ఇటీవల పట్టుపడిన గుట్కా వాహనం
ఈ కంటెయినర్ వాహనం విలువ రూ.20లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఉంటుంది. ఇది కొత్త వాహనం. గత నెల గుడిహత్నూర్ పోలీసులు ఈ వాహనాన్ని పట్టుకున్నారు. ఇందులో హోల్‌సెల్‌లో రూ.25లక్షల విలువైన నిషేధిత గుట్కాను అక్రమంగా వేరే రాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌కు తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇది ఆదిలాబాద్‌కు చెందిన పాన్ మసాలా వ్యాపారిది. అంత ఖరీదైన వాహనంలో లక్షల విలువైన అక్రమ సరుకును పోలీసులు పట్టుకున్నా ఆ వ్యాపారి పెద్దగా పట్టించుకోలేదు. కారణం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారం అతనే నిర్వహిస్తుండటం, ఇప్పటికే కోట్లకు పడగలెత్తడంతోనే ఇలా విలువైన వాహనం, సరుకు పట్టుబడ్డా ఆయన దందాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.
సాక్షి, ఆదిలాబాద్: గుట్కా దందాలో ఆయనో డాన్. ఆదిలాబాద్‌కు చెందిన ఓ పాన్ మసాలా వ్యాపారి, అతని సోదరులతో కలిసి అక్రమ దందా నిర్వహిస్తున్నాడు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిఘా కళ్లు కప్పి దందా నడుపుతున్నాడు. ఈ దందాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చేయని ప్రయత్నాలు లేవు. అయినా అతని దందాకు బ్రేక్ పడటం లేదు. ఉమ్మడి జిల్లాలో ఆయనపై ఇప్పటివరకు వంద కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్ని బెయిలబుల్ కేసులు కావడంతో ఒక కేసులో పట్టుబడ్డ తర్వాత త్వరితగతిన బయటకొస్తున్న ఈ నిందితుడు మళ్లీ తన పాత పంథాను మాత్రం కొనసాగిస్తున్నాడు. విలువైన వాహనాలు, సరుకు పట్టుబడినప్పుడు ఆయన తన నష్టాన్ని మరో రూపంలో పూడ్చుకుంటున్నట్లు ఈ వ్యాపారంతో సంబంధం ఉన్న కొంతమంది ద్వారా తెలుస్తోంది. అదెలా అంటే.. ఇటీవల గుడిహత్నూర్‌లో ఓ వాహనం పోలీసులకు పట్టుబడిన తర్వాత ఆ వాహనం ఖరీదు, సరుకు విలువనే అరకోటి దాటుతుండగా, దీని తర్వాత సరుకును హోల్‌సెల్‌గా విక్రయించే దగ్గర రెట్టింపు చేసి తన నష్టాన్ని పూడ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఈ దందాలో విలువైన వాహనాలు, సరుకు ఎలాంటిది పట్టుబడ్డా ఆ పాన్ మసాలా వ్యాపారి లైట్ తీసుకోవడానికి అదే కారణమని చెప్పుకుంటున్నారు.
నిత్యం దందా..
నిషేధిత గుట్కా వ్యాపారాన్ని ఎన్నో ఏళ్లుగా ఈ పాన్ మసాలా వ్యాపారి యథేచ్ఛగా నిర్వహిస్తున్నాడు. ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రెండేళ్లలోనే సుమారు రూ.5 కోట్ల అక్రమ సరుకును పట్టుకున్నారు. అయినా ఈ దందాను పూర్తిస్థాయిలో నిలువరించలేకపోతున్నారు. కాగా జిల్లాలో మట్కా జూదం జోరుగా సాగుతున్న సమయంలో ఎస్పీ ఉక్కుపాదం మోపారు. అది చాలా మట్టుకు సక్సెస్ అయ్యింది. ఇందులో కొంతమంది మట్కా నిర్వాహకులకు బెయిల్ రాకుండా పోలీసులు కేసులు పెట్టడంతోనే వారు మళ్లీ అటువైపుగా దృష్టి సారించలేదన్న అభిప్రాయం పోలీసు వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి చర్యలే ఈ గుట్కా విషయంలోనూ అవలంబించాలన్న అభిప్రాయం లేకపోలేదు.
కొందరికీ మామూళ్ల తంతు..
గుట్కా దందాలో కొందరు పోలీసులకు ఇప్పటికీ మామూళ్లు ముడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ గుట్కాపై ఉక్కుపాదం మోపుతూ కేసుల విషయంలో సూక్ష్మంగా దృష్టి సారించడంతో మండలాల్లో పోలీసు అధికారులు ఇందులో మామూళ్లకు వెనుకంజ వేస్తున్నా.. దీర్ఘకాలికంగా ఆయా సర్కిల్, ఎస్‌హెచ్‌ఓలలో పనిచేస్తున్న పోలీసు అధికారులు ఇప్పటికి మామూళ్ల తంతును రుచి మరుగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రం, శివారులో ఈ దందా యథేచ్ఛగా నడుస్తోంది. ఆదిలాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న కచ్‌కంటిలో ఒక గోదామును ఏర్పాటు చేసుకొని నిషేధిత గుట్కాను నిల్వ చేసి ఉంచగా పోలీసులే దాడిచేసి వెలుగులోకి తెచ్చారు. అయితే జిల్లా ఉన్నతాధికారికి సమాచారం రావడంతోనే ఇటువంటివి బయటకు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం పోలీసు అధికారులకు తెలిసినా మామూళ్ల కారణంగా పట్టించుకోవడం లేదన్న అపవాదు ఉంది.
మండలాల్లో గోదాములు
నిషేధిత గుట్కా వ్యాపారంలో కోట్లు గడించిన ఆదిలాబాద్‌కు చెందిన ఓ పాన్ మసాలా వ్యాపారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ దందాలో ఏకచత్రాధిపత్యం వహిస్తున్నాడు. మండలాల్లో గోదాములు ఏర్పాటు చేసుకొని సరుకును నిల్వ ఉంచి అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్న ఈ గుట్కాను ఎక్కడికక్కడ వాహనాలు పంపి డంపింగ్ చేయడం ద్వారా దందాను సులభతరం చేసుకున్నాడు. కోట్లు గడించిన ఈ వ్యాపారికి రాష్ట్ర రాజధానిలోనూ కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయనే ప్రచారం లేకపోలేదు. ఇదిలా ఉంటే పోలీసుశాఖలో రాష్ట్రస్థాయిలో కొంతమంది ఉన్నతాధికారులతో కూడా ఈ వ్యాపారితో సత్సంబంధాలు ఉండడంతో పోలీసులు ఇతన్ని కట్టడి చేయలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment