Pan Masala illegal sales case
-
సినీ నటుడు సచిన్ జోషి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : గుట్కా అక్రమ రవాణా కేసులో సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాన్ మసాలాల ముసుగులో నిషేధిత గుట్కాలు తయారీ, సరఫరా చేస్తున్న ఆయనను ముంబై విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన సచిన్ జోషిని నిర్బంధంలోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. కాగా హైదరాబాద్‌కు అక్రమంగా గుట్కా తరలింపులో సచిన్ జోషి హస్తమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆయనపై ఐపీసీ 273,336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ('గుట్టు'కా దందా!) కాగా ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కాల తయారీ, సరఫరాపై సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిఘా పెంచారు. పెద్ద మొత్తంలో గుట్కా బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గుట్కా కోట్ల రూపాయల్లో ఉంటుందని సమాచారం. ఈ కేసులో నిందితుల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విచారణలో సచిన్ జోషి పేరు బయటకు రావడంతో ఆయనపై బహదూర్ పురా పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 336, 273 కింద కేసు నమోదు అయింది. అప్పటి నుంచి సచిన్ జోషి విదేశాల్లో ఉండటంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్ నుంచి ముంబైకి రాగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. (గుట్టుగా.. బెంగళూరు టు నెల్లూరు) ఇక హిందీలో అత్యంత సంపన్నమైన నటుల్లో సచిన్ జోషి ఒకరు. ఆయన గుట్కా వ్యాపారంలో ప్రసిద్ధి చెందాడు. గుట్కా కింగ్‌గా ఆయన తండ్రిని పిలుస్తుంటారు. ఓ వైపు ముంబయి, మరోవైపు హైదరాబాద్‌లో అక్రమంగా ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్రమంగా భారీ సంపాదించి ఎంజాయ్ చేస్తుంటారని, అందులో భాగంగానే సినిమాలు చేస్తున్నారని భోగట్టా. సచిన్ జోషి ‘మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, ఆజాన్, జాక్‌పాట్, వీరప్పన్, వీడెవడు, నెక్ట్స్ ఏంటీ, అమావాస్ చిత్రాల్లో నటించారు. ఇదిలా ఉంటే ఇటీవల బాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన నేపథ్యంలో తాజాగా సచిన్‌ని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ('చిరుద్యోగి నుంచి ఏడాదికి రూ.20కోట్ల టర్నోవర్‌కు') -
ఇలా పట్టుబడతాడు.. అలా బయటకొస్తాడు
ఈ కంటెయినర్ వాహనం విలువ రూ.20లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఉంటుంది. ఇది కొత్త వాహనం. గత నెల గుడిహత్నూర్ పోలీసులు ఈ వాహనాన్ని పట్టుకున్నారు. ఇందులో హోల్‌సెల్‌లో రూ.25లక్షల విలువైన నిషేధిత గుట్కాను అక్రమంగా వేరే రాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌కు తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇది ఆదిలాబాద్‌కు చెందిన పాన్ మసాలా వ్యాపారిది. అంత ఖరీదైన వాహనంలో లక్షల విలువైన అక్రమ సరుకును పోలీసులు పట్టుకున్నా ఆ వ్యాపారి పెద్దగా పట్టించుకోలేదు. కారణం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారం అతనే నిర్వహిస్తుండటం, ఇప్పటికే కోట్లకు పడగలెత్తడంతోనే ఇలా విలువైన వాహనం, సరుకు పట్టుబడ్డా ఆయన దందాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. సాక్షి, ఆదిలాబాద్: గుట్కా దందాలో ఆయనో డాన్. ఆదిలాబాద్‌కు చెందిన ఓ పాన్ మసాలా వ్యాపారి, అతని సోదరులతో కలిసి అక్రమ దందా నిర్వహిస్తున్నాడు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిఘా కళ్లు కప్పి దందా నడుపుతున్నాడు. ఈ దందాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చేయని ప్రయత్నాలు లేవు. అయినా అతని దందాకు బ్రేక్ పడటం లేదు. ఉమ్మడి జిల్లాలో ఆయనపై ఇప్పటివరకు వంద కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్ని బెయిలబుల్ కేసులు కావడంతో ఒక కేసులో పట్టుబడ్డ తర్వాత త్వరితగతిన బయటకొస్తున్న ఈ నిందితుడు మళ్లీ తన పాత పంథాను మాత్రం కొనసాగిస్తున్నాడు. విలువైన వాహనాలు, సరుకు పట్టుబడినప్పుడు ఆయన తన నష్టాన్ని మరో రూపంలో పూడ్చుకుంటున్నట్లు ఈ వ్యాపారంతో సంబంధం ఉన్న కొంతమంది ద్వారా తెలుస్తోంది. అదెలా అంటే.. ఇటీవల గుడిహత్నూర్‌లో ఓ వాహనం పోలీసులకు పట్టుబడిన తర్వాత ఆ వాహనం ఖరీదు, సరుకు విలువనే అరకోటి దాటుతుండగా, దీని తర్వాత సరుకును హోల్‌సెల్‌గా విక్రయించే దగ్గర రెట్టింపు చేసి తన నష్టాన్ని పూడ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఈ దందాలో విలువైన వాహనాలు, సరుకు ఎలాంటిది పట్టుబడ్డా ఆ పాన్ మసాలా వ్యాపారి లైట్ తీసుకోవడానికి అదే కారణమని చెప్పుకుంటున్నారు. నిత్యం దందా.. నిషేధిత గుట్కా వ్యాపారాన్ని ఎన్నో ఏళ్లుగా ఈ పాన్ మసాలా వ్యాపారి యథేచ్ఛగా నిర్వహిస్తున్నాడు. ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రెండేళ్లలోనే సుమారు రూ.5 కోట్ల అక్రమ సరుకును పట్టుకున్నారు. అయినా ఈ దందాను పూర్తిస్థాయిలో నిలువరించలేకపోతున్నారు. కాగా జిల్లాలో మట్కా జూదం జోరుగా సాగుతున్న సమయంలో ఎస్పీ ఉక్కుపాదం మోపారు. అది చాలా మట్టుకు సక్సెస్ అయ్యింది. ఇందులో కొంతమంది మట్కా నిర్వాహకులకు బెయిల్ రాకుండా పోలీసులు కేసులు పెట్టడంతోనే వారు మళ్లీ అటువైపుగా దృష్టి సారించలేదన్న అభిప్రాయం పోలీసు వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి చర్యలే ఈ గుట్కా విషయంలోనూ అవలంబించాలన్న అభిప్రాయం లేకపోలేదు. కొందరికీ మామూళ్ల తంతు.. గుట్కా దందాలో కొందరు పోలీసులకు ఇప్పటికీ మామూళ్లు ముడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ గుట్కాపై ఉక్కుపాదం మోపుతూ కేసుల విషయంలో సూక్ష్మంగా దృష్టి సారించడంతో మండలాల్లో పోలీసు అధికారులు ఇందులో మామూళ్లకు వెనుకంజ వేస్తున్నా.. దీర్ఘకాలికంగా ఆయా సర్కిల్, ఎస్‌హెచ్‌ఓలలో పనిచేస్తున్న పోలీసు అధికారులు ఇప్పటికి మామూళ్ల తంతును రుచి మరుగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రం, శివారులో ఈ దందా యథేచ్ఛగా నడుస్తోంది. ఆదిలాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న కచ్కంటిలో ఒక గోదామును ఏర్పాటు చేసుకొని నిషేధిత గుట్కాను నిల్వ చేసి ఉంచగా పోలీసులే దాడిచేసి వెలుగులోకి తెచ్చారు. అయితే జిల్లా ఉన్నతాధికారికి సమాచారం రావడంతోనే ఇటువంటివి బయటకు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం పోలీసు అధికారులకు తెలిసినా మామూళ్ల కారణంగా పట్టించుకోవడం లేదన్న అపవాదు ఉంది. మండలాల్లో గోదాములు నిషేధిత గుట్కా వ్యాపారంలో కోట్లు గడించిన ఆదిలాబాద్‌కు చెందిన ఓ పాన్ మసాలా వ్యాపారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ దందాలో ఏకచత్రాధిపత్యం వహిస్తున్నాడు. మండలాల్లో గోదాములు ఏర్పాటు చేసుకొని సరుకును నిల్వ ఉంచి అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్న ఈ గుట్కాను ఎక్కడికక్కడ వాహనాలు పంపి డంపింగ్ చేయడం ద్వారా దందాను సులభతరం చేసుకున్నాడు. కోట్లు గడించిన ఈ వ్యాపారికి రాష్ట్ర రాజధానిలోనూ కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయనే ప్రచారం లేకపోలేదు. ఇదిలా ఉంటే పోలీసుశాఖలో రాష్ట్రస్థాయిలో కొంతమంది ఉన్నతాధికారులతో కూడా ఈ వ్యాపారితో సత్సంబంధాలు ఉండడంతో పోలీసులు ఇతన్ని కట్టడి చేయలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. -
విచారణకు పోలీస్‌బాస్ !
♦ గుట్కా కేసులో మదురై హైకోర్టు స్పష్టీకరణ ♦ విచారణ కమిషన్‌కు పూర్తి అధికారాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: శాంతి భద్రతలు పరిరక్షిస్తూ, నేరాలను అదుపుచేయాల్సిన డీజీపీ రాజేంద్రనే నిందితుడుగా మారిపోయాడు. నిషేధిత గుట్కా అమ్మకాలను గుట్టుగా కానిచ్చేశారనే ఆరోపణలపై విచారణ జరిపేందుకు మదురై హైకోర్టు అనుమతించింది. అవినీతి నిరోధకశాఖకు పూర్తి అధికారాలు కల్పిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. రాజేంద్రన్ చెన్నై నగర్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో 2015లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత డీజీపీగా పదోన్నతి కల్పించారు. డీజీపీ రాజేంద్రన్ గత నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా ఆయన పదవీకాలాన్ని సీఎం ఎడపాడి మరో రెండేళ్లు పొడిగించారు. నిషేధిత గుట్కా, పాన్ మసాలా అక్రమ అమ్మకాల కేసులో డీజీపీ రాజేంద్రన్ కూడా ఒక నిందితుడని, నగర కమిషనర్‌గా ఉన్న కాలంలో సైతం గుట్కా అమ్మకాలు సాగాయని ఇంగ్లిషు టీవీ చానల్ ఆధారాలు సహా బైటపెట్టింది. గుట్కా గోల్మాల్ నుంచి రాజేంద్రన్‌ను రక్షించేందుకే ఆయన పదవీకాలాన్ని పొడిగించారని తప్పుపడుతూ మదురై మీనాంబాళపురానికి చెందిన కే కదిరేశన్ ఈనెల 7వ తేదీన హైకోర్టు మదురై శాఖలో పిటిషన్ వేశారు. అవినీతి నిరోధక శాఖ నుంచి విచారణ ఎదుర్కొంటున్న డీజీపీకి కల్పించిన పదవీకాల పొడిగింపుపై స్టే విధించాలని, కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ కోరాడు. తనకు బెదిరింపులు వస్తున్నందున సాయుధ పోలీసును బందోబస్తుకు కేటాయించాలని కోరుతో మరో అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు కేకే శశిధరన్, జీఆర్ స్వామినాథన్‌ల ముందుకు ఈనెల 6వ తేదీన విచారణకు వచ్చింది. పిటిషన్ తరఫు వాదనపై వివరాలు అందజేయాల్సిందిగా న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ఆనాడు ఆదేశించారు. ఈనెల 17వ తేదీ వాయిదా నాటికి ప్రభుత్వ అధికారులు పత్రాలను దాఖలు చేసి తమ వాదనను వినిపించారు. అత్యున్నత స్థానంలోని అధికారులపై చేసే ఫిర్యాదులకు ఆధారాలు కూడా సమర్పించాలని న్యాయమూర్తులు పిటిషనర్‌ను ఆదేశించారు. శుక్రవారం ఈ కేసు మరోసారి విచారణకు రాగా ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తులు కేకే శశిధరన్, జీఆర్ స్వామినాథన్ మాట్లాడుతూ డీజీపీ పదవీకాలం పొడిగింపుపై తాము స్టే మంజూరు చేయలేం, అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలపై 20 రోజుల్లోగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అవినీతి నిరోధకశాఖ కమిషనర్ నేతృత్వంలో విచారణ జరగాలని వారు తీర్పు చెప్పారు. డీజీపీ, ప్రభుత్వం, రాజకీయ జోక్యం లేకుండా ఈ విచారణ కమిషన్ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పిటిషన్‌పై సాహసోపేతంగా విచారణ జరపాలని వారు సూచించారు. విచారణ సమయంలో రాష్ట్ర హోంమంత్రిత్వశాఖ, మరే ఇతర శాఖల నుంచి అనుమతి పొందాల్సిన అవసరం కూడా లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.