క్యారమ్స్‌ కాశీమా | M Khazima, womens title winner in Carrom World Cup wins gold medals | Sakshi
Sakshi News home page

క్యారమ్స్‌ కాశీమా

Published Tue, Jan 7 2025 3:56 AM | Last Updated on Tue, Jan 7 2025 4:23 AM

M Khazima, womens title winner in Carrom World Cup wins gold medals

పైన లైట్‌ బల్బు వెలుగుతుండగా... ఆ కాంతిలో...క్యారమ్‌ బోర్డ్‌పై ‘టప్‌’ ‘టప్‌’ అంటూ శబ్దాలు వినిపించేవి. లక్ష్యాన్ని ఛేదించడం నుంచి ఛేదించక పోవడం వరకు ఆ శబ్దాలలో ఎన్నో అర్థాలు ఉండేవి. ఆ అర్థాలను ఔపాసన పట్టింది చెన్నైకి చెందిన కాశీమా. ‘క్యారమ్స్‌’ కుటుంబ ఆట అంటారు. ఆ ఆటలోని రెడ్, వైట్, బ్లాక్‌ కాయిన్స్, స్ట్రైకర్‌... కాశీమాకు కుటుంబ సభ్యులు అయ్యాయి. వాటితో అనుబంధం ఆమెను క్యారమ్స్‌ ప్లేయర్‌గా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.

ఆరు సంవత్సరాల వయసు నుంచి కాశీమా క్యారమ్స్‌ ఆడడం మొదలుపెట్టింది. కుమార్తె క్యారమ్స్‌లో చూపుతున్న ప్రతిభకు సంబరపడిపోయేవాడు తండ్రి మెహబూబ్‌ బాషా.

ఉత్తరచెన్నై పరిధిలో ఎక్కడ టోర్నమెంట్‌ జరిగినా కాశీమాను ఆడించే వాడు బాషా. కప్పులు గెలుచుకోవడం సంగతి ఎలా ఉన్నా ఇరుగు, ΄÷రుగు, బంధువులు ‘అమ్మాయిని అలా బయటికి తీసుకువెళ్లవచ్చా? ఇది పద్ధతేనా!’ అనేవారు. అయితే మెహబూబ్‌ వారి మాటల్ని పట్టించుకునేవాడు కాదు. ‘వారి మాటలు పట్టించుకోవద్దు. క్యారమ్స్‌లో నువ్వు పెద్దపేరు తెచ్చుకోవాలి’ అంటూ కూతుర్నిప్రోత్సహించేవాడు బాషా.

గల్లీనుంచి జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల వరకు ఎన్నో పతకాలు సొంతం చేసుకున్న కాశీమా జాతీయ స్థాయిలో పదికి పైగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించింది. కాశీమా ప్రతిభ అర్జున అవార్డు గ్రహీత మరియా ఇరుదయం దృష్టిలో పడింది. ఆయన శిక్షణలో తనలోని ప్రతిభను మరింత మెరుగు పరుచుకునే అవకాశం కాశీమాకు వచ్చింది.

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలలో జరిగిన 6వ క్యారమ్‌ ప్రపంచ కప్‌ పోటీలలో 18 దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి పాల్గొన్న కాశీమా సింగిల్స్, డబుల్స్, గ్రూప్‌ పోటీలలో మూడు బంగారు పతకాలు సాధించి క్యారమ్స్‌లో విశ్వవిజేతగా నిలిచింది. 

అమెరికాకు వెళ్లడానికి ముందు వీసా రెండుసార్లు తిరస్కరణకు గురి కావడంతో కాశీమా పడిన బాధ ఇంతా అంతా కాదు. ‘నేను కచ్చితంగా అమెరికాకు వెళ్లాలి. వెళ్లడమే కాదు పతకాలు సాధించాలి’ అని గట్టిగా అనుకుంది. పట్టువదలకుండా ప్రయత్నించి అమెరికాలో అడుగుపెట్టిన కాశీమా ఏకంగా మూడు స్వర్ణాలతో క్యారమ్స్‌ విశ్వవిజేతగా చెన్నైలో అడుగు పెట్టింది. ఆటకు అడ్డుపడే విధంగా విమర్శలు చేసిన వారే కాశీమాకు చెన్నైలో బ్రహ్మరథం పట్టడం విశేషం. ఆమె విజయానికి మరింతప్రోత్సాహాన్నిస్తూ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఇటీవలే ఆమెకు కోటి రూపాయల చెక్‌ అందజేశారు. 

‘క్యారమ్స్‌’ అనేది జీవితంలాంటిది. కాయిన్స్‌ లక్ష్యాలు అనుకుంటే ‘స్టైకర్‌’ అనేది ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలాంటిది. స్ట్రైకర్‌ మీద పట్టు ఉన్న కాశీమా మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

నాన్న కల సాకారం చేస్తాను
క్యారమ్స్‌ ఆడుతుంటే ఉత్సాహంగా ఉండడమే కాదు కొత్తశక్తి నాలో ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. ఆ శక్తే నన్ను చెన్నైలోని న్యూ వాషర్‌మెన్‌పేట మురికివాడ నుంచి అమెరికా వరకు తీసుకువెళ్లింది. ‘క్యారమ్స్‌ ఆకాడమీ’ ఏర్పాటు చేసి మురికివాడలోని పేద పిల్లలకు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దాలనేది నాన్న కల. ఆయన కల నెరవేర్చాలని ఉంది.
– కాశీమా 

– అస్మతీన్‌ మైదీన్, సాక్షి, చెన్నై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement