gutka ban
-
తిరుమల కొండపైకి గుట్కా అక్రమ రవాణా
సాక్షి, తిరుపతి: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తిరుమల కొండపైకి గుట్కా, మద్యం యథేచ్ఛగా సరఫరా అవుతున్నాయి. ఘాట్ రోడ్డులో తినిపడేసిన గుట్కా ప్యాకెట్లు కుప్పలుకుప్పలుగా దర్శనమివ్వడం భక్తులను కలవరపెడుతోంది.అలిపిరి వద్ద నామమాత్రపు తనిఖీలు జరగడమే ఇందుకు కారణమన్న వాదన వినిపిస్తోంది.నిఘావ్యవస్థ నిద్రపోతుండడం వల్లే తిరుమల కొండపైకి నిత్యం నిషేధిత వస్తువులు తరలిపోతున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు ఏదీ పట్టించుకోవడం లేదు. ఇదీ చదవండి: చంద్రబాబు సర్కార్.. మళ్లీ కన్సల్టెంట్ల రాజ్యం -
నిషేధం.. వారికి ఓ వరం
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం గుట్కాను నిషేధించిన విష యం తెలిసిందే. కానీ ఆ నిషేధిత వస్తువే కొందరికి వరంగా మారి కోట్లాది రూపా యల లాభం చేకూరుస్తోంది. మొన్నటి వరకు వ్యాపారులే గుట్కా దందా చేయగా..ఇప్పుడు కొందరు రాజకీయ నాయకులు కూడా అందులోకి దిగారు. అసలే రాజకీయ నేతలు..ఆపై ప్రజాప్రతినిధులు కావడంతో ఆహార కల్తీ నియంత్రణ, పోలీసు శాఖలు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అడపాదడపా టార్గెట్ల కోసం దాడులు చేసి గుట్కా ప్యాకెట్లను స్వా«దీనం చేసుకొని కేసులు పెడుతున్నారే తప్ప సూత్రధారులు, గుట్కా రాకెట్‌ను నిరోధించలేకపోతున్నారు. ఒక్క లారీ సరుకుపై రూ.60–రూ.80 లక్షల ఆదాయం మాణిక్‌చంద్, సితార్, సాగర్, గోవా, రెబల్, సిమ్లా, గోవా, అంబర్..పేర్లేవైనా తెలంగాణవ్యాప్తంగా గుట్కా, తంబాకు ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి మొదలైన గుట్కా దందా వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. గతంలో ప్రతిరోజూ రూ. 5 కోట్ల విలువైన గుట్కా ప్యాకెట్లు అమ్ముడుపోగా.. ఇప్పుడా అమ్మకాలు, ధరలు పెరిగి రూ.10 కోట్లకు చేరినట్టు అంచనా. కంపెనీ నుంచి హోల్‌సేల్ వ్యాపారికి.. అక్కడి నుంచి రిటైల్‌గా షాపులకు సరఫరా చేసేందుకు ప్రతీ జిల్లాలో ‘గుట్కా మాఫియా’పెద్ద నెట్‌వర్క్‌నే ఏర్పాటు చేసుకుంది. ఒక్క గుట్కా లారీ (డీసీఎం వ్యాన్) నేరుగా వ్యాపారి వద్దకు వస్తే రూ.60 లక్షల సంపాదన వచ్చినట్టే. ఒక లారీలో 250 కాటన్ల గుట్కా వస్తుంది. ఒక్కో కాటన్లో 70 పొడలు, ఒక్కో పొడలో 50 ప్యాకెట్లు ఉంటాయి. 50 పొట్లాలు ఉండే ఒక్క పొడ (బాక్స్) రూ.350లకు ఇస్తుండగా... రిటైల్ వ్యాపారులు ‘నిర్భంధం, నిషేధం, పోలీసు నిఘా’తదితర పదాలు వాడుతూ రూ.750 ల వరకు సొమ్ము చేసుకుంటున్నారు. అంటే ఒక్క గుట్కా ప్యాకెట్‌ను రూ.7లకు తీసుకొని రూ.15ల నుంచి 18ల వరకు అమ్ముతున్నారంటే లాభాలు ఏ మేరకు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. హోల్‌సేల్ వ్యాపారులు ఇవే గుట్కాలను కంపెనీని బట్టి రూ.20ల నుంచి రూ.25ల వరకు.. పాన్ టేలా, కిరాణం దుకాణందారులు రూ.30ల నుంచి రూ.40లు కూడా అమ్ముతున్నారు. సరిహద్దు 10 కిలోమీటర్ల దూరంలోనే... తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కర్ణాటక రాష్ట్రం ఉంది. బీదర్ పట్టణం రాష్ట్ర సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. బీదర్ నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలకు గుట్కా సరఫరా అవుతోంది. కర్ణాటకలో గుట్కాపై నిషేధం లేదు. తెలంగాణ ఉన్న నిషేధం, డిమాండ్‌ను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో గుట్కాకు ఉన్న డిమాండ్‌ను చూసి కొంతమంది వ్యాపారులు పట్టణంలో పరిశ్రమలను స్థాపించారు. అక్రమార్కులు బీదర్‌లో తయారవుతున్న గుట్కాను తక్కువ ధరకు కొనుగోలు చేసి తెలంగాణ అంతా రవాణా చేస్తున్నారు. కాగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం 2006 సంవత్సరంలో ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచి్చంది.దాని ప్రకారం పొగాకు ఉత్పత్తుల, విక్రయాలపై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో 2005లో గోవాలో గుట్కా, పాన్ మాసాలాను నిషేధించగా, 2012, 2013లలో మరో 15 రాష్ట్రాలు అమలు చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 జనవరి 9న గుట్కాలపై నిషేధం విధించగా, రాష్ట్ర వి¿¶భజన తర్వాత కూడా ఈ రెండు రాష్ట్రాల్లో అమలవుతోంది. బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హరిణాయా, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, పంజాబ్, మిజోరాం, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాలలోనూ గుట్కా విక్రయాలపై నిషేధం ఉంది. ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే గుట్కా విక్రయాలు, తయారీకి లైసెన్స్‌లు ఇవ్వగా, అక్కడి నుంచి అన్ని జిల్లాలకు యథేచ్ఛగా రవాణా అవుతోంది. రకరకాల పేర్లు, అధిక రేట్లు... నిండు జీవితాలు బలి పొగాకు ఉత్పత్తులను రకరకాల పేర్లతో ఎంఆర్పీ లేకుండా అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. వీటిలో విమల్, మాణిక్‌చంద్ (ఎంసీ), సితార్, సాగర్, గోవా, ఎంజీఎం, హాన్స్, చైనీఖైనీ, మీరాజ్, రెబల్, సిమ్లా, పాన్‌బార్, విమల్, 1000, ఖలేజా, ఆర్డీఎం, కె 7000, కె 9000, 24 క్యారెట్ .. వంటి వాటికి ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా భారీ గిరాకీ ఉంది. వీటిని విక్రయించే స్థలం, సమయం, పరిస్థితిని బట్టి 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అధిక ధర అయినా, దొరకడమే భాగ్యం అన్నట్టుగా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. విచ్చలవిడిగా గుట్కా, చైనీఖైనీ, వంటి పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తుండడంతో యువత వాటికి బానిసలవుతున్నారు. 2009–10 ప్రపంచ పొగాకు ఉత్పత్తుల సర్వే ప్రకారం 53.5 శాతం మంది పొగాకు, నికోటిన్ ఉత్పత్తులు వినియోగిస్తున్నట్టు తేలింది. గుట్కా, పాన్ మసాలాను నమిలేవారు 48.07 శాతం మంది ఉన్నారని ఈ సర్వేలో తేలింది. వీరిలో పిల్లలు16 శాతం వరకు ఉన్నారని అంచనా. 17 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సున్న యువకులే అధికంగా ఉన్నారు. కేన్సర్, గుండె, కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. దొరుకతలేవు అంటుండ్రు... అడ్డగోలు ధరకు ఇస్తుండ్రు రోజూ పనికి పోయినచోట మా పెద్దన్నతోటి మెల్లమెల్లగా గుట్కా అలవాటు అయ్యింది. టైంపాస్ కోసం ఏసుకున్నందుకు ఇప్పుడు అలవాటుగా మారింది. దొరుకుతలేవు అంటండ్రు.. రోజుకో రూపాయి పెంచి అమ్ముతండ్రు. ఎం.సీ (మానిక్‌చంద్) ఎనిమిది రూపాలుండే. ఇప్పుడు రూ.35ల నుంచి రూ.40లు అంటండ్రు. రెబల్, కె.7000, 24 క్యారెట్లేమో రూ.25ల నుంచి రూ.30లకు ఇస్తుండ్రు. నిషేధం ఉండుడేమో గాని అడ్డగోలు ధరలు పెంచి అమ్ముతండ్రు. – గుట్కా వినియోగదారుడు, జనగాం -
AP: గుట్కాపై ‘సెబ్’ అస్త్రం
సాక్షి, అమరావతి: గుట్కాను నిషేధించినప్పటికీ రాష్ట్రంలో అక్రమంగా సాగుతున్న దందాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. గుట్కా రాకెట్ ఆటకట్టించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)కు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. గుట్కా అక్రమ రవాణా, అమ్మకాలను అరికట్టే బాధ్యతను సెబ్ పరిధిలోకి తెచ్చింది. రాష్ట్రంలో గంజాయి, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా సెబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సెబ్ పరిధిని విస్తరిస్తూ గుట్కా దందా ఆటకట్టించే బాధ్యతను కూడా దీని పరిధిలోకి తేవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు సెబ్‌కు విస్తృతంగా అధికారాలు కల్పించారు. రాష్ట్రం ఒక యూనిట్‌గా గుట్కా కేసులను సెబ్ పరిధిలోకి తేనున్నారు. ఈమేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. సెబ్‌తో అడ్డుకట్ట సులభం గుట్కా ప్రధానంగా ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి అక్రమంగా తెస్తున్నారు. స్థానిక పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, జిల్లా సరిహద్దులు వంటి సాంకేతిక కారణాలతో నిందితులు బెయిల్ పొందుతూ తప్పించుకుంటున్నారు. కేసుల దర్యాప్తులో కూడా కాలయాపన జరుగుతోంది. దాంతో గుట్కా దందాను అడ్డుకునే బాధ్యతను స్థానిక పోలీసులకంటే సెబ్‌కు అప్పగించడమే మంచిదని నిర్ణయించారు. రాష్ట్రం అంతా సెబ్ అధికార పరిధిలోకి వస్తుంది కాబట్టి జిల్లా సరిహద్దులు వంటి సాంకేతిక అడ్డంకులు ఉండవు. సెబ్‌కు ఇప్పటికే ప్రత్యేకంగా 208 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతోపాటు అవసరమైతే పొరుగు రాష్ట్రాల పోలీసులతోనూ సమన్వయం చేసుకొనే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టడంతో పొరుగు రాష్ట్రాలకు సెబ్ మార్గనిర్దేశం చేస్తోంది. అందువల్ల పొరుగు రాష్ట్రాలతో సమన్వయం కూడా సెబ్‌కు సులభం అవుతుంది. గుట్కా రాకెట్‌ను అరికట్టడంలో కూడా సెబ్ స్థానిక పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసులతోనూ కలిసి పనిచేయగలుగుతుంది. ఇప్పటికే ‘క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్)’ పరిధిలోకి పోలీసు విభాగంతోపాటు సెబ్ కూడా చేరింది. సీసీటీఎన్‌ఎస్‌లోని సమాచారం రాష్ట్రంలోని 950 పోలీసు స్టేషన్లతోపాటు 208 సెబ్ పోలీసు స్టేషన్లకూ అందుబాటులోకి వచ్చింది. దీంతో సెబ్ అధికారులు సమర్థంగా గుట్కాను కట్టడిచేయొచ్చు. సాంకేతిక అంశాలను సాకుగా చూపించి నేరస్తులు తప్పించుకునే అవకాశాలూ ఉండవు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సెబ్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, గుట్కాతో పాటు అన్ని రకాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. -
కేసు గుట్కాయ స్వాహా..!
