సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం: మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామా నికి చెందిన ఉమకు నాలుగేళ్ల కుమారు డు సర్వేంద్ర ఉన్నాడు. ఈనెల 24న అతడి పుట్టిన రోజు.. శుక్రవారం తల్లి బాలవ్వ(60), తోటికోడలు, అత్తతో కలిసి లింగంపేటలోని పుట్టింటికి బయలుదేరింది ఉమ. కాచిగూడ –మన్మాడ్ రైలు ఎక్కి ఉదయం 9 గంటలకు కామారెడ్డిలో దిగారు. కామారెడ్డి రైల్వే స్టేషన్‌నుంచి కాలినడకన బస్టాండ్‌వైపు బయలుదేరింది. ఉమ చంకలో ఉన్న ఆమె కుమారుడు సర్వేంద్రను అమ్మమ్మ బాలవ్వ తీసుకుని నడుస్తోంది. అందరూ మాట్లాడుకుంటూ పట్టాలు దాటే ప్రయత్నంలో గూడ్సు రైలు దూసుకువచ్చింది. ఒక్కసారిగా రైలు ఢీకొట్టడంతో అమ్మమ్మ చంకలో ఉన్న సర్వేంద్ర అంతదూరం ఎగిరిపడి అక్కడికక్కడే కన్నుమూశాడు. బాలవ్వ తీవ్ర గాయాలు కాగా.. కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. అమ్మమ్మ ఒడికి మారిన కుమారుడు.. ఆమెతోపాటే అనంతలోకాలకు చేరాడు. మనవడికి పుట్టిన రోజు కోసం బట్టలు కొనిపెడతానంటూ ఎత్తుకున్న అమ్మమ్మ.. పట్టాలు దాటుతూ మనవడితో కలిసి మరుభూమికి చేరింది. తన కళ్లెదుటే కుమారుడు, తల్లి మరణించడంతో ఉమ షాక్‌కు గురైంది. అటు కొడుకును, ఇటు తల్లిని కోల్పోయిన ఉమకు కన్నీరే మిగిలింది. అప్పటి దాకా ఎంతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
చదువుల తల్లి...
భిక్కనూరు మండలం తిప్పాపూర్‌కు చెందిన నవ్య బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె చదువుల తల్లే.. పీజీ పూర్తి చేసి, మంచి ఉద్యోగం సంపాదిస్తానని స్నేహితులు, కుటుంబ సభ్యులతో పేర్కొనేది. మరో నెల రోజుల్లో డిగ్రీ పరీక్షలు ఉండడంతో కష్టపడి చదువుతోంది. పొద్దున్నే కాలేజీకి రెడీ అయిన కూతురు.. మధ్యాహ్నం తిరిగి వస్తానని అమ్మకు చెప్పి బయలుదేరింది. స్నేహితులతో కలిసి కాచిగూడ –మన్మాడ్ రైలెక్కిన నవ్య.. కామారెడ్డి స్టేషన్లో దిగి రోజులాగే పట్టాలు దాటే ప్రయత్నంలో దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టడంతో మృత్యువాత పడింది. కూతురు మరణాన్ని చూసి తల్లి నాగమణి గుండెలు బాదుకుంటూ రోదించింది. విగత జీవిగా పడి ఉన్న అక్కను చూసి తమ్ముడు నరేశ్ గుండెలవిసేలా ఏడ్చాడు. నవ్య పదో తరగతి, ఇంటర్‌లో మంచి మార్కులు పొందిందని, చదువులో చురుకుగా ఉండడంతో కామారెడ్డిలోని వశిష్ట కాలేజీలో డిగ్రీలో చేర్పించామని బంధువులు తెలిపారు. డిగ్రీలోనూ మంచి మార్కులు తెచ్చుకుందన్నారు. నవ్య మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. నవ్య తండ్రి నర్సింలు ఐదేళ్ల క్రితం బతుకుదెరువుకోసం దుబాయి వెళ్లాడు.
ఊహించని ప్రమాదంతో..
రైల్వేస్టేషన్‌లో దిగిన ప్రయాణికులు.. ప్రమాదం గూడ్స్ రైలు రూపంలో వస్తుందని ఊహించలేకపోయారు. వారు దిగిన రైలు అక్కడే ఉంది. మధ్యలోని ట్రాక్‌లో మరో రైలుకు సంబంధించిన ఇంజిన్ ఉంది. చివరి ట్రాక్ మీదుగా నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే గూడ్స్ రైలు వచ్చింది. సంఘటన స్థలానికి కొద్దిదూరంలో ఉన్నప్పుడు గూడ్స్ రైలు హారన్ మోగించారు. పట్టాలు దాటుతున్న ప్రయాణికులు అది అప్పటికే అక్కడున్న రైలు సైరన్ అనుకుని పొరబడ్డారు. మధ్యట్రాక్‌లోని ఇంజిన్ శబ్ధం అనుకుని కంగారు పడి గూడ్స్ రైలు రాకను గమనించకుండా చివరి ట్రాక్ పైకి వెళ్లిపోయారని, దీంతో ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ శ్వేత పరిశీలించారు. రైల్వే, పోలీసు అధికారులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.
తిప్పాపూర్‌లో విషాదఛాయలు
భిక్కనూరు: విద్యార్థి బోయిని నవ్య(19) స్వగ్రామం తిప్పాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. నవ్య తండ్రి నర్సింలు బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లాడు. తల్లి నాగమణి ఇంట్లో ఉంటోంది. తమ్ముడు కామారెడ్డిలో ఇంటర్ చదువుతుండగా.. నవ్య కామారెడ్డిలోనే డిగ్రీ చదువుతోంది. కాలేజీకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన కూతురు రైలు ఢీకొని మరణించిందన్న విషయం తెలుసుకుని నాగమణి కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కామారెడ్డికి వెళ్లి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తీసుకుని వచ్చి, అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment