Goods rail
-
ఎంఎంటీఎస్‌కు గూడ్స్ బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ‘రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే ఎంఎంటీఎస్ ఎంతో ముఖ్యం. హైదరాబాద్ ప్రజల రాకపోకలకు ఎంఎంటీఎస్ ‘లైఫ్‌లైన్’. ...ఇది ఒకప్పటి దక్షిణమధ్య రైల్వే ప్రాధాన్యం. అలాంటి ఎంఎంటీఎస్ రైళ్ల లక్ష్యం నీరుగారుతోంది. ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణ కంటే ఇప్పుడు గూడ్స్ రైళ్లే దక్షిణ మధ్య రైల్వేకు కీలకంగా మారాయి. బైపాస్ మార్గాల్లో వెళ్లవలసిన గూడ్స్ రైళ్లను సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా నడుపుతూ ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి వంటి ప్రధాన రైల్వేస్టేషన్ల నుంచి ప్రయాణికుల రైళ్లు మాత్రమే నడపాల్సి ఉండగా కొంతకాలంగా ఈ స్టేషన్ల నుంచి గూడ్స్ రైళ్లను సైతం నడుపుతున్నారు. దీంతో ప్రయాణికుల రైళ్లకు బ్రేకులు పడుతున్నాయి. ప్రత్యేకించి సికింద్రాబాద్ మీదుగా నడిచే గూడ్స్ వల్ల ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయడంతో పాటు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు స్టేషన్‌కు చేరుకోవడంలో జాప్యం నెలకొంటోంది. ప్రతి రోజు తెల్లవారు జామునే సికింద్రాబాద్‌కు చేరుకోవలసిన రైళ్లు మౌలాలీ, చర్లపల్లి స్టేషన్లలో నిలిచిపోతున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఎంఎంటీఎస్లపైన ప్రయాణికులు క్రమంగా నమ్మకాన్ని కోల్పోవలసి వస్తుంది. బైపాస్ ఉన్నా ఎందుకిలా... విజయవాడ, కాజీపేట్ తదితర ప్రాంతాల నుంచి ఉత్తరాది రాష్ట్రాల వైపు వెళ్లే సరుకు రవాణా రైళ్లు బైపాస్ మార్గంలో మౌలాలి–సనత్‌నగర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. కానీ కోవిడ్ కాలంలో పాలు, కూరగాయలు, అత్యవసర వస్తువులను వివిధ ప్రాంతాలకు చేరవేసేందుకు ప్రధాన రైల్వేస్టేషన్ల మీదుగా గూడ్స్ రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. కోవిడ్ అనంతరం పాత రూట్లలో ఈ రైళ్లను పునరుద్ధరించకపోవడం గమనార్హం. కాజీపేట్ వైపు నుంచి వచ్చే పలు సరుకు రవాణా రైళ్లు ఇప్పటికీ సికింద్రాబాద్ నుంచే నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికుల రైళ్ల నిర్వహణపైన ప్రభావం పడుతుంది. గూడ్స్ రైళ్ల కోసం ఏకంగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయడం గమనార్హం. ఒక్క శని, ఆదివారాలు రెండు రోజుల్లోనే 68 ఎంఎంటీఎస్ సర్వీసులను నిలిపివేయడం గమనార్హం. కోవిడ్ అనంతరం ఎంఎంటీఎస్ రైళ్ల కచ్చితమైన సమయపాలనను పునరుద్ధరించకపోవడమే కాకుండా సర్వీసులను కూడా రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యామ్నాయంగా సిటీ బస్సులు... ఎంఎంటీఎస్ రైళ్లకు బ్రేకులు పడుతూండడంతో ఆయా మార్గాలపైన ఆర్టీసీ దృష్టి సారించింది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీ, లింగంపల్లి వరకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రూట్లలో 280 కి పైగా అదనపు ట్రిప్పులను నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సగానికి తగ్గిన సర్వీసులు... కోవిడ్‌కు ముందు సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా, తదితర రూట్లలో రోజుకు 121 సర్వీసులు నడిచాయి.1.5 లక్షల మంది ప్రయాణం చేశారు. కోవిడ్ అనంతరం దశలవారీగా 70 నుంచి 80 రైళ్లను మాత్రమే పునరుద్ధరించారు.కానీ కచ్చితమై సమయపాలన లేకపోవడం వల్ల ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఉన్న సర్వీసుల్లోనూ వీకెండ్స్‌లో 34 నుంచి 40 రైళ్లను రద్దు చేస్తున్నారు. మిగతా రోజుల్లోనూ ట్రిప్పుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఒకప్పుడు లక్షన్నర మందికి రవాణా సదుపాయం కల్పించిన రైళ్లలో ఇప్పుడు 25 వేల మంది కూడా ప్రయాణం చేయడం లేదు. (చదవండి: క్లబ్ టెకీల అంశంలో... మరో ఇన్స్పెక్టర్కు పబ్ దెబ్బ) -
బోగీలు లేకుండానే గూడ్స్ రైలు ఇంజిన్ ముందుకు..
సాక్షి, బోనకల్(ఖమ్మం): సరుకు రవాణా గూడ్స్ రైలు బోగీల లింకు తెగిపోవడంతో గోవిందాపురం(ఏ) రైల్వే గేటు సమీపంలో సోమవారం ఓ గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై నిలిచిపోయాయి. విజయవాడ వైపు ఈ గూడ్సురైలు వెళ్తుండగా సాయంత్రం 4గంటల సమయంలో ఒక్కసారిగా లింక్ తెగింది. అయితే ఈ విషయాన్ని రైలు డ్రైవర్ గుర్తించకుండా ఇంజిన్‌ను ముందుకు తీసుకెళ్లారు. గార్డు సమాచారాన్ని అందించాక తిరిగి ఇంజిన్‌ను వెనుకకు తెచ్చి మరమ్మతులు చేశారు. గంట పాటు పట్టాలపై నిలవడంతో పలు ట్రెయిన్ల రాకపోకలు నిలిచిపోయాయి. గేటు వద్ద ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. -
చెవిలో హియర్ ఫోన్స్ పెట్టుకుని పట్టాలపై వెళ్తుండగా..
సాక్షి, మర్పల్లి(వికారాబాద్): గూడ్స్‌రైలు ఢీకొని బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని కొత్లాపూర్‌లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మండల పరిధిలోని కొత్లాపూర్‌కు చెందిన శానికే రాజిరెడ్డి కుమారుడు వసంత్‌రెడ్డి (16) మోమిన్‌పేట్ మండల కేంద్రంలోని ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్ద నూర్పిడి చేసి కుప్పగా పోసిన మొక్కజొన్నలపై కప్పి ఉన్న ప్లాస్టిక్ కవర్‌ను తీసేందుకు బైక్‌పై వెళ్లాడు. పొలం రైలు పట్టాల పక్కన ఉంది. వసంత్‌రెడ్డి పట్టాల పక్కన తన బైక్‌ను ఆపి చెవిలో హియర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతూ పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. బీదర్ నుంచి మర్పల్లి మీదుగా వికారాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొంది. దీంతో వసంత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులు అందజేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు. -
తప్పిన ప్రమాదం: ఆక్సిజన్ ట్యాంకర్ లీక్
రాయగడ: స్థానిక రైల్వేస్టేషన్లో ఆగిఉన్న గూడ్సు వ్యాగన్‌లోని ఓ ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి ఆక్సిజన్ లీక్ అయింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది అతికష్టం మీద ఆక్సిజన్ లీకేజీని అదుపుచేశారు. రౌర్కెలా నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న గూడ్సు స్థానిక రైల్వేస్టేషన్‌కి చేరుకోగానే సిగ్నల్స్ ఇవ్వకపోవడంతో అక్కడే కాసేపు దానిని నిలపాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి వాయువు బయటకు వచ్చినట్లు అక్కడి వారు గుర్తించారు. -
రమేష్ హత్య వెనుక రహస్యాలనేకం..!
సాక్షి, ఆసిఫాబాద్: స్నేహితుల చేతిలో హతమైన ఆత్రం రమేష్ మృతి వెనక అసలు కారణాలు మాత్రం అంతు చిక్కడం లేదు. దాడికి అసలైన కారణం దొంగతనమే అయితే ఆ దొంగతనం వెనుక ఉన్న అసలు సూత్రదారులెవరరనేది అంతుచిక్కడం లేదు. గూడ్స్ రైలులో నుంచి బస్తాలు దొంగతనం చేసేందుకు నిరాకరించాడనే కారణంతో దాడికి పాల్పడితే ఎన్ని నెలల నుంచి ఈ దొంగతనాలు కొనసాగుతున్నాయనేది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంలో రైల్వే సిబ్బంది ప్రమేయం లేకుండానే బస్తాల దొంగతనం ఎలా సాధ్యమవుతుంది..? అనే సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు మండల ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. రైలులో నుంచి బస్తాలను దొంగతనం చేసేందుకు సహాయం చేయకపోవటంతో ఆగ్రహించిన స్నేహితులు ఆత్రం రమేష్‌పై దాడికి పాల్పడటంతో విషయం బయటపడింది. కాలితో తట్టడంతోనే ఆత్రం రమేష్ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు చెబుతున్నా దాడిలో చాలామంది ఉండి ఉంటారని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపడితే నిందితులు బయటపడే అవకాశం ఉందని మండల వాసులు అంటున్నారు. బస్తాల దొంగతనం ఎన్నాళ్ల నుంచి కొనసాగుతోంది..? రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వేస్టేషన్లో నిత్యం ఏదో ఒక గూడ్స్ రైలు నిలిచి ఉంటుంది. అలా ఆగి ఉన్న గూడ్స్ రైలులో నుంచి కొంతకాలంగా రాత్రి సమయంలో ఎరువుల బస్తాలను దొంగిలిస్తూ వాటిని రైతులకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తతంగం వెనుక మండలానికి చెందిన పలువురు వ్యక్తులే ఉన్నట్లు అనుమానాలున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం పంటల సీజనల్లో రసాయనిక ఎరువులు సరాఫరా అధికంగా జరిగే సమయాల్లో దొంగతనం జరుగుతుందని చెప్పుకుంటున్నారు. గూడ్స్ రైలు వచ్చి నిలిచిందనే సమాచారం తెలియగానే సూత్రదారులు తమ అనుచరులను రంగంలోకి దింపి రాత్రి సమయంలో చోరీలకు పాల్పడుతుంటారని ప్రయాణికులు సైతం చెబుతున్నారు. రైలు బోగిల్లోని బస్తాలను స్టేషన్ చివర్లో ఉన్న ముళ్ల పొదల్లో పడేసి గుట్టు చప్పుడు కాకుండా వాహనాల్లో తరలించి సమీప రైతులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. అయితే స్టేషన్ ఆవరణలోనే ఈ తతంగం అంతా జరుగుతున్నా రైల్వే సిబ్బందికి ఏ మాత్రమూ తెలియకపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దొంగతనం బయటకి రావద్దనే దాడి..? రైలులో నుంచి బస్తాల దొంగతనానికి పాల్పడుతున్న విషయం బయటకు పొక్కుతుందనే కారణంతోనే ఆత్రం రమేష్‌పై దాడి జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మండల కేంద్రానికి చెందిన గోగర్ల రమేష్‌తోపాటు మరో వ్యక్తి కలిసి ముందుగా ఆత్రం రమేష్ ఇంటికి వెళ్లి బస్తాల దొంగతనం విషయం చెప్పారు. దానికి నిరాకరించగా మద్యం ఆశ చూపి ఆయనను ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. ముగ్గురు కలిసి మద్యం సేవించిన అనంతరం రైలులో నుంచి బస్తాలను దొంగతనం చేద్దామని తెలపగా మరోసారి నిరాకరించటంతో ఇద్దరు కలిసి ఆత్రం రమేష్‌పై దాడికి పాల్పడినట్లు రైల్వే పోలీసులు చెబుతున్నారు. అప్పటికే రైలులో నుంచి బస్తాలను దొంగలించి స్టేషన్‌కు చివరల్లో ఉన్న ముళ్ల పొదల్లో పడేసి వాటిని తరలించేందుకు ఆత్రం రమేష్‌ను సహాయం కోరినట్లు సమాచారం. దొంగతనం విషయం బయటకు పొక్కుతుందనే అనుమానంతో ఆత్రం రమేష్‌పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన రమేష్ అపస్మారక స్థితికి చేరుకోవటంతో అక్కడి నుంచి జారుకున్నారు. బయటి వ్యక్తుల ద్వారా సమాచారం అందుకున్న రమేష్ కుటుంబ సభ్యులు స్టేషన్‌కు చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న రమేష్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. లోతుగా విచారిస్తే.. ఆత్రం రమేష్ మృతి కేసు రైల్వే పోలీసుల పరిధిలో ఉండగా, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని కేసులో అసలు నిందితులను గుర్తించి శిక్ష పడేలా చూడాలని గత శనివారం మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో రాస్తారోకో చేపట్టారు. దాంతో స్పందించిన కాగజ్‌నగర్ డీఎస్పీ వీవీఎస్ సుదీంద్ర కేసును రైల్వే పోలీసుల నుంచి తమ శాఖ పరిధిలోకి ట్రాన్స్ఫర్ చేయించుకుని విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అయితే ఈ కేసు విషయంలో కొంత మంది రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేసి నిందితులకు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. రమేష్ మృతికి ముందు నుంచే కొందరు రాజకీయ నాయకులు బాధితుడి కుటుంబ సభ్యులకు డబ్బులు ఎరగా చూపి కేసు వాపస్ తీసుకునేలా ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసుల విచారణలో దాడితో పాటు దొంగతనం వెనుక ఉన్న అసలు సూత్రదారులు బయటకు వస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తమదైన శైలిలో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి ఈ వ్యవహారంలో దాగి ఉన్న రహస్యాలను బయటకు తీయాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
సాక్షి, అనంతగిరి: ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సంఘటన జిల్లాకేంద్రం వికారాబాద్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ నుంచి రాయిచూర్‌కు బొగ్గు లోడ్‌తో గూడ్స్ రైలు వికారాబాద్ మీదుగా వెళ్తోంది. బుధవారం తెల్లవారుజామున వికారాబాద్ సమీపానికి రాగానే కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో 7 బోగీలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. బోగీలు కిందపడడంతో పట్టాలు పూర్తిగా దెబ్బతినఆనయి. అయితే రైలుముందు భాగం, వెనుకభాగానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేవలం 7 బోగీలు ప్రమాదానికి గురవ్వగా 4 బోగీలు కిందికిదిగాయి. ఈ సంఘటనతో వెంటనే స్పందించిన రైల్వే అధికారులు అక్కడికు చేరుకున్నారు. ప్రమాదం తీరును పరిశీలించారు. హుటాహుటిన సిబ్బందిని పిలిపించి జేసీబీతో బొగ్గును, కిందపడిన బోగిలను పక్కకు జరిపారు. బోగీలను పక్కకు తొలగించిన అనంతరం పట్టాలకు మరమ్మతు పనులు చేస్తున్నారు. బోగీలను రైల్వే ట్రాక్ మీద నుంచి తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి వరకు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రమాదానికి కారణం బోగీల తప్పిదమా లేక రైలు పట్టాల తప్పిదమా తెలియాల్సి ఉంది.. కాగా ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. ఘటన స్థలాన్ని సికింద్రాబాద్ రైల్వే చీఫ్ సెక్యూరిటీ కమీషనర్ రమేష్ చందర్, జీయం గజానంద్ మల్యా, డీఆర్‌యం ఆనంద్ భటియా, సీనియర్ డీవిజనల్ సెక్యూరిటి కమీషనర్ రామకృష్ణ, ఏఎస్స్ ఉజ్జల్ దాస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్పాల్ లతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది వచ్చారు. పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా ఈ ప్రమాదంతో హైదాబాద్ నుంచి వికారాబాద్ వైపు వచ్చే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతినడంతో కొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. పట్టాలు ఊడిపోవడంతో సిబ్బంది సరి చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి వచ్చే రైళ్లను చిట్టిగడ్డ రైల్వేస్టేషన్‌కు రాగానే నిలిపివేస్తున్నారు. వికారాబాద్ నుంచి హైదరా బాద్ వైపు వెళ్లే రైళ్లు లేని సమయంలో లేదా అటు నుంచి వచ్చే రైళ్లను ఆపి ఒకే ట్రాక్ మీద రైళ్ల రాకపోకలను కొనసాగించారు. దీంతో రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పలు రైళ్లు రద్దు.. కాగా ప్రమాదంలో రైలు పట్టాలు ధ్వంసం కావడంతో పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. హైదరాబాద్–గుల్బర్గా (57156), గుల్బర్గా–హైదరాబాద్(57155), సికింద్రాబాద్–తాండూరు (67250), తాండూరు–సికింద్రాబాద్ (67249) రైళ్లను రద్దు చేశారు. గుంటూరు నుంచి వికారాబాద్ వరకు వచ్చే పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి వరకే నడిపారు. సికింద్రాబాద్–వికారాబాద్ ప్యాసింజర్‌ను శంకర్పల్లి వరకే నడిపించారు. ఈ ప్రమాదంతో వికారాబాద్ మీదుగా వెళ్లే రైళ్లన్నీ సుమారు గంటకు పైగా ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వికారాబాద్, తాండూరుకు వెళ్లే ఎన్నికల సిబ్బంది కూడా ఈ ప్రమాదంతో ఆలస్యంగా విధులకు చేరుకున్నారు. పలువురు ఉద్యోగులు బస్సుల్లో ప్రయాణించి ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. -
పట్టాల మధ్యలో యువతి..
సాక్షి, జమ్మికుంటరూరల్: తీవ్రగాయాలతో రైలు పట్టాల మధ్య పడి ఉన్న ఓ గుర్తు తెలియని యువతిని గమనించిన రైలు గార్డు సమయస్పూర్తితో వ్యవహరించి రైల్వే అధికారులకు అప్పగించిన సంఘటన ఆదివారం జమ్మికుంట పట్టణంలో జరిగింది. పట్టణ సమీపంలోని మడిపల్లి రైల్వే గేటు వద్ద తీవ్రగాయాలతో ఓ యువతి పట్టాల మధ్య పడి ఉంది. ఈ క్రమంలో కాజీపేట నుంచి బల్లార్ష వైపు వెళ్తున్న గూడ్స్ రైలు గార్డు సదరు యువతిని గమనించి, డ్రైవర్‌కు సమాచారం అందించటంతో యువతిని రైల్వేస్టేషన్ రైల్వే అప్పగించారు. దీంతో అధికారులు 108కు సమాచారం అందించి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. -
డ్రైవర్ లేని రైలు.. చివరికేమైందో తెలుసా?
సిడ్నీ : ఇనుప ఖనిజాన్ని మోసుకెళ్తున్న ఓ భారీ గూడ్స్ రైలు బండి పట్టాలు తప్పింది. మైనింగ్ దిగ్గజం బీహెచ్పీ కంపెనీకి చెందిన గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండా దాదాపు గంటసేపు ప్రయాణించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. బీహెచ్పీకి చెందిన 268 - వాగన్ రైలు ఇనుప ఖనిజాన్ని మోసుకుని పశ్చిమ ఆస్ట్రేలియాలోని పోర్ట్ హెడ్‌ల్యాండ్‌కు ప్రయాణం ప్రారంభించింది. ప్రయాణం మధ్యలో తనిఖీ చేయడం కోసం డ్రైవర్ తన క్యాబిన్ నుంచి దిగాడు. ఈ సమయంలో రైలు ఆటోమెటిగ్గా పట్టాలు తప్పి.. గంట సేపు దాదాపు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు కానీ కొన్ని రైళ్లు, 1,500 మీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ దెబ్బతిన్నదని సమాచారం. ప్రస్తుతం బీహెచ్పీ సిబ్బంది ఈ ట్రాక్‌ను బాగు చేసే పనిలో ఉన్నారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో వ్యాగన్ పాయింట్ లైన్‌పై గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. శనివారం వేకువజామున 2 గంటల సమయంలో 17 బోగీలు పట్టాలు తప్పడంతో హుటాహుటిన సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులు జనగామకు చేరుకున్నారు. జనగామలో బియ్యం లోడ్ చేసుకుని సికింద్రాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పిన బోగీలను వదిలేసి మిగతా బోగీలను సికింద్రాబాద్‌కు పంపించేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
కామారెడ్డిలో ఘోర ప్రమాదం
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం: మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామా నికి చెందిన ఉమకు నాలుగేళ్ల కుమారు డు సర్వేంద్ర ఉన్నాడు. ఈనెల 24న అతడి పుట్టిన రోజు.. శుక్రవారం తల్లి బాలవ్వ(60), తోటికోడలు, అత్తతో కలిసి లింగంపేటలోని పుట్టింటికి బయలుదేరింది ఉమ. కాచిగూడ –మన్మాడ్ రైలు ఎక్కి ఉదయం 9 గంటలకు కామారెడ్డిలో దిగారు. కామారెడ్డి రైల్వే స్టేషన్నుంచి కాలినడకన బస్టాండ్‌వైపు బయలుదేరింది. ఉమ చంకలో ఉన్న ఆమె కుమారుడు సర్వేంద్రను అమ్మమ్మ బాలవ్వ తీసుకుని నడుస్తోంది. అందరూ మాట్లాడుకుంటూ పట్టాలు దాటే ప్రయత్నంలో గూడ్సు రైలు దూసుకువచ్చింది. ఒక్కసారిగా రైలు ఢీకొట్టడంతో అమ్మమ్మ చంకలో ఉన్న సర్వేంద్ర అంతదూరం ఎగిరిపడి అక్కడికక్కడే కన్నుమూశాడు. బాలవ్వ తీవ్ర గాయాలు కాగా.. కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. అమ్మమ్మ ఒడికి మారిన కుమారుడు.. ఆమెతోపాటే అనంతలోకాలకు చేరాడు. మనవడికి పుట్టిన రోజు కోసం బట్టలు కొనిపెడతానంటూ ఎత్తుకున్న అమ్మమ్మ.. పట్టాలు దాటుతూ మనవడితో కలిసి మరుభూమికి చేరింది. తన కళ్లెదుటే కుమారుడు, తల్లి మరణించడంతో ఉమ షాక్‌కు గురైంది. అటు కొడుకును, ఇటు తల్లిని కోల్పోయిన ఉమకు కన్నీరే మిగిలింది. అప్పటి దాకా ఎంతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. చదువుల తల్లి... భిక్కనూరు మండలం తిప్పాపూర్‌కు చెందిన నవ్య బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె చదువుల తల్లే.. పీజీ పూర్తి చేసి, మంచి ఉద్యోగం సంపాదిస్తానని స్నేహితులు, కుటుంబ సభ్యులతో పేర్కొనేది. మరో నెల రోజుల్లో డిగ్రీ పరీక్షలు ఉండడంతో కష్టపడి చదువుతోంది. పొద్దున్నే కాలేజీకి రెడీ అయిన కూతురు.. మధ్యాహ్నం తిరిగి వస్తానని అమ్మకు చెప్పి బయలుదేరింది. స్నేహితులతో కలిసి కాచిగూడ –మన్మాడ్ రైలెక్కిన నవ్య.. కామారెడ్డి స్టేషన్లో దిగి రోజులాగే పట్టాలు దాటే ప్రయత్నంలో దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టడంతో మృత్యువాత పడింది. కూతురు మరణాన్ని చూసి తల్లి నాగమణి గుండెలు బాదుకుంటూ రోదించింది. విగత జీవిగా పడి ఉన్న అక్కను చూసి తమ్ముడు నరేశ్ గుండెలవిసేలా ఏడ్చాడు. నవ్య పదో తరగతి, ఇంటర్లో మంచి మార్కులు పొందిందని, చదువులో చురుకుగా ఉండడంతో కామారెడ్డిలోని వశిష్ట కాలేజీలో డిగ్రీలో చేర్పించామని బంధువులు తెలిపారు. డిగ్రీలోనూ మంచి మార్కులు తెచ్చుకుందన్నారు. నవ్య మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. నవ్య తండ్రి నర్సింలు ఐదేళ్ల క్రితం బతుకుదెరువుకోసం దుబాయి వెళ్లాడు. ఊహించని ప్రమాదంతో.. రైల్వేస్టేషన్లో దిగిన ప్రయాణికులు.. ప్రమాదం గూడ్స్ రైలు రూపంలో వస్తుందని ఊహించలేకపోయారు. వారు దిగిన రైలు అక్కడే ఉంది. మధ్యలోని ట్రాక్‌లో మరో రైలుకు సంబంధించిన ఇంజిన్ ఉంది. చివరి ట్రాక్ మీదుగా నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే గూడ్స్ రైలు వచ్చింది. సంఘటన స్థలానికి కొద్దిదూరంలో ఉన్నప్పుడు గూడ్స్ రైలు హారన్ మోగించారు. పట్టాలు దాటుతున్న ప్రయాణికులు అది అప్పటికే అక్కడున్న రైలు సైరన్ అనుకుని పొరబడ్డారు. మధ్యట్రాక్లోని ఇంజిన్ శబ్ధం అనుకుని కంగారు పడి గూడ్స్ రైలు రాకను గమనించకుండా చివరి ట్రాక్ పైకి వెళ్లిపోయారని, దీంతో ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ శ్వేత పరిశీలించారు. రైల్వే, పోలీసు అధికారులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. తిప్పాపూర్‌లో విషాదఛాయలు భిక్కనూరు: విద్యార్థి బోయిని నవ్య(19) స్వగ్రామం తిప్పాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. నవ్య తండ్రి నర్సింలు బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లాడు. తల్లి నాగమణి ఇంట్లో ఉంటోంది. తమ్ముడు కామారెడ్డిలో ఇంటర్ చదువుతుండగా.. నవ్య కామారెడ్డిలోనే డిగ్రీ చదువుతోంది. కాలేజీకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన కూతురు రైలు ఢీకొని మరణించిందన్న విషయం తెలుసుకుని నాగమణి కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కామారెడ్డికి వెళ్లి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తీసుకుని వచ్చి, అంత్యక్రియలు నిర్వహించారు. -
వంగపల్లిలో నిలిచిపోయిన గూడ్సు రైలు
యాదగిరిగుట్ట (నల్గొండ జిల్లా) : యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వే గేటు మధ్యలో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గూడ్సు రైలు ఆగిపోయింది. సాంకేతిక సమస్య వల్ల రైలు ఆగిపోయినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. రైలు సరిగ్గా రోడ్డు మార్గానికి అడ్డంగా ఆగిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. -
బిడ్డతో సహా తల్లి ఆత్మహత్య
కేససముద్రం (వరంగల్ జిల్లా) : కేససముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్సు రైలు కిందపడి అలివేలు(21) అనే వివాహిత తన రెండు సంవత్సరాల కుమారుడు కౌశిక్‌తో సహా ఆత్మహత్య చేసుకుంది. రాము అనే వ్యక్తిని అలివేలు ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన అలివేలు కుమారుడితో సహా రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రైవర్ నిర్లక్ష్యంతో నిలిచిన రెండు రైళ్లు
భువనగిరి (నల్గొండ జిల్లా) : డ్రైవర్ నిర్లక్ష్యంతో భువనగిరి రైల్వే స్టేషన్లో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపేశారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇంటర్సిటీ, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. అంతకుముందు సికింద్రాబాద్ వైపు వెళ్లిన ఒక గూడ్సు రైలు బగిడిపల్లి ర్వైల్వే స్టేషన్లో సిగ్నల్ ఇవ్వకున్నా ముందుకు వెళ్లిపోవడంతో గత్యంతరం లేక అదే మార్గంలో వెళ్లనున్న రైళ్లను భువనగిరిలోనే ఆపడం జరిగింది. గూడ్సు రైలు సికింద్రాబాద్ చేరేవరకూ ఈ రైళ్లను ఇక్కడే ఆపేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. గూడ్సు రైలు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థతి దాపురించిందని వారంటున్నారు. అదే మార్గంలో వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ రైళ్లను వదిలితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున తాము ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
విశాఖలో పట్టాలు తప్పిన గూడ్స్
విశాఖ: విశాఖపట్నం జిల్లా కరకవలస- బొర్రా రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం ఉదయం గూడ్సు రైలు పట్టాలు తప్పింది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన గూడ్సురైలు బొర్రా ర్వేస్టేషన్ దాటగానే పట్టాలు తప్పింది. రెండు బోగీలు పట్టాలు తప్పి అడ్డంగా పడ్డాయి. విషయం తెలిసిన వెంటనే తూర్పు మధ్య రైల్వే అధికారులు, సిబ్బంది వచ్చి రైలు మార్గాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడినందున విశాఖపట్నం నుంచి కొరడోల్ వెళ్లే ప్యాసింజర్ రైలును రద్దుచేశారు. పట్టాలు సరిచేసిన తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు చెప్పారు. -
26న పలు రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: నెల్లూరు-గూడూరు స్టేషన్ల మధ్య గూడ్సు రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో రైళ్ల రద్దు, దారిమళ్లింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శుక్రవారం కూడా విజయవాడ-మద్రాస్ మధ్య నడిచే జనశతాబ్ది, పినాకిని, కాకినాడ-బెంగళూర్ శేషాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. అలాగే 26న(శనివారం) కూడా విజయవాడ-మద్రాస్ జనశతాబ్ది, పినాకిని, ఆదిలాబాద్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు కానున్నాయి. 30న సికింద్రాబాద్-విశాఖ ప్రత్యేక రైళ్లు రద్దు.. ఈ నెల 30, మే 1వ తేదీల్లో సికింద్రాబాద్-విశాఖ మధ్య ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. 30న రాత్రి 11.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, మే ఒకటో తేదీన సాయంత్రం 7.05 గంటలకు విశాఖ నుంచి హైదరాబాద్ రావాల్సిన ైరె ళ్లను సాంకేతిక కారణాలతో రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
పట్టాలు తప్పిన గూడ్స్
కడప రైల్వేస్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. రెండు ఇంజిన్లు, వ్యాగన్లు ట్రాక్ పక్కకు ఒరిగిపోయాయి. 40 మీటర్ల మేర ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైళ్లన్నింటినీ ఒంటిమిట్ట, రాజంపేట, నందలూరులో గంటలకొద్దీ నిలిపివేశారు. కడప అర్బన్, న్యూస్‌లైన్ : కడప రైల్వేస్టేషన్ మూడవ ప్లాట్ఫారం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలుకు సంబంధించి రెండు ఇంజన్లు, రెండు వ్యాగన్లు ట్రాక్ పక్కకు ఒరిగిపోయాయి. 40 మీటర్ల మేర ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. వివరాల్లోకి వెళితే....గూడ్స్ రైలు కృష్ణపట్నం నుంచి 59 వ్యాగన్ల బొగ్గు లోడును మంగళవారం తెల్లవారుజామున తీసుకొచ్చింది. కృష్ణపట్నం, గూడూరు, రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల మీదుగా ముద్దనూరు సమీపంలోని ఆర్టీపీపీకి తీసుకెళ్లేందుకు కడప రైల్వేస్టేషన్‌కు చేరుకునేలోపు ప్రమాదం జరిగింది. కడప రైల్వేస్టేషన్ మూడవ ప్లాట్ఫారం ట్రాక్ నుంచి నాల్గవ ట్రాక్‌లోకి గూడ్స్ రైలు ఇంజన్లతోసహా వెళ్లేలోపు ట్రాక్‌పై అదుపుతప్పి పడిపోయింది. రెండు రైలింజన్లు, రెండు వ్యాగన్లు పూర్తిగా తప్పిపోయి కుడివైపుకు ఒరిగాయి. ట్రాక్‌కు నిర్మితమైన పట్టాలు విడిపోయి దెబ్బతిన్నాయి. దీంతో ఇతర రైళ్లు రాకుండా పూర్తిగా అంతరాయాన్ని కలిగించాయి. రైళ్లనన్నింటిని ఒంటిమిట్ట, రాజంపేట, నందలూరులలో గంటలకొద్ది నిలిపి వేశారు. సంఘటన జరిగిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. రైలింజన్లను, రెండు వ్యాగన్లను తప్పించి మిగతా వ్యాగన్లను వెనక్కి మరలించి తిరిగి ఆర్టీపీపీకి చేర్పించేందుకు తమవంతు కృషి చేశారు. రేణిగుంట నుంచి లూకాస్ అనే క్రేన్ ట్రైన్‌ను రైల్వే అధికారులు తీసుకొచ్చి రైలింజన్లను మరలా ట్రాక్‌పై చేర్చేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. తృటిలో తప్పిన ప్రమాదం గూడ్స్ రైలు వేగంగా మూడవ ట్రాక్ నుంచి నాల్గవ ట్రాక్‌కు వెళ్లే సమయంలో అదుపుతప్పి రైల్ ట్రాక్ కుడివైపుగా ఒరిగిపోయింది. అదే సమయంలో ఐదవ లైన్లో ఐఓసీ ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్ ట్యాంకర్లను అన్లోడ్ ప్రక్రియ చేస్తున్నారు. రైలింజన్లు కుడివైపుకు కాకుండా ఎడమవైపుకు ఒరిగినా, లేక వ్యాగన్లు ఎక్కువ సంఖ్యలో ఒరిగినా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. ప్రమాదానికి కారణం ట్రాకా? వేగమా? ఈ ప్రమాదం జరగడానికి ట్రాక్ నాణ్యత లోపించడం వల్ల జరిగిందా? లేక రైలింజన్ లోకోపెలైట్, అసిస్టెంట్ లోకో పెలైట్ స్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి పరిమితమైన వేగం 15 నుంచి 20 కిలోమీటర్ల మేరకు ప్రయాణించాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా దూసుకు రావడంతో ప్రమాదం జరిగిందా? అనేది నిర్దారణ కావాల్సి ఉంది. ఇప్పటికే రేణిగుంట నుంచి రైల్వే అధికారులు వచ్చారు. సాయంత్రం ఐదు గంటలలోపు కడపకు చేరుకోవాల్సిన దాదార్ ఎక్స్‌ప్రెస్‌ను నందలూరులో కొన్ని గంటల వరకు అలాగే ఉంచారు. హరిప్రియ, రాయలసీమ, వెంకటాద్రి రైళ్లను కూడా కడప రైల్వేస్టేషన్ మూడవ ప్లాట్‌ఫాం మీదుగా ప్రతిరోజు ప్రయాణించాల్సి ఉంది. కానీ ఈ సంఘటనతో ఒకటవ ప్లాట్ఫారం మీదుగానే పంపించే ప్రయత్నం చేస్తున్నారు.