్నారు. ముంద్రా, చెన్నై, ఢిల్లీ, నోయిడాలలోనే హెరాయిన్ స్వాధీనాలు, అరెస్టులు చేశారని జాతీయ పత్రికలు, చానళ్లు కూడా ప్రముఖంగా ప్రసారం చేసిన విషయాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ గుర్తుచేశారు. ఆ నేరం ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో లేవని డీఆర్ఐతోపాటు కేంద్ర సంస్థలు ధ్రువీకరిస్తున్నా సరే సీనియర్ నాయకుడినని చెప్పుకునే ప్రతిపక్ష నేత ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టించడం భావ్యం కాదని స్పష్టం చేశారు. ఆషీ ట్రేడింగ్ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడగా ఉంది తప్ప రాష్ట్రంలో ఇసుమంతైనా కార్యకలాపాలు జరపలేదని పునరుద్ఘాటించారు. అసత్య ప్రకటనలు మానుకోవాలి హెరాయిన్‌ను విజయవాడకుగానీ, ఏపీలోని ఇతర ప్రాంతాలకుగానీ దిగుమతి చేసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదని డీఆర్ఐ అధికారులు స్పష్టంచేసిన విషయాన్ని డీజీపీ గుర్తుచేశారు. అఫ్గానిస్తాన్ నుంచి ముంద్రా పోర్టుకు కన్సైన్మెంట్ ముసుగులో హెరాయిన్ దిగుమతి చేసుకుంటుండగా తనిఖీలు చేసి జప్తు చేశామని మాత్రమే డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారని ఆయన చెప్పారు. అన్ని అంశాలపై డీఆర్ఐ, ఇతర కేంద్ర సంస్థలు ముమ్మరంగా పరిశోధన చేస్తున్నాయని కూడా సవాంగ్ చెప్పారు. కాబట్టి, ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రకటనలు చేయడం, ప్రజల మనసుల్లో భయాందోళనలు రేకెత్తించడం, ప్రజలను తప్పుదోవపట్టించడం మానుకోవాలని ఆయన కోరారు. హెరాయిన్ స్మగ్లింగ్ వంటి జాతి వ్యతిరేక కార్యకలాపాల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్ తమకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారని డీజీపీ చెప్పారు. ఈ సమావేశంలో విజయవాడ పోలీస్ కమిషనర్ బి. శ్రీనివాసులుతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. బహిరంగ మద్య సేవనంపై కఠిన చర్యలు రాష్ట్రంలో బహిరంగ మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు. మహిళల భద్రత, ఘర్షణల నివారణకు పోలీసు యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో బహిరంగ మద్య సేవనంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వలంరెడ్డి లక్ష్మణరెడ్డి డీజీపీకి గురువారం వినతిపత్రం సమర్పించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉద్యోగ నియామవళిలో బహిరంగ మద్యసేవనం నిరోధాన్ని కూడా చేర్చాలని కోరారు. దీనిపై సవాంగ్ స్పందిస్తూ.. బహిరంగ మద్య సేవనాన్ని అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యం అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను పటిష్టపరిచామన్నారు. -
ఏపీ: మద్యం.. తగ్గుముఖం
అక్రమ మద్యంపై ఉక్కుపాదం బెల్ట్ షాపులు, పర్మిట్ రూములను మూసేయించడం, దుకాణాల సంఖ్యను తగ్గించడంతో పాటు.. విక్రయాల సమయాన్ని కుదించాం. తద్వారా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. ఈ సమయంలో రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం తరలి రాకుండా చూడాలి. ఎక్కడైనా తయారు చేస్తుంటే చర్యలు తీసుకోవాలి. కాలేజీలు, యూనివర్సిటీలకు సమీపంలో గంజాయి అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో నిఘా పెట్టాలి. గంజాయి సాగును గుర్తించి, ఎప్పటికప్పుడు ధ్వంసం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: అక్రమ మద్యం తయారీ, రవాణాతో పాటు గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులను ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా, తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదివరకే చట్టాన్ని తీసుకు వచ్చామని, దానిని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాల ప్రగతిపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్య నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామని, 4,379 మద్యం షాపులను 2,975కు కుదించి.. మూడింట ఒక వంతు దుకాణాలను మూసి వేశామని తెలిపారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం 43 వేల బెల్టు షాపులను తీసేయడంతో పాటు 4,379 పర్మిట్ రూమ్‌లను మూసి వేయించడం వల్ల రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయన్నారు. ఇది వరకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయించే వారని, ఈ సమయాన్ని ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకే పరిమితం చేశామని చెప్పారు. ఈ చర్యలన్నింటితో లిక్కర్ అమ్మకాలు నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు, బీరు అమ్మకాలు నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయని వివరించారు. ఇలాంటి సందర్భంలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని, మద్యం తయారీని అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం ► గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపాలి. క్రమం తప్పకుండా దాడులు నిర్వహించి గంజాయి తోటలను ధ్వంసం చేయాలి. పోలీసు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ► డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఏ కాలేజీలోనైనా అలాంటి ఉదంతాలు కనిపిస్తే.. అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలి. క్రమం తప్పకుండా విశ్వవిద్యాలయాలు, కాలేజీలపై పర్యవేక్షణ ఉండాలి. ► దీనిపై కార్యాచరణ తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో వచ్చే సమావేశంలో తెలియజేయాలి. ఆరోగ్యానికి అత్యంత హానికరంగా మారిన గుట్కా విక్రయాలు, రవాణాపై దృష్టి పెట్టాలి. ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు ► నిర్ధేశించిన రేట్ల కన్నా ఇసుకను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలి. ఎస్ఈబీ కాల్ సెంటర్ నంబర్‌పై విస్తృత ప్రచారం కల్పించాలి. అధిక రేట్లకు ఎవరైనా అమ్మితే వెంటనే వినియోగదారులు ఆ నంబర్‌కు కాల్ చేసేలా జిల్లాల వారీగా ప్రచారం చేయాలి. ► వచ్చే కాల్స్‌పై సత్వరమే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆయా జిల్లాల్లో రేట్ల వివరాలను తెలియజేస్తూ ప్రకటనలు ఇవ్వాలి. అంతకన్నా ఎక్కువ ధరకు ఎవరైనా విక్రయిస్తే.. తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా అధికారులు దీనిపై పర్యవేక్షణ చేయాలి. వర్షాలు తగ్గుముఖం పట్టగానే మరిన్ని రీచ్‌లు, డిపోల సంఖ్య పెంచేలా చూడాలి. ► ఈ సమీక్షా సమావేశంలో ప్లానింగ్ అండ్ రిసోర్స్ మొబలైజేషన్ స్పెషల్ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఇంటెలిజెన్స్ చీఫ్ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్, ఎస్ఈబీ డైరెక్టర్ (స్పెషల్ యూనిట్స్) ఏ రమేష్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్న పోలీసులు (ఫైల్) కేసుల వివరాలు ఇలా.. ► మద్యం అక్రమ రవాణా, తయారీపై నమోదైన కేసులు : 1,20,822 ► అరెస్ట్ అయిన నిందితులు : 1,25,202 ► 2020లో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులు : 63,310 ► 2021లో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులు : 57,512 ► ఎస్ఈబీ నమోదు చేసిన కేసులు : 74,311 ► పోలీసులు నమోదు చేసిన కేసులు : 46,511 ► సీజ్ చేసిన అక్రమ మద్యం (లీటర్లు) : 8,30,910 ► స్వాధీనం చేసుకున్న నాటుసారా (లీటర్లు) : 8,07,644 ► ధ్వంసం చేసిన బెల్లం ఊట (లీటర్లు) : 2,30,48,401 ► సీజ్ చేసిన వాహనాలు : 29,491 ► ఇసుక అక్రమ రవాణాపై నమోదైన కేసులు : 12,211 ► అరెస్ట్ అయిన నిందితులు : 22,769 ► స్వాధీనం చేసుకున్న ఇసుక (టన్నులు) : 5,72,372 ► స్వాధీనం చేసుకున్న వాహనాలు : 16,365 ► గంజాయి సాగు, రవాణాపై నమోదైన కేసులు : 220 ► అరెస్ట్ అయిన నిందితులు : 384 ► స్వాధీనం చేసుకున్న గంజాయి (కిలోలు) : 18,686 ► 2021 మార్చి 20 నుంచి 2021 మార్చి 31 వరకు ఆపరేషన్ నయా సవేరా కింద నమోదైన కేసులు : 69 ► అరెస్ట్ అయిన వారు : 174 ► స్వాధీనం చేసుకున్న గంజాయి (కిలోలు) : 2,176 ► అవేర్నెస్ క్యాంపులు : 330 -
అటవీ ప్రాంతంలో పేకాట..
నెల్లూరు(క్రైమ్): ఓ అటవీప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 18 మందిని అరెస్టు చేసి వారినుంచి రూ.10,45,500 స్వాధీనం చేసుకున్న ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్హాల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) జేడీ కె.శ్రీలక్ష్మి మంగళవారం వివరాలను వెల్లడించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం అనంతవరం అటవీ ప్రాంతంలో పేకాట సాగుతోందన్న సమాచారం సెబ్ కమిషనర్ వినీత్‌బ్రిజ్‌లాల్, జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావుకు అందింది. వారి ఆదేశాల మేరకు జేడీ, నెల్లూరు రూరల్ డీఎస్పీ వై.హరినాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఈబీ (సెబ్) బృందం, బుచ్చిరెడ్డిపాళెం సీఐ సీహెచ్ కోటేశ్వరరావు సిబ్బందితో కలిసి ఈ నెల 20వ తేదీన పేకాట కేంద్రంపై దాడులు చేశారు. దీంతో పేకాట ఆడుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన హరిబాబు, పి.జవహర్‌ఖాన్, షేక్ జమాల్, పి.కొండయ్య, జి.బాబు, పి.సత్తిబాబు, జి.గుర్రప్ప, కె.వెంకట్రావు, గుంటూరుకు చెందిన కె.హనుమంతరావు, ఎం.తులసీకృష్ణ, ఒ.రాంబాబు, విజయవాడకు చెందిన షేక్ మౌలాలీ, డి.వరప్రసాద్, వి.సంజీవ్, పి.అర్జున్, ప్రకాశం జిల్లాకు చెందిన సీహెచ్ పిచ్చయ్య, కె.శ్రీను, ప్రొద్దుటూరుకు చెందిన వై.మల్లికార్జునను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10,45,500, 16 సెల్ఫోన్లు, తొమ్మిది బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కాగా వీరిపై త్వరలో సస్పెక్టెడ్ షీట్లు తెరవనున్నట్లు జేడీ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. పేకాట కేంద్రంపై దాడి చేసి నిందితులను అరెస్టు చేసిన సెబ్, పోలీసులను జేడీ శ్రీలక్ష్మి అభినందించారు. సెబ్ జేడీ టీమ్ ఇన్స్పెక్టర్ హుస్సేన్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
గుట్కా స్థావరంపై ఎస్ఈబీ దాడులు
నెల్లూరు (క్రైమ్): నెల్లూరులో గుట్కా స్థావరంపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున గుట్కా, ఖైనీలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఈబీ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ (ఏఈఎస్) కృష్ణకిశోర్‌రెడ్డి దాడుల వివరాలను శనివారం విలేకరులకు వెల్లడించారు. హరనాథపురం నాగసాయి దేవాలయం సమీపంలో ఉంటున్న సీహెచ్ రాజశేఖర్ అలియాస్ శేఖర్ బెంగళూరు నుంచి పెద్ద ఎత్తున నిషేధిత గుట్కాలను నెల్లూరుకు దిగుమతి చేసుకునేవాడు. అనంతరం తన సహాయకుడైన స్టోన్‌హౌస్ పేటకు చెందిన టి.ప్రసాద్ ద్వారా ఆటోలో నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని వ్యాపారులకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకొనేవాడు. ఈ వ్యవహారంపై ఎస్ఈబీ జేడీ కె.శ్రీలక్ష్మికి సమాచారం అందింది. ఆమె ఆదేశాల మేరకు శనివారం ఎస్ఈబీ నెల్లూరు–1 ఇన్స్పెక్టర్ కె.పి.కిశోర్ తన సిబ్బందితో కలిసి ముత్తుకూరు రోడ్డులోని ఆకుతోట వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. గుట్కా వ్యాపారి రాజశేఖర్ సహాయకుడు ప్రసాద్ ఆటోలో గుట్కాలు తరలిస్తుండగా ఇన్స్పెక్టర్ అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నెల్లూరు రూరల్ మండలం వడ్డిపాలెంలో గుట్కాలను నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గోదాము వెలుగులోకి వచ్చింది. దీంతో ఇన్స్పెక్టర్ గోదాముపై దాడి చేసి నిషేధిత గుట్కా, ఖైనీలను, ఆటోను స్వాధీనం చేసుకుని రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరకు విలువ బహిరంగ మార్కెట్లో రూ.25 లక్షలు ఉంటుందని ఎస్ఈబీ ఏఈఎస్ కృష్ణకిశోర్‌రెడ్డి తెలిపారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న గుట్కాలు, ఆటోను తదుపరి విచారణ నిమిత్తం నెల్లూరు రూరల్ పోలీసులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున గుట్కాలు, ఖైనీలను స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్న ఇన్స్పెక్టర్ కె.పి.కిశోర్, ఎస్ఐ ఎ.శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు ఎ.శ్రీరాములు, డి.వెంకటేశ్వర్లును ఎస్ఈబీ జేడీ కె.శ్రీలక్ష్మి అభినందించారు. -
ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా దాటించేస్తున్నారు
నెల్లూరు (క్రైమ్): ‘బస్సుకు టైం అవుతోంది. త్వరగా సరుకు సర్దుకుని బయల్దేరండి..’ ఈ హడావుడి సాధారణ ప్రయాణికులది ఎంతమాత్రం కాదు. గంజాయిని దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో ఊర్లు దాటించేస్తున్న స్మగ్లర్లది. ఆర్టీసీ బస్సంత సురక్షితం మరొకటి లేదనుకున్నారో ఏమో.. గంజాయి స్మగ్లర్లు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. అనుమానం రాకుండా మహిళలకు కమీషన్ ఆశ చూపి అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారు. తాజాగా ఆర్టీసీ బస్సుల్లో భారీగా గంజాయి పట్టుబడటంతో ఈ విషయం అర్థమవుతోంది. వివరాల్లోకి వెళితే.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు శనివారం తెల్లవారుజామున నగరంలో పలుచోట్ల వాహన తనిఖీలు నిర్వహించారు. తిరుపతి వైపు వెళ్తున్న నెల్లూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో తమిళనాడుకు చెందిన కదిరవేలు రోజా, కామాచి, ముత్తు, నాగరాజు, అనంతపురం జిల్లాకు చెందిన విజయ్‌లు గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద ఏడు బ్యాగుల్లో ఉన్న 78.24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండు సమీపంలో విజయవాడ–నెల్లూరు బస్సులో నుంచి అనుమానాస్పదంగా దిగుతున్న తమిళనాడుకు చెందిన చెల్లాదురై మణిముత్తును అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 8.610 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, బూదనం టోల్‌ప్లాజా వద్ద కాకినాడ నుంచి తిరుపతి వెళుతున్న ఆర్టీసీ బస్సును ఆపి తనిఖీలు చేయగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న కాకినాడకు చెందిన ఎం.శ్రీను, ఎ.రాజకుమారి, తమిళనాడుకు చెందిన రాణి రమేష్‌లు పట్టుబడ్డారు. వారి నుంచి 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు చోట్ల పట్టుబడిన తొమ్మిది మంది నిందితుల్లో ఆరుగురు మహిళలుండటం గమనార్హం. వీరందరూ కమీషన్ పద్ధతిపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ కె.శ్రీలక్ష్మి వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.11 లక్షలు ఉంటుందని తెలిపారు. -
కమీషన్లకు ఆశపడి కటకటాలపాలు
నెల్లూరు(క్రైమ్): కమీషన్లకు ఆశపడి గంజాయిని అక్రమ రవాణా చేస్తూ ఇద్దరు నిందితులు రాష్ట్ర స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) అధికారులకు దొరికిపోయారు. రూ.10 వేలు, రూ.30 వేలు కమీషన్లుగా ఇస్తామని చెప్పడంతో.. గంజాయిని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తూ కటకటాలపాలయ్యారు. ఇందులో ఒకరు చదువు కోసం వక్రమార్గం పట్టిన తమిళనాడు విద్యార్థి కాగా, మరొకరు ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు డబ్బులకు ఆశపడిన బెంగళూరు యువకుడు. ఈ వివరాలను గూడూరు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్.రవికుమార్ మీడియాకు వెల్లడించారు. కర్ణాటకలోని హోస్పేటకు చెందిన వి.హరీష్ అనే వ్యక్తి బెంగళూరులోని సిటీ మార్కెట్లో ఉన్న బట్టల దుకాణంలో పని చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన.. నరసింహులు అనే వ్యక్తి అతనికి డబ్బు ఆశ చూపించాడు. విశాఖ నుంచి బెంగళూరుకు గంజాయిని తీసుకువస్తే రూ.10 వేల కమీషన్ ఇస్తానని చెప్పాడు. దీంతో హరీష్ విశాఖలో గంజాయిని కొనుగోలు చేసి.. బెంగళూరుకు బస్సులో పయనమయ్యాడు. మరోవైపు బుధవారం తెల్లవారుజామున జేడీ ఇంటెలిజెన్స్ టీమ్ ఇన్స్పెక్టర్ ఆర్.నరహరి తన సిబ్బందితో కలిసి నెల్లూరులోని అయ్యప్పగుడి వద్ద ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. హరీష్ రూ.30 వేలు విలువ చేసే 6 కేజీల గంజాయితో దొరికిపోయాడు. కాలేజీ ఫీజు కోసం..! ఫీజు డబ్బుల కోసం.. గంజాయిని అక్రమంగా తరలించేందుకు తమిళనాడుకు చెందిన విద్యార్థి ఓ వ్యక్తి చేతిలో పావుగా మారాడు. చివరకు నెల్లూరు బస్టాండ్‌లో పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కపెడుతున్నాడు. తమిళనాడులోని నీలగిరి జిల్లా గుడలూరుకు చెందిన ఎం.ప్రవీణ్‌రాజ్ తిరువారూరులో ఉన్న ఏసీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చదువుకుంటున్నాడు. రూ.40 వేల ఫీజు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాడు. అతనికి కేరళకు చెందిన రహీంతో పరిచయం ఏర్పడింది. ఏపీలోని అన్నవరం నుంచి లిక్విడ్ (హాషిష్ ఆయిల్) గంజాయి తీసుకువస్తే రూ.30 వేలు కమీషన్ ఇస్తానని ప్రవీణ్‌కు రహీం చెప్పాడు. దీంతో ప్రవీణ్ అన్నవరం చేరుకొని బుచ్చి అనే వ్యక్తి వద్ద 2 కేజీల లిక్విడ్ గంజాయి కొనుగోలు చేశాడు. చెన్నైకి తీసుకెళ్తూ నెల్లూరు బస్టాండ్‌లో పోలీసులు చేస్తున్న తనిఖీల్లో పట్టుబడ్డాడు. అతని నుంచి రూ.4 లక్షలు విలువ చేసే లిక్విడ్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసిన సిబ్బందిని అధికారులు అభినందించారు. -
కంటైనర్‌లో పైన పైపులు.. కింద గంజాయి!
తణుకు: పీవీసీ పైపుల రవాణా మాటున భారీగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. విశాఖ జిల్లా పాడేరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 2 టన్నుల గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు, తణుకు సర్కిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ జయరామరాజు మీడియాకు తెలిపారు. తణుకు జాతీయ రహదారిపై మహిళా కళాశాల సమీపంలో ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా పీవీసీ పైపుల లోడుతో వెళుతున్న లారీని పోలీసులు తనిఖీ చేశారు. పైపుల కింది భాగంలో ప్రత్యేకంగా తయారుచేసిన కంటైనర్‌లో మొత్తం 85 సంచుల్లో నిషేధిత గంజాయిని గుర్తించారు. కర్నాటకలోని బీదర్ జిల్లా ఫరీదాబాద్‌కి చెందిన లారీ డ్రైవర్ రాజప్ప, గుల్బర్గా జిల్లా కుడుమూతికి చెందిన్ క్లీనర్ ఆనంద్‌లను అరెస్ట్ చేశారు. లారీతో పాటు వారి నుంచి రూ.40 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
రూ.3 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
కర్నూలు: స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తనిఖీల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. కర్నూలు మండలం పంచలింగాల రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై సెబ్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కారును తనిఖీ చేయగా అందులో రూ.10 లక్షలు, 7 కిలోల బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కారులో ఉన్న బెంగళూరుకు చెందిన అజయ్‌గాడియా, డి.ప్రకాశ్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కృష్ణా జ్యువెలర్స్ నుంచి బెంగళూరు శ్రీధర్మరాయస్వామి ఆలయ రోడ్డులోని షోవాన్ జ్యువెలర్స్‌కు తరలిస్తున్నట్టు తెలిపారు. అయితే అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ చూపకపోవడంతో వాహనంతో పాటు నగలు, నగదును సీజ్ చేశారు. అరెస్ట్ చేసిన ఇద్దరినీ కర్నూలు అర్బన్ తాలుకా పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్టు పోలీసులు చెప్పారు. -
ఎస్ఈబీ మరింత బలోపేతం
సాక్షి, అమరావతి :స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని మరింత పటిష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ మద్యం, డ్రగ్స్, ఇసుక అక్రమ రవాణా తదితర వాటిని అరికట్టేందుకు నెలకొల్పిన ఎస్ఈబీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తలపెట్టింది. ఎక్సైజ్ శాఖలో ఉన్న 31 మంది అధికారులను కొత్తగా ఎస్ఈబీకి కేటాయించింది. ఈ మేరకు ఎస్ఈబీ ముఖ్య కార్యదర్శిగా ఉన్న డీజీపీ సవాంగ్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎస్ఈబీకి కేటాయించిన వారిలో ఇద్దరు జాయింట్ కమిషనర్లు, నలుగురు డెప్యూటీ కమిషనర్లు, 9 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 16 మంది సూపరింటెండెంట్లు ఉన్నారు. -
తూర్పుగోదావరిలో ఎస్ఈబీ మెగా ఆపరేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధిక నాటుసారా తయారీ కేంద్రాలు ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో ఎస్ఈబీ ఏఎస్పీ సుమిత్ గరుడ్, ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ప్రసాద్‌ల పర్యవేక్షణలో 100 మంది సిబ్బంది 13 టీమ్‌లుగా ఏర్పడి సారా తయారీ కేంద్రాలపై పెద్ద ఎత్తున దాడులు చేశారు. మంగళవారం ఒక్క రోజే జిల్లాలోని 30 వేర్వేరు ప్రాంతాల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 67,900 లీటర్ల (రూ.13 లక్షల విలువైన) బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఇంత పెద్ద ఎత్తున బెల్లం ఊటను ధ్వంసం చేయడం ఆంధ్రప్రదేశ్‌లోనే రికార్డు. 5గురిని అరెస్టు చేశారు. 100 లీటర్ల నాటు సారాను, ఒక వాహనాన్ని స్వాదీనం చేసుకున్నారు. సారా తయారీకి సంబంధించిన సమాచారాన్ని తూర్పుగోదావరి ఎస్ఈబీ హెల్ప్‌లైన్ నంబర్ +91 9490618510కు ఫోన్ చేసి తెలియజేయాలని వినీత్ బ్రిజ్‌లాల్ సూచించారు. -
రూ.1.04 కోట్ల ఆభరణాల పట్టివేత
కర్నూలు: స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) తనిఖీల్లో భారీగా బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. కర్నూలు మండలం పంచలింగాల వద్దనున్న చెక్‌పోస్టు వద్ద బుధవారం తెల్లవారుజామున ఎస్ఈబీ సిబ్బంది హైదరాబాద్ నుంచి మధురై వెళుతోన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును తనిఖీలు చేశారు. అందులో ప్రయాణిస్తోన్న హైదరాబాద్ (తిరుమలగిరి అస్మత్పేట)కు చెందిన యశ్వంత్‌సోని, మహారాష్ట్రలోని వాజర్‌కి చెందిన నిఖిల్ రాజ్‌కుమార్ బోండే వద్ద రూ.1,04,94,132 విలువ చేసే వజ్రాలతో కూడిన బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. వీరు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్–12లోని క్రిష్ ఇంటర్నేషనల్ జ్యువెలర్స్ నుంచి బంగారు ఆభరణాలను మధురైకు తీసుకెళ్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆభరణాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ చూపకపోవడంతో నగలను సీజ్ చేసి..ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులకు అప్పగించారు. నగలను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
రూ.3.05 కోట్లు ఆదాయ పన్ను శాఖకు అప్పగింత
కర్నూలు: స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) తనిఖీల్లో పట్టుబడిన రూ.3,05,35,500 నగదును విచారణ నిమిత్తం ఆదాయపు పన్ను శాఖకు అప్పగించినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. కర్నూలు మండలం పంచలింగాల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద శుక్రవారం వాహన తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుడు బీఏ చేతన్‌కుమార్ వద్ద రెండు ట్రాలీ బ్యాగుల్లో నగదు పట్టుబడిన విషయం విదితమే. డబ్బుతోపాటు చేతన్‌కుమార్‌ను ఎస్పీ ఫక్కీరప్ప ఎదుట హాజరుపరిచారు. ఎస్పీ శనివారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ గౌతమి సాలితో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. చేతన్‌కుమార్ స్వస్థలం బెంగళూరు. చెన్నైకి చెందిన అరుణ్ అనే వ్యక్తి దగ్గర కారు డ్రైవర్‌గా పనిచేస్తూ నమ్మకం పెంచుకున్నాడు. డబ్బు మార్పిడి కోసం ఈ ఏడాది మార్చి 28న విమానంలో బెంగళూరు నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌కు చేతన్‌కుమార్‌ను అరుణ్ పంపించాడు. రాయగఢ్‌కు చేరుకుని త్రీస్టార్ హోటల్ శ్రేష్ఠలో పది రోజుల పాటు ఉన్నాడు. అక్కడ కొంతమంది అతన్ని కలిసి పెద్ద మొత్తంలో నగదు అప్పగించారు. దాన్ని తీసుకుని ఈ నెల 8న రాయగఢ్ నుంచి విలాస్‌పూర్‌కు వెళ్లాడు. నగదు మార్పిడి పని జరగకపోవడంతో తిరిగి రాయపూర్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ వాహనంలో హైదరాబాద్‌కు వచ్చాడు. తర్వాత బెంగళూరుకు ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరాడు. ఈ క్రమంలో కర్నూలు శివారులోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో పట్టుబడ్డాడు. చెన్నైలోని రామచంద్ర మెడికల్ కళాశాలకు చెందిన వారి డబ్బు అంటూ దర్యాప్తులో చేతన్‌కుమార్ తెలిపాడని, అయితే అందుకు సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో కర్నూలు అర్బన్ తాలూకా పోలీసు స్టేషన్లో సీఆర్పీసీ సెక్షన్ 102 కింద కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. గత మూడు నెలల కాలంలో ఇక్కడ రూ.8 కోట్ల నగదు, 25 కిలోల బంగారు, 12 కిలోల వెండి, 500 గ్రాముల వజ్రాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించిన తరువాతనే పట్టుపడిన నగదు, నగలు తిరిగి యజమానులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
‘మత్తు’ వదిలిస్తున్న ‘ఆపరేషన్ నయా సవేరా’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్ల తరబడి ఉన్న మాదకద్రవ్యాల ‘మత్తు’ వదిలించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) రంగంలోకి దిగింది. గంజాయి తదితర మాదకద్రవ్యాల నిరోధానికి ‘ఆపరేషన్ నయా సవేరా’ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో సమాజంలో మాదకద్రవ్యాలు రుగ్మతగా మారాయి. దీంతో ఈ మహమ్మారిని నిర్మూలించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ సూచనల మేరకు ఎస్ఈబీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని కట్టడి చేసేందుకు పైలట్ ప్రాజెక్టుగా ‘ఆపరేషన్ నయా సవేరా’ పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తృత కార్యక్రమాలు చేపట్టారు. గతనెల 25 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన విస్తృత దాడుల్లో గుంటూరు జిల్లాలో 22 కేసులు నమోదు చేసి 44 మందిని అరెస్టు చేయడంతోపాటు 59.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లాతోపాటు విజయవాడ నగరంలో 10 కేసులు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేసి 19 కిలోల గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. గతనెల 29న గుంటూరు అర్బన్, విజయవాడలో ఎస్ఈబీ బృందాలు దాడులు నిర్వహించి 4 గ్రాముల ఎండీఎంఏ (సింథటిక్ డ్రగ్స్) స్వాధీనం చేసుకుని నలుగురుని అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 174 మందిపై 69 కేసులు నమోదు చేసి 2,176 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలపై ఫోకస్ గంజాయి ఇతర మాదకద్రవ్యాలను అరికట్టేందుకు పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ ‘సాక్షి’కి చెప్పారు. ఈ రెండు జిల్లాల్లోను క్షేత్రస్థాయిలో 179 కార్యక్రమాలు నిర్వహించి 24 వేలమందికి అవగాహన కలి్పంచినట్టు తెలిపారు. డ్రగ్స్ ప్రమాదంపై ర్యాలీలు, సదస్సులు, హోర్డింగ్‌ల ఏర్పాటు చేశామన్నారు. మత్తు పదార్థాల గురించి తెలిస్తే కంట్రోల్ రూమ్‌లకు సమాచారం అందించాలని ఆయన కోరారు. చదవండి: పరువు కోల్పోయేకంటే ఇదే బెటర్.. జగనన్నను కలిశాకే.. ఈ కాళ్లకు చెప్పులు -
రెండు రోజుల్లో 202 కేసులు
సాక్షి, అమరావతి: ‘సాక్షి’ వరుస కథనాలతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ‘కాటు సారా’, ‘హద్దులు లేవు–అక్రమాలకు కేరఫ్ ఆంధ్రా ఒడిశా బోర్డర్’ నిఘా కథనాలను వెలుగులోకి తేవడంతో ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ స్పందించి రాష్ట్రంలో నాటుసారా తయారీ కేంద్రాలను నిర్మూలించేలా అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా నాటు సారా కేంద్రాలపై విస్తృత దాడులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్ఈబీ డైరెక్టర్ పీహెచ్డీ రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ► గత రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 202 కేసులు నమోదు చేశారు. 2,141.8 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. సారా తరలించేందుకు వినియోగించిన 16 వాహనాలను సీజ్ చేశారు. ► సారా తయారీ కేంద్రాల వద్ద 88,065 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ► ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 788 లీటర్ల సారా, 41,500 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక సారా తయారీ కేంద్రాలు ఇక్కడి ఏజెన్సీ, గోదావరి లంకలు, కోరంగి మడ అడవుల్లో ఉండటంతో ఎస్ఈబీ ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆ తర్వాత పశ్చిమ గోదావరి, చిత్తూరు, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం నాటుసారా తయారీ కేంద్రాలపై ఎస్ఈబీ కొరడా ఝుళిపించింది. -
నాటు సారా కేంద్రాల నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నాటు సారాను అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. సారా తయారీ కేంద్రాలను గుర్తించేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ‘కాటు సారా’, ‘హద్దులు లేవు.. అక్రమాలకు కేరాఫ్‌గా ఆంధ్రా ఒడిశా బోర్డర్’ అనే శీర్షికలతో ‘సాక్షి’ ప్రచురించిన కథనాలపై ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ స్పందించారు. 18 పోలీస్ యూనిట్లకు చెందిన ఎస్ఈబీ ఏఎస్పీలతో సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. సీఎం వైఎస్ జగన్ ఆశయం, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలకు అనుగుణంగా నాటు సారా, గంజాయి, మాదక ద్రవ్యాలతో పాటు ఇసుక అక్రమాలపై మరింత దృష్టి సారించాలని వినీత్ బ్రిజ్‌లాల్ ఆదేశించారు. ప్రజల ప్రాణాలు తీస్తున్న సారాను పూర్తిగా నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని.. గ్రామాల్లో ఉన్న ఇన్ఫార్మర్స్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 191 మండలాల్లో మొత్తం 682 నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించినట్లు చెప్పారు. ఇవి కాకుండా ఇంకా ఎక్కడెక్కడ సారా తయారీ కేంద్రాలు ఉన్నాయో నిఘా వర్గాలు, ఇన్ఫార్మర్స్ ద్వారా జల్లెడ పట్టాలని ఆదేశించారు. ఇప్పటికే దాదాపు 10,000 మంది ఇక సారా తయారు చేయబోమని చెప్పారని.. ఇంకా ఎవరైనా ఉంటే నయానో, భయానో చెప్పి సారా తయారీని మాన్పించాలని సూచించారు. నవోదయం, పరివర్తన వంటి కార్యక్రమాల ద్వారా వారికి అవగాహన కల్పించాలని.. అప్పటికీ మారకపోతే పీడీ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడవద్దని ఆదేశాలిచ్చారు. సారా తయారీ, రవాణాపై నిరంతరం నిఘా వేసి ఉంచాలని.. ఏ మాత్రం ఏమరుపాటు వద్దని ఆదేశించారు. జక్కరవలసలో 1,280 లీటర్ల బెల్లం ఊట కేన్లను పట్టుకున్న ఎస్ఈబీ సిబ్బంది శ్రీకాకుళంలో కొనసాగిన దాడులు.. ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశమైంది. సరిహద్దులపై ఎస్ఈబీ అధికారులు మరింత దృష్టి సారించారు. దాడులు చేయడమే కాకుండా.. అవగాహన కల్పించడం ద్వారా కూడా మార్పు తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పాతపట్నం మండలం బొమ్మికలో, కంచిలి మండలం పి.సాసనం గ్రామంలో ఎస్ఈబీ అ«ధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు సీతంపేట మండలం జక్కరవలస పరిసర ప్రాంతాల్లో ఎస్ఈబీ సిబ్బంది సోమవారం దాడులు చేసి 1,280 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. మెళియాపుట్టి మండలం సవరమర్రిపాడులో 600 లీటర్లు, కొత్తూరు మండలంలో జక్కరగూడ, బొడ్డగూడలో 750 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. పలాసలో నాటు సారాను, రాజాం, కోటబొమ్మాళి, పొందూరులో నాన్ పెయిడ్ డ్యూటీ వైన్‌ను పట్టుకుని సీజ్ చేశారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా వేసినట్లు ఎస్ఈబీ ఏఎస్పీ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. -
గరళాన్ని కాస్తున్న గోదారి లంకలు
హలో సార్...ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు తూర్పు గోదావరి జిల్లా ఎస్ఈబీ ఏఎస్పీ సుమిత్ సునీల్ గర్డ్ ఫోన్ రింగ్ అయింది. హలో చెప్పండి.. సార్.. నేను ప్రత్తిపాడు మండలంలోని తోటపల్లి గ్రామ వలంటీర్‌ను.. ఓకే.. చెప్పండి.. సార్.. మా ఊర్లో పెద్ద ఎత్తున నాటుసారా కాచి వేలాది లీటర్లను పీపాల్లో పెట్టి భూమిలో పాతి నిల్వ చేశారు సార్.. సరే నేను చూస్తాను.. అంటూ ఏఎస్పీ ఫోన్ కట్ చేశారు. వెంటనే కాకినాడ డీఎస్పీ ప్రసాద్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అక్కడి నుంచి యాక్షన్ టీమ్ రంగంలోకి దిగింది. తోటపల్లి గ్రామ వలంటీర్ అందించిన సమాచారం నిజమేనని నిర్ధారించుకున్నారు. ఉదయం 7.50 గంటలకు ఎస్ఈబీ టీం తోటపల్లి ఫారెస్ట్‌లో కూంబింగ్ మొదలు పెట్టింది. 10 గంటలకు 112 సారా ఊట పీపాలను గుర్తించింది. 10.05 గంటలకు డీఎస్పీ ప్రసాద్.. సిబ్బందితో బయలు దేరారు. గంటన్నరపాటు ప్రయాణించి తోటపల్లికి చేరుకున్నారు. అక్కడ 20 నిమిషాలకు పైగా అడవిలో కాలినడకన ముందుకు సాగి.. సారా డంప్ ఉన్న చోటుకు చేరారు. 22,400 లీటర్ల ఊటను వెలికి తీసి ధ్వంసం చేశారు. ఆదివారం అయినప్పటికీ ఎస్ఈబీ టీం 8 గంటలపాటు శ్రమించి సారా బట్టీలు, బెల్లం ఊటను ధ్వంసం చేసింది. ఇలా ప్రతిరోజూ గోదారి లంక గ్రామాల్లో జల్లెడ పడుతూ.. నాటు సారా బట్టీలను ఎస్ఈబీ బృందాలు ధ్వంసం చేస్తున్నాయి. గోదావరి లంకలు.. సముద్ర తీరంలోని ఇసుక తిన్నెలు.. కొల్లేరు దిబ్బలు.. సెలయేటి గట్లు.. పిల్ల కాలువ మాటున బట్టీలు పెట్టి రాత్రిళ్లు నాటు సారా కాస్తున్నారు. దాన్ని ఇసుక తిన్నెలు, గడ్డివాముల్లో కప్పిపెడుతున్నారు. డిమాండ్ మేరకు గ్రామాల్లోకి తరలించి పగటి పూట అమ్మకాలు సాగిస్తున్నారు. అక్రమార్జన కోసం కొందరు ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. నీటిలో బెల్లం కలిపి దాన్ని పులియబెడతారు. దాంట్లో అమ్మోనియా, యూరియా, ఈస్ట్.. కిక్కు కోసం మసాలా దినుసులు, ఎండు మిర్చి, స్పిరిట్, యాసిడ్ వంటి వాటిని కలిపి వేడి చేసి, సారా తయారు చేస్తారు. ఎక్కడికక్కడ గ్రూపులుగా సారా తయారీ సాగుతోంది. ఇదొక మాఫియాగా పరిణమించడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) దాడులు ముమ్మరం చేసింది. జనం గొంతులో గరళం నింపుతున్న ‘నాటు సారా’పై వేటు వేస్తోంది. -ఇర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి, అమరావతి కాపు సారా బడుగు జీవుల బతుకులను కాటేస్తోంది. తాగుడుకు బానిసలైన అనేక మంది నాటు సారా తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో 2010లో కల్తీ సారాకు 21 మంది బలయ్యారు. అంబాజీపేట మండలం మొసలపల్లి, జి.అగ్రహారం, అమలాపురం మండలం పాలగుమ్మి, బండారులంక గ్రామాలకు చెందిన పేదలు కల్తీ సారాతో మృత్యువాత పడటం అప్పట్లో సంచలనం రేపింది. అదే ఏడాది కృష్ణా జిల్లా మైలవరంలో 17 మంది నాటు సారాకు బలయ్యారు. 2013లో ఆలమూరు మండలం మడికి శివారు ప్రాంతం నాగులపేటకు చెందిన సీతెన రాజబాబు (59) కల్తీ సారా తాగి మృత్యువాతపడ్డాడు. సారా మహమ్మారిని తరిమికొట్టాలంటూ రంగంపేట మండలం మర్రివాడలో గతంలో యువత ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోను మహిళలు అప్పట్లో సారా వ్యతిరేక ఉద్యమాలు చేశారు. గత సర్కారు హయాంలో ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు ప్రజలు ఫిర్యాదు చేశారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. బైండోవర్లు.. రౌడీషీట్లు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలను సాకారం చేసే దిశగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 18 పోలీస్ యూనిట్ల ద్వారా పక్కా కార్యాచరణతో, ఒక్కో యూనిట్లో ఒక్కో ఐపీఎస్ అధికారి(ఏఎస్పీ)కి బాధ్యతలు అప్పగించడం ద్వారా ముందుకు సాగుతోంది. గ్రామాల్లో నాటుసారా కట్టడికి ‘నవోదయం’ పేరుతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ (కార్యాచరణ) అమలులోకి తెచ్చింది. సారా తయారీ, అక్రమ మద్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించే కొరియర్ (వేగుల) వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నాటు సారా తయారీ కేంద్రాల లెక్కలు తేల్చింది. అవి ఎక్కడ.. ఎన్ని ఉన్నాయి? ఎవరు తయారు చేస్తున్నారు? తదితర వివరాలను ఎస్ఈబీ ప్రత్యేక బృందాలు సేకరించాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 79 పోలీస్ స్టేషన్ల పరిధిలో 191 మండలాల్లో మొత్తం 682 నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించారు. వాటిలో భారీగా సారా తయారు చేస్తున్నవి 141, ఒక మోస్తరువి 249, తక్కువ మోతాదువి 292 కేంద్రాలు ఉన్నట్టు తేల్చారు. రాష్ట్రంలో నేర చరిత్ర ఉన్న పది వేల మందిని ఇకపై సారా తయారు చేయబోమంటూ హామీ ఇచ్చేలా బైండోవర్ చేశారు. ఎంత చెప్పినా వినకుండా సారా తయారీ వీడని 1500 మందిపై రౌడీషీట్లు తెరిచారు. ఆరుగురిపై పీడీ యాక్ట్‌లు పెట్టారు. సమన్వయం.. సామాజిక పరివర్తన లాఠీకి పని చెప్పినా వినని వారికి లౌక్యంతో మంచి మాటలు చెప్పి దారికి తెస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని సామాజిక చైతన్యాన్ని తేవడంలో పోలీసులు చేస్తున్న కొత్త ప్రయోగం వారిలో ‘పరివర్తన’ తెస్తోంది. ఇలా రాష్ట్రంలో 436 కుటుంబాల్లో మార్పు తెచ్చారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తొలి జిల్లాగా కృష్ణా జిల్లా రాష్ట్రానికి రోల్ మోడల్‌గా నిలిచింది. 5 లక్షల లీటర్లకుపైగా సారా స్వాధీనం రాష్ట్రంలో ఎస్ఈబీ ఏర్పాటైన గతేడాది మే నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు నాటు సారా తయారీ, రవాణా, అమ్మకాలపై దాడులు నిర్వహించిన పోలీసులు పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశారు. 5,00,482 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 1,26,26,673 లీటర్ల బెల్లపు ఊట (సారా తయారీకి ఉపయోగించేది) ధ్వంసం చేశారు. 38,595 కేసుల్లో 32,372 మందిని అరెస్టు చేశారు. 4,653 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఆదివారం 200 మందితో కూడిన 12 ఎస్ఈబీ ప్రత్యేక బృందాలు 35 వేల లీటర్లకు పైగా నాటు సారా ఊటను ధ్వంసం చేశాయి. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో దశల వారీ మద్య నియంత్రణ కోసం అనేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రజారోగ్యాన్ని దెబ్బతీసి, ప్రాణాల మీదకు తెచ్చే నాటుసారా విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఎస్ఈబీ అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నప్పటికీ, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించాలి. – డి.గౌతమ్ సవాంగ్, డీజీపీ సారా తయారు చేస్తే పీడీ యాక్ట్ సారా తయారీ మానకుంటే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతాం. రౌడీషీట్లు తెరుస్తాం. అయినా సారా తయారీ మానకపోతే వారి ఆస్తుల జప్తునకు చర్యలు తీసుకుంటాం. పట్టుబడిన వారిని వెంటనే రిమాండ్‌కు పంపించేలా జ్యుడిషియల్ వ్యవస్థను సంప్రదిస్తున్నాం. నిఘా తీవ్రతరం చేశాం. మొబైల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. ఇన్ఫార్మర్లు, ఆ«ధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం. – వినీత్ బ్రిజ్‌లాల్, కమిషనర్, ఎస్ఈబీ ‘పరివర్తన’కు ప్రయత్నిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సారా తయారీదార్లు, తయారు చేస్తున్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. తయారీదార్లలో మార్పు తెచ్చేందుకు డీఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశాం. వారికి నయానా, భయానా నచ్చజెప్పి సారా జోలికి పోకుండా ‘పరివర్తన’ తెచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. – పీహెచ్డీ రామకృష్ణ, డైరెక్టర్, ఎస్ఈబీ సామాజిక బాధ్యతలో గర్వంగా ఉంది ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో మేము భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. నాటుసారా తయారీ నిలిపి వేసే కుటుంబాలకు ఉపాధి చూపించడంలో భాగంగా ఒక్క కృష్ణా జిల్లాలోనే 170 కుటుంబాలకు చెందిన యువతకు అవుట్ సోర్సింగ్ సంస్థ ద్వారా ఉద్యోగాలు ఇప్పించాం. – పామర్తి గోపీచంద్, చైర్మన్, పీవీఎన్నార్ సంస్థ సారా జోలికి పోకుండా ఉద్యోగం ఇప్పించారు చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలోని లంబాడీ తండాలోని చాలా కుటుంబాలకు దశాబ్దాల తరబడి నాటు సారా తయారీయే జీవనాధారం. ఎంటెక్, బీటెక్, డిగ్రీ, ఇంటర్ చదివిన మా తరం యువతకు చాలా మందికి ఉద్యోగావకాశాలు రావడం లేదు. దీంతో మేము ఉపాధి కోసం మళ్లీ నాటుసారా తయారీ జోలికి పోకుండా పోలీసులు మాకు అవగాహన కల్పించి చైతన్యం తెచ్చారు. నాకు ఠాకూర్ ఆక్వా ఇండస్ట్రీస్‌లో ఉద్యోగం ఇప్పించారు. – బుక్యా శ్యామ్ సుందర్ సారా ప్రాణం తీస్తుంది.. సారా తయారీదారులు కిక్కు కోసం అనేక ప్రమాదకరమైన సరుకులు వాడుతున్నారు. కిక్కు కోసం, ఘాటు కోసం వాడే ఆ పదార్థాల వల్ల మనిషి గొంతు నుంచి జీర్ణాశయం వరకు దెబ్బతింటోంది. లివర్ సంబంధమైన అనేక తీవ్ర వ్యాధులతో ప్రాణాలు పోయే వరకు దారితీస్తోంది. కిక్కు కోసం అనేక మంది వ్యసనపరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వారి కుటుంబాలను దిక్కులేని వారుగా చేస్తున్నారు. – బి.దుర్గాప్రసాద్, ప్రభుత్వ వైద్యాధికారి, భీమవరం -
గసగసాల సాగు వెనుక డ్రగ్ మాఫియా!
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం మాలెపాడులో గసగసాల (ఓపియం పాపీ సీడ్స్) సాగు వెనుక డ్రగ్ మాఫియా హస్తమున్నట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అనుమానిస్తోంది. దాని మూలాలను కనుగొనేందుకు దర్యాప్తు చేపట్టిన ఎస్ఈబీ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించింది. పక్కా సమాచారం మేరకు చిత్తూరు జిల్లా ఎస్ఈబీ అదనపు ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాలతో ఆదివారం మాలెపాడులో నిషేధిత గసగసాల సాగును గుర్తించి ధ్వంసం చేశారు. ఇందుకు బాధ్యులైన నాగరాజు, లక్ష్మన్న, సోమశేఖర్ అనే వారిని అదుపులోకి తీసుకుని విచారించిన ఎస్ఈబీ వారినుంచి అనేక కీలక విషయాలను రాబట్టింది. నిషేధిత డ్రగ్స్ తయారీకి ఉపయోగించే గసగసాల పంట సాగు చేస్తున్న ఆ ముగ్గురిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) యాక్ట్–1985 కింద కేసులు నమోదు చేసినట్టు ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ సోమవారం చెప్పారు. లోతైన దర్యాప్తు కోసం ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తోటల్లో అంతర పంటగా.. చిత్తూరు జిల్లాలోని మామిడి, టమాట తోటల్లో అంతర పంటగా గసగసాలను సాగు చేయడం విస్తుగొల్పుతోంది. నాగరాజు అనే రైతు తన మామిడి తోటలో సుమారు 10 సెంట్ల స్థలంలో విద్యుత్ తీగలతో మూడంచెల కంచె ఏర్పాటు చేసి 15 వేలకుపైగా గసగసాల మొక్కలను సాగు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇంకా ఎక్కడన్నా సాగు జరుగుతుందేమోనని ఎస్ఈబీ దృష్టి సారించింది. మార్ఫిన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ వంటి డ్రగ్స్‌లో ఉపయోగించే గసగసాల సాగుపై నిషేధం ఉంది. పలు వురు అధిక సంపాదన కోసం ఎవరికీ అనుమానం రాకుం డా అల్లనేరేడు, మొక్కజొన్న, టమాట తోటల్లో అంతర పంటగా దీన్ని సాగు చేస్తున్నారు. ఇది డ్రగ్ మాఫియా పనే మత్తు పంట గసగసాల సాగుకు మన దేశంలో అనుమతి లేదు. కేంద్ర ప్రభుత్వ ఔషధ తయారీ సంస్థ అనుమతులు పొందిన చోట్ల మాత్రమే పరిమితులకు లోబడి సాగు చేస్తారు. ఆ పంటను ప్రభుత్వ యంత్రాంగమే సేకరించి వైద్యపరమైన మత్తుమందులకు వినియోగిస్తారు. చివరగా వచ్చే గసగసాలను వంటింటి వినియోగం కోసం మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఈ విషయంలో అడుగ డుగునా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పకడ్బందీ విధానాన్ని అమలు చేస్తారు. కొన్ని రహస్య ప్రాంతాల్లో గసగసాల పంటను రైతులతో సాగుచేయించి డ్రగ్ మాఫియా కాసులు దండుకుంటోంది. ఈ మొక్క నుంచి గసగసాలతో పాటు కాయ నుంచి జిగురు, బెరడును కూడా సేకరిస్తారు. కాయ ఏపుగా పెరిగినప్పుడు దానిపై బ్లేడ్లతో గాట్లు పెట్టి అందులోంచి వెలువడే జిగురును సేకరిస్తారు. దీన్ని కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ తయారీకి ఉపయోగిస్తారు. చిత్తూరు జిల్లాలో గసగసా లను రహస్యంగా సాగు చేయిస్తున్న డ్రగ్స్ మాఫియా వాటి కాయలను, బెరడును సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక కేంద్రంగా స్మగ్లింగ్ కర్ణాటకలోని కోలారు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు ప్రాంతాల్లో బెంగళూరు ముఠాకు చెందిన ఏజెంట్లు ఉన్నట్టు ఎస్ఈబీ అధికారులు గుర్తించారు. వారి వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులను పట్టుకునే పనిలోఎస్ఈబీ ప్రత్యేక బృందం దృష్టి పెట్టింది. ఈ దందా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా హస్తమున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఎవరూ సాగు చేయొద్దు డబ్బులకు ఆశపడి రైతులెవరూ గసగసాల సాగు చేయొద్దు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్ అంధకారం అవుతుంది. గసగసాల సాగు చేసినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా, అమ్మినా తీవ్రమైన నేరమవుతుంది. అలాంటి వారిపై కఠినమైన నాన్–బెయిలబుల్ కేసులు నమోదవుతాయి. దోషులకు పదేళ్ల జైలు శిక్ష తప్పదు. – వినీత్ బ్రిజ్‌లాల్, ఎస్ఈబీ కమిషనర్ -
అక్రమ మద్యం విక్రయిస్తూ పట్టుబడిన అధ్యాపకులు
సత్తెనపల్లి: అధ్యాపకులు సైతం తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తూ అధికారులకు దొరికిపోయారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) సీఐ ఈడె మారయ్యబాబు తెలిపిన వివరాలు.. సౌత్ సెంట్రల్ రైల్వే క్యాంటీన్ వర్కర్ రావూరి సాయికృష్ణ, పట్టణంలోని ఎస్వీఆర్ డిగ్రీ కళాశాల కామర్స్ అధ్యాపకుడు పొందుగల శ్రీనివాసరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ గంటా శ్రీనివాసరావు, వంట మాస్టార్ షేక్ వలీ ఒక బృందంగా ఏర్పడి నిత్యం రైల్లో తెలంగాణ మద్యం తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నారు. ముందస్తు సమాచారం ప్రకారం సెబ్ అధికారులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. పట్టణంలో రెండు ద్విచక్ర వాహనాల్లో మద్యం సీసాలు పెట్టుకుని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
ఎస్‌ఈబీకీ ‘ఎక్సైజ్’ అధికారాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణా, జూదం, డ్రగ్స్, గంజాయి వంటి వంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ)కి ప్రభుత్వం అదనపు అధికారాలను కట్టబెట్టింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌భార్గవ్ (ఎక్సైజ్), ఎక్స్అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ గౌతమ్ సవాంగ్(డీజీపీ) మంగళవారం వేర్వేరుగా ఉత్తర్వులిచ్చారు. ఏపీ ఎక్సైజ్ యాక్ట్–1968, ఏపీ ప్రొహిబిషన్ యాక్ట్–1995, ఎన్డీపీఎస్ యాక్ట్–1985లోని పలు సెక్షన్ల ప్రకారం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖకు గల పలు అధికారాలు ఇకపై ఎస్ఈబీకి కూడా ఉంటాయి. అక్రమ మద్యం, సారాను, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం, ధ్వంసం చేయడం, వేలం వేయడం తదితర అన్ని అధికారాలను ఎస్ఈబీకి అప్పగిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇటీవల వరకు ఎస్ఈబీ స్వాధీనం చేసుకున్న 2.8 లక్షల లీటర్ల మద్యం విషయంలోనూ ఎస్ఈబీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని చర్యలు చేపట్టేలా అధికారం ఇచ్చారు. ‘గనుల’ అధికారాలు కూడా.. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా భూగర్భ గనుల శాఖకు ఉండే అధికారాలను ఎస్ఈబీకి కూడా ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం (ఎంఎండీఆర్)–1957లోని నిబంధనలను సవరించింది. కోర్టుల్లో కేసులు పెట్టాలంటే ఇçప్పుడున్న ఎంఎండీఆర్ నిబంధనల ప్రకారం భూగర్భ గనుల శాఖ అధికారులకే అధికారం ఉంది. ఇప్పుడు ఎస్ఈబీ అధికారులకు కూడా ఈ అధికారాలను కల్పిస్తూ ప్రభుత్వం కొత్త నిబంధనలను చేర్చింది. దీని ప్రకారం ఎస్ఈబీ అధికారులు కూడా ఇసుక క్వారీలను తనిఖీ చేయవచ్చు. క్వారీ పరిమాణాన్ని కొలతలు వేయవచ్చు. ఏ క్వారీలో అయినా ఇసుక పరిమాణాన్ని తూకం, కొలత వేయించవచ్చు. రికార్డులు, రిజిష్టర్, పత్రాలు తనిఖీ చేయవచ్చని భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది మంగళవారం ఉత్తర్వులిచ్చారు -
ఇసుక, మద్యం అక్రమాలకు ఆస్కారం ఇవ్వొద్దు
మద్యం, ఇసుక, ఇతర అక్రమాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడులు ఉధృతం చేయాలి. సరిహద్దు రాష్ట్రాల నుంచి వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యంపై కచ్చితంగా దృష్టి పెట్టాలి. రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం రాకుండా గట్టి చర్యలు చేపట్టాలి. సాక్షి, అమరావతి: ఇసుక, మద్యం విషయంలో ఎక్కడా అక్రమాలకు ఆస్కారం ఉండకూడదని, అక్రమ రవాణా చేసిన వారిపై ఉక్కుపాదం మోపాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. అక్రమాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిని ఉపేక్షించవద్దని, వ్యవస్థీకృతంగా అవినీతికి అవకాశం ఉండకూడదని స్పష్టం చేశారు. మద్యం, ఇసుక అక్రమాల నిరోధానికి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) పనితీరుపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏదైనా సమాచారం రాగానే దానిపై కచ్చితంగా దృష్టిపెట్టి పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవస్థీకృతంగా ఎస్ఈబీలో అవినీతికి ఆస్కారం ఉండకూడదని, ఎక్కడైనా తప్పులు జరిగాయన్న సమాచారం రాగానే కచ్చితంగా దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పుడున్న వారే కాకుండా సమర్థత, నిజాయితీపరులైన అధికారులకు ఎస్ఈబీలో స్థానం కల్పించాలని సూచించారు. ఇందులో పని చేసే వారికి ఇన్సెంటివ్‌లు కూడా ఇచ్చి ప్రోత్సహించాలని, ఎస్ఈబీకి కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. ఎస్ఈబీ పనితీరుపై ప్రతివారం సమావేశమై సమీక్ష నిర్వహించాలని, వచ్చే 15 రోజుల్లో కచ్చితంగా మెరుగైన ఫలితాలు రావాలన్నారు. ఇందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డీజీపీ డి.గౌతమ్ సవాంగ్, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ ఎస్ఈబీ పురోగతి ► స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఏర్పాటైన గతేడాది మే 16వ తేదీ నుంచి ఇప్పటి వరకు సాధించిన పురోగతిని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► మద్యం అక్రమాలపై 79,632 కేసులు నమోదు. 4,85,009 లీటర్ల మద్యం, 12,766 లీటర్ల బీరు, 4,54,658 లీటర్ల నాటుసారా పట్టివేత. 1,12,70,123 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం. 2,85,142 కేజీల నల్లబెల్లం, 22,715 వాహనాలు స్వాధీనం. మద్యం అక్రమాలకు పాల్పడ్డ 240 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కూడా కేసులు నమోదు. ► ఇసుక అక్రమాలపై 7,244 కేసులు నమోదు. 4,79,692 టన్నుల ఇసుక స్వాధీనం. 9,689 వాహనాలు సీజ్. ► ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడ్డ 22 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు. మద్యం, ఇసుక అక్రమాలకు పాల్పడ్డ 82 మంది పోలీసులపై కూడా కేసులు నమోదు. ► ఇతర అక్రమాలపైనా ఎస్ఈబీ కొరడా ఝళిపించింది. 1,00,979 కేజీల గంజాయి, 90,97,628 గుట్కా ప్యాకెట్లు, 1,120 ఎర్రచందనం దుంగలు పట్టివేత. పేకాట శిబిరాలపై దాడులు.. రూ.4.92 కోట్లు స్వాధీనం. -
దూకుడు పెంచిన ఎస్ఈబీ
సాక్షి, అమరావతి: మద్యం, ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మరింత దూకుడు పెంచింది. గడచిన పది రోజులుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నది. గత నెల 23వ తేదీ నుంచి ఈ నెల 2వ తేదీ వరకు నిర్వహించిన దాడులు, కేసుల వివరాలను ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ మంగళవారం వెల్లడించారు. రాష్ట్రంలోని 18 పోలీస్ యూనిట్లలో ఎన్నికల కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఎస్ఈబీకి చెందిన ఏఎస్పీలకు నోడల్ ఆఫీసర్లుగా బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు 11,034 మందిని బైండోవర్ చేశారు. మద్యం, నగదు తరలిస్తున్న వారిని గుర్తించి 1,728 కేసులు నమోదు చేసి 1,262 మందిని అరెస్టు చేశారు. సోమవారం రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మెరుపు సోదాలు నిర్వహించారు. 39 మందిని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద 3.799 కిలోల బంగారు ఆభరణాలు, 3.42కిలోల బంగారం, 439.11 కెరట్స్ వజ్రాలను స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2.47కోట్లు ఉంటుంది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ఎగువపల్లి చెక్‌పోస్టు వద్ద కారులో రూ.30 లక్షలు తరలిస్తుండగా పట్టుకుని సీజ్ చేశారు. కర్నూలు జిల్లాలో మరొక ప్రాంతంలో రూ.36.5లక్షలను సీజ్ చేశారు. ఎస్ఈబీ ప్రత్యేక బృందాల దాడుల్లో 10,137 లీటర్ల నాటుసారా , 5,068 లీటర్ల మద్యం, 2,981 లీటర్ల బీరును స్వాదీనం చేసుకున్నారు. -
మద్యం, డబ్బు పంపిణీకి అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: పార్టీలకు అతీతంగా జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీని అడ్డుకునేందుకు స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో(ఎస్ఈబీ) ఏర్పాట్లు చేసింది. స్టేట్ కంట్రోల్ రూమ్‌తో పాటు రాష్ట్రంలోని 18 పోలీస్ యూనిట్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఎలక్షన్ కంట్రోల్ రూమ్‌ల వివరాలను ఎస్ఈబీ కమిషనర్ వినీత్‌బ్రిజ్‌లాల్ వెల్లడించారు. అన్ని యూనిట్లలోనూ ఎస్ఈబీ ప్రత్యేకాధికారులుగా ఉన్న ఏఎస్పీలు కంట్రోల్ రూమ్‌లను పర్యవేక్షిస్తారు. ఎప్పటికప్పుడు గ్రామాల నుంచి వచ్చిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపుతారు. పోలీస్, ఎక్సైజ్, మైనింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీని అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపడతారు. రాష్ట్ర కంట్రోల్ రూమ్ నంబర్: 94910 30853, 0866 2843131తో పాటు జిల్లాల్లోని ఫోన్ నంబర్ల వివరాలు.. -
డబ్బు.. మద్యం పంపిణీకి చెక్ పెట్టేలా..
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహానికి చెక్ పెట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) రంగంలోకి దిగింది. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్, ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ప్రత్యేక కార్యాచరణ మొదలైంది. రాష్ట్రంలోని 18 పోలీస్ యూనిట్ల పరిధిలో.. ఏఎస్పీల నేతృత్వంలో ఎస్ఈబీ టీమ్‌లు డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు కృషి చేస్తాయి. పోలీస్, ఎక్సైజ్, మైనింగ్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ స్పెషల్ టీమ్‌లు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాయి. రాష్ట్ర స్థాయిలోను, 18 పోలీస్ యూనిట్ల పరిధిలో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి కంట్రోల్ రూమ్‌లో సీఐ నేతృత్వంలో ఒక ఎస్సై, సిబ్బంది విధులు నిర్వహిస్తారు. డబ్బు, మద్యం పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని ప్రజలు కంట్రోల్ రూమ్‌లకు తెలియజేయవచ్చు. ఈసీఎంఎస్ యాప్‌తో పర్యవేక్షణ డబ్బు, మద్యం పంపిణీ.. వాటి రవాణాకు సంబంధించిన ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ చేపట్టేందుకు ప్రత్యేకంగా ఎక్సైజ్ కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈసీఎంఎస్) యాప్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు ఆన్లైన్ సిస్టమ్, వాట్సాప్, కంట్రోల్ రూమ్ తదితర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఫిర్యాదులపై ఎంతవరకు చర్యలు తీసుకున్నారు, చర్యలు తీసుకోకపోతే కారణాలేమిటి, దాడులు చేసిన ఫలితాలు తదితర అన్ని వివరాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. వీటిపై ప్రతిరోజూ ఉదయం రాష్ట్రస్థాయి అధికారులతో మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలోను, జిల్లాల స్థాయిలోను వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అనంతరం అన్ని జిల్లాల ఎస్ఈబీ టీమ్‌లతో టెలీ కాన్ఫరెన్స్‌లో తక్షణ ఆదేశాలిస్తున్నారు. రంగంలోకి టాస్‌్కఫోర్స్ టీమ్‌లు మద్యం, డబ్బు రవాణా, పంపిణీలకు అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఈబీ నేతృత్వంలో ప్రత్యేకంగా 12 టాస్‌్కఫోర్స్ టీమ్‌లను, ప్రతి జిల్లాలో 10 చొప్పున 180 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు ఎస్ఈబీ ప్రత్యేకంగా 130 మొబైల్ పార్టీలతోపాటు పోలీస్, మైనింగ్, ఎక్సైజ్ శాఖలకు చెందిన బృందాలు కూడా ఉంటాయి. మద్యం, డబ్బు రవాణా, పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పుటికప్పుడు ఎస్ఈబీకి చేరవేసేలా ఇంటెలిజెన్స్(నిఘా) బృందాలు కూడా పనిచేస్తున్నాయి. 439 చెక్‌పోస్టులు పొరుగు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి మద్యం, డబ్బు రవాణా కాకుండా రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వీటితోపాటు జిల్లాలు డివిజన్ల వారీగా కూడా చెక్‌పోస్టులు పెట్టారు. ఎస్ఈబీ ప్రత్యేకంగా 50 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయగా, మైనింగ్, ఎక్సైజ్, పోలీస్ శాఖలకు చెందిన మరో 389 చెక్‌పోస్టులు ఉన్నాయి. మొత్తం 439 చెక్‌పోస్టులు ఈ ఎన్నికల్లో నిరంతర తనిఖీలు నిర్వహిస్తాయి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పనిచేస్తున్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు(ఎస్పీవోలు) 2,200 మందితోపాటు ఎస్ఈబీ అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఒక్క రోజే 219 కేసులు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. నామినేషన్లు మొదలైన శుక్రవారం ఒక్క రోజే ఎస్ఈబీ 219 కేసులు నమోదు చేసి 219 మందిని అరెస్ట్ చేసింది. 35 వాహనాలను స్వా«దీనం చేసుకున్నాం. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్, ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో రాష్ట్రంలో ఎస్ఈబీ, పోలీస్, ఎక్సైజ్, మైనింగ్ సమన్వయంతో మంచి ఫలితాలు సాధించే దిశగా చర్యలు చేపట్టారు. – పీహెచ్డీ రామకృష్ణ, ఎస్ఈబీ డైరెక్టర్ -
కోడి పందేల కట్టడికి రంగంలోకి పోలీసులు
సాక్షి, అమరావతి: సంక్రాంతికి ఆడే కోడి పందేల కట్టడికి పోలీసులు రంగంలోకి దిగారు. రెండు రోజులుగా ప్రధానంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కోడి పందేలతో పాటు గుండాట, పేకాటలను అడ్డుకునేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. కోడి పందేలు, జూదం కట్టడికి ప్రతి మండలంలో జాయింట్ యాక్షన్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈసారి పోలీసులతో పాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కూడా రంగంలోకి దిగింది. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గుట్కా, మట్కా, కోడిపందేలపై నిఘా ముమ్మరం చేసింది. తొలిదశలో పలు గ్రామాల్లో కోడిపందేల నిర్వాహకులను, కత్తులు తయారు చేసే వాళ్లను, కత్తులు కట్టేవాళ్లను, కోళ్లను పెంచే వాళ్లను అదుపులోకి తీసుకుని బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్క ఏలూరు రేంజ్ పరిధి (కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలు)లో 4,395 బైండోవర్ కేసులు నమోదు చేశారు. కోడి కత్తులు తయారు చేసేవారు, కోడి కత్తులు కట్టే వారి నుంచి 5,243 కత్తులను స్వాదీనం చేసుకున్నారు. కోడి పందేలు, పేకాటలు నిర్వహించే వారిపై 848 కేసులు నమోదు చేశారు. కోవిడ్ వ్యాప్తి ప్రమాదం.. సంక్రాంతి పేరుతో కోడి పందేలు, పేకాట నిర్వహిస్తే పెద్ద ఎత్తున జూదరులు ఒక చోటకు చేరతారని, అందువల్ల కోవిడ్ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామాల్లో పోలీసులు ప్రచారం చేస్తున్నారు. పందేలు, పేకాట నిర్వహకులపై చట్టరీత్యా కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాల్లోని లాడ్జిల్లో ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చారా? అనే కోణంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. లాడ్జిల్లో ఉండే వారి వద్ద ఎక్కువగా నగదు ఉంటే సీజ్ చేస్తామని, బెట్టింగ్ ఆడితే క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సంక్రాంతి సంబరాల కోసం వస్తే సంతోషమని, అదే పేకాట, కోడి పందేలు కోసం వచ్చి లాడ్జిల్లో ఉంటే అరెస్టులు తప్పవని పోలీసులు సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేలు, పేకాటలను అడ్డుకునేందుకు ఐపీసీ సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30ను అమలు చేస్తున్నారు. -
ఎస్ఈబీ నిఘా.. అక్రమార్కుల ఆటకట్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమార్కుల ఆటకట్టించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) మెరుపుదాడులు నిర్వహించింది. రెండు రోజులపాటు నిర్వహించిన ఆపరేషన్ నిఘాలో 269 ఎస్ఈబీ బృందాలు పాల్గొన్నాయి. రాష్ట్రంలో అక్రమంగా మద్యం తయారీ, రవాణా, ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్, గుట్కా, గంజాయిలపై ఎస్ఈబీ బృందాలు ఉక్కుపాదం మోపాయి. అక్రమాలకు పాల్పడుతున్న 1,537 మందిపై 1,088 కేసులు నమోదు చేశారు. ఈ వివరాలను ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ మీడియాకు వెల్లడించారు. ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్న వివరాలివీ.. నమోదైన కేసులు: 1,088 అరెస్టయిన వారు: 1,537 సీజ్ చేసిన వాహనాలు: 192 సుంకం చెల్లించని మద్యం బాటిల్స్ (ఎన్డీపీఎల్): 3,652 అక్రమ మద్యం బాటిల్స్ (డీపీఎల్): 11,230 నాటుసారా (ఐడీ లిక్కర్): 6,016.7 లీటర్లు సారా తయారీ ఊట: 43,326 లీటర్లు అక్రమంగా తరలిస్తున్న ఇసుక: 349 టన్నులు గంజాయి: 530 కిలోలు సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం: 140 కిలోలు గుట్కా: 4,45,000 ప్యాకెట్లు (రూ.45 లక్షలు విలువ) పేకాటలపై దాడుల్లో: రూ.11,76,678 నగదు, గేమింగ్ కాయిన్స్: రూ.8.35 లక్షల విలువైనవి ఎటువంటి ఆధారపత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న కిలోన్నర వెండి, రూ.13.80 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
ప్రభుత్వ అధికారులను కూడా వదలం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాను సక్సెస్ ఫుల్‌గా కట్టడి చేశాం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ)కి రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది అన్నారు సెబ్ (ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్. ఈ సందర్భంగా సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ.. ‘సెబ్ పరిధిలో 4వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా 106 మంది సిబ్బందిని అదనంగా పెంచారు. గంజాయి, గుట్కా, ఎర్ర చందనం స్మగ్లింగ్, ఆన్లైన్ గాంబ్లింగ్‌లను కూడా ప్రభుత్వం సెబ్ పరిధిలోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్, గాంబ్లింగ్ అడుతూ యువకులు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. మాఫియాల మూలాలు కనిపెట్టి కఠినమైన చర్యలు తీసుకుంటాం’ అన్నారు. (చదవండి: అక్రమార్కుల బెండు తీస్తున్న సెబ్) ‘ఎర్ర చందనంపై ప్రత్యేక నిఘా ఎర్పాటు చేస్తాం. ఫారెస్ట్, పోలీస్ శాఖలను సమన్వయ పరుచుకొని ఎర్రచందనం రవాణాకు అడ్డుకట్ట వేస్తాం. కొండకింద గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించి స్మగ్లర్ల భరతం పడతాం. అక్రమ రవాణాని అడ్డుకొనేందుకు రాష్ట్ర సరిహద్దులోని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం. అక్రమార్కులకు సహకరిస్తే ప్రభుత్వాధికారులను కూడా వదలం. ప్రభుత్వ లక్షాన్ని ఛేదించటమే లక్ష్యంగా సెబ్ ముందుకు సాగుతుంది అన్నారు. -
సారా కట్టడికి ‘నవోదయం’
సాక్షి, అమరావతి: మద్యం నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) ఇప్పుడు నాటుసారా కట్టడిపైనా దృష్టి సారించింది. ఇందుకోసం ‘నవోదయం’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ అమలులోకి తెచ్చింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. సారా తయారీ, అక్రమ మద్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించే వేగుల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా తయారీ కేంద్రాల లెక్కలు తేల్చింది. అవి ఎక్కడ? ఎన్ని ఉన్నాయి? ఎవరు తయారు చేస్తున్నారు? వంటి వివరాలను సేకరించింది. ఎస్ఈబీ చేపట్టిన కార్యాచరణలో కీలక అంశాలు ఇవి. ⇔ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 79 పోలీస్స్టేషన్ల పరిధిలో 191 మండలాల్లో మొత్తం 682 నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించారు. ⇔ నాలుగున్నర నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఈబీ బృందాలు జరిపిన దాడుల్లో 19,567 మందిపై కేసులు నమోదు చేశారు. నాటుసారా 2,58,448 లీటర్లు, సారా తయారీ కోసం సిద్ధం చేసిన ఊట 57,21,704 లీటర్లు ధ్వంసం చేశారు. సారాను తరలించేందుకు ఉంచిన 2,956 వాహనాలు, సారా తయారీ కోసం ఉంచిన 2,08,795 కిలోల బెల్లంను స్వాధీనం చేసుకున్నారు. ⇔ ఎస్ఈబీ బృందాలు సారా తయారీదార్లను గుర్తించి ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే చర్యలు వద్దంటూ మొదట కౌన్సెలింగ్ ఇస్తున్నాయి. మాట విని సారా తయారీకి జోలికివెళ్లని కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఆసరా కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. చెప్పినా మాట వినకుండా సారా తయారు చేస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ⇔ రాష్ట్రంలో నేర చరిత్ర ఉన్న పది వేల మందిని ఇకపై సారా తయారు చేయబోమంటూ హామీ ఇచ్చేలా బైండోవర్ చేశారు. ఎంత చెప్పినా వినకుండా సారా తయారీ వీడని 1,500 మందిపై రౌడీషీట్లు తెరిచారు. ఆరుగురిపై పీడీ యాక్ట్‌లు పెట్టారు. సారా తయారీ ఆపకుంటే కఠిన చర్యలు తప్పవు: వినీత్‌బ్రిజ్‌లాల్, ఎస్ఈబీ డైరెక్టర్ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రాణాల మీదకు తెచ్చే నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నాం. సమాజంలో పరువు పోగొట్టుకుని బతకడం కంటే సారా తయారీ ఆపేసి మంచి జీవనం గడపాలని కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అయినా వినకుండా సారా తయారు చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. అటువంటి వారికి 8 ఏళ్లు జైలు శిక్ష , రౌడీషీట్లు, పీడీ యాక్ట్‌లు తప్పవు. జిల్లాల వారీగా నాటుసారా తయారీ కేంద్రాలు: జిల్లా ఎన్ని మండలాలు నాటుసారా కేంద్రాలు శ్రీకాకుళం 13 90 విజయనగరం 10 28 విశాఖపట్నం 21 89 తూర్పుగోదావరి 36 186 పశ్చిమగోదావరి 12 20 కృష్ణా 6 27 గుంటూరు 6 14 ప్రకాశం 9 21 నెల్లూరు 2 7 చిత్తూరు 20 39 వైఎస్సార్ కడప 4 8 అనంతపురం 20 46 కర్నూలు 32 107 -
సెబ్.. స్మగ్లర్ల పాలిట సింహస్వప్నం
-
అక్రమార్కుల బెండు తీస్తున్న సెబ్
సాక్షి, అమరావతి: అక్రమార్కుల ఆటలు కట్టించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) మెరుగైన పనితీరుతో దూసుకెళ్తోంది. అమల్లోకొచ్చిన కొద్ది రోజుల్లోనే సెబ్ స్మగ్లర్ల పాలిట సింహస్వప్నంగా మారింది. అక్రమార్కుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ బెండు తీస్తోంది. మూడునెలల్లోనే ముప్పై వేలకు పైగా కేసులు నమోదుచేసి ధోనంబర్ దందాగాళ్ళ గుండెల్లో దడ పుట్టిస్తోంది. శాండ్ మాఫియా, గంజాయి స్మగ్లింగ్, సారా తయారీదారుపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం అర్తమూరులో ఎస్సై తులసి రామకృష్ణ ఆధ్వర్యంలో 500 లీటర్ల బెల్లం ఊటలను ఎస్ఈబీ బృందం ధ్వంసం చేసింది. దీంతోపాటు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎక్సైజ్ పరిధిలో సెబ్ అధికారులు దాడులు చేసి 45 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 400 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం చేశామని అక్రమరవాణా ఆపకపోతే కఠినచర్యలు తప్పవని ఈ సందర్భంగా సెబ్ డైరెక్టర్ రామకృష్ణ హెచ్చరించారు. (చదవండి: మడ అడవుల్లో సారా బట్టీలపై మెరుపు దాడి) -
మడ అడవుల్లో మెరుపు దాడి
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడ కోరింగ మడ అడవుల్లో నాటు సారా తయారీ స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), పోలీసులు కలిసి దాడులు చేపట్టారు. ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ సుమిత్ నేతృత్వంలోని పోలీసుల బృందం అభయారణ్యంలో దాడులు జరిపింది. మడ అడవుల్లో 22 సారా బట్టీలపై మెరుపు దాడిన చేసిన ఎస్ఈబీ అధికారులు 46000 లీటర్ల ఊట బెల్లాన్ని ద్వంసం చేశారు. 200 లీటర్ల సామర్థ్యం కలిగిన 230 బారెల్స్‌ను గుర్తించిన ఎస్ఈబీ అధికారులు 1400 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్ఈబీ అదనపు ఎస్పీ సుమీత్ గరుడ్ స్వయంగా పాల్గొనగా..దాడులను ఇంకా కొనసాగిస్తున్నారు. అయితే పోలీసుల రాకతో సారా తయారీదారులు అక్కడి నుంచి పరారయ్యారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
సాక్షి, విజయవాడ : అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాలపై నిఘా పెడుతున్నామని, డ్రగ్ లైసెన్స్ లేని వారిపై కేసులు నమోదు చేస్తున్నామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజలాల్ తెలిపారు. హైదరాబాద్, మేడ్చల్, జీడిమెట్ల ప్రాంతాలలో కొందరు కల్తీ శానిటైజర్ యూనిట్లు నడుపుతున్నట్టు గుర్తించామని, జీడిమెట్ల నుంచి నకిలీ శానిటైజర్లు సప్లై జరుగుతోందని తెలిపారు. నిబంధనలు ఉల్లగించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేటితో ఎస్ఈబీ ఏర్పాటు చేసి 100 రోజులు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 36 వేల అక్రమ మద్యం కేసులు నమోదు చేశాం. 46,500 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించాం. ఇతర రాష్ట్రాల మద్యంతో పాటు నాటుసారాపై ఉక్కుపాదం మోపుతున్నాం. 2 లక్షల యాభై వేల లీటర్ల నాటుసారాను ఐడీ పార్టీ స్వాధీనం చేసుకుంది. ( ఎస్ఈబీ సత్తా చాటుతోంది ) ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వస్తున్న 2,75,000 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశాం. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం సరఫరా జరుగుతున్నట్టు గుర్తించాం. తమిళనాడు, ఒరిస్సా నుంచి తక్కువ స్థాయిలో అక్రమ స్మగ్లింగ్ జరుగుతోంది. ఎక్సైజ్ యాక్ట్ 46 ప్రకారం అక్రమ మద్యాన్ని ధ్వంసం చేస్తున్నాం. లాక్ డౌన్ తర్వాత అక్రమ మద్యం తరలింపు ఎక్కువైoది. పట్టుపడ్డ వారికి 8 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. మద్యం రవాణాలో 139 మంది ప్రభుత్వ సిబ్బందిని రిమాండ్‌కి తరలించాం. పట్టుబడ్డ వారిలో 6 గురు స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, 48 మంది లోకల్ పోలీసులు, సెంట్రల్ పారామిలటరీ సిబ్బంది ఉన్నారు. కల్తీ శానిటైజర్లపై ఎస్ఈబీ, డ్రగ్ కంట్రోల్, పోలీసు శాఖ సంయుక్త దాడులు చేస్తున్నాయ’’న్నారు. పొట్ట చుట్టూ మద్యం సీసాలు టేపు చేసుకుని.. కృష్ణ : అక్రమంగా మద్యాన్ని చేరవేసేందుకు ఓ ఇద్దరు వ్యక్తులు వేసుకున్న ప్లాన్ బెడిసి కొట్టి పోలీసులకు చిక్కారు. మంగళవారం చాట్రాయి మండలం పోలవరం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. టేపుతో పొట్ట చుట్టు సీల్ చేసుకున్న దాదాపు 105 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఆటకట్టు, ఎక్కడిక్కడ మద్యం సీజ్
సాక్షి, విజయవాడ: కరోనా కారణంగా రాష్ట్రంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితులను అక్రమార్కులు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పొరుగున ఉన్న తెలంగాణ నుంచి మద్యాన్ని తెచ్చి అమ్మి సొమ్ముచేసుకొంటున్నారు. చెక్ పోస్టుల్లో నిఘా పెరగటంతో అడ్డదారులు ఏర్పాటు చేసుకొని పోలీసుల కళ్లుకప్పి దందా కొనసాగిస్తున్నారు. అయితే, అక్రమరవాణా దారుల ఆటకట్టించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కొరడా ఝళిపిస్తోంది. మూడంచెల చెక్‌పోస్టు విధానంతో నాన్ డ్యూటీ పెయిడ్ అక్రమ మద్యాన్ని ఎక్కడికక్కడ సీజ్ చేస్తోంది. తాజాగా కృష్ణలంక,పెనమలూరు, నున్న ,గన్నవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు చోట్ల ఏకకాలంలో ఎస్ఈబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు .కొరియర్ సర్వీస్ ద్వారా తరలిస్తున్న 2,804 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు .రవాణాకు ఉపయోగించిన ఆటో, లారీని సీజ్ చేశారు. మరోపక్క పరివర్తన పేరుతో ఎస్ఈబీ అధికారులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ సారా తయారీ దారుల్లో మార్పునకు ప్రయత్నిస్తున్నారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని వదిలిపెట్టకపోతే పీడీ యాక్టులు పెట్టి కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరిస్తున్నారు . -
మద్యం అక్రమ రవాణా కేసులో బీజేపీ నేత గుడివాక అరెస్ట్
సాక్షి, గుంటూరు/సాక్షి, అమరావతి: తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తోన్న బీజేపీ నేత గుడివాక రామాంజినేయులును అధికారులు అరెస్ట్ చేశారు. ఈయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ స్థానానికి బీజేపీ తరఫున పోటీచేసి ఓటమి చెందాడు. గుంటూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు పెదకాకాని మండలం కొప్పురావూరు సమీపంలో ఆదివారం తనిఖీలు చేశారు. తెలంగాణ నుంచి మద్యంతో రెండు కార్లలో ప్రయాణిస్తున్న గుడివాక, మత్సా సురేష్‌ను అరెస్ట్ చేసి 20 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో గుంటూరులోని రామాంజినేయులు బినామీ నరేష్‌తో పాటు, గంటా హరీష్‌లను అరెస్టు చేసి 20 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఈబీ ఏఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మాట్లాడుతూ..నిందితుల నుంచి రూ.6 లక్షల విలువైన 1,920 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా, గుడివాకను పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సస్పెండ్ చేసినట్లు బీజేపీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
శానిటైజర్లు తాగుతున్న వారి కోసం ఎస్ఈబీ వేట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటి వరకు శానిటైజర్లు తాగుతున్న 144 మందిని స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు పట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా శానిటైజర్లు తాగి ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్న వారిని గుర్తించే పనిలో ఎస్ఈబీ అధికారులు నిమగ్నమయ్యారు. వీరికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు డీ–అడిక్షన్ కేంద్రాలకు పంపుతున్నారు. మద్యానికి బానిసైన వారు మాత్రమే శానిటైజర్లు తాగుతున్నారని, వీరి కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేసి మద్యం వ్యసనపరుల గురించి వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీ–అడిక్షన్ కేంద్రాలతో పాటు ప్రైవేటు కేంద్రాల్లోనూ కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ► శానిటైజర్లలో మిథైల్ ఆల్కహాల్ బదులుగా మిథైల్ క్లోరైడ్ కలుపుతున్నట్లు ల్యాబ్ పరీక్షల్లో ఫలితాలు వస్తున్నాయి. ► శానిటైజర్లు తాగి మృత్యువాత పడుతున్న ఘటనల్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశిస్తున్నారు. ► ఎస్ఈబీతో పాటు స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ► కురిచేడు ఘటనపై గత ఐదు రోజుల నుంచి ఎక్సైజ్, ఎస్ఈబీ, పోలీసు బృందాలు గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు శానిటైజర్ తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాయి. ► రాష్ట్రంలో అక్రమ మద్యం సరఫరా చేస్తున్న 345 ప్రాంతాల్ని గుర్తించి వాటిపై నిఘా ఉంచామని, ఎవరైనా పట్టుబడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ పీహెచ్డీ రామకృష్ణ స్పష్టం చేశారు. -
ఎస్ఈబీకి ఆర్థిక అధికారాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)కు ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలతో సహా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ (హెచ్‌వోడీ) హోదాను కల్పించింది. ఈ మేరకు దేశంలోనే తొలిసారిగా ఎక్స్అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఈబీ విభాగం మెరుగైన ఫలితాలు సాధించేలా పోలీసు శాఖను సమన్వయం చేసేందుకు డీజీపీకి ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా కల్పించారు. ఏపీ జీఏడీ పరిధిలోకి ఎస్ఈబీ వింగ్‌ను తీసుకొచ్చారు. ఐజీ, అంతకంటే పై స్థాయి ఐపీఎస్ అధికారి ఎస్ఈబీకి కమిషనర్, హెడ్‌గానూ వ్యవహరిస్తారు. -
ఎస్ఈబీతో మంచి ఫలితాలు
సాక్షి, అమరావతి: అక్రమ మద్యం తయారీ, రవాణా, ఇసుక అక్రమాల నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో(ఎస్ఈబీ) మంచి ఫలితాలు సాధిస్తోందని ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల డీజీపీల కీలక సమావేశం శనివారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగింది. సమావేశంలో తీర ప్రాంత గస్తీ, మాదక ద్రవ్యాల రవాణా, మావోయిజం, ఉగ్రవాద కార్యకలాపాలు, మనుషుల అక్రమ రవాణా, ఇసుక, మద్యం అక్రమ రవాణా నియంత్రణ తదితర అంశాలలో దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయంపై చర్చ జరిగింది. డీజీపీ సవాంగ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని తీరప్రాంతంలో గస్తీ ముమ్మరం చేశామన్నారు. ఆయుధాల సామర్థ్యాన్ని పరీక్షించిన డీజీపీ మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌లో ఫైరింగ్ రేంజ్‌ను శనివారం సందర్శించిన డీజీపీ సవాంగ్.. రాష్ట్ర పోలీసు శాఖ సమకూర్చుకున్న అత్యాధునిక ఆయుధాల సామర్థ్యాన్ని పరీక్షించారు. ► ఇజ్రాయిల్ సహకారంతో రూపొందించిన ఆధునిక ఆయుధాలను టెస్ట్ ఫైర్ చేసి పరిశీలించి, ఐపీఎస్ అధికారులకు అందించారు. ► అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్, టెస్ట్ ఫైరింగ్ కార్యక్రమాన్ని పీఅండ్ఎల్ నాగేంద్రకుమార్, ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఐజీ ట్రైనింగ్ సంజయ్ నిర్వహించారు. -
మార్పు వైపు మరో అడుగు
సాక్షి, అమరావతి : మద్య రహిత సమాజం కోసం, ఇసుక కొరతలేని నిర్మాణ రంగం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన మరో అడుగు మంచి ఫలితాన్నిస్తోందని స్పష్టమవుతోంది. ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఏర్పాటుతో చేసిన కొత్త ప్రయోగం దేశానికే ఆదర్శం కాబోతోంది. అవిర్భవించిన నెల రోజుల్లోనే అద్భుత పనితీరును ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో అనుమతి లేని మద్యం ప్రవాహానికి చెక్ పెడుతోంది. ఇసుక అక్రమాలకు బ్రేక్ వేస్తోంది. మరోవైపు గొంతులో గరళం నింపుతున్న నాటుసారా, గంజాయిలకు చెల్లుచీటీ రాసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దశాబ్దాల తరబడి నాటుసారా కాస్తున్న గ్రామాల్లో మంచి మార్పు తీసుకురావడంలో తనదైన ముద్ర వేస్తోంది. ఎస్ఈబీ ఏర్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయని ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్‌లో స్పష్టమైంది. నెల రోజుల్లోనే ఎస్ఈబీ ముద్ర.. ► గత నెల 12న ఏర్పాటైన ఈ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక, మద్యం అక్రమాలపై గత నెల 15వ తేదీ వరకు క్షేత్ర స్థాయి సమాచారం సేకరించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 18 పోలీస్ యూనిట్లలో పోలీస్ టీమ్‌లను ఏర్పాటు చేసుకుని గత నెల 16 నుంచి పూర్తి స్థాయి కార్యాచరణ చేపట్టింది. ► రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని అన్ని యూనిట్లు వాటి పరిధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ► ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పట్టుబడే వారిపై కఠిన చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తూ.. ప్రత్యేక నిఘా వ్యవస్థతో మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. అక్రమాలకు పాల్పడే పాత నేరస్థులపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు, నిబంధనలు ఉల్లంఘించే అక్రమార్కులపై రౌడీషీట్స్ తెరవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్ఈబీ దాడుల ఫలితాలివి.. ► 75,731 లీటర్ల నాటుసారా, దీని తయారీలో ఉపయోగించే 45,969 కిలోల బెల్లం స్వాధీనం. ► సారా తయారీకి ఉపయోగించే 13,04,022 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం. ► అక్రమంగా తరలిస్తున్న 59,161.6 లీటర్ల మద్యం, 1,957.99 లీటర్ల బీరు, 10,530.302 కిలోల గంజాయి స్వాధీనం. ► 18,961 మందిపై 14,200 కేసుల నమోదు. 4,872 వాహనాల స్వాధీనం. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమాలకు పాల్పడుతున్న 2,837 మందిపై 1,545 కేసుల నమోదు. ► ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 1,924 వాహనాలు, 3,82,636.855 టన్నుల ఇసుక స్వాధీనం. ప్రభుత్వ ఆశయాన్ని సాధిస్తాం.. ► రాష్ట్రంలో అక్రమ మద్యం, ఇసుక అక్రమాలను నిలువరించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా ఎస్ఈబీ ఏర్పాటు చేశారు. మద్యం, ఇసుక అక్రమాలకు చెక్ పెట్టాలనే ప్రభుత్వ ఆశయాన్ని సాధిస్తాం. డీజీపీ సవాంగ్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనిట్లతో బలమైన పోలీస్ టీమ్‌లు ఏర్పాటు చేసుకుని రంగంలోకి దిగుతున్నాం. ► ప్రత్యేక కొరియర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, సాంకేతిక పరిజ్ఞానం వాడుకుని ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ రవాణా, సారా తయారీని అరికట్టేందుకు దాడులు ముమ్మరం చేశాం. మద్యం, ఇసుక అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాం. ► పలు జిల్లాల్లో ఇసుక, సిలికా, గ్రావెల్ నిల్వలు ఎక్కువగా ఉన్న క్రమంలో వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇసుక అక్రమంగా తరలింపు, మద్యం అక్రమ రవాణా, మద్యం అక్రమ తయారీపై నిఘాను తీవ్రతరం చేశాం. రాత్రివేళల్లోనూ గస్తీ ముమ్మరం చేశాం. మొబైల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. – వినీత్ బ్రిజ్‌లాల్, ఎస్ఈబీ కమిషనర్ ‘పరివర్తన’ వచ్చింది.. ► అవి కృష్ణా జిల్లా సముద్ర తీరంలోని గ్రామాలు. తీరంలోని ఇసుక తిన్నెలపై అడుగడుగునా నాటు సారా పాతరలుండేవి. ఆ పక్కనే సర్వే తోటల్లోకి వెళితే చెట్టుకొకటి అన్నట్టుగా నాటుసారా బట్టీలు పొగలు కక్కుతుండేవి. పోలీసులు దాడులు, నాటుసారా తయారీ దారుల ప్రతిదాడులు అక్కడ నిత్యకృత్యం. ► చినగొల్లపాలెం, పెదగొల్లపాలెం, పోడు, పడతడిక, నిడమర్రు తదితర గ్రామాలలో ఈ పరిస్థితి ఉండేది. ఇప్పుడు సీన్ మారింది. ప్రస్తుతం సముద్రతీరం ప్రశాంతంగా ఉంది. నాటుసారా తయారీకి దూరంగా ఉంటామంటూ ఆ గ్రామాలు ప్రతిజ్ఞ చేసి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ► లాఠీకి పని చెప్పినా వినని వారిని లౌక్యంతో మంచి మాటలు చెప్పి దారికి తెచ్చారు. ఇందుకు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని సామాజిక చైతన్యాన్ని తెచ్చారు. ► కృత్తివెన్ను, పెడన మండలాల్లోని పలు గ్రామాలతోపాటు మైలవరం, తిరువూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని తండాల్లోను నాటుసారా తయారీ సాగుతున్నట్టు గుర్తించిన పోలీసులు పక్కా కార్యాచరణతో అక్కడి ప్రజల్లో మార్పు తేగలిగారు. ► కృష్ణా జిల్లాలో తరతరాలుగా (దాదాపు 60 ఏళ్లకుపైగా) నాటుసారా తయారీని కుటీర పరిశ్రమలా నిర్వహిస్తున్న 16 గ్రామాల్లోని 140 కుటుంబాలు ఆ ఊబి నుంచి బయట పడటంలో ఎస్ఈబీ పాత్ర ఘనమైనది. ► కృష్ణా జిల్లాలో చేసిన ప్రయోగం ఫలించడంతో చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరితోపాటు అనేక జిల్లాల్లో వందలాది కుటుంబాలు నాటుసారా రొంపి నుంచి బయటపడేలా ఎస్ఈబీ ప్రయత్నం చేసింది. ► దశాబ్దాల తరబడి నాటు సారా కాయడంలో నిమగ్నమైన కుటుంబాలకు రోజుల తరబడి ఓపికగా కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తెస్తున్నారు. రాష్ట్రంలో 436 కుటుంబాల్లో మార్పు తెచ్చి ఇక నాటుసారా జోలికి వెళ్లం అంటూ ప్రతిజ్ఞ చేయించడం విశేషం. ఆ ఉపాధి ఇక మాకొద్దు ఎన్నో ఏళ్లుగా మా గ్రామంలో నాటుసారా కాచి అమ్మి కుటుంబాన్ని పోషించుకునే వాళ్లం. ఒక విధంగా చెప్పాలంటే నాటుసారా తయారీయే మాకు ఉపాధి అయ్యింది. పోలీసులంటేనే కేసులు పెట్టి వేధిస్తారని మాకు తెలుసు. కానీ అందుకు భిన్నంగా వారు రోజుల తరబడి తిరిగి మా చుట్టూ తిరిగి సారా తయారీ జోలికి వెళ్లకుండా మార్పు తెచ్చారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసిన మాకు ఇకపై ఆయన ఏదో ఒక ఉపాధి చూపకపోతారా అనే నమ్మకంతో నాటుసారా తయారీ నిలిపివేశాం. ఇకపై సారా తయారీ జోలికి వెళ్లం. – ఆరేపల్లి వెంకటేశ్వరరావు, సావిత్రి, చినగొల్లపాలెం, కృష్ణా జిల్లా నాకు గౌరవం పెరిగింది సమాజంలో మద్యం లేకుండా చేసి ప్రజల ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయం నాకు బాగా నచ్చింది. కేసులు పెట్టి వేధించకుండా మా కోసం, మా బిడ్డల భవిష్యత్ కోసం పోలీసులు పడిన తాపత్రయం ఆలోచింపజేసింది. అందుకే ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే సారా కాయకూడదని నిర్ణయం తీసుకున్నాను. దీంతో సంఘంలో నాకు గౌరవం పెరిగింది. మంచి నిర్ణయం తీసుకున్నావంటూ చుట్టు పక్కల వారు కూడా ఇప్పుడు నన్ను మెచ్చుకుంటుంటే గర్వంగా ఉంది. – పడమట శ్రీనివాసరావు, నిడమర్రు, కృష్ణా జిల్లా ఇసుక కష్టాలు తీరుతున్నాయి ఇసుక సమస్యతో భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది అనేక ఇబ్బందులు పడ్డారు. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. ఇసుక అక్రమాల నివారణకు ప్రత్యేకంగా ఎస్ఈబీ ఏర్పాటు చేయడం బాగుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఇప్పుడిప్పుడే ఇసుక కష్టాలు తీరుతున్నాయి. – కె.నాగేశ్వరరావు, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా -
ఇలాగైతే..ఎలాగమ్మా?