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల స్వాధీనం చేసుకున్న కోట్ల రూపాయల విలువైన నిషేధిత గుట్కా, ఖైనీ విడుదలకు తెరవెనుక ఖాకీలు తోడ్పాటు అందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిషేధిత గుట్కా, ఖైనీ స్వాధీనం... అనంతరం చేపట్టాల్సిన ప్రక్రియ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. వివరాల్లోకెళ్తే... ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఒడిశా నుంచి విశాఖకు వస్తున్న లారీని అడవివరం ప్రాంతంలో స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ ఆఫ్ బ్యూరో అధికారులు అనుమానంతో ఆపి తనిఖీలు చేశారు. అందులో నకిలీ గుట్కా ఖైనీలతోపాటు రూ.10 లక్షలు విలువ గల నకిలీ మద్యం కూడా దొరికింది. పట్టబడిన 10,050 మద్యం బాటిళ్ల విలువ రూ.10.05 లక్షలు, 20 లక్షల గుట్కా, ఖైనీ ప్యాకెట్ల విలువ రూ.2.07 కోట్లుగా నిర్ధారించారు. అయితే అందులోని అక్రమ మద్యం ఎస్ఈబీ అధికారులే సీజ్ చేశారు. మిగతా సుమారు రూ.2 కోట్లు విలువ చేసే గుట్కా, ఖైనీ ప్యాకెట్లను గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో లారీలో సరకు లభ్యమైతే వేరే వాహనం నంబర్ ప్లేట్ మార్చి కేసు నమోదు చేశారన్న ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి. మరోవైపు ఎస్ఈబీ సిబ్బందైతే రూ.40 వేలు ఇస్తే పట్టుకున్న వాహనాన్ని వదిలేస్తామని ఆఫర్ కూడా ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. బయటకు వస్తే చాలా ప్రమాదం ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్న సరకు బయటకు తీసుకొచ్చేందుకు సంబంధిత వ్యక్తులు అనేక ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. వీరికి పోలీసులు కూడా సహకరించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అసలే రసాయనాలు, కెమికల్స్‌తో తయారు చేసిన గుట్కా, ఖైనీలు.. ఆపై మూడు నెలలకు పైగా నిల్వ ఉన్న వాటిని బయటకు తీసుకొచ్చి మార్కెట్లో విక్రయిస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముంది. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న గుట్కా, ఖైనీలు అధికశాతం నకిలీవే. కొందరు పోలీసుల తీరుతో చెడ్డపేరు రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ నగరంలో స్వేచ్ఛగా గుట్కా, ఖైనీ అమ్మకాలు జరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి విశాఖ నగరానికి అక్రమ మార్గంలో సరకు తరలిస్తున్నారు. అధికారులతో కొందరు బడాబాబులు కుమ్మక్కై సరకు అమ్మకాలు చేస్తున్నారు. లారీల్లో, రైళ్లలో ఏదో ఒక రకంగా సరకు నగరానికి తీసుకొచ్చి దుకాణాలకు చేరవేసి విక్రయిస్తున్నారు. అయితే వీటి నియంత్రణకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ గుట్కా మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో కొంత మంది పోలీసులు ముఠా సభ్యులతో చేతులు కలుపుతుండడంతో భారీ స్థాయిలో సరకు సీజ్ చేస్తున్నా ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. ఎస్ఈబీ, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది శ్రమించి నిషేధిత గుట్కా, ఖైనీలను పట్టుకొని పోలీసులకు అప్పగిస్తుంటే.. అక్కడ మాఫియా సభ్యులు పోలీసులకు ముడుపులు చెల్లించి తమకు అనుకూలంగా కేసును మలచుకొని సరకు విడుదల చేసుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా ప్రక్రియ నిలిపివేత మత్తు పదార్థాలు, గుట్కా, ఖైనీ పట్టుబడిన వెంటనే పంచనామా చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ పరిశీలించి ఇచ్చిన రిపోర్టుని కోర్టుకు అందజేయాలి. కోర్టు తీర్పు ఆధారంగా ఈ హానికరమైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను దహనం చేయాలి. కానీ పోలీసులు అలా చేయలేదు. స్వాధీనం చేసుకున్న సరకు ఎస్ఈబీ అధికారులు అప్పగించిన తర్వాత గోపాలపట్నం పోలీసులు ఓ గొడౌన్లో భద్రపరిచారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. అక్కడితో తమ పని అయిపోయిందన్నట్లు ఊరుకున్నారు. సుమారు రెండున్నర నెలల (80 రోజులు)పాటు ఆ ప్రక్రియ ఏమీ పూర్తి చేయకుండా స్వాధీనం చేసుకున్న సరకును గొడౌన్‌లోనే నిల్వ ఉంచారు. ఇంతలో సరకు తరలిస్తూ పట్టుబడిన నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చి కోర్టును ఆశ్రయించారు. తమ సరకు విడిపించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే నిందితులు కోర్టును ఆశ్రయించే వరకు పోలీసులు ఉద్దేశపూర్వక నిర్లిప్తత ప్రదర్శించారని, అందుకు భారీగా ముడుపులు ముట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యాయస్థానం ఆదేశాలు పాటిస్తాం ఎస్ఈబీ పోలీసులు గుట్కా, ఖైనీ స్వాధీనం చేసుకుని మాకు అప్పగించారు. అనంతరం తాము సీజ్ చేశాం. గుట్కా, ఖైనీ సరకు తిరిగి ఇచ్చేయమని కోర్టు నుంచి సంబంధిత సరఫరాదారులు ఆర్డర్ తెచ్చుకుంటే విడుదల చేయకతప్పదు. ఈ కేసులో కూడా న్యాయస్థానం నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. – మళ్ల అప్పారావు, గోపాలపట్నం సీఐ గోపాలపట్నం పోలీసులకు అప్పగించాం గత ఫిబ్రవరి నెలలో అడవివరం జంక్షన్లో లారీ తనిఖీ చేయగా సుమారు రూ.2కోట్ల విలువైన గుట్కా, ఖైనీ పట్టుబడింది. కేసు నమోదుచేసి గోపాలపట్నం పోలీసులకు సరకు అప్పగించాం. అనంతరం నిందితులు బెయిల్ తెచ్చుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం తీర్పు ఆధారంగా తాము నడుచుకుంటాం. – శ్రీనాథుడు, ఏఈఎస్, ఎస్ఈబీ (చదవండి: ఉన్మాదికి ఉరి.. సరైన తీర్పు) -
ట్విటర్లో ఫోటో షేర్.. పోలీసులకే పంచ్ వేసిన నెటిజన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులు, గుట్కాలపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలోనే వీటి అక్రమ దందాలపై పోలీసులు డేగకన్ను వేసి ఉంచుతున్నారు. తరచుగా దాడులు చేస్తూ ఇవి కలిగి ఉన్న, విక్రయిస్తున్న వా రిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఓపక్క ఈ చర్యలు కొనసాగిస్తూనే మరోపక్క ఈ ఉత్పత్తులు సేవించడం వల్ల కలిగే నష్టాలపై అవగాహనకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా నగర పోలీసు అధికారిక సోషల్‌మీడియా ఖాతాల్లో సోమవారం ఓ ఫొటోను షేర్ చేశారు. గుట్కా, పొగాకు ఉత్పత్తులు విక్రయించే ఓ పాన్ డబ్బా ఫొటోను పొందుపరిచారు. అందులో సదరు డబ్బాపై ది క్యాన్సర్ హబ్ అని రాసి ఉంది. ఈ హబ్‌కు సరైన పేరు సూచించండి అంటూ నెటిజనుల్ని పోలీసులు కోరారు. ఈ పోస్టు నో గుట్కా, నో టొబాకో హ్యాష్ టాగ్స్‌తో వైరల్ అయింది. దీనికి స్పందించిన అనేక మంది పలు ఆకర్షణీయమైన, చిత్రమైన పేర్లు సూచించారు. దీనిపై ఘాటుగా స్పందించిన నెటిజనులు ఉన్నా రు. ఓ ట్విట్టర్ వినియోగదారు.. ‘ఆర్టీఏ, రిజిస్ట్రేషన్ ఆఫీసు వంటి ప్రభుత్వ కార్యాలయాల వద్ద కరప్షన్ హబ్ అనే బోర్డు పెట్టాలి’ అని సూచించారు. నగరంలో వీటి విక్రయంపై నిషేధం ఉండటంతో ఈ ఫొటో ఎక్కడదనే సందేహం అనేకమందికి కలుగుతోంది. ఈ వివరాలు సిటీ పోలీసులు తమ పోస్టులో ప్రకటించలేదు. చదవండి: విద్యార్థిని స్నేహితుడే హతమార్చాడా..? -
నిషేధం ఉన్నా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నగుట్కా
-
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై రేపటి నుంచి ఏడాది పాటు నిషేధం విధిస్తూ కుటుంబ సంక్షేమ,ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: మ్యూచువల్ బదిలీలకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులయిన గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు పదార్థాలు అన్నిటిపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. వీటిని ఏ పేరుతో నైనా తయారు చేయడం అమ్మడం, సరఫరా చేయడం, నిల్వ చేయడం నేరమని.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని కాటమనేని భాస్కర్ హెచ్చరించారు. -
గుట్కా దందా కు చెక్
-
సినీ నటుడు సచిన్ జోషి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : గుట్కా అక్రమ రవాణా కేసులో సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాన్ మసాలాల ముసుగులో నిషేధిత గుట్కాలు తయారీ, సరఫరా చేస్తున్న ఆయనను ముంబై విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన సచిన్ జోషిని నిర్బంధంలోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. కాగా హైదరాబాద్‌కు అక్రమంగా గుట్కా తరలింపులో సచిన్ జోషి హస్తమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆయనపై ఐపీసీ 273,336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ('గుట్టు'కా దందా!) కాగా ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కాల తయారీ, సరఫరాపై సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిఘా పెంచారు. పెద్ద మొత్తంలో గుట్కా బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గుట్కా కోట్ల రూపాయల్లో ఉంటుందని సమాచారం. ఈ కేసులో నిందితుల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విచారణలో సచిన్ జోషి పేరు బయటకు రావడంతో ఆయనపై బహదూర్ పురా పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 336, 273 కింద కేసు నమోదు అయింది. అప్పటి నుంచి సచిన్ జోషి విదేశాల్లో ఉండటంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్ నుంచి ముంబైకి రాగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. (గుట్టుగా.. బెంగళూరు టు నెల్లూరు) ఇక హిందీలో అత్యంత సంపన్నమైన నటుల్లో సచిన్ జోషి ఒకరు. ఆయన గుట్కా వ్యాపారంలో ప్రసిద్ధి చెందాడు. గుట్కా కింగ్‌గా ఆయన తండ్రిని పిలుస్తుంటారు. ఓ వైపు ముంబయి, మరోవైపు హైదరాబాద్‌లో అక్రమంగా ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్రమంగా భారీ సంపాదించి ఎంజాయ్ చేస్తుంటారని, అందులో భాగంగానే సినిమాలు చేస్తున్నారని భోగట్టా. సచిన్ జోషి ‘మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, ఆజాన్, జాక్‌పాట్, వీరప్పన్, వీడెవడు, నెక్ట్స్ ఏంటీ, అమావాస్ చిత్రాల్లో నటించారు. ఇదిలా ఉంటే ఇటీవల బాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన నేపథ్యంలో తాజాగా సచిన్‌ని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ('చిరుద్యోగి నుంచి ఏడాదికి రూ.20కోట్ల టర్నోవర్‌కు') -
'గుట్టు'కా దందా!
సంస్థాన్ నారాయణపురం(మునుగోడు) : నిషేధిత గుట్కా వ్యాపారం గుట్టుగా సాగుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గుట్కాల నిషేధం అమలు చేస్తున్నప్పటికీ కొందరు అక్రమార్కులు మాఫియాను తలపించే విధంగా గుట్కా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు. మాఫియా ఎత్తులు వేస్తూ నిషేధిత గుట్కాను కిరాణం షాపులు, పాన్ డబ్బాలకు చేరవేస్తున్నారు. ఎస్ఓటీ పోలీస్‌లు అక్కడక్కడ దాడులు చేసి పట్టుకున్నప్పటికీ వ్యాపారాన్ని అదుపు చేయలేకపోతున్నారు. చైన్ సిస్టంలో గుట్కా దందా.. మాఫియా తీరును పోలి చైన్ సిస్టంలో గుట్కా దందా నడుస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి వాహనాల ద్వారా రాష్ట్రంలోకి వస్తుంది. వాహనాల్లో అడుగు భాగంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు పైన నిత్యావసర సరుకులు, కూరగాయలు వేస్తూ, కొందరు కార్లలో తీసుకు వస్తారు. వీరి దగ్గర నుంచి ఒక ప్రాంతాన్ని బట్టి మరొక దళారీ కొనుగోలు చేస్తాడు. అతను మండలంలోని ఒక్కరు, ఇద్దరు ఏజెంట్లను పెట్టుకుంటాడు. వారు రిటైల్(కిరాణం షాపులు, పాన్‌డబ్బాలు)గా లక్ష్యంగా పెట్టుకొని అక్కడికి చేరవేస్తారు. పోలీస్‌లకు చిక్కరు.. చైన్ సిస్టంలో ఉన్న వారు ఎవరు కూడా పోలీస్‌లకు చిక్కరు. గుట్కా తీసుకొస్తున్న వాహనం ముందు మరో వ్యక్తి ద్విచక్ర వాహనం పోలీస్‌ల తనిఖీలపై సూచనల మేరకు గుట్కా వాహనం ముందుకు వస్తుంది. వాహనం, మొబైల్ నంబర్లు తరచు మారుస్తుంటారు. గుట్కాల కోసం పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు కాల్ చేస్తారు కానీ, కింది స్థాయి నుంచి కాల్ చేసే పరిస్థితి ఉండదు.(రిటైల్ యజమాని ఏజెంట్‌కు, ఏజెంట్ దళారికి.. కాల్ చేసే పరిస్థితి ఉండదు). గుట్కాలు ఎంపిక చేసే ప్రాంతానికి వచ్చే వరకు తీసుకునే వ్యక్తికి తెలియకుండా చేరవేస్తారు. ఏజెంట్లు కూడా స్టాక్ పాయింట్లను ఎప్పటికప్పుడు మారుస్తూ దందా చేస్తున్నారు. ఏజెంట్లు కూడా వాహనాలు మారుస్తూ, కొంత మంది ఏజెంట్లు స్నేహం పేరుతో యువతను మద్యానికి బానిసలుగా మార్చి దందాలో వాడుకుంటున్నారు. ఎస్ఓటీ పోలీస్‌లు గుట్కా ఏజెంట్లపై నిఘా పెట్టి దాడులు చేస్తుండడంతో అప్పుడప్పుడు కేసులు నమోదవుతున్నాయి. మూడు, నాలుగు రోజుల తర్వాత యథావిధిగా నిషేధిత గుట్కా దందా కొనసాగుతోంది. జిల్లాలో రూ.3 కోట్లకు పైగానే దందా జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారం నెలకు రూ.3కోట్లకు పైగానే ఉంటుంది. గుట్కా నమిలేవారి అభిరుచి ఆధారంగా సుమారు 10 పేర్లతో సాధారణ గుట్కా, పాన్మసాలాగుట్కా(రెండు ప్యాకెట్లను కలిపి తింటారు) తయారు చేస్తారు. ఈ ప్యాకెట్ మీద ధర రూ.9, కొన్నింటి మీద రూ.10 వరకు ఉంటుంది. దళారి వద్దకు వచ్చే సరికి రూ.7, ఏజెంట్ వద్దకు వచ్చే సరికి 8, రిటైల్‌గా వచ్చే సరికి రూ.12 ఉండగా, గుట్కా నమిలేవారి దగ్గరికి వచ్చేసరికి రూ.20 ధర ఉంటుంది. లాక్డౌన్ నేపథ్యంలో వీటి ధరలు దళారి, ఏజెంట్లు అమాంతం పెంచారు. రిటైల్‌గా ప్యాకెట్‌కు రూ. 40నుంచి రూ.50వరకు అమ్మకం చేస్తున్నారు. ప్రతి మండలంలోని ఏజెంట్ల దందా నెలకు రూ.12లక్షలు ఉండగా, హైదరాబాద్, నల్లగొండ నుంచి తెచ్చుకునే వారిది మరో రూ.3లక్షల వరకు ఉంటుంది. చౌటుప్పల్, భువనగిరి, ఆలేరు, మోతూరు, వలిగొండ, రామన్నపేట, యాదగిరిగుట్ట పెద్దపెద్ద మండలాల్లో వీటి అమ్మకం చిన్న మండలంలో కంటే రెట్టింపు ఉంటుంది. లాక్డౌన్ నేపథ్యంలో నిషేధిత గుట్కా కొరతను చూపుతూ అధిక ధరలు అమ్ముతుండడంతో నెల టర్నోవర్, లాభం రెట్టింపు అయ్యిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యాపారి తెలిపాడు. నారాయణపురం నుంచి నల్లగొండ.. సంస్థాన్ నారాయణపురం నుంచి నల్లగొండ వరకు ముగ్గురు గుట్కా దందాదారుల కనుసన్నల్లో నిషేధిత గుట్కా దందా గుట్టుగా నడుస్తోందని ఆరోపణలు ఉన్నాయి. నల్లగొండకు చెందిన ఓ వ్యక్తి గుట్కా దళారి, ఏజెంట్‌గా నల్లగొండ, చుట్టు పక్కల మండలాల్లోని ఏజెంట్లకు, మునుగోడులోని కొన్ని గ్రామాలకు అమ్మకం చేస్తాడు. చిట్యాల మండలానికి చెందిన మరో ఏజెంట్ చిట్యాల, చౌటుప్పల్, మునుగోడులోని కొన్ని గ్రామాలకు, సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన మరో ఏజెంట్ సంస్థాన్ నారాయణపురం , మర్రిగూడ, మునుగోడు, చౌటుప్పల్ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో నిషేధిత గుట్కా దందా నిర్వహిస్తున్నారు. గత మూడు నెలల్లో నమోదైన కేసులు.. ♦ మే 29న కర్నాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి స్విఫ్ట్ కారులో 16 బ్యాగులు గుట్కా ప్యాకెట్లును ఆలేరు మీదుగా తరలిస్తుండగా, రోడ్డు ప్రమాదం జరగడంతో గుర్తించారు. కేసు నమోదు చేశారు. ♦ హైదరాబాద్‌లోని ఘట్కేసర్కు చెందిన ఇమ్రాన్, రాహులు కలిసి భూదాన్ పోచంపల్లి మండలంలో రూ.50వేల విలువ చేసే నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ♦ చౌటుప్పల్‌లోని ఓ కిరాణం షాపులో 1.50లక్షల నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ♦ భువనగిరిలో ఇద్దరు వ్యక్తులు ఉన్న రూ.30వేల విలువ గల నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. ♦ చౌటుప్పల్ మండలంలోని పంతంగిలో ఓ కిరాణం షాపులో రూ.40వేల గుట్కాను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. ♦ చౌటుప్పల్ మండలంలోని పీపల్‌పహాడ్‌లో ఓ ఏజెంట్ రూ.50వేల గుట్కాను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. ♦ వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామంలో ఓ కిరాణం షాపులో రూ.50వేల విలువ చేసే గుట్కాలను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. ♦ భూదాన్‌పోచంపల్లి మండలంలో ఓ కిరాణం షాపులో రూ.60వేల విలువ చేసే నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. కేసులు నమోదు చేస్తున్నాం నిషేధిత గుట్కాపై ఇప్పటికే భువనగిరి, చౌటుప్పల్, అలేరులో కేసులు నమోదు చేశాం. సమాచారం ఉంటే గుర్తించి, కేసులు నమోదు చేస్తాం. – నారాయణరెడ్డి, డీసీపీ,యాద్రాది భువనగిరి -
గుట్టుగా.. బెంగళూరు టు నెల్లూరు
నెల్లూరు(క్రైమ్): బెంగళూరు నుంచి నిషేధిత పొగాకు ఉత్పత్తులైన గుట్కాలు, ఖైనీలను గుట్టుగా దిగుమతి చేసుకుని కోళ్లఫారం సమీపంలోని గదిలో నిల్వ చేశారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న నెల్లూరులోని నవాబుపేట పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. బుధవారం నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి వివరాలను వెల్లడించారు. వివిధ మార్గాల్లో.. కోవూరు మండలం పెద్దపడుగుపాడు విన్నకోటవారి వీ«ధికి చెందిన అంకిరెడ్డి వినోద్‌కుమార్, ఎన్.సందీప్‌కుమార్‌లు గుట్కా, ఖైనీలను బెంగళూరు నుంచి వివిధ మార్గాల్లో నెల్లూరుకు దిగుమతి చేసుకునేవారు. వాటిని జిల్లాలోని పలువురు వ్యాపారులకు విక్రయించేవారు. కొంతకాలంగా వారు ప్రశాంతినగర్‌లోని పాడుబడిన కోళ్లఫారం వద్ద ఉన్న గదిని గోదాముగా చేసుకుని పెద్దఎత్తున గుట్కాలను నిల్వ చేశారు. లాక్డౌన్ వేళ అధిక ధరలకు వాటిని విక్రయిస్తూ జేబులు నింపుకోసాగారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న నవాబుపేట ఇన్స్పెక్టర్ కె.వేమారెడ్డి తన సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి గోదాముపై దాడులు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి వీ1, హెచ్1 బ్రాండ్లకు చెందిన రూ.10,72,410 గుట్కా, ఖైనీలను స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన నిందితులను పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని చెప్పారు. వారికి సహకరిస్తున్న వారి వివరాల గురించి ఆరాతీస్తున్నామన్నారు. నిందితుల్లో ఒకరైన వినోద్‌పై ఇప్పటికే పలు కేసులున్నాయని, త్వరలోనే రౌడీషీట్ సైతం తెరుస్తామని వెల్లడించారు. నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ కె.వేమారెడ్డి, ఎస్సైలు రమేష్‌బాబు, బి.శివప్రకాష్, హెడ్ కానిస్టేబుల్ సాల్మన్, టి.శ్రీనివాసులు, కానిస్టేబుల్స్ బి.మోహన్‌బాబు. ఎస్.సురేంద్రబాబు, పి.వెంకటేశ్వర్లును డీఎస్పీ అభినందించారు. -
చూయింగ్ గమ్, గుట్కా, పాన్‌పై నిషేధం
హర్యానా: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు హర్యానా ప్రభుత్వం చూయింగ్ గమ్ అమ్మకాలను జూన్ 30 వరకూ నిషేధించినట్లు తాజాగా ప్రకటించింది. ఉమ్మివేయడం ద్వారా కోవిడ్-19 వ్యాపిస్తున్న నేపథ్యంలో చూయింగ్ గమ్‌తో పాటు పాన్ మసాలా, గుట్కాపై కూడా నిషేధం విధించింది. ప్రభుత్వం ఆదేశించిన ఈ నిషేధాన్ని సమవర్థవంతాగా అమలు చేయాలని అధికారులను కోరింది. ‘కరోనా వైరస్ నోటీలోని లాలాజలంతో కూడా వ్యాపిస్తుంది. దీంతో చూయింగ్ గమ్ తినేవారు ఉమ్మివేయడం వల్ల ఆ లాలాజలం ద్వారా ఇతరులకు కరోనా సోకే అవకాశం ఉంది’ అని రాష్ట్ర ప్రభుత్వ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ శాఖ వెల్లడించింది. (కరోనాకు సవాల్: క్యూబా వైద్యుల సాహసం) అలాగే గత ఏడాదిలో గుట్కా, పాన్ మసాలా, పోగాకుపై విధించిన నిషేధాన్ని కూడా ఏడాది పాటు అమలు చేయాలని సదరు డిపార్ట్మెంట్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సువాసన, రుచిగల పొగాకు, గుట్కా, పాన్ మసాలా, సున్నం(చునా) పంపిణీనిలపై కూడా తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించింది. ఇక రాష్ట్రంలో కరోనా అనుమానితులు 13000 మంది ఉన్నారని, వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా పాన్ మసాలా తయారి, అమ్మకాలపై ఇప్పటికే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. (ఆ వార్డులన్నీ రెడ్ జోన్లు) -
నిషేధిత గుట్కా, గంజాయి విక్రయాలపై దాడులు
నెల్లూరు(క్రైమ్): నిషేధిత గుట్కా, జర్ధా, గంజాయిని విక్రయిస్తున్న వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.2.80లక్షల విలువ చేసే సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను చిన్నబజారు పోలీసుస్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జే శ్రీనివాసులరెడ్డి వివరాలను వెల్లడించారు. నగరంలోని పాతపెద్దాస్పత్రి మెక్లిన్స్‌రోడ్డుకు చెందిన ఎన్ వెంకటేషన్ అలియాస్ వెంకటేష్ బడ్డీకొట్టు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా బెంగుళూరు నుంచి నిషేధిత గుట్కాలు, జర్ధాలు, విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని దిగుమతి చేసుకుని ఇంట్లోనే నిల్వచేసేవాడు. అనంతరం నెల్లూరు నగరం, పరిసర ప్రాంతాల్లోని వ్యాపారులకు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న చిన్నబజారు పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం మధుబాబు ఈ నెల 25న ఎస్సై రవినాయక్, సిబ్బందితో కలిసి వెంకటేష్ ఇంటిపై దాడిచేశారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.2.60లక్షల విలువచేసే 190టన్నుల నిషేధిత జర్ధా, 83,767 ప్యాకెట్ల గుట్కా, ఖైనీలు, రూ.20వేల విలువచేసే రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడ్ని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడ్ని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన ఇన్స్పెక్టర్, ఎస్సైలతో పాటు హెడ్‌కానిస్టేబుల్ భాస్కర్‌రెడ్డి, కానిస్టేబుల్స్ రాజా, వెంకటేశ్వర్లు, అల్తాఫ్ షంషుద్దీన్‌ను అభినందించి రివార్డులు ప్రకటించారు. ఇన్స్పెక్టర్ మధుబాబు, ఎస్సైలు రవినాయక్, పీ చిన్నబలరామయ్య, తదితరులు పాల్గొన్నారు. -
గుట్కా వ్యాపారం గుట్టు రట్టు
ఖాజీపేట : ఖాజీపేట కేంద్రంగా గత కొంతకాలంగా సాగుతున్న గుట్కా వ్యాపారం గుట్టు స్పెషల్ బ్రాంచ్ పోలీసుల దాడితో రట్టయింది. సుమారు రూ.లక్ష విలువైన గుట్కాను స్వాధీనం చేసుకుని నలుగురు వ్యాపారులను అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఖాజీపేట కేంద్రంగా గత కొంతకాలంగా గుట్కా, ఖైనీ, మావా వంటి నిషేధిత గుట్కాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఈ విషయం స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం రావడంతో మైదుకూరు ఎస్బీ ఏఎస్ఐ వెంకటసుబ్బయ్య, ఎస్బీ కానిస్టేబుళ్లు సంతోష్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డిలు బుధవారం చిల్లర కొట్టు దుకాణాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు లక్ష రూపాయల విలువగల గుట్కా, ఖైనీ, మావా వంటి పాకెట్ల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. దుకాణాల్లో అమ్మకాలు సాగిస్తున్న మేడా మోహన్‌చంద్ర, సుంకు ప్రహ్లాద, నల్లగుండు వెంకటసుబ్బయ్య, కోనేటి నాగేంద్రలను అదుపులోకి తీసుకుని ఖాజీపేట పోలీసులకు అప్పగించారు. ఖాజీపేట నుంచే సరఫరా ఖాజీపేటలోని పలువురు వ్యాపారులు హైదరాబాద్, బెంగళూరు నుంచి ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల ద్వారా ఈ బస్తాలను తీసుకు వస్తున్నట్లు విచారణలో గుర్తించారు. తమకు అనుకూలమైన వారు బస్సు డ్రైవర్‌గా ఉన్నప్పుడు బస్తాలను తీసుకు వస్తున్నారు. ఆ బస్తాలను బైపాస్‌లో దించి అక్కడినుంచి రహస్య గోడౌన్లకు తరలిస్తున్నారు. ఆ తర్వాత ఖాజీపేటలోని అన్ని దుకాణాలకు, గ్రామాల్లోని దుకాణాలకు, చెన్నూరు, మైదుకూరు, కడపకు సరఫరా చేస్తున్నారు. అధిక లాభమే వ్యాపారానికి కారణం గుట్కా వ్యాపారంతో భారీ ఆదాయం వస్తున్నందున పోలీసులు ఎన్ని కేసులు పెడుతున్నా అమ్మకాలు ఆపడం లేదు. గతంలో మేడా మోహన్‌చంద్రపై పోలీసులు కేసులు నమోదు చేసినా తిరిగి అమ్మకాలు చేస్తున్నారు. ఒక ప్యాకెట్ ధర రూ.5లు ఉంటే దాన్ని రూ. 15నుంచి రూ.20ల వరకు విక్రయిస్తున్నారు. అలాగే హోల్ సేల్ అమ్మకాల్లో భారీగా ఆదాయం వస్తుండటంతో అమ్మకాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా నిషేధిత గుట్కా అమ్మకాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి పూర్తిగా అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. -
గుట్కా గుట్టుగా..
మారుమూల పల్లెల్లోని పాన్ షాపులో అడిగినా, పట్టణ ప్రాంతాల్లోని చిల్లర దుకాణాల్లో సైగ చేసినా చాలు.. వెంటనే గుట్కా ప్యాకెట్ ప్రత్యక్షమవుతోంది. రెట్టింపు ధరతో వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతూ.. ఆరోగ్యానికి తూట్లు పొడుస్తోంది. అమలుకు నోచుకోని గుట్కాపై నిషేధం.. అధికారుల అలసత్వాన్ని నిలదీస్తోంది. సరిహద్దులు దాటుకుంటూ ఇతర రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా జిల్లాలోకి ప్రవేశిస్తున్న గుట్కా.. కొందరు పోలీసు సిబ్బంది సహకారంతో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. సాక్షి, గుంటూరు: జిల్లాలో యధేచ్ఛగా నిషేధిత గుట్కాలు లభ్యమవుతున్నాయి. నిషేధం మాటున కొందరు గుట్కా వ్యాపారులు రూ. కోట్లు పోగేసుకుంటున్నారు. ఇటు పోలీసులు, అటు విజిలెన్స్ అధికారులు నిఘా ఎక్కువవ్వడంతో వ్యాపారులు కొత్త పంథాల్లో గుట్కా రవాణా చేస్తున్నారు. జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, తెనాలి సహా వివిధ ప్రాంతాలకు కర్ణాటకలోని బెంగళూరు, బళ్లారి, హుబ్లీ, చెన్నై, హైదరాబాద్‌ల నుంచి గుట్కా రవాణా సాగుతోంది. ఆయా నగరాల నుంచి హోల్‌సేల్‌గా నిషేధిత గుట్కా తెప్పించి గుట్టుగా జిల్లాలోని సిగరెట్, కిల్లి, చిల్లర కొట్లకు రీటైల్‌గా విక్రయిస్తున్నారు. పార్సిల్ సర్వీస్‌ల ద్వారా... రైల్వే, ఆర్టీసీ కార్గో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సంస్థల ద్వారా రకరకాల పద్ధతుల్లో జిల్లాకు ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి గుట్కా రవాణా చేస్తున్నారు. చిన్న చిన్న బస్తాలుగా చేసి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో గుంటూరుకు చేరుకునే రైళ్లలోనే ఎక్కువగా గుట్కా పార్సిల్ చేస్తుంటారు. పగటి వేళల్లో రైల్వే కూలీలను మేనేజ్ చేసుకుని వాటిని పొద్దు పోయే వరకూ అక్కడే ఉంచుతున్నారు. ఈ తరహాలో రైల్వే పార్సిల్ ద్వారా వచ్చిన తంబాకును రవాణా చేస్తున్న వ్యక్తులను గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలో గత జూలైలో కొత్తపేట పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి పార్సిల్లో వచ్చిన నిషేధిత గుట్కాలను రహస్య స్థావరాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి బైకులపై షాపులకు రవాణా చేస్తున్నారు. నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల ప్రాంతాల్లో టీడీపీ నాయకులు గుట్కా దందా కొనసాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి గుట్కాలను షాపులకు కార్లు, బైక్‌లు, అశోక్ లైలాండ్, అప్పి ఆటోల్లో గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. గుంటూరు అర్బన్ పరిధిలోని ఎన్‌హెచ్ 66 పక్కన ఉన్న ఏటుకూరు రోడ్డు, నల్లచెరువు, కాకాని, నగరాలు సహా పలు ప్రాంతాల్లోని గోడౌన్లలో రాత్రికి రాత్రికి రహస్యంగా ఎంసీ, ఖలేజా వంటి గుట్కా ఉత్పత్తులను తయారు చేస్తున్నట్టు సమాచారం. డిమాండ్‌ను బట్టి అప్పటికప్పుడు తయారు చేసి సరుకును బయటికి పంపి మిషన్లను విడదీసి భద్రపరుస్తున్నట్టు తెలుస్తోంది. తెలిసినా గప్‌చుప్ గుట్కా వ్యాపారంపై పోలీస్, విజిలెన్స్ సిబ్బందికి పూర్తి స్థాయిలో సమాచారం ఉంటోంది. అయితే ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియనివ్వకుండా గుట్కా మాఫియా వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారు. తెనాలి, నరసరావుపేట, గుంటూరు సహా పలు సబ్ డివిజన్లలో నడుస్తున్న గుట్కా దందాలో కింది స్థాయి పోలీస్ సిబ్బందికి హస్తం ఉన్నట్టు పోలీస్ వర్గాల్లోనే చర్చలు నడుస్తోంది. -
ఇంటి దొంగలు సేఫ్!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గుట్కా రాకెట్ కేసులో ఇంటి దొంగలు సేఫ్‌గా బయట పడేశారు. గుట్కా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ నేతలైతే.. దానికి అండగా నిలిచింది మాత్రం అప్పట్లో అక్కడ పనిచేసిన కొందరు పోలీసు అధికారులే. గుట్కా మాఫియా నుంచి భారీ మొత్తంలో నెలవారీ మామూళ్లు పుచ్చుకుని గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటుతో పాటు గుట్కా అక్రమ రవాణాకు సైతం సహకరించిన వైనం విధితమే. కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామం నడిబొడ్డున ఓ మిల్లులో మూడేళ్లుగా గుట్కా తయారీ కేంద్రంనడుస్తున్న విషయం అప్పట్లో పనిచేసిన స్థానిక పోలీసు అధికారులకు, ఎస్బీ అధికారులకు తెలిసినప్పటికీ టీడీపీ నేతలకు చెందింది కావడంతో దాని జోలికి వెళ్లలేదు. తిలాపాపం తలాపిడికెడు అన్న చందంగా ఎవరికి తోచినంత వారు వసూలు చేసుకుని అక్రమ వ్యాపారానికి కొమ్ము కాస్తూ వచ్చారు. గత నెలలో గుట్కా తయారీ కేంద్రం వ్యవహారం బట్టబయలు కావడంతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ నేరుగా అక్కడకు వెళ్లి గుట్కా తయారీ యంత్రాలు, గుట్కా నిల్వలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయించారు. గుట్కా రాకెట్ పై విచారణ మొదలు పెట్టిన పోలీసులకు తీగ లాగితే డొంక కదిలినట్లుగా నెల్లూరులో సైతం మరో గుట్కా తయారీ కేంద్రం బయటపడింది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికి గుట్కా రాకెట్‌కు సహకరిస్తున్న ఇంటి దొంగల వ్యవహారం కూడా విచారణలో బయటకు రావడంతో ఉలిక్కి పడ్డారు. వారిని తప్పించేందుకు కేసులో ముఖ్య సూత్రదారులైన ముగ్గురు టీడీపీ నేతలను సైతం కేసు నుంచి తప్పించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే... అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల గ్రామంలోని ఓ పొగాకు గోడౌన్లో మూడేళ్లుగా నడుస్తున్న గుట్కా మాఫియా గుట్టును రట్టు చేసిన పోలీసులు నిర్వాహకుడు బలగాని ప్రసాద్‌తోపాటు గోడౌన్ యజమాని, గ్రామ టీడీపీ నాయకుడు హనుమంతరావు (బుల్లబ్బాయ్)లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా తీగ లాగుతూ వెళ్లిన పోలీసులకు గుట్కా మాఫియా నడుపుతున్న మరో గుట్కా తయారీ కేంద్రం నెల్లూరు నగరంలో దొరికింది. గుట్కా తయారీ కేంద్రాన్ని నిర్వహించేందుకు ఆర్థిక సహాయం చేస్తున్న సూత్రదారులు అదే గ్రామానికి చెందిన నలుగురు టీడీపీ నేతలైతే, సాంకేతిక పరంగా తయారు చేసేది మాత్రం బలగాని ప్రసాద్. కావడం గమనార్హం. అయితే తయారీ కేంద్రం ఏర్పాటు విషయం తెలిసినప్పటికి గుట్కా రాకెట్‌కు అండగా నిలిచింది మాత్రం అప్పట్లో అక్కడ పనిచేసిన కొందరు పోలీస్ అధికారులు కావడం గమనార్హం. గోడౌన్ యజమాని హనుమంతరావు (బుల్లబ్బాయ్) తోపాటు గ్రామానికి చెందిన మరో ముగ్గురు టీడీపీ నేతలు భాగస్వామ్యంతో గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటు చేశారనేది అందరికి తెలిసిన విషయమే. అప్పట్లో అక్కడ పనిచేసిన ఎస్సైతో పాటు మరి కొందరు పోలీస్ అధికారులకు నెలకు రూ.2 లక్షల చొప్పున మామూళ్లు ముట్టచెప్పి అక్రమ వ్యాపారాన్ని అధికారికంగా నిర్వహిస్తూ వచ్చారు. అప్పట్లో ఓ హెడ్ కానిస్టేబుల్ ద్వారా ఎస్సై నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు నెలవారీ మామూళ్లు ఇస్తూ హనుమంతరావుకు చెందిన గోడౌన్లో గుట్టుగా గుట్కా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తూ వచ్చారు. రాత్రి వేళల్లో గుట్కాను ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేందుకు కూడా అప్పట్లో పనిచేసిన పోలీస్ అధికారులు అండదండలు అందించారనే ఆరోపణలున్నాయి. ఇంటి దొంగలను తప్పించేశారు... గుట్కా తయారీ కేంద్రానికి వచ్చి రూ.3కోట్ల విలువ చేసే యంత్రాలు, తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులకు తీగ లాగేకొద్దీ గతంలో కొందరు ఖాకీలు చేసిన పాపాలు బయటపడుతూ వచ్చాయి. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకూ అందరికీ నెలవారీ మామూళ్లు ఇచ్చారనేది బహిరంగ రహస్యమే. నిందితులను తమదైన శైలిలో విచారిస్తే వాటాల బాగోతం బయటపడుతుంది. అయితే పోలీసుల పరువు పోతుందోననే భయమో, అక్రమాలకు పాల్పడ్డ పోలీసు అధికారులను రక్షించాలనే తపనో తెలియదు కానీ వారి పాత్రను మాత్రం బయట పెట్టకుండా కేసును ముగించేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేసులో పాత్ర ధారులను మాత్రమే అరెస్టులు చేసి సూత్రధారులను, అండగా నిలిచిన ఖాకీలను కేసు నుంచి తప్పించేశారు. పోలీసు ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం అందించి కేసును ముగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి ఇంటి దొంగలపై చర్యలు తీసుకుని సూత్రధారులను సైతం అరెస్టు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
గుట్టుగా గుట్కా దందా
సాక్షి, కదిరి: జిల్లాలో గుట్కా వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. గుట్కాపై నిషేధం ఉన్నా గత ప్రభుత్వంలో దానిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో గుట్కా రవాణాతో పాటు వ్యాపారం జోరుగా సాగేది. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే గుట్కా, మట్కా, పబ్బులు, క్లబ్బు లు లాంటి వాటిపై ప్రత్యే క దృష్టిసారించాలని పోలీసుశాఖను గట్టి గా ఆదేశించారు. జిల్లా ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు కూడా సీఎం ఆదేశాల ను ఛాలెం జ్గా తీసుకొని వాటిపై ప్రత్యేక దృష్టి సారిం చారు. పక్క రాష్ట్రమైన కర్ణాట క నుంచి అక్రమంగా జిల్లాలోకి గుట్కా ప్యాకెట్లను సరఫరా చేస్తూ గుట్కా దందా కొందరు వ్యాపారులు యథేచ్ఛగా చేస్తున్నారు. వ్యాపారాన్ని వదులుకోడానికి నో.. కొన్నేళ్లుగా గుట్కా వ్యాపారంలోకి దిగి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడిస్తున్న గుట్కా మాఫియా ఈ వ్యాపారాన్ని వదులుకోవడానికి మాత్రం ఇష్టపడటం లేదు. నిషేధిత గుట్కా వ్యాపారాన్ని మరింత సీరియస్‌గా తీసుకొని ప్రతినెలా లక్షలాది రూపాయలను గడిస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తే వారం తిరక్కుండానే బెయిల్‌పై వచ్చేస్తామనే ధీమాతో తమ దందాను కొనసాగిస్తున్నారు. ఈ వ్యాపారాన్ని గతంలో ఎవరైతే నిర్వహించేవారో ఇప్పటికీ వారే నడుపుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసుల అండదండలు వీరికి పుష్కలంగా ఉండేవి. ఇప్పటికీ కొందరు పోలీసు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ గుట్కా మాఫియాకు సహకరిస్తున్నట్లు సమాచారం. అధిక ధరకు విక్రయాలు పొగాకు ఉత్పత్తులతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా.. వాటి బారినపడి అనారోగ్యానికి గురయ్యేవారికి పెట్టే ఖర్చే రెట్టింపు అవుతోందన్న కారణంతోనే ప్రభుత్వం గుట్కాపై నిషేధం విధించింది. అయితే వీటి అమ్మకాలు మాత్రం యథేచ్ఛగా సాగుతున్నాయి. గతంలో ఎలా బహిరంగంగా విక్రయించేవారో ఇప్పుడుకూడా అలానే అమ్ముతున్నారు. దీనికి పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేదు. గతంలో రూ.5కు దొరికే గుట్కా ప్యాకెట్ నిషేధం సాకుతో ఇప్పుడు అధిక(రూ20) ధరకు విక్రయిస్తున్నారు. కాలేజీ కుర్రాళ్ల దగ్గర నుంచి కాటికి కాళ్లు చాపిన వృద్ధుల వరకూ చాలా మంది గుట్కాకు అలవాటు పడ్డారు. గుట్కా నిషేధం అమలులో కీలక పాత్ర పోషించాల్సిన పోలీసులే చాలా మంది గుట్కాకు అలవాటు పడ్డారు. దీంతో గుట్కా దందాకు ఎదురులేకుండా సాగుతోంది. జిల్లా కర్ణాటక సరిహద్దులో ఉండటంతో ఆ రాష్ట్రం నుండి గుట్కా పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది. దీంతో నిషేధం కాస్తా ‘గుట్కా’య స్వాహాగా మారిపోయింది. ఎవరికీ అనుమానం రాకుండా గుట్కా ప్యాకెట్లను ఒక్కోసారి పాలవ్యాన్లలో తరలిస్తే, ఇంకోసారి ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో తీసుకొస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నామమాత్రపు తనిఖీలే సెక్షన్ 30(2) 2006 ఆహార భద్రతా చట్టం ప్రకారం రాష్ట్రంలో గుట్కా నిషేధం అమలులో ఉంది. వాటిని తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా కఠన చర్యలు తప్పవు. ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్, రవాణా, కార్మిక, పురపాలక, పంచాయతీరాజ్, నిఘా, వాణిజ్య పన్నుల శాఖల సమన్వయంతో తనిఖీలు చేయాలనే ఆదేశాలున్నాయి. నిషేధం అమలు బాధ్యత ఇన్ని శాఖలపై ఉన్నప్పటికీ జిల్లాలో తనిఖీలు మాత్రం నామమాత్రమే. దీంతో గుట్కా మాఫియా చెలరేగిపోతోంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రజలను గుట్కా బారి నుంచి కాపాడుతుందని ఆశిద్దాం. ఆగని అమ్మకాలు గత ప్రభుత్వ హయాంలో జిల్లా వ్యాప్తంగా హీరా, మానిక్‌చంద్, చాంపియన్, బాషా, విమల్, హాన్స్, పాన్‌పరాగ్, రాజా, ఎంసీ, చైనీ ఖైనీ ఇలా పలు కంపెనీలకు సంబంధించి ప్రతిరోజూ 1.20 లక్షల గుట్కా ప్యాకెట్లు అమ్ముడు పోయేవని ఆయా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో ప్యాకెట్లో 6 పొట్లాలు చొప్పున 7.20 లక్షల గుట్కా పొట్లాల అమ్మకాలు జరిగేవని అంటున్నారు. అప్పట్లో ఒక్కో పొట్లం రూ.5 చొప్పున రోజుకు రూ.36 లక్షల విక్రయాలు జరిగేవని వారు లెక్కలేసి మరీ చెబుతున్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గుట్కాలపై నిషేధం కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించడంతో గతంలో బహిరంగంగా జరిగే ఈ వ్యాపారం ఇప్పుడు కదిరి, గుంతకల్లు, తాడిపత్రి, మడకశిర, అనంతపురం, శింగనమల, రాయదుర్గం, హిందూపురం తదితర ప్రాంతాల్లో గుట్టుగా సాగుతోంది. పోలీసుల తనిఖీలు ముమ్మరంగా ఉన్నాయని చెబుతూ ఒక్కో గుట్కా పొట్లం రూ.15 నుంచి రూ.20 దాకా అమ్ముతున్నారు. ఈ లెక్కన రోజుకు ఎంత వ్యాపారం జరుతుతుందో మీరే అంచనా వేయండని చెబుతున్నారు. గుట్కా లోగుట్టు వెనుక ఎంతో మందికి మామూళ్లు ముట్టజెబుతున్న విషయం కూడా వారి నోటి వెంట వినబడుతోంది. మరోవైపు గుట్కా జోలికెళ్తే గుటుక్కు మనేది ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
గుట్కాపై నిషేధమేది?
బేల(ఆదిలాబాద్): గుట్కా, ప్లాస్టిక్‌లపై నిషేధం ఉన్నా ఇవి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. పాన్‌షాపులలో మరింత విరివిగా లభిస్తున్నాయి. ఓ వైపు గుట్కా దందా జోరుగా కొనసాగుతుండగా, మరోవైపు ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా మారింది. కాగా పాన్‌షాపులలో ఈ నిషేధత తంబాకులు, పోకలు, సున్నంతో కలిపి నిషేధిత ప్టాస్టిక్‌లో వేసి నలిచి కర్రా పూడిలను(గుట్కా పొట్లాలు) మరీ తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ గుట్కా తయారీ జిల్లా కేంద్రంతోపాటు ఆదిలాబాద్‌రూరల్, మావల, జైనథ్, బేల, గాదిగూడ, తదితర మహారాష్ట్ర సరిహద్దు మండలాల్లో యథేచ్ఛగా కొనసాగుతోంది. వీటిపై అధికారుల తనిఖీలు అంతంతే ఉండడంతో గుట్కా, ప్లాస్టిక్‌ల నిషేధం ఏమాత్రం అమలు కావడం లేదు. గుట్కా, ప్లాస్టిక్ విరివిగా లభ్యం ‘గుట్కా నమలడం కేన్సర్‌కు కారకం’..అని సినిమా థియేటర్లలో, అక్కడక్కడా ప్రచార మాధ్యమాల్లో, వాల్‌పోస్టర్లలో చూస్తుంటాం, చదువుతుంటాం. దీంతో పాటు ‘ప్లాస్టిక్‌తో పర్యవరణానికి ముప్పు’ అని సైతం చూస్తుంటాం. అయినా నిషేధిత గుట్కా, ప్లాస్టిక్లు కలిసి మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇదిలా ఉండగా..నిషేధిత ఈగల్, మాజా, బాబా, రత్నా, 160, తదితర తంబాకులను పోకలు, సున్నంతో కలిపి నిషేధిత ప్టాస్టిక్‌లో వేసి సాధారణ మిమన్‌ల ద్వారా నలిచి నలిచి కర్రా పూడిలను తయారు చేస్తున్నారు. ఈ గుట్కా తయారీకి కరెంటు మిషన్లను సైతం యథేచ్ఛగా వినియోగిస్తుండటంతో గుట్కా, ప్లాస్టిక్లు దందా మరింత జోరుగా సాగుతోంది. మూడు ప్యాకెట్లు..ఆరు కాటన్‌లుగా గుట్కా దందా.. మార్కెట్లో విమల్, సాగర్, నజర్, ఆర్ఎండీ, వంటి గుట్కాలు సాధారణంగా లభిస్తున్నాయి. ప్టాస్టిక్ ప్యాకింగ్‌తో ఉన్న అంబర్ తంబాకును ప్రత్యేకంగా ఫ్రీజ్‌లలో కూలింగ్ చేసి, రెండింతలతో మరి విక్రయిస్తున్నారు. ఇంతేకాకుండా నిషేధిత కర్రా పూడిలను ఒక్కొక్కటి రూ.10 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా తయారు చేసిన కర్రాలను ముందుగా వయసు పైబడ్డవారు, వయోజనులు, యువకులు తినేవారు. గత ఒకట్రెండు ఏళ్ల నుంచి మహిళలతోపాటు బడీడు పిల్లలు సైతం తినడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో చిన్నాపెద్ద తేడా లేకుండా తింటుండంతో ‘మూడు ప్యాకెట్లు..ఆరు కాటన్లు’గా ఈ గుట్కా దందా రోజు లక్షల్లో కొనసాగుతోంది. ఈ గుట్కాతో ప్రతీరోజు చిన్న పాన్‌షాపులలో ఆరేడు వేలు పైబడి గిరాకైతే, పెద్ద పాన్‌షాపులలో రూ.35వేలకు పైబడి దాటుతోంది. ఈ గుట్కాకు అలవాటు పడ్డవారు దాన్ని మానలేక ఎక్కడ దొరుకుతాయో కనుక్కుని మరి నములుతున్నారు. వీళ్ల అలవాటును పసిగట్టిన కొందరు మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్రమ నిల్వలు ఉంచి, అవసరాన్ని బట్టి పాన్‌షాపులకు సరఫరా చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అవగాహన లోపం.. రాష్ట్రంలో గుట్కాను నిషేధించినా అలవాటు పడ్డవారు మానలేకపోతున్నారు. ఇక్కడి ప్రజల్లో అవగాహన లేకపోవడం, గుట్కాతో కలిగే దుష్పరిణామాలను మామూలుగానే తీసుకుంటూ నమిలేస్తున్నారు. దీంతో ప్రజల ఆరోగ్యం గుళ్ల అవుతోంది. గుట్కా నమిలే వాళ్ల వద్ధ పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. బహిరంగా ప్రదేశాల్లోనూ, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడంతో అపరిశుభ్రత నెలకొంటోంది. దీంతో తోటి వారు ఇబ్బందులు పడుతున్నారు. గుట్కా నమిలితే కాలేయం, నోటి కేన్సర్, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, కేన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు, పోలీసులు ముందుకు వచ్చి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నిషేధించినా గుట్కా నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
వాటిపై నిషేధం ఏడాది పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : గుట్కా, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, విక్రయాలపై విధించిన నిషేధాన్ని ఢిల్లీ ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ ఉత్పత్తులపై నిషేధాన్ని పొడిగిస్తూ ఫుడ్ సేఫ్టీ విభాగం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఎల్ఆర్ గార్గ్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ప్రజారోగ్య ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని గుట్కా, పాన్ మసాలాతో సహా పొగాకు ఉత్పత్తులన్నింటిపై విధించిన నిషేధాన్ని ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాల్లో మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ జారీ చేసిన నోటిఫికేషన్ వెల్లడించింది. అయితే సిగరెట్లపై అలాంటి నిషేధం విధించే ఉద్దేశం లేదని అధికార వర్గాలు పేర్కొనడం గమనార్హం. -
అలవాటు పడితే అంతే సంగతి
ఆరోగ్యానికి తూట్లు పొడిచే గుట్కాను ప్రభుత్వం నిషేధించింది. అయితే లాభార్జనే ధ్యేయంగా అక్రమార్కులు యథేచ్ఛగా దాన్ని విక్రయిస్తూ యువతను మత్తులో ముంచెత్తుతున్నారు. నిషేధం బూచి చూపి రేటును మరింత పెంచి విక్రయిస్తూ దోచుకుంటున్నారు. తూర్పుగోదావరి, పిఠాపురం: ఆరోగ్యమే మహాభాగ్యం.. కానీ మత్తులో ఆనందాన్ని వెదుక్కుంటూ చేజేతులా ఆరోగ్యానికి తూట్లు పొడుచుకుంటున్నారు కొందరు యువత. ఒక గుట్కా ప్యాకెట్ సేవించడం వల్ల జీవిత కాలంలో ఒక గంట ఆయువు కోల్పోతారని వైద్యులు చెబుతున్నారు. గొంతు, నోటి క్యాన్సర్లు వస్తాయంటున్నారు. ఈ విషయాలన్నీ గుట్కా వినియోగదార్లకు తెలిసినప్పటికీ దానికి బానిసలై ఆ మత్తులో కూరుకుపోతున్నారు. యువత 32 శాతం వరకూ గుట్కాకు బానిసలైనట్టు తెలుస్తోంది. ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే గుట్కాను ప్రభుత్వం నిషేధించింది. దీన్ని సాకుగా చూపి కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి విక్రయిస్తూ వ్యాపారులు దోచుకుంటున్నారు. కోట్ల రూపాయల ఈ వ్యాపారం చాపకింద నీరులా సాగిపోతోంది. ఇటీవల పోలీసులు దాడులు ముమ్మరం చేసినా గ్రామాల్లో గుట్కా అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. వివిధ రకాల గోవా గుట్కాల అమ్మకాలు ఈ ఏడాది ఎక్కువగా పెరిగినట్టు వ్యాపారస్తులు చెబుతున్నారు. అలవాటు పడితే అంతే సంగతి ఆరోగ్యానికి హానికరమని తెలిసినప్పటికీ ఒకసారి అలవాటు పడిన వారు దానికి బానిసలైపోతున్నారు. గుట్కా సేవనానికి అలవాటు పడిన వ్యక్తి రోజూ ఐదు నుంచి 20 ప్యాకెట్ల వరకు వినియోగిస్తుంటాడు. ఇలా సగటున రోజుకు జిల్లాలో లక్షలాది ప్యాకెట్లు వినియోగిస్తున్నట్టు అంచనా. గుట్టుగా గుట్కా వ్యాపారం నెల రోజులుగా గుట్కా రేట్లకు రెక్కలు వచ్చాయి. దీని విక్రయాలపై నిషేధం ఉండడంతో వినియోగదారులు ఎవరూ నోరు మెదపడం లేదు. దీంతో గుట్కా వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతున్నాయి. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఈ వ్యాపారం చేసేవారు కుబేరులవుతున్నారు. దాడులు చేసినా షరా మామూలే గతంలో వారం రోజుల పాటు పోలీసులు గుట్కా అమ్మకాలపై దాడులు చేశారు. నియోజకవర్గంలో పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల పరిధిలో దాడులు నిర్వహించిన పోలీసులు సుమారు రూ. 60 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని 20 మందిపై కేసులు నమోదు చేశారు. దాడుల నేపథ్యంలో జాగ్రత్తపడ్డ వ్యాపారులు తిరిగి అమ్మకాలు ప్రారంభించారు. దాడులు చేసిన తరువాత పట్టించుకోకోపోవడంతో గుట్కా వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది గుట్కా సేవిస్తే గొంతు, నోటి క్యాన్సర్లు వస్తాయి. ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. గుట్కా సేవిస్తే తాత్కాలికంగా మత్తులో తూగటం తప్ప మరే ప్రయోజనమూ లేదు. దీనికి అలవాటుపడినవారు సంసారిక జీవనానికి తక్కువ రోజుల్లోనే దూరమవుతారు. ఈ అలవాటు నుంచి బయటపడేందుకు స్వయం నిర్ణయం ఎంతైనా అవసరం.–డాక్టర్ బీరావిజయశేఖర్ -
భారీగా గుట్కా నిల్వల సీజ్
సాక్షి, ఒంగోలు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేస్తారని భావించి రెండు నెలలకుపైగా అవసరమని భావించి గుట్కా ప్యాకెట్లను ముందుగానే సిద్ధం చేసుకున్న ఓ వ్యాపారి ఇంటిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అదనపు ఎస్పీ ఎం.రజని ఆదేశాల మేరకు డీఎస్పీ ఎల్.అంకయ్య ఆధ్వర్యంలో అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక లాయరుపేట సాయిబాబా ఆలయం ఎదురుగా ఉన్న హరేరామ బజార్‌లోని అమరా బాలకృష్ణ నివాసంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ సీఐలు బీటీ నాయక్, కేవీ రాఘవేంద్ర ఎస్ఐ అహ్మద్ జానీ, ఆడిటర్ శ్యామ్‌పాల్, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు ప్రసాద్, వెంకట్, లక్ష్మణ్, ఒన్‌టౌన్ ఎస్ఐ సుమన్, హెడ్‌కానిస్టేబుల్ సీతారామయ్యలు దాడులకు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఇంటిపైన ఉన్న మూడో అంతస్తులో స్టాకు నిల్వలు గుర్తించారు. పెద్ద పెద్ద బస్తాల్లో నిల్వ ఉన్న గుట్కా ప్యాకెట్లను గుర్తించి వాటిని సీజ్ చేశారు. వాటి విలువ రూ.9,37,700 ఉంటుందని భావించారు. ఈ సందర్భంగా వ్యాపారి అమరా బాలకృష్ణను ప్రాథమికంగా విచారించారు. అనంతపురం నుంచి నరేష్ అనే వ్యక్తి తనకు బుధవారం రాత్రి స్టాకు పంపినట్లు వివరించాడు. ఈ నేపథ్యంలో స్టాకును, నిందితుడైన బాలకృష్ణను ఒన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఒన్‌టౌన్ ఎస్ఐ సుమన్ తెలిపారు. బాలకృష్ణ స్థానిక నూతన కూరగాయల మార్కెట్లో ఓ షాపు నిర్వహిస్తూ ఉంటాడు. గతంలో కూడా ఇతడిపై గుట్కాలకు సంబంధించి కేసు కూడా నమోదై ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో రెండో దఫా కూడా పెద్ద ఎత్తున స్టాకు నిల్వ ఉంచడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
గుట్కా ఘాటు
గద్వాల క్రైం: మన రాష్ట్రంలో మత్తునిచ్చే గుట్కా ప్యాకెట్లను ప్రభుత్వం నిషేధించింది. దీంతో వివిధ కంపెనీలు మూతబడ్డాయి. అయితే వ్యాపారులు కర్ణాటక, మహారాష్ట్ర వంటి ప్రాంతాలనుంచి పోలీసుల నిఘా నేత్రాల దృష్టిలో పడకుండా సరిహద్దులు దాట్టి వేలాది ప్యాకెట్లను దొంగచాటున తీసుకొస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంగా తోడేళ్లలాంటి జాదూగాళ్ల సాయంతో వనపర్తి ప్రాంతానికి చెందిన వ్యాపారులు లక్షలు గడిస్తున్నారు. షాలో మునిగిన యువత ఆ దురలవాటును మానుకోకపోవడంతో వీరి వ్యాపారం గుట్టుగా జోరుగా సాగుతోంది. పాన్ మాసాల, జర్దా, ఖైనీ, తంబాకు, గుట్కాలతో ప్రజలు క్యాన్సర్ బారిన పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో వీటి విక్రయాలను నిషేధించారు. అయినప్పటికీ సరఫరా పొరుగు రాష్ట్రాలనుంచి అవుతూనే ఉంది. జిల్లాలో జనవరి ఒక్క నెలలోనే సుమారు రూ.3లక్షల విలువ గల గుట్కాలను పోలీసులు పట్టుకుని 7 కేసులు, 11 మందిని అరెస్ట్ చేశారంటే విక్రయాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. మూడింతలు లాభం మత్తెక్కించే గుట్కాలో దందాలో లాభం కూడా అదేస్థాయిలో ఉంటుంది. ఒక్క గుక్కా ప్యాకెట్ ధర రూ.5 ఉంటే బ్లాక్ మార్కెట్లో రూ.10 నుంచి రూ.15 పలుకుతోంది. అంటే సగటున రోజుకు ఓ చిరు వ్యాపారి 100 ప్యాకెట్లు అమ్మితే కనీసం రూ.1500ల సంపాదన. ఇలా రోజుకు, వారానికి, నెలకు లెక్కేస్తే వారి ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నమోదైన కేసులు జనవరి 5న కర్నూల్ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు రాయచూర్ నుంచి రూ.27 వేల విలువ గల నిషేధిత గుట్కాలను రహ్యసంగా బైక్‌పై అయిజ మీదుగా తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని సరుకును సీజ్ చేశారు. 17వ తేదీన వనపర్తి జిల్లాకు చెందిన తండ్రీకొడుకులు రాయచూర్ నుంచి గద్వాల మీదుగా రూ.30 వేలు విలువగల గుట్కాలను తరలిస్తుండగా జమ్మిచెడ్ శివారులో పట్టుకున్నారు. అదే రోజున గద్వాల పట్టణ పోలీసులు సైతం పలువురిని అదుపులోకి తీసుకోగా వారినుంచి వివిధ రకాల గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. సరుకును సీజ్ చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు. 18వ తేదీన వనపర్తి జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు రాయచూర్ నుంయి కారులో ఎవరికీ అనుమానం రాకుండా రూ.1, 80 లక్షల విలువ గల గుట్కాలను తరలిస్తున్నట్లు కేటీదొడ్డి పోలీసులకు సమాచారం వచ్చింది. నందిన్నె చెక్‌పోస్టు వద్ద పోలీసులు కారును తనిఖీ చేసి పట్టుకున్నారు. గుట్కా.. కేరాఫ్ కర్ణాటక! నిషేధిత పాన్ మాసాల, జర్దా, తంబాకు, కైనీ, గుట్కా విక్రయాలకు కర్ణాటకలో నిషేధం లేదు. అందులోనూ రెండు రాష్ట్రాలకు సరిహద్దు గల ప్రాంతం కావడంతో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కర్నూల్ జిల్లా వాసులు అలంపూర్ చౌరస్తా నుంచి శాంతినగర్, అయిజ, బల్గెర మీదుగా రాయచూర్‌కు చేరుకుంటారు. అక్కడ సరుకును కొనుగోలు చేసి రహ్యసంగా బస్సుల్లో బైక్, కారు వంటి వాహనాల్లో తరలిస్తుంటారు. బల్గెర వద్ద పోలీసుశాఖ చెక్‌పోస్టును ఏర్పాటు చేయగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నారు. నామమాత్రంగా తనిఖీలు చేపడితేనే ఇలా పట్టుబడుతుంటే సరిగ్గా ప్రతి వాహనాన్ని పరిశీలించి తనికీ చేస్తే ఇంకెంత సరుకు పట్టుబడుతుందో. ఇలా తరలిస్తుంటారు.. వనపర్తి జిల్లాకు చెందిన వ్యాపారులు గద్వాల జిల్లా మీదుగా సరుకును ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వనపర్తి నుంచి గద్వాల, కేటీదొడ్డి, ధరూర్, దేవరకద్ర, మక్తల్ తదితర ప్రాంతల మీదుగా అనువుగా ఉండడం అక్రమార్కులకు అనువుగా ఉంది. అయితే ఇక్కడే తప్పించుకునేందుకు సులువైన మార్గాలు కూడా ఉన్నాయి. కేటీదొడ్డి మండలం నందిన్నె సరిహద్దు వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. ఇక మక్తల్ వద్ద మాగనూర్ దగ్గర మరో చెక్‌పోస్టును పోలీసు శాఖ ఏర్పాటు చేసినప్పటికి అక్కడి సిబ్బంది కళ్లుగప్పి గుట్కా ప్యాకెట్లు చేరాల్సిన ప్రాంతాలకు సునాయాసంగా చేరిపోతున్నాయి. ఇక రాయచూర్ నుంచి నిత్యం గుట్కాలను తరలిచడం, తనిఖీలు చేస్తున్న తరుణంలో కర్నాటక డిపోకు చెందిన బస్సుల్లో సైతం రవాణా చేయడం వ్యాపారులకు కలిసి వస్తోంది. ఆర్టీసీ సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి ఈ దందాకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆ కీలక వ్యక్తులు ఎవరు? నిషేధిత గుట్కా తరలింపు చేస్తున్నది ఎవరన్నది పోలీసులు బయటపెట్టాలి. పలుకుబడి ఉన్న వ్యక్తులు, పెద్దల అండదండలతో ఈ వ్యవహారం కొన్నసాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పెద్దల సహాయంతో ముందుగానే పోలీసులను మచ్చిక చేసుకోవడంతో ఎలాంటి తనిఖీలు లేకుండా సరుకు గ్రామాలకు చేరుతోందనే ఆరోపణలు సైతం లేకపోలేదు. పక్కా ప్లాన్‌తో కర్నాటక వ్యాపారులకు, అక్కడి పెద్దలతో నిత్యం టాచ్‌లో ఉండి వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించి ఏ సమయంలో తరలించాలో ముందుగానే చెప్పడంతో లక్షల కొద్దీ సరుకులు సరిహద్దులు దాటిపోతోంది. గొలుసు కట్టు దుకాణాలే టార్గెట్.. వ్యాపారంలో నిర్ధేశించిన వ్యక్తులు మాత్రమే ప్రణాళిక ప్రకారం గుట్కాలను అమ్మే విధంగా ఏర్పాట్లు చేసుకుంటారు. ముఖ్యంగా వీధి సైడ్, శివారు ప్రాంతం, పాన్ డబ్బాల నిర్వహకులు, టీ స్టాల్స్ తదితర వ్యాపారుల నుంచి పక్కా ప్రణాళికలతో గొలుసు కట్టుగా అమ్మకాలు ఉంటాయి. విక్రయాల్లో ఒక్కో దుకాణదారుని వద్ద గుట్కాలకు ఓ రేటు ఉంటుంది. అమ్మిన వ్యాపారి కొత్త వ్యక్తులకు ఎట్టి పరిస్థితిలో విక్రయాలు చేయరు. మరికొంత మందైతే కోడ్ భాషలో మాట్లాడితేనే అమ్ముతారు. ఈ వ్యాపారంలో మూడింతల లాభాలు ఉండ డంతో సామాన్యులు సైతం అమ్మకాలు చేయడానికి వెనకాడటంలేదు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తెరవెనుక ఉన్న కేటుగాళ్లను పట్టుకుంటే తప్ప ఈ నిషేధిత గుట్కా వ్యాపారానికి చెక్పడదు. గుట్కా ప్యాకెట్ల పట్టివేత గద్వాల క్రైం: జిల్లాకేంద్రానికి గుట్కా ప్యాకెట్లను తీసుకొస్తుండగా పట్టుకున్నట్టు పట్టణ ఏఎస్ఐ జిక్కిబాబు తెలిపారు. గద్వాల పట్టణం రెండో రైల్వే గేటు కాలనీకి చెందిన మాణిక్యం ఆదివారం రాయచూర్ నుంచి గుట్కాలను బైక్‌పై గద్వాలకు తీసుకువస్తున్నట్లు సమాచారం వచ్చింది. సాయంత్రం ధరూర్ మెట్టు ప్రాంతంలో కాపుకాసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనివద్దనుంచి గుట్కాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. క్రిమినల్ కేసులు పెడతాం నిషేధిత గుట్కాలను కొనుగోలు చేసినా, అమ్మినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. సరిహద్దులో గట్టి నిఘా ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసి రాష్ట్రంలో అనుమతినిస్తాం. ప్రజల ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదు. గుట్కా వ్యాపారంలో భాగస్వాములుగా మారి తరలించేవారు పద్ధతి మార్చుకోవాలి. – షాకీర్ హుస్సేన్, డీఎస్పీ, గద్వాల -
తండ్రీకొడుకు గుట్కా దందా!
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తర మండల పరిధిలోని మోండా మార్కెట్ కేంద్రంగా తండ్రీకొడుకుల గుట్కా దందాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. వారి నుంచి రూ.3.25 లక్షల విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. న్యూ బోయగూడకు చెందిన తండ్రీకొడుకులు ఎస్ఎం జైన్, రాకేష్ జైన్ 20 ఏళ్లుగా మోండా మార్కెట్లో వందన ఏజెన్సీస్ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నారు. పాన్ మసాలాలు, సిగరెట్లు విక్రయించే వీరు ప్రభుత్వ నిషేధంతో గుట్కా, పొగాకు ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలని భావించారు. ఇందులో భాగంగా ఈది బజార్, బేగంబజార్ ప్రాంతాలకు చెందిన ప్రధాన ఏజెంట్లు అన్వర్, మోసిన్‌ఖాన్ నుంచి హోల్‌సేల్‌గా నిషేధిత ఉత్పత్తులు ఖరీదు చేస్తున్నారు. వీటిని తమ ఏజెన్సీకి తరలించి అక్కడి నుంచి సబ్ ఏజెంట్లు, పాన్ దుకాణాల వారితో పాటు పరిచయస్తులైన వినియోగదారులకు విక్రయించేవారు. దీనిపై సమాచారం అందడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. కేసును స్థానిక పోలీసులకు అప్పగించి పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. -
భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
పహడీషరీఫ్: గుట్టు చప్పుడు కాకుండా గుట్కాను తయారు చేస్తున్న వ్యక్తిని బాలాపూర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి, అతడి నుంచి రూ.30 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుల్తాన్‌పుర్ ప్రాంతంలో హుస్సేన్ అనే వ్యక్తి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బ్లూబుల్ కంపెనీ పేరుతో గుట్కా తయారు చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో బాలాపూర్ ఇన్స్పెక్టర్ సైదులు ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి తయారీ మిషన్లతో పాటు భారీగా గుట్కా ముడి సరుకుని స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్మెట్లో.. భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న సంఘటన నేరేడ్మెట్ పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. నేరేడ్మెట్ సీఐ నర్సింహ్మస్వామి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..స్థానిక వినాయకనగర్‌లో శ్రీవాసవి కిరాణ దుకాణానికి చెందిన గోదాంలో గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉన్నట్లు సమాచారం అందడంతో మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గోదాంలో నిల్వ చేసిన వివిధ కంపెనీల గుట్కా, పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గోలి నిరంజన్ను అదుపులోకి తీసుకొన్నారు. -
గుట్కా కేంద్రాలపై దాడులు
వరంగల్ క్రైం: ప్రభుత్వం నిషేధించిన గుట్కాలను అమ్ముతున్న కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆదివారం దాడులు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ చక్రవర్తి తెలిపారు. ఏసీపీ కథనం ప్రకారం...సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలోని గోకుల్‌నగర్‌కు చెందిన కొమురవెల్లి వేణుమాధవ్ హుజురాబాద్‌కు చెందిన శ్రీనివాస్ గుట్కా సరఫరా దారుని నుంచి గుట్కాలు తీసుకుని అమ్ముతున్నాడు.ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకున్నాం.. సరఫరా దారుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.72వేల విలువ గల గుట్కాలు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్యల కోసం నింధితులను సుబేదారి ఎస్సై సత్యనారాయణకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ రమేష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నట్లు ఏసీపీ తెలిపారు. ప్రైవేట్ హాస్టల్లో గుట్కాలు స్వాధీనం హన్మకొండ పోలీసు స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్దంగా గుట్కాలు సరఫరా చేస్తున్న వీరమల్ల కార్తీక్‌ను అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ చక్రవర్తి తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన వీరమల్ల కార్తీక్ హన్మకొండలోని కిషన్‌పురలో మహర్షి ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ నగరంలోని పాన్‌షాపులకు గుట్కాలను సరఫరా చేస్తున్నాడు. నగరంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న కార్తీక్ గత కొంత కాలంగా గుట్కాల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారం మేరకు నింధితున్ని అదుపులోకి తీసుకుని నిందితుని నుంచి రూ.50వేల విలువ గల గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. తదుపరి చర్యల కోసం నిందితున్ని హన్మకొండ ఎస్సై శ్రీనా«ధ్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ నందిరాంనాయక్, సిబ్బంది పాల్గొన్నారు.