కడప రైల్వేస్టేషన్‌లో మంగళవారం మధ్యాహ్నం గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. రెండు ఇంజిన్లు, వ్యాగన్లు ట్రాక్ పక్కకు ఒరిగిపోయాయి. 40 మీటర్ల మేర ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైళ్లన్నింటినీ ఒంటిమిట్ట, రాజంపేట, నందలూరులో గంటలకొద్దీ నిలిపివేశారు.
కడప అర్బన్, న్యూస్‌లైన్ : కడప రైల్వేస్టేషన్ మూడవ ప్లాట్‌ఫారం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలుకు సంబంధించి రెండు ఇంజన్లు, రెండు వ్యాగన్లు ట్రాక్ పక్కకు ఒరిగిపోయాయి. 40 మీటర్ల మేర ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. వివరాల్లోకి వెళితే....గూడ్స్ రైలు కృష్ణపట్నం నుంచి 59 వ్యాగన్ల బొగ్గు లోడును మంగళవారం తెల్లవారుజామున తీసుకొచ్చింది. కృష్ణపట్నం, గూడూరు, రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల మీదుగా ముద్దనూరు సమీపంలోని ఆర్టీపీపీకి తీసుకెళ్లేందుకు కడప రైల్వేస్టేషన్‌కు చేరుకునేలోపు ప్రమాదం జరిగింది. కడప రైల్వేస్టేషన్ మూడవ ప్లాట్‌ఫారం ట్రాక్ నుంచి నాల్గవ ట్రాక్‌లోకి గూడ్స్ రైలు ఇంజన్లతోసహా వెళ్లేలోపు ట్రాక్‌పై అదుపుతప్పి పడిపోయింది. రెండు రైలింజన్లు, రెండు వ్యాగన్లు పూర్తిగా తప్పిపోయి కుడివైపుకు ఒరిగాయి.
ట్రాక్‌కు నిర్మితమైన పట్టాలు విడిపోయి దెబ్బతిన్నాయి. దీంతో ఇతర రైళ్లు రాకుండా పూర్తిగా అంతరాయాన్ని కలిగించాయి. రైళ్లనన్నింటిని ఒంటిమిట్ట, రాజంపేట, నందలూరులలో గంటలకొద్ది నిలిపి వేశారు. సంఘటన జరిగిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. రైలింజన్లను, రెండు వ్యాగన్లను తప్పించి మిగతా వ్యాగన్లను వెనక్కి మరలించి తిరిగి ఆర్టీపీపీకి చేర్పించేందుకు తమవంతు కృషి చేశారు. రేణిగుంట నుంచి లూకాస్ అనే క్రేన్ ట్రైన్‌ను రైల్వే అధికారులు తీసుకొచ్చి రైలింజన్లను మరలా ట్రాక్‌పై చేర్చేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.
తృటిలో తప్పిన ప్రమాదం
గూడ్స్ రైలు వేగంగా మూడవ ట్రాక్ నుంచి నాల్గవ ట్రాక్‌కు వెళ్లే సమయంలో అదుపుతప్పి రైల్ ట్రాక్ కుడివైపుగా ఒరిగిపోయింది. అదే సమయంలో ఐదవ లైన్‌లో ఐఓసీ ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్ ట్యాంకర్లను అన్‌లోడ్ ప్రక్రియ చేస్తున్నారు. రైలింజన్లు కుడివైపుకు కాకుండా ఎడమవైపుకు ఒరిగినా, లేక వ్యాగన్లు ఎక్కువ సంఖ్యలో ఒరిగినా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉండేది.
ప్రమాదానికి కారణం ట్రాకా? వేగమా?
ఈ ప్రమాదం జరగడానికి ట్రాక్ నాణ్యత లోపించడం వల్ల జరిగిందా? లేక రైలింజన్ లోకోపెలైట్, అసిస్టెంట్ లోకో పెలైట్ స్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి పరిమితమైన వేగం 15 నుంచి 20 కిలోమీటర్ల మేరకు ప్రయాణించాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా దూసుకు రావడంతో ప్రమాదం జరిగిందా? అనేది నిర్దారణ కావాల్సి ఉంది. ఇప్పటికే రేణిగుంట నుంచి రైల్వే అధికారులు వచ్చారు. సాయంత్రం ఐదు గంటలలోపు కడపకు చేరుకోవాల్సిన దాదార్ ఎక్స్‌ప్రెస్‌ను నందలూరులో కొన్ని గంటల వరకు అలాగే ఉంచారు. హరిప్రియ, రాయలసీమ, వెంకటాద్రి రైళ్లను కూడా కడప రైల్వేస్టేషన్ మూడవ ప్లాట్‌ఫాం మీదుగా ప్రతిరోజు ప్రయాణించాల్సి ఉంది. కానీ ఈ సంఘటనతో ఒకటవ ప్లాట్‌ఫారం మీదుగానే పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
పట్టాలు తప్పిన గూడ్స్
Published Wed, Apr 2 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM
Advertisement
Advertisement