Adilabad Crime News
-
ఆస్పత్రికి వెళ్తూ.. కానరాని లోకాలకు
గుడిహత్నూర్: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందగా, దివ్యాంగుడైన భర్తకు స్వల్పగాయాలయ్యాయి. ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ కథనం ప్రకారం.. ఇచ్చోడ మండలం కోకస్‌మన్నూర్‌కు చెందిన జాదవ్ మధుకర్–రమ్యక్రిష్ణ (30)భార్యాభర్తలు. భర్త మధుకర్ దివ్యాంగుడు, కోకస్‌మన్నూర్‌లో కిరాణషాపు నడిపిస్తున్నాడు. రమ్యక్రిష్ణ.. లేడిస్ ఎంపోరియం నడిపిస్తోంది. వీరికి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. గ్రామంలో ఇటీవల మీ సేవ కేంద్రం మంజూరైంది. రమ్యక్రిష్ణ శిక్షణ సైతం తీసుకుంది. గత కొంతకాలంగా ఈమె చర్మవ్యాధితో బాధపడుతోంది. రెండు రోజులుగా చర్మంపై దద్దుర్లు వచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం భర్తతో కలిసి బైక్‌పై రిమ్స్‌కు వెళ్లేందుకు బయల్దేరింది. గుడిహత్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో వీరి బైక్‌ను వెనుక నుంచి వస్తున్న వాహనం ఢీకొట్టింది. జాతీయ రహదారి 44పై పక్కన రెయిలింగ్‌పై రమ్యక్రిష్ణ ఎగిరిపడింది. ఆమె రెండు చేతులు విరిగిపోయి, తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. హెల్మెట్ ధరించి ఉండడంతో భర్తకు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే వారిని అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించారు. వైద్యులు భర్తకు చికిత్స అందిస్తున్నారు. మధుకర్ తండ్రి తుకారాం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతురాలికి 6, 7 ఏళ్లలోపు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి గుడిహత్నుర్ మండలం మేకలగండి సమీపంలో మాక్స్ పికప్ వాహనం సైడ్ పిల్లర్లను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మృతులు మొజుద్దీన్ (60), మొయినొద్దీన్ (40),అలీ (8),ఉస్మానొద్దీన్ (10),ఉస్మాన్ (12)పోలీసులు గుర్తించారు. మృతులంతా ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన వారని తెలుస్తోంది. భైంసాలో ఓ కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రియుడి కోసం భర్తను అతి దారుణంగా..
ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ ఖలీల్ తనకు భార్య ఉన్నప్పటికీ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరికి ఇది వరకే పెళ్లి జరిగినా ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు. పదేళ్లలోనే వారి కాపురం కుప్పకూలింది. భార్యపై అనుమానంతో కర్రలతో దాడి చేసి హత్య చేశాడు. ఆమె మరణించగా, భర్త కటకటాల పాలయ్యాడు. మృతురాలి పిల్లలతో పాటు మొదటి భార్య, ఆమె పిల్లలు రోడ్డున పడ్డారు.ఈ నెల 12న నార్నూర్ మండలం నాగలకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజానంద్ హత్యకు గురయ్యాడు. రెండు రోజుల్లో ఆయన పదోన్నతి పొందనుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని హత్యకు పన్నాగం పన్నారు. నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. ఈక్రమంలో భార్య జైలు పాలు కాగా, కుమారుడు అనాథగా మిగిలాడు. జిల్లా వ్యాప్తంగా ఈ హత్య కలకలం రేపింది.గతేడాది ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్ కాలనీకి చెందిన ఓ వివాహిత భుక్తాపూర్‌కు చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. విషయం తెలిసిన భర్త పలుసార్లు మందలించాడు. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత ఆ యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన భర్త గుడిహత్నూర్ మండలం సీతాగోంది సమీపంలోని గర్కంపేట వద్ద తన బంధువులతో కలిసి హతమార్చాడు. భార్యతో పాటు యువకుడిని సైతం కర్రతో బాది హత్య చేశారు.ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఆయన ప్రేమ వివాహం చేసుకొని సంతోషంగా ఉంటున్న సమయంలో వరుసకు బంధువు అయిన ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కుటుంబీకులకు తెలియకుండా జిల్లా కేంద్రంలోని ఓ ఆలయంలో ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. దీంతో అమ్మాయి తరఫున వారు కోపోద్రిక్తులై గుడిహత్నూర్ మండలంలోని డంపింగ్ యార్డు సమీపంలోని అటవీ ప్రాంతంలో గతేడాది హతమార్చారు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆమెను కాదని మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే హత్యకు దారి తీసింది. భార్యతో పాటు ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు.జిల్లాలో గతేడాది జరిగిన హత్యలు: 18ఈఏడాది (ఇప్పటివరకు) జరిగిన హత్యలు:06ఆదిలాబాద్‌టౌన్: వివాహేతర సంబంధాలతో బంధాలు తెగిపోతున్నాయి. భార్యపై అనుమానంతో భర్త హత్యకు పాల్పడుతుండగా, మరికొంత మంది మహిళలు ఇతర వ్యక్తులతో సంబంధాలు ఏర్పర్చుకొని విలువైన జీవితాలను బలిగొంటున్నారు. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కాటికి పంపుతున్న ఘటనలు జిల్లాలో అనేకం చోటుచేసుకుంటున్నాయి. జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసిన దంపతులు ఈ సంబంధాల కారణంగా లోకానికే దూరమవుతున్నారు. కుటుంబంతో సంతోషంగా ఉంటూ సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టాల్సిన కొంతమంది భార్యభర్తలు వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. తమ జీవిత భాగస్వామిని మోసం చేస్తూ వివాహేతర సంబంధాలకు ఆకర్షితులవుతున్నారు. ఇందులో పురుషులతో పాటు మహిళలు ఉంటున్నారు. వీరి తప్పిదానికి కుటుంబ పరువు వీధిపాలు కావడంతో పాటు పిల్లల భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ క్రమంలోనే కొన్ని బంధాలు విడిపోతుండగా, మరికొందరు తప్పు చేసిన వారిని అంతమొందిస్తున్నారు. దారుణ హత్యలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇరువురి కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది. వీరే కాకుండా ప్రేమలో పడిన జంటలు సైతం ఆఘాయిత్యాలకు పాల్పడుతుండం గమనార్హం.హత్యలకు ఒడిగడుతున్నారు..వివాహేతర సంబంధాలతో జిల్లాలో హత్యలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఆరు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఇటీవల చోటు చేసుకున్న రెండు ఘటనలు జిల్లాలో సంచలనం రేపాయి. బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నింపాయి. ఒకరు రెండో భార్యపై అనుమానంతో హత్య చేయగా.. ఓ ఉపాధ్యాయుడి భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకొని భర్తనే కడతేర్చింది. ఇంకొంత మంది ప్రేమికులు, కొంతమంది వివాహేతర సంబంధాల కారణంగా వారి కుటుంబీకులు, బంధువులు హత్యలకు పాల్పడుతుండగా, దంపతుల్లో ఎవరో ఒకరు అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు ఒడిగడుతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా చెడుదారులకు ఆకర్షితులై ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయి. తరచూ ఫోన్లో మాట్లాడడాన్ని గ్రహించడంతో భార్య భర్తల మధ్య గొడవలు చోటుచేసుకొని కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఇదిలా ఉండగా మద్యం, గంజాయి మత్తులో సైతం కొంత మంది హత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంతో విలువైన జీవితాలను గాలిలో కలుపుతున్నారు. దంపతుల్లో ఒకరు తప్పు చేస్తే వారిని హతమార్చడానికి పన్నాగం పన్నుతుండగా, ప్రేయసి ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చేందుకు సైతం వెనుకాడటం లేదు.ఇష్టం లేకుంటే విడిపోవాలిదంపతుల్లో చాలా వరకు అనుమానాలతోనే హత్యలు జరుగుతున్నాయి. ఇష్టం లేనప్పుడు విడిపోవడం మంచిది. పోలీస్స్టేషన్లలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. స్టేషన్‌కు వచ్చి కౌన్సెలింగ్ తీసుకోవాలి. అవసరమైతే ఫిర్యాదు చేయాలి. చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి. కోర్టును ఆశ్రయించాలి. అంతే తప్పా విలువైన ప్రాణాలను తీయడం సరికాదు. రెండు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకుంటాయి. పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయంతో జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.– ఎల్.జీవన్‌రెడ్డి, డీఎస్పీ, ఆదిలాబాద్ -
దళితబంధు రావడం లేదని బలవన్మరణం?
సాక్షి, ఆదిలాబాద్: దళిత బందు పథకం కోసం ఓ యువకుడి అత్మహత్య చేసుకున్న ఉదంతం జిల్లాలో చోటు చేసుకుంది. జైనథ్ మండలం బోరజ్కు చెందిన రమాకాంత్ అనే యువకుడు పురుగుల మందు త్రాగి అత్మహత్య చేసుకున్నాడు. స్పాట్లో ఓ లేఖ దొరికింది. తాను దళితబంధు కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని రమాకాంత్ పేరిట ఆ లేఖ ఉంది. కుటుంబ సభ్యుల ప్రస్తావనతో పాటు తన ఆత్మహత్యకు సీఎం కేసీఆర్ కారణమంటూ లేఖలో ప్రస్తావించాడు రమాకాంత్. కొడుకు కోల్పోయిన దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు తమను ఆదుకోవాలని సర్కార్‌ను కోరుతున్నారు. అయితే ఈ ఘటనపై ఇంకా పోలీసులకు ఫిర్యాదు అందలేదని సమాచారం. -
విధి అంటే ఇదేనేమో!.. అటు భార్య.. ఇటు భర్త..
క్రైమ్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో దారుణం జరిగింది. కొత్త కాపురంలో కలహలతో ఓ వ్యక్తి భార్యను చంపేశాడు. ఆపై పారిపోతుండగా లారీ యాక్సిడెంట్ అయ్యి.. అక్కడిక్కడే కన్నుమూశాడు. నాలుగు నెలల కిందట దీప్య, అరుణ్‌ల వివాహం జరిగింది. కారణం తెలియదుగానీ కొంతకాలంగా వీళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అరుణ్.. దీపను హతమార్చాడు. ఆపై బైక్‌పై పారిపోతుండగా ఆగి ఉన్న లారీ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే భార్యను చంపి లొంగిపోయే క్రమంలోనే అరుణ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని అతని తరపు బంధువులు చెబుతున్నారు. -
ఆదిలాబాద్ లో రోడ్డు ప్రమాదం..
-
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు.. మనస్తాపంతో..
దస్తురాబాద్(ఖానాపూర్): డ్రంకెన్‌డ్రైవ్ కేసు నమోదుతో మనస్తాపం చెందిన ఆదివాసీ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని గొడిసిర్యాల గోండుగూడాలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, నిర్మల్ డీఎస్పీ ఉపేంద్రరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాడవి నాగరాజు (19) ఈనెల 13న జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం చిత్రవేణిగూడంలో ఓ వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యాడు. అనంతరం ఆదివాసీ సంప్రదాయం ప్రకారం మద్యం తాగాడు. వెంటనే బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలో స్థానిక ఎస్సై జ్యోతిమణి వాహనాల తనిఖీ చేపట్టారు. డ్రంకెన్ డ్రైవ్‌లో నాగరాజు మద్యం తాగినట్లు రుజువైంది. పోలీసులు బైక్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం నాగరాజు ఇంటికి చేరగా తల్లిదండ్రులు బైక్ ఏమైందని ప్రశ్నించారు. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుకున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో వారు కోపం చేయడంతో అదే రోజు రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని జన్నారం ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతదేహంతో రోడ్డుపై ఆందోళన పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేయడంతోనే నాగరాజు మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గురువారం ఉదయం మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి ధర్నా చేపట్టేందుకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ సీఐ అజయ్‌బాబు సిబ్బందితో గ్రామ పొలిమేరకు చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈక్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. సుమారు ఐదు గంటల పాటు ఆందోళన కొనసాగించగా.. డీఎస్పీ ఉపేంద్రరెడ్డి అక్కడికి చేరుకుని ఆదివాసీ నాయకులతో చర్చించారు. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. -
పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో
ఆదిలాబాద్ రూరల్: మండలంలోని ఖండాల గ్రామ పంచాయతీ పరిధిలోని మొలాలగుట్టకు చెందిన ఆత్రం మోతిబాయి (21) పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆదిలాబాద్ రూరల్ ఎస్సై అంజమ్మ తెలిపారు. ఆమె కథనం ప్రకారం... మొలాలగుట్టకు చెందిన నాగోరావ్‌తో గాదిగూడ మండలం పర్సువాడ గ్రామానికి చెందిన మోతిబాయికి గతేడాది వివాహమైంది. ఇటీవల రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంది. రెండు రోజుల కిందట భర్త ఇంటికి వచ్చింది. తాను పుట్టింటికి వస్తానని, తనను తీసుకెళ్లేందుకు తమ్ముడిని పంపించాలని తల్లితో ఫోన్లో కోరింది. రెండు రోజుల కిందటనే వెళ్లావు కదా ఇంకెందుకు వస్తావ్ అని తల్లి పేర్కొంది. దీంతో మోతిబాయికి ఆమె భర్త నాగోరావ్ మధ్య చిన్నప్పటి గొడవ జరిగింది. దీంతో శనివారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11.30 గంటలకు మృతి చెందింది. మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె వివరించారు. -
చేతులు మారిన రూ.2.50లక్షలు..?
సాక్షి, బేల(అదిలాబాద్): ఓ ప్రైవేట్ లైన్‌మన్ విద్యుత్‌షాక్‌తో ఇటీవల చనిపోయిన ఘటనలో బాధిత కుటుంబానికి అందాల్సిన పరిహారం చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ కేసు నుంచి తప్పించేందుకు స్థానిక నాయకుడొకరు ముగ్గురు విద్యుత్‌శాఖ అధికారుల నుంచి రూ.2.50లక్షలు వసూలు చేశాడని, ఇందుకు సబ్‌స్టేషన్ ఆపరేటర్ ఒకరు సహకరించారన్న చర్చ స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు విద్యుత్‌శాఖ అధికారులు కూడా ‘పైసలుపాయే.. ఆపై కేసు నమోదాయే..’ అని చర్చించుకుంటున్నారు. వీరిచ్చిన రూ.2.50 లక్షలు చేతులు మారాయా..? మారితే ఎవరికి చేరాయి..? డబ్బులిచ్చినా కేసు ఎందుకు నమోదైంది..? అని ఆ శాఖలో తర్జనభర్జన నెలకొంది. బేల విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో అంతర్రాష్ట్ర రోడ్డు పక్కన ఓ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు వచ్చింది. దీంతో గతనెల 17న చిన్న ట్రాన్స్ఫార్మర్ బిగింపు, మరమ్మతు చేసేందుకు ప్రైవేటు లైన్‌మన్ షేక్ అయ్యూబ్ (22)ను తీసుకొచ్చారు. ఆ సమయంలో విద్యుత్‌షాక్ తగిలి అయ్యూబ్ మృతి చెందాడు. అయితే పోస్టుమార్టం సమయంలో ఓ నాయకుడు, సబ్‌స్టేషన్ ఆపరేటర్ కలిసి బాధిత కుటుంబం నుంచి పోలీసులకు ఆరుసార్లు ఫిర్యాదు రాయించారు. సంఘటనకు బాధ్యులైన అధికారులను కేసు నుంచి తప్పించేందుకు ఏకంగా రూ. 2.50లక్షలకు ఒప్పందం కుదిర్చారు. ఇందులో నుంచి బాధిత కుటుంబానికి రూ.2లక్షలు అందించాలని, మిగిలిన రూ. 50 వేలు కేసుల ఖర్చుల కోసమని నిర్ణయించుకున్నారు. కేసు ప్రారంభంలో పోలీసులు ప్రమాదానికి విలేజ్ వర్కర్ (ఆదివాసీ యువకుడు) కనకే శ్యాం కారణమని పేర్కొంటూ కేసు నెట్టారు. దీంతో ఆదివాసీలు ఆందోళనకు దిగారు. కేసును తాత్కాలిక విలేజ్ వర్కర్‌పై నెట్టడమేంటని, అమాయకుడిని బలిచేస్తే ఊరుకోబోమని పోలీసులను ఆశ్రయించారు. ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లును కలిసి విన్నవించారు. సమగ్ర విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఆదివాసీ నాయకులను సముదాయించారు. ఇటీవల ఆ కేసు నుంచి విద్యుత్ అధికారులను తప్పించి.. విలేజ్ వర్కర్‌పై నెట్టడానికి డబ్బులు వసూలు చేసిన సదరు నాయకుడు ఓ మైనార్టీ నాయకుడితోపాటు బాధిత కుటుంబసభ్యులను తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్సై సాయన్న సమగ్ర విచారణ చేపట్టి గతనెల 26న ముగ్గురు విద్యుత్ శాఖ అధికారులతోపాటు విలేజ్ వర్కర్‌ను రిమాండ్ చేశారు. రిమాండ్ అయినవారిలో ఏఈ శంకర్, లైన్ ఇన్స్పెక్టర్ పవార్ సౌలా, జూనియర్ లైన్‌మన్ మనోహర్, విలేజ్ వర్కర్ కనకే శ్యాం ఉన్నారు. ఇలా ముగ్గురు అధికారులపై కేసు కావడంతో డివిజన్ పరిధిలోని విద్యుత్ బృందం తలాకొంత కలిపి ఇచ్చిన డబ్బులను వెనక్కి ఇవ్వాలంటూ కేసులో మధ్యవర్తిత్వం వహించిన సబ్‌స్టేషన్ ఆపరేటర్‌తో అన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ డబ్బులను సదరు ఆపరేటర్ నాయకుడికి ఇచ్చాడా..? ఒకవేళ నాయకుడికి ఇస్తే వెనక్కి ఎలా తీసుకోవాలి..? అని తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. సదరు నాయకుడు అధికారపారీ్టకి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. మరోవైపు బాధిత కుటుంబానికీ రూ.2లక్షలు ఇవ్వలేదని తెలిసింది. మొత్తం డబ్బులను ఆ నాయకుడే నొక్కేశాడా? ఆపరేటర్ నొక్కేశాడా..? తేలాల్సి ఉంద ని విద్యుత్‌శాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. -
ఎనిమిదేళ్ల బాలికపై యువకుడి అఘాయిత్యం
సాక్షి, జైనథ్(ఆదిలాబాద్): ముక్కు పచ్చలారని ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం నిరాల గ్రామంలో చోటు చేసుకుంది. జైనథ్ ఎస్సై రామయ్య కథనం ప్రకారం.. నిరాల గ్రామానికి చెందిన బోయర్ ఆకాశ్ (21) అనే యువకుడు వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారికి ఆదివారం సాయంత్రం మాయ మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆమె బట్టలు విప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో పాప ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది. రాత్రి భోజనం చేసే సమయంలో ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు ఏమైందని గట్టిగా ప్రశ్నించారు. కడుపులో నొప్పిగా ఉందని, తాను అన్నం తినలేనని ఏడ్చుకుంటూ జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో తల్లి సోమవారం జైనథ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో, 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. చిన్నారిని వైద్య పరీక్షలు, చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. -
అసభ్యకర ఫొటోలను ఫేస్బుక్లో పెట్టడంతో..!
సాక్షి, అదిలాబాద్: అసభ్యకర చిత్రాలను ఓ యువకుడు ఫేస్బుక్లో పోస్టు చేయడంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం ఉదయం నిర్మల్ జిల్లా ముథోల్‌లో చోటు చేసుకొంది. ముథోల్ సీఐ అజయ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ముథోల్ మండల కేంద్రానికి చెందిన పురుషోత్తం యాదవ్ అలియాస్ పన్ను అదే ఊరిలోని ఓ వివాహితను లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమెకు సంబంధించిన అసభ్యకరమైన చిత్రాలను యువకుడు ఇటీవల ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఈ పోస్టులు చూసి మనస్తాపం చెందిన సదరు వివాహిత శనివారం ఇంట్లో పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు గమనించి ముథోల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడకు చేరుకున్న ముథోల్ సీఐ అజయ్‌బాబు, ఎస్సై అశోక్, భైంసా డీఎస్పీ నర్సింగ్‌రావు న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించేందుకు భైంసా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్బయ యాక్టు కింద కేసు నమోదు చేసి..ఆదివారం రిమాండ్‌కు పంపించినట్లు సీఐ వెల్లడించారు. న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు వినతి.. ముథోల్ సర్పంచ్ రాజేందర్ ఆధ్వర్యంలో ఆదివారం బాధితురాలి బంధువులు, స్థానికులు క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని కలిశారు. నిందితుడు పురుషోత్తం యాదవ్‌పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే ఉన్నతాధికారులతో మాట్లాడానని.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
రౌడీషీటర్ దారుణహత్య
సాక్షి, కాగజ్‌నగర్‌టౌన్ : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని గోల్బజార్ ఏరియాకు చెందిన రౌడీషీటర్ గుర్రం సంతోష్ అలియాస్ సంతు (35) హత్యకు గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి గాంధీ చౌక్ మెయిన్ మార్కెట్ ఏరియాలో సంతోష్‌ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పట్టణ సీఐ డి.మోహన్ తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని గోల్బజార్ ఏరియాకు చెందిన గుర్రం సత్యమ్మ, రమణమ్మ దంపతుల కుమారుడైన సంతోష్ ఇటీవల పీడీయాక్టు కేసులో జైలుశిక్ష అనుభవించి విడులైయ్యాడు. ప్రస్తుతం తల్లివద్దనే ఉంటున్నాడు. వ్యసనాలకు బానిసైన సంతోష్‌పై 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి. (పగబట్టిన ప్రేమ; సాఫ్ట్వేర్ యువతికి..! ) అందులో హత్య, హత్యాయత్నాలు, దాడులు వంటివి కూడా ఉన్నాయి. మే 7న జైలు నుంచి విడుదలైన సంతోష్ శనివారం రాత్రి తీరందాజ్‌రోడ్డు గల్లిలో మరికొంత మంది నేరస్తులతో కలిసి మద్యం సేవిస్తుండగా గొడవపడ్డారు. వారి మధ్య ఉన్న పాత గొడవలపై ఘర్షణ చోటు చేసుకోవడంతో ఒకరు తమ ఇంటి నుంచి గొడ్డలి తీసుకువచ్చి సంతోష్‌పై దాడిచేశాడు. ఈ ఘటనలో సంతోష్‌కు తల, ఇతర భాగాల్లో తీవ్రగాయాలై మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఈ వార్త పట్టణవ్యాప్తంగా విస్తరించడంతో ఈ హత్య వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సంఘటన స్థలాన్ని కాగజ్‌నగర్ డీఎస్పీ బి.లక్ష్మీనర్సింహాస్వామి, సీఐ మోహన్, ఎస్సైలు రవికుమార్, తదితరులు పరిశీలించారు. సంఘటన స్థలంలో పడి ఉన్న పగిలిన మద్యం సీసాలు, ఇతర వివరాలను సేకరించారు. (కరోనా: రికార్డు స్థాయిలో కేసులు) ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. మరికొంత మంది అనుమానితుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి తల్లి సత్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ మోహన్ విలేకరులకు తెలిపారు. -
‘అమ్మా.. అలసటగా ఉందమ్మా.. నిద్రపోతాను’
సాక్షి, రామకృష్ణాపూర్(ఆదిలాబాద్) : కష్టపడి చదివాడు..కన్నవారి కలలు నిజం చేశాడు. మామూలు వైద్యుడి కంటే ఏకంగా ‘గుండె’ డాక్టరే(కార్డియాలజిస్ట్) అయ్యాడు. కాలక్రమంలో అతనిలో ‘ప్రేమ’ అనే మరో కల మొగ్గలు తొడిగింది. చివరికి పెళ్లి దాకా వెళ్లింది. ఏ ప్రేమ కోసమైతే అతడు ఆరాటపడ్డాడో అదే ‘ప్రేమకల’ చెదిరిపోయింది. ఆ వైద్యుడి గుండె శాశ్వతంగా ఆగిపోయింది. రామకృష్ణాపూర్లో విషాదం నింపిన ఘటన వివరాలివి.. పట్టణంలోని ఠాగూర్ స్టేడియం ఏరియాకు చెందిన దాసారాపు సుభాష్(34) గురువారం రాత్రి హైదరాబాద్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. రిటైర్ కార్మికుడు ఆగయ్య కుమారుడైన సుభాష్ మెడిసిన్‌కు ఎంపికయ్యాడు. అరుదైన గుండె విభాగంలో స్పెషలైజేషన్ పూర్తిచేశాడు. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అందరితో కలివిడిగా ఉండే సుభాష్ హైదరాబాద్‌లో తానుంటున్న ఇంటిలోనే విషపు ఇంజక్షన్ వేసుకుని విగతజీవుడయ్యాడు. మనస్తాపంతోనే ఈ దారుణం మృతుడు సుభాష్ విధులు నిర్వర్తిస్తున్న క్రమంలోనే చెన్నైకి చెందిన నిత్య అనే వైద్యురాలితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త పెళ్లి వరకు వెళ్లింది. 2017లో హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. సాఫీగా వీరి దాంపత్య జీవితం గడుస్తు న్నా నిత్య తల్లిదండ్రులకు మాత్రం వీరి ప్రేమ వివా హం మింగుడు పడలేదు. 15 రోజుల క్రితం నిత్య తల్లి దండ్రులు హైదరాబాద్ వచ్చి ఆమెను చెన్నైకి తీసుకువెళ్లారు. కాగా అక్కడే మరో వ్యక్తితో పెళ్లి సంబంధం చూస్తున్నారన్న సమాచారం సుభాష్‌కు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. పెళ్లై రెండు సంవత్సరాలు దాటిపోయాక మరో సంబంధం చూడటం జీర్ణించుకోలేకనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని తెలుస్తోంది. అమ్మా.. నిద్రపోతానమ్మా.. ‘అమ్మా.. అలసటగా ఉందమ్మా.. నేను నిద్రపోతాను...’ అని చెప్పిన కొడుకు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవటం ఆ కన్నతల్లి పేగుల్ని పెకిలించివేసింది. గురువారం రాత్రి సుభాష్ నోట వచ్చిన పదాలే ఇక చివరి మాటలవుతాయని తల్లి మల్లమ్మ ఏ కోశాన ఆలోచించలేదు. ఉదయం పూట డ్యూటీకి టైం అవుతుందని లేపుదామని వెళ్లిన తల్లి కొడుకు విగతజీవుడయ్యాడని తెలిసి కుప్పకూలిపోయింది. ఎందరో పేషెంట్ల గుండెకు వైద్యం చేసిన తన కొడుకు నిజజీవితంలో ‘గుండె నిబ్బరాన్ని’ కోల్పోయాడని కన్నీరుమున్నీరైంది. ఆగయ్య–మల్లమ్మల సంతానంలో మూడోవాడైన సుభాష్ మృతి స్థానికంగా విషాదం నింపింది. శుక్రవారం ఉదయం ఈ వార్త తెలిసి ఠాగూర్‌స్టేడియం ఏరి యా వాసులు పెద్ద ఎత్తున వారింటికి తరలివచ్చారు. -
ప్రేమలో గెలిచి... జీవితంలో ఓడి
సాక్షి, లక్ష్మణచాంద(నిర్మల్): ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి నాలుగు నెలలకే శవమైంది. ప్రేమలో గెలిచినా జీవితంలో ఓడిపోయింది. ప్రేమించిన వాడే ముఖ్యమని తల్లిదండ్రులను వదిలిపెట్టింది. అంతలోనే అత్తింటి వేధింపులతో తనువు చాలించింది. మండలంలోని రాచాపూర్ గ్రామానికి చెందిన పరమేష్ నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన రాజేశ్వర్‌రెడ్డి – మంజుల మూడో కుమార్తె కావ్య(24) గత నవంబర్ 1, 2019న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి కావ్య అత్తవారింటనే ఉంటూ జిల్లా కేంద్రంలోని సెయింట్‌తోమస్ ఉన్నత పాఠశాలలో టీచర్‌గా పని చేస్తుంది. శుక్రవారం ఉదయం 9గంటల సమయంలో దూలానికి చున్నితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కావ్య తల్లిదండ్రులకు ఉదయం 10గంటలకు ఫోన్ ద్వారా సమాచారం అందచేశారు. ఘటన స్థలంకు చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు కావ్యను చూసి మృతదేహం వద్ద బోరున విలపించారు. కుటుంబ సభ్యుల అనుమానం... కావ్య కుటుంబ సభ్యులు మాత్రం కావ్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె వరకట్నం వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. తను చాలా దైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అత్తింటి వారే తమకూతురుచావుకు కారణమని తెలిపారు. ముగ్గురుపై కేసు నమోదు కావ్య తల్లి మంజుల ఫిర్యాదు మేరకు కావ్య భర్త పరమేష్, భావ, అత్తపై ఐపీసీ సెక్షన్ 304బీ ప్రకారం కేసు నమోదు చేస్తున్నట్లు నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సంఘట స్థలాన్ని సోన్ సీఐ జీవన్‌రెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణరావు, ఇన్చార్జి ఎస్సై పరిశీలించారు. -
కూతురితో తండ్రి అసభ్య ప్రవర్తన..
సాక్షి, చింతకాని(ఖమ్మం): మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన వీరబాబుపై మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఎస్సై రెడ్డిబోయిన ఉమ కథనం ప్రకారం.. వీరబాబు తన మొదటి భార్య కూతురు ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఇంటి వద్ద నిద్రిస్తుండగా తండ్రి తన కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈలోగా పాప కేకలు వేయగా కుటుంబసభ్యులు అతడిని మందలించారు. అనంతరం అదే రోజు అర్ధరాత్రి సైతం మరోసారి అలాగే కూతురితో ప్రవర్తించడంతో తన రెండో భార్య చందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
లక్కీ డ్రా పేరుతో మోసం..!
సాక్షి, బెల్లంపల్లి(అదిలాబాద్): లక్కీ డ్రా పేరుతో అమాయక ప్రజలను మోసగిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ కె.జగదీష్ వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం విట్టునాయక్ తండాకు చెందిన కొంతమంది యువకులు లక్కీ డ్రా పేరుతో బెల్లంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలను మోసం చేస్తూ వసూళ్లకు పాల్పడ్డారు. ఇంటింటికి వెళ్లి జుపిటర్ మార్కెటింగ్, పాలీగోల్డ్ మార్కెటింగ్, రెడ్ ఫాక్స్ హోమ్ అప్లయన్సెస్, స్కాలర్ హోమ్ అప్లయన్సెస్, శ్రీసాయి ఓంకార్ ఎంటర్ ప్రైజేస్ కంపెనీ పేర్లతో స్క్రాచ్ కార్డులను చూపించి గ్రామీణులను లక్కీ డ్రా పేరుతో మోసం చేశారు. «గత నెల 20వ తేదీన ధర్మపురిలో ఎనిమిది మంది బృందం సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు. స్క్రాచ్‌కార్డులు కొనుగోలు చేసిన తరువాత లక్కీ డ్రాలో బహుమతులు వస్తాయని నమ్మించి రూ.2వేల నుంచి రూ.7,500 వరకు దొరికినంత వసూళ్లు చేశారు. చెన్నూర్, రామగుండం, ధర్మారం తదితర ప్రాంతాల్లోనూ ఇలాగే వసూళ్లకు పాల్పడ్డారు. గత నెల 29న బెల్లంపల్లి మండలం కాశిరెడ్డిపల్లి గ్రామంలో కొంతమంది మహిళలను లక్కీ డ్రా ఆశచూపి రూ.14వేలు వసూళ్లు చేశారు. ఆ సమాచారంతో తాళ్లగురిజాల పోలీసులు ఈ నెల 1న నిందితులపై రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్క్రాచ్ కార్డులపై ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించి బుధవారం సాయంత్రం ఎంపీడీవో కార్యాలయం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో మూడు సంజీవ్, కేతవాత్ గోపాల్, కేతవాత్ అరవింద్ , జాదవ్ అకాశ్, కేతవాత్ అలియాస్ రాథోడ్ రాజు, పవర్‌కేషు, కేతవాత్ గోపాల్, చవాన్‌కుమార్ ఉన్నట్లు వివరించారు. అనంతరం నిందితుల వద్దనుంచి రూ.29,090 నగదు, 2కార్లు, గృహోపకరణ వస్తువులైన కుక్కర్లు, మొబైల్ ఫోన్లు 8, వివిధ కంపెనీలకు చెందిన స్క్రాచ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో తాళ్లగురిజాల ఎస్సై బి.సమ్మయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
కీచక గురువు..
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ గురువు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరించాడు. విద్యార్థులను మానసికంగా, లైంగికంగా వేధింపులకు పాల్పడగా వారు కుటుంబ సభ్యులకు గోడు వెల్లబోసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సదరు ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం వెలుగుచూసింది. ఆదిలాబాద్ పట్టణంలోని రైతుబజార్ ఎదుట గల క్రీసెంట్ కళాశాల ప్రిన్సిపల్ రఫీ విద్యార్థినులను వేధింపులకు పాల్పడుతున్నట్లు వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో బాధిత విద్యార్థినులు కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం కళాశాల ఎదుట సైతం ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులు, వారి బంధువులను సముదాయించారు. విద్యార్థినులను వేధిస్తున్న కళాశాల ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కళాశాలకు రానివ్వకుండా.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిని నెలరోజులుగా కళాశాలకు రానివ్వకుండా ప్రిన్సిపల్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తరచుగా ఫోన్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని, పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కూతురును మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతోపాటు అదే కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న మరో విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్‌తో పాటు మరో ఇద్దరు వేధింపులకు పాల్పడుతున్నారని, తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నారని వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు నమోదు.. ఇటీవల మహిళలపై అత్యాచారం, హత్యలు చోటుచేసుకుంటున్న సందర్భంలో సరస్వతీ నిలయాల్లోనూ విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయింది. ఆదిలాబాద్ పట్టణంలోని క్రీసెంట్ కళాశాల ప్రిన్సిపల్ రఫీపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు, విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించినందుకు సెక్షన్ 354, 12పోక్సో కేసులను నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. కళాశాల ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల ఆందోళన.. విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్, కళాశాల కరస్పాండెంట్ బిలాల్, అతని సోదరుడు జలాల్పై కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. క్రీసెంట్ కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. కళాశాల గుర్తింపును రద్దు చేయాలని నినాదాలు చేశారు. విద్యార్థినులను వేధించిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. -
సమత నిందితుల తరఫున వాదించేందుకు నిరాకరణ
సాక్షి, ఆదిలాబాద్: సమతపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుల తరఫున వాదించేందుకు న్యాయవాదులెవరూ ముందుకు రాలేదు. ఈ కేసులోని నిందితుల రిమాండ్ ముగియడంతో జిల్లా జైలు నుంచి పోలీసులు సోమవారం ఉదయం కోర్టులో హాజరుపర్చారు. వారి కేసును ఎవరు వాదించవద్దని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. న్యాయవాదులను నియమించుకునేందుకు నిందితులు కోర్టును మూడు రోజుల సమయం కోరారు. కాగా మంగళవారం ఉదయం 10గంటల వరకు గడువు ఇచ్చింది. నిందితులను పోలీసులు జుడీషియల్ కస్టడీకి తరలించారు. మంగళవారం తదుపరి విచారణ కోసం నిందితులను హాజరుపర్చనున్నారు. ఆదిలాబాద్‌లోని స్పెషల్ ఎస్సీ, ఎస్టీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో సమత కేసు నిందితులైన షేక్ బాబు, షేక్ శాబొద్దీన్, షేక్ ముగ్దుమ్లపై విచారణ జరగనుంది. జుడీషియల్ కస్టడీకి.. నిందితులపై లింగాపూర్ పోలీసులు 376–డి, 404, 312, 325, 3(2)(5)ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. సోమవారం రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో నిందితులను పోలీసులు హాజరుపర్చారు. జుడీషియల్ కస్టడీకి న్యాయస్థానం వారిని అప్పగించింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కత్తి, సెల్‌ఫోన్, రూ.200లతో పాటు 72 రకాల వస్తువులను కోర్టులో పోలీసులు డిపాజిట్ చేశారు. వీటిలో సమత దుస్తులు, సంఘటన స్థలంలో లభించిన ఆధారాలను పోలీసులు కోర్టులో డిపాజిట్ చేసినట్లు ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. మొత్తం 44 మంది సాక్షులు.. ఒకవేళ న్యాయవాదులెవరూ కేసును వాదించేందుకు ముందుకు రాకపోతే జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా, ప్రభుత్వం తరఫునుంచైనా న్యాయవాదిని నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో మొత్తం 44 మంది సాక్షులను పోలీసులు సేకరించగా, రోజు కొంతమంది కోర్టులో హాజరుకానున్నట్లు సమాచారం. -
సమతపై అత్యాచారం, హత్య: చార్జిషీట్ దాఖలు
సాక్షి, ఆసిఫాబాద్: సమతను అత్యాచారం చేశాక గొంతుకోసి చంపారని పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఈ విషయం తేలిందన్నారు. అలాగే నిందితుల వీర్యానికి సంబంధించిన డీఎన్ఏ నివేదిక కోర్టుకు సమర్పించారు. శనివారం కుమురం భీం జిల్లా పోలీసులు ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 44 మంది సాక్షులను గుర్తించగా, ఏ1గా షేక్‌బాబా, ఏ2 షేక్ షాబొద్దీన్, ఏ3 షేక్ ముఖ్దూమ్‌గా పేర్కొన్నారు. ఇక కేసు విచారణ సోమవారం నుంచి రోజువారీగా కొనసాగనుంది. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ని ఓ గ్రామానికి చెందిన దళిత మహిళ గత నెల 24న కుమురం భీం జిల్లా లింగాపూర్ మండ లం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురై న విషయం తెలిసిందే. 27న నిందితులను అరె స్టు చేశారు. దిశ ఘటనకు మూడు రోజుల ముం దు ఈ దారుణం జరిగింది. అయితే దిశ తరహా లో మొదట ప్రాధాన్యత దక్కకపోవడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తర్వాత ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. -
కట్నం తేకుంటే చచ్చిపో..
సాక్షి, దండేపల్లి(మంచిర్యాల): అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందింది. దీంతో 11 నెలల చిన్నారి అనాథగా మారింది. ఎస్సై విజయ్‌కుమార్, మృతురాలి కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. దండేపల్లి మండలం పెద్దపేటకు చెందిన ఆముదాల ప్రసూణ(మహాతి) (21)కు వెల్గటూర్ మండలం స్తంభంపెలి్లకి చెందిన తర్ర రాకేష్‌తో 2017లో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.11లక్షల నగదు తోపాటు, రూ.4లక్షల బంగారు ఆభరణాలు, మరో రూ.2లక్షల సామగ్రిని కట్నంగా అందించారు. ఆ తరువాత అదనంగా మరో ఐదు లక్షలు కట్నం తేవాలని భర్త, అత్త, మామ, ఆడబిడ్డ మానసికంగా, శారీరకంగా వేధించారు. ఈ విషయాన్ని తన తండ్రికి ఎప్పటికప్పుడు చెప్పింది. ఒప్పుకున్నకాడికి కట్నం ఇచ్చానని, అదనపు కట్నం ఇవ్వలేదనని బాధితురాలి తండ్రి చెప్పాడు. 2018లో ప్రసూణకు ఆడపాప జన్మించింది. అప్పటినుంచి ఆమెకు వేధింపులు మరింత పెరిగాయి. అదనపు కట్నం తేవాలని, లేకుంటే విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. గదిలో బందించి దాడి చేశారు. విషయం తండ్రికి ఫోన్‌చేసి చెప్పడంతో 15రోజుల క్రితం తండ్రి తన కూతురిని పుట్టింటికి తీసుకువచ్చాడు. అయినా రాకేష్ పదేపదే ఫోన్‌చేసి కట్నం తీసుకురాకుంటే చచ్చిపో అని అనడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఈ నెల 8న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. మళ్లీ కరీంనగర్‌కు తీసుకువచ్చి చికిత్స అందిస్తుండగా బుధవారం మృతి చెందింది. దీంతో చిన్నారి పాప అనాథగా మారింది. తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రసూణ మృతదేహం.. -
‘సమత’గా పేరు మార్పు: ఎస్పీ
సాక్షి, ఖానాపూర్(ఆదిలాబాద్) : దిశ కేసులో లాగే కుమురం భీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురైన సమత ఘటనలోనూ సమ న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాటం చేస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. సోమవారం ఆయన సీఎల్పీ నాయకులతో కలిసి ఎల్లాపటార్‌లోని సంఘటన ప్రాంతాన్ని, ఖానాపూర్ మండలంలోని గోసంపల్లెలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నాచితక పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న సమతను ముగ్గురు వ్యక్తులు అత్యాచారం, హత్య చేయడం అత్యంత పాశవికంగా ఉందన్నారు. ఈ ఘటన అందరినీ కలిచివేసిందన్నారు. మహిళలపై దాడులకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రాంలో ఇటీవల కాలంలో సుమారు 15 మందిపై అత్యాచారాలు, హత్యలు జరిగాయన్నారు. అత్యాచార ఘటనలన్నింటినీ ఒకేలా చూస్తూ ఒకే కోర్టు ద్వారా విచారించి తక్షణమే శిక్షలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ తరపున బాధిత కుటుంబానికి రూ.లక్ష అందజేశారు. సంఘటితంగా పోరాడుదాం.. అత్యాచారాలు, హత్యలపై సంఘటితంగా పోరాడుదామని సీఎల్పీ నేతలు పేర్కొన్నారు. పాలకులు అగ్రవర్ణాలు, దళితులను వేర్వేరుగా చూడొద్దన్నారు. ఎల్లాపటార్ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. మద్యం మత్తుతోనే ఇలాంటి అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే గ్రామాల్లో బెల్టు షాపులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామన్నారు. ఎల్లాపటార్ ఘటనను పార్లమెంట్లో చర్చించేలా టీపీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళతామని తెలిపారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ ఘటనలన్నింటినీ ప్రస్తావిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిదులు కె.విశ్వప్రసాద్, లక్ష్మణ్‌రెడ్డి, లచ్చన్న, మహేశ్, మోహిద్, ఆకుల శ్రీనివాస్, వాల్సింగ్, మాజిద్, శంకర్, మహేందర్, సాగర్, శంకర్‌గౌడ్, రవీందర్, శ్రీనివాస్, మల్లయ్య, నారాయణ, ప్రదీప్, గంగాదర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చిన సీఎం ఖానాపూర్: రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చడంతో పాటు మహిళలపై అత్యాచారాలు, హత్యలకు కేరాఫ్‌గా రాష్ట్రాన్ని నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ ఎద్దేవా చేశారు. హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. పొట్టకూటి కోసం వెళ్లిన వివాహితను దుండగులు కనికరం లేకుండా అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి హత్యచేశారన్నారు. దిశ నిందితులకు ఒక న్యాయం.. ‘సమత’కు మరో న్యాయం సరికాదని మహిళలందరికీ సమన్యాయం జరగాలని అన్నారు. 12, 13న బీజేపీ ఆందోళనలు రాష్ట్రంలో మద్యం నిషేధించాలని కోరుతూ ఈనెల 12,13 తేదీల్లో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు అరుణ పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ టేకు గంగారాం, మహిళ మోర్చా అధ్యక్షురాలు విజయ, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు రావుల రాంనాథ్, తోకల బుచ్చన్న, పడాల రాజశేఖర్, టేకు ప్రకాశ్, నాయిని లక్ష్మణ్, దాదె మల్లయ్య, వేణు, రాజేశ్వర్ తదితరులున్నారు. ‘సమత’గా పేరు మార్పు ఆసిఫాబాద్‌అర్బన్: గత నెల 24న లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురైన దళిత మహిళ పేరును సమతగా మార్చుతున్నట్లు ఎస్పీ మల్లారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక నుంచి బాధితురాలి పేరును సమతగా పేర్కొనాలని సూచించారు. సోషల్ మీడియా, తదితర వాటిల్లోనూ సమతగా మార్చనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. త్వరితగతిన విచారణ జరిపేందుకు కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు వెల్లడించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఆదేశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. మృతురాలి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి ప్రతినెలా పెన్షన్, డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. నిందితులను చట్ట ప్రకారం శిక్షిస్తామని, ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. -
పరిధి కాదు.. ఫిర్యాదు ముఖ్యం
సాక్షి, నిర్మల్: నిర్మల్–నిజామాబాద్ జిల్లాల మధ్య గోదావరి నది వంతెనపై సోన్ గ్రామ సమీపంలో కొన్నేళ్ల క్రితం రోడ్డుప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మృతిచెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రదేశం రెండు జిల్లాల మధ్యలో ఉంది. సమాచారం రెండు జిల్లాల సరిహద్దు మండలాల పోలీసులకు చేరింది. కానీ.. సత్వరమే రెండు స్టేషన్ల నుంచి స్పందన రాలేదు. తమ పరిధి కాదంటే.. తమ పరిధి కాదంటూ.. సమాధానాలిచ్చారు. కొంతసేపటి తర్వాత సోన్ పోలీసులే వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు. ఇలా జిల్లాలో పలు మండలాల మధ్య, జిల్లాకేంద్రం చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల మధ్య పోలీసుల ‘పరిధి’ ఇబ్బందిగా మారుతోంది. బాధితులు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. దిశ కేసులోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు చట్టాల్లోనూ మార్పులు తీసుకువస్తోంది. సాంకేతికతను విస్తృతం ఉపయోగించుకుంటున్న పోలీస్‌శాఖ వెలుగులోకి తీసుకురాని జీరో ఎఫ్ఐఆర్ను తెరపైకి తీసుకువచ్చింది. దిశపై అఘాయిత్యం జరిగిన రోజు రాత్రి ఆమె కుటుంబసభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయడానికి సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఘటన జరిగిన ప్రదేశం తమ పరిధిలోకి రాదని చెప్పారు. దీంతో ఆ రాత్రి బాధిత కుటుంబం రెండు ఠాణాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇలా కేవలం ఈ ఒక్క కేసులోనే కాదు. చాలా సంఘటనలు జరిగినప్పుడు పోలీసుల సాయం కోసం వెళ్లే వారికి ఎదురవుతూనే ఉంది. చట్టం ప్రకారం తమ జ్యురిస్డిక్షన్(పరిధి)లో ఉంటేనే కేసు నమోదు చేస్తామని చెబుతుంటారు. దీంతో బాధితులు వెళ్లి సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసే లోపు దిశలాంటి ఘటనలు జరిగిపోతున్నాయి. ఇక ఇలాంటి సమస్య లేకుండా జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని పకడ్బందీగా అమలులోకి తీసుకువస్తున్నారు. జీరో నంబర్ ఎఫ్ఐఆర్.. పోలీస్ స్టేషన్ల పరిధితో సంబంధం లేకుండా బాధితులు తమకు సమీపంలో ఉన్న ఠాణాలో ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పించేదే జీరో నంబర్ ఎఫ్ఐఆర్. బాధితుడి నుంచి అందుకున్న ఫిర్యాదును పోలీసుస్టేషన్లో కేసుగా నమోదు చేస్తూ ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) జారీ చేస్తారు. ప్రతి ఎఫ్ఐఆర్కు సీరియల్ నెంబర్/ఆ సంవత్సరం సూచిస్తూ సంఖ్యను కేటాయిస్తారు. తమ పరి«ధిలో జరగని నేరాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ఎలాంటి నంబర్ కేటాయించకుండా ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసి వెంటనే బాధితులకు సాయం అందిస్తారు. అనంతరం సంబంధిత ఘటన ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందో పరిశీలించి.. ఆ ఠాణాకు కేసును బదిలీ చేస్తారు. లేకుంటే ఇబ్బందే.. జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని ‘దిశ’ కేసు స్పష్టం చేసింది. ఠాణాల పరిధులు తెలుసుకోవడం సామాన్యుడికే కాదు ఒక్కోసారి పోలీసులకూ ఇబ్బందికరంగానే మారుతోంది. ఈ పరిధుల సమస్య ఎక్కువగా ఒకచోట నుంచి మరో చోటుకి ప్రయాణాలు చేస్తున్నప్పుడు జరుగుతుంది. మిస్సింగ్, చోరీ, యాక్సిడెంట్ కేసుల్లో ఎక్కువగా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు జ్యురిస్‌డిక్షన్‌గా పిలిచే అధికారిక పరిధి ఉంటుంది. సంబంధిత పోలీసు అధికారులు ఆ పరిధిలోని ఘటనలపైనే స్పందిస్తుంటారు. ఆయా పరిధుల్లో జరిగిన నేరాలపై మాత్రమే సదరు ఠాణా అధికారులు కేసు నమోదు చేస్తుంటారు. పరిధి దాటితే చట్టపరంగా తాము సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు చెబుతుంటారు. కానీ.. ఈ నిబంధనలు సామాన్యులకు ఇబ్బందిగా మారుతోంది. మార్పు ‘దిశ’గా.. దేశవ్యాప్తంగా సంచలనమైన దిశ ఘటనతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మరోసారి ఆలోచనలో పడ్డాయి. ఢిల్లీ జరిగిన నిర్భయ ఘటనతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. ఇప్పుడు ‘దిశ’ ఘటనపైనా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లో హోంమంత్రి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. ప్రధానంగా జీరో ఎఫ్ఐఆర్ అంశంపైనే చర్చ సాగింది. ఈమేరకు ఈ విధానాన్ని రాష్ట్రంలో పక్కాగా అమలు చేయాలని ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. జిల్లాలోనూ సమస్య.. పోలీస్స్టేషన్ల పరిధికి సంబంధించిన సమస్యలు తరచూ ఉత్పన్నమవుతున్నాయి. ప్రధానంగా నిర్మల్ జిల్లాకేంద్రం చుట్టూ విస్తరించింది. ఇందులో సారంగపూర్, నిర్మల్‌రూరల్, సోన్, దిలావర్పూర్ తదితర మండలాలు చుట్టూ ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఏ స్టేషన్‌కు వెళ్లాలన్న విషయంలో తరచూ ఇబ్బంది ఎదురవుతోంది. బాసర, సోన్ వంతెనలపైన గతంలో రోడ్డుప్రమాదాల విషయంలో ఇలాంటి ఘటనలు ఎదురయ్యాయి. పలు పోలీస్స్టేషన్ల అధికారులు తమ పరిధిలను గుర్తించి, సూచికల బోర్డులను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం జీరో నంబర్ ఎఫ్ఐఆర్ను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించడంతో పరిధికి సంబంధం లేకుండా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఏర్పడనుంది. ఇది బాధితులకు ఊరటనిస్తుందని పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు ఏదైన ఘటన జరిగినప్పుడు సంబంధిత ప్రాంతంతో సంబంధం లేకుండా బాధితులు సమీపంలో ఉన్న ఏ పోలీసుస్టేషన్లోనైనా ఫిర్యాదు చేయొచ్చు. చట్ట ప్రకారం స్టేషన్ పరిధి కాని ప్రాంతమైతే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అనంతరం సంబంధిత ప్రాంత పోలీసుస్టేషన్‌కు కేసును బదిలీ చేస్తారు. జిల్లాలో ఈ విధానాన్ని ముందు నుంచి అమలు చేస్తున్నాం. ఇప్పుడు మరింత పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. – సి.శశిధర్‌రాజు, ఎస్పీ -
దళిత మహిళను అత్యాచారం, గొంతుకోస్తే స్పందించరా?
సాక్షి, లింగాపూర్: ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో నవంబర్ 25న దళిత బుడగజంగం సామాజిక వర్గానికి చెందిన మహిళపై ఎల్లాపటార్ గ్రామానికి చెందిన ముగ్గురు సాముహికంగా అత్యాచారం చేసి.. గొంతుకోసి చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. దళిత మహిళ టేకు లక్ష్మి హత్య జరిగిన ప్రదేశాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. శంషాబాద్‌లో జరిగిన దిశ సంఘటనను పార్లమెంట్లో ప్రస్తావించారని, అదే లక్ష్మి ఘటనను ఎందుకు మర్చిపోయారని ప్రశ్నించారు. ఉన్నత వర్గాలకు ఒక న్యాయం.. దళితులకు మరో న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. దిశ నిందితులను శిక్షించే ముందు లింగాపూర్ నిందితులనూ శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దళితుల ఓట్లు కావాలిగానీ.. వారిపై హత్యాచారాలు జరిగితే మాత్రం స్పందించకపోవడం దారుణమన్నారు. -
రుణాల పేరిట ఘరానా మోసం
భీమారం(చెన్నూర్): తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్న మంచిర్యాల జిల్లా భీమారం మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన 8 మంది యువకులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై డి. కిరణ్‌కుమార్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దాసరి సంపత్, దాసరి రవి, దాసరి నరేందర్, తోటపల్లి ప్రశాంత్, దాసరి సన్నీ, కుంటల ప్రదీప్, దాసరి ప్రణీత్‌లు కలిసి వివిధ వ్యక్తుల పేర్లతో సిమ్ కార్డులు సేకరించి వాటితో మోసాలకు పాల్పడుతున్నారు. మే 22న ఒక దినపత్రికలో తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నట్లు ప్రకటన ఇచ్చారు. ఆసిఫాబాద్‌కు చెందిన మహేష్ అనే వ్యక్తి ప్రకటనలో ఉన్న నంబర్‌కు కాల్ చేశాడు. నిందితులు అతనితో ఫోన్లో మాట్లాడి రుణం కావాలంటే ప్రాసెసింగ్ ఫీజ్ కింద రూ .25 వేలు వారి బ్యాంక్‌ఖాతాలో జమచేయాలన్నారు. మహేష్ వెంటనే బ్యాంక్‌ఖాతాలో డబ్బు జమచేశాడు. నెలలు గడుస్తున్నా రుణం గురించి మాట్లాడకపోవడంతో మహేష్ మరోసారి వారికి కాల్ చేశాడు. కాని నిందితులు సెల్‌ఫోన్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన మహేష్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు వాడిన సెల్ నంబర్ ఆధారంగా సిగ్నల్స్ ప్రకారం నిందితులు రెడ్డిపల్లి గ్రామానికి చెందని వారుగా పోలీసులు నిర్ధారించారు. గాలించి మోసానికి పాల్పడిన 8 మంది యువకులను పట్టుకున్నారు. వీరిని కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు. సిబ్బంది మాచర్ల, దివాకర్, సంపత్, రవి, దశరత్, శివప్రసాద్ ఉన్నారు. -
గల్లంతైన ఫారెస్ట్ ఆఫీసర్ల మృతదేహాలు లభ్యం
సాక్షి,ఆదిలాబాద్: కుమురం భీం జిల్లా చింతలమానెపల్లి మండలంలోని గూడెం వద్ద ప్రాణహిత నదిలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్ల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఆదివారం విధుల్లో ఉన్న ఇద్దరు బీట్ అధికారులు గల్లంతయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహెరి నుంచి గూడెం వైపుకు నాటు పడవలో వస్తుండగా ప్రమాదం జరిగింది. పడవలో పడవనడిపే నావికుడు పాణె లింగయ్య, సహాయకుడు పేదం అర్జయ్య, ప్రయాణికుడు సూర కత్రయ్య, ముగ్గురు అటవీశాఖ బీట్ అధికారులు సద్దాం, ముంజం బాలక్రిష్ణ, బానావత్ సురేష్ నాయక్‌లు ఉన్నారు. ఖర్జెల్లి రేంజ్ పరిధిలోని గూడెం సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు బీట్ అధికారులు తమ విధుల్లో భాగంగా పర్యవేక్షిస్తూ నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి కాలినడకన ప్రాణహిత నదికి ఆవలివైపుకు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో నాటు పడవలోకి నీరు రావడంతో బయటకు తోడే క్రమంలో పడవ మునిగింది. లింగయ్య , సహాయకుడు అర్జయ్య, కత్రయ్య సమీపంలోని చెట్ల సహాయంతో బయటకు వచ్చారు. కాగా బీట్ అధికారి సద్దాం ఈదుకుంటూ బయటకు రాగా ముంజం బాలక్రిష్ణ, సురేష్ నాయక్‌లు నీటమునిగారు. ముంజం బాలక్రిష్ణ స్వస్థలం కాగజ్‌నగర్ మండలంలోని చింతగూడ కోయవాగు కాగా బానావత్ సురేష్ నాయక్ కెరమెరి మండలంలోని దేవాపూర్ గ్రామపంచాయితీ టెంమ్లగూడ గ్రామానికి చెందినవాడు. సమాచారం అందుకున్న చింతలమానెపల్లి ఎస్సై రాం మోహన్, అటవీశాఖ అధికారులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని కాగజ్‌నగర్ డీఎస్పీ స్వామి, కాగజ్‌నగర్ అటవీ డివిజన్ అధికారి విజయ్‌కుమార్‌లు పరిశీలించారు. అటవీ అధికారుల ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సాయంత్రం చీకటి పడడంతో గా లింపు చర్యలు నిలిపి వేసినట్లు ఎస్సై రాంమోహన్ తె లిపారు. నదిలో ప్రమాదం నుంచి బయటపడ్డ సద్దాం అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. పడవ నావికుడు లింగయ్య, అర్జయ్యలను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. నిర్లక్ష్యంతోనే ప్రమాదం. పడవ నడిపే వారి నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికుల ఆరోపణలు చేస్తున్నారు. పడవ నడిపే లింగయ్య, సహాయకుడు అర్జయ్యలు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతిరోజు గూడెం నుంచి అహెరి ప్రాంతానికి అహెరి నుంచి అహెరి వైపుకు నిత్యం వందల సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులను తరలించడానికి ఇంజన్లను బిగించిన పెద్ద సైజు పడవలను వినియోగిస్తుంటారు. ఉదయం కేవలం నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉండడంతో చేపల వేటకు వినియోగించే చిన్న నాటుపడవలో వీరిని తరలించేందుకు ప్రయత్నించారు. పడవ ప్రమాదకరంగా ఉండడంతో పడవలోకి నీళ్లు రాగా తోడే క్రమంలో పడవ బోల్తా పడింది. ఆందోళనలో కుటుంబసభ్యులు. బీట్ అధికారులు గల్లంతయిన ప్రమాదంపై సమాచారం అందడంతో ఘటనా స్థలానికి బీట్ అధికారుల కుటుంబసభ్యులు చేరుకున్నారు. బాలక్రిష్ణ తండ్రి ముంజం మల్లయ్య, సోదరుడు శివ, చింతలమానెపల్లి మండల కేంద్రంలోని ఇతర బంధువులు నది వద్దకు చేరుకున్నారు. బాలక్రిష్ణ గత జూలై నెలలో బీట్ అధికారిగా విధుల్లో చేరగా, సురేష్ గత అక్టోబర్‌లో విధుల్లో చేరాడు. బాలక్రిష్ణకు భార్య దుర్గారాణి, 6 నెలల కుమారుడు రుద్రాంశ్ ఉన్నారు. సురేష్ నాయక్‌కు భార్య మనీషా 4సంవత్సరాల కుమారుడు గణేష్ ఉన్నాడు. కాగా సురేష్ భార్య మనీషా 9నెలల గర్భిణి. కళ్లముందే నీట మునిగారు విధుల్లో భాగంగా నదికి ఆవలివైపునకు నిర్మాణంలో ఉన్న వంతెన నుంచి నడిచి వెళ్లాం. తిరిగి వచ్చేక్రమంలో వంతెనపై నుంచి కాకుండా పడవలో బయలుదేరాం. ప్రయాణికులు లేకపోవడంతో నాటు పడవలో వెళ్లాలని పడవ నిర్వాహకులు చెప్పడంతో పడవలోకి ఎక్కాం. నది మధ్యలోకి వెళ్లగానే పడవలోకి నీరు రావడంతో సహాయకుడు నీరు బయటకు తోడే క్రమంలో పడవ మునిగిపోయింది. చెట్ల సహాయంతో నేను, మరో ప్రయాణికుడు ప్రమాదం నుంచి బయటపడ్డాం. మా కళ్ల ముందే ఇద్దరు బీట్ అధికారులు నదిలో మునిగిపోయారు. –సద్దాం, బీట్ అధికారి -
డబ్బులు సంపాదిద్దాం.. టార్గెట్ రూ.కోటి..!
సాక్షి, భైంసా(ఆదిలాబాద్) : ఆ ముగ్గురు విద్యార్థులవీ దాదాపు మధ్య తరగతి కుటుంబాలే. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని తాము చదువుతున్న హాస్టల్ నుంచి హైదరాబాద్‌కు రైలులో పారిపోయారు. గురువారం రాత్రి 7.20 గంటల ప్రాంతంలో భైంసాలోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ముగ్గురు బాగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పాఠశాల నుంచి పారిపోయినట్లు వారి వదిలివెళ్లిన లేఖ ఆధారంగా తెలుస్తోంది. పాఠశాల ప్రిన్సిపాల్ సుదర్శన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసుకున్నారు. వారి ఆచూకీ కోసం గాలిస్తుండగా, విద్యార్థులే తమ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఉన్నామని.. తిరిగి వస్తున్నామని చెప్పినట్లు సీఐ వేణుగోపాల్‌రావు వివరించారు. సాయంత్రం వచ్చిన విద్యార్థులను మందలించి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. గురువారం రాత్రి నుంచే అదృశ్యం.. వివరాల్లోకి వెళ్తే.. భైంసా పట్టణంలోని ఆటోనగర్ బైపాస్‌రోడ్డులో మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో జల్లా శివకుమార్, జాదవ్ వికాస్, మనీష్ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. శివకుమార్ తండ్రి భైంసాలో మీడియాలో పని చేస్తుండగా, సారంగపూర్ మండలం మహావీర్తండాకు చెందిన జాదవ్ వికాస్ తండ్రి రవి వేరుగా ఉంటుండటంతో అతడి తల్లి నీలాబాయి చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేస్తూ కొడుకును చదివిస్తోంది. కుభీర్‌కు చెందిన మనీష్ తండ్రి సాయినాథ్ టైలర్‌గా పని చేస్తున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు చెప్పారు. గురువారం రాత్రి 7.20 గంటల ప్రాంతంలో ఈ ముగ్గురు హాస్టల్ నుంచి తప్పించుకుపోయినట్లు ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్లకు వెళ్లి ఉంటారని భావించి వారి తల్లిదండ్రులకు ఫోన్లో సంప్రదించారు. రాలేదని వారు తెలపడంతో అదృశ్యమైనట్లు శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెలకు రూ.15వేలు సంపాదిస్తే.. దాదాపు 40 మంది వరకు విద్యార్థులు ఉండే ఈ తరగతి గదిలో శివకుమార్, వికాస్, మనీష్‌లు ఎప్పుడూ ఒక జట్టుగా ఉండేవారని, వీరి ఆలోచనా విధానం అంతా బాగా బతకాలనే ధోరణిలో ఉండేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. శివకుమార్‌కు షార్ట్‌ఫిలింలు తీయాలనే ఆసక్తి, రాజకీయాల్లో రాణించాలనే ఆసక్తిగా ఉండేదని గమనించినట్లు చెప్పారు. ఇక వికాస్ కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో డబ్బు సంపాదించాలనుకునేవాడని చెప్పాడు. మనీష్ తండ్రి టైలర్‌గా చేస్తుండగా, పాఠశాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ముగ్గురు కలిసి పాల్గొనేవారని పేర్కొన్నారు. డబ్బు సంపాదన కోసం వీరు రాసుకున్న లేఖ ఉపాధ్యాయులకు లభించింది. అందులో ఇలా ఉంది..వికాస్ నెల సంపాదన రూ.10వేలు, శివకుమార్‌కు రూ.5వేలు, మనీష్‌కు రూ.5వేలు, ముగ్గురు కలిసి నెలకు రూ.20వేలు సంపాదిస్తామని, ఇందులో రూ.5వేలు ఖర్చులకుపోగా, నెలకు రూ.15వేలు, ఏడాదికి రూ.లక్షా 80వేలు సంపాదించవచ్చని, మరుసటి ఏడాది రూ.3.60లక్షలు, మూడో ఏడాది రూ.5.40లక్షలు.. ఇలా రూ.కోటి వరకు సంపాదించేలా ప్రణాళిక వేసుకున్నారు. ఈ చేతిరాత వికాస్దేనని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. కేవలం డబ్బు సంపాదించాలనే ఆశే వారిని హాస్టల్ వదిలి వెళ్లేలా చేసి ఉంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల భద్రతపై అనుమానాలు.. ఇదిలా ఉండగా, హాస్టల్ నుంచి ముగ్గురు విద్యార్థులు పారిపోయిన విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం పాఠశాల నుంచి పారిపోతే తమకు ఉదయం వరకు ఎందుకు చెప్పలేదని మండిపడ్డారు. భరోసాతో ఇక్కడ చదివిస్తున్నామని, ఇలా ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆగ్రహించారు. -
తమ్ముడితో కలిసి భర్తకు ఉరేసిన భార్య..
సాక్షి, మామడ(నిర్మల్): ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు తన తమ్ముడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చింది. మామడ మండలకేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శుక్రవారం నిర్మల్ డీఎస్పీ ఉపేంద్రరెడ్డి, సోన్ సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై అనూష వివరించారు. మండలకేంద్రానికి చెందిన సయ్యద్ సద్దాం (30) ఈనెల 16న మృతిచెందాడు. మృతిపై అనుమానాలు రావడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు విషయాన్ని చేధించారు. బోథ్‌కు చెందిన సయ్యద్ సద్దాం.. మామడకు చెందిన సయ్యద్ నూరిని ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి మామడలోనే ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా సద్దాం వద్ద మహ్మద్ షఫీ మేకలకాపరిగా పనిచేస్తున్నాడు. షఫీ కుమారుడైన అలీంతో సద్దాం భార్య నూరికి పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న సద్దాం భార్యను పద్ధతి మార్చుకోవాలని మందలించాడు. మద్యం సేవించి వచ్చి మందలిస్తుండడంతో నూరి తన ప్రియుడు అలీంకు తెలిపింది. దీంతో సద్దాంను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించిన ఇద్దరు ఈనెల 16నరాత్రి నూరి తన తమ్ముడు రియాజ్ సహకారంతో సద్దాం మెడకు చున్నీతో ఉరివేసి చంపేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోని ఓ కర్రకు ఉరేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. మొదట్లో ఆత్మహత్యగానే భావించిన కుటుంబ సభ్యులు మృతదేహంపై గాయాలు, భార్య తీరుపై అనుమానం ఉండటంతో సద్దాం తల్లి తాజ్‌బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. నెలలోనే మరో ఘటన.. మామడ మండలంలో ఇదే తీరులో.. నెల వ్యవధిలో మరో ఘటన చోటుచేసుకోవడం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు ప్రియులతో కలిసి స్థానిక పొన్కల్ శివారులోనే గోదావరి వద్ద చంపించింది. ఆ కేసు ఈనెల ఒకటిన తేలింది. తాజాగా ఇదే మండలకేంద్రంలో ప్రియుడి మోజులో పడి భార్య భర్తను హతమార్చిన ఘటన వెలుగు చూసింది. -
ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట మృతి
సాక్షి, తాండూర్(బెల్లంపల్లి): ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమజంట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. బెజ్జూరు మండలం లంబాడితండా పరిధిలోని బొగుడ గూడ గ్రామానికి చెందిన గోమాస జీవన్ (35), తాండూర్ మండలం కాసిపేట గ్రామానికి చెందిన ఏల్పుల గౌరు(29) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సామాజిక వర్గాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు అంగీకరించకపోవచ్చని బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్నేహితులు మంచిర్యాల ఆస్పత్రిలో చేర్పించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలిం చారు. వేర్వేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందిన సీఐ సామల ఉపేందర్ తెలిపారు. -
‘క్రైమ్’ కలవరం!
సాక్షి, నిర్మల్: నిర్మల్.. పేరుకు తగ్గట్టుగా ప్రశాంతంగా ఉండే జిల్లా. అలాంటి జిల్లాలో నెలరోజులుగా ఏదో ఒక ఘటన కలవర పెడుతూనే ఉంది. వరుసగా జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. పొన్కల్‌లో గోదావరిలో లభ్యమైన మృతదేహం వెనుక ఉన్న మిస్టరీని మరచిపోకముందే.. తల్వేద చెరువులో మహిళ మృతదేహం గోనెసంచిలో లభ్యమైంది. ఇదిలా ఉండగా, ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దారుణంగా చనిపోయాడు. ఇలా.. క్రైమ్ సీరియల్ మాదిరి ఈనెలలో వరుసగా నేరఘటనలు చోటు చేసుకున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, దొంగతనాలు, కొట్లాటలతో ఇది క్రైమ్‌సీజన్‌గా మారింది. పోలీసులకూ ఈ సీజన్ సవాల్‌గానే సాగుతోంది. భర్తను చంపించిన భార్య.. ఇద్దరు ప్రియులతో కలిసి ఓ భార్య తన భర్తనే దారుణంగా చంపించింది. ఇలాంటి ఘటనలు మీడియాలో చూడడమే తప్ప స్థానికంగా ఎప్పుడూ వినలేదు. భర్తను చంపేసిన తర్వాత కూడా.. చచ్చాడా.. లేదా.. మరోసారి చూడండంటూ ప్రియులకు ఫోన్ చేసి మరీ.. ఆ భార్య నిర్దారణ చేసుకున్న తీరు దారుణం. ఈనెల 1న బయటపడ్డ ఈ కేసు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మృతుడు, నిందితులు జిల్లావాసులు కాకున్నా ఘటన మాత్రం స్థానికంగా జరిగింది. నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు చెందిన గుజ్జెటి ఉదయ్‌కుమార్(39)ను ఆయన రెండో భార్య పావని ఆలియాస్ లావణ్య చంపించింది. తన ఇద్దరు ప్రియులు దవాతే దౌలాజీ అలియాస్ రమేష్, గంగాధర్‌తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. చంపేసి.. మూటకట్టి.. చెరువులో పడేసి తమ సోదరుడిని చంపారన్న అనుమానంతో నిందితులు ఓ మహిళను బలిగొన్న తీరు వీళ్లు మనుషులా.. అన్న భావనను కలిగించింది. పచ్చని పల్లెలో పగతో రగిలిపోయిన వాళ్లు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో మృగాలుగా వ్యవహరించిన తీరు అందరినీ కలచివేసింది. సారంగాపూర్ మండలం బోరిగాంకు చెందిన ప్రశాంత్ అతడి స్నేహితుడు మహేందర్ బైక్‌పై నిర్మల్ వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ప్రశాంత్ మృతి చెందాడు. అయితే ఇది ప్రమాదం కాదని, తమ సోదరుడిని మహేందర్ హత్య చేశాడని ప్రశాంత్ సోదరులు, కుటుంబసభ్యులు కక్షగట్టారు. ఈక్రమంలో ఈనెల 12న రాత్రి మహేందర్ తల్లి కళావతి తమ ఇంటి ముందు నుంచి వెళ్తుండగా నిందితులు ఆమెను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి హతమార్చారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి, కారులో తీసుకెళ్లి నిర్మల్‌రూరల్ మండలంలోని తల్వేద చెరువులో పడేశారు. పాతకక్షల నేపథ్యం ఉండటంతో గ్రామస్తులు నిందితులపై చర్యలు తీసుకోవలంటూ గ్రామంలో ఆందోళన చేపట్టారు. ఈ ఘటనలో నిందితులకు సహకరిస్తున్నారంటూ పోలీసుల తీరుపైనా గ్రామస్తులు ఆరోపణలు చేశారు. తల ఎగిరిపోయింది.. ఈనెల 17న రాత్రి భైంసా–నిర్మల్ మార్గంలో 61 వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్ర మాదం సంచలనమైంది. తల లేకుండా రోడ్డుపై మొండెం మాత్రమే కనిపించింది. హత్యనా.. లేక ప్రమాదమా.. అన్న చర్చ మొదలైంది. ఘటన జరిగిన మరుసటి రోజు వరకూ మృతు డి తల దొరకలేదు. దిలావర్పూర్ మండలం లోని కుస్లి గ్రామానికి చెందిన సూర అరుణ్ అనే యువకుడు ఆదివారం రాత్రి డోంగూర్గావ్ నుంచి తమ ఊరికి వెళ్తుండగా నర్సాపూర్(జి) మండలంలో ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వేగంతో వస్తున్న భారీ వాహనం(హార్వేస్టర్గా భావిస్తున్నారు) మెడ భాగంలో బలంగా ఢీకొట్టడంతో అరుణ్ తల ఎగిరిపోయింది. దాదాపు 30మీటర్ల దూరంలో పడింది. ఘటన జరిగిన తర్వాత మరుసటి రోజు తల దొరికింది. రోడ్డుపై మొండెం మాత్రమే ఉండటంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు అరుణ్‌ది హత్యగా భావించారు. కానీ ఘటన జరిగిన తీరును అంచనా వేసిన పోలీసులు రోడ్డుప్రమాదంగా భావిస్తున్నారు. వరుస ఘటనలతో.. గతానికి భిన్నంగా జిల్లాలో వరుసగా నేరాలు, ఘటనలు చోటుచేసుకోవడంతో సర్వత్రా క్రైమ్పైనే చర్చ నడుస్తోంది. ప్రధానంగా పొన్కల్, బోరిగాం కేసులు మానవత్వానికే మాయని మచ్చగా నిలిచాయని పేర్కొంటున్నారు. ప్రియుల మోజులో పడి భర్తను చంపించిన తీరు, అనుమానంతో కక్షకట్టి ఓ అమాయకురాలి ప్రాణం తీసిన.. ఈ ఘటనలు జిల్లావాసులను కలచివేశాయని చెప్పవచ్చు. ప్రశాంతంగా ఉండే జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో పాటు పలు రోడ్డుప్రమాదాలు, వరుస దొంగతనాలూ ఈనెలలోనే జరిగాయి. జిల్లాకేంద్రానికి చెందిన యువకుడు మొగిలి అంజు సై తం రోడ్డుప్రమాదంతో మృత్యువు దరికి చేరాడు. మామడ మండలంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇలా వరుస ఘటనలు జరగడంతో ఇది క్రైమ్ కాలంగా జిల్లావాసులు భావిస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న క్రైమ్‌రేట్ పోలీసులకు కొత్త సవాళ్లు విసురుతోంది. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..!
సాక్షి, కాగజ్‌నగర్(ఆదిలాబాద్) : తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి హతమార్చిన సంఘటన దహెగాం మండలం రాళ్లగూడెం గ్రామంలో ఈ నెల 17న చోటుచేసుకుంది. పోలీసులు తక్కువ సమయంలోనే కేసును చేధించి నిందితులను పట్టుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.లక్ష్మినర్సింహస్వామి, రూరల్ సీఐ అల్లం నరేందర్ వివరాలు వెల్లడించారు. రాళ్లగూడ గ్రామానికి చెందిన రౌతు బండు(38), భార్య కవిత. వీరికి ఏడేళ్ల కుమార్తె ఉంది. కవిత ఏడాదిగా కాగజ్‌నగర్ మండలం బురదగూడ గ్రామానికి చెందిన కొట్రంగి బిక్కుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని పథకం ప్రకారం బండును హత్య చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 17న రాత్రి బండు ఇంట్లో నిద్రిస్తుండగా కర్రతో తలపై దాడి చేసి హతమార్చారు. అనంతరం అనుమానం రాకుండా బిక్కు ద్విచక్రవాహనంపై మృతుడి శవాన్ని తీసుకెళ్లి బిబ్రా శివారులోని పత్తి చేనులో పడేశారు. సోమవారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. భార్య కవితను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నారు. మృతుడి సోదరుడు రౌతు కొండయ్య ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై రఘుపతి, మహిళా హెడ్ కానిస్టేబుల్ సమీనా, సిబ్బంది పాల్గొన్నారు. -
అనుమానంతో మహిళ హత్య
సారంగపూర్(ఆదిలాబాద్ ) : మండలంలోని బోరిగాం గ్రామానికి చెందిన ఎడ్ల కళావతి(42)ని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని గోనే సంచిలో కట్టి నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామంలోని చెరువులో పడేసిన ఘటన విధితమే. అయితే ఈ ఘటనపై ఆదివారం మృతురాలి బంధువులు బోరిగాం గ్రామంలో ఆందోళనకు దిగారు. అనవసరంగా అనుమానం పెంచుకుని మహిళా అని కూడా ఆలోచించకుండా కిరాతకంగా హత్య చేశారని ఆరోపిస్తూ నిందితుడి ఇంటిముందు ఆందోళనకు దిగారు. ఇంటిలోని సామగ్రిని ధ్వంసం చేశారు. పోలీసులు సైతం నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ సారంగాపూర్ ఎస్సై యూనుస్ అహ్మద్ అలీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో నిర్మల్ డీఎస్పీ ఉపేంద్రరెడ్డి బోరిగాం గ్రామానికి చేరుకుని ప్రజలను శాంతింపజేసి ఆందోళన విరమింపజేశారు. అలాగే కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమానంతో.. బోరిగాం గ్రామానికి చెందిన అచ్చమ్మ–రాజన్న దంపతులకు ముగ్గురు కుమారులు ప్రసాద్, నరేష్, రమేష్‌లు, కుమార్తె రాధ ఉన్నారు. చిన్నవాడైన ప్రసాద్‌కు ఆర్మీ జవానుగా ఉద్యోగం చేసేవాడు. సెలవులో ఇంటికి వచ్చిన ప్రసాద్ నాలుగు నెలల క్రితం ఇంటి పక్కన గల ఎడ్ల కళావతి–ఎర్రన్నల కుమారుడు మహేందర్, మరో స్నేహితుడు నిఖిల్‌లతో కలిసి దావత్‌కు వెళ్లాడు. దావత్ ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఆలూరు మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాదంలో ప్రసాద్ మరణించాడు. అయితే ప్రసాద్ తల్లి, సోదరులు ఇది రోడ్డు ప్రమాదం కాదని కావాలనే మహేందర్, నిఖిల్‌లు చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని అనుమానం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు మహేందర్, నిఖిల్ కుటుంబీకులను నరేష్, రమేష్‌లు బెదిరించారని బాధిత కుటుంబీకులు తెలిపారు. ఈ వేధింపులు భరించలేక ఇంటిని ఖాళీ చేసి ఎడ్ల కళావతి కుటుంబం గ్రామంలో మరో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. హత్య జరిగింది ఇలా.. మృతురాలు ఎడ్ల కళావతి భర్త ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లాడు. కుమారుడు మహేందర్ బెదిరింపుల నేపథ్యంలో గ్రామాన్ని వదిలి నిర్మల్ మండలం మంజులాపూర్‌లో ఉంటున్నాడు. మృతురాలు కళావతి ఈ నెల 12వ తేదీన గ్రామంలో ఒకరి ఇంటి వద్ద భజన కార్యక్రమాన్ని హాజరవడానికి అచ్చమ్మ ఇంటి ముందు నుంచి వెళ్తుండగా గమనించిన నరేష్, రమేష్, అచ్చమ్మ, పక్కా ప్రణాళిక ప్రకారం కళావతిని ఇంట్లోకి ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి మేడపైనున్న మరో గదిలోకి తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి తల్వేద గ్రామంలోగల చెరువులో పడేశారు. పలువురికి కళావతి కేకలు, అరుపులు వినిపించడంతో విషయాన్ని కళావతి కుమారుడు మహేందర్‌కు ఫోన్ చేసి తెలిపారని సమాచారం. ఈ నెల 14న మహేందర్ తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్సై అనుమానితులను విచారించగా హత్య విషయం వెలుగు చూసింది. నిందితులను కఠినంగా శిక్షించాలి కేవలం అనుమానంతో కళావతిని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులు నరేష్, రమేష్, తల్లి అచ్చమ్మ, అక్క రాధ, బావ ముత్యంలను కఠినంగా శిక్షించాలని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి అన్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టౌన్ పోలీస్‌స్టేషన్‌కు అటాచ్ బోరిగాం ఘటన నేపథ్యంలో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సారంగాపూర్ ఎస్సై యూనుస్ అహ్మద్ అలీని నిర్మల్ టౌన్ పోలీస్టేషన్‌కు అటాచ్ చేశామని రూరల్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అలాగే ప్రస్తుతం సారంగాపూర్ ఎస్సైగా టౌన్ ఎస్సై అరాఫత్‌కు బాధ్యతలు అప్పగించామని పేర్కొన్నారు. విచారణ కొనసాగుతుందని అన్నారు. -
లావుగా ఉన్నావని అత్తింటి వేధింపులతో..
సాక్షి, చెన్నూర్(ఆదిలాలబాద్) : అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత పెళ్లయిన తొమ్మిది నెలలకే ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని కుమ్మరిబొగుడ కాలనీలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాలివీ..కుమ్మరిబొగుడ కాలనీకి చెందిన తోట కిషన్–మధునమ్మలకు మానస, మౌనిక ఇద్దరు కూతుర్లు. తండ్రి కిషన్ 2014లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో కుమార్తె మౌనిక (22) మహారాష్ట్రలోని సిరోంచ తాలూకా, ఆరుడ గ్రామానికి చెందిన ఏతం కిరణ్‌కు రూ.8లక్షల కట్నం ఇచ్చి 2018లో వివాహం చేసింది. మౌనిక లావుగా ఉండడంతో భర్త, అత్తమామలు వేధించసాగారు. దీంతో ఆరు నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. శుక్రవారం బంధువులు ఆస్పత్రిలో ఉండగా చూసేందుకు తల్లి మంచిర్యాల వెళ్లింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మానిక చున్నీతో దూలానికి ఉరేసుకుంది. ఎస్సై సంజీవ్, తహసీల్దార్ పుష్పలత సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి భర్త కిరణ్, అత్తమామలు విడాకులు ఇవ్వాలని వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి మేనమామ మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నమ్మించి గొంతుకోశాడు..
సాక్షి, ఆదిలాబాద్ : అక్కను చూసేందుకు వచ్చి బావ చేతిలో బావమరిది హతమైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని దహేలిలో నివాసముంటున్న నర్సమ్మ – దత్తుల కూతురు మమతను ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన ఓసావార్ సంతోష్‌తో పదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకోగా అక్కతో కలిసి మనోజ్ (25) బావపై పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఏడాది నుంచి అక్కాబావలు కలిసి ఉంటున్నారు. గురువారం తన అక్కను చూసేందుకు వచ్చాడు. అక్కతో పాటు ఆమె పిల్లలకు కొత్త బట్టలు కొనిచ్చాడు. బావ సంతోష్ బావమరిదిని టీ తాగేందుకు ద్విచక్ర వాహనంపై బయటకు తీసుకువెళ్లాడు. మమత జిన్నింగ్ ఫ్యాక్టరీ దగ్గరికి రాగానే బైక్ నడుపుతున్న మనోజ్‌ను కత్తితో వెనకనుంచి మెడను కోశాడు. ఆ తర్వాత కడుపులో పలుమార్లు పోడవడంతో మనోజ్ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుని అక్క కన్నీరుమున్నీరుగా విలపించింది. సంఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్రావు, వన్‌టౌన్, టూటౌన్ సీఐలు చేరుకొని పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. -
ఇలా పట్టుబడతాడు.. అలా బయటకొస్తాడు
ఈ కంటెయినర్ వాహనం విలువ రూ.20లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఉంటుంది. ఇది కొత్త వాహనం. గత నెల గుడిహత్నూర్ పోలీసులు ఈ వాహనాన్ని పట్టుకున్నారు. ఇందులో హోల్‌సెల్‌లో రూ.25లక్షల విలువైన నిషేధిత గుట్కాను అక్రమంగా వేరే రాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌కు తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇది ఆదిలాబాద్‌కు చెందిన పాన్ మసాలా వ్యాపారిది. అంత ఖరీదైన వాహనంలో లక్షల విలువైన అక్రమ సరుకును పోలీసులు పట్టుకున్నా ఆ వ్యాపారి పెద్దగా పట్టించుకోలేదు. కారణం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారం అతనే నిర్వహిస్తుండటం, ఇప్పటికే కోట్లకు పడగలెత్తడంతోనే ఇలా విలువైన వాహనం, సరుకు పట్టుబడ్డా ఆయన దందాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. సాక్షి, ఆదిలాబాద్: గుట్కా దందాలో ఆయనో డాన్. ఆదిలాబాద్‌కు చెందిన ఓ పాన్ మసాలా వ్యాపారి, అతని సోదరులతో కలిసి అక్రమ దందా నిర్వహిస్తున్నాడు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిఘా కళ్లు కప్పి దందా నడుపుతున్నాడు. ఈ దందాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చేయని ప్రయత్నాలు లేవు. అయినా అతని దందాకు బ్రేక్ పడటం లేదు. ఉమ్మడి జిల్లాలో ఆయనపై ఇప్పటివరకు వంద కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్ని బెయిలబుల్ కేసులు కావడంతో ఒక కేసులో పట్టుబడ్డ తర్వాత త్వరితగతిన బయటకొస్తున్న ఈ నిందితుడు మళ్లీ తన పాత పంథాను మాత్రం కొనసాగిస్తున్నాడు. విలువైన వాహనాలు, సరుకు పట్టుబడినప్పుడు ఆయన తన నష్టాన్ని మరో రూపంలో పూడ్చుకుంటున్నట్లు ఈ వ్యాపారంతో సంబంధం ఉన్న కొంతమంది ద్వారా తెలుస్తోంది. అదెలా అంటే.. ఇటీవల గుడిహత్నూర్‌లో ఓ వాహనం పోలీసులకు పట్టుబడిన తర్వాత ఆ వాహనం ఖరీదు, సరుకు విలువనే అరకోటి దాటుతుండగా, దీని తర్వాత సరుకును హోల్‌సెల్‌గా విక్రయించే దగ్గర రెట్టింపు చేసి తన నష్టాన్ని పూడ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఈ దందాలో విలువైన వాహనాలు, సరుకు ఎలాంటిది పట్టుబడ్డా ఆ పాన్ మసాలా వ్యాపారి లైట్ తీసుకోవడానికి అదే కారణమని చెప్పుకుంటున్నారు. నిత్యం దందా.. నిషేధిత గుట్కా వ్యాపారాన్ని ఎన్నో ఏళ్లుగా ఈ పాన్ మసాలా వ్యాపారి యథేచ్ఛగా నిర్వహిస్తున్నాడు. ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రెండేళ్లలోనే సుమారు రూ.5 కోట్ల అక్రమ సరుకును పట్టుకున్నారు. అయినా ఈ దందాను పూర్తిస్థాయిలో నిలువరించలేకపోతున్నారు. కాగా జిల్లాలో మట్కా జూదం జోరుగా సాగుతున్న సమయంలో ఎస్పీ ఉక్కుపాదం మోపారు. అది చాలా మట్టుకు సక్సెస్ అయ్యింది. ఇందులో కొంతమంది మట్కా నిర్వాహకులకు బెయిల్ రాకుండా పోలీసులు కేసులు పెట్టడంతోనే వారు మళ్లీ అటువైపుగా దృష్టి సారించలేదన్న అభిప్రాయం పోలీసు వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి చర్యలే ఈ గుట్కా విషయంలోనూ అవలంబించాలన్న అభిప్రాయం లేకపోలేదు. కొందరికీ మామూళ్ల తంతు.. గుట్కా దందాలో కొందరు పోలీసులకు ఇప్పటికీ మామూళ్లు ముడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ గుట్కాపై ఉక్కుపాదం మోపుతూ కేసుల విషయంలో సూక్ష్మంగా దృష్టి సారించడంతో మండలాల్లో పోలీసు అధికారులు ఇందులో మామూళ్లకు వెనుకంజ వేస్తున్నా.. దీర్ఘకాలికంగా ఆయా సర్కిల్, ఎస్‌హెచ్‌ఓలలో పనిచేస్తున్న పోలీసు అధికారులు ఇప్పటికి మామూళ్ల తంతును రుచి మరుగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రం, శివారులో ఈ దందా యథేచ్ఛగా నడుస్తోంది. ఆదిలాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న కచ్కంటిలో ఒక గోదామును ఏర్పాటు చేసుకొని నిషేధిత గుట్కాను నిల్వ చేసి ఉంచగా పోలీసులే దాడిచేసి వెలుగులోకి తెచ్చారు. అయితే జిల్లా ఉన్నతాధికారికి సమాచారం రావడంతోనే ఇటువంటివి బయటకు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం పోలీసు అధికారులకు తెలిసినా మామూళ్ల కారణంగా పట్టించుకోవడం లేదన్న అపవాదు ఉంది. మండలాల్లో గోదాములు నిషేధిత గుట్కా వ్యాపారంలో కోట్లు గడించిన ఆదిలాబాద్‌కు చెందిన ఓ పాన్ మసాలా వ్యాపారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ దందాలో ఏకచత్రాధిపత్యం వహిస్తున్నాడు. మండలాల్లో గోదాములు ఏర్పాటు చేసుకొని సరుకును నిల్వ ఉంచి అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్న ఈ గుట్కాను ఎక్కడికక్కడ వాహనాలు పంపి డంపింగ్ చేయడం ద్వారా దందాను సులభతరం చేసుకున్నాడు. కోట్లు గడించిన ఈ వ్యాపారికి రాష్ట్ర రాజధానిలోనూ కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయనే ప్రచారం లేకపోలేదు. ఇదిలా ఉంటే పోలీసుశాఖలో రాష్ట్రస్థాయిలో కొంతమంది ఉన్నతాధికారులతో కూడా ఈ వ్యాపారితో సత్సంబంధాలు ఉండడంతో పోలీసులు ఇతన్ని కట్టడి చేయలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. -
భర్త చిత్రహింసలతో భార్య బలవన్మరణం
సాక్షి, ఖానాపూర్: భర్త చిత్రహింసలు తాళలేక భార్య పురుగుల మందుతాగి మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ జయరాం నాయక్, ఎస్సై భవానిసేన్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బీర్నంది పంచాయతీ పరిధిలోని కొమ్ముతాండ గ్రామానికి చెందిన లక్ష్మి (40) భర్త బుక్య బలిరాం సోదరుడు గతంలో మృతిచెందాడు. అతడి భార్యతో బలిరాం వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఈ విషయంపై భార్యతో తరుచుగా గొడవలు జరిగేవి. గ్రామస్తులు సైతం పలుమార్లు హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోకపోవడంతో పాటు భార్యను తరుచుగా వేధించేవాడు. శుక్రవారం ఉదయం పంటచేనుకు వెళ్లిన లక్ష్మిని అక్కడికి వెళ్లి తీవ్రంగా కొట్టాడు. దీంతో పంట చేనులోని పురుగుల మందు తాగి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి కుమారుడు వెంకటేశ్, కూతుల్లు చంద్రకళ, స్వప్న ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ -
చెన్నూర్‌లో భారీ చోరీ
సాక్షి, చెన్నూర్: చెన్నూర్ పట్టణంలో జేబీఎస్ పాఠశాల సమీపంలోని గోదావరి రోడ్డులో చెన్నూర్ ఎంఈవో రాధాకృష్ణమూర్తి ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు తాళాలు పగలకొట్టి బీరువాలో దాచిన నగదు, విలువైన సొత్తును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు కొమ్మెర రాధాకృష్ణమూర్తి వాపోయాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లి అదేరోజు అర్ధరాత్రి 1 గంటకు ఇంటికి వచ్చి చూసేసరికి తలుపు తీసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా.. బీరువా పగులగొట్టి అందులో దాచిన మూడున్నర తులాల బంగారం, రూ.70 వేల విలువైన వెండి, రూ.1.60 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఎస్సై విక్టర్, సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. డాగ్‌స్వా్కడ్, క్లూస్ టీం బృందం సభ్యులు రంగంలోకి దిగారు. పట్టణంలోని జెండవాడలో చెన్న మధు ఇంటి వద్ద కుక్క ఆగడంతో మధును తీసుకెళ్లి పోలీసులు విచారిస్తున్నారు. జైపూర్ ఏసీపీ నరేందర్ ఎంఈవో ఇంటికి వెళ్లి చోరీ జరిగిన తీరును తెలుసుకున్నారు. పక్కా ప్లాన్‌తోనే దొంగతనం.. ఏంఈవో రాధాకృష్ణమూర్తి కుటుంబం హైదరాబాద్ వెళ్లి వచ్చేలోగా ఇంట్లో చోరీ జరిగింది. పక్కా ప్లాన్‌తోనే దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. తెలిసిన వారైన ఉండాలి. లేక రెక్కీ నిర్వహించిన దొంగలైన ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడి ఇల్లు రోడ్డు పక్కనే ఉండడంతో పాటు నిరంతరం జన సంచారం ఉంటుంది. పగలు చోరీ జరిగే అవకాశమే లేదు. రాత్రివేళ సుమారు 10 నుంచి 12 గంటల మధ్యే చోరీ జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
నోటికి ప్లాస్టర్ అంటించి, అగర్‌బత్తీలతో కాల్చి...
సాక్షి, ఉట్నూర్ రూరల్ : కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ వార్డెన్ చిన్నారులపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. అర్ధరాత్రి నిద్రలేపి మరీ ఈ అరాచకానికి ఒడిగడుతున్నాడు. ఈ కీచకపర్వం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల వసతి గృహంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని ఓ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాల అక్కడే హాస్టల్ నిర్వహిస్తోంది. విద్యార్థులపై హాస్టల్ వార్డెన్ కొమ్ము లింగన్న లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ప్రిన్సిపాల్‌కు వివరించినట్లు సమాచారం. అయినా సదరు వార్డెన్‌లో మాత్రం మార్పు రాలేదు. దీంతో పిల్లల తల్లిదండ్రులు గురువారం పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. పిల్లలను అర్ధరాత్రి నిద్ర లేపి లైంగిక వేధింపులకు గురిచేసేవాడని, వినకపోతే నోటికి ప్లాస్టర్ అంటించి, అగర్‌బత్తీలతో కాల్చేవాడని పిల్లలు తమకు ఏడుస్తూ విన్నవించారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. గతంలో ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశామని, పిల్లల పరువుపోతుందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆగిపోయామని తెలిపారు. అదే సమయంలో వార్డెన్ కనిపించడంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు అతడిపై దాడి చేశారు. సీఐ నరేశ్, ఎస్సై అనిల్ విద్యార్థుల తల్లిదండ్రులను సముదాయించారు. వార్డెన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. -
పత్తి ఏరడానికి చేనుకు వెళ్తే..
సాక్షి, బేల(ఆదిలాబాద్ ): మండలంలోని సదల్పూర్ రెవెన్యూ గ్రామ శివారులోని ఓ పత్తి చేనులో పిడుగుపాటుతో గురువారం ఇద్దరు మహిళ కూలీలు మృతిచెందారు. వీరిలో ఒకరు రైతు కుటుంబం కాగా, మరోకరిది కూలీ కుటుంబం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సదల్పూర్ గ్రామ శివారులోని రైతు రేషవార్ ఆశన్న పత్తి చేనులో బేల, జూనోని గ్రామాల నుంచి 8 మంది మహిళ కూలీలు ఆటోలో పత్తి ఏరడానికి వెళ్లారు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వీరంతా చెట్ల కిందకు పరుగెత్తారు. దీంతో ఒక చెట్టుకు కిందకు వెళ్లిన నలుగురు పిడుగుపాటుకు గురయ్యారు. జూనోనికి చెందిన నాగోసే ప్రమీల(33), బేలకు చెందిన కనక దేవిక(29)లు అక్కడిక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన జూనోని గ్రామానికి చెందిన మరో ఇద్దరు లెన్‌గురే ఉష, నాగోసే దుర్పతలను రిమ్స్‌కు తరలించారు. వీరు ప్రస్తుతం కోలుకుంటున్నారు. సంఘటన స్థలాన్ని ఏఎస్సై నజీబ్ పరిశీలించారు. ఆయన వెంట కానిస్టేబుల్ స్వామి ఉన్నారు. -
దొంగలొస్తారు.. జాగ్రత్త !
సాక్షి, మంచిర్యాల: దసర పండగ సందర్భంగా చాలా మంది ఊర్లోకి, వివిధ ప్రాంతాలకు టూర్లకు వెళ్తుంటారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని మంచిర్యాల ఏసీపీ గౌస్‌బాబ పట్టణ ప్రజలకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. దొంగలు వీధుల గుండ తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించి పక్కింటి వారికి మాయ మాటలు చెప్పి తాళం వేసి ఉన్న ఇంటి వారు తమ బంధువులంటూ సమాచారం సేకరిస్తున్నారు. అనంతరం రాత్రి వేళ దర్జాగా దొంగలు తమ పని కానిస్తున్నారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 13 వరకు దసర సెలవులు ఉన్నందున ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు, వ్యాపారులు సైతం పండగకు ఇంటికి తాళం వేసి సొంతూర్లకు వెళ్తుంటారు. ఇదే మంచి తరుణం అని భావించిన దొంగలు దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల పట్టణ సీఐ మహేష్ దొంగల భారి నుంచి తప్పించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఊళ్లకు వెళ్లే ముందు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలంటున్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసు పెట్రోలింగ్ నిఘా ఉంటుందని, ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. దొంగతనం కేసులో బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్న డీసీపీ రక్షిత కె. మూర్తి దొంగతనాల నివారణకు ఇవి పాటించండి అత్యవసరంగా ఊరెళ్లాల్సి వస్తే పక్కింటి వారికి తెలపాలి. వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అతి తక్కువ ధరకు దొరికే వైఫై బేస్డ్ రోబో కెమెరాను అమర్చుకోవాలి. దీని నుంచి మీ ఇంట్లో జరిగే విషయాలు మీ సెల్‌ఫోన్‌కు అలర్ట్ రింగ్‌టోన్ వస్తుంది. అది వారికి వినిపించదు. వారు దొంగతనం చేస్తుండగానే పట్టుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్లో సైరన్ మోగే తాళాలు సైతం అతి తక్కువ ధరలో దొరుకుతాయి. దానిని కదిలించే ప్రయత్నం ఎవరు చేసిన సైరన్ మోగుతుంది. దీంతో పక్కవారు అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. తాళం వేసినా అది కనిపించకుండా డోర్ కర్టెన్ కప్పి ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి ముందు ఉన్న గేటుకు తాళం వేయకపోవడం మంచిది. బెడ్ రూంలో లైట్ వేసి ఉంచాలి నగలు, నగదు బీరువాల్లో దాచిపెట్టక పోవడం మంచిది. డబ్బులు, ఆభరణాలు బ్యాంకుల్లో భద్రపర్చుకోవడం ఉత్తమమైనది. అపార్ట్మెంట్లో ఉండేవారు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అపార్ట్మెంట్లో అందరు కలిసి వాచ్‌మెన్‌ను నియమించుకోవాలి. అతనిపై నిఘా ఉంచాలి. తలుపులకు సమీపంలో కిటికీలు ఉండకుండా ఇంటి నిర్మాణం చేపట్టుకుంటే మంచిది. ఇలా ఉంటే కిటికీల గుండా గడియ తీసే అవకాశం ఉంది. కొత్తగా ఎవరైన అద్దెకు దిగితే వారి పూర్తి వివరాలు సేకరించాలి. మహిళలు బయటకు వెళ్లే ముందు విలువైన నగలు ధరించుకోకుండా వెళ్లడం మంచిది. తప్పదనిపిస్తే నగలు కనిపించకుండా చీర కొంగు లేదా చున్ని మెడ చుట్టూ కప్పుకోవాలి. వీలైనంత తక్కువ నగలు ధరించడం మంచి ది. ఆర్టిఫిషియల్ నగలు ధరించుకోవాలి. గుర్తు తెలియని వ్యక్తులు మన పరిసర ప్రాంతాల్లో తిరిగినప్పుడు వారిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. వెంటనే 100 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. వీలైతే మీ మొబైల్ ద్వారా ఫొటో తీసి పోలీసులకు పంపించాలి. ప్రజల భద్రత కోసమే పోలీస్ ప్రజల భద్రత, ప్రజల ఆస్తుల రక్షణకు పోలీస్ వ్యవస్థ 24 గంటలు పని చేస్తుంది. నిర్భయంగా సమాచారం ఇవ్వండి రక్షణ కల్పిస్తాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పట్టణంలో 24 గంటలు నాలుగు బ్లూ కోట్స్ టీములు తిరుగుతున్నాయి. ఊళ్లకు వెళ్లే వారు ముందుగానే పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇచ్చి పోతే వారి ఇళ్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం. 100 నంబర్ బిజీగా ఉంటే మంచిర్యాల పోలీస్‌స్టేషన్ నంబర్ 9059949099కు సమాచారం ఇవ్వచ్చు. – ఏసీపీ, గౌస్‌బాబ -
రైల్వేపోలీసుల ఎత్తుకు స్మగ్లర్ల పైఎత్తు..!
సాక్షి, మంచిర్యాల: రేషన్ బియ్యం అక్రమ రవాణా కొంత పుంతలు తొక్కుతోంది. బియ్యం అక్రమ రవాణా చేయడంలో అక్రమదారులు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. నాడు బియ్యం తరలించే సమయంలో రైల్వే పోలీసులకు దొరకుండా టాయిలెట్లలో నింపి లోపల ఓ వ్యక్తి గడియ పెట్టుకుని ఉండేవారు. తనిఖీ చేసేందుకు వచ్చిన పోలీసులు బయట దొరికిన బియ్యం సంచులను మాత్రమే తీసుకువెళ్లేవారు. టాయిలెట్లో దాచిపెట్టిన బియ్యాన్ని దింపే సమయంలో డోర్ వెళ్లకపోతే ధ్వంసం చేసేవారు. ‘అక్రమ రవాణా ఆపై ధ్వంసం’ అనే కథనం ‘సాక్షి ’దిన ప్రతికలో ఆగస్టు 13న ప్రచురణ కాగా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారు తమ పంథాను మార్చుకున్నారు. ప్రస్తుతం కొత్త పద్ధతిలో తరలిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. రైలుమార్గం వరం అక్రమంగా రేషన్ బియ్యం తరలించేందుకు అక్రమార్కులకు రైలుమార్గం వరంగా మారింది. రైల్వేపోలీసులు, టీసీ ఎవరైన అడ్డు పడితే చాలు నయానో.. బయానో ముట్టజెప్పి తమపని యథేచ్ఛగా సాగించుకుంటున్నారు. అధికంగా కాజిపేట నుంచి మహారాష్ట్రకు వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, అజ్ని ప్యాసింజర్ రైళ్లల్లో అధికంగా జరుగుతోంది. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 6గంటలకు కాజిపేట నుంచి బయలు దేరుతోంది. అజ్ని ప్యాసింజర్ రాత్రి 10:30 గంటలకు బయలుతేరుతోంది. ఈ రెండు రైళ్లు తెల్లవారే లోపు మహారాష్ట్రలోని వీరూర్‌కు చేరుకుంటాయి. రాత్రి వెళ్లడంతో రేషన్ బియ్యం అక్రమ రవాణ దారులకు ఈ రెండు రైళ్లు అనుకూలంగా మారింది. ఆగని బియ్యం దందా... మహారాష్ట్రలోని వీరూర్‌కు మన రేషన్ బియ్యం భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, ఆజ్ని ప్యాసింజర్ రైళ్ల ద్వారా యథేచ్ఛగా అక్రమార్కులు రేషన్ బియ్యం తరలిస్తున్నారు. కాజిపేట నుంచి ప్రతిరోజు సాయంత్రం 6గంటలకు బయలు దేరిన భాగ్యనగర్ అర్ధ రాత్రి 2గంటల ప్రాంతంలో వీరూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. ఆజ్ని ప్యాసింజర్ రాత్రి 10:30గంటలకు కాజిపేట నుంచి బయలుదేరి తెల్లవారు జామును వీరూర్‌కు చేరుకుంటుంది. ప్రతి రోజు గంటల తరబడి ఆలస్యంగా నడువడంతో బియ్యం స్మగ్లర్లకు ఇది వరంగా మారింది. వీటి వెనుకల వచ్చే మరో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేందుకు ఉప్పల్, పోత్కపల్లి, ఓదెల తదితర కొన్ని స్టేషన్లలో క్రాసింగ్ పెట్టి నిలిపి వేయడంతో బియ్యం రైల్లో ఎక్కించుకునేందుకు సమయం కలిసి వస్తోంది. సంచుల్లోని బియ్యాన్ని సీట్ల కింద పారబోసి తమకు ఏమి ఏరుగనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు భాగ్యనగర్. ఆజ్నీ ప్యాసింజర్ రైళ్లో హసన్పర్తిరోడ్డు, ఉప్పల్, బిజిగిరిషరీఫ్, పొత్కపల్లి, ఓదెల, కొలనూర్, కొత్తపల్లి, రాఘవపూరం, పెద్దంపేట, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, రేచినిరోడ్ ఈ రైల్వేస్టేషన్ల నుంచి ప్రతిరోజు సుమారు 70నుంచి 80 క్వింటాళ్ల రేషన్ బియ్యం మహారాష్ట్రకు తరలిస్తున్నారు. గతంలో రవాణా ఇలా... గతంలో రేషన్ బియ్యం తరలిస్తుండగా రైల్వేపోలీసులకు పట్టుబడితే బియ్యం పట్టుకోవడం లేదా బ్యాగులు చింపేసి పడేయం లాంటివి జరిగేవి. ఆ తరువాత బియ్యం సంచులను టాయిలెట్ రూములో భద్రపరిచి ఓ వ్యక్తి లోపలనే ఉండి డోర్‌లాక్ చేసుకుని తరలించేవారు. రైల్వేస్టేషన్ గోడపైన తరలించేందుకు సిద్ధంగా బియ్యం సంచులు; సీట్లకింద పోసిన రేషన్ బియ్యం సీట్ల కింద బియ్యం... రైలు బోగిల్లోకి ఎక్కించిన బియ్యం సంచుల్లో నుంచి సీట్లకింద పారబోసి అవి ఎవరివో మాకేం తెలియదన్నట్లుగా సీట్లపై పడుకుంటున్నారు. విడిగా ఉన్న బియ్యాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలో తెలియక అధికారులు వదిలేస్తున్నారు. రేషన్ బియ్యం స్టేషన్ ప్లాట్‌ఫారంపైకి రాకముందే కట్టడి చేస్తే రైలుమార్గం వెంట బియ్యం అక్రమ రవాణా అరికట్టవచ్చు. రైల్వే అధికారుల అండతో.. రేషన్ బియ్యం అక్రమ రవాణా రైల్వే అధికారుల అండతోనే యథేచ్ఛగా సాగుతోందనే ఆరోపనలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజు రైళ్లలో గస్తీ తిరుగుతున్న రైల్వేపోలీసులు రేషన్ బియ్యం స్మగ్లర్లను గుర్తించకపోవడంపై సర్వత్ర విమర్శలకు తావిస్తోంది. రైల్వే అధికార యంత్రంగం ఈ వ్యవహారాన్ని మాములు ‘గా’ తీసుకుంటున్నారనే ఆరోపనలున్నాయి. 41 క్వింటాళ్లు పట్టివేత తాండూర్(బెల్లంపల్లి): మండలంలోని రేచిని రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఇళ్లల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని శుక్రవారం తెల్లవారు జామున ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. రేచిని రోడ్ రైల్వే స్టేషన్ నుంచి రైళ్లల్లో మహారాష్ట్రకు బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారం మేరకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్ సమీపంలోని ఇళ్లల్లో దాడులు నిర్వహించారు. తలుపులు లేని ఓ ఇంట్లో 90బస్తాల్లో 41 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బియ్యాన్ని మండల కేంద్రంలోని గోదాంకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ గోవింద్ , సిబ్బంది పాల్గొన్నారు. 56 క్వింటాళ్లు కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్లో శుక్రవారం భారీగా రేషన్ బియ్యాన్ని స్వాధీనపర్చుకున్నట్లు రైల్వే రక్షక దళం ఎస్సై ఏటీఎస్ నర్సింహులు తెలిపారు. ఆయన కథనం ప్రకారం... కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రంలోని విరూర్‌కు పలు ప్యాసింజర్ రైళ్ల ద్వారా బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఉదయం నుంచి పలు రైళ్లలోని బోగిల్లో తనిఖీలు నిర్వహించామని, ఈ తనిఖీల్లో 185 బ్యాగుల బియ్యం బస్తాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. ఆర్పీఎఫ్ సీఐ రాకేష్ మీణా ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. 185 బ్యాగుల్లో మొత్తం 56 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు వెల్లడించారు. -
ప్రాణం ఖరీదు రూ.2లక్షలు..?
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు ప్రాణాలకు ఖరీదు కడుతున్నాయి. ఇటీవల కాలంలో వైద్యుల నిర్లక్ష్యంతో పలువురు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనలు చోటుచేసుకోవడం జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వేలాది రూపాయలను ఫీజుల రూపంలో తీసుకుంటూనే, ప్రాణాలకు గ్యారంటీని ఇవ్వలేని దుర్భర పరిస్థితుల్లో జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల తీరు జిల్లా ప్రజల్లో కలవరం నెలకొంది. జిల్లా కేంద్రంలో ఇటీవల పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం అంటు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడం... వీరికి మధ్యవర్తిత్వంగా వ్యవహరిస్తూ బాధితుల పక్షన నిలబడి ఆందోళనలు చేయడం... కుటుంబానికి న్యాయం చేయాలని లక్షల్లో డిమాండ్ చేయడం, చివరికి బాధితులకు ఎంతో కొంత ఇప్పించడం వైద్యులు సైతం ఈ గొడువలెందుకులే అని లక్షల్లో ముట్టజెప్పడం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రాణాలకు ఖరీదు కట్టడం పరిపాటిగా మారింది. ఇటీవల జిల్లా కేంద్రంలో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.... ఈ నెల 17 మంచిర్యాల మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రిలో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్ మండలం డోర్‌పెల్లి గ్రామానికి చెందిన డోంగ్రీ సాయినాథ్ – తిరుమల కూతురు సంకీర్తణ (8) జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల అనంతరం డెంగీ జ్వరం అని, ప్లేట్లేట్స్ 43వేలే ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో చికిత్స పొదుతూ ఈ నెల 18న సాయంత్రం మృతి చెండడంతో వైద్యుల నిర్లక్ష్యమేనని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రూ. 2లక్షలకు ఒప్పందం... విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు చేరుకొని వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక మృతి చెందినట్లు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు. జోక్యం చేసుకుని ఇరువార్గాలతో మాట్లాడి ఆందోళన జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఘటన స్థలంలో బాలిక తల్లిదండ్రులు ఇద్దరే ఉండడంతో మృత దేహాన్ని తీసుకెళ్లడానికి విముకత చూపించారు. తమ గ్రామం నుంచి తమకు చెందిన బంధువులు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లమని రోదిస్తూ ఉండిపోయారు. గురువారం సాయినాథ్ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని మరోసారి ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. స్థానిక నేతలు కుటుంబానికి న్యాయం చేయాలంటూ రూ. 15లక్షలు పరిహారం అందజేయాలని డి మాండ్ చేశారు. ఆసుపత్రి యాజమాన్యం 3గంటల పాటు చర్చల అనంతరం రూ.2లక్షల ఇచ్చేదుకు అంగీకరించడంతో వివాదం సర్దుమనిగింది. 16గంటల పాటు పోలీస్ పహారా.... ఆసుపత్రి ఎదుట ఎలాంటి ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుండా ఉండేందుకు ఈ నెల 18న రాత్రి 8గంటలకు ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు ఈ నెల19న ఉదయం11 గంటల వరకు అంటే 16గంటల పాటు పోలీసులు ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంఛనయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. -
తప్పని ఎదురుచూపులు..
సాక్షి, మంచిర్యాల(హాజీపూర్): చిన్ననాటి నుంచి ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధించిన కన్నపేగు ఇన్నాళ్లు తమ మధ్య ఉంటూ నిత్యం నవ్వులతో ఆనందంగా ఉండే కన్నబిడ్డ జాడ కరువయ్యింది. మొన్నటి వరకు సంతోషాల మధ్య సాగిన ఆ కుటుంబంలో అంతుచిక్కని విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్లితే... హాజీపూర్ మండలంలోని నంనూర్ గ్రామానికి చెందిన కారుకూరి సుదర్శన్–భూలక్ష్మి దంపతులకు ఒక కుమార్తె రమ్య(23), కుమారుడు రఘు ఉన్నారు. సుదర్శన్ విద్యుత్ శాఖలో సబ్ స్టేషన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇక కుమార్తె రమ్య బీటెక్ పూర్తి చేసి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సబ్ ఇంజినీర్‌గా ఉద్యోగం మొదటి నెల జీతం కూడా తీసుకుంది. విధుల నిమిత్తం వరంగల్ వెళ్లి అక్కడి నుంచి పాపికొండలు విహార యాత్రకు తోటి స్నేహితులతో కలిసి వెళ్లింది. అక్కడ విహార యాత్రలో భాగంగా 15వ తేదీ ఆదివారం పాపికొండలు గోదావరిలో పడవ మునిగి అంతా గల్లంతయ్యారు. నాటి నుంచి రమ్య ఆచూకీ మాత్రం లభించలేదు. రోజు రోజుకూ గోదావరిలో లభిస్తున్న మృతదేహాల్లో తమ రమ్య మృతదేహం ఉందేమోనని ఆందోళన ఒకవైపు... రమ్య ఆచూకీ తెలియడం లేదని మరోవైపు రమ్య తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. నేటికి ఆరు రోజులైనా కన్నబిడ్డ జాడ లేదు సరికదా ఏం జరిగిందోనని అంతుచిక్కని ఆవేదనలో పెడుతున్న కన్నీరు మున్నీరు అవుతున్న వారి తీవ్ర ఆవేదన ప్రతీ ఒక్కరిని కలిచివేస్తుంది. ఏది ఏమైనా రమ్య ఆచూకీ గురువారం రాత్రి వరకు తెలియరాలేదు. ఇంకా దాదాపు పది మంది వరకు గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది. రమ్య గల్లంతు ఇంత వరకు తెలియక పోవడంతో ఇటు నంనూర్‌లో తల్లి భూలక్ష్మి తీవ్ర ఆవేదనలో ఉండగా సంఘటనా స్థలంలో తండ్రి సుదర్శన్, సోదరుడు రఘులు దయనీయ స్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా గల్లంతైన రమ్య ఆచూకీ త్వరగా లభించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. -
పోలీసుల అదుపులో మాయలేడి
సాక్షి, బెల్లంపల్లి: కోల్‌బెల్ట్ ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉద్యోగాల పేరిట కోట్లు వసూలు చేసిన మాయలేడీని కాసిపేట పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన ఠాకూర్ సుమలత గత మూడేళ్లుగా ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసిన ఉద్యోగాల విషయంలో జైపూర్, దేవాపూర్ పవర్ప్లాంట్లలో ఉద్యోగాలు పెట్టిస్తానంటూ నిరుద్యోగులను కలిసి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు బాధితుల నుంచి వసూలు చేసింది. అనంతరం నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తుండటంతో బాధితులు విసిగి వేసారి వడ్డీ నష్టపోతున్నామని వాదనకు దిగారు. ఆరు నెలల క్రితం మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో సైతం మోసం చేసినట్లు విన్నవించారు. దీంతో విషయం తెలుసుకున్న సుమలత కోర్టు నుంచి ఐపీ తెచ్చుకొని నోటీసులు పంపించింది. బాధితులు సుమారు రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు చెబుతుండగా నిందితురాలు రూ.80 లక్షలు వరకు వసూలుపై ఐపీ తెచ్చుకుంది. ఉద్యోగాల పేరిట మోసపోయింది పోయి తిరిగి ఐపీ కింద కోర్టు నుంచి నోటీసులు అందుకోవడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాసిపేట, సోమగూడెం, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్‌నగర్, వరంగల్, పర్కాల, హన్మకొండ, రంగారెడ్డి, సికింద్రాబాద్‌లలో సైతం ఉద్యోగాల పేరిట వసూలు చేసినట్లు తెలిసింది. కాగా బాధితుల ఫిర్యాదుపై విచారణ చేపట్టి సుమలత కోసం గాలించగా గత కొన్ని నెలలుగా తప్పించుకు తిరిగింది. ఎట్టకేలకు బుధవారం కాసిపేట పోలీసులు బెల్లంపల్లిలో అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. గురువారం కోర్టులో హాజరుపర్చనున్నారు. -
నెత్తురోడిన జాతీయ రహదారి: 24 మందికి తీవ్ర గాయాలు
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ గ్రామ సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద మంగళవారం మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదానికి ప్రధాన కారణంగా డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది. టోల్‌ప్లాజా పక్కనే ఉన్న సిమెంట్ గద్దెను బలంగా ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 32మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 22మందికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నవారిని నిజామాబాద్, హైదరాబాద్‌కు తరలించారు. క్షతగాత్రుల్లో వృద్ధులు, చిన్నారులు కూడా ఉండడం కలకలం రేపింది. సంఘటన జరిగిన వెంటనే ఎస్సై రవీందర్కేంద్రే తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తోటి ప్రయాణికులతో కలిసి క్షతగాత్రులకు సహాయం అందించారు. కొందరి తలలు, మరికొందరి కాళ్లు, ఇంకొందరి చేతులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని 108లో, ప్రైవేటు వాహనాల్లో నిర్మల్, నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు వేణుగోపాల కృష్ణ, రఘునందన్ రెడ్డి, శశికాంత్, శ్రీదేవి క్షతగాత్రులకు చికిత్స అందించారు. బస్సు డ్రైవర్ మనోహర్ సింగ్ నిర్లక్ష్యంగా నడపటం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు అంటున్నారు. ప్రాణాలు కాపాడిన స్పీడ్ బ్రేకర్లు వేగంగా వచ్చే వాహనాలను అదుపు చేసేందుకు టోల్‌గేటు వద్ద ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లే తమ ప్రాణాలు కాపాడాయని ప్రయాణికులు చెబు తున్నారు. అప్పటికే వేగంగా వచ్చిన బస్సు స్పీ డ్ బ్రేకర్ వద్ద కంట్రోల్ అయినా.. పూర్తిగా ని యంత్రణలోకి రాకపోవడంతో అదుపుతప్పి సిమెంట్ గద్దెను ఢీకొట్టిందని చెబుతున్నారు. స్పీడ్ బ్రేకర్లు లేకుంటే మరింత వేగంతో వచ్చి ఢీ కొని ప్రాణాలు కోల్పోయేవారమని పేర్కొన్నారు. పరిస్థితి విషమంగా ఉంది వీరే.. భైంసాకు చెందిన హమీదా బేగం ముఖం భాగంలో ఎముకలు విరిగిపోయాయి. నిర్మల్‌కు చెందిన కళ్యాణికి ముక్కుభాగంలో ఎముక విరిగింది. శంకర్ అనే వ్యక్తికి నడుం భాగంలో ఎముకలు విరిగాయి. లక్ష్మీ అనే వృద్ధురాలికి ఎడమ కాలు విరిగి తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఈ నలుగురుకి పరిస్థితి విషమంగా వుండటంతో నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి నిజామాబాద్, హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. గాయాలతో బయటపడిన వారు.. నిర్మల్‌కు చెందిన కండక్టర్ రమేష్‌గౌడ్, నిజాదవ్ వసంత, జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మౌనిక, రేఖ, నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన రమేష్, నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన అమీద, నిజామాబాద్‌కు చెందిన నరేష్, నందిపేట్‌కు చెందిన లక్ష్మీ, గుత్పాకు చెందిన సునిత, లావణ్య, ఆదిలాబాద్ జిల్లా బోథ్‌కు చెందిన శంకర్, హైదరాబాద్‌కు చెందిన నరేష్ కుమార్, నిర్మల్‌కు చెందిన ఫహిజుల్లా ఖాన్, షబాన, షేక్ ఉల్లాఖాన్, గంగయ్య, రమేష్, సునితా, సరీనా బేగం ఉన్నారు. ఇదే బస్సులో ఉన్న నలుగురు చిన్నారులు, మరో ఇద్దరు వృద్ధులు ఎలాంటి గాయాలుకాకుండా బయట పడ్డారు. మొహర్రం పండగా పూట ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే పండుగల్లో మొహర్రం పండగా ఒకటి. అయితే పండగను జరుపుకోవడానికి వెళ్లిన ముస్లిం వృద్ధురాలు హమీదాబేగం పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. బైంసాకు చెందిన హమీదా బేగంకు ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. కుమారుడు మహారాష్ట్రలోని నాందెడ్‌లోని అత్తగారి ఇంటివద్ద ఉంటున్నాడు. భర్త అప్సర్ గతంలోనే మరణించగా ఇంట్లో ఒక్కతే కూలీ పని చేసుకుంటూ జీవిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్మూరులో ఉండే ఆమె చిన్న కూతురు ఆసియా బేగం తన తల్లికి ఫోన్ చేసి మొహర్రం పండగకు రావాలని కోరడంతో ఆదివారం ఆర్మూర్‌కు వెళ్లి సోమవారం మొహర్రం పంగను కూతురు, అల్లుడు, మనవళ్లతో ఆనందంగా జరుపుకుంది. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆమె బంధువులు తెలిపారు. ఇదే సంఘటనలో మరో ఐదుగురు ముస్లింలు సైతం గాయపడ్డారు. పండగ పూట ప్రమాదం జరగడంతో వారి కుటుంబాల్లో విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. సోన్: జిల్లాలోని 44వ జాతీయ రహదారి మంగళవారం నెత్తురోడింది. నిజామాబాద్ నుంచి నిర్మల్‌కు బయలుదేరిన ఆర్టీసీ అద్దె బస్సు గంజాల్ సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద అదుపు తప్పింది. పక్కనే ఉన్న సిమెంట్ గద్దెకు ఢీకొనడంతో ప్రయాణికులు చెల్లాచెదురయ్యారు. ఒక్కసారిగా హాహాకారాలు.. ఆర్తనాదాలు మిన్నంటాయి. మొత్తం 32 మంది ప్రయాణికుల్లో 24 మందికి తీవ్ర గాయాలవగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది. -
రమేష్ హత్య వెనుక రహస్యాలనేకం..!
సాక్షి, ఆసిఫాబాద్: స్నేహితుల చేతిలో హతమైన ఆత్రం రమేష్ మృతి వెనక అసలు కారణాలు మాత్రం అంతు చిక్కడం లేదు. దాడికి అసలైన కారణం దొంగతనమే అయితే ఆ దొంగతనం వెనుక ఉన్న అసలు సూత్రదారులెవరరనేది అంతుచిక్కడం లేదు. గూడ్స్ రైలులో నుంచి బస్తాలు దొంగతనం చేసేందుకు నిరాకరించాడనే కారణంతో దాడికి పాల్పడితే ఎన్ని నెలల నుంచి ఈ దొంగతనాలు కొనసాగుతున్నాయనేది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంలో రైల్వే సిబ్బంది ప్రమేయం లేకుండానే బస్తాల దొంగతనం ఎలా సాధ్యమవుతుంది..? అనే సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు మండల ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. రైలులో నుంచి బస్తాలను దొంగతనం చేసేందుకు సహాయం చేయకపోవటంతో ఆగ్రహించిన స్నేహితులు ఆత్రం రమేష్‌పై దాడికి పాల్పడటంతో విషయం బయటపడింది. కాలితో తట్టడంతోనే ఆత్రం రమేష్ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు చెబుతున్నా దాడిలో చాలామంది ఉండి ఉంటారని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపడితే నిందితులు బయటపడే అవకాశం ఉందని మండల వాసులు అంటున్నారు. బస్తాల దొంగతనం ఎన్నాళ్ల నుంచి కొనసాగుతోంది..? రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వేస్టేషన్లో నిత్యం ఏదో ఒక గూడ్స్ రైలు నిలిచి ఉంటుంది. అలా ఆగి ఉన్న గూడ్స్ రైలులో నుంచి కొంతకాలంగా రాత్రి సమయంలో ఎరువుల బస్తాలను దొంగిలిస్తూ వాటిని రైతులకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తతంగం వెనుక మండలానికి చెందిన పలువురు వ్యక్తులే ఉన్నట్లు అనుమానాలున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం పంటల సీజనల్లో రసాయనిక ఎరువులు సరాఫరా అధికంగా జరిగే సమయాల్లో దొంగతనం జరుగుతుందని చెప్పుకుంటున్నారు. గూడ్స్ రైలు వచ్చి నిలిచిందనే సమాచారం తెలియగానే సూత్రదారులు తమ అనుచరులను రంగంలోకి దింపి రాత్రి సమయంలో చోరీలకు పాల్పడుతుంటారని ప్రయాణికులు సైతం చెబుతున్నారు. రైలు బోగిల్లోని బస్తాలను స్టేషన్ చివర్లో ఉన్న ముళ్ల పొదల్లో పడేసి గుట్టు చప్పుడు కాకుండా వాహనాల్లో తరలించి సమీప రైతులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. అయితే స్టేషన్ ఆవరణలోనే ఈ తతంగం అంతా జరుగుతున్నా రైల్వే సిబ్బందికి ఏ మాత్రమూ తెలియకపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దొంగతనం బయటకి రావద్దనే దాడి..? రైలులో నుంచి బస్తాల దొంగతనానికి పాల్పడుతున్న విషయం బయటకు పొక్కుతుందనే కారణంతోనే ఆత్రం రమేష్‌పై దాడి జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మండల కేంద్రానికి చెందిన గోగర్ల రమేష్‌తోపాటు మరో వ్యక్తి కలిసి ముందుగా ఆత్రం రమేష్ ఇంటికి వెళ్లి బస్తాల దొంగతనం విషయం చెప్పారు. దానికి నిరాకరించగా మద్యం ఆశ చూపి ఆయనను ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. ముగ్గురు కలిసి మద్యం సేవించిన అనంతరం రైలులో నుంచి బస్తాలను దొంగతనం చేద్దామని తెలపగా మరోసారి నిరాకరించటంతో ఇద్దరు కలిసి ఆత్రం రమేష్‌పై దాడికి పాల్పడినట్లు రైల్వే పోలీసులు చెబుతున్నారు. అప్పటికే రైలులో నుంచి బస్తాలను దొంగలించి స్టేషన్‌కు చివరల్లో ఉన్న ముళ్ల పొదల్లో పడేసి వాటిని తరలించేందుకు ఆత్రం రమేష్‌ను సహాయం కోరినట్లు సమాచారం. దొంగతనం విషయం బయటకు పొక్కుతుందనే అనుమానంతో ఆత్రం రమేష్‌పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన రమేష్ అపస్మారక స్థితికి చేరుకోవటంతో అక్కడి నుంచి జారుకున్నారు. బయటి వ్యక్తుల ద్వారా సమాచారం అందుకున్న రమేష్ కుటుంబ సభ్యులు స్టేషన్‌కు చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న రమేష్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. లోతుగా విచారిస్తే.. ఆత్రం రమేష్ మృతి కేసు రైల్వే పోలీసుల పరిధిలో ఉండగా, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని కేసులో అసలు నిందితులను గుర్తించి శిక్ష పడేలా చూడాలని గత శనివారం మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో రాస్తారోకో చేపట్టారు. దాంతో స్పందించిన కాగజ్‌నగర్ డీఎస్పీ వీవీఎస్ సుదీంద్ర కేసును రైల్వే పోలీసుల నుంచి తమ శాఖ పరిధిలోకి ట్రాన్స్ఫర్ చేయించుకుని విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అయితే ఈ కేసు విషయంలో కొంత మంది రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేసి నిందితులకు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. రమేష్ మృతికి ముందు నుంచే కొందరు రాజకీయ నాయకులు బాధితుడి కుటుంబ సభ్యులకు డబ్బులు ఎరగా చూపి కేసు వాపస్ తీసుకునేలా ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసుల విచారణలో దాడితో పాటు దొంగతనం వెనుక ఉన్న అసలు సూత్రదారులు బయటకు వస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తమదైన శైలిలో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి ఈ వ్యవహారంలో దాగి ఉన్న రహస్యాలను బయటకు తీయాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
పండుగకు పిలిచి మరీ చంపారు
సాక్షి, ఆదిలాబాద్ : కట్టుకున్న భార్య, బావమరుదులే కాలయములై ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కగూడలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బావను పండగ కోసం ఇంటికి పిలిచి హతమార్చారు. అంతవరకు బక్రీద్ ఆనందోత్సహాల్లో మునిగి తేలుతున్న కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆదిలాబాద్ టౌన్ సీఐ సురేష్ తెలిపిన వివరాలు ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కలగూడలో నివాసం ఉంటున్న షేక్ ఆసీఫ్ (26)కు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య సదాది కిన్వట్. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. అనంతరం ఫిర్దోస్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు ఉంది. ఫిర్దోస్, ఆసీఫ్ మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మొదటి భార్యను వదిలిపెట్టి తనతో ఉండాలని ఫిర్దోస్ ఆసీఫ్‌తో గొడవ పడుతుండేది. పట్టణ మహిళా పోలీస్‌స్టేషన్‌లో సైతం ఈ విషయంలో గతంలో కేసు నమోదయింది. సోమవారం బక్రీద్‌ను పురస్కరించుకుని రాత్రి 8.30 గంటల ప్రాంతంలో షేక్ ఆసీఫ్ బావమరుదులు సలీం, షారూఖ్ ఇంటికి పిలిచారు. మొదటి భార్యను వదిలేసి తమ సోదరితో కలిసి ఉండాలని కోరారు. ఈ తరుణంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి గొడవకు దారి తీసింది. దీంతో ఇరువురు బావమరుదులు ఆసీఫ్‌ను తీవ్రంగా కొట్టి, కత్తెరతో గుండెలో పొడిచారు. రక్తం మడుగులో ఆసీఫ్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించిన స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రిమ్స్ వైద్యులు పరిశీలించి ఆసీఫ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌లో భార్య ఫిర్దోస్, బావమరుదులు సలీం, షారూఖ్, మామ అజీం, అత్త హలీమా, మరదళ్లు నసీమ, హీనాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళను..
సాక్షి, అదిలాబాద్ : ఉద్యోగం ఇప్పిస్తానని మహిళకు మాయ మాటలు చెప్పి.. వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తికి అమ్మేసిన ఘటన కోమరం భీం జిల్లాలో చోటు చేసుకుంది. తిర్యాణి మండలం కొలం తెగకు చెందిన మతిస్థిమితం లేని గిరిజన మహిళను సమీప బంధువుతోపాటు ఓ వ్యక్తి మాయమాటలతో లొంగదీసుకొని మధ్యప్రదేశ్‌లోని మండ్పుర్ జిల్లాలోని ఓ వ్యక్తికి అమ్మేశారు. కూతురు కనబడటం లేదని మహిళ తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో, తన కూతురు ఎక్కడికి వెళ్లలేదని తండ్రిని మభ్యపెట్టారు. మహిళను మధ్యప్రదేశ్‌లో ఇంటి పనులకు వాడుకోవడమే కాకుండా.. శారీరకంగా నరకం చూపించడంతో తప్పించుకొని ఇంటికి చేరుకుంది. అనంతరం కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. నిందితులను పోలీసులు కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్ విధించింది. డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా అక్రమ రవాణాకు పాల్పడ్డ ముఠాను అరెస్టు చేశామని, నిందుతులకు శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. గిరిజన మహిళలు ఇలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
గల్ఫ్ శవ పేటికలపై అంబులెన్స్ సంస్థల దోపిడీ
సాక్షి, బోథ్: గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కార్మికుల శవపేటికల్ని స్వగ్రామానికి రవాణా చేయడానికి అంబులెన్స్ సంస్థలు అందిన కాడికి బాధితుల నుంచి దోచుకుంటున్నాయి. గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలు, ప్రమాదాలలో చనిపోయిన వలస కార్మికుల శవాలు స్వగ్రామానికి రావడానికి నెలల తరబడి వేచి చూస్తున్న కుటుంబాల బలహీనతలు ఆసరా చేసుకొని అంబులెన్స్‌ల నిర్వాహకులు అందిన కాడికి దండుకుంటూ డబ్బుల దందా కొనసాగిస్తున్నారు. అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామానికి చెందిన హరీష్ అనే బాధిత కుటుంబ సభ్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన జలెందర్(38) ఉపాధి కోసం మూడు సంవత్సరాల క్రితం బహ్రెయిన్‌కు వెళ్లాడు. ఈ నెల 1వ తేదీన ప్రమాదవశాత్తు బాత్రూంలో కాలుజారి పడడంతో తలకు బలమైన గాయాలు అయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అక్కడి కంపెనీ వారు ఈ నెల 3వ తేదీన జలెందర్ శవపేటికను హైదరాబాద్‌కు పంపారు. ఆధికారులు మృతుని అన్న కుమారుడు హరీష్‌కుమార్‌కు శవపేటికను అప్పగించి, ఉచిత అంబులెన్స్‌లో సాగనంపారు. హైదరాబాద్ నుంచి శవపేటికతో వెళ్లిన అంబులెన్స్‌లో నుంచి శవాన్ని గ్రామాస్థులు దించుకున్నారు. ప్రభుత్వానికి కిరాయికి సరఫరా చేసే శ్రీసాయి అంబులెన్స్ సర్వీసెస్ డ్రైవర్ జలెందర్ బంధువుల నుంచి బలవంతంగా రూ. 1500 వసూలు చేశాడు. మరుసటి రోజు విషయం తెలుసుకున్న హరీష్ కేసీఆర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అంబులెన్స్ సర్వీసు సంస్థ ప్రతినిధి గూగుల్ పేలో డబ్బు వాపస్ ఇచ్చినట్లు హరీష్‌కుమార్ తెలిపారు. -
ముగ్గురిని మింగిన బావి పూడ్చివేత
సాక్షి, సిర్పూర్: కౌటాల మండలంలోని ముత్తంపేట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కారెం మహేష్, గాదిరెడ్డి రాకేష్, మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండలంలోని శికిరం గ్రామానికి చెందిన సొక్కల శ్రీనివాస్‌లు బావిలో దిగి ఊపిరాడక బుధవారం మృతి చెందారు. ఆరుగంటల పాటు అధికారులు శ్రమించి జేసీబీ, ప్రోక్లియిన్‌లతో బావి చూట్టు తవ్వకాలు జరిపారు. బావిలో ఆక్సిజన్ నింపి బావిలోకి దిగి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం బావి చుట్టూ తవ్విన మట్టిని జేసీబీల సహాయంతో పూడ్చివేశారు. రాత్రి కావడంతో పూర్తిగా పూడ్చివేత పనులు నిర్వహించలేదు. బావిని పూర్తిగా పూడ్చివేస్తామని అధికారులు తెలిపారు. కంటతడి పెట్టిన ముత్తంపేట ముత్తంపేట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బంధువులు బావిలో దిగి మృతి చెందడంతో గ్రామంలోని యువకులు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. బావిలో దిగి ముగ్గురు మృతి చెందిన వార్త మండలంలో సంచలనం రేపడంతో గురువారం ఉదయం యువకుల అంత్యక్రియల్లో మండలంలోని ఆయా గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చి వారి మృతదేహాలకు నివాళ్లు అర్పించారు. ఇద్దరు యువకుల మృతదేహాలకు ఒకేసారి గ్రామంలో చివరి అంతిమ యాత్ర నిర్వహించడంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. అందరితో కలిసి మెలిసి ఉండే యువకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు బోరునా విలపించారు. -
వీళ్లూ మనుషులు కాదు మృగాళ్లు..
పట్టుమని పదినెలలు కూడా లేని చిన్నారి. తన చిరునవ్వులతో ఇంటిల్లిపాదిని అలరించేది. ఒక్కక్షణం కూడా ఆ బంగారుతల్లిని విడిచి ఉండలేం.. అలాంటి ముద్దులొలికే చిట్టితల్లి ఓ రాక్షసుడి చేతిలో బలైంది. తల్లిపక్కన వెచ్చగా ఒదిగి పడుకున్న బంగారుతల్లిని ఎత్తుకెళ్లిన కిరాతకుడు మాటల్లో చెప్పలేని విధంగా మట్టుబెట్టాడు. వరంగల్‌లో జరిగిన చిన్నారి ఘటన జిల్లావాసులనూ కంటతడి పెట్టించింది. సరిగ్గా ఏడాదిక్రితం జిల్లాలోని సోన్‌లో ఓ చిట్టితల్లిపై జరిగిన దారుణాన్ని మరోసారి గుర్తుకు తెచ్చింది. నిర్మల్: ఈ మధ్య వరుసగా చిన్నారులు, మహిళలపై జరుగుతున్న దారుణాలపై సమాజం కలతచెందుతోంది. ‘అసలు వీళ్లు మనుషులేనా.. వీరికి మానవత్వం లేదా..’ అంటూ నిందితులపై ఆక్రోషం వెల్లగక్కుతోంది. సోషల్ మీడియా వేదికగా కారకులను అంతే కిరాతకంగా శిక్షించాలంటూ తమలోని ఆక్రందనను వ్యక్తంచేస్తోంది. మరోవైపు స్మార్ట్‌ఫోన్‌కు బానిసైన యువత అశ్లీల చిత్రాలను చూస్తూ.. కన్నుమిన్ను కానకుండా కామాంధులుగా తయారవుతున్నారని ఆందోళన చెందుతోంది. జిల్లాలో ఏడాదిక్రితం.. బడికి సెలవొచ్చిందని.. తన స్నేహితురాలి ఇంటికి ఆడుకోవడానికి వెళ్లిన ఓ చిన్నారి ఓ మృగాడి బారిన పడింది. తన స్నేహితురాలి మామ కావడంతో తానూ ‘మామా..’ అనే ప్రేమగా పిలిచింది. కానీ.. ఆ దుర్మార్గుడు అప్పటికే అశ్లీల దృశ్యాలు చూడటానికి బానిసయ్యాడు. వాటి ప్రభావంతో మృగాడిగా మారాడు. చిన్నారి అని కూడా చూడకుండా పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి తనపై లైంగికదాడికి పాల్పడ్డాడు. తన గురించి ఎక్కడ చెబుతుందోనని ఇటుక రాయితో ముఖంపై దాడిచేసి, దారుణంగా చంపేశాడు. ఇదంతా గతేడాది ఇదేనెల 16న సోన్ మండల కేంద్రంలో జరిగిన ఘటన. తమ ముందు ఆడుతూపాడుతూ తిరిగిన చిన్నితల్లి విగతజీవిగా మారడంతో సోన్ ఊరంతా ఆరోజు ఆగ్రహంతో ఊగిపోయింది. గతంలో పలు ఘటనలు.. జిల్లాలోనూ గతంలో అభంశుభం తెలియని చిన్నారులపై లైంగికదాడులు జరిగిన ఘటనలు ఉన్నాయి. వావివరసలు లేకుండా.. తాత వయసున్న ‘మృగాడు’ ఓ చిన్నారిపై అఘాయిత్యం చేశాడు. గత ఏప్రిల్ 7న సోన్ మండలకేంద్రంలోనే ఎనిమిదేండ్ల బాలికపై యాభయ్యేళ్ల వృద్ధుడు బాలయ్య లైంగిక దాడికి పాల్పడ్డాడు. రాత్రిపూట ఇంట్లో అందరూ పెళ్లి సందడిలో ఉండగా చిన్నారిపై అఘాయిత్యం చేశాడు. చాక్లెట్లు ఇస్తానని మాయమాటలు చెప్పడంతో నమ్మి వచ్చిన చిన్నారికి ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. రెండేళ్ల కిందట లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్‌లో రెండున్నరేళ్ల చిన్నారిపై సతీశ్ అనే యువకుడు లైంగికదాడికి యత్నించాడు. 2014 ఆగస్టులో సారంగపూర్ మండలంలోని ధనిలో శ్రీకాంత్ అనే యువకుడు ఆరేళ్ల్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గతేడాది దిలావర్పూర్ మండలకేంద్రంలో ఓ కిరాణ దుకాణాన్ని నడిపించే వ్యక్తి కుమారుడైన బాలుడు ఓ చిన్నారిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో పోలీసులు బాలుడిని అరెస్టు చేశారు. ఊరికి పెద్దగా.. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి ఆదుకోవాల్సిన వాళ్లే నయవంచకులుగా మారిన ఘటనలూ చోటుచేసుకున్నాయి. ఓ ఆడపిల్ల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని లక్ష్మణచాంద మండలంలో ఓ సర్పంచ్ లైంగిక దాడికి పాల్పడి జైలుకు వెళ్లాడు. ఇక లోకేశ్వరం మండలానికి చెందిన ఓ నాయకుడు తనకు సహకరించని యువతులపై వేధింపులకు దిగాడు. యువతులు, మహిళలపై వేధింపులు జిల్లాలో చిన్నారులతో పాటు యువతులు, మహిళలు, ఉద్యోగినులపై వేధింపులు పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి చదువుకోవడానికి, ఉపాధి కోసం వస్తున్న యువతులే లక్ష్యంగా జిల్లాకేంద్రంలో వేధింపులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా బస్టాండ్ ప్రాంతంలో మహిళలు, యువతులతో అసభ్యకరంగా మాట్లాడుతూ.. సైగలు చేస్తూ.. వేధిస్తున్న ఘటనలు చాలాసార్లు బయటపడ్డాయి. బతుకుదెరువు కోసం దుకాణాల్లో పనిచేస్తున్న యువతులతోనూ ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కళాశాలల్లో చదువులు చెప్పాల్సిన అధ్యాపకుల్లోనూ కొందరు మృగాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాకేంద్రంలోని ఓ కళాశాలలో, ఓ పాఠశాలలో గతేడాది జరిగిన ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేశాయి. ఒకట్రెండు శాఖల్లో మృగాళ్ల చేష్టలు భరించలేక ఉద్యోగం మానేయడం, బదిలీ చేయించుకోవడం వంటివీ జరిగాయి. చాలామంది పోలీసులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. మళ్లీ తమ పరువే పోతుందన్న భయంతో బయటకు రావడం లేదు. షీటీమ్‌లు ఎక్కడ? మహిళలపై ఈవ్‌టీజింగ్, దాడులను నిరోధించడానికి రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌శాఖ షీటీమ్‌లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇవి జిల్లాకేంద్రానికి మాత్రమే పరిమితమయ్యాయి. ఇందులోనూ సరిపడా సిబ్బంది లేకపోవడంతో అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయి. తరచూ విద్యార్థినులు, యువతులకు అవగాహన కార్యక్రమాలను చేపట్టాల్సి ఉన్నా.. అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విద్యాసంవత్సరం ప్రారంభమైనందున కళాశాలలు, విద్యాలయాల్లో విద్యార్థినులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. సఖీ కేంద్రాన్ని సంప్రదించాలి మహిళలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడటం చట్టరీత్యా నేరం. ఇలాంటి ఘటనల్లోని బాధితులు నేరుగా సఖి కేంద్రాన్ని సంప్రదించవచ్చు. చాలామంది పోలీసుల వద్దకు వెళ్లి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా మహిళల స్వేచ్ఛ, హక్కులు, రక్షణ కోసం సఖి కేంద్రం కృషిచేస్తుంది. సమస్యను నేరుగా చెప్పడానికి ఇబ్బంది పడేవారు టోల్ ఫ్రీ నంబర్ 181 లేదా సఖి కేంద్రం 85005 40181 నంబరులో సంప్రదించవచ్చు. – మమత, సఖీ కేంద్రం నిర్వాహకురాలు,నిర్మల్ -
ఫెయిల్ అవుతానన్న బెంగతో ఆత్మహత్య
కాగజ్‌నగర్: పరీక్షలో ఫెయిల్ అవుతానన్న బెంగతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కాగజ్‌నగర్‌లో చోటు చేసుకుంది. సీఐ తెల్లబోయిన కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన మహ్మద్ అన్వర్, అంజుమ్‌బేగం దంపతుల కుమార్తె ఫిజా ఫిర్దౌజ్(15) స్థానిక వీఐపీ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది. మార్చిలో వార్షిక పరీక్షలు రాసిన ఫిర్దౌజ్ ఫలితాల కోసం వేచిచూస్తోంది. కాగా రెండు రో జులుగా పరీక్షలు బాగా రాయలేదని ఆందోళన చెందుతుంది. ఈ భయంతో మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఫిజా ఫిర్దౌజ్ బాత్రూంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అన్వర్ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. పెద్దబ్బాయి అమాన్ హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతుండగా రెండోబ్బాయి నౌమాన్ కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, కూతురు ఫిజా ఫిర్దౌజ్ పదో తరగతి పూర్తిచేసింది. వార్షిక పరీక్షలు సక్రమంగా రాయలేదని గత రెండు రోజులుగా బెంగతో ఉందని కుటుంబీకులు తెలిపారు. పరీక్షలో ఫెయిల్ అవుతానేమోనని మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు వేకువ జామున సహెర్ చేసి ఉపవాస దీక్ష పట్టి మళ్లీ నిద్రపోయారు. అయితే 9 గంటల ప్రాంతంలో ఫిర్దౌజ్ బాత్రూమ్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బాత్రూం నుంచి పోగలు రావడంతో కుటుంబీకులు వెళ్లి చూసేసరికి పూర్తిగా కాలిపోయింది. పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ సీఐ కిరణ్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాలిక తండ్రి అన్వర్ ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. -
అనుమానమే పెనుభూతమై..
రెబ్బెన(ఆసిఫాబాద్): కట్టుకున్న భార్యపై ఉన్న అనుమానానికి తోడు అదనపు కట్నంకోసం జీవితాంతం తోడుగా నిలవాల్చిన భర్తే భార్యను కడతేర్చిన సంఘటన రెబ్బెన మండలం నారాయణపూర్‌లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నారాయణపూర్ గ్రామానికి చెందిన కుడికాలు రామకృష్ణ ఆటోడ్రైవర్. ఈయనకు తాండూర్ మండలం కాసిపేట గ్రామానికి చెందిన సరిత (27)తో 2011లో వివాహమైంది. వీరికి అరవింద్ (7), శ్రీనిధి(5) పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగింది. రెండేళ్లుగా రామకృష్ణ భార్య సరితపై అనుమానం పెంచుకున్నాడు. అప్పటినుంచి కలహాలు ఏర్పడ్డాయి. ఈక్రమంలోనే రామకృష్ణ తల్లి కమల, తండ్రి హన్మంతుతో కలిసి సరితను అదనపు కట్నంకోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. నారాయణపూర్ గ్రామంలో సరిత పేరుపై రెండెకరాల వ్యవసాయ భూమి ఉండగా.. దానిని అమ్మాలని ఒత్తిడి తెచ్చారు. దానికి సరిత ససేమిరా అనటంతో వేధింపులు మరింత అధికమయ్యాయి. దీంతో ఎలాగైనా సరితను అంతమొందించాలనే పథకం పన్నిన రామకృష్ణ.. తల్లిదండ్రుల ప్రోద్బలంతో బుధవారం అర్ధరాత్రి ఇంట్లో పడుకుని ఉన్న సరిత తలపై బలమైన ఆయుధంతో మోదడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. రెబ్బెన సీఐ రమణమూర్తి, ఆసిఫాబాద్ సీఐ మల్లయ్య, ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి తమ్ముడు ములుకుట్ల లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏమైపోయారో?
ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగిరావడం లేదు. నెలలు..సంవత్సరాలైన వారి జాడ తెలియడం లేదు. అసలు బతికున్నాడో..మరే ప్రమాదంలో చిక్కుకున్నాడో అంతుపట్టడం లేదు. ఇలా అదృశ్యమైన వ్యక్తుల్లో అధికంగా మహిళలే ఉంటున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా తప్పిపోయిన వారి ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు. ఏళ్ల తరబడి వీరి జాడ తెలియక అయిన వా రు మానసిక వేదనకు గురవుతున్నారు. మంచిర్యాలక్రైం: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిస్సింగ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తప్పిపోయిన వారిలో కొంతమంది ఆచూకీ దొరుకుతుండగా.. మరికొంత మంది ఏమైపోతున్నారో తెలియడం లేదు. 2016 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,502 మంది తప్పిపోగా ఆయా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,502 మంది అదృశ్యం కాగా 1,379 మంది దొరికారు. ఇంకా 123 మంది ఆచూకీ లభించక ఆ కుటుంబాలు తీరని క్షోభను అనుభవిస్తున్నాయి. అదృశ్యమైన వారిలో చిన్నారుల నుంచి యువత వరకు ఉన్నారు. ఇందులో 18 ఏళ్లలోపు బాలబాలికలు అక్రమ రవాణాకు గురవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధిక శాతం మహిళా మిస్సింగ్ కేసులు నమోదు కావడం గమనార్హం. కారణమేదైనా జిల్లాలో మిస్సింగ్ కేసులు పెరిగిపోవడం కలకలం రేపుతోంది. ఇటీవల భద్రాద్రి జిల్లాలోని హాజీపూర్ ఘటనతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. వివాహం చేసుకుంటున్నారు.. యువతుల మిస్సింగ్ కేసుల్లో చాలా మట్టుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నవే అధికంగా ఉంటున్నాయి. సాధారణంగా యువతులు ఆదృశ్యమైనప్పుడు వారి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెడుతుంటారు. ఇలాంటి చాలా కేసుల్లో యువత కొన్ని నెలల తర్వాత ప్రేమ వివాహం చేసుకొని జంటలుగా తిరిగివస్తున్నారు. యువతి మైనర్ తీరిన పక్షంలో ఆమె వాంగ్మూలం తీసుకొని ఆ కేసులను కొట్టివేస్తారు. కాగా మరికొంత మంది యువతుల ఆచూకీ మాత్రం దొరకడం లేదు. వీరు కూడా ఏదైనా ప్రేమ వివాహం చేసుకున్నారా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మూడున్నర ఏళ్లలో మహిళల మిస్సింగ్ కేసులే అధికంగా నమోదవుతున్నాయి. మొత్తం 1,502 మిస్సింగ్ కేసులు నమోదు కాగా, ఇందులో సుమారు 600లకుపైగా మహిళలు అదృశ్యమయ్యారు. కొందరుల ప్రేమ పేరుతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకొని తిరిగి వచ్చిన సంఘటనలూ ఉన్నాయి. ఇలా ఇందులో 500మంది ఆచూకీ లభించింది. ఇంకా 100 మంది మహిళల ఆదృశ్యం మిస్టరిగానే మిగిలిపోయింది. ఏదేమైనా చేతికందిన పిల్లలు కనిపించకుండా పోతున్నారనే బాధ తల్లిదండ్రులను వేధిస్తోంది. ఒక వేళా అదృశ్యమై పెళ్లిళ్లు చేసుకున్నా ఇంటికి రాకుండా బయటనే ఉండే పిల్లల గురించి తెలియక తల్లితండ్రులు.. వారు ఏమయ్యారనే ఆవేదనకు గురవుతున్నారు. పిల్లల అక్రమ రవాణా.. ఉమ్మడి జిల్లాలో అదృశ్యమైన కేసులను బట్టి చూస్తే మనుషుల అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతోందని తెలుసుస్తోంది. అదృశ్యమైన 18 ఏళ్లలోపు పిల్లలు అక్రమ రవాణాకు గురవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో చిన్న పిల్లలను అపహరించడమే లక్ష్యంగా కొన్ని ముఠాలు ఇటీవల తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పసి పిల్లలకు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లి ముంబై, నాగ్‌పూర్, హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. బాలబాలికల్లో కొంతమంది తల్లిదండ్రుల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యంతోనే ఇంటిని విడిచి వెళ్లిపోగా.. మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి కార్మిక పనులు చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల, ఆదిలాబాద్, ఉట్నూర్, కెరమెరి, నిర్మల్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, చెన్నూర్ వంటి పట్టణాల నుంచి మనుషుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. అదృశ్యమైన మహిళలను రాజస్థాన్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి కొంత మందిని లైంగిక వేధింపులకు గురి చేస్తూ తిరిగి వదిలేయడం, మరికొంత మందిని వ్యభిచార గృహాలకు తరలించడం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన అమాయక మహిళలకు డబ్బు ఏరగా వేసి ఇలాంటి పడుపు రొంపిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. పోలీస్స్టేషన్లలో మిస్సింగ్ కింద నమోదు చేసిన చాలా కేసుల్లో ఇంకా ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. చిన్నపిల్లలు అదృశ్యమై ఎంత వెతికినా దొరకని కేసులపై సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మచ్చుకు కొన్ని సంఘటనలు æ మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్‌కు చెందిన ఓ బాలిక( 18) తమకు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉచుకొని దగ్గరి బందువైన ఓ యువకునికి తెలిసిన వారి ఇంట్లో పని చేసేందుకని 2014 డిసెంబర్ 21న హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సదరు యువతి, యువకుడు కనిపించకుండా పోయారు. కొంత కాలం వేతికి ఎక్కడ ఆచుకి లభించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. æ 2018 అక్టోబర్ 14న మంచిర్యాల గోదావరిలో రైల్వే బ్రిడ్జి కింద గుర్తుతెలియని కుళ్లిపోయిన మృతదేహం లభించింది. తలకు తీవ్రమైన గాయం ఉండడంతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 6 నెలలు అవుతున్న మృతి చెందిన వ్యక్తి ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? ఎవరు హత్య చేసి ఉంటారు అనేది ఇంక మిస్టరీగానే మిగిలిపోయింది. మిస్సింగ్ కేసులపైదృష్టి సారిస్తాం జిల్లాలో మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. మంచిర్యాల జిల్లాలోని పోలీస్ అధికారులతో సమావేశమై ఈ కేసులపై చర్చిస్తాం. ఇప్పటికే సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అన్ని కేసుల్లో దృష్టి సారిస్తున్నారు. మిస్సింగ్ కేసుల్లో పురోగతి సాధించేందుకు, వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఆధారంగా ఇతర రాష్ట్రాల్లోనూ, జిల్లాలోని పోలీస్స్టేషన్లలో సమాచారం అందించి చర్యలు తీసుకుంటాం. మంచిర్యాల జిల్లాలో మహిళల అక్రమ రవాణా ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీçసులకు సమాచారం అందించాలి. 100 కాల్ చేస్తే పోలీసులు క్షణాల్లో ఘటన స్థలానికి చేరుకుంటారు. – రక్షిత కే మూర్తి, డీసీపీ, మంచిర్యాల -
ప్రేమ వేధింపులకు బాలిక బలి
మంచిర్యాలక్రైం: ప్రేమికుని వేధింపులు భరించలేక ఓ బాలిక (17) తీవ్ర మనస్థాపానికి గురై సోమవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిని బూర్ల రాజయ్య, స్వరూప దంపతుల కూతురు సంధ్యకు అదే గ్రామానికి చెందిన ఎండీ.అక్బర్ కొంతకాలం క్రితం పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకుందామంటూ వెంట పడుతున్నాడు. ఏడాదిన్నర క్రితం సంధ్య సీసీసీ నస్పూర్‌లో ఉంటున్న చిన్నమ్మ ఇంటికెళ్లింది. ఆ సమయంలో అక్బర్ సంధ్యను కిడ్నాప్ చేశాడు. ఈ విషయంలో అక్బర్‌పై సీసీసీ పోలీస్‌స్టేషన్‌లో నాన్‌బెయిలేబుల్ కేసు నమోదైంది. అక్బర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అక్బర్‌ను మరిచిపోవాలని కుటుంబసభ్యులు సంధ్యకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మూడు నెలల జైలుశిక్ష అనంతరం బెయిల్‌పై వచ్చిన అక్బర్.. సంధ్యను వివాహం చేసుకుంటానంటూ మళ్లీ వేధించసాగాడు. అతడి వేధింపులు భరించలేని సంధ్య కుటుంబం ఇటీవల మంచిర్యాలలోని సున్నంబట్టివాడకు మకాం మార్చారు. అయినా అక్బర్ నుంచి వేధింపులు ఆగలేదు. ఇటీవల ఇంటికి వెళ్లి సంధ్యను తానే పెళ్లి చేసుకుంటానని, తనను కాదని ఎవరు చేసుకున్నా వారి అంతుచూస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంధ్య బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబస భ్యుల ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తు న్నట్లు మంచి ర్యాల ఎస్సై ఓంకార్‌యాదవ్ తెలిపారు. -
నయా మోసగాళ్లు!
బెల్లంపల్లి: జనాల్లో ఉన్న మూఢనమ్మకాలే ఆ యుధంగా ఓ ముఠా టోపీ పెట్టేందుకు సిద్ధమైంది. ‘మరుగుమందు విక్రయం’ అంటూ పన్నాగం పన్నింది. కానీ, పోలీసుల అప్రమత్తతతో ఆ న యా మోసగాళ్ల వ్యూహం బెడిసికొట్టింది. కట్ చేస్తే.. ఆ ముఠా కటకటాలపాలైంది. ఈ సంఘటన వివరాలను బెల్లంపల్లి ఏసీపీ వి.బాలు జాదవ్ గురువారం రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇలా వెల్లడించారు. మరుగుమందు పేరుతో కొందరు జనాలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకు సమాచారమందింది. దీంతో రామగుండం టాస్క్‌ఫోర్స్ సీఐ సాగర్ టీమ్‌తోపాటు తాళ్లగురిజాల పోలీసులు సంయుక్తంగా బెల్లంపల్లి మండలం దుగినేపల్లి గ్రామ శివారులోని ఓ మామిడితోటలో బుధవారం ఆకస్మిక దాడి చేశారు. తోటలో మరుగుమందును అమ్మడానికి ప్రయత్నిస్తున్న తుమ్మిడ మల్లేష్ (చిన్న రాస్పల్లి, దహెగాం మండలం), ఎలుకారి అంజన్న(చిన్న రాస్పెల్లి, దహెగాం మండలం), చింతకింది రమేష్ (నవభారత్కాలనీ, రామకృష్ణాపూర్), పాగిడి మధుకర్ (దుగినేపల్లి, బెల్లంపల్లి), కొండగొర్ల రాజేష్(జన్కాపూర్, కన్నెపల్లి మండలం), జాడి స్వామి (బొప్పారం, నెన్నెల మండలం), కరెకొండ రామన్న(బొప్పారం, నెన్నెల మండలం), జావీద్ (ఐబీ, తాండూర్ మండలం), వొడ్నాల సాయివిజయ్( 24 డీప్ ఏరియా, బెల్లంపల్లి మున్సిపాలిటీ), టేకం గంగు (మాలగొండి, ఆసిఫాబాద్)ను అరెస్టు చేసినట్లు ఏసీపీ వివరించారు. వారి నుంచి చెట్ల పసరు సీసాలు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పన్నాగమేమిటంటే.. ఈ మోసగాళ్లు తాము తయారు చేసిన మందును ముందు కోడిపై ప్రయోగిస్తారు. అప్పుడు మందు రాసినవారు చెప్పినట్లు నడుచుకుంటుందని నమ్మిస్తారు. ఆ తర్వాత ఈ కుట్రను తమ ప్రయోగంగా చెప్పుకుంటూ మందును ప్రజలకు అమ్ముతారు. అంటే, మనుషులకు కూడా ఈ మందు రాస్తే.. రాసినవారి చుట్టూ రాయించుకున్న వారు తిరుగుతారని నమ్మిస్తారు. ఇలా నమ్మించి మందును అమ్మి కోట్లలో దండుకోవడమే వారి వ్యూహం. కేవలం ప్రజల నమ్మకాలను ఆసరా చేసుకుని సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే దురుద్దేశంతో మరుగుమందు పేరుతో సదరు ముఠా ఈ పథక రచన చేసినట్లు ఏసీపీ వివరించారు. మూఢనమ్మకాలు వీడాలి.. మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని, ప్రజలు నమ్మినంతా కాలం ఇలాంటి నయా మోసగాళ్లు పుడుతూనే ఉంటారని, ఇప్పటికైనా వీరితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే పోలీసులకు తెలపాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీపీ పేర్కొన్నారు. ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ సీఐ సాగర్, కానిస్టేబుళ్లు రాజేందర్, దేవేందర్, శేఖర్, సదానందం, హోంగార్డులు హైదర్, మహాంకాళితోపాటు తాళ్లగురిజాల పోలీసులు పాల్గొన్నారని తెలిపారు. పట్టుబడ్డ నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి రూరల్ సీఐ అల్లం నరేందర్, తాళ్ల గురిజాల ఎస్సై సీహెచ్.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. బాలుజాదవ్, ఏసీపీ -
బైక్ అదుపు తప్పి ఇద్దరు మృతి
ఆదిలాబాద్‌రూరల్: కార్యాలయ విధులు ముగించుకొని ఇంటికి వస్తున్నామని చెప్పిన యువకులు బైక్ అదుపు తప్పి దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ రూరల్ ఎస్సై హరిబాబు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. బేల మండలకేంద్రానికి చెందిన జిలిపెల్లివార్ శుభం (25), అదే మండలం మనీయర్‌పూర్‌కి చెందిన తన మిత్రుడు మునేశ్వర్ దినేశ్ (27)తో కలిసి మంగళవారం శుభం ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్‌కు వచ్చారు. ఇద్దరు మిషన్ భగీరథలో ఉద్యోగం చేస్తున్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లో భగీరథపై జరిగిన సమావేశం ముగించుకొని బేలకు వస్తుండగా చాందా (టి) శివారు ప్రాంతంలోని వంతెన వద్ద బైక్ అదుపు తప్పి వంతెన కింద పడిపోయారని తెలుస్తోంది. ఇద్దరి తలకు తీవ్రగాయాలుకావడంతో అక్కడిక్కడే మృతిచెందారు. బుధవారం అటువైపు వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులకు మృతదేహాలు కనిపించడంతో ఆరా తీయగా బేల మండల యువకులుగా గుర్తించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. శుభం తండ్రి సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా ఇద్దరు యువకుల తల్లులు అంగన్వాడీ టీచర్లుగా పని చేస్తున్నారు. యువకుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే రామన్న సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
ప్రియురాలి మరణం తట్టుకోలేక..
వాంకిడి(ఆసిఫాబాద్): ఇంట్లో పెద్దలు ప్రేమకు ఒప్పుకోలేదని తీవ్ర మనస్థాపానికి గురై ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడగా.. అది చూసి ప్రియుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన వాంకిడి మండలంలోని మహాగాంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్సెంగ్ గౌరుబాయి(18) అదే గ్రామానికి చెందిన మడపచ్చి భరత్(22) ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు వరుసకు బావమరుదళ్లు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో గౌరుబాయిని తల్లిదండ్రులు ఇటీవల మందలించారు. అప్పటి నుంచి మనస్థాపానికి గురైన గౌరుబాయి తన ప్రేమకు తల్లిదండ్రులు ఇక ఒప్పుకోరన్న బాధతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. ఇంటి పక్కవారు గమనించి మహారాష్ట్రలోని చికిలి పాటన్ గ్రామానికి చెందిన గౌరుబాయి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆసిఫాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో గౌరుబాయి మృతిచెందింది. బహిర్భూమికి వెళ్లి ప్రియుడు.. ప్రియురాలి మరణ వార్త తెలుసుకున్న ప్రియుడు మడపచ్చి భరత్(22) శనివారం ఉదయం బహిర్భూమికి అని వెళ్లి ఇంటి పక్కనే గల చేనులో పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. అప్పటికే భరత్ స్పృహా కోల్పోతున్న భరత్ జరిగిన విషయాన్ని అన్నయ్య తిరుపతికి చెప్పాడు. దీంతో వెంటనే భరత్‌ను వాంకిడి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఆసిఫాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో భరత్ కూడా మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. చిన్న వయసులోనే ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాదచాయలు కమ్ముకున్నాయి. ఇరువైపులా కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. -
వేటగాళ్ల ఉచ్చుకు బలైన పులి
మంచిర్యాలఅర్బన్(చెన్నూర్): జాతీయ జంతువు, అత్యంత అరుదైన జాతికి చెందిన రాయల్ బెంగాల్ టైగర్ వేటగాళ్ల ఉచ్చుకు బలైంది. వన్యప్రాణుల వేట కోసం అమర్చిన ఉచ్చుకు తగిలి నేలకొరిగింది. మందమర్రిలో స్వాధీనం చేసుకున్న పులి చర్మానికి సంబంధించిన చిక్కుముడి వీడింది. చెన్నూర్ అటవీ డివిజన్ శివ్వారం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన పులి అవశేషాల(కళేబరం)ను శుక్రవారం కనుగొన్నారు. గత మూడు రోజులుగా మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ, అటవీశాఖ సంయుక్తంగా దాడి నిర్వహించి మందమర్రి రామన్‌కాలనీలో గురువారం పులిచర్మాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పులి చర్మం విక్రయించే ముఠాకు చెందిన పెద్దపల్లి జిల్లా రామరావుపేట్కు చెందిన నర్సయ్యతోపాటు ముగ్గురిని, చర్మం, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకుని మంచిర్యాల అటవీశాఖ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. శుక్రవారం పోలీసు టాస్క్‌పోర్సు, అటవీశాఖ అధికారులు శివ్వారం గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో పులి మృతి విషయం వెలుగుచూసింది. పులి చనిపోయిన సంఘటన స్థలానికి వెళ్లి చూడగా కళేబరం పూర్తిగా కుళ్లిపోయి కనిపించింది. పక్షం రోజుల క్రితం అటవీ జంతువుల కోసం విద్యుత్ తీగలు అమర్చగా మరో వన్యప్రాణిని తరుముకుంటూ వచ్చి పులి విద్యుత్ షాక్‌తో మృతిచెందినట్లు నిందితుడు చెబుతున్నాడని అటవీ అధికారులు తెలిపారు. దుండగులు విలువైన పెద్దపులి చర్మాన్ని, గోళ్లను తీసుకుని అటవీ ప్రాంతంలో కళేబరాన్ని వదిలి వెళ్లారు. ఇదే కేసులో శివ్వారం గ్రామానికి చెందిన మల్లయ్య, బుచ్చిరాజయ్యలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరిఖనికి చెందిన టాక్సీ డ్రైవర్‌తోపాటు మొత్తం ఎనిమిది మంది పాత్ర ఉన్నట్లు అటవీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం అటవీశాఖ అదుపులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ పులి చనిపోయిన సంఘటన స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, డీసీపీ వేణుగోపాల్, అడిషనల్ డీసీపీ రవికుమార్, మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారి రామలింగం, మంచిర్యాల ఎఫ్‌డీవో వెంకటేశ్వరావు శుక్రవారం రాత్రి పరిశీలించారు. పదిహేను రోజుల క్రితం పులి చనిపోయిందని భావిస్తున్నట్లు మంచిర్యాల ఎఫ్‌డీవో వెంకటేశ్వరావు తెలిపారు. నాలుగేళ్ల వయస్సు కలిగి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పశువైద్యులతో పులి కొంత భాగాన్ని కత్తిరించి పులికి సంబం«ధించిన పూర్తి వివరాల సేకరణకు ఫోరెనిక్స్ ల్యాబ్, సీసీఎంబీలకు పంపిస్తామని తెలిపారు. ఇంకా కేసుపై విచారణ సాగుతోందని, రెండు మూడు రోజుల్లో అన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్, అటవీశాఖ సంయుక్తంగా పెద్దపులి మరణంపై విచారణ చేపడుతున్నట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. పెద్దపులి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అటవీ ప్రాంతంలో ఉందా లేదా అన్న అంశాలపై విచారణ చేపట్టి కీలకమైన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నాలుగేళ్ల వయస్సు గల పెద్దపులి 12నుంచి 13 ఫీట్ల పొడవు ఉందని, దీనికి మార్కెట్లో విలువ ఉంటుందని భావించిన దుండగులు చర్మం, గోళ్లు తీసుకున్నారని తెలిపారు. విద్యుత్ ఉచ్చులతో చనిపోతే హత్య కేసులుగా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో తొమ్మిది మంది దుండగులను గుర్తించగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో మెడికో దుర్మరణం
నార్కట్‌పల్లి(నకిరేకల్): రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్ర ంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏపీలింగోటం శివారులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన స్రవంతి(25), హైదరాబాద్‌కు చెందిన రమ్య, నాగజ్యోతి ఇక్కడి కామినేని వైద్యకళాశాలలో హౌస్ సర్జన్ విద్య అభ్యసిస్తూ హాస్టల్లో ఉంటున్నారు. ఆదివారం కావడంతో ఉదయం టిఫిన్ చేసేందుకు ముగ్గురు కలిసి హాస్టల్ నుంచి స్కూ టీపై సమీపంలోనే ఉన్న ఏపీ లింగోటం గ్రామాని కి వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో టిఫిన్ చేసిన తర్వాత స్కూటీపై సూర్యాపేట వైపు బయలుదేరారు. మరో కిలోమీటర్ దూరంలో యూటర్న్ తీసుకుని హాస్టల్‌కు వచ్చేందుకు ప్రయాణిస్తున్నా రు. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న గుర్తుతెలి యని వాహనం వీరి స్కూటీని వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో స్రవంతి డివైడర్‌పై పడింది. స్రవంతి తలకు బలమైన గాయం తగిలింది. స్థానికులు గమనించి వెంటనే 108లో కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి స్రవంతి మృతిచెందింది. నాగజ్యోతి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబా ద్‌కు తరలించారు. రమ్య ప్రస్తుతం కామినేని ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. ఇచ్చోడలో విషాదచాయలు.. ఇచ్చోడ(బోథ్): ఇచ్చోడ టీచర్స్ కాలనీకి చెందిన సామన్‌పల్లి సుదర్శన్ రెండో కుమార్తె స్రవంతి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. స్రవం తి చిన్నప్పటి నుంచే చదువులలో చురుకుగా ఉం డేది. కూతురును డాక్టర్ చేయాలని సుదర్శన్ కష్టపడి చదివించాడు. రెండు నెలలో చదువు పూర్తి చేసుకునే లోపే మృతిచెందడం అందరినీ కలచివేసింది. స్రవంతి మృతితో టీచర్స్‌కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. -
రెండోవిడతకు నేడే ఆఖరు
ఆదిలాబాద్‌అర్బన్: రెండోవిడత పంచాయతీ నామినేషన్ల స్వీకరణ సమయం నేటితో ముగియనుంది. ఆదివారం చివరి గడువుకావడంతో ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొదటి, రెండురోజులు దాదాపు సరాసరి సంఖ్యలో దాఖలైన నామినేషన్లు మూడోరోజు ఎన్ని నమోదవుతాయో వేచి చూడాలి. కాగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం యథావిధిగా కొనసాగింది. ఆయానామినేషన్ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి పత్రాలు స్వీకరించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు కేంద్రాల వద్ద బారులు తీరడంతో స్వీకరణ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటలలోపు కేంద్రంలోకి వెళ్లిన వారు నామినేషన్ వేసి బయటకురావాలంటే రాత్రి 7 గంటల వరకు సమయం పట్టింది. తలమడుగు మండలంలోని కుచులాపూర్, సుంకిడి, దేవాపూర్ గ్రామంలో అధికారులు రాత్రి వరకు నామినేషన్ పత్రాలు స్వీకరించారు. రెండోరోజు.. జిల్లాలోని తలమడుగు, బజాహత్నూర్, బోథ్, గుడిహత్నూర్, నేరడిగొండ మండలాల్లోని 149 పంచాయతీలకు, 1208 వార్డులకు రెండోవిడతలో ఈనెల25న ఎన్నికలు జరగనున్నాయి. ఐదు మండలాల్లోని పంచాయతీ సర్పంచ్ స్థానాలకు 162 నామినేషన్లు రాగా, వార్డుస్థానాలకు 553 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే రెండోరోజు కూడా అధికంగా బోథ్ మండలంలో 33 జీపీలకు 44 నామినేషన్లు రాగా, తక్కువగా నేరడిగొండ, గుడిహత్నూర్ మండలాల్లోని జీపీలకు 29 చొప్పున నామినేషన్లు వచ్చాయి. ఇదిలా ఉండగా తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 147 నామినేషన్లు, వార్డుస్థానాలకు 197 నామినేషన్లు దాఖలైన విష యం తెలిసిందే. కాగా రెండురోజులపాటు జరి గిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలిస్తే.. ఐదు మండలాల్లోని 149 సర్పంచ్ పదవులకు 309 నామినేషన్లు రాగా, 1208 వార్డులకు 750 నామినేషన్లు వచ్చాయి. నేడు తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించే పంచా యతీలకు ఈనెల7 నుంచి 9 వరకు మూడురో జులపాటు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేష న్లు స్వీకరించారు. అయితే 10న నామినేషన్లను పరిశీలించిన అధికారులు నాలుగు వార్డు, ఒక సర్పంచ్ స్థానానికి వచ్చిన నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించిన విషయం తెలిసిం దే. తొలివిడత పంచాయతీ నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల13 ఆఖరు గడువు కావడంతో అధికారులు అన్నీ సిద్ధం చేశారు. ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నామినేషన్ కేంద్రాల్లోనే ఉపసంహరణ ప్రక్రియ జరగనుంది. అనంతరం బరి లో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తారు. తద్వారా ఏకగ్రీవ పంచాయతీ లెక్క తేలనుంది. -
బాలుడిపై వార్డెన్ లైంగికదాడి
ఆదిలాబాద్‌రూరల్: మావల మండలంలోని మావల శివారు ప్రాంతంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న బాలుడిపై అక్కడే విధులు నిర్వహిస్తున్న వార్డెన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. మావల ఎస్సై ముజాహిద్ కథనం ప్రకారం..మావల శివారు ప్రాంతంలోని ఎస్ఆర్ ప్రైం కార్పొరేట్ స్కూల్ బాలుడిపై మంగళవారం రాత్రి అదే పాఠశాలలో రాత్రి విధుల్లో ఉన్న వార్డెన్ లైంగిక దాడి చేయగా విషయాన్ని బాలుడు తోటి విద్యార్థులకు, వసతి గృహాం నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు స్పందించకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. శుక్రవారం పాఠశాలకు చేరుకున్న వారు జరిగిన విషయంపై ఆరా తీశారు. ఆగ్రహించిన పోషకులు పాఠశాల యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మావల ఎస్సై పాఠశాలకు చేరుకొని జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. బాలుడి పోషకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కార్పొరేట్ కళాశాలల్లో కొరవడుతున్న పర్యవేక్షణ.. పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని కార్పొరేట్ కళాశాల నిర్వాహకులు ఎంత అడిగితే అంతా ఫీజులు చెల్లిస్తున్నా, తల్లిదండ్రులు ఇలాంటి సంఘటనపై ఆందోళన చెందుతున్నారు. నిర్వాహకుల పర్యవేక్షణ లోపంతో పాఠశాల, కళాశాలల్లో లైంగిక దాడులు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పెళ్లింట విషాదం
ఆదిలాబాద్‌రూరల్: ఎన్నో ఆశలతో.. మరెన్నో కలలతో వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. మరికొద్ది నిమిషాల్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన బోతున్న సమయంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. హృదయ విదారకమైన ఈ రోడ్డు ప్రమాదం ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలం దేవాపూర్ ఫారెస్టు చెక్ పోస్టు వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఘటన నవ దంపతుల కుటుంబాల్లో విషాదం నింపింది. కారులో ప్రయానిస్తున్న పెళ్లి కూతురు సోదరి మెట్పల్లి స్వాతి, స్థానికంగా ఉన్న అటవీశాఖ అధికారులు, పోలీసుల కథనం ప్రకారం.. మావల మండలంలోని రాంనగర్లో నివాసం ఉంటున్న మెట్పల్లి ముత్తమ్మ, అశోక్ దంపతుల పెద్ద కు మార్తె ప్రియాంకకు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం వడ్డెడ్ గ్రామానికి చెందిన అడెపల్లి సాయి కుమార్‌తో గురువారం వడ్డేడ్‌లో పెద్దలు వి వాహం జరిపించారు. శుక్రవారం మావల మం డలంలోని రాంనగర్లో (పెళ్లి కూతురు ఇంటివద్ద) రిసెప్షన్ ఏర్పాటు చేశారు. విందులో పాల్గొనేందుకు నవదంపతులు బంధువులతో కలిసి వడ్డేడ్ నుంచి ఉదయం 9గంటలకు ఆదిలాబాద్‌కు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో దేవాపూర్ చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారి 44పై ఉదయం 10.24 గంటల ప్రాంతంలో బరంపూర్ వైపు నుంచి ఆదిలాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు టర్న్ అవుతున్న క్రమంలో కారు అదుపుతప్పి బస్సును సైడ్‌నుంచి ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ప్రియాంక, ఆమె సోదరీ మణులు స్వాతి, ప్రణవి, కజిన్ బ్రదర్ సాయికు మార్, బంధువు రాజేశ్‌తో పాటు పెళ్లి కుమారుని మేనత్త దొనకంటి రాజమణి ఉండగా పెండ్లి కుమారుడు సాయికుమార్ కారును డ్రైవ్ చేస్తున్నాడు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. ఘటన సమయంలో అక్కడే ఉన్న ఫారెస్టు అధికారులు, సిబ్బంది, స్థానికులు కారు అద్దాలను ధ్వం సం చేసి క్షతగాత్రులను బయటకు తీశారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో అడెపల్లి సాయికుమార్‌తో పాటు ఆయన మేనత్త రాజమణిలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మావల ఎస్సై తెలిపారు. నిలిచి పోయిన ఫంక్షన్.. వివాహం జరిగిన మరుసటి రోజు పెళ్లి కూతురు ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరో గంటలోపు భోజనాలు సైతం ప్రారంభం కానున్నాయి. ఇంతలో రోడ్డు ప్రమా దం చోటు చేసుకోవడంతో రిసెప్షన్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని రోదిం చిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఎమ్మెల్యే జోగు రామన్న పరామర్శ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న రిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. గాయపడ్డ వారికి నాణ్య మైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆయన వెంట జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, తదితరులు ఉన్నారు. -
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
నిర్మల్‌టౌన్: వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్‌లో బుధవారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ జాన్‌దివాకర్ తెలిపిన వివరాల ప్రకారం..జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్‌కు చెందిన కుంట మోహన్‌రెడ్డి– భారతి దంపతుల కుమారై సోనికారెడ్డి(31)కి మూడేళ్ల క్రితం భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఉదయ్‌కిరణ్‌రెడ్డితో వివాహం జరిగింది. పెళ్లయ్యాక దంపతులు కొంత కాలం బాగానే ఉన్నారు. ఆ తర్వాత భర్త ఆమెను మానసికంగా వేధించడం ప్రారంభించాడు. దీంతో కుంగిపోయిన సోనిక ఇటీవలే తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. కాగా బుధవారం శాస్త్రినగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో తెలిసిన బంధువులను కలిసివస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన సోనిక ఆత్మహత్యకు పాల్పడింది. అపార్ట్మెంట్ ఐదో అంతస్తు పైకి ఎక్కి చెప్పులు, చేతిసంచి, చున్నీని అక్కడే వదిలేసి దూకి బలవన్మరణానికి పాల్పడింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కాగా భవనంపైన కూల్‌డ్రింక్ సీసా ఉండడంతో ఏదైనా రసాయనం కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ ప్రాంతియ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. -
గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యం
తానూరు(ముథోల్): మండలంలోని మొగ్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యమైనట్లు ఎస్సై వెంకటరెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన ప్రకారం వివరాలు.. గ్రామానికి చెందిన పశువుల కాపరులు శనివారం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఓ సంచిలో ఉన్న అస్థిపంజరం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంçఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దానిని పరిశీలించారు. మూడు నెలల క్రితం ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు సంచిలో మృతదేహన్ని తీసుకువచ్చి పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ముథోల్ సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మహారాష్ట్ర వాసిగా అనుమానం ... నాందేడ్ జిల్లా నాయేగావ్ తాలూకా కుంబర్‌గావ్ గ్రామానికి చెందిన సంతోష్‌తో తానూరు మండలం మొగ్లి గ్రామానికి చెందిన రుక్మాణి బాయితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. రుక్మిణిబాయి ఏడాది నుంచి మొగ్లి గ్రామంలోని తల్లి గారి ఇంటి వద్ద ఉంటుంది. మూడు నెలల క్రితం సంతోష్ మొగ్లికి వచ్చి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సంతోష్ అచూకీ తెలియడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని అస్తిపంజరాన్ని పరిశీలించారు. సంతోష్ మృతదేహం కావచ్చని అనుమానిస్తున్నారు. అస్థిపంజరాన్ని ల్యాబ్‌కు తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించాలని బాధిత కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన రూ.ఐదు వేల అప్పు
రెబ్బెన(ఆసిఫాబాద్): అవసరం నిమిత్తం తీసుకున్న రూ.5వేల అప్పే ఆ యువకుడిని తనువు చాలించేలా చేసింది. అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక యువకుడు పురుగుల ముందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకోగా శనివారం వెలుగులోకి వచ్చింది. రెబ్బెన ఎస్సై దీకొండ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బెన మండల కేంద్రానికి చెందిన బొడ్డు కిరణ్‌బాబు(20) స్థానికంగా ఉన్న జిరాక్స్ సెంటర్లో పని చేస్తుండేవాడు. అవసరం నిమిత్తం రూ.5వేలను మండల కేంద్రానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి రవితేజ వద్ద అప్పు తీసుకున్నాడు. తీసుకున్న మొత్తం సకాలంలో చెల్లించడంలో విఫలం కావటంతో రవితేజ డబ్బుల కోసం అతడిని వేధించాడు. ఈ క్రమంలో గత నెల 30న మోటర్‌సైకిల్‌పై వస్తున్న కిరణ్‌ను అడ్డగించి బైక్‌ను లాక్కోవడంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియచేశాడు. ఈ క్రమంలో కిరణ్ ఇంటికి వెళ్లిన రవితేజ కుటుంబ సభ్యుల ఎదుటే అసభ్య పదజాలంతో ధూషించి అతడిపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన కిరణ్ క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్కడి నుంచి మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న కిరణ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారగా హైదరాబాద్‌కు తరలించగా శుక్రవారం మృతి చెందాడు. మృతుడి నానమ్మ వెంకటనర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బైక్ కొనివ్వలేదని..
కెరమెరి(ఆసిపాబాద్): బైక్ కొనివ్వలేదని మనస్తాపంతో మండలంలోని ఖైరీ గ్రామానికి చెందిన వాడై వాసుదేవ్(15) ఆత్మహత్య చేసుకున్నాడు. కెరమెరి ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాలివీ..వాడై శంకర్–కమలాబాయి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దకు కూతుర్లు. వారిలో రెండో వాడు వాసుదేవ్ కెరమెరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజులుగా బైక్ కొనివ్వాలని తండ్రిని ఆడుగుతున్నాడు. కాని ఈ సంవత్సరం కుదరదని, వచ్చే సంవత్సరం కొనిస్తానని తండ్రి చెప్పడంతో మనస్తాపానికి గురై శనివారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాలకు రెఫర్ చేయగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
నకిలీ మావోయిస్టుల అరెస్ట్
కాగజ్‌నగర్ (ఆదిలాబాద్): కాగజ్‌నగర్ పట్టణంలో వ్యాపారులు, వివిధ సంస్థల వద్ద బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసిన ఇద్దరు నకిలీ మావోయిస్టులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. కుమురంభీం జిల్లా వాంకిడి మండలం కిర్డీ గ్రామానికి చెందిన తిరుపతి, సూర్యపేట జిల్లా గుంజలూరు గ్రామానికి చెందిన సైదయ్య సీపీఐ (ఎంఎల్) రెడ్‌స్టార్ పేరుతో పెట్రోల్‌పంపులు, జిన్నింగ్ మిల్లులు, విద్యాసంస్థలు, ఇతర వ్యాపారుల వద్ద చందాలు వసూలు చేస్తున్నారని, కార్మిక సంఘాన్ని స్థాపిస్తామని చెబుతూ వేల రూపాయల్లో డబ్బులు వసూలు చేస్తుండడంతో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గత 6 నెలల క్రితం ఇదే తరహాలో వసూళ్లకు పాల్పడ్డారని అప్పటి నుంచి ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. పట్టణ సీఐ వెంకటేశ్వర్, క్యాట్ టీం సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి పట్టున్నారని తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుస్తామని స్పష్టం చేశారు. అసభ్యకరంగా పోస్టు చేసిన ఇద్దరిపై కేసు ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు చేసి కించపరిచినందుకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఒకసారి చేసిన తప్పు మరోసారి చేయడంతో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశామన్నారు. సంబంధిత గ్రూపుల అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. అలా కాకుండా అసభ్య పదజాలంతో కూడిన పోస్టులు, బరిలో ఉన్న అభ్యర్థులపై కామెంట్ చేయడం సరికాదన్నారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు. -
విషాదం నింపిన విహారం
ఉట్నూర్‌రూరల్: సెలవులు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా పిక్నిక్ వెళ్లారు. మత్తడి ప్రాజెక్టు వద్ద ఇద్దరు అన్నదమ్ములు ఎంతో ఎంజాయ్ చేశారు. ఇంటికి వెళ్లే సమయంలో ఫొటోలు దిగేందుకు ప్రాజెక్టులోకి దిగడంతో ప్రమాదవశాత్తు తమ్ముడు నీట మునిగాడు. కాపాడబోయిన అన్న కూడా నీటి మునిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో శనివారం జరిగిన ఈ హృదయ విదారక సంఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇద్దరే సంతానం కావడంతో ఆ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. కుటుంబ సభ్యులు, ఎస్సై జగన్మోహన్ రెడ్డి తెలిపిన వివరాలివీ.. ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ గ్రామానికి చెం దిన జాదవ్ ప్రహ్లద్–బిజ్జుబాయిలకు అరుణ్(14), తరుణ్ (16) ఇద్దరు సంతానం. సెలవులు కావడంతో ఉట్నూర్‌లో ఉంటున్న పెద్దమ్మ కూతు రు శిల్ప ఇంటికి వచ్చారు. వారి పిల్లలతో కలిసి ఉట్నూర్ మండలం లక్కారం గ్రామపంచాయతీ పరిధిలోని మత్తడిగూడ చెరువు వద్దకు పిక్నిక్కు వచ్చారు. దినమంతా సరదాగా గడిపారు. అన్ని కార్యక్రమాలు ముగించుకున్నాక మధ్యాహ్నం ఇంటికి వెళ్దామనుకునే సమయంలో కాసేపు నీళ్లతో ఆడుకుంటూ ఫొటోలు దిగుదామని ప్రాజెక్టులో దిగారు. లోతు తెలియక..ఈతరాక ఒక్కసారిగా అన్నదమ్ముళ్లలో అరుణ్ మునిగి పోతుండగా తమ్ముని కాపాడబోయి తరుణ్ కూడా నీట మునిగాడు. కుటుంబ సభ్యులు అరుపులు.. కేకలు వేయడంతో మత్తడిగూడ గ్రామస్తులు అక్కడికి చేరుకునేలోపే ఇద్దరూ ప్రాణాలు వదిలారు. ప్రాజెక్టు లోతు ఉండటంతో మృతదేహాల కోసం గజ ఈతగాళ్లు దాదాపు గంటసేపు గాలించి బయటకు తీశారు. కాగా అరుణ్ మండల కేంద్రంలోని సన్‌షైన్ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతుండగా, తరుణ్ స్థానిక పూలాజీ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ హృదయ విదారక సంఘటన పలువురిని కలిచివేసింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సైలు ఎల్వీ రమణ, జగన్మోహన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఘటనపై కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రి ప్రçహ్లద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. ప్రాజెక్టు వద్ద రక్షణ కరువు మండల కేంద్రంలోనే పేరుగాంచిన ఈ ప్రాజెక్టు వద్ద రక్షణ కరువైంది. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా తవ్వకాలు జరపడంతో చెరువు లోతు తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో కనీసం కం చెలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
గట్టయ్య మృతి బాధాకరం : ఓదెలు
జైపూర్(చెన్నూర్): తాను నమ్ముకున్న నాయకుడికి ఎమ్మెల్యే టికెట్ రాలేదని మనస్తాపం చెందిన రేగుంట గట్టయ్య పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడి తన కుటుంబానికి తీరనిశోకాన్ని మిగిల్చాడు. ఈ నెల 12న ఇందారంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్రచార ర్యాలీ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గట్టయ్య(35) 80శాతం కాలిన గాయాలతో హైదరాబాద్ మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 2.20 గంటలకు మృతి చెందాడు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత సిటింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు స్థానంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను టీఆర్ఎస్ చెన్నూర్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. ఓదెలుకు టికెట్ ఇవ్వకపోవడంతో ముందు నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్న జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన రేగుంట గట్టయ్య మనస్తాపం చెందాడు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా, కేసీఆర్ సేవా దళం జిల్లా ఉపాధ్యక్షులుగా, ఇందారం 13వ వార్డు సభ్యులుగా ఉన్న గట్టయ్య ఓదెలు, ఆయన కుటుంబానికి దగ్గరయ్యారు. గట్టయ్య అనారోగ్యపరిస్థితుల్లో ఓదెలు ఆయనను ఆదుకోవడం అన్నివిధాలుగా సహకరించడంతో అభిమానం మరింత పెరిగింది. మరో సారి ఓదెలుకు టికెట్ వచ్చి మళ్లీ ఆయన గెలిస్తే తనకు కూడా ప్రాధాన్యతపెరుగుతుందని భావించిన గట్టయ్య టికెట్ రాకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలో చెన్నూర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ బాల్క సుమన్ 12న(బుధవారం) తొలిసారి నియోజకవర్గానికి రావడం ఇందారం వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో అక్కడే ఉన్న గట్టయ్య తన నిరసనను వ్యక్తం చేయడానికి ప్రచార ర్యాలీ ప్రారంభించే ముందు ఎంపీ సుమన్ రాజీవ్ రహదారి పక్కన డీఎంఎఫ్టీ నిధులతో నూతనంగా నిర్మించనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తుండగా జై..కేసీఆర్..జై ఓదెలు అంటూ గట్టయ్య తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ సీసాను ఒంటిపై పోసుకోగా దాన్నిఅడ్డుకునే ప్రయత్నంలో అక్కడే ఎంపీకి స్వాగతం పలకడానికి మంగళహారతులతో వచ్చిన మహిళలపై పెట్రోల్ పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇందారం, రామారావుపేట, టేకుమట్ల, భీమారం గ్రామాలకు చెందిన 12మంది ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతోపాటు 3 రిపోటర్లకు గాయాలయ్యాయి. ముందు గట్టయ్య తనపై పెట్రోల్ పోసుకోవడంతో ఆయన 80శాతం కాలిపోయాడు. హుటాహుటిన మంచిర్యాలకు తరలించి అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు, అనంతరం హైదరాబాద్ మలక్‌పేట్ యశోద ఆస్పత్రి తరలించి వైద్యం అందించారు. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన గట్టయ్య మంగళవారం మృతి చెందాడు. ఇందారంలో విషాదం.. అందరితో కలివిడిగా ఉండే గట్టయ్య మృతి చెందడంతో ఇందారంలో విషాదం నెలకొంది. గట్టయ్య మరణ వార్త తెలిసి ఇందారం వాసులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. గట్టయ్య మృతితో ఆయన కుటుంబ రోడ్డున పడింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరులా రోధించారు. గట్టయ్యకు భార్య విజయ, కుమార్తె సాయినివేదిత(5), కుమారుడు సాయి విజ్ఞేశ్(3) ఉన్నారు. బుధవారం ఇందారంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాజ సేవలో గట్టయ్య.. ఇందారం గ్రామానికి చెందిన గట్టయ్య తన నాన్నమ్మ బుచ్చమ్మ దగ్గర పెరిగిన గట్టయ్య ఆమె మృతితో 2010లో గ్రాండ్ మా యూత్ స్థాపించారు. గ్రాండ్ మా యూత్ ద్వారా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రక్తదాన శిబిరాలు, దాతల సహకారంతో ఉచిత వైద్యశిబిరాల ఏర్పాటు, నిరుపేద విద్యార్థులకు విద్యాసామగ్రి తదితర సేవకార్యక్రమాలు చేపట్టి జిల్లా స్థాయిలో గుర్తింపు పొంది పలుమార్లు అవార్డులు సైతం అందుకున్నారు. ఇందారం ఓపెన్‌కాస్టుకు వ్యతిరేకంగా గట్టయ్య ఉద్యమించారు. జేఏసీ నేతృత్వంలో తలపెట్టిన ఓపెన్‌కాస్టు వ్యతిరేక పోరాటాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. గట్టయ్య మృతి బాధాకరం : ఓదెలు మంచి మనస్సున గట్టయ్య మృతి చెందడం చాలా బాధకరమని చెన్నూర్ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. గట్టయ్య కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటానని ఆయన కుమార్తె సాయినివేదిత, కుమారుడు సాయివిజ్ఞేశ్పై రూ.5 లక్షల చొప్పున ఇద్దరిపై రూ.10లక్షలు బ్యాంకులో ఫిక్స్‌డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. అంత్యక్రియల ఖర్చు మొత్తం బరించుకుంటామని కుటుం బానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. -
మూడు నెలల క్రితమే ప్రేమపెళ్లి..
జైనథ్(ఆదిలాబాద్): కట్నం వేధింపులు తాళలేక జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన ఆవుల అంకిత(25) పెన్‌గంగలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దీపాయిగూడలోని లోక రవీందర్ రెడ్డి, అనురాధల కుమార్తె అంకిత, అదే గ్రామానికి చెందిన సాయి నాలుగు నెలల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు. ఆదిలాబాద్‌లో కాపురం పెట్టారు. కాగా సాయి తనకు రూ.3లక్షల కట్నం ఇవ్వాలని తరుచూ భార్య అంకితను వేధించేవాడు. అంకిత కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి, కట్నం ఇస్తేనే కూతురితో కాపురం చేస్తానని, లేదంటే తీసుకెళ్లాలని బెదిరించాడు. ఈ క్రమంలో గురువారం ఇద్దరు కలిసి ఆదిలాబాద్ నుంచి భోరజ్ గ్రామానికి వచ్చారు. అక్కడి నుంచి సాయి దీపాయిగూడకు వెళ్లగా, అంకిత మహారాష్ట్రలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్తానని చెప్పి పిప్పల్‌కోటికి బయలు దేరింది. మార్గమధ్యంలో ఇరు రాష్ట్రాల సరిహద్దు బ్రిడ్జిపై నుంచి పెన్‌గంగ నదిలో దూకింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియకుండాపోయింది. శనివారం ఉదయం మండలంలోని ఆనంద్‌పూర్ సమీపంలో బ్రిడ్జికి కూతవేటు దూరంలో మృతదేహం కనిపించగా జాలర్లు ఒడ్డుకు చేర్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎస్సై తోట తిరుపతి శవాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. ఆపధర్మ మంత్రి జోగు రామన్న, డీఎస్పీ నర్సింహా రెడ్డి, తహసీల్దార్ బొల్లెం ప్రభాకర్ మార్చురీ వద్ద మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబీకులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. దీపాయిగూడలో అంత్యక్రియలు నిర్వహించగా మంత్రి జోగు రామన్న పాల్గొని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిండు జీవితాలు బలి వాస్తవంగా అంకిత, సాయి ఇద్దరిదీ రెండో వివాహమే. నాలుగు సంవత్సరాల క్రితం అంకితను జైనథ్ మండలంలోని సిర్సన్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి తల్లిదండ్రులు వివాహం చేశారు. ఆవుల సాయికి అదే గ్రామానికి చెందిన యువతిని ఇచ్చి పెళ్లి చేశారు. వీరి ఇద్దరు కూడా పెళ్లి జీవితాల్లో ఇమడలేకపోయారు. ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. ఇద్దరికి వేర్వేరుగా పెళ్లిళ్లు అయినా వీరి మధ్య సంబంధం కొనసాగడంతో పాత జీవిత భాగస్వాములకు విడాకులు ఇచ్చేశారు. అనంతరం పెద్దలను ఎదిరించి ఇద్దరు ప్రేమవివాహం చేసుకున్నారు. కాగా వీరి పెళ్లి జీవితం ఎంతో కాలం నిలవలేదు. కట్నం కోసం సాయి, అంకితను వేధించడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. మొదటి పెళ్లి కాదని, పెద్దలను ఎదిరించి రెండో వివాహం చేసుకోవడంతో ఇరు కుటుంబాలకు దూరమయ్యారు. భర్త వేధింపులు అధికమవడంతో అంకిత తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా మృతురాలి తండ్రి రవీందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సాయిపై 498(ఏ), 304(బి) సెక్షన్ల కింద వరకట్నం వేధింపులు, గృహహింస కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
తెల్లారితే పెళ్లి... అంతలోనే
జన్నారం(కరీంనగర్): పెళ్లి చేసుకుని ఇతర రాష్ట్రానికి వెళ్లడం ఇష్టం లేక నవవధువు సూపర్‌వాస్మోల్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. బాజాభజంత్రీలు మోగాల్సిన ఆ ఇంటా విషాదం చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన టేకుమంట్ల రాజన్న, పంకజ దంపతులకు ముగ్గురు సంతానం. ఇందులో రెండో కూతురు ఆమని(28) ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఎస్బీఐలో క్యాషియర్‌గా పనిచేస్తోంది. ఈ మధ్యనే వివాహం నిశ్చయమైంది. ఈ నెల 4న నిశ్చితార్థం కూడా జరిపారు. గురువారం(నేడు) వివాహం జరగాల్సి ఉంది. ఆమనిని వివాహం చేసుకునే వ్యక్తి ముంబయిలో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం చేసుకుని ముంబయికి వెళ్లాల్సి ఉందనే బెంగతో ఉండేది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. తల్లిదండ్రులు నచ్చజెప్పారు. అయిన దూరంగా వెళ్లి ఉండటం ఇష్టలేక బుధవారం ఉదయం ఇంట్లో ఉన్న సూపర్‌వాస్మోల్ తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన కుటుంబీకులు వెంటనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్ తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. పెళ్లికి అంతా సిద్ధం.. ఆమని వివాహం కోసం తల్లిదండ్రులు అంతా సిద్ధం చేశారు. సామగ్రి తెచ్చారు. పెళ్లి పత్రికలు పంచారు. టెంట్లు వేశారు. వంటమనిషిని మాట్లాడారు. వంట సామగ్రి తీసుకువచ్చారు. పచ్చనిపందిరి కోసం పొరకకు వెళ్దామనే సమయంలో అమ్మాయి ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబీకులతోపాటు బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతురాలి తల్లి పంకజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వైద్యం అందక చిన్నారి మృతి
మంచిర్యాలక్రైం: ప్రైవేట్ పిల్లల ఆసుపత్రిలో ఓ చిన్నారికి సకాలంలో వైద్యం అందక మృతిచెందిన సంఘటన మంచిర్యాల పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. కాసిపేట మండల కేంద్రానికి చెందిన వైద్యం అందకపోవడంతోదంపతుల కూతురు తనుశ్రీ (2)కి మూడు రోజులుగా జ్వరం వస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 7 గంటలకు మంచిర్యాలలోని స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన గంటలోపే చిన్నారి మృతి చెందింది. సకాలంలో వైద్యం అందకపోవడంతోనే చిన్నారి మృతిచెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబసభ్యులతో మాటాడి ఆందోళన విరమింపజేశారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు. తనుశ్రీ చనిపోయే గంట ముందే ఆస్పతికి తీసుకువచ్చారని, అప్పటికే చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యుడు తెలిపాడు. వైద్యం అందించలోపే మృతిచెందిందన్నారు. ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదన్నారు. కాగా, చిన్నారి మృతితో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
ఉరేసుకుని సింగరేణి కార్మికుడి ఆత్మహత్య
శ్రీరాంపూర్(మంచిర్యాల): కృష్ణాకాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు కనవేని పోషయ్య(56) ఆర్కే 5గని సమీపంలో నీలగిరి తోటలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పోషయ్య మేడిపల్లి ఓసీపీలో పని చేస్తున్నాడు. ఇతనికి భార్య రాధ, కూతుర్లు మల్లేశ్వరి, మౌనిక, కొడుకు మహేందర్ ఉన్నారు. స్వస్థలం వరంగల్ జిల్లా గొల్లపల్లి మండలం. సింగరేణిలో పని చేస్తూ కృష్ణాకాలనీలోని కంపెనీ క్వార్టర్లో నివాసం ఉంటున్నాడు. గత నెల 31న కుటుంబంతో సహా సొంతూరికి వెళ్లాడు. తరువాత ఒక్కడే ఇంటికి వచ్చి సోమవారం డ్యూటీకని బయలు దేరాడు. కాని తిరిగి ఇంటికి రాలేదు. మంగళవారం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చిన తరువాత అతని ఇంటికి తిరిగిరాని విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతని ఆచూకీ కోసం వెతకగా అతని బైక్ శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద ఉన్న వైన్స్‌షాప్ వద్ద లభించింది. దీంతో బెక్‌ను స్వాధీనం చేసుకున్నారు. చివరికి అతని కోసం గాలించగా శనివారం నీలగిరి తోటలో చెట్టుకు ఉరివేసుకొని శవమై కనిపించాడు. మృతుడు మద్యానికి బానిస అని, డ్యూటీలు కూడా సక్రమంగా చేసే వాడుకాదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ కారణంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అనుమానం కలుగుతోంది. ఈ మేరకు శ్రీరాంపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బోథ్ టు హైదరాబాద్..
బోథ్ : బోథ్ మండలం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి రవాణా అవుతోంది. కొంతమంది యువకులు హైదరాబాద్‌కు వెళ్తున్నానంటూ బ్యాగుల్లో గంజాయి తీసుకెళ్తున్నారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పబ్బుల వద్ద విక్రయిస్తున్నారు. పబ్బులకు వచ్చే ధనికులు, యువకులు, సెలబ్రటీలకు గంజాయిని అమ్ముతున్నట్లు సమాచారం. వీకెండ్లలో హైదరాబాద్ వెళుతూ విక్రయిస్తున్నారు. మరికొందరు హైదరాబాద్‌లో వాచ్మెన్లుగా ఉండి గంజాయి విక్రయాలు చేస్తున్నారు. వారానికి దాదాపు 20 నుంచి 30 వేల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. దీంతో గంజాయి రవాణ వారికి వృత్తిగా మారింది. వచ్చిన డబ్బులతో జల్సా చేస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాచ్మెన్లుగా పనిచేస్తూ.. బోథ్ మండలంలో సొనాల గ్రామ చుట్టు పక్కల గ్రామాల్లోని దాదాపు 20 నుంచి 30 మంది యువకులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజరా హిల్స్, దిల్సుఖ్నగర్, అమీర్‌పేట్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్‌సీటీ తదితర ప్రాంతాల్లో వివిధ పబ్బులల్లో, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లల్లో వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. వీరంతా 18 నుంచి 30 సంవత్సరాలలోపు యువకులే..ఈ ప్రాంతాల్లో చాలా మంది ధనికులు, సెలబ్రటీస్లు తిరుగుతూ ఉంటారు. పబ్బుల్లో రాత్రిపూట గంజాయిలు విక్రయిస్తూ వేల కొద్ది డబ్బును సంపాదిస్తున్నారు. అపార్ట్మెంట్లల్లో ఉండే ధనికులకు ప్రతీవారం గంజాయిని సరఫరా చేస్తున్నారు. తమ వాచ్మెన్ తన గ్రామం నుంచి గంజాయి తెచ్చివ్వడంతో తక్కువ ధరలకు కొంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రవాణా గంజాయిని హైదరాబాద్‌కు గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్తుతున్నారు. తాము తీసుకెళ్లే బ్యాగులో గంజాయిని ఉంచి వాసన రాకుండా దానికి సెంట్ కొడుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా బోథ్ మండల కేంద్రం నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులో ఒక వారం, మరోవారం నిర్మల్ నుంచి హైదరాబాద్‌కు బయలు దేరుతున్నారు. రాత్రుల్లో పబ్బుల వద్ద ఒక వ్యక్తికి విక్రయించి డబ్బులు తీసుకుని వచ్చేస్తున్నారు. మరోవైపు వాచ్మెన్లుగా , సెక్యురిటీ గార్డులుగా పనిచేస్తున్న వ్యక్తులు తమ ఇంటి వద్ద నుంచి యువకులతో గంజాయిని తెప్పించుకుని గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఈ తతంగం గత సంవత్సర కాలంగా నడుస్తోందని తెలుస్తోంది. అయితే హైదరాబాద్‌కు సరఫరా చేసే యువకుల్లో ఎక్కువగా ఇంటర్, డిగ్రీలు చేస్తున్న విద్యార్థులు సైతం ఉన్నట్లు సమాచారం.. వీరికి గంజాయిని హైదారాబాద్‌కు తీసుకువస్తే డబ్బులు ఇస్తామంటూ వల వేస్తున్నారు. దీంతో గంజాయిని తీసుకువెళ్లి అక్కడ ఉండే వాచ్మెన్లకు సరఫరా చేస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి.. చాలా మంది యువకులు గంజాయినీ సరఫరా చేస్తే డబ్బులు రావడం గమనించడంతో ఈజీగా డబ్బులు వస్తున్నాయని ఆశపడి రవాణా చేస్తున్నారు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. ఓ యువకుడు తమ ఇంటి వద్ద తన తండ్రి కూలీ పనులకు వెళుతుంటే తాను మాత్రం బైక్‌పై స్మార్ట్‌ఫోన్‌తో జల్సా చేస్తున్నాడు. అదేంటి అని ఓ వ్యక్తి అడిగితే..‘అన్న హైదరాబాద్‌కు గంజాయి ఇచ్చి వస్తే వారానికి 4 వేలు ఇస్తున్నారు.’’ అని సమాధానం చేప్పి వెళ్లిపోయాడు. దీన్ని బట్టి చూస్తే గంజాయి రవాణా ఎలా సాగుతోందో అర్థం అవుతోంది. బోథ్ మండలానికి చెందిన ఓ వ్యక్తి బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆ అపార్ట్మెంట్లో ఉండే కొంత మంది వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. దీంతో ఆ వ్యక్తులకు గంజాయిని బోథ్ మండలం నుంచి సరఫరా చేస్తున్నాడు. ప్రతీవారం తన గ్రామం నుంచి కొంతమంది యువకులతో గంజాయిని తెప్పించుకుని సరఫరా చేస్తూ వారానికి 20 నుంచి 30 వేల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. అక్కడే ఉన్న పబ్బులో ఓ వ్యక్తి ద్వారా గంజాయి సప్లై చేస్తున్నారు. అంతర పంటగా సాగు... హైదరాబాద్‌లో గంజాయికి భారీ డిమాండ్ ఉండటంతో బోథ్ మండలంలోని కొన్ని చేలల్లో గంజాయని అంతరంపంటగా సాగు చేస్తున్నారు. దీన్ని యువకులతో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. మూడు నుండి ఐదుగురు వ్యక్తులు బస్సుల్లో హైదరాబాద్‌కు తీసుకువెళుతున్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు గంజాయి పంటను వేసినా.. గంజాయిని హైదరాబాద్ వంటి ఇతర ప్రదేశాలకు రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు, క్రిమినల్ కేసులు పెడతాం. యువకులు గంజాయిని రవాణా చేసి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఆయా గ్రామాల్లో తనిఖీలు చేపడతాం. అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. ఎవరైనా గంజాయిని తరలిస్తున్నట్లయితే పోలీసులకు సమాచారం అందించాలి. - జయరాంనాయక్, సీఐ -
సాయి దీక్షలోనే తుదిశ్వాస
జైనథ్(ఆదిలాబాద్): సాయి దీక్ష స్వీకరించి తన బైక్‌పై ఇంటికి వస్తున్న జైనథ్ మండలం సావాపూర్ గ్రామానికి చెందిన అరిగెల రవి (22)ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. బుధవారం ఉదయం అదిలాబాద్‌లోని క్రాంతినగర్ సాయిబాబా ఆలయంలో సాయి దీక్ష తీసుకునేందుకు అదే గ్రామానికి చెందిన బాలుడు వైభవ్ కృష్ణతో కలిసి వచ్చాడు. పూజాది కార్యక్రమాలు ముగించుకొని మాలధారణ తర్వాత ఇద్దరు కలిసి సావాపూర్‌కు తిరిగి పయనమయ్యారు. భోరజ్–బేల అంతర్రాష్ట్రీయ రహదారిపై తరోడ బ్రిడ్జి మరమ్మతుల కోసం రోడ్‌ను మూసివేయడంతో ఆదిలాబాద్ మండలం లాండ సాంగి రూట్లో బయలు దేరారు. కాగా జైనథ్ మండలం అడ గ్రామ సమీపంలో ఎదురుగా గుర్తుతెలియని వాహనం వచ్చి వీరిని ఢీకొంది. దీంతో రవి తలికి దెబ్బతగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వైభవ్ కృష్ణ కుడి కాలు విరిగింది. అటుగా వెళ్తున్న వారు వెంటనే 108లో రిమ్స్‌కు తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. కాగా రిమ్స్‌లో చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు. రవి తండ్రి ఆశన్న 8 సంవత్సరాల క్రితమే చనిపోవడంతో తల్లి విమల కుటుంబాన్ని పోశిస్తూ రవిని చదివిస్తోంది. రవికి ముగ్గురు అన్నలు, ముగ్గురు అక్కలు ఉన్నారు. కాగా రవి ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతూ.. కుటుంబానికి ఆసరా ఉండేందుకు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పోస్టుమార్టం కోసం రవి శవాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. గ్రామస్తులు, యువకులు చివరి చూపుకోసం భారీగా తరలివచ్చారు. కాగా> ఎదిగిన కొడుకును కళ్లముందే రక్తపు మడుగులో చూసిన తల్లి విమల హతాశురాలైంది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. -
ఎన్ని పరీక్షలు రాసినా ఉద్యోగం రాలేదని...
నార్నూర్(ఆసిఫాబాద్): ఉన్నత చదువులు చదివింది. ఉద్యోగం కోసం అనేకసార్లు పోటీ పరీక్షలు రాసింది. అయినా జాబ్ రాలేదు. బతుకుదెరువు కోసం భర్తతో కలిసి ఖరీఫ్‌లో పత్తి సాగు చేస్తే ఆ పంట అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఉపాధి లేక జీవితంపై విరక్తి చెందిన రాథోడ్ జ్యోతి (30) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం మండలంలోని భీంపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...జాదవ్ కమలాబాయి, జాను దంపతుల కూతురు జ్యోతికి అదే గ్రామానికి చెందిన రాథోడ్ బాగుబాయి–శేషరావుల కూమారుడు రాథోడ్ రాజేశ్‌తో గత పదేళ్ల క్రితం వివాహమైంది. ఆమె ఎంఏ, బీఈడీ పూర్తి చేసింది. గత నాలుగేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఐటీడీఏ ద్వారా భర్తీ చేస్తున్న సీఆర్టీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకుంది. అది రాకపోవడంతో విద్యావలంటీర్ కోసం దరఖాస్తు చేసుకుంది. అదికూడా రాలేదు. దీంతో భర్త రాజేశ్‌తో కలిసి తనకు ఉన్న మూడు ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి పంట మొత్తం దెబ్బతినడంతో ఆవేదనకు గురైంది. భర్త రాజేశ్ గత ఆదివారం తిరుపతికి వెళ్లగా ఇంట్లో ఇద్దరు పిల్లలతో ఉంటున్న జ్యోతి ఉద్యోగం, ఉపాధి లేక పంట దెబ్బతినడంతో తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం తెల్లావారుజామున పురుగుల మందు తాగింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో వాంతులు కావడంతో మృత్యురాలి తల్లి కమలాబాయి హుటహూటిన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం ఉట్నూర్ తరలించగా అక్కడి వైద్యులు రిమ్స్‌కు రెఫర్ చేశారు. అక్కడికి వెళ్తుండగా మృతి చెందింది. మృత్యురాలికి ఎనిమిదేళ్ల బాబు, 12 ఏళ్ల పాప ఉంది. ఆమె తల్లి కమలాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణకుమార్ తెలిపారు. -
టిప్పర్ ఢీకొని మహిళ మృతి
తాండూర్(బెల్లంపల్లి): అప్పటిదాక ఇంటి పనులు చేసుకుంటూ తమముందే కదలాడిన మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నీటి కోసమని రోడ్డుదాటుతున్న ఆమెను మృత్యువు బొగ్గుటిప్పర్ రూపంలో వచ్చి కబళించడం తీవ్ర శోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే...తాండూర్ మండల కేంద్రానికి సమీపంలోని రాజీవ్‌నగర్‌లో నివాసం ఉండే షేక్ మహెబూబ్ అలీ, రైసా సుల్తానా (50) దంపతులు సోమవారం ఉదయం ఇంటి అవసరాల కోసం నీళ్లకు ఉపక్రమించారు. రైసా సుల్తానా రోడ్డు దాటి నీటి కోసం వెళ్తుండగా తాండూర్ ఐబీ ప్రాంతం నుంచి మాదారం వైపు వెళ్తున్న బొగ్గు టిప్పర్ వేగంగా ఢీకొట్టి ఆమె మీద నుంచి దూసుకుపోయింది. ఈ ఘటనలో రైసా సుల్తానా అక్కడికక్కడే మృతి చెందింది. క్షణాల్లో ఆ మహిళ ఆకాల మరణం చెందడంతో చూపరులు, మృతురాలి కుటుంబీకులు జీర్ణించుకోలేకపోయారు. మృతదేహంపై పడి కూతుళ్లు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. దీంతో అక్కడికి చేరుకున్న టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సూరం రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సాబీర్ హుస్సెన్ తదితరులు అక్కడికి చేరుకుని మృతురాలి కుటుంబీకులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. అర గంటపాటు రాస్తారోకో జరిగింది. సమాచారం అందుకుని సీఐ ఉపేందర్, ఎస్సై కె.రవి అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి విరమింపజేశారు. ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని చేసుకుని తాండూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
కట్టేసి..దోచుకెళ్లారు
నిర్మల్అర్బన్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని కమలానగర్ కాలనీలో దొంగల ముఠా బుధవారం రాత్రి కలకలం సృష్టించింది. రెడ్డి ఫంక్షన్ హాల్ సమీపంలోని చిట్టచివరన ఉన్న ఇంట్లో అర్ధరాత్రి దొంగలు చొరబడి ఇంట్లోని వారిని కత్తులతో బెదిరించి, చీరలతో కట్టేసి దొంగతనానికి పాల్పడ్డారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దొంగతనం నిర్మల్ జిల్లా కేంద్ర ప్రజలను భయాందోళనకు గురిచేసింది. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని కమలానగర్కాలనీలోని రెడ్డి ఫంక్షన్‌హాల్ సమీపంలో పొద్దుటూరి ప్రసాద్‌రెడ్డి, పద్మ దంపతులు కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. ప్రసాద్‌రెడ్డి నిర్మల్‌లోని ఏఎన్‌రెడ్డి కాలనీ సమీపంలో మిల్క్ సెంటర్ నిర్వహిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి తలుపులను బండరాళ్లు, ఇనుప రాళ్లతో బాదారు. తలుపు చప్పుల్లతో ఇంటి ముందు గదిలో నిద్రిస్తున్న ప్రసాద్‌రెడ్డి అత్త భయంతో అరిచింది. లోపలి గదిలో ఉన్న ప్రసాద్‌రెడ్డి, అతని భార్య పద్మ ముందు గదిలోకి వచ్చారు. అప్పటికే ఇంటి తలుపులు బలవంతంగా తెరిచిన నలుగురు దొంగలు లోపలికి ప్రవేశించారు. వారి గొంతుపై కత్తిపెట్టి బెదిరించారు. వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు లాక్కున్నారు. ముగ్గురితోపాటు ఇద్దరు పిల్లల కాళ్లు, చేతులను వెనక్కి మలిచి చీరలతో కట్టేశారు. డబ్బులు, బంగారు ఎక్కడ దాచారో చెప్పాలంటూ బెదిరించారు. చెప్పకపోతే చంపేస్తామన్నారు. బెడ్రూంలోని బీరువా తాళాలు పగులగొట్టారు. అందులోని, బెడ్‌కింద ఉన్న రూ.20 వేలు, సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి దోచుకెళ్లారు. సుమారు రెండున్నర గంటలపాటు వారిని భయభ్రాంతులకు గురి చేసి పప్పు, బియ్యం డబ్బాలు, బ్యాగులను చిందరవందరగా పడేసి అందులో దాచుకున్న డబ్బులను సైతం చోరీ చేశారు. వారి వద్ద ఉన్న 3 సెల్ఫోన్లు తీసుకెళ్లారు. గొళ్లెం పెట్టి ఉడాయింపు.. ఈ ఇంటి చుట్టు ఇళ్లు లేకపోవడంతో దొంగలు తమ పనిని సులభంగా కానిచ్చేశారు. ఇంట్లోకి చొరబడి నగదు, బంగారు ఆభరణాలను దొంగిలించిన దొంగలు తమ పనిపూర్తయిన తర్వాత ఇంటి బయట తలుపులకు గొళ్లెం వేసి అక్కడి నుంచి పారిపోయారు. ఎవరైనా అరిస్తే చంపేస్తామని బెదిరించడంతో బాధితులు బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. ఎలాగోలా చేతులకు కట్టిన తాళ్లను తొలగించుకుని, చుట్టుపక్కల వారికి, పోలీసులకు సమాచారం అందించారు. దొంగతనం జరిగిన విషయం తెలియడంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. అలాగే క్లూస్ టీం సభ్యులు బీరువా, ఇతర సామగ్రిపై వేలిముద్రలను, ఇతర ఆధారాలను సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పాత కక్షలతో మహిళ హత్య
ఆసిఫాబాద్ (ఆదిలాబాద్): మండలంలోని ఇప్పల నవగాంలో శుక్రవారం అర్ధరాత్రి పాత కక్షలతో వివాహిత ఇంజరి లక్ష్మి హత్యకు గురైంది. అదే గ్రామానికి చెందిన ఇంజరి బాపు, బద్ది రామయ్య గ్రామానికి చెందిన పటేల్ సోమయ్య వద్ద వ్యవసాయ పనులు చేసేందుకు రూ.10 వేలు అడ్వాన్సుగా తీసుకున్నారు. ఈ డబ్బుల్లో చెరో రూ.5 వేలు తీసుకున్నారు. ఈ క్రమంలో డబ్బులు తీసుకున్న మరుసటి రోజు నుంచి రామయ్య పనులకు వెళ్లడం లేదు. తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించడం లేదు. ఈ క్రమంలో తీసుకున్న డబ్బులు రామయ్య వారం రోజుల్లో తిరిగి చెల్లిస్తానని గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పుకుని చెల్లించలేదు, పనికి వెళ్లలేదు. దీంతో శుక్రవారం రాత్రి బాపు తన భార్య లక్ష్మితో కలిసి రామయ్య ఇంటికి వెళ్లాడు. విషయం మాట్లాడుతుండగా అక్కడే ఉన్న రామయ్య మేనల్లుడు ఆత్రం మహేశ్.. బాపు భార్య లక్ష్మి పొత్తి కడుపుపై పిడిగుద్దులు గుద్దుతూ, మెడ, తలపై దాడి చేశాడు. గొంతు నులిమి దాడి చేశాడు. దీంతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లయ్య తెలిపారు. -
కాలువలో జారి పడి బాలుడి మృతి
చెన్నూర్‌రూరల్ ఆదిలాబాద్ : మండలంలోని ఒత్కులపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు గొల్లవాగు ప్రాజెక్టు కాలువలో జారి పడి గురువారం జాడి రామ్‌చరణ్(11) మృతి చెందాడు. చెన్నూర్ పట్టణ సీఐ కిశోర్ కథనం ప్రకారం..గ్రామానికి చెందిన జాడి సారయ్య, మల్లీశ్వరిల కుమారుడు రామ్‌చరణ్ మరో బాలుడితో కలిసి గొల్లవాగు కాలువ వైపునకు బహిర్భూమికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు రామ్‌చరణ్ జారి కాలువలో పడ్డాడు. కాలువలో ఇటీవల కురిసిన వర్షపు నీరు నిలిచి ఉండటంతో మృతి చెందాడు. మరో బాలుడు కాలువ గట్టుపైనే ఉన్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కాలువ వద్దకు వెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామ్‌చరణ్ 6వ తరగతి చదువుతున్నాడు. బాలుని మృతదేహం వద్ద తల్లిదండ్రులు రోదించిన తీరు పలువుర్ని కంట తడి పెట్టించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.