సాక్షి, అమరావతి: గుట్కాను నిషేధించినప్పటికీ రాష్ట్రంలో అక్రమంగా సాగుతున్న దందాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. గుట్కా రాకెట్ ఆటకట్టించేందుకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)కు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. గుట్కా అక్రమ రవాణా, అమ్మకాలను అరికట్టే బాధ్యతను సెబ్ పరిధిలోకి తెచ్చింది.
రాష్ట్రంలో గంజాయి, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా సెబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సెబ్ పరిధిని విస్తరిస్తూ గుట్కా దందా ఆటకట్టించే బాధ్యతను కూడా దీని పరిధిలోకి తేవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు సెబ్‌కు విస్తృతంగా అధికారాలు కల్పించారు. రాష్ట్రం ఒక యూనిట్‌గా గుట్కా కేసులను సెబ్ పరిధిలోకి తేనున్నారు. ఈమేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
సెబ్‌తో అడ్డుకట్ట సులభం
గుట్కా ప్రధానంగా ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి అక్రమంగా తెస్తున్నారు. స్థానిక పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, జిల్లా సరిహద్దులు వంటి సాంకేతిక కారణాలతో నిందితులు బెయిల్ పొందుతూ తప్పించుకుంటున్నారు. కేసుల దర్యాప్తులో కూడా కాలయాపన జరుగుతోంది. దాంతో గుట్కా దందాను అడ్డుకునే బాధ్యతను స్థానిక పోలీసులకంటే సెబ్‌కు అప్పగించడమే మంచిదని నిర్ణయించారు.
రాష్ట్రం అంతా సెబ్ అధికార పరిధిలోకి వస్తుంది కాబట్టి జిల్లా సరిహద్దులు వంటి సాంకేతిక అడ్డంకులు ఉండవు. సెబ్‌కు ఇప్పటికే ప్రత్యేకంగా 208 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతోపాటు అవసరమైతే పొరుగు రాష్ట్రాల పోలీసులతోనూ సమన్వయం చేసుకొనే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టడంతో పొరుగు రాష్ట్రాలకు సెబ్ మార్గనిర్దేశం చేస్తోంది. అందువల్ల పొరుగు రాష్ట్రాలతో సమన్వయం కూడా సెబ్‌కు సులభం అవుతుంది.
గుట్కా రాకెట్‌ను అరికట్టడంలో కూడా సెబ్ స్థానిక పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసులతోనూ కలిసి పనిచేయగలుగుతుంది. ఇప్పటికే ‘క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్‌ఎస్)’ పరిధిలోకి పోలీసు విభాగంతోపాటు సెబ్ కూడా చేరింది. సీసీటీఎన్‌ఎస్‌లోని సమాచారం రాష్ట్రంలోని 950 పోలీసు స్టేషన్లతోపాటు 208 సెబ్ పోలీసు స్టేషన్లకూ అందుబాటులోకి వచ్చింది. దీంతో సెబ్ అధికారులు సమర్థంగా గుట్కాను కట్టడిచేయొచ్చు.
సాంకేతిక అంశాలను సాకుగా చూపించి నేరస్తులు తప్పించుకునే అవకాశాలూ ఉండవు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సెబ్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, గుట్కాతో పాటు అన్ని రకాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
AP: గుట్కాపై ‘సెబ్’ అస్త్రం
Published Thu, Sep 15 2022 5:49 AM | Last Updated on Thu, Sep 15 2022 8:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment