పనితీరు..ప్చ్‌ ! | Prakasam Police Negligence on Pending Cases | Sakshi
Sakshi News home page

పనితీరు..ప్చ్‌ !

Published Fri, Dec 27 2019 1:08 PM | Last Updated on Fri, Dec 27 2019 1:08 PM

Prakasam Police Negligence on Pending Cases - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ‘సారూ.. ఆ ఎస్‌ఐ మమ్మల్ని పట్టించుకోవడం లేదయ్యా.. తమరే మాకు న్యాయం చేయాలి..’ అంటూ ఓ వృద్ధ దంపతులు మొరపెట్టుకోగా.. ‘ఎస్పీ గారూ.. మా స్థలం కబ్జా చేసినోళ్లకు సీఐ వత్తాసు పలికి, ఫిర్యాదిచ్చిన మా మీదనే బెదిరింపులకు దిగుతున్నాడంటూ...’ మరికొందరు బాధి తులు వాపోతున్న పరిస్థితి. పోలీసులు బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి.. తక్షణమే వారి సమస్యలపై స్పందించాలని జిల్లా ఎస్పీ పదేపదే నేర సమీక్షల్లో పోలీసు అధికారులకు క్లాస్‌ పీకుతూనే ఉన్నారు. అయితే, కొన్ని పోలీస్‌ స్టేషన్‌ల అధికారులకు మాత్రం కనీసం, చీమకుట్టినట్‌లైనా ఉండటం లేదు. అచ్చంగా కాసులొచ్చే కేసులపైనే మక్కువ చూపుతూ ... అన్యాయం జరిగిన వారిని సైతం బెదిరిస్తూ పబ్బం గడుపుకోవాలని పలువురు ఎస్‌ఐలు, సీఐలు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో కొందరు పోలీస్‌ అధికారులు చేస్తున్న ‘అవినీతి’ వ్యవహారాలు అందరికీ చెడ్డపేరు తెస్తున్నాయని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నారు. మరికొన్ని పోలీస్‌స్టేషన్‌లలో అయితే అసాంఘిక శక్తులకు అండగా నిలుస్తూ అక్రమ దందాకు సహకరిస్తూ భారీ స్థాయి అవినీతికి తెగబడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అవినీతి ఆరోపణలు, పనితీరు బాగుండని పోలీస్‌ స్టేషన్‌ అధికారులపై గుంటూరు రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజిలాల్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌లు దశలవారీగా చర్యలు చేపడుతూనే ఉన్నారు. అయినా క్షేత్రస్థాయిలో íపోలీస్‌ అధికారుల పనితీరులో మార్పు రాకపోవడంపై ఎస్పీ సీరియస్‌గా ఉన్నారు. ప్రతీ సోమవారం జిల్లా కేంద్రంలో జరుగుతున్న ‘స్పందన’ కార్యక్రమంలో అవినీతి పోలీస్‌ అధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటమే ఇందుకు నిదర్శనం.

జిల్లాలో కొందరు సీఐలకు ఇంకా పాత ప్రభుత్వ వాసనలు పోయినట్లుగా లేవు. ఇప్పటికీ టీడీపీ నేతల అక్రమ దందాలకు సహకరిస్తూనే ఉన్నారు. అక్రమ వ్యవహారాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్పీలు, కలెక్టర్‌లకు పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే జిల్లాలో గతంలో మాదిరిగా అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా జిల్లా ఎస్పీ ఉక్కుపాదం మోపుతూ వస్తున్నారు. అయితే కొందరు కిందిస్థాయి పోలీస్‌ అధికారులు మాత్రం అక్రమార్కులతో చేతులు కలిపి భారీ స్థాయి అవినీతికి తెరతీసినట్లు ఎస్పీ దృష్టికి వచ్చింది. జిల్లాలో ఇటీవల వివిధ స్టేషన్ల పరిధిలోని ఎస్సై, సీఐ స్థాయి అధికారులపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారితో అమర్యాదగా మాట్లాడటం, దురుసుగా ప్రవర్తిస్తూ పోలీస్‌శాఖకే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదులు అందాయి. గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు అధికారులే వాటికి విఘాతం కల్పించేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సివిల్‌ వివాదాల్లో తలదూర్చుతున్న పోలీసు అధికారులపైనే ఉన్నతాధికారులకు అధికంగా ఫిర్యాదులందుతున్నాయి. స్పందన కార్యక్రమంలో ఒకే స్టేషన్‌ పరిధిలో పోలీస్‌ అధికారులపై రెండు, మూడు సార్లు ఫిర్యాదులు వస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పినా ఫలితం లేకుండా పోతోంది. 

అవినీతి ‘ఛీ’ఐల ఏరివేతకు రంగం సిద్ధం:  జిల్లాలో పోలీస్‌ అధికారుల అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ పూర్తిస్థాయిలో నిఘా ఉంచారు. కొందరు సీఐలు అక్రమార్కులతో చేతులు కలిపి అవినీతికి పాల్పడుతున్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. పోలీస్‌ స్టేషన్‌లలో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో రైటర్‌లందరిపైనా బదిలీ వేటు వేసిన ఎస్పీ ఇప్పుడు ఎస్సై, సీఐలపై సీరియస్‌గా దృష్టి సారించారు. చీరాల సబ్‌డివిజన్‌ పరిధిలో ఓ సీఐ, ఒంగోలు సబ్‌డివిజన్‌ పరిధిలోని ఇద్దరు సీఐలు, దర్శి, మార్కాపురం, కందుకూరు పోలీస్‌ సబ్‌డివిజన్‌ల పరిధిలో ముగ్గురు సీఐలు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నట్లు ఎస్పీ రహస్య విచారణలో తేలడంతో అందుకు సంబంధించి ఆధారాలతో సహా నివేదిక సిద్ధం చేసి ఐజీకి పంపేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా అక్రమ వ్యవహారాలకు పాల్పడే వారితో కొందరు సీఐలు ముందుగానే మాట్లాడుకుని పోస్టింగ్‌ల కోసం ప్రయత్నిస్తున్న వైనం ఎస్పీ దృష్టికి రావడంతో అలాంటి వారికి జిల్లాలో ఎక్కడా పోస్టింగ్‌లు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం.

ఇందులో భాగంగా ఇటీవల సింగరాయకొండ సర్కిల్‌ పోస్టింగ్‌ కోసం నెల్లూరులో పని చేస్తున్న ఓ సీఐ చేసిన ప్రయత్నాలకు పోలీస్‌ ఉన్నతాధికారులు అడ్డుకట్ట వేసిన విషయం తెలిసిందే. తనకు పోస్టింగ్‌ వేయిస్తే మీరు ఏం చేసినా పట్టించుకోనంటూ సదరు సీఐ కొందరు అక్రమార్కులతో ఒప్పందం చేసుకున్న విషయం ఎస్పీ, ఐజీ దృష్టికి రావడంతో ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకుండా సీసీఎస్‌లో పనిచేస్తున్న శ్రీనివాసరావుకు పోస్టింగ్‌ ఇచ్చారు. అంతేకాకుండా పోలీస్‌శాఖ నిర్ణయాలకు సంబంధించిన ఇంటి గుట్టును కొందరు పోలీస్‌ అధికారులు బయటకు చెబుతూ అక్రమార్కులకు సహకరిస్తున్నట్లు తెలుసుకున్న ఎస్పీ వారిపై రహస్య విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. అవినీతికి పాల్పడే వారితోపాటు, పనితీరు బాగాలేని ఎస్సైలు, సీఐల జాబితాను తయారు చేసిన ఎస్పీ వారిపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement