గురువారం నిందితులను అరెస్టు చూపుతున్న దర్శి డీఎస్పీ ప్రకాశరావు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గుట్కా రాకెట్ కేసులో ఇంటి దొంగలు సేఫ్‌గా బయట పడేశారు. గుట్కా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ నేతలైతే.. దానికి అండగా నిలిచింది మాత్రం అప్పట్లో అక్కడ పనిచేసిన కొందరు పోలీసు అధికారులే. గుట్కా మాఫియా నుంచి భారీ మొత్తంలో నెలవారీ మామూళ్లు పుచ్చుకుని గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటుతో పాటు గుట్కా అక్రమ రవాణాకు సైతం సహకరించిన వైనం విధితమే. కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామం నడిబొడ్డున ఓ మిల్లులో మూడేళ్లుగా గుట్కా తయారీ కేంద్రంనడుస్తున్న విషయం అప్పట్లో పనిచేసిన స్థానిక పోలీసు అధికారులకు, ఎస్‌బీ అధికారులకు తెలిసినప్పటికీ టీడీపీ నేతలకు చెందింది కావడంతో దాని జోలికి వెళ్లలేదు. తిలాపాపం తలాపిడికెడు అన్న చందంగా ఎవరికి తోచినంత వారు వసూలు చేసుకుని అక్రమ వ్యాపారానికి కొమ్ము కాస్తూ వచ్చారు. గత నెలలో గుట్కా తయారీ కేంద్రం వ్యవహారం బట్టబయలు కావడంతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ నేరుగా అక్కడకు వెళ్లి గుట్కా తయారీ యంత్రాలు, గుట్కా నిల్వలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయించారు. గుట్కా రాకెట్ పై విచారణ మొదలు పెట్టిన పోలీసులకు తీగ లాగితే డొంక కదిలినట్లుగా నెల్లూరులో సైతం మరో గుట్కా తయారీ కేంద్రం బయటపడింది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికి గుట్కా రాకెట్‌కు సహకరిస్తున్న ఇంటి దొంగల వ్యవహారం కూడా విచారణలో బయటకు రావడంతో ఉలిక్కి పడ్డారు. వారిని తప్పించేందుకు కేసులో ముఖ్య సూత్రదారులైన ముగ్గురు టీడీపీ నేతలను సైతం కేసు నుంచి తప్పించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళితే...
అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల గ్రామంలోని ఓ పొగాకు గోడౌన్‌లో మూడేళ్లుగా నడుస్తున్న గుట్కా మాఫియా గుట్టును రట్టు చేసిన పోలీసులు నిర్వాహకుడు బలగాని ప్రసాద్‌తోపాటు గోడౌన్ యజమాని, గ్రామ టీడీపీ నాయకుడు హనుమంతరావు (బుల్లబ్బాయ్)లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా తీగ లాగుతూ వెళ్లిన పోలీసులకు గుట్కా మాఫియా నడుపుతున్న మరో గుట్కా తయారీ కేంద్రం నెల్లూరు నగరంలో దొరికింది. గుట్కా తయారీ కేంద్రాన్ని నిర్వహించేందుకు ఆర్థిక సహాయం చేస్తున్న సూత్రదారులు అదే గ్రామానికి చెందిన నలుగురు టీడీపీ నేతలైతే, సాంకేతిక పరంగా తయారు చేసేది మాత్రం బలగాని ప్రసాద్. కావడం గమనార్హం. అయితే తయారీ కేంద్రం ఏర్పాటు విషయం తెలిసినప్పటికి గుట్కా రాకెట్‌కు అండగా నిలిచింది మాత్రం అప్పట్లో అక్కడ పనిచేసిన కొందరు పోలీస్ అధికారులు కావడం గమనార్హం. గోడౌన్ యజమాని హనుమంతరావు (బుల్లబ్బాయ్) తోపాటు గ్రామానికి చెందిన మరో ముగ్గురు టీడీపీ నేతలు భాగస్వామ్యంతో గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటు చేశారనేది అందరికి తెలిసిన విషయమే. అప్పట్లో అక్కడ పనిచేసిన ఎస్సైతో పాటు మరి కొందరు పోలీస్ అధికారులకు నెలకు రూ.2 లక్షల చొప్పున మామూళ్లు ముట్టచెప్పి అక్రమ వ్యాపారాన్ని అధికారికంగా నిర్వహిస్తూ వచ్చారు. అప్పట్లో ఓ హెడ్ కానిస్టేబుల్ ద్వారా ఎస్సై నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు నెలవారీ మామూళ్లు ఇస్తూ హనుమంతరావుకు చెందిన గోడౌన్‌లో గుట్టుగా గుట్కా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తూ వచ్చారు. రాత్రి వేళల్లో గుట్కాను ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేందుకు కూడా అప్పట్లో పనిచేసిన పోలీస్ అధికారులు అండదండలు అందించారనే ఆరోపణలున్నాయి.
ఇంటి దొంగలను తప్పించేశారు...
గుట్కా తయారీ కేంద్రానికి వచ్చి రూ.3కోట్ల విలువ చేసే యంత్రాలు, తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులకు తీగ లాగేకొద్దీ గతంలో కొందరు ఖాకీలు చేసిన పాపాలు బయటపడుతూ వచ్చాయి. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకూ అందరికీ నెలవారీ మామూళ్లు ఇచ్చారనేది బహిరంగ రహస్యమే. నిందితులను తమదైన శైలిలో విచారిస్తే వాటాల బాగోతం బయటపడుతుంది. అయితే పోలీసుల పరువు పోతుందోననే భయమో, అక్రమాలకు పాల్పడ్డ పోలీసు అధికారులను రక్షించాలనే తపనో తెలియదు కానీ వారి పాత్రను మాత్రం బయట పెట్టకుండా కేసును ముగించేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేసులో పాత్ర ధారులను మాత్రమే అరెస్టులు చేసి సూత్రధారులను, అండగా నిలిచిన ఖాకీలను కేసు నుంచి తప్పించేశారు. పోలీసు ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం అందించి కేసును ముగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి ఇంటి దొంగలపై చర్యలు తీసుకుని సూత్రధారులను సైతం అరెస్టు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment