
న్యూఢిల్లీ:దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 18 మంది మృతి చెందిన తర్వాత కూడా పరిస్థితి మారలేదు. మరుసటి రోజు ఆదివారం(ఫిబ్రవరి16) కూడా రైల్వేస్టేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.దీనికి కారణం సీట్ల కోసం ప్రయాణికులు ముందు వెనుకా చూసుకోకుండా మిగిలిన వారిని తోసుకుంటూ వెళ్లి రైళ్లు ఎక్కడమే కారణం.
శనివారం సాయంత్రం తొక్కిసలాట జరిగిన చోటుకు దగర్లోనే ప్లాట్‌ఫాం నంబర్ 16 దగ్గర బీహార్ సంపర్క్ క్రాంతి రైలు కోసం ప్రయాణికులు మళ్లీ ఎగబడ్డారు.భారీ లగేజ్ పట్టుకుని ఒకరిని ఒకరు తోసుకుంటూ ఎలాగైనా రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ బీభత్సం సృష్టించారు. ఒక ముసలావిడనైతే ఎమర్జెన్సీ కిటికి నుంచి రైలులోకి నెట్టడానికి ప్రయత్నించగా ఆమె అందులో ఇరుక్కుపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
రైలు డోర్ దగ్గర ఆ ముసలావిడ ఎక్కలేని పరిస్థితి ఉండడం వల్లే ఆమెను ఎమర్జెన్సీ కిటికీ నుంచి నెట్టారు.ఇంతేకాకుండా దర్బంగా వెళ్లే రైలు ప్లాట్‌ఫాంపైకి రాగానే రైలులోకి ఎక్కేందుకు రిజర్వేషన్‌లేని, రిజర్వేషన్ కన్ఫామ్ కాని ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడ్డారు.
ఎమర్జెన్సీ కిటీకిలో నుంచి లగేజ్‌లను విసురుతూ సీట్లు ముందుగానే ఆపేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలోనే అడ్డొచ్చిన వారిని నెట్టివేయడం గందరగోళానికి దారి తీసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ రైల్వేప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)కు సంబంధించిన ఒక్క పోలీసు లేకపోవడం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఉన్న దారుణమైన పరిస్థితులను అద్దం పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment