kadapa railway station
-
పట్టాలు తప్పిన రైల్వే జంక్షన్లు.!
రాజంపేట: రైల్వే జంక్షన్లు అభివృద్ధిలో పట్టాలు తప్పాయి. హోదా ఘనం.. ప్రగతిలో హీనంగా మారాయి. సాదాసీదా స్టేషన్లుగానే మిగిలి పోయాయి. ముంబయి–చైన్నె రైల్వే మార్గంలోని గుత్తి–రేణిగుంట మధ్య మూడింటిని జంక్షన్ల స్టేషన్లుగా గుర్తించారు. కడప, ఎర్రగుంట్ల, ఓబులవారిపల్లె రైల్వేస్టేషన్లను దక్షిణ మధ్య రైల్వే ఇటీవల జంక్షన్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పేరుకు మాత్రమే జంక్షన్స్టేషన్లుగా నిలిచిపోయాయి. కేవలం ప్రకటనతో మమా అనిపించారు. ఇతర ప్రాంతాల వాటితో అభివృద్ధితో పోలికే లేకుండా పోయింది. కొన్ని రైళ్లు కూడా ఆగడం లేదు. రైలు మార్గాల అనుసంధానతతో.. రైల్వేబడ్జెట్ మేరకు 1996–1997లో ప్రారంభమైన ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గంతో ఎర్రగుంట్లను జంక్షన్‌గా గుర్తించారు. 2008–2009లో కడప –బెంగళూరు రైలుమార్గం ఏర్పాటైంది. ఈ మార్గంతో కడప రైల్వేస్టేషన్ జంక్షన్‌గా ఏర్పడింది. 2005–2006లో కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైలుమార్గం ఏర్పాటైంది. ఓబులవారిపల్లె రైల్వేస్టేషన్.. కృష్ణపట్నం రైలుమార్గానికి అనుసంధానత (కనెక్టివిటి) స్టేషన్ కావడంతో జంక్షన్‌గా గుర్తించారు. అటకెక్కిన కడప రీడెవలప్మెంట్ ఎయిర్పోర్ట్సును తలిపించేలా రైల్వేస్టేషన్లను రీ డెవలప్మెంట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కడప రైల్వేస్టేషన్‌ను రీడెవలప్మెంట్ చేసేందుకు గతంలో రైల్వేశాఖ నిర్ణయించింది. ఆ తర్వాత అటకెక్కించింది. ఏ కేటగిరిలో కడప రైల్వేస్టేషన్ ఉంది. విశాలమైన ప్లాట్‌ఫాంలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆధునిక సౌకర్యాల లేమి కనిపిస్తోంది. రీడెవలప్మెంట్ వెనక్కి వెళ్లిపోయిందనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు కడప–బెంగళూరు రైలు మార్గ అనుసంధానంతో జంక్షన్‌గా ఉన్నప్పటికీ.. ఆ స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదు. కాలుష్యకోరల నుంచి విముక్తేదీ? ఎర్రగుంట్ల రైల్వే జంక్షన్‌ను కాలుష్య కోరల్లో నుంచి విముక్తి కల్పించే దిశగా రైల్వే శాఖ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. పైగా ఇప్పుడు లోకోరన్నింగ్స్టాప్ క్రూసెంటర్ ఏర్పాటు చేశారు. దాని నిర్వహణ కూడా విఫలమైందని రన్నింగ్‌స్టాప్ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. డివిజన్ అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల అనవసర వ్యయంతో రైల్వేకిఽ భారీగా నష్టం కలిగించారు. ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేసే పరిస్థితులు కనుచూపు మేరలో కనిపించడం లేదు. స్థల లేమి సమస్య ఓ వైపు పీడిస్తోంది. గ్రామీణ స్టేషన్‌గానే ఓబులవారిపల్లె ఓబులవారిపల్లె జంక్షన్ నేటికీ గ్రామీణ రైల్వేస్టేషన్గానే కొనసాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్స్ లేవు. పైగా స్టేషన్ ఔటరు నుంచి విజయవాడ డివిజన్ పరిధిలోకి వెళ్లిపోయింది. కేవలం స్టేషన్ మాత్రమే గుంతకల్ డివిజన్లో ఉంది. జంక్షన్‌న్ కాగానే స్టేషన్ రూపురేఖలు మారిపోతాయని ఇక్కడి ప్రాంతీయులు భావించారు. అయితే కలగానే మిగిలిపోయింది. అభివృద్ధి చేయాలి ఓబులవారిపల్లె రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగా రైల్వేబోర్డు యోచించాలి. ఈ విషయాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తాను. అన్ని రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరుతాను. ఇప్పటికీ ఎంపీ రైల్వే సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నారు. –కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే, రైల్వేకోడూరు కేంద్రం దృష్టి సారించాలి కడప రైల్వేస్టేషన్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలి. అధునాతన సౌకర్యాలు కల్పించాలి. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కడప రైల్వేల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు రైల్వే శాఖ మంత్రి, అధికారులను కలిశారు. పేరుకే జంక్షన్‌లా ఉంది. ఎయిర్‌పోర్టులా తీర్చిదిద్దాలి. –బీహెచ్ ఇలియాస్, డైరెక్టర్, ఏపీఎన్ఆర్టీఎస్, కడప -
మాజీ ఎంపీల కృషి.. ప్రయాణికుల ఖుషీ..
కడప కోటిరెడ్డి సర్కిల్: తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు కడప స్టేషన్ వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్యే అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఈ రైలును పొడిగించాలని కడప, రాజంపేట మాజీ పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పలుసార్లు పార్లమెంటులో చర్చించారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను వీరు స్వయంగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. దక్షిణ మధ్య రైల్యే బోర్డు మీటింగ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం రైలును పొడిగించాలని పట్టుపట్టారు. అందుకు స్పందించిన కేంద్ర మంత్రి, దక్షిణ మధ్య రైల్వేబోర్డు అధికారులు కడప వరకు తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును ఎట్టకేలకు పొడిగించారు. ఈ రైలు విశాఖనుంచి బయలు దేరి కడపకు రానుంది. ఈ రైలు రాకతో రాజధాని ప్రయాణికులకు కష్టాలు తీరనున్నాయి. ఫిబ్రవరి 1 సాయంత్రం 5.5 గంటలకు కడప నుంచి రైలు బయలుదేరి తిరుపతికి వెళ్లి అటునుంచి విశాఖకు బయలుదేరుతుంది. నిన్నటి వరకు ప్రయాణికులు విజయవాడకువెళ్లాలంటే ధర్మవరం–విజయవాడ రైలును ఆశ్రయించాల్సి వచ్చేది. ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు,నంద్యాల మీదుగా వెళ్లాల్సి వచ్చేది. వారానికి 3రోజులు మాత్రమే ఈ రైలు నడుస్తోంది దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు విశాఖ–తిరుమలఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి రోజు నడుస్తుంది కాబట్టి రాజధానికి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. అభినందనీయం.. కడప నుంచి రాజధాని మీదుగా రైలు సౌకర్యం కల్పించడం అభినందనీయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లా నుంచి రాజధానికి వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే వారన్నారు. ఈ క్రమంలో అనేకమార్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి కడపనుంచి రాజధానికి నేరుగా ఏదో ఒక మార్గంలో రైలు సౌకర్యం కల్పించాలని కోరామన్నారు. సమయం ఇలా.. విశాఖ–కడప ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖపట్నంలో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి విజయవాడ మీదుగా తిరుపతికి మరుసటి రోజు ఉదయం 4.50 గంటలకు చేరుకుంటుంది. తిరుపతి నుంచి 5.20 గంటలకు బయలుదేరి రైల్వేకోడూరు, రాజంపేట, నందలూరు మీదుగా 8.25 గంటలకు కడప రైల్వేస్టేషన్‌కు వస్తుంది. ప్రతి రోజు సాయంత్రం 5.05 గంటలకు కడప స్టేషన్లో బయలుదేరి తిరుపతికి రాత్రి 8.00 గంటలకు చేరుకుంటుంది. అక్కడినుంచి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి మీదుగా విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, ద్వారాపూడి, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, దువ్వాడ, విశాఖపట్నంకు ఉదయం 11.30 గంటలకు చేరుకుంటుంది. మాజీ ఎంపీలకు, దక్షిణ మధ్య రైల్యే అధికారులకు జిల్లాలోని ప్రయాణికులు కృతజ్ఞతలు చెబుతున్నారు. -
బాలికల తరలింపు కేసులో..
కడప అర్బన్ : కడప రైల్వేస్టేషన్ పరిధిలో ఇటీవల కడప నుంచి చెన్నైకి టైలరింగ్ శిక్షణ, ఉపాధి కల్పిస్తామని బాలికలను తరలిస్తున్నారని సమాచారం రావడంతో ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులు తెలుసుకుని పోలీసుల సహకారంతో రక్షించారు. వారిని శిశు సదన్‌లో ఉంచి సంరక్షిస్తున్నారు. మరోవైపు గత నెల 30న ఐసీపీఎస్ జిల్లా కో ఆర్డినేటర్ శివప్రసాద్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 31న రాత్రి ఎనిమిది మందిని ఆర్టీసీ బస్టాండు సమీపంలో అరెస్టు చేశారు. వన్‌టౌన్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రతాప్‌రెడ్డి, తమ సిబ్బందితో కలిసి వీరిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో కె.యోబు, దేవదానం, పుల్లయ్య, ప్రసాద్, ప్రసాద్, రమేష్, రవి, పుల్లయ్యలు ఉన్నారు. వీరిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా రిమాండుకు తరలించారు. -
ఆ బాలికలను ఎందుకు తీసుకెళ్తున్నారు?
సాక్షి, కడప: ‘శిక్షణ– ఉద్యోగం’ పేరుతో బాలికలను కొంతమంది వ్యక్తులు చెన్నైకు తీసుకెళ్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలికలను రైలులో చెన్నైకు తీసుకెళ్లనున్నారనే సమాచారం అందడంతో బుధవారం కడప రైల్వే స్టేషన్లో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 11 మంది బాలికలతో పాటు కొందరు పురుషులు ఉన్నారు. వీరిని విచారించగా చెన్నైలో బాలికలకు టైలరింగ్‌లో శిక్షణ ఇప్పించి ఉపాధి చూపేందుకు తీసుకెళ్తున్నామని వారు చెప్పారు. ఈ బాలికలు తమ పిల్లలేనని ఒకసారి, తమ బంధువుల పిల్లలని మరోసారి పొంతన లేని సమాధానాలు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. చెన్నైకి చెందిన సంస్థ వారిని విచారించగా తాము శిక్షణ ఇచ్చేందుకు ఒకరో ఇద్దరో అవసరమని అంతమంది అవసరం లేదని చెప్పారు. ఆడపిల్లల వెంట తప్పనిసరిగా వారి తల్లిదండ్రులు ఉంటేనే చేర్చుకుంటామని వారు చెబుతున్నారు. కాగా, ఈ బాలికలను ఐసీడీఎస్ పీడీ రాఘవరావు విచారించగా వారు సమాధానం చెప్పలేక కంట తడిపెట్టుకున్నారు. దీంతో వారిని శిశుగృహకు తరలించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే కడప రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. అప్పట్లో పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపకుండా వదిలేయడంతో తిరిగి అలాంటి సంఘటనే పునరావృతమైంది. ఇప్పుడైనా పోలీసులు ఈ సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. -
పట్టాలు తప్పిన గూడ్స్
కడప రైల్వేస్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. రెండు ఇంజిన్లు, వ్యాగన్లు ట్రాక్ పక్కకు ఒరిగిపోయాయి. 40 మీటర్ల మేర ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైళ్లన్నింటినీ ఒంటిమిట్ట, రాజంపేట, నందలూరులో గంటలకొద్దీ నిలిపివేశారు. కడప అర్బన్, న్యూస్‌లైన్ : కడప రైల్వేస్టేషన్ మూడవ ప్లాట్ఫారం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలుకు సంబంధించి రెండు ఇంజన్లు, రెండు వ్యాగన్లు ట్రాక్ పక్కకు ఒరిగిపోయాయి. 40 మీటర్ల మేర ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. వివరాల్లోకి వెళితే....గూడ్స్ రైలు కృష్ణపట్నం నుంచి 59 వ్యాగన్ల బొగ్గు లోడును మంగళవారం తెల్లవారుజామున తీసుకొచ్చింది. కృష్ణపట్నం, గూడూరు, రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల మీదుగా ముద్దనూరు సమీపంలోని ఆర్టీపీపీకి తీసుకెళ్లేందుకు కడప రైల్వేస్టేషన్‌కు చేరుకునేలోపు ప్రమాదం జరిగింది. కడప రైల్వేస్టేషన్ మూడవ ప్లాట్ఫారం ట్రాక్ నుంచి నాల్గవ ట్రాక్‌లోకి గూడ్స్ రైలు ఇంజన్లతోసహా వెళ్లేలోపు ట్రాక్‌పై అదుపుతప్పి పడిపోయింది. రెండు రైలింజన్లు, రెండు వ్యాగన్లు పూర్తిగా తప్పిపోయి కుడివైపుకు ఒరిగాయి. ట్రాక్‌కు నిర్మితమైన పట్టాలు విడిపోయి దెబ్బతిన్నాయి. దీంతో ఇతర రైళ్లు రాకుండా పూర్తిగా అంతరాయాన్ని కలిగించాయి. రైళ్లనన్నింటిని ఒంటిమిట్ట, రాజంపేట, నందలూరులలో గంటలకొద్ది నిలిపి వేశారు. సంఘటన జరిగిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. రైలింజన్లను, రెండు వ్యాగన్లను తప్పించి మిగతా వ్యాగన్లను వెనక్కి మరలించి తిరిగి ఆర్టీపీపీకి చేర్పించేందుకు తమవంతు కృషి చేశారు. రేణిగుంట నుంచి లూకాస్ అనే క్రేన్ ట్రైన్‌ను రైల్వే అధికారులు తీసుకొచ్చి రైలింజన్లను మరలా ట్రాక్‌పై చేర్చేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. తృటిలో తప్పిన ప్రమాదం గూడ్స్ రైలు వేగంగా మూడవ ట్రాక్ నుంచి నాల్గవ ట్రాక్‌కు వెళ్లే సమయంలో అదుపుతప్పి రైల్ ట్రాక్ కుడివైపుగా ఒరిగిపోయింది. అదే సమయంలో ఐదవ లైన్లో ఐఓసీ ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్ ట్యాంకర్లను అన్లోడ్ ప్రక్రియ చేస్తున్నారు. రైలింజన్లు కుడివైపుకు కాకుండా ఎడమవైపుకు ఒరిగినా, లేక వ్యాగన్లు ఎక్కువ సంఖ్యలో ఒరిగినా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. ప్రమాదానికి కారణం ట్రాకా? వేగమా? ఈ ప్రమాదం జరగడానికి ట్రాక్ నాణ్యత లోపించడం వల్ల జరిగిందా? లేక రైలింజన్ లోకోపెలైట్, అసిస్టెంట్ లోకో పెలైట్ స్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి పరిమితమైన వేగం 15 నుంచి 20 కిలోమీటర్ల మేరకు ప్రయాణించాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా దూసుకు రావడంతో ప్రమాదం జరిగిందా? అనేది నిర్దారణ కావాల్సి ఉంది. ఇప్పటికే రేణిగుంట నుంచి రైల్వే అధికారులు వచ్చారు. సాయంత్రం ఐదు గంటలలోపు కడపకు చేరుకోవాల్సిన దాదార్ ఎక్స్‌ప్రెస్‌ను నందలూరులో కొన్ని గంటల వరకు అలాగే ఉంచారు. హరిప్రియ, రాయలసీమ, వెంకటాద్రి రైళ్లను కూడా కడప రైల్వేస్టేషన్ మూడవ ప్లాట్‌ఫాం మీదుగా ప్రతిరోజు ప్రయాణించాల్సి ఉంది. కానీ ఈ సంఘటనతో ఒకటవ ప్లాట్ఫారం మీదుగానే పంపించే ప్రయత్నం చేస్తున్నారు.