పర్చూరు: నాటుసారా, అక్రమ మద్యం, ఇసుక తరలింపును అడ్డుకునేందుకు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఎస్‌హెచ్‌వో అవినీతికి అడ్డు లేకుండా పోయిందని కింది స్థాయి సిబ్బంది ఎస్ఈబీ అసిస్టెంట్ కమిషనర్‌కు రాతపూర్వకంగా సోమవారం ఫిర్యాదు చేశారు. పర్చూరు ఎస్ఈబీ ఇన్చార్జి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆర్వీ రమణమ్మపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ సిబ్బంది పంపిన లేఖ పర్చూరు ఎస్ఈబీలో దుమారం రేపుతోంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సిబ్బంది కొన్ని కేసుల్లో జరిగిన అవినీతి గురించి వివరించడం చర్చనీయాంశంగా మారింది. ఇవీ..సిబ్బంది ఆరోపణలు ♦ మే 14వ తేదీన నమోదైన క్రైమ్ నంబర్ 12–2020లో పర్చూరు మండల కేంద్రానికి చెందిన ముగ్గురు నిందితుల్లో ఒకరిని, ఒక మోటారు సైకిల్‌ను కేసు నుంచి తప్పించేందుకు, మిగిలిన ఇద్దరికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.60 వేలు డిమాండ్ చేసి చివరకు ఎస్హెచ్ఓ రూ.25 వేలు తీసుకున్నట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. ♦ ఈ నెల 6వ తేదీన నమోదైన క్రైమ్ నంబర్ 15–2020లో పర్చూరు మండలం నాగులపాలేనికి చెందిన కేసు నుంచి మోటారు సైకిల్‌ను తప్పించి నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.40 వేలు డిమాండ్ చేసి రూ.20 వేలు తీసుకున్నారు. ♦ ఈ నెల 9వ తేదీన నమోదైన క్రైమ్ నంబర్ 16–2020లో యద్దనపూడికి చెందిన ఒక నిందితుడిని, ఒక మోటారు సైకిల్‌ను తప్పించారని, మరో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.40 వేలు డిమాండ్ చేసి రూ.30 వేలు తీసుకున్నట్లు ఆరోపించారు. ♦ ఈ నెల 11వ తేదీన నమోదైన క్రైమ్ నంబర్ 17–2020లో ఒక నిందితుడిని, మోటారు సైకిల్‌ను తప్పించి మరో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.40 వేలు డిమాండ్ చేసి రూ.20 వేలు తీసుకున్నట్లు ఆరోపించారు. ఇంకో మరెన్నో? ♦ మద్యం సీసాలతో పట్టుబడిన వారి ఫొటోలు తీసి వారి వద్ద డబ్బులు, మద్యం సీసాలన్నింటినీ తీసుకుని వదిలేశారంటూ ఆరోపణలు ♦ మే 30వ తేదీన పూసపాడు జీఆర్వో వద్ద అరెస్టు చేసిన నలుగురు నిందితులు, రెండు మోటారు సైకిళ్లను వదిలేసేందుకు రూ.40 వేలు తీసుకున్నట్లు ఆరోపించారు. ♦ నూతలపాడులో అర్ధరాత్రి ఓ ఇంటిపై దాడి చేసి వారి వద్ద 8 ఫుల్ బాటిళ్లు, ఐదు క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయలేదు. ♦ ఇంకొల్లులో ఓ ట్రావెల్స్ యజమాని వద్ద సాయంత్రం 8 గంటల సమయంలో 12 మధ్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తీసుకొచ్చి ఫొటోలు తీసిన తర్వాత కేసు నమోదు చేయకుండా రూ.20 వేలు లంచం తీసుకుని వదిలేశారు. ♦ పర్చూరు ఇందిరా కాలనీలోని వైఎస్సార్ సెంటర్లో ఈ నెల 10వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి నుంచి 12 ఫుల్ బాటిళ్లు స్వాధీనం చేసుకుని ఎస్హెచ్ఓ ఇంటికి తీసుకెళ్లారు. ♦ ఈ నెల 11వ తేదీన దొరికిన 13 ఖరీదైన మద్యం సీసాలను ఇంటికి తీసుకెళ్లి తక్కువ ఖరీదు ఉన్న 9 మద్యం సీసాలు చూపి కేసు నమోదు చేశారు. వీటితో పాటు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎస్‌హెచ్‌వో రమణమ్మ అవినీతిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుని డిపార్ట్మెంట్ పరువు కాపాడాలని ఎస్ఈబీ అసిస్టెంట్ కమిషనర్‌ను సిబ్బంది కోరారు. -
మద్యం అక్రమ రవాణాకు ‘చెక్’
సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో: నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపుతున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) ఇసుక, మద్యం అక్రమ రవాణాపైనా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం రాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు చేపట్టింది. తెలంగాణ, పంజాబ్, కర్ణాటక నుంచి భారీగా తరలి వస్తున్న మద్యానికి చెక్ పెడుతోంది. జగ్గయ్యపేట, దాచేపల్లి, తిరువూరు, మైలవరం, నూజివీడు ప్రాంతాల్లో ఎస్ఈబీ నిఘా పెట్టింది. మొక్కజొన్న ముసుగులో పంజాబ్ నుంచి తీసుకొచ్చి పొలంలోని గడ్డి వాములో దాచిన రూ.20 లక్షల మద్యాన్ని శనివారం స్వాధీనం చేసుకుంది. పకడ్బందీ చర్యలతో.. ► ఎస్ఈబీ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులను రంగంలోకి దించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం పట్టుబడుతోంది. ► సోదాల సమయంలో పట్టుబడుతున్న మద్యం అత్యధికంగా తెలంగాణ నుంచే వస్తున్నట్టు తేలింది. ఈ దృష్ట్యా సరిహద్దులోని జగ్గయ్యపేట, దాచేపల్లి, మైలవరం, తిరువూరు, నూజివీడు తదితర ప్రాంతాల్లోని చెక్ పోస్టుల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ► గత నెల 29న తెలంగాణ నుంచి వస్తున్న 1,056 మద్యం బాటిల్స్‌ను మాచర్ల వద్ద ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. ► గత నెల 28న తెలంగాణాణ నుంచి ఏపీకి తరలిస్తున్న 284 మద్యం బాటిల్స్‌ను కర్నూలు ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ► గత నెల 27న కర్ణాటక నుంచి ఏపీకి అక్రమంగా గోనె సంచుల్లో తరలిస్తున్న 543 మద్యం బాటిల్స్‌ను పట్టుకున్నారు. మొక్కజొన్న లోడుతో పంజాబ్ మద్యం ► శుక్రవారం కృష్ణా జిల్లా కంకిపాడు పరిధిలోని మంతెన గ్రామ శివారులో రూ.20 లక్షల విలువైన 5,162 అక్రమ మద్యం బాటిల్స్‌ను పోలీసులు గుర్తించారు. ► విజయవాడ పోలీస్ కమిషన్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో ఎస్ఈబీ పోలీసులు నిర్వహించిన మెరుపు దాడుల్లో పంజాబ్‌కు చెందిన అక్రమ మద్యం పట్టుబడటం గమనార్హం. ► కంకిపాడు మండలం మంతెన గ్రామానికి చెందిన వీరంకి వెంకటరమణ మండల స్థాయిలో పేకాట, కోడి పందేల నిర్వాహకుడిగా పేరుంది. ► అతనికి విజయవాడ కృష్ణలంకకు చెందిన లారీ బ్రోకర్ షేక్ మహబూబ్ సుబానీ, నిడమానూరుకు చెందిన లారీ యజమానులు కొండపల్లి ఆనంద్, షేక్ రఫీ ముఠాగా ఏర్పడి అక్రమ మద్యం సరఫరాకు పక్కా ప్రణాళిక రచించినట్టు పోలీసులు గుర్తించారు. ► సుబానీ ద్వారా పంజాబ్‌లో తయారైన 142 కేసుల మద్యాన్ని కోల్‌కతా నుంచి మొక్కజొన్న లారీలో పంపించగా.. దానిని కంకిపాడు మండలం మంతెనలోని తన పొలం గల గడ్డివాములో వీరంకి వెంకటరమణ దాచి ఉంచాడు. ► పక్కా సమాచారం అందడంతో ఎస్ఈబీ అధికారులు మెరుపుదాడి చేసి రూ. 20 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ► నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు అక్రమ మద్యంపై లోతుగా విచారణ జరుగుతోంది. అక్రమ మద్యంపై కఠిన చర్యలు ప్రజారోగ్యంతో ఆడుకునేలా నాటుసారా తయారీ, అక్రమంగా మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తరలించే వారిపై నిఘా పెట్టాం. బోర్డర్ చెక్‌పోస్టుల్లో సోదాలు ముమ్మరం చేశాం. మద్యం తరలిస్తూ పట్టుబడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కసారి పట్టుబడినా అటువంటి వారిపై నిఘా పెడుతున్నాం. అన్ని జిల్లాల్లో రాత్రి వేళ కూడా గస్తీ ముమ్మరం చేశాం. – వినీత్ బ్రిజ్‌లాల్, కమిషనర్, ఎస్ఈబీ -
అక్రమార్కుల భరతం పడతోన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో
-
సీఎం జగన్ లక్ష్యాలను నెరవేరుస్తాం
సాక్షి, అమరావతి: మద్యం, ఇసుక అక్రమాలను అడ్డుకోవడం తమ ముందున్న పెద్ద సవాళ్లని, వీటిని అధిగమించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశించిన లక్ష్యాలను సాధిస్తామని స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో (ఎస్ఈబీ–లిక్కర్ అండ్ శాండ్) కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని డీజీపీ ప్రధాన కార్యాలయంలో బ్రిజ్‌లాల్‌తోపాటు ఏడుగురు ఐపీఎస్‌లతో ఏర్పాటు చేసిన ఎస్ఈబీ కొత్త టీమ్ బుధవారం విధులు చేపట్టింది. ఈ సందర్బంగా వినీత్ బ్రిజ్‌లాల్ సాక్షితో మాట్లాడారు. (సీఎస్‌గా నీలం సాహ్ని కొనసాగింపు!) ► రాష్ట్రంలో మద్య నియంత్రణ, మద్యం అక్రమ రవాణా, మద్యం అక్రమ తయారీతోపాటు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు స్వయం ప్రతిపత్తి గల ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశాలతో ఎస్ఈబీ ఏర్పాటైంది. ► మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయం కేంద్రంగా డీజీపీ సవాంగ్ పర్యవేక్షణలో ఎస్ఈబీ పనిచేస్తుంది. ► ఈ టీమ్‌లోకి త్వరలో మరో 11 మంది ఐపీఎస్‌లు కూడా రానున్నారు. రాష్ట్రంలో మొత్తం 18 పోలీస్ యూనిట్ (జిల్లాలు, అర్బన్ ప్రాంతాలు)లకు ఎస్ఈబీ టీమ్ లీడర్లను ఏర్పాటు చేస్తాం. ► నేరుగా పోలీస్ శాఖ రంగంలోకి దిగి పనిచేసే ఎస్ఈబీలో ఎక్సైజ్ శాఖ నుంచి కూడా అధికార సిబ్బందిని నియమిస్తాం. ఆయా జిల్లాల పోలీసులను కూడా ఈ టీమ్‌లు వినియోగించుకుంటాయి. పోలీస్, ఎక్సైజ్, మైనింగ్ సిబ్బందితో కలసి మంచి ఫలితాలు సాధిస్తాం. యువ ఐపీఎస్‌లకు జిల్లాల బాధ్యతలు 2015, 2016 బ్యాచ్‌లకు చెందిన ఏడుగురు యువ ఐపీఎస్ అధికారులకు జిల్లాల బాధ్యతలు కేటాయించారు. కె.ఆరిఫ్ హఫీజ్ (గుంటూరు రూరల్), గరుడ్ సుమిత్ సునీల్ (తూర్పు గోదావరి), రాహుల్‌దేవ్ సింగ్ (విశాఖపట్నం రూరల్), అజిత వేజెండ్ల (విశాఖపట్నం సిటీ), గౌతమి శాలి (కర్నూలు), వకుల్ జిందాల్ (కృష్ణా), వై.రిషాంత్ రెడ్డి (చిత్తూరు) బాధ్యతలు కేటాయించారు.