రిహార్సల్స్‌లో కేంద్ర ప్రత్యేక బలగాలు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని చైన్నెతోపాటూ ఇతర నగరాలలో ఉన్న విమానాశ్రయాలలో భద్రతను ఐదు అంచెలకు పెంచారు. విమానాశ్రయాలు, పరిసరాలలో 30వ తేదీ వరకు పలు రకాల నిబంధనలతో ఆంక్షలు విధించారు. ఈనెల 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకునేందుకు దేశం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోనే వేడుకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థిలలో రాష్ట్రవ్యాప్తంగా భద్రత ఏర్పాట్లపై పోలీసుల ఽఅధికారులు దృష్టి పెట్టారు. అదే సమయంలో చైన్నెలోని అంతర్జాతీయ విమానాశ్రయం, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై విమానాశ్రయాలలనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.తూత్తుకుడి, సేలంలోని స్వదేశీ విమానాశ్రయాలను భద్రతా వలయంలోకి తీసుకొచ్చారు.
విమానాశ్రయాలలో సాధారణంగా ఉన్న భద్రతతో పాటూ అదనంగా ఐదు అంచెల భద్రతను పెంచారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేసినానంతరం అనుమతిస్తున్నారు. అలాగే చైన్నె, తిరుచ్చి, మదురై, కోయంబత్తూరు, తూత్తుకుడి, తిరునల్వేలి, విల్లుపురం తదిత ర రైల్వే స్టేషన్లను నిఘాపెంచారు. విమానశ్రయం పరిసరాలలో కేంద్ర బలగాలు, వెలుపల రాష్ట్ర పోలీసులు భద్రతా విధులలో ఉన్నారు. సందర్శకులకు ఆంక్షలు విధించారు. విమానాశ్రయం రన్ వే మార్గం జీఎస్టీ రోడ్డుకు ఆనుకుని ఉండటంతో ఈ మార్గంలో ప్రత్యేక భద్రత చర్యలు తీసుకున్నారు. అలాగే, రైల్వే స్టేషన్ల వద్ద సైతం భద్రతను పెంచారు.
రిహార్సల్స్..
మెరీనా తీరంలో రిపబ్లిక్ డే వేడుకల కసరత్తులు మొదలయ్యాయి. కామరాజర్ సాలైలో సోమవారం నుంచి రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. త్రివిధ దళాలు, ఎన్‌సీసీ క్యాడెట్లు, పోలీసు శాఖ, వివిధ కళాశాలల విద్యార్థులు రిహార్సల్స్ రూపంలో ఉదయాన్నే తమ ప్రదర్శనలు చేశారు. పోలీసులు, త్రివిధ దళాల కవాతులు అబ్బుర పరిచాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈసారి వేడుకలలో పలు రాష్ట్రాల సంస్కృతులను చాటే విధంగా ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ రిహార్సల్స్ జరిగే సమయాలలో కామరాజర్ సాలై , పరిసరాలలో ఉదయాన్నే ట్రాఫిక్ మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment