ఆ బాలికలను ఎందుకు తీసుకెళ్తున్నారు?
సాక్షి, కడప:
‘శిక్షణ– ఉద్యోగం’ పేరుతో బాలికలను కొంతమంది వ్యక్తులు చెన్నైకు తీసుకెళ్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలికలను రైలులో చెన్నైకు తీసుకెళ్లనున్నారనే సమాచారం అందడంతో బుధవారం కడప రైల్వే స్టేషన్‌లో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 11 మంది బాలికలతో పాటు కొందరు పురుషులు ఉన్నారు. వీరిని విచారించగా చెన్నైలో బాలికలకు
టైలరింగ్‌లో శిక్షణ ఇప్పించి ఉపాధి చూపేందుకు తీసుకెళ్తున్నామని వారు చెప్పారు. ఈ బాలికలు తమ పిల్లలేనని ఒకసారి, తమ బంధువుల పిల్లలని మరోసారి పొంతన లేని సమాధానాలు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. చెన్నైకి చెందిన సంస్థ వారిని విచారించగా తాము శిక్షణ ఇచ్చేందుకు ఒకరో ఇద్దరో అవసరమని అంతమంది అవసరం లేదని చెప్పారు. ఆడపిల్లల వెంట తప్పనిసరిగా వారి తల్లిదండ్రులు ఉంటేనే చేర్చుకుంటామని వారు చెబుతున్నారు. కాగా, ఈ బాలికలను ఐసీడీఎస్ పీడీ రాఘవరావు విచారించగా వారు సమాధానం చెప్పలేక కంట తడిపెట్టుకున్నారు. దీంతో వారిని శిశుగృహకు తరలించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే కడప
రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. అప్పట్లో పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపకుండా వదిలేయడంతో తిరిగి అలాంటి సంఘటనే పునరావృతమైంది. ఇప్పుడైనా పోలీసులు ఈ సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది.