సాక్షి, హైదరాబాద్ : గుట్కా అక్రమ రవాణా కేసులో సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాన్ మసాలాల ముసుగులో నిషేధిత గుట్కాలు తయారీ, సరఫరా చేస్తున్న ఆయనను ముంబై విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన సచిన్ జోషిని నిర్బంధంలోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. కాగా హైదరాబాద్‌కు అక్రమంగా గుట్కా తరలింపులో సచిన్ జోషి హస్తమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆయనపై ఐపీసీ 273,336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ('గుట్టు'కా దందా!)
కాగా ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కాల తయారీ, సరఫరాపై సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిఘా పెంచారు. పెద్ద మొత్తంలో గుట్కా బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గుట్కా కోట్ల రూపాయల్లో ఉంటుందని సమాచారం. ఈ కేసులో నిందితుల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విచారణలో సచిన్ జోషి పేరు బయటకు రావడంతో ఆయనపై బహదూర్ పురా పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 336, 273 కింద కేసు నమోదు అయింది. అప్పటి నుంచి సచిన్ జోషి విదేశాల్లో ఉండటంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్ నుంచి ముంబైకి రాగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. (గుట్టుగా.. బెంగళూరు టు నెల్లూరు)
ఇక హిందీలో అత్యంత సంపన్నమైన నటుల్లో సచిన్ జోషి ఒకరు. ఆయన గుట్కా వ్యాపారంలో ప్రసిద్ధి చెందాడు. గుట్కా కింగ్‌గా ఆయన తండ్రిని పిలుస్తుంటారు. ఓ వైపు ముంబయి, మరోవైపు హైదరాబాద్‌లో అక్రమంగా ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్రమంగా భారీ సంపాదించి ఎంజాయ్ చేస్తుంటారని, అందులో భాగంగానే సినిమాలు చేస్తున్నారని భోగట్టా. సచిన్ జోషి ‘మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, ఆజాన్, జాక్‌పాట్, వీరప్పన్, వీడెవడు, నెక్ట్స్ ఏంటీ, అమావాస్ చిత్రాల్లో నటించారు. ఇదిలా ఉంటే ఇటీవల బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన నేపథ్యంలో తాజాగా సచిన్‌ని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ('చిరుద్యోగి నుంచి ఏడాదికి రూ.20కోట్ల టర్నోవర్‌కు')
Comments
Please login to add a commentAdd a comment