
ఫ్లోరిడా (అమెరికా): ప్రపంచకప్ స్టేజ్–1 ఆర్చరీ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్‌తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్ సెమీఫైనల్లో ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్‌లతో కూడిన భారత జట్టు 6–2 (54–54, 55–54, 56–56, 56–53) సెట్ పాయింట్ల తేడాతో పాబ్లో అచా, ఆండ్రెస్ టెమినో, జేవియర్ మెరీడాలతో కూడిన స్పెయిన్ జట్టును ఓడించింది.
ఆదివారం జరిగే ఫైనల్లో చైనా జట్టుతో భారత్ తలపడుతుంది. అంతకుముందు తొలి రౌండ్‌లో భారత్ 6–2 సెట్ పాయింట్ల తేడాతో బ్రెజిల్ జట్టుపై, క్వార్టర్ ఫైనల్లో 6–2 సెట్ పాయింట్ల తేడాతోనే ఇండోనేసియా జట్టుపై గెలిచింది. మరోవైపు దీపిక కుమారి, అంకిత, అన్షికలతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు క్వార్టర్ ఫైనల్లో 2–6 సెట్ పాయింట్ల తేడాతో అమెరికా జట్టు చేతిలో ఓడిపోయింది.