
క్రైమ్ నంబర్ 17/2020 కేసుకు సంబంధించి వదిలేసిన టూ వీలర్ ఇదే.., క్రైమ్ నంబర్ 17/2020 కేసుకు సంబంధించి వదిలేసిన నిందితుడి ఫొటో
పర్చూరు: నాటుసారా, అక్రమ మద్యం, ఇసుక తరలింపును అడ్డుకునేందుకు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) ఎస్‌హెచ్‌వో అవినీతికి అడ్డు లేకుండా పోయిందని కింది స్థాయి సిబ్బంది ఎస్‌ఈబీ అసిస్టెంట్ కమిషనర్‌కు రాతపూర్వకంగా సోమవారం ఫిర్యాదు చేశారు. పర్చూరు ఎస్‌ఈబీ ఇన్‌చార్జి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆర్‌వీ రమణమ్మపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ సిబ్బంది పంపిన లేఖ పర్చూరు ఎస్‌ఈబీలో దుమారం రేపుతోంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సిబ్బంది కొన్ని కేసుల్లో జరిగిన అవినీతి గురించి వివరించడం చర్చనీయాంశంగా మారింది.
ఇవీ..సిబ్బంది ఆరోపణలు
♦ మే 14వ తేదీన నమోదైన క్రైమ్ నంబర్ 12–2020లో పర్చూరు మండల కేంద్రానికి చెందిన ముగ్గురు నిందితుల్లో ఒకరిని, ఒక మోటారు సైకిల్‌ను కేసు నుంచి తప్పించేందుకు, మిగిలిన ఇద్దరికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.60 వేలు డిమాండ్ చేసి చివరకు ఎస్‌హెచ్‌ఓ రూ.25 వేలు తీసుకున్నట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు.
♦ ఈ నెల 6వ తేదీన నమోదైన క్రైమ్ నంబర్ 15–2020లో పర్చూరు మండలం నాగులపాలేనికి చెందిన కేసు నుంచి మోటారు సైకిల్‌ను తప్పించి నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.40 వేలు డిమాండ్ చేసి రూ.20 వేలు తీసుకున్నారు.
♦ ఈ నెల 9వ తేదీన నమోదైన క్రైమ్ నంబర్ 16–2020లో యద్దనపూడికి చెందిన ఒక నిందితుడిని, ఒక మోటారు సైకిల్‌ను తప్పించారని, మరో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.40 వేలు డిమాండ్ చేసి రూ.30 వేలు తీసుకున్నట్లు ఆరోపించారు.
♦ ఈ నెల 11వ తేదీన నమోదైన క్రైమ్ నంబర్ 17–2020లో ఒక నిందితుడిని, మోటారు సైకిల్‌ను తప్పించి మరో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.40 వేలు డిమాండ్ చేసి రూ.20 వేలు తీసుకున్నట్లు ఆరోపించారు.
ఇంకో మరెన్నో?
♦ మద్యం సీసాలతో పట్టుబడిన వారి ఫొటోలు తీసి వారి వద్ద డబ్బులు, మద్యం సీసాలన్నింటినీ తీసుకుని వదిలేశారంటూ ఆరోపణలు
♦ మే 30వ తేదీన పూసపాడు జీఆర్‌వో వద్ద అరెస్టు చేసిన నలుగురు నిందితులు, రెండు మోటారు సైకిళ్లను వదిలేసేందుకు రూ.40 వేలు తీసుకున్నట్లు ఆరోపించారు.
♦ నూతలపాడులో అర్ధరాత్రి ఓ ఇంటిపై దాడి చేసి వారి వద్ద 8 ఫుల్ బాటిళ్లు, ఐదు క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయలేదు.
♦ ఇంకొల్లులో ఓ ట్రావెల్స్ యజమాని వద్ద సాయంత్రం 8 గంటల సమయంలో 12 మధ్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తీసుకొచ్చి ఫొటోలు తీసిన తర్వాత కేసు నమోదు చేయకుండా రూ.20 వేలు లంచం తీసుకుని వదిలేశారు.
♦ పర్చూరు ఇందిరా కాలనీలోని వైఎస్సార్ సెంటర్‌లో ఈ నెల 10వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి నుంచి 12 ఫుల్ బాటిళ్లు స్వాధీనం చేసుకుని ఎస్‌హెచ్‌ఓ ఇంటికి తీసుకెళ్లారు.
♦ ఈ నెల 11వ తేదీన దొరికిన 13 ఖరీదైన మద్యం సీసాలను ఇంటికి తీసుకెళ్లి తక్కువ ఖరీదు ఉన్న 9 మద్యం సీసాలు చూపి కేసు నమోదు చేశారు. వీటితో పాటు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎస్‌హెచ్‌వో రమణమ్మ అవినీతిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుని డిపార్ట్‌మెంట్ పరువు కాపాడాలని ఎస్‌ఈబీ అసిస్టెంట్ కమిషనర్‌ను సిబ్బంది కోరారు.
Comments
Please login to add a commentAdd a comment