నిందితులను శిక్షించాలని రాస్తారోకో చేస్తున్న మృతుడి కుటుంబ సభ్యులు (ఫైల్)
సాక్షి, ఆసిఫాబాద్: స్నేహితుల చేతిలో హతమైన ఆత్రం రమేష్ మృతి వెనక అసలు కారణాలు మాత్రం అంతు చిక్కడం లేదు. దాడికి అసలైన కారణం దొంగతనమే అయితే ఆ దొంగతనం వెనుక ఉన్న అసలు సూత్రదారులెవరరనేది అంతుచిక్కడం లేదు. గూడ్స్ రైలులో నుంచి బస్తాలు దొంగతనం చేసేందుకు నిరాకరించాడనే కారణంతో దాడికి పాల్పడితే ఎన్ని నెలల నుంచి ఈ దొంగతనాలు కొనసాగుతున్నాయనేది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంలో రైల్వే సిబ్బంది ప్రమేయం లేకుండానే బస్తాల దొంగతనం ఎలా సాధ్యమవుతుంది..? అనే సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు మండల ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. రైలులో నుంచి బస్తాలను దొంగతనం చేసేందుకు సహాయం చేయకపోవటంతో ఆగ్రహించిన స్నేహితులు ఆత్రం రమేష్‌పై దాడికి పాల్పడటంతో విషయం బయటపడింది. కాలితో తట్టడంతోనే ఆత్రం రమేష్ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు చెబుతున్నా దాడిలో చాలామంది ఉండి ఉంటారని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపడితే నిందితులు బయటపడే అవకాశం ఉందని మండల వాసులు అంటున్నారు.
బస్తాల దొంగతనం ఎన్నాళ్ల నుంచి కొనసాగుతోంది..?
రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వేస్టేషన్‌లో నిత్యం ఏదో ఒక గూడ్స్ రైలు నిలిచి ఉంటుంది. అలా ఆగి ఉన్న గూడ్స్ రైలులో నుంచి కొంతకాలంగా రాత్రి సమయంలో ఎరువుల బస్తాలను దొంగిలిస్తూ వాటిని రైతులకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తతంగం వెనుక మండలానికి చెందిన పలువురు వ్యక్తులే ఉన్నట్లు అనుమానాలున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం పంటల సీజనల్‌లో రసాయనిక ఎరువులు సరాఫరా అధికంగా జరిగే సమయాల్లో దొంగతనం జరుగుతుందని చెప్పుకుంటున్నారు.
గూడ్స్ రైలు వచ్చి నిలిచిందనే సమాచారం తెలియగానే సూత్రదారులు తమ అనుచరులను రంగంలోకి దింపి రాత్రి సమయంలో చోరీలకు పాల్పడుతుంటారని ప్రయాణికులు సైతం చెబుతున్నారు. రైలు బోగిల్లోని బస్తాలను స్టేషన్ చివర్లో ఉన్న ముళ్ల పొదల్లో పడేసి గుట్టు చప్పుడు కాకుండా వాహనాల్లో తరలించి సమీప రైతులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. అయితే స్టేషన్ ఆవరణలోనే ఈ తతంగం అంతా జరుగుతున్నా రైల్వే సిబ్బందికి ఏ మాత్రమూ తెలియకపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దొంగతనం బయటకి రావద్దనే దాడి..?
రైలులో నుంచి బస్తాల దొంగతనానికి పాల్పడుతున్న విషయం బయటకు పొక్కుతుందనే కారణంతోనే ఆత్రం రమేష్‌పై దాడి జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మండల కేంద్రానికి చెందిన గోగర్ల రమేష్‌తోపాటు మరో వ్యక్తి కలిసి ముందుగా ఆత్రం రమేష్ ఇంటికి వెళ్లి బస్తాల దొంగతనం విషయం చెప్పారు. దానికి నిరాకరించగా మద్యం ఆశ చూపి ఆయనను ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. ముగ్గురు కలిసి మద్యం సేవించిన అనంతరం రైలులో నుంచి బస్తాలను దొంగతనం చేద్దామని తెలపగా మరోసారి నిరాకరించటంతో ఇద్దరు కలిసి ఆత్రం రమేష్‌పై దాడికి పాల్పడినట్లు రైల్వే పోలీసులు చెబుతున్నారు.
అప్పటికే రైలులో నుంచి బస్తాలను దొంగలించి స్టేషన్‌కు చివరల్లో ఉన్న ముళ్ల పొదల్లో పడేసి వాటిని తరలించేందుకు ఆత్రం రమేష్‌ను సహాయం కోరినట్లు సమాచారం. దొంగతనం విషయం బయటకు పొక్కుతుందనే అనుమానంతో ఆత్రం రమేష్‌పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన రమేష్ అపస్మారక స్థితికి చేరుకోవటంతో అక్కడి నుంచి జారుకున్నారు. బయటి వ్యక్తుల ద్వారా సమాచారం అందుకున్న రమేష్ కుటుంబ సభ్యులు స్టేషన్‌కు చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న రమేష్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.
లోతుగా విచారిస్తే..
ఆత్రం రమేష్ మృతి కేసు రైల్వే పోలీసుల పరిధిలో ఉండగా, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని కేసులో అసలు నిందితులను గుర్తించి శిక్ష పడేలా చూడాలని గత శనివారం మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో రాస్తారోకో చేపట్టారు. దాంతో స్పందించిన కాగజ్‌నగర్ డీఎస్పీ వీవీఎస్ సుదీంద్ర కేసును రైల్వే పోలీసుల నుంచి తమ శాఖ పరిధిలోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకుని విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అయితే ఈ కేసు విషయంలో కొంత మంది రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేసి నిందితులకు మద్దతుగా నిలిచినట్లు సమాచారం.
రమేష్ మృతికి ముందు నుంచే కొందరు రాజకీయ నాయకులు బాధితుడి కుటుంబ సభ్యులకు డబ్బులు ఎరగా చూపి కేసు వాపస్ తీసుకునేలా ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసుల విచారణలో దాడితో పాటు దొంగతనం వెనుక ఉన్న అసలు సూత్రదారులు బయటకు వస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తమదైన శైలిలో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి ఈ వ్యవహారంలో దాగి ఉన్న రహస్యాలను బయటకు తీయాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment